“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

12, మే 2023, శుక్రవారం

మన ఆశ్రమానికి విజిటర్స్ ని తీసుకురావచ్చా?

ఆశ్రమ నిర్మాణం నిరాడంబరంగా, చురుకుగా ముందుకు సాగుతోంది.

మొన్నీ మధ్యన ఒక శిష్యుడు ఆశ్రమ సందర్శనానికి వచ్చాడు అదీ ఇదీ మాట్లాడి వెళుతూ, 'అప్పుడప్పుడూ తెలిసినవాళ్ళని ఇక్కడికి తీసుకురావచ్చా?' అని అడిగాడు

'అంటే ఎవరు?' అడిగాను

'అంటే, దగ్గర్లో ఉన్న క్షేత్రాలు అవీ చూడటానికి వచ్చేవాళ్ళు. వాళ్ళని ఇటు కూడా తేవచ్చా?' అన్నాడు

తను కారు ఓనర్ కం డ్రైవర్ గా పని చేస్తుంటాడు అందుకని అలా అడిగాడు 

'నువ్వెవరినీ తేవద్దు, అలా తేవడానికి ఇదేమీ  పిక్నిక్ స్పాట్ కాదు. ఇక్కడికి వచ్చే అర్హతా అదృష్టమూ ఉన్నవాళ్లు వాళ్ళే వస్తారు. మనకు మార్కెటింగ్ అవసరం లేదు' అని చెప్పాను

మా ఆశ్రమం సీరియస్ గా సాధనామార్గంలో నడిచేవాళ్ళకోసం  ఉద్దేశించబడింది గాని, కాలక్షేపం కోసం పుణ్యక్షేత్రాలు, పిక్నిక్ స్పాట్లు తిరిగేవాళ్ళ కోసం, ఫేన్సీ దీక్షలు తీసుకుని ఉత్తమాటలు చెప్పేవాళ్ళ కోసం పెట్టబడింది కాదు.

వారం క్రితం ఇంకొకాయన హిమాలయాల నుంచి ఫోన్ చేశాడు

'నేను గణపతిముని గారి సంప్రదాయానికి చెందినవాడిని ఆయన ప్రశిష్యుల దగ్గర దీక్షలు తీసుకున్నాను. పాతంజల యోగశాస్త్రాన్ని బోధిస్తుంటాను.  మీరు రాసిన ఛిన్నమస్తా సీరీస్ చదివాను. చాలా బాగున్నాయి. వేదాన్ని తంత్రాన్ని సమన్వయం చెయ్యడం అపురూపం. అది మీ రాతలలో కనిపిస్తోంది. మీకు నమస్కారాలు చెబుదామని ఫోన్ చేస్తున్నాను' అన్నాడు

'మంచిది. ప్రస్తుతం మీరెక్కడనుంచి మాట్లాడుతున్నారు' అడిగాను

'హిమాచల్ ప్రదేశ్ లో మెక్లియోడ్ గంజ్ కు ఇంకా పైన బాక్స్ నాధ్ అనే ప్రదేశం ఉంది. ప్రతి ఏడాదీ కొన్ని నెలలపాటు నేనిక్కడ ఉంటూ  సాధన చేసుకుంటూ ఉంటాను మీరు అనుమతిస్తే ఆంధ్రాకు వచ్చినపుడు మీ  ఆశ్రమంలో ఉండి కొన్నాళ్లపాటు సాధన చేసుకోవచ్చా?' అడిగాడు

'నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. ఇది సాధనాశ్రమమే, సాధకుల కోసం ఉద్దేశించబడినదే' అని చెప్పాను 

'బ్రాహ్మణులలో మార్షల్ ఆర్ట్స్ తక్కువగా  కనిపిస్తాయి. మీకు అవి కూడా వచ్చని చదివాను. వేలాది ఏళ్ల క్రితం ద్రోణాచార్యుడు మొదలైన గురువులు వాటిని నేర్పించేవారు. కానీ ప్రస్తుతం అలాంటివారు లేరు. మీ గురించి చదివి సంతోషం వేసింది. ఎన్నాళ్ళుగా అభ్యాసం చేస్తున్నారు?' అడిగాడు.

'గత నలభై ఏళ్లుగా' అన్నాను

'మీ మార్గాన్ని గురించి ఇంకా వివరంగా తెలుసుకోవచ్చా?' అడిగాడు.

'దానికేమి? నా పుస్తకాలలో ఉంది, చదవండి, అర్ధమౌతుంది లేకపోతే, ఇక్కడకు వచ్చి నాతో ముఖాముఖీ మాట్లాడి తెలుసుకోవచ్చు' అన్నాను

'తప్పకుండా త్వరలో వస్తాను' అన్నాడు

'ముందుగా ఫోన్ చేసి రండి, నేను ఎటన్నా వెళ్లి ఉంటే మీరు నిరాశపడతారు' అని చెప్పాను

నిజమైన సాధకులకు మా ఆశ్రమద్వారాలు  ఎప్పుడూ తెరిచే ఉంటాయి. కుతూహలపరులకు, కాలక్షేపరాయుళ్లకు మాత్రం తెరుచుకోవు.

మాది సాధనాశ్రమమే గాని సరదా ఆశ్రమం కాదు. అదే మాటను వాళ్ళతో చెప్పాను.