“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

28, డిసెంబర్ 2011, బుధవారం

ఓషో రజనీష్ జాతకం, భావజాలం-2

రజనీష్ జాతకంలో కొన్ని ముఖ్యఘట్టాలు మనకు తెలుసు. వీటి సాయంతో, ఆయా దశలనుబట్టి జన్మసమయాన్ని కొంత సరిచేద్దాం.

రజనీష్ తండ్రి (స్వామి దేవతీర్థభారతి)  8-9-1979 న మరణించారు. ఆయన జ్ఞానిగా మారి సమాధిస్తితిలో శరీరాన్ని వదిలిపెట్టాడని రజనీష్ చెప్పాడు. 5.09 అనేది జననసమయంగా మనం తీసుకుంటే ఆరోజున రజనీష్ కు శుక్ర/శని/గురు/రాహు/రాహుదశ జరిగింది. పితృస్థానమైన మకరం నుంచి శుక్రుడు యోగకారకుడు. రాహువు అష్టమాధిపతియగు గురువుకు సూచకుడు. నవమంనుంచి ఈఅష్టమం ద్వాదశం అవుతుంది. రాహువుదృష్టి గురువుమీద ఉంది. గురువు నవమాత్ సప్తమమారకంలో ఉచ్చస్తితిలో ఉన్నాడు. కనుక ఈదశ పితృమారకానికి సరిగ్గా సరిపోయింది. ఇక 5.10 అనేది జననసమయం అనుకుంటే, ఇదే దశ శుక్ర/శని/గురు/శుక్ర/రవి అవుతుంది. సూక్ష్మదశ ప్రాణదశలలో రాహువుస్థానంలో శుక్రరవులు ప్రత్యక్షమైనారు. ఆరోజున గోచారకుండలిని  పరిశీలిస్తే, మీనంలో చంద్రుడు 9 డిగ్రీలలో ఉండి జననకాలరాహువు ఉన్నటువంటి 8 డిగ్రీలకు చాలా దగ్గరలో ఉన్నాడు. కనుక ఈ సంఘటనకు రాహువుకు సంబంధం ఉంది. రాహువు నవమస్థానం నుండి ఆయుష్యస్థానం అయిన తృతీయంలో ఉండటం చూడవచ్చు. కనుక రాహు సూక్ష్మ, ప్రాణదశలను చూపిస్తున్న 5.09 మాత్రమే జననకాలసమయం కావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఆరోజున నవమాత్ అష్టమం అయిన సింహంలో ఆరుగ్రహాలు గుమిగూడి ఉండటం చూడవచ్చు. ఈ గ్రహకూటమినిబట్టి రజనీష్ తండ్రిగారు సమాధిస్తితిలో శరీరాన్ని ఒదిలిపెట్టటం నిజమే అని సూచన ఉంది.      

రజనీష్ 19-1-1990 న సాయంత్రం 5 గంటల సమయంలో పూనాలో మరణించాడు. ఆ సమయానికి జాతకంలో శుక్ర/శుక్ర/గురు/చంద్ర/రాహు దశలలో గురుదేహదశ జరిగింది. గోచారకేతువు జననకాల గురువుపైనా, గోచార శనిబుధులు జననకాల చంద్రబుధుల పైన సంచరించారు. శుక్రుడు లగ్నాధిపతి. గురువు ఉచ్ఛస్తితిలో ఉన్న అష్టమాదిపతి. ఇకపోతే చంద్రరాహువుల సూక్ష్మప్రాణదశలను బట్టి ఓషోరజనీష్ కు తీరనికోరికలు ఇంకా ఉన్నాయనీ, ఆయనకు పరిపూర్ణముక్తి లభించలేదనీ చెప్పక తప్పదు. ఓషోరజనీష్ చివరిరోజుల గురించి వచ్చిన పుస్తకం ఒకటుంది. దాని పేరు "Notes of a madman". అందులో ఒకచోట -- "ఓం" అనే అక్షరం రకరకాల రంగులలో వెలుగుతూ తన కళ్ళముందు దర్శనం ఇస్తూ ఉందని, ఆ రంగులలో ఎక్కువగా ముదురునీలం, వయొలెట్ రంగులు కనిపిస్తున్నాయనీ -- ఆయన అంటాడు. ఇలా ఎందుకు జరుగుతున్నదో అర్ధంకావడం లేదనీ, తాను కావాలని ఆ దర్శనాన్ని కోరుకోవడం లేదనీ, అయినా ఆ దర్శనం తనను వెంటాడుతున్నదనీ అంటాడు. ఓం అనేది శబ్దబ్రహ్మానికి, విశ్వచైతన్యానికీ (Universal Consciousness) సూచిక. కాని ఆస్థాయిలో ఉన్నవారికి కూడా తిరిగి పునర్జన్మ ఉంటుంది. దశలో అంతిమంగా రాహుస్పర్శ కూడా దీనినే సూచిస్తున్నది. పునర్జన్మ ఉంటుంది అనిఅన్నంత మాత్రాన రజనీష్ మామూలు మనుషులవంటి సామాన్యుడు అని మనం అనుకోకూడదు.


తనకు జ్ఞానోదయం కలిగిన సమయం 21 -3 -1953 రాత్రి అని, అప్పుడు తనకు 21 ఏళ్ళు అనీ రజనీష్ చెప్పాడు. అప్పుడు ఈయన జాతకంలో గురు/బుధ/బుధ/గురు/బుధ దశ జరుగుతున్నది. జననసమయం 5.09  అనుకుంటే శుక్ర దేహదశా, 5.10 అనుకుంటే చంద్రదేహదశా జరుగుతాయి. శుక్రుడు లగ్నాధిపతి, చంద్రుడు తృతీయాధిపతి  కనుక 5.09 వైపే సమయం మొగ్గు చూపుతున్నది. ఈ సమయంలో  దశానాధులైన గురు, బుధులవల్ల ఒకవిషయం స్పష్టం అవుతున్నది.గురువు అష్టమాదిపతి, బుధుడు పంచమాదిపతి. కనుక ఈయనకు ఆరోజున ఒక అతీత మార్మికఅనుభవం కలిగినమాట వాస్తవమే అని తెలుస్తున్నది. అయితే అది బౌద్ధికపరమైన అనుభవం మాత్రమే అని ఒకసూచన ఉంది. ఇది ఆధ్యాత్మికంగా ఒక ఉన్నతఅనుభవం అయినప్పటికీ, పూర్ణసిద్ధికి సూచన మాత్రం కాదు. ఆ రోజున తనకు కలిగిన అనుభవం గురించి రజనీష్ చాలా వివరంగా వర్ణించాడు. ఆ అనుభవం తర్వాతకూడా చెయ్యవలసిన సాధన ఇంకా చాలా ఉంటుంది. చేరవలసిన గమ్యాలు చాలా ఉంటాయి. బహుశా అదే అంతిమఅనుభవం అని ఆయన అనుకోని ఉండవచ్చు. అలా అనుకోవడమే తర్వాత తర్వాత ఆయన చేసిన తప్పులకు కారణం అయి ఉండవచ్చు. 

గోచారరీత్యా ఆరోజున కుజశుక్రులు మేషం 8వ డిగ్రీలో ఉండి, జననకాల ధనూకుజునికి సరిగ్గా కోణస్థితిలో ఉన్నారు. గోచారగురువు మేషంలో 26 డిగ్రీలో ఉండి, జననకాల ధనూశనికి కోణస్తితిలోనూ, జననకాలగురువుకు కేంద్రస్తితిలోనూ ఉన్నాడు.   

ఇక్కడ దాగిఉన్న ఒక రహస్యాన్ని వివరిస్తాను. మార్చ్ 21 అనేది సాయనజ్యోతిషరీత్యా వసంతవిషువత్ అనబడుతుంది. ఖగోళశాస్త్రం ప్రకారం ఆరోజున భూమధ్యరేఖ క్రాంతికక్ష్యలు ఒకదానినొకటి ఖండించుకునే ఖగోళబిందువు మీదకు సూర్యుడు ప్రవేశిస్తాడు. అంటే సాయనమేషసంక్రమణం ఆరోజున జరుగుతుంది. మార్చ్ 21 సెప్టెంబర్ 23 లను equinoctial points అంటారు. అంటే ఆరోజులలో భూమ్మీద ఎక్కడచూచినా రాత్రీ పగలూ సమవ్యవధిలో ఉంటాయి. ఈ రెంటిలో మార్చ్ 21 అనేది వసంతవిషువత్ అనీ మేషసంపాతం అనీ   పిలువబడుతుంది. అంటే వసంతఋతువు ఆ రోజున మొదలౌతుంది. ఋతువులు సూర్యుని అనుసరించి ఏర్పడతాయి. రుతువులకూ మనిషిలోని హార్మోన్ స్రావాలకూ సంబంధం ఉంది. శరీరంలోని హార్మోన్ లెవెల్స్ బట్టి మనిషి ప్రవర్తన ఉంటుంది. సూర్యగమనం ఆధారంగా లెక్కించే జ్యోతిష్య విధానాన్ని సాయనవిధానం అనీ సూర్యమానం అనీ అంటారు. దీనిని పాశ్చాత్యులు అనుసరిస్తారు. ఇటువంటి ప్రత్యేకమైన రోజునే రజనీష్ కు జ్ఞానోదయం కలిగింది. బుద్ధునికి పూర్ణిమ రోజున జ్ఞానోదయం కలిగింది. మహావీరునికి అమావాస్య రోజున జ్ఞానోదయం కలిగింది. రజనీష్ కు వసంత విషువత్ రోజున జ్ఞానోదయం కలిగింది. కనుక భూమ్మీద జరిగే సామూహిక సంఘటనల పరంగానే కాకుండా వ్యక్తిగత అంతరికవిషయం అయిన  సాధనాపరంగా కూడా ఈ ప్రత్యేకమైన రోజుల ప్రభావం తప్పకుండా ఉంటుంది. అంతేకాక ఆయా సాధకులకు కలిగే అనుభవాలు కూడా ఆయారోజులలో ఉండే ప్రత్యేకప్రభావాలకు అనుగుణంగానే ఉంటాయి. అందుకనే సంక్రాంతి రోజుల్లోనూ, విషువత్తులలోనూ , పౌర్ణమి అమావాస్యల లోనూ సాధన తీవ్రతరం చెయ్యాలని పెద్దలు అంటారు.  

పగలూ రాత్రీ ప్రపంచం మొత్తం సమమైన నిడివితో ఉండే రోజులలో భూమిమీద సమత్వస్తితి నెలకొని ఉంటుంది. "సమత్వం యోగ ఉచ్యతే"- అని యోగానికి నిర్వచనం ఉంది. కనుక ఆ రోజులలో యోగసాధకులకు సిద్ధికారక స్పందనలు ఎక్కువగా ఉంటాయి. రజనీష్ బోధలలో ముఖ్యమైనవి "ఎరుక" మరియు "సాక్షీభావ స్తితి". ఇవి సమత్వానికి పర్యాయపదాలు. సమత్వానికి సూచిక అయిన విషువత్ రోజున సమత్వానికి ప్రతీక అయిన యోగంలో సిద్ధికలగడం ఒక యోగరహస్యం. అంతేకాక ఆత్మజ్ఞానకారకుడైన సూర్యునికి ఈ రోజునించి ఉచ్ఛస్తితి మొదలౌతుంది. దీనికి ఇంకా లోతులు ఉన్నప్పటికీ ప్రస్తుతానికి ఇంతకంటే ఎక్కువగా వివరించను. ఒక్కటి మాత్రం చెప్తాను. చాలామంది నిరయనజ్యోతిష్కులు సాయనసిద్ధాంతాన్ని హేళన చేస్తుంటారు. ఈ హేళనాత్మకభావన పూర్తిగా తప్పు అని నేను నమ్ముతాను. సూర్యుడు లేకుండా జ్యోతిష్యం లేదు. కనుక సాయనవిధానాన్ని ఎలా వాడుకోవాలో తెలిస్తే అదికూడా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. సాయన విషువత్ రోజుననే రజనీష్ కు జ్ఞానోదయం కలగడం వెనుక సాయనవిధానం యొక్క ప్రాముఖ్యత దాగుంది.

రజనీష్ కు 7 వ ఏట చావు రాసిపెట్టి ఉందని ఒక జ్యోతిష్కుడు చెప్పాడు. ఈయన పుట్టినపుడు వీరి తాతగారు ఆఊరిలోని ఒక ప్రసిద్ధజ్యోతిష్కుని సంప్రదించాడు. తీవ్రబాలారిష్టం ఉన్న జాతకమని ఆ జ్యోతిష్కుడు చెబుతూ, ఏడవఏట ఈబాలుడు మరణిస్తాడనీ ఒకవేళ అది తప్పిపోతే అప్పుడు ఇతని జాతకం వేస్తానని, అంతవరకూ ఈ జాతకం చూడననీ చెప్పాడు. ఇతని జాతకంలో ప్రతి ఏడేళ్ళకూ గండాలు ఉన్నాయని ఆ జ్యోతిష్కుడు చెప్పాడు. అంటే 14 , 21 కూడా మరణ సూచక వయస్సులేనని అతను అంటాడు.ఏడేళ్ళ వయస్సులో రజనీష్ చనిపోలేదు కాని, ఈయన్ని అమితంగా ప్రేమించిన తాతగారు(తల్లి తండ్రిగారు)  మరణించాడు. అదికూడా ఏడేళ్ళ పిల్లవాడైన రజనీష్ ఒడిలో తలపెట్టుకుని అయన చనిపోయాడు. రజనీష్ కూడా ఆయన్ని అమితంగా ప్రేమించాడు. అది రజనీష్ జీవితంలో అతిపెద్ద మొదటి షాక్. 

"ఆ వయసులో నాకు చావు రాలేదు. కాని నాలో ఒకభాగం చనిపోయింది. అది మా తాతగారితో వెళ్ళిపోయింది" అని తర్వాతికాలంలో రజనీష్ చెప్పాడు. తాతగారికి జబ్బుచేస్తే వైద్యంకోసం వాళ్ళున్న పల్లెనుంచి ముప్పైమైళ్ళ దూరంలోని  పట్నానికి ఎద్దుబండిలో వెళుతూ మార్గమధ్యంలో రజనీష్ ఒడిలో తలపెట్టుకుని తాతగారు నిస్సహాయంగా చనిపోయాడు. అది బాలరజనీష్ మనస్సును తీవ్రంగా కలచివేసింది. వేగంగాపోయే వాహనం లేకపోవడంవల్ల వైద్యసహాయం అందక తాతగారు చనిపోయారు అన్నబాధవల్లేనేమో తర్వాత జీవితంలో 93 రోల్స్ రాయస్ కార్లను ఆయన పోగుచేసాడు. ఇదే నిజమైతే ఆయనలో సంస్కారాలు నశించలేదని, మనోనాశం కలగలేదనీ అర్ధం అవుతున్నది. అలాంటప్పుడు ఆయన పొందిన సిద్ధి పరిపూర్ణసిద్ధి కాదు అనే చెప్పవలసి ఉంటుంది. 

కాని ఒక్కవిషయం ఇక్కడ స్పష్టంగా తెలుసుకోవాలి. సిద్ధపురుషులకు ఉండే సంస్కారాలకూ మామూలు మనుషులకు ఉండే సంస్కారాలకూ హస్తి మశకాంతరం  ఉంటుంది. మామూలు మనుషులకు క్షుద్రమైన సంస్కారాలుంటాయి. ఏదో సంపాదించాలని, దేన్నో అనుభవించాలన్న కోరికలుంటాయి. సిద్దులైన వారికి అలాటి కోరికలుండవు. చీకటిలో మగ్గుతున్న లోకులకు జ్ఞానజ్యోతిని చూపిద్దామన్న కోరిక వారిలో కొందరికుంటుంది. స్థూలదృష్టిలో దానిని కోరిక అనీ, సంస్కారం అనీ, అనలేం. కానీ అదికూడా ఒక సంస్కారమే. దానివల్ల కూడా పునర్జన్మ కలుగుతుంది.

అదలా ఉంచితే, ఏడోఏటికి ముందున్న పాతరజనీష్ ఒకరకంగా ఆరోజుతో చనిపోయాడు. జ్యోతిష్కుని జ్యోస్యం తాతగారి మరణంద్వారా నిజమైంది. అప్పుడు రజనీష్ జాతకంలో  అష్టోత్తరీదశాప్రకారం శని/శని/గురుదశ జరిగింది. ఈ సంఘటన జరిగిన తేదీ తెలియదు కనుక సూక్ష్మదశా ప్రాణదశలు లెక్కించలేము. శని గురువులిద్దరూ అష్టమభావంలో ఉండటంవల్ల, మాతామహుని సూచించే ద్వాదశభావం (చతుర్ధానికి నవమం) యొక్క అధిపతి కుజుడుకూడా వీరితో అష్టమంలో ఉండటంవల్ల బహుశా కుజసూక్ష్మదశ అయి ఉండవచ్చు. కుజసూక్ష్మదశ 10 -11 -1938  నుంచి 15 -11 -1938 వరకూ జరిగింది.  శని ఈజాతకానికి యోగకారకుడే కాని అష్టమంలో ఉన్నాడు. గురువు అష్టమాదిపతిగా తృతీయ ఆయుష్యస్థానంలో ఉచ్ఛస్తితిలో వక్రించి ఉన్నాడు. కనుక ఇది మారకదశ అయినప్పటికీ పూర్తిగా మారకదశ కాదు. కనుక ఈయనకు బాగా ఇష్టుడైన తాతగారి మరణం జరిగింది.

అయితే ఈ సంఘటన ఇతని లేతమనస్సు మీద బలమైన ముద్ర వేసింది. అంతేగాక -- "మరణం అంటే ఏమిటి? ఆ సమయంలో అసలేం జరుగుతుంది?" అన్న చింతన ఆ లేతమనస్సులో తీవ్రంగా మొదలైంది. ఈ చింతనాప్రభావం వల్లనే తన సాటివయస్కులతో కలిసి ఆడుకోవడం మొదలైనపనులు రజనీష్ ఆవయసులో చేసేవాడు కాదు. ఆ చేష్టలన్నీ అతనికి పిల్లచేష్టలుగా తోచేవి. ఇక్కడనుంచి 14 ఏళ్ళ వరకూ ఆయన జీవితం ఈ జిజ్ఞాసతోనే సాగింది.

ఇకపోతే 14 ఏళ్ల వయస్సులో ఇంకొక విచిత్రఅనుభవం ఈయన్ను వరించింది. 14 ఏళ్ళు దగ్గరపడుతున్న కొద్దీ జ్యోతిష్కుడు చెప్పిన జోస్యం మళ్ళీ నిజమౌతుందేమో, మళ్ళీ చావు ఇతనికి ఎదురౌతుందేమో అని కుటుంబసభ్యులు చాలా కంగారుపడ్డారు. ఈసంగతి రజనీష్ కి కూడా తెలిసింది. అప్పటికే అతను తన వయస్సుకు మించిన మానసికపరిపక్వతను పొంది ఉన్నాడు. సరే మరణం ఎలాగూ తప్పనపుడు దానికి మనమే ఎదురుపోతే పోలేదా? అలా చావుకు ఎదురువెళితే ఏమి జరుగుతుందో చూద్దామని రజనీష్ అనుకున్నాడు.

ఒక వారంరోజులలో తన 14 వ జన్మదినం వస్తుందనగా రజనీష్ ఒక ప్రయోగం చేసాడు. వారున్న పల్లెటూరిలో ఊరిబయట చెరువుగట్టున ఒక చిన్నగుడి ఉంది. అది దాదాపుగా నిర్మానుష్యంగా ఉంటుంది. అక్కడికి ఎవరూ రారు. రోజుకొకసారి మాత్రం తనకు కొంత ఆహారం ఇవ్వమని ఆ గుడిపూజారితో ఒప్పందం కుదుర్చుకుని రజనీష్ ఆగుడిలో పడుకొని మరణంకోసం ఎదురుచూడసాగాడు. అది వచ్చినపుడు కంగారుపడకుండా ప్రశాంతంగా దానికి స్వాగతం చెప్పాలని అతని ఊహ. అంతేగాక మరణం ఎలా వస్తుందో, మరణంలో ఏమి జరుగుతుందో చూద్దామని, దాని రహస్యాన్ని చేదించాలనీ అతను భావించాడు. ఒక వారంరోజులు ఒక్కడే ఆగుడిలో రాత్రింబవళ్ళూ ఉంటూ మరణంకోసం ఎదురుచూశాడు. పద్నాలుగేళ్ళ పిల్లవానిలో అంత మానసికపరిపక్వత ఉండటం మామూలువిషయం కాదు. అది చాలా గొప్పవిషయం. ఎన్నోజన్మలనుంచీ అతను చేస్తున్న సాధనవల్లనే అంత పరిపక్వత అతనికి కలిగింది అని మనం భావించవచ్చు. 

ఒకరోజు రాత్రి రజనీష్ అలా పడుకొని మరణంకోసం ఎదురుచూస్తూ ఉండగా ఒక తాచుపాము ఆ గుడిలోకి ప్రవేశించింది. అదొక పల్లెటూరు, చుట్టూ పొలాలు చెరువూ ఉండటంతో అక్కడ పాములు బాగా తిరుగుతూ ఉండేవి. రజనీష్ దానిని గమనించి ఆ రూపంలో చావు వచ్చిందని భావిస్తూ కదలకుండా దానిని చూస్తూ ఉండిపోయాడు. ఆపాము పాకుతూ వచ్చి, పడుకొని ఉన్న రజనీష్ మీదికెక్కి, పాకుతూ అవతలకి దిగి ఎటో వెళ్ళిపోయింది. ఇదంతాకూడా చూస్తూ రజనీష్ కదలకుండా కట్టెలా పడుకుని ఉన్నాడు. ఈ వారంరోజుల చావుకోసం ఎదురుచూపులో, చివరికి జరిగిన ఈ పాము సంఘటనలో అతనికి ఎన్నోవిషయాలు అర్ధం అయ్యాయి.  మరణం అనేది అసలు లేనేలేదనీ, అది శరీరానికే వర్తిస్తుందనీ, శరీరం మరణించిన తర్వాతకూడా నిలిచి ఉండేది ఒకటి ఉంటుందనీ అతనికి అర్ధమైంది.

మరణం అంటే భయపడవలసిన పని లేదనీ, అది ఎంతో విశ్రాంతిగా హాయిగా ఉండే స్తితి అనీ, మన భయంవల్లనే దానిని మనం స్వీకరించలేకపోతున్నామనీ, భయాన్ని వదిలి దానిని స్వాగతిస్తే, ప్రపంచంలో అంతచక్కని విశ్రాంతి ఇచ్చేస్తితి ఇంకొకటి లేదనీ ఆయనకు తెలిసింది. ఆ సమయంలో గురు/రవి/శనిదశ ఆయన జీవితంలో జరిగింది. గురువు అష్టమాధిపతి, రవి మారకస్థానమైన సప్తమంలో ఉన్నాడు. శని ఏకాంతవాసానికీ ఆధ్యాత్మికజీవనానికీ సూచకుడు. కనుక ఈసమయం ఈసంఘటనకు చాలాసరిగ్గా సరిపోయింది. ఇకపోతే, 21 ఏళ్ళ వయస్సులో తనకు కలిగిన జ్ఞానోదయానుభవమే అసలైనమరణం అని రజనీష్ చెప్పాడు.అది ఎలాజరిగిందోపైనచూచాం. ఈ విధంగా పల్లెటూరిలోని   జ్యోతిష్కుడు చెప్పినట్లు ప్రతి ఏడేళ్ళకొకసారి రజనీష్ జీవితంలో మరణం ఎదురుపడింది. మొదటిసారి ఏడేళ్ళ వయస్సులో తాతగారి మరణంతో అప్పటివరకూ అతనిలో ఉన్న బాల్యం చనిపోయి ఆస్థానంలో జిజ్ఞాసతో కూడిన పరిపక్వతా అంతరికపరిశీలనా చోటుచేసుకున్నాయి. 14 ఏళ్ళ వయస్సులో వారం రోజులపాటు అహోరాత్రులూ తదేకంగా మరణంకోసం చూచిన ఎదురుచూపు ఒక తీవ్రధ్యానంగా మారి అతనికి అంతరికలోకపు లోతులు చూపించింది.అప్పటివరకూ ఉన్న రజనీష్ మరణించి మళ్ళీ ఒక కొత్త వ్యక్తీ ఉద్భవించాడు.తిరిగి 21 ఏళ్ళ వయస్సులో తన పరిమిత అహంకారాన్ని దాటిపోవడం ద్వారా కలిగిన అనుభూతి నిజమైన మరణంగా పరిణమించి ఎన్నో జన్మలనుంచీ ఎదురుచూస్తున్న సిద్ధస్తితిని ఆయనకు ఇచ్చింది.పరిమితాహంకారనాశనమూ,విశ్వవ్యాప్త చైతన్యానుభవమూ కలిగేస్థితినే జ్ఞానోదయం అని అంటారు.  ఆధ్యాత్మికకోణంలో అదే నిజమైన మరణం అని చెప్పవచ్చు.

రజనీష్ జీవితంలో జరిగిన ఇంకొక ముఖ్యసంఘటన -- చిన్ననాటి తన స్నేహితురాలైన వివేక్ మరణం. రజనీష్ చిన్నతనంలో ఆయనకు ఒక స్నేహితురాలుండేది. ఆ అమ్మాయి పేరు శశి. ఇద్దరూ ఒకేవయస్సువాళ్ళు అవటంతో, ఆపల్లెటూళ్ళో ఆడుతూపాడుతూ నిష్కల్మషంగా తిరుగుతూ కాలంగడిపారు. వారిద్దరి మధ్యన ప్రేమఉందని మనం ఊహించవచ్చు. రజనీష్ కు 17 సంవత్సరాల వయసులో ఆ అమ్మాయికి 15 ఏళ్ళు ఉండేవి. అయితే, ఏదో జబ్బుచేసి ఆ అమ్మాయి హటాత్తుగా చనిపోయింది. ఆ రోజుల్లో మలేరియా, టైఫాయిడ్, జాండీస్, కలరావంటి రోగాలకు కూడా పల్లెల్లో మందులుండేవి  కావు. అలాటిదే ఏదో రోగంతో ఆ అమ్మాయి చనిపోయింది. చనిపోయే ముందు రజనీష్ చేతిలో చెయ్యివేసి, తాను మళ్ళీ పుడతాననీ తనని వెతుక్కుంటూవస్తాననీ చెప్పింది.

తర్వాత కొంతకాలానికి ఇంగ్లాండ్ లో "క్రిస్టిన్ వూల్ఫ్" అనే పేరుతో పుట్టిన ఒకఅమ్మాయి ఇరవైఏళ్లతర్వాత ఏదోతెలియని ఆకర్షణచేత లాగబడి, వెతుక్కుంటూ ఇండియాకు వచ్చింది. రజనీష్ ఉపన్యాసాలు విన్న ఆఅమ్మాయి ఇక ఇంగ్లాండ్ కు వెళ్ళకుండా ఇక్కడే ఉండిపోయింది. ఇలాఉండగా రజనీష్ సమక్షంలో ఒకరోజున అనుకోకుండా ఆఅమ్మాయి ఒక రకమైన ట్రాన్స్ లోకివెళ్లి తన పూర్వజన్మఘట్టాలను సినిమాతెరమీద సీన్లలాగా చూసింది. పూర్వజన్మలో  శశిగా ఉన్నప్పుడు తాను రజనీష్ తో కలిసి ఎలా ఆడుకున్నదీ, తరువాత ఎలా చనిపోయిందీ, అప్పుడు తాను చేసిన వాగ్దానమూ ఆ ఘట్టాలన్నీ కళ్ళముందు సినిమాసీన్లలాగా కనిపించాయి. అదే సమయంలో రజనీష్ కూడా ఆఅమ్మాయికి పూర్వజన్మ గురించి చెప్పాడు. ఆ అమ్మాయిని మొదటి సారి చూచినప్పుడే ఆమె తన గతజన్మస్నేహితురాలైన "శశి" అని రజనీష్ గుర్తించాడని చెప్తారు. అయితే ఆవిషయం ఆమెతో చెప్పకుండా మౌనంగా ఉన్నాడు. ఎప్పుడైతే ఆమె ట్రాన్స్ లో తన గతజన్మ జ్ఞాపకాలను చూచిందో అప్పుడు ఆమెకు విషయాన్ని తెలియచేసాడు.

అప్పటినుంచి ఆమె చనిపోయేవరకూ రజనీష్ తోనే ఉండి అతనికి సేవ చేస్తూ ఉండిపోయింది. "మా యోగవివేక్" అని రజనీష్ ఆమెకు సన్యాసనామాన్ని ఇచ్చాడు. అయితే ఈఅమ్మాయి అనుమానాస్పద పరిస్తితుల్లో బాంబేలోని ఒక హోటల్లో 9-12-1989 న మరణించింది. ఆరోజున రజనీష్ జాతకంలో శుక్ర/శుక్ర/గురు/శుక్ర/శుక్రదశ జరిగింది. స్నేహితులను ఏకాదశస్థానం నుంచి చూడాలి. రజనీష్ జాతకంలో ఇది మీనం అవుతుంది. మీనంలో రాహువుయొక్క స్తితివల్ల రజనీష్ కు విదేశీశిష్యులూ స్నేహితులూ ఎక్కువగా ఉన్నారు. రజనీష్ జాతకంలో గురువు, తనయొక్క అష్టమ లాభాదిపత్యాల వల్ల పూర్వజన్మబంధాన్ని సూచిస్తున్నాడు. శుక్రుడు మీనలగ్నానికి మారకుడు. గురువు రజనీష్ కు  లాభాధిపతిగా స్నేహితులను సూచిస్తున్నాడు. శుక్రుడు లగ్న షష్ఠ అధిపతిగా తనకు ఈ కోణంలో మిగిలిఉన్న కర్మశేషాన్ని సూచిస్తున్నాడు.

ఆ రోజున గోచారగ్రహాలస్తితిని బట్టి - గోచారశని సరిగ్గా ధనుస్సు 19 డిగ్రీలమీద సంచరిస్తూ జననకాల శుక్రునిమీద ఉన్నాడు. గోచారబుధుడు ధనుస్సు 9 డిగ్రీల మీద జననకాల సప్తమాధిపతి అయిన కుజునికి చాలా దగ్గరగా ఉన్నాడు. గోచారకుజుడు వృశ్చికం 0 డిగ్రీలో ఉన్నాడు. ఈమె చనిపోయిన సరిగ్గా 40 రోజులకు రజనీష్ కూడా శరీరాన్ని ఒదిలిపెట్టాడు. అప్పటికే రజనీష్ ఆరోగ్యం బాగా క్షీణిస్తూన్నదనీ, దానినిచూచి భరించలేని  వివేక్, ఆయనకంటే ముందుగా పోవాలని, హైడోస్ లో స్లీపింగ్ పిల్స్ మింగిందనీ కొందరంటారు. అదేమీ లేదు, ఆ అమ్మాయి ఏదో వ్యాధితో బాధపడేది. దానికి సంబంధించిన మందులు ఎక్కువ డోస్ లో వేసుకోవడంతో చనిపోయింది అని కొందరంటారు.  

అవన్నీ ఎలా ఉన్నప్పటికీ , ఈ విశ్లేషణ అంతా 5.09 నిమిషాల జనన సమయానికే సరిపోతున్నది.  కనుక ఈ సమయమే రజనీష్ జనన సమయం అని అనుకోవచ్చు.