“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

2, ఆగస్టు 2012, గురువారం

అజ్ఞానంలోని ఆనందం

నా అజ్ఞానాన్ని చూచి చాలామంది జాలిపడి నాకు దారి చూపుదామని ప్రయత్నం చేస్తుంటారు. ఇది చిన్నప్పటి నుంచీ నాకు అలవాటే. కాని నా అజ్ఞానం మాత్రం పోదు. ఏం చేద్దాం? కొన్ని జీవితాలింతే.

మొన్నీమధ్య పాపం ఒకాయన ఇలాటి ప్రయత్నం చేశాడు. ఆయన చొక్కాకి ఒక బాబా డాలర్ తగిలించుకుని కనిపించాడు. ఆ డాలర్ వంక ఒకసారి చూడటమే నేను చేసిన తప్పు. ఇక బోధ మొదలైంది.

"నేను 'ఫలానా' బాబా భక్తుణ్ణి. ఆయన్నే నమ్ముకున్నాను." అంటూ ఉపోద్ఘాతం మొదలెట్టాడు. " నమ్ముకున్నాను " అని అతను అన్న విధానం, నాకు ఏదోగా వినిపించింది. పాతకాలంలో పల్లెటూళ్ళలో ఉండే సాని,  "నేను మా ఊరి జమీందారునే నమ్ముకున్నాను" అన్నట్లు వినిపించింది ఆ మాట. 

నేను చిరునవ్వు నవ్వాను.
"ఆయన్ని నమ్ముకున్నాక నాకు అంతా మంచే జరిగింది" అంటూ ఇంకో బిస్కెట్ విసిరాడు.
నేనా బిస్కెట్ తీసుకోలేదు. మళ్లీ చిరునవ్వు నవ్వాను.
"ప్రతిదానికీ అలా నవ్వుతారెంటి?" అన్నాడు. 
"నవ్వక ఏడవమంటారా?" అన్నాను. 
"అసలు మీకు నవ్వెందుకొస్తున్నది?" అడిగాడు.
"నేను నవ్వితే మీకెందుకు బాధ?" అన్నాను. 
"అదికాదు. మీ మంచికే చెప్తున్నాను." అన్నాడు.
"మీరు నిజంగా నా మంచి కోరుతున్నారా?" అడిగాను.
"అవును." అన్నాడు.
"అయితే నాకు అర్జంటుగా ఒక ఏభై లక్షలు కావాలి. ఇవ్వగలరా? తిరిగి ఇస్తానని మాత్రం గ్యారంటీ ఇవ్వలేను." అన్నాను.
అతను ఎగాదిగా చూచాడు.
"నేను చెప్పేదానికీ మీరు చెప్పేదానికీ ఏదన్నా సంబంధం ఉందా?" అడిగాడు.
"గ్రహించగలిగితే ఉంటుంది" అన్నాను " సరే ఒకమాట చెప్పండి. మీరు ఆ బాబాను నమ్ముకున్నాక మీ జీవితంలో ఏ విధమైన చెడూ ఎప్పుడూ జరగలేదా? గుండెలమీద చెయ్యేసుకుని చెప్పండి"
"అంటే జరిగిందనుకోండి.కర్మను ఎవరు తప్పించగలరు?" అన్నాడు.
"కర్మను ఎవరూ తప్పించలేనప్పుడు కర్మనే నమ్ముకోక ఆ బాబాను నమ్మడం ఎందుకు?" అడిగాను.
"ఆయన చాలామందిని రక్షించాడు" అన్నాడు.
"మరి మీకు చెడు జరిగినప్పుడు మిమ్మల్ని ఎందుకు రక్షించలేదు" అడిగాను.
"అంటే నా భక్తిలో లోపం ఉండవచ్చు." అన్నాడు.
"అంటే మీ నమ్మకాన్ని బట్టి కాక, మీ భక్తిని బట్టి మీకు జరుగుతుందా? మరిప్పటిదాకా నమ్మకం అన్నారు. ఇప్పుడేమో  భక్తి అంటున్నారు. రెండూ ఒకటేనా లేక తేడా ఉందా?" అడిగాను.
"నమ్మకం ముఖ్యం. భక్తి కూడా ఉండాలి." అన్నాడు. 
"ఇలాంటివి ఇంకా ఎన్నున్నాయో ఆలోచించుకుని అప్పుడు రండి. తీరికగా మాట్లాడుకుందాం." అంటూ ఇంకో ప్రశ్న అడిగాను. "నమ్మినవారికీ నమ్మనివారికీ కూడా జీవితంలో మంచీ చెడూ జరుగుతూనే ఉంటాయి. ఒకరిని నమ్మినంత మాత్రాన అంతా మంచే జరగదు. నమ్మకపోయినంత మాత్రాన అంతా చెడె జరగదు. అలా అయ్యేపనైతే ఆస్తికులు ఎప్పుడూ సుఖంగా ఉండాలి. నాస్తికులు అన్నీ బాధలే పడాలి. అలా జరగడం లేదు కదా. అందరికీ కష్టాలూ సుఖాలూ రెండూ ఉంటున్నాయి. కనుక మీరంటున్న "నమ్మకం"లోనో "భక్తి"లోనో ఎక్కడో ఏదో లోపం ఉన్నట్లు అనిపించడం లేదా?"
అతనేం మాట్లాడలేదు. బహుశా కొంత ఆలోచన మొదలయినట్లుంది.
నేను మళ్లీ చిరునవ్వు నవ్వి అడిగాను "ఎందుకు నవ్వానో ఇప్పుడైనా అర్ధమైందా?"
అతను అదోరకంగా తలాడించాడు.
ఆరోజు తర్వాత అతను మళ్లీ ఈ టాపిక్ నావద్ద తీసుకురాలేదు.