“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

20, మే 2019, సోమవారం

ఆంజనేయ కళ్యాణము చూతము రారండి !

'సీతారాముల కల్యాణం చూతము రారండి' అనే పాటను మీరు వినే ఉంటారు. ఈ టైటిల్ కూడా అలాగే ఉంది కదూ? వినడానికి ఏదో ఇబ్బందిగా కూడా  ఉంది కదూ ! మీ సందేహం కరెక్టే. ఈ టైటిల్ ఎందుకో చెప్పాలంటే చాలా కధుంది. వినండి మరి !

మొన్నొక రోజున ఏదో పనుండి ఎక్కడికో వెళితే, ఒకాయన నాకు పరిచయం కాబడ్డాడు.

'ఈయనే 'సువర్చలా సహిత ఆంజనేయ కళ్యాణవిధానము ' అనే పుస్తకం వ్రాసినాయన' అంటూ ఒకరిని నాకు పరిచయం చేశాడు ఒక ఫ్రెండ్.

నవ్వుతో నాకు పొలమారింది. కానీ నవ్వితే బాగుండదని తెగ తమాయించుకుని, ఆయనకు నమస్తే చెబుతూ ' ఓహో మీరేనా అది?' అన్నాను.

'అవును. నేనే' అన్నాడాయన గర్వంగా.

'సర్లే! పుర్రెకో బుద్ధి' అనుకుంటూ నాపని చూసుకుని అక్కడనుంచి వచ్చేశాను.

మర్నాడు మళ్ళీ అక్కడికే పనిమీద వెళితే ఆయన లేడుగాని, మా ఫ్రెండ్ కూచుని ఉన్నాడు. ఆమాటా ఈ మాటా అయ్యాక మెల్లిగా - 'నిన్నంతా చంపాడు ఆయన. ఒకటే సోది' అన్నాడు నవ్వుతూ.

'ఏమైంది?' అన్నాను.

'ఏంటో ఆంజనేయుడి గోత్రం మారిందంటాడు. పెళ్లి తంతు మార్చాలంటాడు. వినలేక చచ్చాను' అన్నాడు నవ్వుతూ. 'ఎందుకు నువ్వాయన్ని రానిస్తున్నావ్?' అని నేనడగలేదు. ఎందుకంటే, అది అతని వృత్తి కాబట్టి.

'ఇంతకీ ఆంజనేయుడికి పెళ్లయిందా?' అడిగాడు మా ఫ్రెండ్.

'చిన్న జీయర్ స్వామి నడుగు. చెప్తాడు' అన్నాను.

'అదేంటి?' అన్నాడు

'వైష్ణవం మీద ఆయనే కదా ప్రస్తుతం అధారిటి? ఆంజనేయస్వామి వైష్ణవసాంప్రదాయపు దేవుడే. కనుక చిన్నజీయర్ స్వామి ఏది చెబితే అదే కరెక్ట్' అన్నాను.

'ఆయన ప్రకారం ఆంజనేయుడు బ్రహ్మచారి. బ్రహ్మచారికి పెళ్ళేంటి నాన్సెన్స్ అంటున్నాడు స్వామీజీ' అన్నాడు.

'అంతేకదా మరి ! కరెక్టే' అన్నాను.

'మరి ఈయనేంటి ఏకంగా పెళ్లితంతుతో పుస్తకమే వ్రాశాడు? గోత్రనామాలతో సహా ఇచ్చాడు. ఇదేంటి? అంతా గందరగోళంగా ఉంది.' అన్నాడు మావాడు.

'అందుకే ఈ గోలంతా వద్దుగాని, వాళ్ళిద్దర్నీ వదిలేసి నా శిష్యుడివైపో, ఏ బాధా ఉండదు. హాయిగా ఉంటుంది' అన్నా నవ్వుతూ.

'చివరకు అదే చేస్తాలేగాని, ప్రస్తుతం నా సందేహం నివృత్తి చెయ్యి' అన్నాడు మావాడు.

'రామాయణాలలో వాల్మీకి రామాయణం తర్వాతనే ఏదైనా. దానిప్రకారం ఆంజనేయస్వామి బ్రహ్మచారి. ఆయనకు పెళ్లి కాలేదు. కనుక మనం ఆయనకు కల్యాణం చెయ్యకూడదు. వాల్మీకి కాకుండా ఇంకా తొంభై ఆరు రామాయణాలు మనకున్నాయి. వాటిల్లో ఎవడికి తోచిన కధలు వాడు రాసి పారేశాడు. అవి నిజాలు కావు. ఈ కాకమ్మ కబుర్లు నమ్మకు.' అన్నాను.

'అసలేంటి ఇదంతా? చెప్పవా ప్లీజ్' అడిగాడు ఫ్రెండ్ దీనంగా.

'చెప్తా విను. సువర్చల అంటే అమ్మాయి కాదు. సు అంటే మంచి, వర్చల అంటే వర్చస్సు, వెరసి 'సువర్చల' అంటే మంచి తేజస్సు అని అర్ధం. ఆంజనేయస్వామి బ్రహ్మచారి. బ్రహ్మచర్యం పాటించే ఎవడికైనా మంచి వర్చస్సు ఉంటుంది. ఎందుకంటే ఎనర్జీ లాస్ ఉండదు కాబట్టి. అదే 'సువర్చల' అంటే. దానిని ఒక అమ్మాయిని చేసి ఆయన పక్కన కూచోబెట్టి ఆయనకు పెళ్లి చేస్తున్నారు అజ్ఞానులు. వాళ్ళ పబ్బం గడుపుకోడానికి అమాయకుల్ని ఫూల్స్ ని చేస్తున్నారు కొందరు సోకాల్డ్ పండితులు, పూజారులు. తెలీని గొర్రెలు మోసపోతున్నాయి. ఇదంతా పెద్ద ఫార్స్.' అన్నాను.

'అంతేనా? నాకూ ఇలాంటిదేదో ఉందనే అనిపించేది ఇన్నాళ్ళూ' అన్నాడు ఫ్రెండ్.

'అవును. ఇంకా విను. వినాయకుడు కూడా బ్రహ్మచారే. కానీ ఆయనకు సిద్ధి బుద్ధి అని ఇద్దరు అమ్మాయిల్ని జోడించాం మనం. వాళ్ళూ అమ్మాయిలు కారు. మరెవరు? విఘ్నేశ్వరుడు మంత్రసిద్ధిని ఇవ్వగలడు. సిద్ధి అంటే అదే. మంచి బుద్దినీ ఇవ్వగలడు. బుద్ధి అంటే అదే. ఆ రెంటినీ అమ్మాయిలుగా మార్చి ఆయనకు పెళ్ళిళ్ళు చేస్తున్నాం.

యావరేజి హిందువుకు జీవితంలో తెలిసిన అతిగొప్ప ఎచీవ్ మెంట్ పెళ్లి ఒక్కటే. అంతకంటే వాడి బుర్ర ఎదగదు. అంతకంటే పెద్ద ఆదర్శమూ వాడి జీవితంలో ఉండదు. కనుక 'మాకు పెళ్ళోద్దురా బాబూ' అని పారిపోతున్న బ్రహ్మచారులకు కూడా కట్టేసి మరీ పెళ్ళిళ్ళు చేస్తాం మనం. చివరకు దేవుళ్ళను కూడా వదలం. ఇంకోటి చెప్తా విను. కుమారస్వామికి కూడా ఇద్దరు భార్యలని అంటారు కదా. అదీ అబద్దమే. ఎలాగో చెప్తా విను. శ్రీవల్లి సంగతి అలా ఉంచు. దేవసేన అని రెండో అమ్మాయి ఉంది కదా. ఆమె సంగతి విను.

కుమారస్వామి అనే దేవుడు దేవతల సైన్యానికి అధిపతిగా ఉండి తారకాసురుడిని చంపాడని పురాణాలు చెబుతున్నాయి. అంటే, ఆయన దేవసేనాపతి. ఈ పదాన్ని దేవ-సేనాపతి (దేవతల సైన్యానికి అధిపతి)  అని చదవాలి. దాన్ని మనవాళ్ళు దేవసేనా-పతి అని విడదీసి దేవసేన అనే అమ్మాయికి పతి అని వక్రభాష్యం చెప్పారు. దేవసేనను ఒక అమ్మాయిగా మార్చి ఆయనకు పెళ్ళిచేశారు. దానికొక తంతు తయారు చేశారు. ఇలాంటి చీప్ పనులు చాలా చేశారు మన పండితులూ పూజారులూనూ. అందుకే వీళ్ళ మాటలు నమ్మకూడదు. అదీ అసలు సంగతి' అన్నాను.

పగలబడి నవ్వాడు మా ఫ్రెండ్. ' అమ్మో ఇదా అసలు సంగతి! నిజాలు తెలీకపోతే ఎంత మోసపోతాం మనం? అన్నాడు నోటిమీద వేలేసుకుంటూ.

'అంతేమరి ! దీంట్లో సైకాలజీ ఏంటంటే - పెళ్లి చేసుకుని మనం నరకం అనుభవిస్తున్నాం కదా, ఈ దేవుడుగాడు ఎందుకు సుఖంగా ఉండాలి? వీడికి కూడా ఒకటో రెండో పెళ్ళిళ్ళు చేసేస్తే అప్పుడు తిక్క కుదురుతుందనేది మన ఊహన్నమాట. అంటే, నేనొక్కడినే చావడం ఎందుకు? నాతోపాటు ఇంకొకడిని కూడా తీసుకుపోదాం అనే చీప్ మెంటాలిటీకి ఇవన్నీ రూపాలు. అర్ధమైందా? సరే నే వస్తా !' అంటూ నేను బయలుదేరాను.

'ఆజన్మబ్రహ్మచారికి కల్యాణం ఏంట్రా దేవుడా?' అంటూ కుర్చీలో కూలబడ్డాడు మా ఫ్రెండ్.