“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

30, నవంబర్ 2011, బుధవారం

Yoga is the work of devil

మొన్న డెక్కన్ క్రానికల్ లో ఒకవార్త ప్రముఖంగా ప్రచురించబడింది. గాబ్రియేల్ అమోర్త్ అనే 80 ఏళ్ల వాటికన్ వృద్ధమాంత్రికుడు చెప్పినదాని ప్రకారం యోగా అనేది సైతానుయొక్క సృష్టిట. ఇది చదివి, నవ్వాలో ఏడవాలో అర్ధం కాలేదు. ఇంత వయసొచ్చినా ఆయనగారి జనరల్ నాలెడ్జి స్థాయి అలా ఉందంటే, ఇక ఆయనగారి IQ ఏస్థాయిలో ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. బహుశా దానికి తగిన మాంత్రికుడి ఉద్యోగమే ఆయనకు దక్కినట్లుంది. ఆయనకు మతి పూర్తిగా భ్రమించిందని నా నమ్మకం.

జీవితమంతా 'లేని' దయ్యాలను వదిలించేపనిలో ఉంటూ, పిచ్చి క్రైస్తవులను మోసం చేసే పనిలో కాలం గడుపుతున్న ఆయనకు క్రైస్తవంకాని ప్రతీదీ సైతాన్ లాగా కనిపించడం ఆశ్చర్యం ఏమీలేదు. ఒకసారి బ్రహ్మంగారు సిద్ధయ్యను ఇలా అడిగారట. "సిద్దా, ప్రపంచం ఎలా ఉందిరా?". "మనం ఎలా చూస్తే అలా ఉంది గురువుగారు" అని సిద్దయ్య సమాధానం చెప్పాట్ట. దీన్నే మన హిందూమతంలో "యద్భావం తద్భవతి" అంటారు. ఏదైనా మన దృక్కోణాన్ని బట్టే మనకు కనిపిస్తుంది. అంటే ఇరవైనాలుగ్గంటలూ మనం దేన్నయితే తలుస్తామో అదే మనం అయి కూచుంటాం. ఈ వృద్ధమాంత్రికుడు ఎప్పుడూ సైతాన్ ధ్యానంలో ఉండటంవల్ల ఆయనకు ప్రతిదీ సైతాన్ చర్యలాగే కనిపిస్తుంది. ఇదేమీ విచిత్రం కాదు. సైతాన్ ధ్యానం మానేసి హిందూ మతమో, బౌద్ధమో నేర్పే ధ్యానం ఈయన నేర్చుకుంటే బాగుంటుంది.

క్రైస్తవం మొదట్నించీ క్రీస్తు యొక్క బోధనలను వక్రీకరిస్తూనే వచ్చింది. అసలైన క్రీస్తుబోధనలు సెయింట్ పాల్ చేతిలో పూర్తిగా వక్రీకరించబడ్డాయి. ముఖ్యంగా క్రైస్తవాన్ని గట్టిగా ప్రోమోట్ చేసే కార్యక్రమంలో భాగంగా, క్రైస్తవం కాని ప్రతివిషయాన్నీ సైతాన్ కు అంటగట్టే ప్రయత్నం గత రెండువేల ఏళ్లుగా జరిగింది. ఆ క్రమంలో భాగంగా, అనేక ఇతరమతాలనూ, వాటి జ్ఞానసంపదనూ కాలగర్భంలో కలిపింది క్రైస్తవం. క్రీస్తుపూర్వంనుంచీ ఉన్న ఎంతో జ్ఞానసంపద ఈ అజ్ఞానపూరితచర్య వల్ల నాశనమై పోయింది. ఎందఱో జ్ఞానఖనులను "విచ్చ్ హంట్" పేరుతో సజీవదహనం చేసిన ఘనచరిత్ర క్రైస్తవానిది. తనకు అర్ధంకాని ప్రతీదీ సైతానే అనుకోవడం క్రైస్తవానికీ ఇస్లాంకూ ఉన్నఅనేక దుర్లక్షణాలలో ఒకటి.

"యోగా" అనేది భారతీయ షడ్దర్శనాలలో ఒకటి. అంటే భగవంతుని చేరుకునే ఆరువిధానాలలో "యోగదర్శనం" ఒకటి అని మన హిందూమతం చెబుతుంది. ప్రపంచవ్యాప్తంగా మహనీయులైన అందరు ప్రవక్తలూ యోగులే. "యోగం" అనే మాటలోనే " కలపడం " అనే అర్ధం ఉంది. వ్యక్తిని దేవునితో కలిపేదే యోగం. వ్యష్టిని సమిష్టితో కలిపేదే యోగం. పరిమితమైన వ్యక్తిత్వాన్ని విశ్వవ్యాపకచైతన్యంతో కలిపేదే యోగం. యోగం అనేమాటకు ఉన్న అర్ధం ఇలా ఉంటె, వృద్ధమాంత్రికుడు అలా చెప్పడంలో అర్ధం ఏమిటో ఆ సైతాన్ కే తెలియాలి. బహుశా సైతానే ఆ విధంగా అతనిచేత పలికించి ఉండవచ్చు.

అసలు సైతాన్ (devil) అనేదే ఒక కల్పితజీవి. సైతాన్ అనేది అసలు లేనేలేదు. There is no devil anywhere at all. ఎందుకంటే, సెమిటిక్ మతాలు చెప్పే సైతాన్ అనేది నిజంగా ఉంటే, అది దేవుణ్ణి అపహాస్యం చెయ్యడమే అవుతుంది. సైతాను ఉన్నదీ అంటే అది దేవునికి ప్రశ్నార్ధకమే. సైతాన్ని తన సృష్టిలో అసలెందుకు ఉండనిస్తున్నాడు దేవుడు? అన్న ప్రశ్నకు ఈ మతాల వద్ద జవాబు లేదు. దీనికి మనమే జవాబు చెప్పుకుందాం. 

ఒకటి -- దేవునికంటే సైతాన్ కు ఎక్కువ శక్తి ఉండి ఉండాలి. అప్పుడే అది దేవుణ్ణి ధిక్కరిస్తూకూడా ఆయన సృష్టిలో మనుగడ సాగించగలుగుతుంది. 

రెండు -- సైతాన్ తనసృష్టిలో ఉండి మానవుల్ని హింసపెట్టడం దేవునికి ఇష్టం అయ్యి ఉండాలి. అందుకని దాని ఆగడాలని ఆయన చూచీచూడనట్లు ఊరుకుంటూ ఉండి ఉండాలి. పై ప్రశ్నలకు ఇవి రెండుతప్ప వేరే లాజికల్ కారణాలు ఉండటానికి వీల్లేదు. అయితే ఈ జవాబుల  వల్ల కొన్ని ఇబ్బందికరమైన పరిస్తితులు తలెత్తుతాయి.

మొదటి కారణం నిజమైతే, మనుషులు దేవుణ్ణి పూజించడం మానేసి సైతాన్నే పూజించడం మంచిది. ఎందుకంటే సైతాన్ తో పోలిస్తే శక్తిహీనుడైన దేవుణ్ణి పూజించి ఉపయోగం ఏముంది? సైతాన్ని ఏమీ చెయ్యలేక తన సృష్టిలో ఉండనిస్తున్న దేవుడు దాని బారినుంచి మనల్ని ఎలా కాపాడగలడు? కాపాడలేడు. కనుక దేవుని పూజించడం అనవసరం.

లేదా రెండోకారణం నిజం అనుకుంటే, కుట్రపూరితంగా సైతాన్ని తనసృష్టిలో ఉండనిస్తూ, దాన్ని తన స్వప్రయోజనానికి వాడుకుంటూ, చెడునంతా దానిమీదకు తోసి, మంచినంతా తాను హస్తగతం చేసుకుంటున్న అటువంటి దేవుణ్ణి పూజించి ఉపయోగం ఏమిటో మనం ఆలోచించాలి. ఇటువంటి కుట్రలుచేసే దేవుడు అసలు దేవుడేకాడు. కనుక ఎలాచూచినా దేవుడికి పరువు పోవడం ఖాయం.

సైతాన్ ఉన్నదీ అంటే, అది దేవుణ్ణి తక్కువ చెయ్యడమే అవుతుంది. కనుక సైతాన్ అనేది అస్సలు లేనేలేదు. అది క్రైస్తవుల సృష్టి. అంతేకాని దేవుని సృష్టి కాదు. గేబ్రియల్ అనేవాడు మొదట దేవదూత అనీ, తర్వాత అతడు దారి తప్పి, దేవునికి ఎదురుతిరిగి , సైతాన్ గా మారాడనీ క్రైస్తవ కధనం. కాని దేవదూత అయినవాడు అసలు ఎలా దారి తప్పగలడు? దేవుని సంకల్పం లేకుండా, అతని మనసులో ఎదురుతిరగాలనే ఆ బీజం ఎలా పడింది? కనుక దేవదూత సైతాన్ గా మారడానికి దేవుడే కారణమా? అని అడిగితే వారు సమాధానం చెప్పలేరు. ఒకవేళ గాబ్రియేల్ డెవిల్ గా మారాడు అనుకున్నప్పటికీ, అతనిలోని చెడును ఖండించి వెంటనే అతన్ని మళ్ళీ దేవదూతగా దేవుడు ఎందుకు మార్చలేకపోయాడు? అంటే, దేవుడు అతని ఖర్మకు అతన్ని వదిలేశాడా? తన దూత పాడైపోతుంటే బాగుచేసుకోలేనివాడు ప్రపంచాన్ని ఎలా రక్షించగలడు? ఈ ప్రశ్నలకు బైబిల్లో ఎక్కడా జవాబులు లేవు.

జవాబు చెప్పలేని ప్రశ్నలు అడగటం మహాపాపం అని ముద్రవేసి, ఇలా ప్రశ్నించిన వారిని దైవద్రోహులుగా పరిగణిస్తే  చాలా సింపుల్ గా సమస్య పరిష్కారం అవుతుంది. కనుక ప్రశ్నించడాన్ని క్రైస్తవం మొదటినుంచీ అణగదొక్కుతూ వచ్చింది. "నోర్మూసుకుని మేము చెప్పింది నమ్ము" అన్నదే మొదట్నుచీ వారి సిద్ధాంతంగా ఉంటూ వచ్చింది. అలా నోరెత్తకుండా నమ్మేవారి దగ్గర ఎలాటి కాకమ్మకబుర్లైనా చెప్పి నమ్మించవచ్చు. ఎందుకంటే అసలు పునాదే "నమ్మకం" అయినప్పుడు, ప్రశ్నించడం "దైవద్రోహం" అయినప్పుడు నోరెత్తకుండా అలా ప్రతిదాన్నీ నమ్మేవారిదగ్గర మతప్రచారకుల ఆటలు బ్రహ్మాండంగా సాగుతాయి. కనుక రెండువేల ఏళ్లనుంచీ వారిప్రచారం ఇదే పంధాలో సాగింది. చాలామంది అమాయకుల్ని మోసం చేసింది. సెమెటిక్ మతాలలో ప్రశ్నించడానికి తావు లేదు. వారు చెప్పింది గుడ్డిగా నమ్మటమే దారి. కాని హిందూమతం దీనికి పూర్తిగా వ్యతిరేకం. హిందూమతంలో ప్రశ్నించడాన్ని ప్రోత్సహిస్తారు. తర్కం అనేది భగవంతుడు మనిషికి ఇచ్చిన ఒక వరంగా భావిస్తారు.

సైన్సు కూడా సైతాన్ సృష్టే అని మధ్యయుగాలలో ఇదే క్రైస్తవప్రచారకులు చాలాకాలం ఊదరగొట్టారు. భూమి బల్లపరుపుగా ఉందని బైబిల్లో ఉంది గనుక-- " బైబిల్లో ఉన్నది అబద్దం. భూమి అలా లేదు, అది గోళాకారంలో ఉంది  మొర్రో" అని మొత్తుకున్న గెలీలియోను చిత్రహింసలు పెట్టారు. ప్రపంచానికి భూమికేంద్రంగా ఉంది అని బైబుల్ చెప్పింది గనుక -- "అది వట్టి అబద్దం. ప్రపంచానికి భూమి కేంద్రం కాదు. సూర్యుడు కేంద్రంగా  ఉంటె, అన్ని గ్రహాలు సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాయి" అని చెప్పిన కోపర్నికస్ ను చిత్రహింసలు పెట్టిందీ ఈ క్రైస్తవులే. "సైన్స్ సైతాన్ సృష్టి" అని మధ్యయుగాల్లో చర్చి అధికారగణం ఎంత మొత్తుకున్నా సైన్స్ పురోగతి ఆగలేదు. అందుకని కొన్నాళ్ళు పోయాక ఆవాదన మానుకున్నారు. ఇప్పుడు హిందూమతం మీదా ఇదే ప్రచారం మొదలు పెట్టారు.

"యోగా" అనేది  ఎవరు ఆపినా ఆగకుండా ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తోంది . దాని యొక్క మహత్యాన్ని లోకమంతా ఇప్పుడు గుర్తిస్తోంది. ఇదే వాటికన్ కు దడ పుట్టిస్తున్న విషయం. ఎందుకంటే యోగాతో బాటు హిందూమతానికి చెందిన "కర్మ", "జ్ఞానం", "భక్తి", "ముక్తి"  లాంటి కొన్ని  పదాలూ అందరికీ తెలుస్తాయి. "పునర్జన్మ" వంటి కాన్సెప్టులూ తెలుస్తాయి. ఈవిధంగా మెల్లిగా హిందూమతం యొక్క పరిజ్ఞానం అందరికీ తెలుస్తుంది. హిందూమతంలో ఉన్న జ్ఞానసంపదనూ, విశాలదృక్పధాన్నీ ఒక్కసారి చవిచూచినవారు ఇక ఇతర మతాలుచెప్పే అబద్దాలు ఎంతమాత్రం నమ్మరు. అప్పుడు ఈ ప్రచారకుల ఆటలు సాగవు. కనుక ఎలాగైనా యోగాని నిరోధించాలి. నిషేధించాలి. ఎలా? దానికి ఒకటే మార్గం. యోగా అనేది సైతాను సృష్టి అని ఊదరగోడితే పని సులువుగా అవుతుంది. ఇదీ వీరి ప్లాన్.

కాని వీరికి తెలియని విషయం ఒకటుంది. ప్రాచీన కాలంలో ఎవరి దేశంలో ఎవరిమతంలో వారుండేవారు. కారణమేమంటే అప్పుడు కమ్యూనికేషన్ ఇంతగా లేదు. లోకంలో ఎన్ని దేశాలున్నాయో, ఎన్ని మతాలున్నాయో చాలామందికి అప్పుడు తెలియదు. అప్పుడంతా ఈ క్రైస్తవ ప్రచారకుల దగాకోరు ప్రచారాలు అమాయకుల దగ్గర సాగాయి. కాని ఇప్పుడలా కాదు. ఇప్పుడు ప్రపంచం ఒక గ్లోబల్ విలేజ్ అయిపోయింది. ఇతర మతాలను గురించి తెలుసుకోవాలంటే ఇప్పుడు చాలా తేలిక. అలాటి తులనాత్మక అధ్యయనం చేసేవారికి అనేక  కొత్త విషయాలు తెలుస్తాయి. ఇప్పటివరకూ వారు ఎంత భ్రమల్లో ఉన్నారో తెలుస్తుంది. ఇతర మతాలకు పట్టుకున్న భయం అదే.

హిందూమతంలో ఉన్న అద్భుతమైన సత్యాలను తెలుసుకునేవారి మానసికపరిధి క్రమేణా విస్తృతం అవుతున్నది. అందులో ఉన్న యోగావంటి ఆచరణాత్మక విషయాలు ప్రపంచదృష్టిని విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. ఈ ట్రెండ్ ను నివారించడానికి గాబ్రిఎల్ అమోర్త్ లాంటివారు అప్పుడప్పుడూ ఇలాటి హాస్యాస్పద వ్యాఖ్యలుచేస్తూ నవ్వుల పాలౌతుంటారు. తెలియనివారు ఈ మాటలు నమ్మవచ్చు. కాని స్వల్పంగానైనా జెనెరల్ నాలెడ్జి ఉన్నవారు ఇటువంటి ప్రచారం ఎంతమాత్రమూ నమ్మరు.

యోగా అనేది దేవుడు మనిషికిచ్చిన అద్భుతమైన వరం. మానవుడు దేవతగా మారడానికి "యోగా" రాజమార్గం. ప్రపంచానికి మనదేశం ఇచ్చిన అనేక బహుమతుల్లో యోగా ఒకటి. అంతెందుకు జీసస్ క్రీస్ట్ కూడా భారతదేశంలో నివసించి ఉన్నతమైన యోగసాధనలు నేర్చుకున్నవాడే. దాని ద్వారా సిద్దుడైనవాడే. దీనికి చాలా ఆధారాలున్నాయి. అయితే ఈసంగతి క్రైస్తవులు ఒప్పుకోరు. ఒప్పుకుంటే జీసస్ స్థాయి దిగిపోతుంది కదా మరి! అందుకని సత్యానైనా భూస్తాపితం చేస్తారు. ఇది వారికి వెన్నతో పెట్టిన విద్యే కదా!!

ఒక విషయాన్ని మనం ఒప్పుకోనంత మాత్రాన అది అబద్దం అయిపోదు. అది వేరే విషయం. కనుక, సంకుచిత దృక్పథాన్ని వీడి, యోగాభ్యాసం చేస్తే ఏమి జరుగుతుందో వృద్ధమాంత్రికుడు తెలుసుకోవాలి. తెలుసుకోవడమే కాదు. ఆచరించి చూడాలి. అప్పుడు ఇలాటివాళ్ళు తమ అభిప్రాయాన్ని తప్పక మార్చుకుంటారు. అప్పుడు మాత్రమె యోగా అనేది సైతాన్ సృష్టి కాదనీ, దేవుడు మానవాళికిచ్చిన అద్భుతమైన వరాలలో "యోగా" ఒకటి అనీ తెలుస్తుంది.

క్రైస్తవాన్ని ఇతరులకు బోధించడం కాదు. ముందుగా దానిని ఆచరించడం క్రైస్తవులు నేర్చుకోవాలి. Judge not, so that you shall not be judged. అని కొండమీద చేసిన ప్రసంగం (Sermon on the mount) లో క్రీస్తు చెప్పాడు. దానిని ఆచరిస్తే, ఎదుటివారిమీద బురదజల్లుడు కార్యక్రమం    ఆటోమేటిక్ గా ఆగిపోతుంది. క్రీస్తుయొక్క ఇలాటి నిజమైన బోధనలను "ఆచరించే" మంచిబుద్ధిని గాబ్రిఎల్ అమోర్త్ లాటి   కుహనా క్రైస్తవులకు ఈశ్వరుడు ప్రసాదించుగాక !!