“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

22, ఆగస్టు 2023, మంగళవారం

పరమహంస యోగానంద గారి జాతకం - Part 7 (కొన్ని చేదు వాస్తవాలు)

యోగానంద గారి జాతకాన్ని గురించి ఎంతైనా వ్రాయవచ్చు. కానీ అవసరం లేదు. కొన్ని వాస్తవాలను మాత్రం వ్రాసి ఈ సీరీస్ ముగిస్తున్నాను.

తమకు నచ్చిన గురువులను మహనీయులను అవతారాలుగా భావించే మనస్తత్వం చాలామంది మనుషులలో కనిపిస్తుంది. ఇలాంటి వారిని చూస్తే నేను చాలా నవ్వుకుంటాను. అవతారాలు సందుకొకరు గొందికొకరు ఉండరు.

జిల్లెళ్ళమూడి అమ్మగారి భక్తుడొకాయన ఒకసారి నాతో మాట్లాడుతూ, 'అమ్మగారి బోధలు పాత అవతారాల బోధలను మించిపోయాయి. రామునికంటే కృష్ణునికంటే అమ్మగారే గ్రేట్' అన్నాడు. 

అందరికంటే అమ్మగారు చాలా గ్రేట్ అని నాకు నిరూపించాలని అతను చాలా తాపత్రయపడిపోయాడు.

అతనితో ఇలా చెప్పాను.

'చూడు బాబు, నేను రాముడినీ చూడలేదు. కృష్ణుడినీ చూడలేదు. అమ్మగారిని కూడా చిన్నపిల్లవాడిగా ఉన్నపుడు ఒక నిముషం సేపు చూడగలిగాను. కనుక ఆమె అవతారమా కాదా అనే విషయం నాకు  తెలియదు. రాముడితో కృష్ణుడితో ఆమెను పోల్చవలసిన అవసరం కూడా నాకు కనిపించడం లేదు. ఆమె గొప్పతనాన్ని ప్రూవ్ చేయవలసిన అగత్యం నాకు లేదు. నాకు ప్రూవ్ చెయ్యవలసిన పని నీకూ లేదు. అలా చేస్తే నీకు ఒరిగేదీ లేదు. కాబట్టి నీ సోది ఇక ఆపు'

'మరైతే మీరు జిల్లెళ్ళమూడి ఎందుకు వస్తున్నారు? ఇక్కడ ఇల్లెందుకు కొన్నారు?' అడిగాడు.

'అమ్మంటే నాకిష్టం. అమ్మ బోధలంటే నాకిష్టం. అందుకే వస్తున్నాను. అంతవరకే' అని చెప్పాను.

జీసస్ ను కూడా యిలాగే అవతారం చేసి కూచోబెట్టారు కొంతమంది మూఢభక్తులు. ఇప్పుడైతే ఆయన సాక్షాత్తు దేవుడే అంటున్నారు క్రైస్తవులు. ఇవన్నీ చాలా హాస్యాస్పదమైన పోకడలు. అసలు పుట్టాడో లేదో రుజువు కానివాడిని దేవుడిని చేసి కూచోబెడతారు మానవులు.

యోగానంద రూపంలో జీసస్ మళ్ళీ వచ్చాడని కొందరు అమెరికన్స్ నమ్మేవారు. ఇదే ప్రశ్న ఆయనను డైరెక్ట్ గా అడిగారు కూడా. ఆయన సూటిగా జవాబు చెప్పలేదు. 'ఏ అలైనా సముద్రం నుంచి మాత్రమే వస్తుంది' అన్నాడు. అయితే ఆయన ఇంకొక మాట చెప్పాడని స్వామి క్రియానంద అంటాడు. 

'జీసస్ పుట్టినపుడు ఆ శిశువును చూడటానికి వచ్చిన ముగ్గురు తూర్పుదేశపు వైజ్ మెన్ ఎవరంటే - బాబాజీ, లాహిరీ మహాశయ, యుక్తేశ్వర్ గిరి - గార్లని ఆయన తనతో చెప్పాడని క్రియానంద వ్రాశాడు. 'మరి జీసస్ ఎవరు?' అనడిగితే యోగానంద మాట్లాడలేదు. కనుక, యోగానందే జీసస్ అని చాలామంది అమెరికన్స్ అనుకున్నారు. 'జీసస్ రెండవ రాకడ' అంటే 'యోగానంద అమెరికా వచ్చి క్రియాయోగాను బోధించడమే' అని వారు నమ్మారు. యోగానంద కూడా ఇటువంటి భావాలకు నర్మగర్భంగా ఆజ్యం పోశాడు. అయితే ఇక్కడ కొన్ని లొసుగులున్నాయి.

లాహిరీ మహాశయుల శిష్యుడైన స్వామి ప్రణవానంద 1860 ప్రాంతాలలో కాశీలో బాబాజీని దర్శించారు.  అది లాహిరీ మహాశయుల ఇంటిలోనే, ఆయన సమక్షంలోనే జరిగింది. ఆ సమయంలో 'మీ వయసు ఎంత?' అని ప్రణవానంద బాబాజీని అడిగారు. 'అయిదారు వందల సంవత్సరాలుంటుంది' అని బాబాజీ చెప్పారు. ఈ విషయం రికార్డ్ కాబడి ఉంది. అంటే బాబాజీ 1300 CE లేదా 1200 CE ప్రాంతానికి చెందిన వాడై ఉండాలి. మరి యోగానందతో బాటు చాలామంది బాబాజీకి 2000 ఏళ్ళున్నాయని, ఆయన జీసస్ కు సమకాలికుడని ఊదరగొడుతున్నారు. ప్రపంచమంతా దీనినే నమ్ముతోంది. అయితే, ఇది నిజం కాదు. లోకంలో ప్రచారంలో ఉన్నవి చాలావరకూ అబద్దాలే.

ప్రణవానందగారు లాహిరి మహాశయుల ఇంటిలో బాబాజీని చూసినట్లుగా చెప్పేది నిజమైతే, యోగానంద తదితరులు చెప్పేది నిజం కాదు. అలాంటప్పుడు జీసస్ పుట్టినపుడు బాబాజీ వెళ్లి దర్శించాడని యోగానంద చెప్పినది కట్టుకథ అవుతుంది. అసలు క్రియానందకు యోగానంద ఈ విషయం నిజంగా చెప్పాడా  లేక ఇదంతా క్రియానంద క్రియేషనా అన్నది కూడా ఎవరికీ తెలియదు.

పైగా, యోగానంద జీసస్ అయితే, బాబాజీ, లాహిరి బాబా, యుక్తేశ్వర్లు ఆయన దర్శనం కోసం రావడం నిజమైతే, మరుజన్మలో అదే యోగానంద ఆ ముగ్గురి శిష్యుడు ఎలా  అయ్యాడు? ఇది సంభవం కాదు. కనుక ఇవన్నీ కాకమ్మకబుర్ల లాగా ఉన్నాయి.

ఒక జన్మలో తను అర్జునుడినని,  జేమ్స్ జే లిన్ నకులుడని యోగానంద అనేవాడు. మరి 'కృష్ణుడు ఎవరు?' అనడిగితే చెప్పేవాడు కాదు. ఒకసారి, 'బాబాజీనే కృష్ణుడు' అని చెప్పాడు. మళ్లీ ఇంకోసారి 'బాబాజీకి కృష్ణుడు క్రియాయోగాన్ని బోధించాడు' అంటాడు. ఇంకో జన్మలో తనే 'చెంఘీజ్ ఖాన్' అంటాడు. మరో జన్మలో 'విలియం ది కాంకరర్' తనే అంటాడు. ఇవన్నీ చదివితే, చదివే వాళ్ళకు పిచ్చెక్కుతుంది.

ఇంకా నయం 'ప్రస్తుతం ద్రౌపది ఎవరు?' అని వినేవాళ్ళు అడగలేదు. సంతోషం !

ఆ మాటకొస్తే,  అసలు యోగానందకు బాబాజీ దర్శనమే కాలేదు. యోగానంద 1935 లో ఇండియాకు వచ్చినపుడు, 'నాకు మరణం దగ్గర పడుతున్నది, నువ్విక్కడే ఉండు' అని యుక్తేశ్వర్ గిరిగారు చెప్పినా వినకుండా, పూరీ ఆశ్రమాన్ని వదలి,  కుంభమేళాకు తన స్నేహితులతో బంధువులతో కలసి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళడానికి గల కారణం, బాబాజీ దర్శనం అక్కడ అవుతుందేమో అన్న ఆశ మాత్రమే. ఏమంటే, గతంలో అలాంటి ఒక కుంభమేళాలోనే యుక్తేశ్వర్ గారికి బాబాజీ దర్శనం అయింది. తనక్కూడా అలా అవుతుందని, అది తన పుస్తకంలో వ్రాసుకుందామని యోగానంద ఆశించాడు. కానీ ఆయనకు బాబాజీ దర్శనం కాలేదు. కారణం? తన గురువు మాట వినకుండా, కుంభమేళాకు వస్తే బాబాజీ ఎందుకు దర్శనం ఇస్తాడు?

నేడు మనం చూస్తున్న బాబాజీ చిత్రం ఒక అమెరికన్ ఆర్టిస్ట్ చేత యోగానంద వేయించినదే.  అందులో బాబాజీకి ఒక అమెరికన్ యువకుని పోలికలు వచ్చాయి. అది సరైన చిత్రం కాదు. బాబాజీని చూచిన ఇతరులు ఎంతోమంది బాబాజీ అలా ఉండడని చెప్పారు. కానీ లోకమంతా ఆ చిత్రమే నిజమని నమ్ముతున్నారు. ఇదొక వింతల్లో వింత ! మాయలలో మాయ ! బాబాజీ ఆ చిత్రంలోలా ఉండడు. 

తనను వదిలేసి కుంభమేళాకు యోగానంద వెళ్ళినపుడు యుక్తేశ్వర్ గారు చాలా బాధపడ్డారు. తన మరణ సమయంలో యోగానంద తనతో ఉండాలని ఆయన ఎంతో ఆశించారు. కానీ ఆ కోరికను యోగానంద తీర్చలేకపోయాడు. ఈ గిల్టీ ఫీలింగ్ యోగానందలో జీవితాంతం ఉండిపోయింది. దీనికి కారణం యోగానంద గారికున్న ఎమోషనల్ ప్రవర్తన మాత్రమే. దానివల్లనే యుక్తేశ్వర్ గారు ఇస్తున్న సూచనలను యోగానంద గ్రహించలేకపోయాడు. మరణ సమయంలో ఆయన దగ్గర ఉండకుండా వెళ్ళిపోయాడు.

తన గురువును నిరాశ పరచాడు గనుకనే, తన శిష్యుల చేతిలో నిరాశకు గురయ్యాడు యోగానంద. కర్మసూత్రం ఎంతటివారినైనా వదలదని దీనివల్ల ఋజువౌతున్నది.

యోగానంద గారికి లోతైన యోగదృష్టి లేదన్నది నా నమ్మకం. దీనికి రుజువుగా ఒకే ఒక్క సంఘటన చూపిస్తాను.

అరుణాచలంలో రమణమహర్షి దర్శనం చేసుకున్నప్పుడు, మహర్షి  కంటే, మహర్షి శిష్యుడైన యోగి రామయ్య ఆయనకు బాగా నచ్చాడు. 'గురువు కంటే శిష్యుడే ఆధ్యాత్మికంగా ఉన్నతస్థాయిలో ఉన్నాడని  అనిపిస్తున్నది' అని తన సహచరులతో అన్నాడు. అంటే మహర్షి కంటే యోగి రామయ్య ఉన్నతస్థాయిలో ఉన్నాడని ఆయననుకున్నాడు. ఇది చదివినపుడు నాకు నవ్వాలో ఏడవాలో అర్ధం కాలేదు. ఇది 1935 లో జరిగింది. యోగానంద గారి యోగదృష్టి అలా ఉండేది !

ఇప్పుడు ఒక పిట్టకథ.

ఇకపోతే, తను యోగానంద కొడుకునని చెబుతూ బెన్ ఎస్కిన్ అనే అమెరికన్ ఒకతను 2000 ప్రాంతంలో తెరపైకి వచ్చాడు. యోగానంద అమెరికాకు వచ్చిన కొత్తలో అడిలైడ్ ఎస్కిన్ అనే తన తల్లి  ఆయనకు ఫోటోగ్రాఫర్ గా పనిచేసిందని, వారిద్దరికీ గట్టి అనుబంధం ఉందని, 1933 లో పుట్టిన బెన్ ఎస్కిన్ వాదించాడు. అతనిలో ఇండియన్ పోలికలుండేవి. రంగు కూడా గోధుమరంగుగా ఉండేవాడు. పైగా, 1933 కి నాలుగేళ్లు ముందే అతని అమెరికన్ పెంపుడు తండ్రికి వాసెక్టమీ ఆపరేషన్ అయింది. కనుక ఇతని తండ్రి ఎవరో ఒక ఇండియన్ అనేది ఆ పెంపుడు అమెరికన్ తండ్రికి కూడా తెలుసు. 

యోగానందే ఆ తండ్రి అని భావించిన ఆ అమెరికన్ తండ్రి, యోగానందను తెగ తిట్టేవాడు. అడిలైడ్ ను కొట్టేవాడు. 'యూ బ్లడీ బ్లాక్ బాస్టర్డ్' అని తన చిన్నపుడు తనను తెగ తిట్టేవాడని బెన్ అన్నాడు. ఈ కోపంతో  పదేళ్ళపాటు నెవాడా ఎడారి దగ్గర దిక్కులేని స్థితిలో తల్లీ కొడుకులను వదిలేశాడు ఆ అమెరికన్ తండ్రి. బెన్ ఎస్కిన్ నానా కష్టాలు పడి, చిన్నవయసు నుండే కూలిపనులు చేసుకుంటూ బ్రతికేవాడు. డబ్బులు లేక చదువుకోలేదు. అతని తల్లి ఎడిలైడ్ అతనితో ఇలా అనేది, 'నీలో ఉన్న రక్తం చాలా విలువైనది. నువ్వు ముందుముందు చాలా గొప్పవాడివి అవుతావు'. ఇలా అనేదిగాని అసలు తండ్రి ఎవరో ఆమె చెప్పేది కాదు.

కాలిఫోర్నియాకు చెందిన న్యూ టైమ్స్ అనే పత్రిక ఇదంతా కాలమ్స్ గా వ్రాసింది. మళ్ళీ దుమారం రేగింది. కలకత్తాలో ఉన్న యోగానంద బంధువుల రక్తాన్ని సేకరించి, బెన్ రక్తంతో పోల్చి DNA టెస్ట్ చేయించారు SRF అధినేతలు. అది నెగటివ్ వచ్చిందని బెన్ చేప్పేది అబద్దమని SRF వాదించింది. SRF పర్యవేక్షణలో జరిగిన టెస్ట్ కరెక్ట్ ఎలా అవుతుందని బెన్ వాదించాడు. పక్షపాతం లేని మూడో ఏజెన్సీ తో ఆ టెస్ట్ జరగాలని అతను కోరాడు. అయితే ఆ విధంగా టెస్ట్ జరగడానికి SRF ఒప్పుకోలేదు.

నేరాన్ని ధీరానంద పైకి లేదా నిరోధ్ పైకి తొయ్యాలని SRF లాయర్ ప్రయత్నించాడు. వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు బెన్ తండ్రి అయ్యుంటాడని ఆ లాయర్ అన్నాడు. ఈ వ్యాఖ్యలతో మండిపడిన వను బాగ్చి (ధీరానంద కుమారుడు), అనిల్ నిరోద్ (నిరోధ్ కుమారుడు)లు, వాలంటరీగా తమ రక్తం శాంపిల్స్ ఇచ్చి బెన్ రక్తంతో పోల్చి అమెరికాలోనే టెస్ట్ చేయించారు. అవి నెగటివ్ రిజల్ట్ వచ్చాయి. అంటే ధీరానంద, నిరోధ్ లు బెన్ తండ్రులు కారని రుజువై పోయింది. అదేవిధంగా ఒక Third party దగ్గర యోగానంద బంధువుల బ్లడ్ ను కూడా బెన్ రక్తంతో పోల్చి  DNA టెస్ట్ చెయ్యాలని వారు కోరారు. కానీ దానికి SRF స్పందించలేదు.

బెన్ తండ్రి, అమెరికన్ కాదనేది వాస్తవం. అతని రంగు, పోలికలు అన్నీ ఒక ఇండియన్ లాగా ఉండేవి. అతని అన్నలందరూ తెల్లగా అమెరికన్ల లాగానే ఉండేవారు. కానీ బెన్ మాత్రం ఇండియన్ లేదా మెక్సికన్ పోలికలతో ఉండేవాడు. ధీరానంద, నిరోధ్ లు అతని తండ్రులు కారు. మరి అతని తండ్రి ఎవరు? అనే ప్రశ్న తేలకుండా ఉండిపోయింది.

బెన్ ఎస్కిన్ కొన్నేళ్ల క్రితం చనిపోయాడు. బెన్ తల్లి ఎడిలైడ్ దాదాపు నూరేళ్లు బ్రతికి ఒక పిచ్చాసుపత్రిలో కరెంట్ షాకులతో చనిపోయింది. యోగానంద బ్రతికి ఉన్నంతవరకూ ఆమె ఆయన భక్తురాలుగానే ఉంది. ఆయన్ను తరచూ కలుస్తూనే ఉండేది. చివరకు ఈ వివాదం ఎటూ తేలకుండా ఉండిపోయింది.

బెన్ ఎస్కిన్ ను, యోగానందను చూసినవారు మాత్రం ఇద్దరికీ ఖచ్చితమైన పోలికలున్నాయని అంటారు. ఇదెంతవరకూ నిజమో మనకు తెలియదు. బెన్ ఎస్కిన్ చనిపోయేవరకూ యోగానందే తన తండ్రి అని నమ్మేవాడు. అదే చెప్పేవాడు. ఇదంతా చర్చ్ అల్లిన కట్టుకథ అని, యోగానందకు చెడ్డపేరు తేవడానికి క్రైస్తవ మిషనరీలు చేసిన కుట్ర అని యోగానంద భక్తులంతా అంటారు.

జ్యోతిష్యశాస్త్రాన్ని ఉపయోగించి చూడమని, ఈ సమస్యను తేల్చమని కొందరు నన్ను కోరారు. యోగానందగారి జాతకం స్పష్టంగా ఉందికదా? చూశాను. కానీ అందరికీ వివరించి చెప్పవలసిన పని నాకు లేదు. కాబట్టి చెప్పను.

'యోగానందకు తన శిష్యురాళ్ళతో సెక్స్ సంబంధాలున్నాయి, వాటిని మానుకోమని నేను చెప్పాను, కానీ యోగానంద వినడం లేదు. అందుకని యోగానందతో నా సంబంధం త్రెంచేశాను' అని బదరీనాథ్ లో  బాబాజీ తనతో అన్నాడని మార్షల్ గోవిందన్ అనే ఇంకొక క్రియాయోగ గురువు వ్రాశాడు. ఇతను SAA రామయ్య అనే తమిళ సిద్ధ సాంప్రదాయ క్రియాయోగ గురువుకు శిష్యుడు. ఇదంతా అబద్దమని, మార్షల్ గోవిందన్ అనేవాడు ఒక ఫ్రాడ్ అని చాలామంది అంటారు.

'బాబాజీ క్రియాయోగా' అనే ఇంకొక సిద్ధ క్రియాయోగా సంప్రదాయాన్ని ఈ SAA రామయ్య అనే అతను తమిళనాడులో స్థాపించాడు. అమెరికాలో వీళ్లకు కూడా బ్రాంచిలున్నాయి.  బాబాజీ పేరు నాగరాజన్ అని, ఆయన కడలూరులో పుట్టాడని, అగస్త్యమహర్షి శిష్యుడని, శ్రీలంకలోని కటర్గమాలో సిద్ధభోగనాధుని శిష్యరికంలో క్రియాయోగాన్ని నేర్చుకున్నాడని వీళ్లంటారు. యోగానంద చెప్పినట్లు, జీసస్ కు బాబాజీకి సంబంధం లేదని, అదంతా ఒక కట్టుకథ అని వీరి వాదన.

నిజానిజాలు ఎవరికీ తెలియవు.

మళ్ళీ మన కధలోకొద్దాం.

యోగానంద మరణం తర్వాత జేమ్స్ జె లిన్ SRF కు అధిపతి అయ్యాడు. అయితే, ఆయన ఎక్కువకాలం జీవించలేదు. ఆయనకు ఏదో మెదడు రోగం వచ్చి  త్వరలోనే చనిపోయాడు. ఆ తర్వాత యోగానందకు ప్రియశిష్యురాలైన దయామాత ఆ స్థానాన్ని అలంకరించి, 2010 లో చనిపోయేవరకూ దాదాపు 50 ఏళ్లపాటు SRF కు అధినేతగా ఉంది. ఆమె హయాంలో 50 మందికి పైగా అమెరికన్ సన్యాసులు సంస్థను వదలి వెళ్లిపోయారు. కొంతమంది వేరే కుంపట్లు పెట్టుకున్నారు. ఇండియాలోని YSS సంస్థలో కూడా,  తనకు ఇష్టం లేని చాలామందిని ఆమె తొలగించింది. ప్రస్తుతం SRF (అమెరికా సంస్థ) + YSS (ఇండియా సంస్థ) లకు జాయింట్ గా బ్రదర్ చిదానంద అనే అమెరికన్ సన్యాసి అధినేతగా ఉన్నాడు. అంటే, వారి సంస్థలో జగద్గురువు పదవిలో అన్నమాట !

క్రియాయోగాను అమెరికాకు చేర్చి యోగానంద మంచిపనే చేశాడు. క్రియాయోగ అనేది తెల్లవాళ్ళకు తెలిసింది. ప్రపంచవ్యాప్తం అయింది. కానీ చివరకేమైంది? సంస్థ అనేది అమెరికా వాళ్ళ చేతులలోకి వెళ్ళిపోయింది. ఒక గ్లోబల్ బిజినెస్ అయ్యి కూచుంది.

'ఇండియా సాధువుల గొప్ప ఏంటి?' అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. 'ఇండియా యోగులకు మేమెందుకు కాళ్లకు మొక్కాలి?' అని అడుగుతున్నారు. వెరసి క్రియాయోగా అనేది అమెరికన్ పేటెంట్ అయిపొయింది. ప్రస్తుతం ఇండియన్స్ అందరూ అమెరికన్ స్వాముల దగ్గర క్రియాయోగాను నేర్చుకోవలసిన గతి పట్టింది.

SRF హెడ్ సంస్థను ఇండియాలో పెట్టి, బ్రాంచీలను అమెరికాలో పెట్టి ఉండవలసింది. కానీ యోగానంద దీనికి వ్యతిరేకంగా చేశాడు. ఫలితంగా, క్రియాయోగా అమెరికా వాడి చేతిలోకి వెళ్ళిపోయింది.

1982 లో నేను క్రియాయోగాను తిరస్కరించిన పాయింట్ కూడా సరిగ్గా ఇదే. 'అమెరికన్ స్వాములు నేర్పిస్తే మనం యోగాను నేర్చుకోవలసిన ఖర్మేంటి? ప్రపంచానికి యోగశాస్త్రాన్ని ఇచ్చినది మనం. మనదగ్గరే వాళ్ళు నేర్చుకోవాలి. ఏం మనదగ్గర గురువులు లేరా? యోగశాస్త్రం మనదగ్గర లేదా?' అని నేను ప్రశ్నించాను. మా స్నేహితులతో ఇదే పాయింట్ మీద వాదించాను. నా వాదనను వాళ్ళపుడు ఒప్పుకోలేదు. కానీ 10 ఏళ్ల తర్వాత ఒప్పుకున్నారు. క్రియాయోగాలో యోగానంద చాలా మార్పులు చేశాడని, అమెరికా స్వాములు దానినే YSS కరెస్పాండెన్స్ కోర్సుగా తమకు నేర్పించారని, దానిని ఎన్నేళ్లు అభ్యాసం చేసినా ఏమీ ఫలితాలు కనిపించడం లేదని ఒక సీనియర్ క్రియాయోగి 1992 లో నాతో వాపోయాడు. 'నువ్వు 1982 లో మాతో అన్నది కరెక్టే' అని పదేళ్ల తర్వాత నాతో అన్నాడు.

అమెరికన్స్ కు కాళ్ళు వంగవు. వాళ్లకు పద్మాసనం రాదు. అందుకని వాళ్లకు పద్మాసనాన్ని తీసేసి, కుర్చీలో కూచుని ప్రాణాయామం చెయ్యమని యోగానంద వెసులుబాటు ఇచ్చాడు. అదే విధంగా, ఖేచరీముద్రను తీసేశాడు. ఖేచరీముద్ర రాకుండా క్రియాయోగాలో ఉన్నతస్థాయి అభ్యాసాలు కుదరవు. ఆ ముద్ర రాకపోతే, వాటిని చెయ్యడం సాధ్యం కాదు. కానీ అమెరికన్ క్రియాయోగా గురువులకు ఖేచరీ ముద్ర రాదు. యోగానంద వాళ్ళకు నేర్పలేదు. లాహిరీ మహాశయులు నేర్పించిన 'థోకార్' అనే క్రియ, దాని వేరియేషన్స్ కూడా వీళ్ళకు తెలియవు.  కానీ వాళ్ళ అహంకారాలు, పోజులు మాత్రం ఏమీ తక్కువ ఉండవు.

2017 లో రెండవసారి నేను అమెరికా వెళ్ళినపుడు ఒక అమెరికన్ స్వామీజీ నాతో ఇలా అన్నాడు, 'ఇండియన్ స్వామీజీలకు మేమెందుకు కాళ్లకు మొక్కాలి? వాళ్ళకంటే మేమేం తక్కువ? వాళ్ళకెందుకు మేము ఊడిగం చెయ్యాలి?'

'ఎందుకంటే, యోగశాస్త్రం ఇండియాలో పుట్టింది కాబట్టి, వాళ్ళు మీకు గురువులు కాబట్టి, వాళ్లకు మీరు మొక్కాలి' అని నేను చెప్పాను. నా మాట ఆయనకు నచ్చలేదు. దీక్ష తీసుకున్న గురువుకే నమస్కారం పెట్టడానికి వాళ్లకు అహంకారం అడ్డు వస్తోంది. అలా ఉంటుంది అమెరికా తెల్లవాళ్ళ ధోరణి.

దేనినైనా ఒక పెద్ద బిజినెస్ గా మార్చడం అమెరికన్ల రక్తంలో ఉంది. అది యోగా కావచ్చు, మెడిటేషన్ కావచ్చు, తంత్రా కావచ్చు. ఒకసారి వాళ్ళ చేతులలోకి వెళ్లిపోయిందంటే ఇక పేటెంట్ అమెరికాకు వెళ్ళిపోయినట్లే. తిరిగి మన చేతులలోకి దానిని రానివ్వరు. అది వారికొక జీవనోపాధి, ఒక MNC గా దానిని మార్చేస్తారు. క్రియాయోగాను కూడా ఇదే చేశారు.

అమెరికన్స్ చేతులలో చిక్కుకోకుండా ఉన్నది మూడే మూడు సంస్థలు, ఒకటి రామకృష్ణా మిషన్, రెండు రమణమహర్షి ఆశ్రమం. మూడు జిల్లెళ్ళమూడి అమ్మగారి ఆశ్రమం. తెల్లవాళ్ళను ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతారు ఈ ముగ్గురూ, కనుక వీళ్ళదగ్గర అమెరికా ఆటలు సాగలేదు. మిగతా అందరినీ వాళ్ళు ముంచేశారు.  ఆసనాలు, క్రియాయోగా, సిద్ధయోగా, ఓషో, మహేష్ యోగి, జెన్, ఎన్నో టిబెటన్ బుద్ధిజం స్కూళ్ళు ఇలా అన్నింటినీ తెల్లవాళ్లు కబళించేశారు. బిజినెస్ గా మార్చేశారు. ఈ మూడు మాత్రం వారి చేతికి చిక్కలేదు.

రమణమహర్షిని కూడా కాపీ కొట్టి 'హృదయయోగా' అని మెక్సికో లో మొదలుపెట్టారు. ఎంతవరకు ఆ బిజినెస్ సాగుతుందో చూడాలి.  

మొత్తమ్మీద, క్రియాయోగా అనేది అమెరికన్స్ చేతిలోని గ్లోబల్ బిజినెస్ అయి కూచుంది. పేటెంట్లు, కాపీరైట్లు అన్నీ అమెరికాకు తరలిపోయాయి. యోగానంద చేసిన తప్పులలో ఇది ఇంకొకటి.

పనిలో పనిగా, క్రియాయోగ స్కూల్స్, ఆశ్రమాలు ఎన్నెన్నో శాఖోపశాఖలుగా విడిపోయాయి. ఇప్పుడు ప్రతి ఊరిలోనూ ఒక క్రియాయోగా ప్రత్యేక బ్రాంచి ఉంది. ప్రతీవారూ 'మాకు బాబాజీ కనిపించాడు. దీక్షలివ్వమని మాకు అధారిటీ ఇచ్చాడు. మాదే అసలైన క్రియాయోగా' అని చెబుతూ ఎవరి బిజినెస్ వారు  చేసుకుంటున్నారు.

కానీ, నిర్వికల్ప సమాధిస్థితి గాని, శ్వాసరహిత స్థితిగాని, గుండె ఆగిపోయినప్పటికీ యోగి బ్రతికి ఉండే స్థితిగాని ఎవరిలోనూ కనిపించడం లేదు. పుస్తకాలు చదివి కాకమ్మకబుర్లు చెప్పడమే గాని, వీటిని సాధించినవారు ఎవరూ లేరు. ఈ క్రియాయోగా స్కూళ్ళు మాత్రం 'మా గురువు గొప్ప మా ఆశ్రమం గొప్ప. అసలైన క్రీయాయోగా మా దగ్గర మాత్రమే ఉంది' అంటూ అందరూ కలసి గోలగోలగా కొట్టుకుంటున్నారు.

వెరసి క్రియాయోగా అనేది ఒక ఫార్స్ అయి కూచుంది. మరి ఇదంతా చూసి యోగానంద గారు, యుక్తేశ్వర్ గారు, లాహిరీ మహాశయులు పైనుంచి ఎలా ఫీలవుతున్నారో వాళ్ళకే ఎరుక. 

ఇక బాబాజీ సంగతందామా? ఆయనదేముంది పాపం? ఎక్కడపడితే అక్కడే ఉంటాడు. ఎవరికి పడితే వారికి కనిపిస్తూ ఉంటాడు. అందరికీ బిజినెస్ ఐటం గా మారాడు. ప్రతివాడూ బాబాజీ పేరు చెప్పి షాపు తెరుస్తున్నాడు. బిజినెస్ సాగుతోంది. గొర్రెలు గుడ్డిగా ముందుకు పోతున్నాయి.

సరిగ్గా ఇది వ్రాస్తున్నపుడే కాలింగ్ బెల్ మోగుతోంది !

బాబాజీ వచ్చి, బెల్లు కొడుతున్నట్టున్నాడు. కోప్పడతాడేమో? ఆ ! కోపం ఎందుకూ? నేనేం అబద్దాలు రాయలేదుగా? నాకెందుకు భయం? చూసొస్తా.

అప్పటిదాకా క్రియాయోగా అనబడే ఈ ఫార్స్ అంతా చదువుకుంటూ ఉండండి.

సరేనా ! జై గురుదేవ !

(అయిపోయింది)