“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

17, ఏప్రిల్ 2019, బుధవారం

శ్రీరామనవమి డ్రామాలు

రేపు నవమి అనగా ఒక ఫన్నీ సంఘటన జరిగింది.

'శ్రీరామనవమి చందా' అంటూ ఒక వ్యక్తి నన్ను మా ఆఫీసులో కలిశాడు.

నేనేమీ జవాబివ్వలేదు.  మౌనంగా చూస్తున్నాను.

'మన గుడి. మన కార్యక్రమం. మీ పేరుమీద ఈ రసీదు'  అంటూ ఒక రసీదును తన దగ్గరున్న రసీదు పుస్తకంలో నుంచి చింపి నా ముందుంచాడు.

అందులోకి తొంగి చూచాను. Rs 2000/- అంటూ ముందే వ్రాయబడిన అంకె కనబడింది. 

'బాగుంది' అన్నా నవ్వుతూ.

ఇచ్చేస్తాననుకున్నాడో  ఏమో, మన ధర్మం మన సంస్కృతి అంటూ ఏదేదో వాగుతూ కాసేపు  కూచున్నాడు.

నేనూ ఆ వాగుడంతా మౌనంగా వింటున్నాను.

చివరకు లేచి ' సరే సార్ ! వెళ్ళొస్తా మరి !' అన్నాడు, ఇక డబ్బులియ్యి అన్నట్లుగా చూస్తూ.

నేనుకూడా అలాగే నవ్వుతూ 'ఓకే' అన్నాను.

'డబ్బులు' అన్నాడు.

'ఏం డబ్బులు?' అన్నాను.

'అదే శ్రీరామనవమి చందా' అన్నాడు.

'ఈ చందాలతో ఏం చేస్తారు?' అడిగాను.

'రాములవారికి కల్యాణం చేస్తాం' అన్నాడు.

'దేవుడికి మనం కల్యాణం చెయ్యడం ఏంటి?' అన్నాను.

అతనికి అర్ధం కాలేదు.

'అలా చేస్తే మంచిది' అన్నాడు అయోమయంగా.

'ఎవరికి మంచిది? దేవుడికా మనకా?' అడిగాను.

'మనకే' అన్నాడు.

'దేవుడికి కల్యాణం జరిగితే మనకు మంచెలా జరుగుతుంది?' అడిగాను.

'ఇది మన సంస్కృతి సార్, ఇస్తే వెళతా, ఇంకా చాలాచోట్లకు వెళ్ళాలి' అన్నాడు అదేదో దేశాన్ని ఉద్ధరిస్తున్నట్లు.

ఇలాంటి రెలిజియస్ బ్లాక్ మెయిల్ కి మనమెందుకు పడతాం?

'ఆ అంకె నేను వెయ్యలేదు. వేసినవాళ్ళు ఇచ్చుకోవాలి. నువ్వేస్తే నువ్వే కట్టుకో' అన్నాను నవ్వుతూ.

'భలే జోకులూ మీరూనూ. ఇవ్వండి సార్. మీకిదొక పెద్ద ఎమౌంట్ కాదు' అన్నాడు నన్ను  ఉబ్బెస్తూ.

'ఇవ్వను సార్. ఆయనకెప్పుడో పెళ్లైంది ఇప్పుడు కొత్తగా మనం చెయ్యనక్కరలేదు.ఇలాంటివాటిమీద నాకు నమ్మకం లేదు' అన్నాను నేనూ నవ్వుతూ.

ఓడిపోతున్నానని అతనికి అర్ధమైపోయింది. అందుకని 'పోన్లెండి సార్. రసీదు ఉంచండి. మీదగ్గర ఇప్పుడు లేకపోతే మళ్ళీ వచ్చి తీసుకుంటా' అన్నాడు తెలివిగా.

'నువ్వెప్పుడొచ్చినా ఆ కాయితం నా  టేబుల్ మీదే ఉంటుంది. తీసికెళ్ళచ్చు.'   అన్నా అదే నవ్వును కొనసాగిస్తూ.

ఏమనుకున్నాడో ఏమో ఆ రసీదును తీసుకుని విసురుగా నా రూమ్ లోనుంచి బయటకు వెళ్ళిపోయాడు.

అంతకు రెండురోజుల ముందే జరిగిన ఎలక్షన్లలో ఒక పార్టీ తరఫున ఇతను కూడా ఇంటింటికీ   తిరిగి డబ్బులు పంచాడు. ఇప్పుడు దేవుడి పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నాడు. భలే వ్యాపారం ! అనిపించింది. కొంతమంది ఇంతే, 365 రోజులూ పండగలే  అయిన మన కాలెండర్లో, రెలిజియస్  సెంటిమెంట్ ను వాడుకుని జనందగ్గర డబ్బులు కాజేయ్యడానికి అవకాశాలు వరుసగా వస్తూనే ఉంటాయి.

ఆజన్మబ్రహ్మచారులైన వినాయకుడు, ఆంజనేయులకే భార్యలను అంటగట్టి కళ్యాణాలు  చేసి  డబ్బులు వెనకేసుకునే ఘనసంస్కృతి కదా  మనది ! మతపరమైన ఈ దోపిడీ ఆగినప్పుడే మన అసలైన సంస్కృతి  ఏంటో తెలుసుకునే అవకాశం కాస్త మన జనాలకు కలుగుతుంది.

శ్రీరాముడు ధర్మస్వరూపుడు. ఆయన్ను పూజించేవాళ్ళు ముందు తమతమ నిత్యజీవితాలలో ధర్మాన్ని తూచా తప్పకుండా పాటించాలి. అది గాలికొదిలేసి, ప్రతిరోజూ అధర్మపు బ్రతుకులు బ్రతుకుతూ, శ్రీరామనవమికి మాత్రం ముత్యాల తలంబ్రాలతో ఆయనకు పెళ్లి చేస్తే ఏమీ ఒరగదు. మనం ఎవరిని పూజిస్తున్నామో ఆయన లక్షణాలు మన నిత్యజీవితంలో ప్రతిబింబించాలి. అది లేనంతవరకూ, రానంతవరకూ ఈ పూజలన్నీ ఉత్త టైంపాస్ పనులే. రాముడిలా వేషంవేస్తే సరిపోదు. రాముడిలా బ్రతకాలి. రాముడికి మనం పెళ్లిచేసి, నానాచెత్త కబుర్లూ చెప్పుకుంటూ ప్రసాదాలు తిని మురిసిపోతే  సరిపోదు. 

దేవుడికి కళ్యాణాలు చేసి మురిసిపోయే అజ్ఞానులు ముందు ఆత్మకల్యాణం అనే పదానికి అర్ధం తెలుసుకుంటే బాగుంటుంది కదూ !