12, నవంబర్ 2011, శనివారం

నిత్యజీవితంలో ప్రశ్నశాస్త్రం -- " పెన్ డ్రైవ్ ఎక్కడుంది?"

అప్పుడప్పుడూ ఏదోఒక వస్తువును మర్చిపోవడం, ఎక్కడ పెట్టామో అని దానికోసం వెదకడం మనకందరికీ అలవాటే. కొన్నిసార్లు ఆ హడావిడిలో ఆ వస్తువు దొరకవచ్చు, లేదా దొరక్కపోవచ్చు. ఇలా జరగటం మనకందరికీ అనుభవమే. ఎంత వెదికినా దొరకని ఇటువంటి సందర్భాలలోనే మనకు ప్రశ్నశాస్త్రం బాగా  ఉపయోగపడుతుంది. కాని సరైన భావంతో ప్రకృతిని సమీపించకపోతే సరైన సమాధానం రాదు.

ప్రశ్నశాస్త్రం అనేది "సామరస్యం" అనే సూత్రం మీద ఆధారపడి పనిచేస్తుంది. ప్రకృతిలో సామరస్యస్థితి ఉన్నది. సమస్తమూ ప్రకృతిలోనే ఉన్నది. మనకు మరుపు ఉంది గాని ప్రకృతికి మరుపు లేదు. కనుక మనం నిజంగా అవసరంలో ఉన్నపుడు ప్రకృతిమాతను వినయంగా అడిగితే తను జవాబిస్తుంది. ఆ జవాబు ఎప్పుడూ విఫలం కాదు. అయితే ఆమెను అడిగేతీరు మనకు తెలియాలి. అడిగిన ప్రతిసారీ వస్తున్న ఆ జవాబులు నిజం అవుతున్నపుడు, ఈ అద్భుతమైన సైన్స్ ను మనం  తప్పకనమ్మాల్సి వస్తుంది.

ఈరోజు మధ్యాన్నం పెన్ డ్రైవ్ కోసం ఆఫీస్ లో వెతుకుతున్నాను. పని వత్తిడిలో పెన్ డ్రైవ్ ఎక్కడపెట్టానో గుర్తు రావడంలేదు. ఒక వారంరోజులనుంచి పెన్ డ్రైవ్ ను వాడటం లేదు. కనుక ఎక్కడుందో మర్చిపోయాను. అక్కడా ఇక్కడా వెదికాను గాని దొరకలేదు.

సరే అని ప్రశ్నచక్రం గుణించి చూశాను. అప్పుడు సమయం 1.05 అయింది. శీర్షోదయమైన కుంభలగ్నం ఉదయిస్తున్నది. లగ్నాధిపతి అయిన శని అష్టమంలో మిత్రస్థానంలో ఉన్నాడు. కన్యకూడా శీర్షోదయ రాశే. కనుక వస్తువు దొరుకుతుంది. కాని, కుజుడు సప్తమంలో ఉండి లగ్నాన్ని దగ్గరగా వీక్షిస్తున్నాడు. తాజకహోరాశాస్త్రం ప్రకారం కుజుడు సప్తమంలో ఉంటే పోయిన వస్తువు దొరకడం కష్టం. కాని ఇక్కడ కుజునికి లగ్నంతో గాని, షష్ఠస్థానంతోగాని సంబంధం లేదు గనుక ఈ పాయింట్ ను పెద్దగా లెక్కించలేదు. దశమ కేంద్రంలో శుక్రుడూ బుధుడూ డిగ్రీ కంజంక్షన్లో ఉండి చతుర్ధంలోని చంద్రుని చూస్తున్నారు. కనుక వస్తువు అతి త్వరలో దొరకవచ్చు.

చంద్రుని గమనించాను. చంద్రుడు చతుర్దంలో ఉచ్ఛస్తితిలో బలంగా ఉన్నాడు. అయితే కేతువుతో కలిసి ఉండటం వల్ల, కొంత గందరగోళమూ మతిమరుపూ వస్తుంది. అయినప్పటికీ చంద్రుడు స్వనక్షత్రంలో ఉండటం వల్ల బలంగానే ఉన్నాడు. ప్రస్తుత కుండలిలో చంద్రుడే  అందరికంటే బలవద్గ్రహం. కనుక పోయిన వస్తువు చతుర్ధ సూచకమైన ఇంట్లోనే ఉన్నది. చంద్రునికి షష్ఠ ఆధిపత్యం పట్టింది. షష్ఠఅధిపతి చతుర్దంలో ఉండటం అంటే దొంగవచ్చి ఇంట్లోకూచోడం అన్నమాట. ఒకవేళ వస్తువు పోయిందనుకున్నప్పటికీ, దొంగ ఈసమయంలో  ఇంట్లోకూచుని ఉండటానికి వీలు లేదు. కనుక వస్తువు పోలేదు. మర్చిపోబడింది. ఇంటిలోనే ఉండి ఉంటుంది.

అయితే మరి పెన్ డ్రైవ్ ఇంట్లో ఎక్కడుంది? దీనికోసం లగ్నడిగ్రీలను పరిశీలిద్దాం. ఇవి ప్రధమద్రేక్కాణంలో పడ్డాయి. కనుక ఇంట్లోని ముందు గదిలో వస్తువు ఉండాలి. ఇలా ఆలోచించిన మీదట, లంచ్ బ్రేక్ లో ఇంటికెళ్ళినపుడు, ముందు గదిలోని పుస్తకాల అల్మారాలో వెదికాను. పెన్ డ్రైవ్ అక్కడే చక్కగా కూచుని కనిపించింది. బుధ శుక్రులు సూచించినట్లుగా అతిత్వరలోనే, అంటే అరగంట లోపే, పోయిందనుకున్న వస్తువు దొరికింది.

ఈ విధంగా, ఉపయోగించుకోగలిగితే, ప్రశ్నశాస్త్రం నిత్యజీవితంలో అనేకసమయాలలో మనకు అక్కరకు వస్తుంది.
read more " నిత్యజీవితంలో ప్రశ్నశాస్త్రం -- " పెన్ డ్రైవ్ ఎక్కడుంది?" "

8, నవంబర్ 2011, మంగళవారం

ఆధ్యాత్మికత ఆత్మహత్యలకు కారణమౌతుందా?

వరంగల్ NIT విద్యార్ధి ఒకతను హాస్టల్ పైనుంచి దూకి మొన్న ఆత్మహత్య చేసుకున్నాడంటున్నారు. అది హత్యో, ఆత్మహత్యో, ప్రమాదమో ఇంకా నిర్ధారణ కాలేదు. ఈ విషయం TV లలో చర్చకు వచ్చిందిట. నేను చూడలేదు. ఆ లింక్ ను నా బ్లాగ్ రీడర్ ఒకాయన నాకు పంపించాడు. ఆధ్యాత్మిక పుస్తకాలు ఎక్కువగా చదవడంవల్ల అతను డిప్రెషన్లోకి వెళ్ళాడని అందులో కొందరు వ్యక్తులు వాదించారు. మరణం తర్వాత ఏమౌతుందో తెలుసుకోవడానికే ఆ అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడని కూడా కొందరు అజ్ఞానులు వాదించినట్లు కనిపించింది. పునర్జన్మ ఉందా లేదా అనే విషయం తెలుసుకోవడానికి కూడా ఆ అబ్బాయి ఆత్మహత్య ప్రయత్నం చేసి ఉండొచ్చని కొన్ని TV చానల్స్ లో చర్చలు జరిగినట్లు ఒక కధనం. వెరసి ఆధ్యాత్మికత అనేది యువతను పెడదారి పట్టిస్తుందా అని కొందరికి అనుమానాలు వచ్చాయిట. అలాటి అనుమానాలు మన పుణ్యభూమిలో ప్రజలకు వచ్చాయంటే నేను నమ్మను. మన TV ప్రబుద్ధులే రేటింగ్ కోసం అలాటి ప్రచారాలు చేస్తున్నారంటే నమ్ముతాను. మన దేశంలోని ప్రజలు లౌకికంగా ఎంత భ్రష్టుపట్టినా వారి మౌలికమైన ఆత్మ ఇంకా చావలేదు. అది చావలేదు కాబట్టే మన దేశం ఇంకా బతికి బట్టకడుతున్నది.

ఆధ్యాత్మికత అనేది ఎన్నటికీ నిరాశావాదాన్ని ప్రోత్సహించదు. ఆత్మహత్యను అసలే అంగీకరించదు. ఆధ్యాత్మికపుస్తకాలు చదివినంత మాత్రాన ఎవరూ డిప్రెషన్ లోకి వెళ్ళరు. ఒకవేళ డిప్రెషన్లో ఉంటే దాన్నుంచి బయటికి వస్తారు. వివేకానందస్వామి యొక్క ఉత్తేజపూరితములైన ఉపన్యాసాలు చదివి, డిప్రెషన్ నుంచి తేరుకుని, ఆశావహదృక్పధంతో జీవితం లో ముందడుగు వేసి నిజాయితీగా విజయాలు సాధించినవారు  చాలామంది నాకు తెలుసు. 

"ఆత్మహత్య మహాపాపం" అని మన సర్వశాస్త్రాలూ చెబుతున్నాయి. కారణం ఏమంటే, జీవితం అనేది భగవంతుని బహుమతి. అది మన అర్హత వల్ల మనం సాధించుకున్న ప్రైజు కాదు. మనలో అర్హత లేకున్నా భగవంతుడు మనకిచ్చిన గిఫ్ట్. కనుక దాన్ని అంతం చేసుకునే హక్కు మనకు లేదు. ఏదైనా బ్రతికిసాధించాలి గాని చచ్చిసాధించేది ఏమీలేదు. "బ్రతికియుండిన సుఖములు బడయవచ్చు" మొదలైన సూక్తులు మన ఆధ్యాత్మిక సాహిత్యంలో కోకొల్లలుగా ఉన్నాయి. 

వేదములు కూడా ఆత్మహత్యను ఖండించాయి. " అసూర్యా నామతేలోకా అంధేన తమసావృతాః తాంస్తే ప్రేత్యాభిగచ్చంతి ఏకే చాత్మహనే జనాః" అంటుంది యజుర్వేదాన్తర్గతమైన ఈశావాశ్యోపనిషత్తు. ఆత్మహత్య చేసుకునేవారు సూర్యునివెలుగు ఉండని చీకటిలోకాలలో ప్రేతాత్మలుగా అఘోరిస్తూ  ఉండవలసివస్తుందని ఈ శ్లోకం యొక్క అర్ధం. ఆత్మహత్య చేసుకునే ముందు ఆమనిషి యొక్క మానసికస్తితికూడా చాలా చీకటిమయంగా ఉంటుంది. నిరాశా నిస్పృహలు ఆవరించి అతనికి ఏరకమైన వెలుగూ కనపడదు. కనుక అతని మరణానంతరస్తితి కూడా చాలా దారుణంగా ఉంటుంది. ఏ బాధలు తప్పించుకోడానికి అతను ఆత్మహత్య చేసుకుంటాడో ఆ బాధలు తప్పకపోగా ప్రేతాత్మగా ఇంకా దారుణమైన బాధలు పడాల్సివస్తుంది. కనుక మన ఆర్షధర్మం అనేది ఆత్మహత్యను ఎన్నటికీ సమర్ధించదు.

కర్మసిద్ధాంతం కూడా ఆత్మహత్యను సమర్ధించదు. మనం చేసిన పూర్వకర్మవల్ల  ప్రస్తుతం బాధలు పడుతున్నాం. కనుక ఇప్పుడు సరియైన మంచికర్మ చేసుకుని పూర్వం చేసిన పాపాలను కడుక్కోమని కర్మసిద్ధాంతం చెబుతుంది. కర్మసిద్ధాంతం అనేది ఆశావాదాన్ని మనిషికి నేర్పిస్తుంది. మనిషి ఎంత అణగారిపోయినా, అది అంతం కాదనీ, ఇంకా ఆశ ఉందనీ చెబుతుంది. కర్మతో కర్మను జయించమని బోధిస్తుంది. ఎన్నటికీ ఆశను విడవద్దని, నిరాశకు లోను కావద్దని ఉద్బోధిస్తుంది.

అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ -- అసత్యంనుంచి సత్యానికి నన్నునడిపించు, చీకటినుంచి వెలుగులోకి నన్ను నడిపించు, మృత్యువునుంచి అమృతత్వంలోకి నన్ను నడిపించు -- అని వేదం యొక్క ప్రార్ధన సాగుతుంది. అలాటి వేదాలను ప్రామాణికాలుగా భావించే మన ఆధ్యాత్మికసంస్కృతి ఎవరినీ ఆత్మహత్యలు చేసుకోమని ప్రేరేపించదు, సమర్ధించదు. 

ఆధ్యాత్మికపరమైన ఆలోచనలవల్ల యువత ఎన్నటికీ  పాడుకాదు. దురలవాట్లవల్లా, డ్రగ్స్ వల్లా, సినిమాలవల్లా, పాశ్చాత్యసంస్కృతిలోని చెడును అనుకరించటం వల్లా, చెడు సావాసాలవల్లా యువత పాడవుతుందిగాని, మన ఆధ్యాత్మికతను తెలుసుకోవడం వల్లా, దానిని ఆచరించడంవల్లా ఎన్నటికీ పాడవదు. 

మరణం తర్వాత ఏమౌతుందో తెలుసుకోవాలన్నా, పునర్జన్మ ఉందాలేదా అనేది తెలుసుకోవాలన్నా, చనిపోవడమూ ఆత్మహత్య చేసుకోవడమూ దానికి మార్గాలు కావు. అలా చేసినందువల్ల వారాశిస్తున్న విషయాలు ఏమీ తెలుసుకోలేరు. నిజంగా వాటిని తెలుసుకోవాలంటే దానికి మార్గాలున్నాయి. ఒక సద్గురువు పర్యవేక్షణలో ధ్యానాన్నీ, యోగాన్నీ సక్రమంగా అభ్యసించడమే దానికి మార్గం. ధ్యానమార్గంలో పురోగమించడం వల్ల మరణానంతర జీవితం గురించీ పునర్జన్మల గురించీ ప్రత్యక్షానుభూతి ద్వారా తమంతట తామే తెలుసుకోవచ్చు. ఆత్మ అనేది ఉన్నదా లేదా తన స్వంత అనుభూతిద్వారా తానే తెలుసుకోవచ్చు. మన మహర్షులూ, యోగులూ, సిద్ధులూ సమస్త జ్ఞానాన్నీ అలా తెలుసుకున్నవారే.

మన ఆధ్యాత్మికతను లోతుగా తెలుసుకోవడమూ, దానిని ఆచరించడమూ మనిషి ఔన్నత్యానికి దారి తీస్తాయి. ఉన్నతమైన భావాలతో, ఉత్తమ పౌరులుగా జీవించడానికి బాటలు వేస్తాయి. ఇంకా ఎదగగలిగితే, ఋషిత్వాన్నిపొంది మానవజీవితాన్ని ధన్యం చేసుకోవడానికి సాయపడతాయి. అంతేగాని నిరాశావాదాన్ని మన మతంగాని మన సంస్కృతి గాని, మన ఆధ్యాత్మికతగాని ఎన్నటికీ ప్రోత్సహించదు.

నిజానికి విద్యార్ధులు ప్రతిఒక్కరూ మన ఆధ్యాత్మికత గురించి లోతుగా తెలుసుకోవాలి. మన ప్రాచీనగ్రంధాలను అధ్యయనం చెయ్యాలి. ఊరకే తెలుసుకోవడం కాదు, తెలుసుకున్న దానిని ఆచరణలోకి తీసుకురావాలి. అప్పుడే నేటితరం గురౌతున్న రకరకాల విషప్రభావాలనుంచి, ముఖ్యంగా మీడియా విషప్రభావం నుంచి  వారు రక్షింపబడతారు. అత్యుత్తమపౌరులుగా ఎదగగలుగుతారు.

మన ఆధ్యాత్మికత మీద ఈరకమైన దాడి వెనుక పరాయి మతాలపాత్ర ఉందేమో అన్నది కూడా నిజం కావచ్చు.
read more " ఆధ్యాత్మికత ఆత్మహత్యలకు కారణమౌతుందా? "

7, నవంబర్ 2011, సోమవారం

తిరుపతి ప్రయాణం లో ఆధ్యాత్మికానుభూతులు

భక్తిలో రెండు పద్ధతులున్నాయి. ఒకటి -- "నేను నీ భక్తుణ్ణి" అని మనం చెప్పుకోవడం. రెండు -- "నీవు నా భక్తుడవు" అని భగవంతుడే చెప్పడం. ఈ రెండింటిలో రెండవది మొదటిదానికంటే శ్రేష్టమైనది. 

మనంతట మనం అనుకోని గుళ్ళూ గోపురాలూ తిరగడం ఒక రకమైతే, అనుకోకుండా ఆయా పర్వదినాలలో ఆయా దేవాలయాలకు ఏదో కారణంచేత వెళ్ళవలసిరావడం, అక్కడ అద్భుతమైన ఆహ్వానాలు మనకోసం ఎదురుచూస్తూ ఉండటం రెండవ రకం. 

మొన్నీ మధ్యన కాకాని శివాలయం, తిరుమలా ఈ రకంగానే వెళ్లి రావడం జరిగింది. కాకాని శివాలయం పురాతనమైనదే అయినప్పటికీ కొన్నేళ్ళ క్రితం రాహుకేతు ప్రతిష్టలు జరిగిన తర్వాత మాత్రమే బాగా అభివృద్ధి చెందింది. నేనెప్పుడో పది పదిహేనేళ్ళ క్రితం అనుకుంటా అక్కడికి వెళ్లాను. మళ్ళీ మొన్న వెళ్లి చూస్తే ఆలయం చాలా అభివృద్ధి చెందినట్లు కనిపించింది.

అక్కడికి వెళ్ళడం కూడా అనుకోకుండా హటాత్తుగా జరిగింది. ఒక ప్రముఖునితో కలసి అప్పటికప్పుడు అనుకోని పరమేశ్వరదర్శనానికి వెళ్ళడమూ, ఆలయమర్యాదలతో పూర్ణకుంభస్వాగతమూ, పరమేశ్వరునికి శాస్త్రోక్తంగా అభిషేకం చేయించడమూ చాలా చక్కగా జరిగాయి. 


అదేరోజు రాత్రికి బయల్దేరి తిరుమలకు వెళ్ళడం కూడా ఇలాగే జరిగింది. ఒకపక్క తుపాను హెచ్చరికలు వినిపిస్తున్నాయి, నెల్లూరులో వారంనుంచి కుంభవృష్టి కురిసి నగరం జలమయమైందని వార్తలు వస్తున్నాయి. తిరుమలలోని మిత్రులతో మాట్లాడితే కొండమీద కూడా బాగా వర్షం పడుతున్నదని, బాగా చలిగా ఉందనీ చెప్పారు. అయినా సరే బయలుదేరి వెళ్ళడం జరిగింది.

తిరుపతిలో దిగి చూస్తే, పొగమంచు మేఘాల మధ్యనుంచి కనీ కనిపించకుండా తిరుమల కొండలు దర్శనం ఇచ్చాయి. వానలోనే ఉదయం ఎనిమిదిన్నరకు అలిపిరిమార్గం గుండా నడక మొదలుపెట్టి, నిదానంగా నడుస్తూ మధ్యాన్నం ఒంటిగంటకు గెస్ట్ హౌస్ కు చేరాము. దారిలో వాన పడుతున్నప్పటికీ దారిపొడుగునా షెల్టర్ ఉండటంతో ఇబ్బంది లేదు. అక్కడక్కడా షెల్టర్ లేని చోట్ల తెచ్చుకున్న గొడుగులు ఉపయోగ పడ్డాయి. 

నాతోపాటు మా అబ్బాయి మాధవ్ ఉన్నాడు. తనతో దారిలో అనేక విషయాలు మాట్లాడాను. మానవజీవితగమ్యం ఏమిటి? మనిషి పుట్టుకకు ఒక అర్ధం అంటూ ఉందా? ఉంటే దాన్ని ఎలా తెలుసుకోవాలి? తెలుసుకోవాలంటే ఏం చెయ్యాలి? అర్ధం ఇదీ అని తెలుసుకున్న తర్వాత ఏం చెయ్యాలి? పశు పక్ష్యాదుల లాగా మనమూ అదే జీవితాన్ని గడిపితే మనిషి జన్మకు ప్రయోజనం ఏమిటి? ఒక వంశంలో ఋషులను ఉద్భవింపచేసే సూత్రాలు, జీవన విధానాలు ఏమిటి? వాటిని ఎలా పాటించాలి? మన జ్ఞానసంపదను  మనవంశంలోని తర్వాతితరాలకు ఎలా అందించాలి? అన్న మౌలికవిషయాలతో మొదలుపెట్టి  -- యోగ, వేదాంత రహస్యాలు, జ్యోతిష శాస్త్రంలో రేమేడీలు ఎలా నిర్ణయించాలి? వాటిలో మళ్ళీ తేడాలు ఎలా ఉంటాయి? తరతరాలుగా వచ్చే జెనెటిక్ లక్షణాలు జాతకంలో ఎలా ప్రతిఫలిస్తాయి? ఏ ఏ దోషాలు ఎలా తరతరాలకు వెంటాడతాయి? వాటి జాడలు జాతక చక్రంలో ఎలా కనిపిస్తాయి? యోగాభ్యాసం ఎన్నిరకాలు? కుండలినీయోగం యొక్క మూలసూత్రాలేమిటి? వాటికి ఆధారాలేమిటి? తిరుమల ఏడుకొండలకూ సప్తచక్రాలకూ ఉన్న సామ్యాలు, వాటివెనుక రహస్యాలు ఏమిటి? వెంకటేశ్వరస్వామి అవతారం యొక్క చారిత్రిక నేపధ్యాలు ఎక్కడున్నాయి?  స్వామి విగ్రహం అమ్మవారి విగ్రహం అనేమాట నిజమేనా? -- ఇలా అనేకవిషయాలు చర్చకు వచ్చాయి.

దారిలో మనం ఎక్కేమెట్లకు ఎడమపక్కగా గోడలపైన వరుసగా చెక్కి విష్ణుసహస్రనామావళి కనిపించింది. వాటిలో ఏ ఏ శ్లోకాలు ఏ ఏ జాతకదోషాలను పోగొడతాయి? వాటియొక్క అంతరార్ధాలు ఏమిటి? జాతకప్రకారం రేమేడీలుగా ఏఏ శ్లోకాలను/మంత్రాలను ఎలా ఎంచుకోవాలి?అన్న విషయాలు మాధవ్ కు వివరించాను. 

ముఖ్యంగా వరాహావతార రహస్యమూ, శ్రీకృష్ణునితో సమంగా ఆ అవతారాన్ని పూర్ణావతారం  అని ఎందుకంటారు? "మహావరాహో గోవిందస్సుశేణ కనకాంగదీ" అన్న నామానికి అర్ధం గురించి మాట్లాడుకున్నాం.
     
దారిలో శ్రీమద్రామానుజుల విగ్రహమూ, ఆ విగ్రహం చుట్టూ కట్టిన చిన్న దేవాలయమూ కనిపించాయి. రామానుజులు తిరుమలకొండ ఎక్కేటప్పుడు ఆ స్తలంలో కొంతసేపు విశ్రాంతి తీసుకున్నారట. కొన్నేళ్ళక్రితం వరకూ నాకు రామానుజులంటే  త్రిమతాచార్యులలో ఒకరిగా గౌరవం ఉండేది కాని అంత గొప్పగౌరవం ఉండేది కాదు. కాని ఈ మధ్యకాలంలో నా అభిప్రాయాలు మారుతూ వచ్చాయి. విశిష్టాద్వైతం ఎంత గొప్ప సిద్ధాంతమో నాకు అర్ధమౌతూ వచ్చింది. కనుక ఆయంటే నాకున్న గౌరవం ఈమధ్యలో చాలారెట్లు పెరిగింది. ఆ ఆలయం దగ్గర కూర్చుని విశిష్టాద్వైతసిద్దాంతపు భావపరంపరలో మునిగిన నాకు భావోద్రేకం కలిగింది. మావాడు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి గొంతు సహకరించలేదు. కాసేపు ఆగమని సైగ చేసాను. నా పరిస్తితి గమనించి తనూ మాట్లాడకుండా ఉన్నాడు. కాస్త నెమ్మదించాక, విశిష్టాద్వైత సిద్ధాంతం ఎంత గొప్పదో తనకు వివరించాను. అభినవగుప్తుని  కాశ్మీరశైవానికీ, రామానుజుని విశిష్టాద్వైతానికీ ఉన్న సామ్యాలు - భేదాలు గురించి కొద్దిసేపు చర్చ నడిచింది. చివరగా ద్వైత, అద్వైత, విశిష్టాద్వైత సిద్ధాంతాలను శ్రీరామకృష్ణులు, వివేకానందులు ఎలా సమన్వయం చేసారో వివరించాను. 

దారిలో కులశేఖర ఆల్వార్ విగ్రహం దగ్గర ఆయన మహారాజు అయ్యి ఉండీ ఎంతటి మహాభక్తుడో, ఎంతటి మహాకవో వివరించి ఆయన సంస్కృతంలో వ్రాసిన "ముకుందమాల" గురించి వివరించాను. ఇలా మాట్లాడుకుంటూ ప్రయాస తెలీకుండా నడుస్తూ కొండమీదకు చేరాము.

మంగళ బుధవారాలలో మధ్యాన్నం రెండు గంటల తర్వాత 300 రూపాయల దర్శనం ఉండదు అని ముందే తెలిసింది. కనుక మర్నాడు దర్శనానికి వెళదామని నిర్ణయించుకున్నాము. గుండు చేయించుకోడమూ, స్నానమూ, భోజనమూ కానిచ్చి సాయంత్రంపూట  రెస్ట్ తీసుకోకుండా పాపనాశనమూ, ఆకాశగంగా, జాబాలి తీర్ధమూ దర్శించాము. మబ్బులు పట్టి రోజంతా తెరలు తెరలుగా వర్షం పడుతూనే ఉంది. 


జాబాలితీర్ధం చేరేసరికి సాయంత్రం అయిదున్నర అయింది. అప్పటికే బాగా మబ్బులవల్ల చీకటి పడినట్లుగా అయింది. జాబాలితీర్ధం అనిఉన్న ఎంట్రన్స్ దగ్గరనుంచి అడివిమార్గంలో  లోపలికి ఒకటిన్నర  కి.మీ. దూరం ఉండవచ్చు. దారంతా  నిర్మానుష్యంగా ఉంది. ముసురుకుంటున్న మసకచీకటిలో, తుంపరగా పడుతున్న వానలో నిదానంగా నడుస్తూ, ఆ అడివిదారిలో పోతుంటే ప్రపంచంలో మనంతప్ప ఇంకెవరూ లేనట్లు, విశాల ప్రకృతిమధ్యంలో మనం ఒక్కరమే ఉన్నట్లు ఒక వింత అనుభూతి కలుగుతుంది. కాలం స్తంభించిన అనుభూతి కలుగుతుంది.

దారంతా మా అమ్మాయి ఏదేదో మాట్లాడుతూనే ఉంది. మాటలు ఆపమని తనకు సైగ చేసి, మౌనంగా అడివిచెట్ల ఆకులమీద పడుతున్న వానశబ్దం వినమని మెల్లిగా చెప్పాను. అంతే. నిశ్శబ్దంగా ఆ చినుకుల శబ్దంవింటూ నడక సాగించాము.  తరువాత, జెన్ ధ్యానవిధానాలలో ఇదీ ఒక విధమైన ధ్యానం అని, అది ఎలా చేస్తారో, దాని ఫలితం ఏమిటో వివరించాను. దట్టమైన అడివిలోకి వెళ్ళినతర్వాత లోపలగా ఒక చదునైన దిగువప్రదేశంలో పెద్దపెద్ద చెట్ల మధ్యన, ఒక కొలను పక్కగా హనుమాన్ ఆలయం కనిపించింది. అక్కడ వాతావరణం ఎంతో రమణీయంగా ఉంది. చీకటీ, ఎడతెరిపిలేకుండా పడుతున్న వానా, దట్టమైన అడివిలోపల జనసంచారానికి బాగా దూరంగా ఉన్న ప్రదేశమూ కావడంతో  మనసు అప్రయత్నంగా ప్రశాంతతను సంతరించుకుంది.  ఒకప్పుడు అక్కడ ఎలుగుబంట్లు బాగా సంచరించేవిట. పిల్ల ఎలుగులు ఆడుకుంటూ అటూ ఇటూ తిరుగుతుంటే, పెద్దవి మాత్రం అప్పుడప్పుడూ ఒంటరిగా వెళుతున్న యాత్రికులను ఎటాక్ చేసేవిట. ఆ తర్వాత అటవీశాఖవారు వాటిని బంధించి ఎక్కడికో తరలించారని చెప్పారు. ప్రస్తుతం మామూలు కోతులు తప్ప ఎలుగుబంట్లు ఎక్కడా కనిపించలేదు.  

అక్కడ ఒక అరగంట సేపు ఉన్నాము. ఈ ఆలయం హథీరాంబాబాజీ ట్రస్ట్ అధీనంలో ఉంది. పూజారి, ఇంకొక స్వామి అక్కడే పక్కగా ఉన్న ఒక పెంకుటింటిలో ఉంటారు. వారికి బయటి ప్రపంచంతో సంబంధాలు దాదాపుగా లేనట్టే కనిపించాయి. అడవిలో బాగా లోపలిప్రాంతం కావడంతో అక్కడికి సెల్ సిగ్నల్స్ కూడా రావు. వాళ్ళ లోకంలో వాళ్లున్నట్టుగా తోచారు. పక్కగా కొన్ని షాపులు మాత్రం ఉన్నాయి.

ఆ ప్రశాంతతను భగ్నం చేస్తూ నార్త్ ఇండియా నుంచి వచ్చిన ఒకసాధువు ఒకటే అరవటం మొదలుపెట్టాడు. "ఆంజనేయా, మై ఆగయా" అని ఒకటే అరుస్తున్నాడు. ఆ సాధువును చూస్తే నాకు మంచి అభిప్రాయం కలగలేదు. చాలా నేలబారు రకం అనిపించింది. అతను అలా అరవాల్సిన అవసరం ఏమిటో అర్ధం కాలేదు. మా అమ్మాయికి ఒక డౌట్ వచ్చింది. " అదేంటి నాన్నా. "ఆంజనేయా" అని అరుస్తూ తన క్లాస్ మేట్ ని పిలిచినట్లు అలా పిలుస్తున్నాడు." అని అంది. "నిజమేనమ్మా. ఒకవేళ భక్తునికి భగవంతునితో చనువు ఉంటే ఉండవచ్చు. కాని ఇతరులముందు దానిని ప్రదర్శనకు పెట్టాల్సిన అవసరం లేదు. మౌనంగా పిలిస్తే భగవంతుడు ఇంకా త్వరగా పలుకుతాడు. ఇలాటి రకాలు చాలామంది ఉంటారు. ఇదంతా మామూలే, మనం పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు." అని చెప్పాను.

జాబాలిమహర్షి ఆ స్థలంలో తపస్సు చేసినప్పుడు ఆయనకు ఆంజనేయస్వామి దర్శనం ఇచ్చి అనుగ్రహించాడుట. వేదాలలో ఉన్న సత్యకామజాబాలీ ఈయనా ఒక్కరేనో కాదో మనకు తెలియదు. సత్యకామ జాబాలి పేరు మీద వచ్చిన నగరమే మధ్యప్రదేశ్ లోని "జబల్ పూర్". పాతకాలంలో దానిపేరు "జాబాలిపురం" అని ఉండేది. 

తిరుమలకొండల్లో చాలాచోట్ల జనసంచారం ఉండని  లోపలి ప్రదేశాలలో చాలామంది మునులు సిద్దులూ ఇప్పటికీ తపస్సు చేస్తూ ఉన్నారన్నది నిజమే. ఏభై ఏళ్ల క్రితం స్వామి అసంగానంద (మళయాళస్వామి) అనే మహర్షి గోగర్భం డ్యాం ప్రాంతంలోని కీకారణ్యంలో దాదాపు ఎనిమిదేళ్ళు తపస్సు చేసారు. ఆరుబయట అడివిలో, ధ్యానంలో మునిగి ఒక రాతిమీద ఆయన కూర్చుని ఉంటే, పులులూ సింహాలూ ఎలుగుబంట్లూ ఆయన చుట్టూ తిరుగుతూ ఉండేవిట. అటువంటి చోట్లకు మామూలు మనుషులు పోవడం అసాధ్యం అనీ, బ్రహ్మచర్య శక్తీ, సాధనా బలమూ, నిర్భయత్వమూ లేని సామాన్యులను ఆ జంతువులు బ్రతకనివ్వవు అని ఆయనే చెప్పారు. 

ఆయన గొప్ప ఋషీ, అసలైన వేదాంతీనూ. ఆయనకు శ్రీరామకృష్ణ వివేకానందులంటే అమితమైన భక్తి ఉండేది. వారి శిష్యపరంపర కూడా మంచి అనుష్టానవేదాన్తులూ, నిజమైన మహాత్ములూనూ. నా గురువైన స్వామినందానందగారికి మళయాళస్వాములవారంటే అమితమైన గౌరవం ఉండేది.


(మిగతా భాగం వచ్చే పోస్ట్ లో)
read more " తిరుపతి ప్రయాణం లో ఆధ్యాత్మికానుభూతులు "

"ప్రజ్ఞా సురభి" కొత్త ఇంగ్లీష్ బ్లాగ్ మొదలైంది

భారతదేశ సంస్కృతినీ, మతాన్నీ, యోగ, జ్యోతిష, మంత్ర తంత్రాది విద్యలనూ, ప్రాచీన వీరవిద్యలనూ ఇష్టపడేవారు ప్రపంచ వ్యాప్తంగా ఎందఱో ఉన్నారు. వారిలో తెలుగు భాష రానివారు కోకొల్లలు. 

కాని వారి విజ్ఞానతృష్ణ మనకంటే ఎంతో అధికం. వారికున్న మతమూ, విజ్ఞానమూ వారికి అత్యన్తికమైన తృప్తిని ఇవ్వలేకపోతున్నాయి. నిజమైన మతాన్ని, ప్రాచీన సంస్కృతుల విజ్ఞానాన్నీ తెలుసుకోవాలని ఆశపడేవారు ఎందఱో ఉన్నారు. వారందరి దృష్టినీ ఆకర్షించే ఒకేఒక్క దేశం మనదేశం. ఎందుకంటే ప్రపంచానికి జ్ఞానభిక్ష పెట్టిన కీర్తి మనసొంతం.

మనదేశపు ప్రాచీన జ్ఞానసంపద అద్భుతమైనది. ఆశ్చర్యజనకమైనది. అవి వేదోపనిషత్తులైనా, పురాణేతిహాసాలలో దాగిఉన్న జ్ఞానసంపదైనా,  జ్యోతిష్యమైనా, వేదాంతమైనా , యోగమైనా, తంత్రమైనా, వీరవిద్యలైనా, ఆయుర్వేదమైనా -- ఏదైనా సరే, ఆ విజ్ఞాన సంపద అత్యద్భుతమైనది. మన సంపదలను మనం మర్చిపోయినా లోకం దానికోసం అర్రులు చాస్తున్నది. అమెరికాలో, ఆస్ట్రేలియాలో, బ్రిటన్ లో ఇంకా ఎన్నో దేశాలలో భారతీయ జ్యోతిష్యంమీద చాలా సీరియస్ రీసెర్చి చేస్తున్నవారు ఎందఱో ఉన్నారు. మన మతంగురించి మనకంటే మంచి అవగాహన ఉన్నవారు ఎందఱో ఉన్నారు. వీటిని తెలుసుకోవాలని ఆశించేవారు వీరికి ఎన్నోరెట్లు ఎక్కువగా ఉన్నారు. వారిలో ఎవరికీ తెలుగు భాష రాదు.

మన దేశంలోనే ఇతరరాష్ట్రాలకు చెందిన భరతమాత నిజమైన బిడ్డలు  ఎందఱో కూడా ఈ రంగాలలో ఎంతో పరిశ్రమ చేసినవారు, చేస్తున్నవారు, ఎంతో జ్ఞానసంపదను ఆర్జించినవారు ఉన్నారు. వారికీ తెలుగురాదు. కనుక ఇలాటివారితో నా భావాలను ఇచ్చిపుచ్చుకోవాలంటే తెలుగుభాషకున్నటువంటి  పరిమితి చాలదు.

తెలుగురాని ఇలాంటి ఎందఱో జిజ్ఞాసువులకు మన సంస్కృతిలోని మహత్తరమైన జ్ఞానసంపదను, నా వ్రాతలద్వారా, తెలియచేయ్యాలనే సదుద్దేశ్యంతో " ప్రజ్ఞా సురభి" అన్న కొత్త ఇంగ్లీష్ బ్లాగ్ మొదలు పెట్టాను. ఆ బ్లాగ్ ను ఇక్కడ చూడవచ్చు. 

అద్భుతమైన మన ప్రాచీన జ్ఞానసంపదను ప్రపంచంతో పంచుకోవాలనే మంచిఉద్దేశ్యంతో ఈప్రయత్నం మొదలైతున్నది. సర్వేశ్వరుడైన పరమాత్మ తన అనుగ్రహాన్ని ఈ చిన్నిప్రయత్నానికి అందించుగాక అని ప్రార్ధిద్దాం.
read more " "ప్రజ్ఞా సురభి" కొత్త ఇంగ్లీష్ బ్లాగ్ మొదలైంది "

6, నవంబర్ 2011, ఆదివారం

మీ సమస్య -- నా రేమేడీ

ప్రతి మనిషి జీవితంలోనూ సమస్యలుంటాయి. "కష్టాలు" అన్న పెద్ద పదం వాడకపోయినా, ఏదో ఒక మామూలు సమస్య అయినా లేని మానవుడంటూ ఎవడూ ఉండడు. అలాంటి సమస్యల పరిష్కారానికి, అవి చిన్నవైనా లేదా పెద్దవైనా,ఒక కొత్తఫీచర్ త్వరలో మొదలుపెట్టబోతున్నాను.

నా బ్లాగ్లో సభ్యులైనవారు వారిజీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలకు జ్యోతిర్విద్య ద్వారా పరిష్కారాలు నన్ను ఈ మెయిల్ ద్వారా  అడుగవచ్చు. వారి వివరాలు రహస్యంగా ఉంచబడతాయి. పరిష్కారాలు ఈ మెయిల్ ద్వారా అడిగిన వారికే డైరెక్ట్ గా తెలియచేయ్యబడతాయి. ఆయా వివరాలు ఎక్కడా బహిర్గతం చెయ్యబడవు.

అడుగుతున్నవారు తమ కరెక్ట్ జననవివరాలు ఇవ్వవలసి ఉంటుంది. ఎవరి జాతకంలోనూ సరియైన సమయం ఉండదు. దానికి కొంతసవరణ అవసరమైతుంది. అలా జాతకాన్ని సవరించడానికి  కొంత interaction అవసరమైతుంది. మరీ అవసరమైతే వచ్చి నన్ను పర్సనల్ గా కలవవలసి ఉంటుంది. దీనికి తగిన సమయాన్ని వెచ్చించడానికి సిద్ధమైనవారే ఈ ఫీచర్ ను ఉపయోగించుకోవాలి. 

ఎగతాళిగా అడిగే ప్రశ్నలకు జవాబులు ఇవ్వడం జరుగదు. అడిగిన ప్రశ్న నిజమైనదా లేక ఎగతాళిగా అడిగిందా అని నాకు తెలిసిపోతుంది. ఎలా తెలుస్తుంది? అన్న సందేహం వద్దు. అంత మాత్రం తెలుసుకోలేకపోతే ఇక సమస్యా పరిష్కారం ఎలా సూచించగలను? ఎగతాళిగా అడిగే ప్రశ్నలకు జవాబులు ఉండకపోగా, అలా చేసినందువల్ల, అడిగేవారు చెడుకర్మను సృష్టిన్చుకున్నవారౌతారు. దాని ఫలితాన్ని వారు తప్పక మొయ్యవలసి వస్తుంది.

రెమెడీస్ పొందినవారు , సూచించిన  సమయం  మేరకు,  వాటిని శ్రద్దగా చెయ్యవలసి ఉంటుంది. చేసిన తర్వాత ఏం జరిగింది? రేమేడీల వల్ల వారి వారి జీవితాలలో ఏ ఏ మార్పులు వచ్చాయి? అన్న విషయాన్ని మళ్ళీ నాకు తెలియచెయ్యవలసి ఉంటుంది. వ్యక్తిగత అవసరాన్ని బట్టి రెమెడీస్ ను finetune చెయ్యడం జరుగుతుంది. అయితే ఒక్క విషయాన్ని గుర్తుంచుకోవాలి. అన్ని విద్యలకున్నట్లే జ్యోతిర్విద్యకూ కొన్ని పరిమితులూ రూల్సూ ఉన్నాయి. వాటిని తప్పక పాటించాలి. అడిగేవారు తమ సమస్యల గురించే తాము అడగాలి. లేదా తమదగ్గరి కుటుంబసభ్యుల గురించి అడుగవచ్చు. స్నేహితుల గురించీ, మూడో వ్యక్తుల గురించీ అడిగే విషయాలు చెప్పబడవు.

కుతూహలంతోనూ, సరదాగానూ అడిగే ప్రశ్నలకు జవాబులు ఉండవు. కొన్ని మార్మికకారణాలవల్ల, అడిగిన ప్రతివారికీ జవాబు ఇవ్వడం జరుగకపోవచ్చు. జవాబు చెప్పడంలో నాకు స్వాతంత్రం ఉంటుంది. నిజంగా బాధల్లో ఉన్నవారికీ, సిన్సియర్ గా అడిగేవారికి నా నుంచి జవాబు వస్తుంది. ఇతరులకు రాదు.

ఈ ఫీచర్ ఎప్పుడు మొదలౌతుందో త్వరలో తెలియచేయబడుతుంది. 
read more " మీ సమస్య -- నా రేమేడీ "

5, నవంబర్ 2011, శనివారం

కాలజ్ఞానం - 4

ముప్పైఏళ్ళకొకసారి సామాన్యుడికీ బలమొస్తుంది
ప్రజాభిప్రాయం బలంగా వినిపిస్తుంది
అవినీతిపరుల ఆటలు ఇంతకు ముందులా సాగవు 
అన్నీఉన్నా అధర్మం చతికిలపడుతుంది 
అనుకున్న పనులు కాక 

తాత్కాలికంగా ధర్మం నిద్ర లేస్తుంది
అయితే అందులోనూ 
అధర్మం మిలితమయ్యే ఉంటుంది  
కలిలో ఇంతకంటే ఏ ఆశించగలం?
శని ప్రతినిధి కళ్ళు తెరుస్తాడు 
ఎంతమంది ఎదురున్నా 
అతనికి వెనకడుగు ఉండదు
read more " కాలజ్ఞానం - 4 "

1, నవంబర్ 2011, మంగళవారం

నవంబర్ 15 -- శని సంక్రమణం --ఫలితాలు

శని భగవానుడు నవంబర్ 15 కార్తీక బహుళ పంచమి రోజున కన్యారాశిని వదలి తులారాశిలోకి మారుతున్నాడు. ఇక్కడ రెండున్నర సంవత్సరాల సుదీర్ఘకాలం నివాసం ఉండబోతున్నాడు. ఈ మార్పు వల్ల ఏం జరుగుతుంది? ఏ ఏ రాశుల వారికి ఈ రెండున్నర సంవత్సరాల కాలం ఎలా ఉండబోతున్నది? అన్న విషయాలు ఈ పోస్ట్ లో చూద్దాం.

ఈ శని సంక్రమణం వల్ల ---

ఏలినాటి శని అయిపోతున్న అదృష్టవంతులు :-- సింహరాశి జాతకులు. వీరు ఏడున్నరేళ్ళ నుంచి పడుతున్న బాధలనుంచి ఊరట కలుగుతుంది. చాలాకాలం నుంచి  పెండింగ్ లో ఉన్న పనులలో కదలిక కనిపిస్తుంది. వెనక్కు తిరిగి చూచుకుంటే,  2004 ముందర ఉన్న జీవితానికీ ఇప్పటి జీవితానికీ చాలా భేదం కనిపిస్తుంది. ఈ ఏలినాటి శనిదశాకాలం అయిన ఏడున్నరేళ్ళు  వీరి జీవితంలో అనేక ఎగుడుదిగుళ్ళు అనేక గుణపాఠాలు కనిపిస్తాయి. 

అష్టమశని తొలగిపోతున్న అదృష్టవంతులు :-- కుంభరాశి జాతకులు. వీరు గత రెండున్నరేళ్లుగా పడుతున్న బాధలనుంచి రిలీఫ్ పొందటం చూడవచ్చు.

అర్ధాష్టమశని తొలగిపోతున్న అదృష్టవంతులు :-- మిథునరాశి జాతకులు. వీరు కూడా గత రెండున్నరేళ్లుగా ఎదుర్కొంటున్న అనేక బాధలనుంచి విముక్తి పొందుతారు.

తులారాశి వారికి ఏలినాటిశని రెండోపాదం మొదలౌతున్నది. వీరు ఆరోగ్య సమస్యలను, బద్దకాన్ని, పనులు వాయిదా వెయ్యడాన్ని, నిరాశావాదాన్ని ఫీల్ అవడం మొదలు పెడతారు.

కన్యారాశి వారికి ఏలినాటిశని మూడోపాదం మొదలౌతున్నది. వీరు కుటుంబ పరమైన సమస్యలను, మాటజారడం వల్ల ఎదుర్కొనే సమస్యలను, కంటి సమస్యలను, విద్యా పరమైన చికాకులను ఎదుర్కొంటారు.

ఇకపోతే ఈ క్రింది రాశులవారికి కొత్తకష్టాలు మొదలు కాబోతున్నాయి.

1. వృశ్చిక రాశివారికి ఏలినాటిశని ఏడున్నర సంవత్సరాల కాలం మొదలౌతున్నది. 
2. మీనరాశి వారికి అష్టమశని రెండున్నరేళ్ళ కాలం మొదలౌతున్నది. 
3. కర్కాటక రాశివారికి అర్ధాష్టమశని రెండున్నరేళ్ళ కాలం మొదలౌతున్నది.

ఏలినాటి శని ప్రధమపాదం (రెండున్నరేళ్ళు) :--- అతి ఖర్చులు, ఆరోగ్యభంగం, ఆస్పత్రుల చుట్టూ తిరగటం, స్థలమార్పు, సేవాకార్యక్రమాలు ముమ్మరం కావడం, నీచ స్త్రీ/పురుష సాంగత్యం, నిరాశ చుట్టుముట్టి ఆధ్యాత్మిక ప్రవృత్తి పెరగటం జరుగుతాయి.  ఈ లక్షణాలు వృశ్చిక రాశివారికి కనిపించడం మొదలైంది.

అష్టమశని ( రెండున్నరేళ్ళ కాలం) ఖర్చులు, నష్టాలు, బాధలు, రోగాలు, నిరాశ బాధపెడతాయి. మీన రాశివారికి ఇవి మొదలౌతున్నాయి.

అర్ధాష్టమశని (రెండున్నరేళ్ళ కాలం) :-- సుఖం  లోపించడం, త్రిప్పట, చదువులో  విఘ్నాలు, వాహనప్రమాదాలు, తల్లికి గండం, మానసిక అశాంతి, ఇంట్లోనూ ఆఫీస్ లోనూ చికాకులు బాధపెడతాయి. కర్కాటకరాశివారికి ఈ లక్షణాలు కనిపించడం మొదలైంది.

అయితే వీటికి కొన్ని మినహాయింపులు ఉన్నాయి. జాతకంలో మంచి దశలు జరుగుతున్నవారికి, ఆయా రాశులలో అష్టవర్గ బలం ఉన్నవారికి ఈ బాధలు చాలావరకు తగ్గిపోతాయి. అంటే neutralize అవుతాయి. జాతకంలో చెడు దశలు జరిగేవారికి, అష్టవర్గ బలం లేనివారికి ఎక్కువగా బాధలు కలుగుతాయి.

అంతమాత్రం చేత ఏలినాటి శని అంటే భయం అక్కరలేదు. దీనిప్రభావం ప్రతి జాతకంలోనూ భిన్నంగా ఉంటుంది. జరుగుతున్న దశలను బట్టి గోచారం ఫలితాన్ని చూపిస్తుంది. మొత్తంమీద ఈ సమయంలో కొత్త బాధ్యతలు చుట్టుముడతాయి, జీవితంలో మార్పులొస్తాయి, ఇష్టంలేని పనులు చెయ్యవలసి వస్తుంది, చికాకులు ఆందోళనా ఎక్కువౌతాయి. కాని అర్ధం చేసుకోగలిగితే లాంగ్ రన్ లో ఇదంతా మంచికే దారి తీస్తుంది. ఓపికనూ, సహనాన్నీ, బాధ్యతలను నిర్వహించడాన్నీ ఏలినాటిశని అనేది మనిషికి నేర్పుతుంది.

ఏలినాటిశని ప్రభావంవల్ల బాధలు మొదలైనవారు కూడా తగిన రేమేడీలు పాటించటం వల్లా, దైవస్మరణలో ఉండటం వల్లా, మాటల్లో చేతల్లో దూకుడు తగ్గించుకొని సంయమనం పాటించటం వల్లా, బాధ్యతలను శ్రద్దగా నిర్వహించడం వల్లా, విలాసాలకు దూరంగా ఉండటం వల్లా, యోగాభ్యాసం చేసి శరీరంలో ప్రాణశక్తిని పెంచుకోవడం వల్లా ఈ బాధలనుంచి రక్షణ పొందవచ్చు.

ఈ మార్పువల్ల అన్ని రాశులకూ చెడే జరగదు. కొన్ని రాశులకు మంచి కూడా జరుగుతుంది. వారెవరో చూద్దాం.

1. సింహ రాశివారికి ఉత్సాహం, ధైర్యం, పెండింగ్ లో ఉన్న పనులు కదలడం, సంఘంలో సంబంధాలు మెరుగుపడటం, మొదలైన మార్పులు కలుగుతాయి.

2. వృషభరాశివారికి దీర్ఘరోగాలనుండి రిలీఫ్, కార్య రంగంలో ఆశాజనక మార్పులు, శత్రుబాధనుంచి రిలీఫ్ కలుగుతాయి. మానసిక అశాంతి తొలగిపోతుంది.

3.ధనూరాశి వారికి ధనసంబంధ విషయాలలో మెరుగుదల, జీవితంలో మార్పు, సొసైటీలో నూతన గుర్తింపు, కొత్తమిత్రుల పరిచయం కలుగుతుంది.

ఈపాటికే చాలామంది జీవితాలలో ఈ మార్పులు జరగడం ప్రారంభం అయ్యింది. ఎవరికి వారు పరిశీలించుకుంటే ఇందులోని నిజం అర్ధమౌతుంది.
read more " నవంబర్ 15 -- శని సంక్రమణం --ఫలితాలు "