“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

10, జూన్ 2010, గురువారం

ఆది శంకరుల జాతకం (మూడవ భాగం)

ఇప్పుడు 22-3-BC 44 నాటి ఈశ్వర నామ సంవత్సర వైశాఖ శుక్ల పంచమి నాటి జాతకాన్ని పరిశీలిద్దాం. ఇందులో లగ్నం యధావిధిగా కర్కాటకం అవుతుంది. రాశి చక్రంలో రవి,చంద్ర,శుక్ర,రాహు,కేతువులు ఉఛ్చస్థితిలో ఉన్నారు. పంచమంలో కెతువు వల్ల మంత్ర సిద్ధి సూచితం అవుతున్నది. సప్తమాధిపతి ఆరింట ఉండి వివాహాన్ని దూరం చేస్తున్నాడు. చతుర్ధ లాబాధిపతి శుక్రుని ఉచ్చ స్థితివల్ల విద్యాలాభం కలుగుతున్నది. రాహుకేతుల ఉఛ్చస్థితివల్ల కాలం అనుకూలంగా ఉంటుంది.

ఇంతవరకూ బాగానే ఉంది. వివరాలన్నీ చూచి చాలామంది ఇదే ఆదిశంకరుల జాతకం అనుకున్నారు. బీవీ రామన్ గారు కూడా శృంగేరి శారదాపీఠం రికార్డులలో ఉన్న తేదీని ప్రామాణికంగా తీసుకుని జాతకం తయారుచేశారు. కాని ఆయన ఇక్కడే కొన్ని తప్పులు చేశారు.

ఆయన తన Notable Horoscopes పుస్తకంలో తేదీని 25-3-44 BC గా తీసుకున్నారు. కాని తేదీన వైశాఖ శుక్ల పంచమి కాదు. తేదీ వైశాఖ శుక్ల అష్టమి అవుతుంది. పైగా ఆయన తీసుకున్న Co-ordinates లో పొరపాటు పడ్డారు. కాలడి రేఖాంశ, అక్షాంశలు ఆయన తీసుకున్నవి 76E59, 8N29. కాని వీటి అసలైన విలువలు 76E16, 9N58.ఇంకా చెప్పాలంటే, ఆయన తీసుకున్న తేదీన పుష్యమి నక్షత్రం ఒకటో పాదం ఉన్నది. కాని శంకరుల నక్షత్రం ఆర్ద్రా అని ఆయన వ్రాశారు. ఆయన చెప్పిన తేదీన చంద్రుడు కర్కాటక రాశిలో ఉన్నాడు. కాని చంద్రుడు మిధున రాశిలో ఉన్నట్లు ఆయన వ్రాశారు. ఇన్ని తప్పులున్నందువలన ఆయన వేసిన శంకరుల జాతకం పెట్టుడుముహూర్తంలా ఉంటుంది కాని పూర్తి స్థాయిలో సరిపోయినట్లు కనిపించదు.

అంతేకాదు. ఆయన ఇచ్చిన అనేక చారిత్రక ప్రసిద్ధ వ్యక్తుల జాతకాలు అన్నీ తప్పుల తడికలే. ఎందుకనగా ఆయా వ్యక్తుల జనన తేదీల మీద భిన్నాభిప్రాయాలున్నాయి. తేదీన వారు పుట్టారు అనేది ఇంకా ఖచ్చితంగా నిర్ధారణ కాలే దు. ఉదాహరణకు శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, గౌతమబుద్ధుడు, జీసస్ వీరెవరివీ జననతేదీలు, జనన సమయాలు ఖచ్చితంగా తెలియవు. కాని రామన్ గారు అందరికీ జాతకాలు వ్రాశి పడేశారు. పైగా చాలామంది ఒప్పుకోనటువంటి రామన్ అయనాంశ వాడారు. ఆయా మహాపురుషుల జీవిత వివరాలు ముందే తెలుసుగాబట్టి జాతకానికి వివరాలు అన్వయిస్తూ వ్రాసుకొచ్చారు. అందుకే నోటబుల్ హోరోస్కోప్స్ పుస్తకం మహా బోరు కొట్టిస్తుంది.

జ్యోతిష్యవిద్యలోని ఒక చిక్కు ఏమిటంటే, ఫలానావారి జాతకం అని ముందే తెలిస్తే, దాదాపు తేదీకైనా, టైముకైనా, జాతకానికైనా వ్యక్తి లక్షణాలను అన్వయిస్తూ వివరణ ఇవ్వవచ్చు. రాశి స్థాయిలో కుదరక పోతే నక్షత్ర స్థాయికి పోవచ్చు. అదీ వీలుగాకపోతే అంశ చక్రాలు, కారకత్వాలు, ప్రత్యేక లగ్నాలు మొదలైన ఇతర అనేక పారామీటర్స్ తో అతికి అన్వయిస్తూ చక్కగా వివరణ ఇవ్వవచ్చు. అది గొప్ప విషయం కాదు. అందుకే జరిగిపోయిన విషయాన్ని వివరించడం తేలిక. జరుగబోయేది ఊహించడమే అతి కష్టం.

జరిగిపోయిన సంఘటనలకు జ్యోతిష్యవివరణ ఇచ్చి మామూలు మనుషులని జ్యోతిర్విద్యలో లోతులు తెలియని వారిని తేలికగా ఒప్పించవచ్చు. కుహనా జ్యోతిష్కులు చాలామంది ఇదేపని చేస్తుంటారు. కాని జ్యోతిర్విద్యలో లోతైన ప్రావీణ్యత ఉన్నవారిని ఇటువంటి పైపై విశ్లేషణలతో మెప్పించడం కష్టం. అటువంటివారు రకమైన విశ్లేషణలోని లోపాలు తేలికగా కనిపెట్టగలుగుతారు. వారు వేసే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలంటే విశ్లేషణ శుద్ధంగా ఉండాలి, విధమైన bias లేకుండా సాగాలి, ప్రామాణీక గ్రంధాలలోని యోగాలను, సూత్రాలను ఉటంకిస్తూ చెప్పాలి. లేదంటే వారి శల్య పరీక్ష ముందు పైపైన చేశే రెట్రోస్పెక్టివ్ వివరణ నిలబడలేదు. రామన్ గారి విశ్లేషణలో లోపం బాగా కనిపిస్తుంది. శంకరుల జాతకానికి ఆయన ఇచ్చిన వివరణ అతుకుల బొంతలా ఉంటుంది.

ఇక మన పరిశీలన మొదలు పెడదాము.

>>
అల్పాయుర్యోగం: లగ్న అష్టమాధిపతులు ద్విస్వభావరాశుల స్థితివల్ల అల్పాయుష్షు సూచితం. లగ్నం చర రాశి, చంద్రుడు స్థిర రాశి స్థితివల్ల మధ్యాయు యోగం కలిగింది. లగ్న హోరాలగ్నాలు చర ద్విస్వభావ రాశులవల్ల అల్పాయువు సూచితం. అంశాయు గణన చెయ్యగా ఆయుష్షు 40.22 సంవత్సరాలు వచ్చింది. ఇది మధ్యాయువు అవుతుంది. కనుక శంకరుల జీవితంతో సరిపోలేదు.



>>
నాలుగేళ్ల వయస్సులో కుజ దశ/కేతు అంతరం జరిగింది. కుజుడు నవమంలో ఉఛ్చ శుక్రునితో కలసి ఉన్నాడు. కేతువు పంచమ స్థానంలో ఉన్నాడు. ఇద్దరూ ఒకరికొకరు కోణ స్థితిలో ఉన్నారు. పితృ స్థానం నుంచి ఏవిధంగానూ దశలో మారకం కనిపించడం లేదు. పితృస్థానం నుంచి కుజుడు ద్వితీయ మారక స్థానాధిపతి అయినప్పటికీ నవమాధిపత్యం కూడా ఉన్నందువలనా, గురునితో మిత్రత్వం వల్లనా మారకుడు కాలేడు. కనుక పితృమారకం సూచితం కావడం లేదు. కాని శంకరులకు వయస్సులోనే పితృమారకం జరిగింది.

>>
అయిదేళ్ళ వయస్సులో కుజ దశ/శుక్ర అంతరం జరిగింది. కుజుడు లగ్నానికి యోగకారకుడు, పంచమాధిపతి. విద్యాస్థానాధిపతి అయిన ఉఛ్చ శుక్రునితో కలసి గురు స్థానంలో ఉన్నందువలన బ్రహ్మోపదేశం ఉపనయనం జరిగాయనిపిస్తుంది. కాని కుజుడు నవాంశలో నీచ స్థితిలో ఉండటం జాతకానికి పూర్తి బలహీనతను ఇచ్చింది. కనుక ఉపనయనం జరిగే అవకాశం లేదు.

>>
ఇక పోతే,ఎనిమిదేళ్ళ వయస్సులో రాహు/రాహు దశ జరిగింది. దశలోనే సంన్యాసం స్వీకరించి దేశాటనకు బయలుదేరాడు. రాహువు దూర ప్రయాణాలను దేశాటనను ఇస్తాడు. కాని ఆయన స్థిర రాశిలో రవి నక్షత్రంలో ఉన్నందువలన గట్టిగా సంఘటన జరుగుతుందని చెప్పలేము. పైగా, సంన్యాస యోగాన్నిచ్చే శని శుక్ర కేతువుల యుతి జాతకంలో బలంగా కనపడదు. శని శుక్ర నక్షత్రంలోనూ,కేతువు శని నక్షత్రంలోనూ ఉండటం వల్ల రెండు గ్రహాలకు నక్షత్ర స్థాయిలో సంబంధం ఉన్నది. కాని శుక్రునికి రెండుగ్రహాలతో ఎటువంటి సంబంధమూ లేకపోగా వ్యతిరేక ఫలితాలనిచ్చే కుజయుతి కనిపిస్తుంది. యుతి వల్ల అతి కామయోగం కల్గుతుంది. ఆది శంకరుల వంటి బ్రహ్మవేత్తకు ఇటువంటి యోగం ఊహించడానికికూడా అసమంజసంగా ఉంటుంది. కనుక ఇది శంకరుల జాతకం అవడానికి ఆస్కారం లేదు.

>>
పదహారేళ్ళ వయస్సులో స్వామికి రాహు/బుధ దశ జరిగింది. రాహువు లాభస్థానం వల్లా,బుధుని తృతీయాధిపత్యం వల్లా,బుధుడు ఉఛ్ఛ రవితో యుతి వల్లా, రవి దశమ స్థానంలో ఉండి చతుర్ధాన్ని చూస్తున్నందువల్లా విద్యా వ్యాసంగం, గ్రంధ రచనలు సూచితం అవుతున్నవి . సమయంలో ప్రస్థాన త్రయ భాష్యం వ్రాశినందువల్ల ఒక్క పాయింట్ మాత్రం బాగా సరిపోతున్నది.

>>
ముప్పైరెండేళ్ళ వయస్సులో స్వామికి గురు/శుక్ర దశ జరిగింది. గురువు లగ్నానికి మారకుడు కాదు. శుక్రుడూకాడు. పైగా శుక్రుడు లగ్న,వింశాంశలలో ఉఛ్చ స్థితిలో ఉన్నాడు. కనుక వీరి దశలలో మారకం సంభవం కాదు.

జాతకంలోని ముఖ్యమైన లోపాలు ఏమనగా-- నవాంశలో యోగకారకుడైన కుజుని నీచ స్థితి మరియు ఆధ్యాత్మికతను సూచించే వింశాంశ చక్రంలో గురుని నీచ స్థితి. ఇటువంటి గ్రహస్థితులు ఆది శంకరునివంటి అవతార మూర్తి జాతకంలో ఉండటం అసంభవం.

కనుక జాతకం ఆది శంకరులది కాదు అని చెప్పవచ్చు. దీనిని బట్టి ఆయన బీ సీ 44 లో పుట్టినట్లుగా చెబుతున్న తేదీ సరియైనది కాదు అని తేలుతున్నది.