“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

1, నవంబర్ 2011, మంగళవారం

నవంబర్ 15 -- శని సంక్రమణం --ఫలితాలు

శని భగవానుడు నవంబర్ 15 కార్తీక బహుళ పంచమి రోజున కన్యారాశిని వదలి తులారాశిలోకి మారుతున్నాడు. ఇక్కడ రెండున్నర సంవత్సరాల సుదీర్ఘకాలం నివాసం ఉండబోతున్నాడు. ఈ మార్పు వల్ల ఏం జరుగుతుంది? ఏ ఏ రాశుల వారికి ఈ రెండున్నర సంవత్సరాల కాలం ఎలా ఉండబోతున్నది? అన్న విషయాలు ఈ పోస్ట్ లో చూద్దాం.

ఈ శని సంక్రమణం వల్ల ---

ఏలినాటి శని అయిపోతున్న అదృష్టవంతులు :-- సింహరాశి జాతకులు. వీరు ఏడున్నరేళ్ళ నుంచి పడుతున్న బాధలనుంచి ఊరట కలుగుతుంది. చాలాకాలం నుంచి  పెండింగ్ లో ఉన్న పనులలో కదలిక కనిపిస్తుంది. వెనక్కు తిరిగి చూచుకుంటే,  2004 ముందర ఉన్న జీవితానికీ ఇప్పటి జీవితానికీ చాలా భేదం కనిపిస్తుంది. ఈ ఏలినాటి శనిదశాకాలం అయిన ఏడున్నరేళ్ళు  వీరి జీవితంలో అనేక ఎగుడుదిగుళ్ళు అనేక గుణపాఠాలు కనిపిస్తాయి. 

అష్టమశని తొలగిపోతున్న అదృష్టవంతులు :-- కుంభరాశి జాతకులు. వీరు గత రెండున్నరేళ్లుగా పడుతున్న బాధలనుంచి రిలీఫ్ పొందటం చూడవచ్చు.

అర్ధాష్టమశని తొలగిపోతున్న అదృష్టవంతులు :-- మిథునరాశి జాతకులు. వీరు కూడా గత రెండున్నరేళ్లుగా ఎదుర్కొంటున్న అనేక బాధలనుంచి విముక్తి పొందుతారు.

తులారాశి వారికి ఏలినాటిశని రెండోపాదం మొదలౌతున్నది. వీరు ఆరోగ్య సమస్యలను, బద్దకాన్ని, పనులు వాయిదా వెయ్యడాన్ని, నిరాశావాదాన్ని ఫీల్ అవడం మొదలు పెడతారు.

కన్యారాశి వారికి ఏలినాటిశని మూడోపాదం మొదలౌతున్నది. వీరు కుటుంబ పరమైన సమస్యలను, మాటజారడం వల్ల ఎదుర్కొనే సమస్యలను, కంటి సమస్యలను, విద్యా పరమైన చికాకులను ఎదుర్కొంటారు.

ఇకపోతే ఈ క్రింది రాశులవారికి కొత్తకష్టాలు మొదలు కాబోతున్నాయి.

1. వృశ్చిక రాశివారికి ఏలినాటిశని ఏడున్నర సంవత్సరాల కాలం మొదలౌతున్నది. 
2. మీనరాశి వారికి అష్టమశని రెండున్నరేళ్ళ కాలం మొదలౌతున్నది. 
3. కర్కాటక రాశివారికి అర్ధాష్టమశని రెండున్నరేళ్ళ కాలం మొదలౌతున్నది.

ఏలినాటి శని ప్రధమపాదం (రెండున్నరేళ్ళు) :--- అతి ఖర్చులు, ఆరోగ్యభంగం, ఆస్పత్రుల చుట్టూ తిరగటం, స్థలమార్పు, సేవాకార్యక్రమాలు ముమ్మరం కావడం, నీచ స్త్రీ/పురుష సాంగత్యం, నిరాశ చుట్టుముట్టి ఆధ్యాత్మిక ప్రవృత్తి పెరగటం జరుగుతాయి.  ఈ లక్షణాలు వృశ్చిక రాశివారికి కనిపించడం మొదలైంది.

అష్టమశని ( రెండున్నరేళ్ళ కాలం) ఖర్చులు, నష్టాలు, బాధలు, రోగాలు, నిరాశ బాధపెడతాయి. మీన రాశివారికి ఇవి మొదలౌతున్నాయి.

అర్ధాష్టమశని (రెండున్నరేళ్ళ కాలం) :-- సుఖం  లోపించడం, త్రిప్పట, చదువులో  విఘ్నాలు, వాహనప్రమాదాలు, తల్లికి గండం, మానసిక అశాంతి, ఇంట్లోనూ ఆఫీస్ లోనూ చికాకులు బాధపెడతాయి. కర్కాటకరాశివారికి ఈ లక్షణాలు కనిపించడం మొదలైంది.

అయితే వీటికి కొన్ని మినహాయింపులు ఉన్నాయి. జాతకంలో మంచి దశలు జరుగుతున్నవారికి, ఆయా రాశులలో అష్టవర్గ బలం ఉన్నవారికి ఈ బాధలు చాలావరకు తగ్గిపోతాయి. అంటే neutralize అవుతాయి. జాతకంలో చెడు దశలు జరిగేవారికి, అష్టవర్గ బలం లేనివారికి ఎక్కువగా బాధలు కలుగుతాయి.

అంతమాత్రం చేత ఏలినాటి శని అంటే భయం అక్కరలేదు. దీనిప్రభావం ప్రతి జాతకంలోనూ భిన్నంగా ఉంటుంది. జరుగుతున్న దశలను బట్టి గోచారం ఫలితాన్ని చూపిస్తుంది. మొత్తంమీద ఈ సమయంలో కొత్త బాధ్యతలు చుట్టుముడతాయి, జీవితంలో మార్పులొస్తాయి, ఇష్టంలేని పనులు చెయ్యవలసి వస్తుంది, చికాకులు ఆందోళనా ఎక్కువౌతాయి. కాని అర్ధం చేసుకోగలిగితే లాంగ్ రన్ లో ఇదంతా మంచికే దారి తీస్తుంది. ఓపికనూ, సహనాన్నీ, బాధ్యతలను నిర్వహించడాన్నీ ఏలినాటిశని అనేది మనిషికి నేర్పుతుంది.

ఏలినాటిశని ప్రభావంవల్ల బాధలు మొదలైనవారు కూడా తగిన రేమేడీలు పాటించటం వల్లా, దైవస్మరణలో ఉండటం వల్లా, మాటల్లో చేతల్లో దూకుడు తగ్గించుకొని సంయమనం పాటించటం వల్లా, బాధ్యతలను శ్రద్దగా నిర్వహించడం వల్లా, విలాసాలకు దూరంగా ఉండటం వల్లా, యోగాభ్యాసం చేసి శరీరంలో ప్రాణశక్తిని పెంచుకోవడం వల్లా ఈ బాధలనుంచి రక్షణ పొందవచ్చు.

ఈ మార్పువల్ల అన్ని రాశులకూ చెడే జరగదు. కొన్ని రాశులకు మంచి కూడా జరుగుతుంది. వారెవరో చూద్దాం.

1. సింహ రాశివారికి ఉత్సాహం, ధైర్యం, పెండింగ్ లో ఉన్న పనులు కదలడం, సంఘంలో సంబంధాలు మెరుగుపడటం, మొదలైన మార్పులు కలుగుతాయి.

2. వృషభరాశివారికి దీర్ఘరోగాలనుండి రిలీఫ్, కార్య రంగంలో ఆశాజనక మార్పులు, శత్రుబాధనుంచి రిలీఫ్ కలుగుతాయి. మానసిక అశాంతి తొలగిపోతుంది.

3.ధనూరాశి వారికి ధనసంబంధ విషయాలలో మెరుగుదల, జీవితంలో మార్పు, సొసైటీలో నూతన గుర్తింపు, కొత్తమిత్రుల పరిచయం కలుగుతుంది.

ఈపాటికే చాలామంది జీవితాలలో ఈ మార్పులు జరగడం ప్రారంభం అయ్యింది. ఎవరికి వారు పరిశీలించుకుంటే ఇందులోని నిజం అర్ధమౌతుంది.