“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

29, జనవరి 2013, మంగళవారం

'విశ్వరూపం' - హ్యాట్స్ ఆఫ్ కమలహాసన్

నిన్న 'విశ్వరూపం' సినిమా చూచాను.అంతా చూచిన తర్వాత ఇందులో నాకర్ధం కాని ఒక్కటే ప్రశ్న మిగిలింది? ఈ సినిమాలో, ముస్లిములను కమలహాసన్ ఎక్కడ కించపరిచాడో నాకేమీ అర్ధం కాలేదు. ఈ సినిమా మీద ఇంత గొడవ ఎందుకో కూడా నాకస్సలు అర్ధం కాలేదు.

ఒక భారతీయ నటుడు దర్శకత్వం వహించి చక్కని వాస్తవికమైన కథతో హాలీవుడ్ స్థాయిలో ఒక సినిమా తీస్తే దానిని మెచ్చుకోవలసింది పోయి, గొడవచెయ్యడం,కోర్టులకెక్కడం ఒక వింత అయితే,మలేషియా వంటి దేశాలలో కూడా ఈ సినిమా నిషేధించబడింది అంటే అది ఇంకా వింత. 'యదార్ధవాది లోకవిరోధి' అన్న సామెత మళ్ళీమళ్ళీ నిజం అని రుజువౌతూనే ఉంటుంది గామోసు.

ఆల్ ఖైదా,లష్కరే తోయిబా వంటి ఉగ్రవాద సంస్థలు ఎలా పని చేస్తాయో చూపిస్తూ విధ్వంసం సృష్టిస్తున్న వారి కుట్రలు భగ్నం చెయ్యడానికి ఒక దేశభక్తుడైన భారతీయ ముస్లిం ఏజంట్ ఎలా ప్రాణాలకు తెగించి పనిచేసాడో ఇందులో కమల్ చూపించాడు.ఇందులో అబద్దం గానీ,ముస్లిములను కించపరచడం గానీ ఎక్కడుంది? వాస్తవానికి విరుద్ధంగా ఈ సినిమాలో ఎక్కడా ఏమీ లేదు. 

కధ బాగుంది.కధనం బాగుంది.యాక్షన్ సీన్స్ బాగున్నాయి.ఎడిటింగ్ బాగుంది.నటీనటుల నటన బాగుంది.ఫైట్స్ బాగున్నాయి.సామాన్యంగా నాకు మన భారతీయ సినిమాల ఫైట్ సీన్స్ అస్సలు నచ్చవు.ఎందుకంటే సోకాల్డ్ ఫైట్ మాస్టర్లు ఏదో ఒక ఇంగ్లీష్ సినిమాలో ఫైట్స్ ను కాపీకొట్టి తెలుగులో అతికిస్తారు.జెట్లీ,టోనీజా వంటి నిజమైన మార్షల్ ఆర్ట్స్ మాస్టర్లు చేసిన ఫైట్స్ ను ఆ విద్యల్లో ఏబీసీడీలు రాని మన హీరోలు చెయ్యబోవటం చూసి పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుంటాను.మన తెలుగు సినిమాల ఫైట్ సీన్స్ కామెడీ సీన్స్ గా బాగా పండుతాయి. 

కాని ఈసినిమాలో ఉన్న ఒక్క ఫైట్ సీన్ చాలాబాగా పండించాడు కమల్.పనికిరాని 'షో ఫైటింగ్' కాకుండా కమెండోలు వాడే నిజమైన డెడ్లీ టెక్నిక్స్ అందులో చూపించి చక్కని ఫైట్ సీన్ ను రక్తి కట్టించాడు.ప్రాక్టికల్ ఫైట్ అలాగే ఉంటుంది.అందులో కరాటే,థాయ్ బాక్సింగ్ & ఐకిడో టెక్నిక్స్ కలిసి ఉన్నాయి.చాలా బాగుంది.

ఇకపోతే కొన్ని డైలాగ్స్ లో పండించిన సునిశిత హాస్యం వెనుక ఎంతో ఆలోచనను రేకెత్తించే 'పంచ్' ఉంది. ఆఫ్గన్ గుహలలో తీసిన ఒక సన్నివేశంలో కమల్ ను విలన్ అడుగుతాడు.'తండ్రి చిన్నతనంలోనే పోతే పెరిగిన పిల్లలు ఎలా ఉంటారో నాకు తెలుసు' అంటూ 'జస్ట్ జోకింగ్' అంటాడు.దానికి కమల్ ప్రతిగా 'తమ తండ్రెవరో తెలియని పిల్లలు ఎలా ఉంటారో నాకూ తెలుసు' అంటూ 'జస్ట్ జోకింగ్' అని జవాబిస్తాడు.దానికి విలన్ తన అసిస్టెంట్ వైపు తిరిగి 'నువ్వు చెప్పావా?' అంటాడు.

అలాగే హీరోయిన్ ను బ్లాక్ అమెరికన్ లేడీ ఆఫీసర్ విచారణ చేస్తూ 'మీ దేవుడికి నాలుగు చేతులుంటాయా? విచిత్రం. అలా అయితే అతన్ని ఎలా శిలువ వేస్తారు? కష్టం కదా?' అంటుంది.దానికి హీరోయిన్ జవాబిస్తూ 'అందుకే ఆయన్ని మేము శిలువ వెయ్యము.సముద్రంలో ముంచేస్తాము' అంటుంది.ఇలాంటి సున్నిత హాస్యాన్ని పండించే డైలాగ్స్ ఇలాంటి వివాదాస్పద అంశాల మీద వ్రాయాలంటే చాలా సెన్సాఫ్ హ్యూమరే కాదు చాలా ధైర్యం కూడా కావాలి.

అనవసరంగా జరుగుతున్న 'జిహాద్' లో పడి ముస్లిం కుటుంబాల ఆడవాళ్ళూ పిల్లల జీవితాలు ఎలా బుగ్గిపాలు అవుతున్నాయో చాలా చక్కగా దయనీయంగా సున్నితంగా చూపించాడు.ఆస్మా తో బాధపడుతున్న తన భార్యకు వైద్యం అందించడానికి వచ్చిన అమెరికన్ లేడీ డాక్టర్ బురఖా ధరించలేదు కనుక ఆమెను వైద్యం చెయ్యకుండా వెళ్ళిపొమ్మని విలన్ ఆదేశించడమూ,లండన్ వెళ్లి ఇంజనీరింగూ మెడిసినూ చదవాలనుకున్న విలన్ పిల్లలు అర్ధాంతరంగా బాంబింగ్ లో చనిపోవడమూ,అక్కడ పిల్లల్లో చాలామందికి ఫైరింగ్ లో కాళ్ళు పోయి కొయ్యకాళ్ళు ఉండటమూ చూపించి ఈ యుద్ధాలు అనవసరం కదా? దీనివల్ల అసలు మనం ఏం సాధిస్తున్నాం? ఎంతమంది జీవితాలను అనవసరంగా నాశనం చేస్తున్నాం? అన్న ఆలోచన ప్రేక్షకులలో రేకెత్తిస్తాడు.

ఒక పిల్లవాణ్ణి తీవ్రవాదులు ఆత్మాహుతిపరుడిగా తయారు చేస్తుంటారు.ఆ అబ్బాయి ఉయ్యాల ఎక్కి కూచుని కమల్ ను ఊపమని అడిగి ఊగుతూ ఉండే సీన్లో బాల్యం వదలని చిన్నపిల్లలను కూడా తీవ్రవాదం నూరిపోసి ఆత్మాహుతికి ఎలా సిద్ధం చేస్తున్నారో సున్నితంగా చూపి కంటతడి పెట్టిస్తాడు.ఇలాంటి సీన్లలో కమల్ దర్శకత్వ ప్రతిభ కొట్టొచ్చినట్లు కనపడింది.  

సినిమాను 'సీన్ బై సీన్' హాలీవుడ్ తరహాలో ఫ్లాష్ బ్యాక్ గా చూపడం సామాన్య సగటు ప్రేక్షకుడికి కొంచం గందరగోళాన్ని సృష్టిస్తుంది.ఈ తరహా స్క్రీన్ ప్లే వల్ల ఈ సినిమా సామాన్యుడికి దూరమై 'క్లాస్' ఇమేజిని సంతరించుకుంది.ఎందుకంటే సినిమా చూచాక మరొక్కసారి 'సీన్ బై సీన్' వెనక్కు వెళ్లి ఆలోచిస్తే గాని ప్రేక్షకుడికి కధలో మిస్సింగ్ లింక్స్ అర్ధమై చావవు.కధ అప్పుడు గాని పూర్తిగా అర్ధమైనట్లు అనిపించదు.అయితే ఒక మంచి హాలీవుడ్ స్థాయి యాక్షన్ సినిమా తియ్యాలంటే ఈ టెక్నిక్ తప్పనిసరి అనిపిస్తుంది.

కమల్ లో వయసు మీరుతున్న సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దానికి తోడూ అతని గొంతు బొంగురుగా ముద్దగా పలికింది.సొంత వాయిస్ బదులుగా ఏ 'మనో' గొంతో తీసుకుంటే ఇంకా బాగుండి ఉండేది. హీరోయినుక్కూడా డబ్బింగ్ చెప్పిన ఆర్టిస్ట్ గొంతులో ఇంకొంచం లేతదనం ఉంటె బాగుండేది.

అనవసరపు పాటలూ పిచ్చి డాన్సులూ ఎక్కడా లేవు.ఇదొక పెద్ద రిలీఫ్.కథక్ నృత్యాభినయాన్ని కమల్ చక్కగా పండించాడు.అయితే ఆ పాటకు జనరంజకమైన ఇంకొంచం మంచి రాగం కట్టి ఉంటె ఇంకా బాగుండేది.

సినిమా బాగుందని ముక్తకంఠంతో చెప్పొచ్చు.ఇంతమంచి సినిమాను తీసిన కమల్ ను అభినందించాలి.త్వరలో మళ్ళీ ఇంకోసారి ఈ సినిమాను చూడ బోతున్నాను.ఈ సినిమా మీద జరుగుతున్న రగడకు విచారిస్తూ మన సంఘంలో ఉన్న కుహనా ప్రజాస్వామ్య పరిస్తితికి బాధపడుతున్నాను. ప్రతిదాన్నీ మసిపూసి మారేడుకాయ చెయ్యకుండా ఉన్న విషయాన్ని ఉన్నట్లు చూడటం మనం ఎప్పుడు నేర్చుకుంటామో కదా?