3, ఏప్రిల్ 2026, శుక్రవారం

World Autism Awareness Day



నిన్న ఏప్రిల్ 2 వ తేదీ World Autism Awareness Day.

ఆటిజం గురించి ఎందుకు తెలుసుకోవాలంటే, ఇవాళా రేపూ పుడుతున్న పిల్లలలో చాలామంది ఆటిజం లక్షణాలతోనే పుడుతున్నారు. అమెరికాలో చూస్తే, గతంలో ప్రతి 45 మంది పిల్లలలో ఒకరు ఆటిజంతో పుట్టేవారు. తరువాత అది 36 కి ఒకటిగా పెరిగింది. ఆ తరువాత 31 కి ఒకటిగా ఇంకా పెరిగింది. నేడు ప్రతి వందమంది పిల్లలలో నలుగురు ఆటిజంతో బాధపడుతున్నారు. అంటే, ప్రతి 25 మందిలో ఒక అటిజం పేషంటున్నాడు. అంటే ప్రతి ఏడాదీ అటిజం పేషంట్లు పెరుగుతున్నారు. 

ఇండియాలో అయితే లెక్కలు సరిగ్గా లేవు. కాకపోతే, ప్రతి 65 మందిలో ఒకరు ఆటిజం పిల్లవాడని ప్రస్తుతపు కాకిలెక్కలు చెబుతున్నాయి.

ప్రపంచజనాభాలో చూస్తే, ప్రతి వందమందిలో ఒకరు అటిజం పేషంటని లెక్కలున్నాయి. ప్రస్తుత ప్రపంచజనాభా 8.3 బిలియన్లు దాటింది. అంటే 830 కోట్లు. 

8 కోట్లమంది అటిజం పేషంట్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారన్నమాట !

విచ్చలవిడిగా వేస్తున్న టీకాల వల్ల, అనవసరంగా వాడబడుతున్న యాంటీ బయాటిక్స్ మరియు స్టెరాయిడ్స్ వల్ల ఈ ఖర్మ మానవాళికి పట్టుకున్నదని హోమియోపతి వైద్యశాస్త్రం అంటుంది. చాలామంది ఈ మాటను నమ్మడం లేదు. మనం నమ్మినా నమ్మకపోయినా సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు కదా మరి !

అన్నీ సక్రమంగా ఉన్న మనిషికే ఈ ప్రపంచంలో బ్రతకాలంటే చాలా కష్టంగా ఉన్న రోజులివి. ఇక బుద్ధిమాంద్యం ఉంటే, అటువంటి పిల్లల పరిస్థితి ఏమిటో తలుచుకుంటేనే ఎంతో బాధ కలుగుతుంది. వారిని చూచుకునేవారు ఉంటే పరవాలేదు. చూచుకునేవారు ఎవరూ లేకపోతే, అటువంటి పిల్లలు ఈ దుర్మార్గపు ప్రపంచంలో ఏమైపోతారో ఊహించడానికే సాధ్యం కాదు.

కుంగ్ ఫూ సూపర్ స్టార్ జెట్ లీ, ఇదే సబ్జెక్ట్ పైన 2009 లోనే చైనాభాషలో ఒక సినిమా తీశాడు. మార్షల్ ఆర్ట్స్ అనేది ఆ సినిమా ఇతివృత్తం కాదు. ఆ సినిమా పేరు Ocean Heaven. దాని కధ చాలా హృదయవిదారకంగా ఉంటుంది.

ఒక తండ్రికి లివర్ కేన్సర్ ఉంటుంది. భార్య చనిపోయి ఉంటుంది. తనుకూడా త్వరలోనే చనిపోతానని అతనికి తెలుసు. అతనికి ఒక ఆటిజం పిల్లవాడుంటాడు. అతనికి 22 ఏళ్ళు. తాను పోయాక, ఈ లోకంలో ఎలా బ్రతకాలో ఆ పిల్లవాడికి ఆ తండ్రి నేర్పిస్తూ ఉంటాడు. ఇదీ కధ.

ఈ స్క్రిప్ట్ ను చదువుతున్నప్పుడే ఎన్నోసార్లు ఏడ్చేశానని జెట్ లీ So Be It అనే ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఆ తరువాత ఆ సినిమాను తీశాడు. అది హిట్టయింది. ఎంతోమందికి అటిజం గురించి అవగాహనను కలిగించింది. ప్రపంచవ్యాప్తంగా వందలాది ఆటిజం కేర్ సెంటర్లు పుట్టడానికి కారణమైంది.

మార్షల్ ఆర్ట్స్  అభ్యాసం చేసేవారు రౌడీలై ఉంటారని, వారిలో మానవత్వం ఉండదని చాలామంది పొరపాటుగా అనుకుంటూ ఉంటారు. అది చాలా తప్పు భావన.

ఈ సినిమాను చూడండి. కాస్తంత మంచితనం మానవత్వం ఉన్నవారు ఎవరైనా సరే కదిలిపోతారు. కన్నీళ్లు పెట్టుకుంటారు. ఈ సమస్యను తీర్చడానికి మనవంతుగా ఏం చేయాలా అని ఆలోచిస్తారు.

ఈ సినిమాను చూసి, మంచి సినిమాలంటే ఎలా ఉంటాయో తెలుసుకోండి.
read more " World Autism Awareness Day "

చక్ నారిస్ మరణం గురించి గ్రహాలేమంటున్నాయి?

ప్రపంచ ప్రఖ్యాత కరాటే ఛాంపియన్ చక్ నారిస్ గురించి తెలియనివారు మార్షల్ ఆర్ట్స్ సర్కిల్లో ఉండరు. The Way Of The Dragon అనే సినిమాలో బ్రూస్ లీ తో ఇతను చేసిన ఫైట్ చాలా పాపులర్ అయింది. ఈ సినిమా పేరును తరువాత Return Of The Dragon గా మార్చారు.

ఇతను మొన్న మార్చి 19 న అమెరికాలో చనిపోయాడు. ఆ సమయానికి ఇతనికి 86 ఏళ్ళు. చివరిక్షణాలలో ఇతని హెల్త్ గురించి ఏ విధమైన సమాచారమూ మీడియాలో అందటం లేదు. గ్రహాలేమంటున్నాయో చూద్దాం.

ఇతను 10 మార్చి 1940 న ఒక్లహామా లోని ర్యాన్ అనేచోట పుట్టాడు. సమయం ఉదయం 3 గంటలు. ఇతని జాతకచక్రాన్ని ఇక్కడ చూడవచ్చు.

మార్చి 19 వ తేదీన ఇతని జాతకంలో రాహు శుక్ర బుధ బుధ బుధ దశ నడిచింది. రాహువు ఉచ్ఛబుధుని సూచిస్తున్నాడు. ఈ జాతకానికి బుధశుక్రులు మారకులు. బుధునికి వచ్చిన 4/7 భావాధిపత్యాల వల్ల ఇది గుండె సంబంధిత సమస్య అని అర్ధమౌతున్నది.

బుధుడు నీచస్థితిలో గ్రహయుద్ధంలో వక్రించి ఉన్నాడు. వక్రతవల్ల కుంభంలో ఉన్న సూర్యుడిని కలుస్తాడు. ఇదికూడా గుండెసంబంధిత సమస్యకు సూచికయే. పైగా, ప్రస్తుతం ఇతనికి ఏలినాటిశని మధ్యభాగం నడుస్తున్నది.

గతంలో 2017 లో జూలై 16, 17 తేదీలలో ఇతనికి రెండు హార్ట్ ఎటాక్స్ వచ్చాయని ఒక పుకారుంది. ఇతను ప్రపంచ సెలబ్రిటీ గనుక, ఇతనికున్న ఇమేజి దృష్ట్యా వివరాలను గోప్యంగా ఉంచారు. ఆ రోజులలో ఏం జరిగిందో, గ్రహాలేమంటున్నాయో చూద్దాం.

ఆ రోజులలో ఇతనికి రాహు గురు శుక్ర శుక్ర శుక్ర దశ నడిచింది.

బుధశుక్రుల ప్రభావం మళ్ళీ స్పష్టంగా కనిపిస్తున్నది. అంతర్దశలో లగ్న, చంద్రలగ్నాలకు అధిపతి అయిన గురువున్నప్పటికీ, నవాంశలో నీచస్థితిలో ఉండటంతో ఇతనికి గురుదోషం ఉన్నది. కనుక ఆ రోజునకూడా ఇతనికి హార్ట్ ఎటాక్స్ వచ్చినది నిజమే అని తెలుస్తున్నది. గురువు పాత్ర వల్ల పార్టీలు,  వేళతప్పి  ఎక్కువగా తినడం మొదలైన పొరపాట్లు జరిగి ఉండవచ్చు.

సూర్యునిపైన రాహుకేతువుల ప్రతికూల దృష్టులు, మరియు యురేనస్ యొక్క అనుకూలదృష్టి ఉన్నాయి. కనుక, గుండెసంబంధిత సమస్యకు గురైనప్పటికీ, సమయానికి సరియైన వైద్యసహాయం అందటంతో బ్రతికి బయటపడ్డాడు. పైగా ఆనాడు గోచారశని 9 వ భావమైన తులలో వక్రించి, 8వ భావం ఆయుష్యస్థానంలో ఉచ్ఛస్థితిలో ఉన్నాడు.  అందుకని బ్రతికించాడు. ఇప్పుడు ఏలినాటిశని గనుక తీసుకుపోయాడు.

మీడియాలో లీక్ చేయకపోయినా, ఇతను చనిపోయినది గుండె సంబంధిత సమస్యతోనే అని దీనిని బట్టి అర్ధమౌతున్నది.

read more " చక్ నారిస్ మరణం గురించి గ్రహాలేమంటున్నాయి? "