అన్తః శాక్తః బహిః శైవః లోకే వైష్ణవః అయమేవాచారః

31, జులై 2015, శుక్రవారం

గురువు - దేవుడు - ఆత్మ

"ఈశ్వరో గురురాత్మేతి"..అని మన శాస్త్రాలు చెబుతున్నాయి.అంటే, దైవము, గురువు,ఆత్మా ఒక్కరే అని అర్ధం.

గురుపూర్ణిమ సందర్భంగా ఎవరెన్ని ఉపన్యాసాలు చెప్పినప్పటికీ అసలైన ఒక్క విషయాన్ని మాత్రం ఎవరూ చెప్పడం లేదు.ఒకవేళ ఎవరైనా నాబోటివాడు చెప్పినా ఎవరూ పాటించడమూ లేదు.

అదేంటంటే - మనుషులు గురువును పూజిస్తారు గాని గురుబోధను పాటించరు.అలాగే దేవుడిని పూజిస్తారు గాని దేవుడిని (చేరాలని) కోరుకోరు.

ఇదే మానవజాతి ఆడుతున్న అతి పెద్దనాటకం.ఈ నాటకాన్ని గమనించలేనంత తెలివితక్కువ వాళ్ళు కారు దేవుడూ గురువూ.

గురుబోధను పాటించాలంటే నిన్ను నువ్వు మార్చుకోవాలి.దీనికి ఎవ్వరూ సిద్ధంగా లేరు.

దైవాన్ని చేరుకోవాలంటే నువ్వే అదృశ్యం కావాలి.దీనికీ ఎవరూ సిద్ధంగా లేరు.

మరి మహాభక్తులుగా నటిస్తున్న ఈ లోకులందరూ ఏం చేస్తున్నారు?

"మేము నీ బోధను పాటించము.కానీ మేము కోరిన వరాలు మాకివ్వు. కష్టాల్లో మాకు అండగా ఉండు" - అని గురువు చుట్టూ చేరి గోల పెడుతున్నారు.

"నువ్వు మాకక్కర్లేదు.మేం చేసే పూజలు స్వీకరించి మేము కోరుకునే వరాలు మాత్రం మాకివ్వు" - అని దేవుడితో చెబుతున్నారు.

వెరసి దైవాన్నీ గురువునూ మానవులు అడ్డంగా తిరస్కరిస్తున్నారు.వాళ్ళ దగ్గర ఉన్న వరాలిచ్చే శక్తిని మాత్రం వీళ్ళు దోపిడీ చెయ్యాలని చూస్తున్నారు. అదికూడా పూజ అనే లంచం ఆశచూపించి.అంటే - లోకంలో ఆడే నాటకాలనే దైవం దగ్గర,గురువు దగ్గరా కూడా ఆడాలని వీళ్ళు చూస్తున్నారు. అంతేకాదు ఆడుతున్నారు కూడా.

మనుషులకు నిజంగా కావలసింది దేవుడూ కాదు గురువూ కాదు.వాళ్లకు కావలసింది సెక్యూరిటీ మాత్రమే.ఒక మానసిక ఆసరా మాత్రమే వాళ్లకు కావాలి.వారు ఆడే రోజువారీ నాటకాలకు ఒక డివైన్ సపోర్టూ డివైన్ శాంక్టిటీ మాత్రమే వారికి కావాలి.మేము చేస్తున్నవి పాపాలు కావు,మేము చేస్తున్నవి తప్పులు కావు - అన్న భరోసా మాత్రమే వారికి కావాలి.ఒకవేళ అవి తప్పులూ పాపాలూ అయినా సరే వాటిని ఎల్లకాలమూ క్షమిస్తూ, 'నీ పద్ధతి మార్చుకో' అని చెప్పకుండా,వీళ్ళు పెడుతున్న బెల్లమూ మరమరాలూ కొబ్బరి ముక్కలూ తింటూ నోర్మూసుకుని పడుండే దేవుడే వీరికి కావాలి.

"నువ్వు నడుస్తున్న దారి తప్పుదారి.అది సరియైన దారి కాదు.నువ్వు మారాలి." అని చెప్పే గురువునూ దేవుడినీ మనుషులు నిర్దాక్షిణ్యంగా తిరస్కరిస్తారు.

తమతమ స్వార్ధపూరిత అవసరాలకోసం,దేవుడిని పూజించినట్లు మనుషులు నటిస్తారు.గురువు చెప్పినది విన్నట్లు నటిస్తారు.కానీ ఈ రెండూ త్రికరణశుద్ధిగా మాత్రం ఎవ్వరూ చెయ్యరు.

ఈ క్రమంలో గురువుకూ దైవానికీ నిజానికి దూరం అవడమే గాక, వారికి ప్రతిరూపం అయిన తన ఆత్మకు కూడా దూరమై పోతున్నారు.ఈ మూటికీ దూరమైన వానికి జీవితంలో శాంతి ఎలా ఉంటుంది? అందుకే నేడు ఎవరి జీవితాలు చూచినా శాంతి మాత్రం లేదు.మిగిలినవన్నీ ఉండవచ్చు.కానీ శాంతి మాత్రం లేదు.

దానికి అసలైన కారణం దైవానికీ, గురువుకూ,ఆత్మకూ దగ్గరౌతున్నామన్న భ్రమలో ఉంటూ ఇంకా ఇంకా దూరం కావడమే.

మానవులు ఈ మోసపూరితమైన తమ మనస్తత్వాన్ని పోగొట్టుకోనంత వరకూ వారికి శాంతి ఎప్పటికీ దొరకదు.

ఇది రేపటి సూర్యోదయమంత నిజం.
read more " గురువు - దేవుడు - ఆత్మ "

30, జులై 2015, గురువారం

Guru Purnima-2015 సందేశం



గురుపూర్ణిమ సందేశాన్ని ఇక్కడ వినండి
read more " Guru Purnima-2015 సందేశం "

28, జులై 2015, మంగళవారం

అబ్దుల్ కలాం జాతకం - కొన్ని విశేషాలు

ఉదయాన్నే ఒక మిత్రుడు ఫోన్ చేసి అడిగాడు.

'అబ్దుల్ కలాం పోయారు కదా. ఈరోజు ఆయన జాతకం నువ్వు వెయ్యబోతున్నావని నేను జోస్యం చెబుతున్నాను. ఇది ఖచ్చితంగా నిజం అవుతుంది చూడు'.

'సరే.నీ జోస్యం నిజమౌతుంది.ఇంత మంచి జోస్యం చెప్పినందుకు నీకు మంచి టీ పార్టీ ఇస్తాలే.' అన్నా నవ్వుతూ.

'అయినా నీకిదేం పని? ఎప్పుడూ పోయినవాళ్ళ జాతకాలు వేస్తుంటావ్?' అడిగాడు కొంచం అతిచనువుగా.

'మీలాంటి బ్రతికున్నవాళ్లకి గడ్డిపరక విలువ కూడా ఇవ్వకుండా పోయినవాళ్ళకే విలువ ఇస్తున్నానంటే నా దృష్టిలో మీ స్థాయి ఏమిటో ఇంకా అర్ధంకాలేదా? మీకంటే వాళ్ళే నయం అని నా అభిప్రాయం.వాళ్ళు మీలా అవాకులూ చవాకులూ వాగరు.Dead men never speak.అందుకే వాళ్ళ జాతకాలే నేను చూస్తా.' -నేనూ నవ్వుతూనే అంటించా.

'సరే ఉంటా మరి' అని వాడు ఫోన్ పెట్టేశాడు.

అబ్దుల్ కలాం గారిది విలక్షణమైన వ్యక్తిత్వం అనే విషయం అందరికీ తెలిసినదే.మీడియాలో అవన్నీ వస్తూనే ఉన్నాయి.తెలిసిన విషయాలనే మళ్ళీ ఊదరగొట్టడం నాకిష్టం లేదు.కొన్ని జ్యోతిశ్శాస్త్ర కోణాలను మాత్రం ఈ వ్యాసంలో స్పర్శిస్తాను.

కలాం గారు 15-10-1931 న తమిళనాడు రామేశ్వరంలో జన్మించాడు.పుట్టిన సమయం 11.30 అనీ 13.30 అనీ రెండు సమయాలు దొరుకుతున్నాయి. వాటిలో ఏది సరియైనదో మనకు తెలియదు.అందుకని విశ్లేషణలోకి లోతుగా పోవడం లేదు.

గురువు ఉచ్ఛస్థితిలో ఉండటం ఈ జాతకంలో ఒక మంచియోగం.అందుకే చిన్నప్పటినుంచీ సద్బ్రాహ్మణులతో సదాచారపరులతో స్నేహం ఈయనకు ఉన్నది.వారినుంచి ఈయన ఎంతో నేర్చుకున్నాడు.

లగ్నం కరెక్టే అనుకుందాం కాసేపు.దశమంలో ఉన్న బుధాదిత్యయోగం వల్ల విద్యారంగంలో రాణించడం,సంగీత సాహిత్యాలలో ప్రవేశం కలిగాయి.లగ్నంలో శనివల్ల పరిశోధనారంగంలో అభిరుచీ,పరిశ్రమా కలిగాయి.

సూర్యబుధుల పైన గురుదృష్టి వల్ల ఆయా బుధాదిత్యరంగాలలో గుర్తింపు లభించింది. నీచభంగరాజయోగం పట్టిన చంద్రునిపైన ఉన్న గురుదృష్టి ఆధ్యాత్మిక చింతనను ఇచ్చింది.

ప్రస్తుతం గోచార గ్రహాలకూ జనన గ్రహాలకూ సంబంధం గమనిద్దాం.

>>గోచార ఛాయాగ్రహాలు జననకాల స్థితికి పూర్తి వ్యతిరేక స్థితి.
>>గోచారశని, జననకాల చంద్రునిపై సంచారం.చంద్రుడు రక్తప్రసరణకు కారకుడని మనకు తెలుసు.హార్ట్ ఎటాక్ వచ్చినపుడు గుండెకు రక్తసరఫరా సరిగా జరగదు.దానివల్ల మరణం సంభవిస్తుంది.

శుక్ల ఏకాదశి రోజు పోవడం ఈయన పుణ్యాత్ముడని సూచిస్తోంది.

కలాంగారు ఇంద్రుడు చంద్రుడు మహనీయుడు అని పొగుడుతున్న వాళ్ళంతా ఆ గుణగణాలలో కొన్నైనా వారివారి రోజువారీ జీవితాలలో ఆచరించే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. లేకుంటే ఈ పొగడ్తలన్నీ దయ్యాలు వేదాలు వల్లించినట్లు తప్ప ఇంకే రకంగానూ ఉపయోగపడవు.

ఎవరినైనా ఉన్నన్నాళ్ళు తమ స్వార్ధానికి వాడుకోవడం,పోయినతర్వాత కులాసాగా వారిని మర్చిపోవడం మనకు అలవాటేగా??
read more " అబ్దుల్ కలాం జాతకం - కొన్ని విశేషాలు "

25, జులై 2015, శనివారం

ఎదురుచూపు








ఎదురుచూపనేది
యుగయుగాలనుంచీ
మనిషికీ దేవుడికీ సమానమే

నేను కోరిన వరాలన్నీ
ఏ దేవుడిస్తాడా అని
మనిషి ఎదురుచూపు

నన్ను కోరుకునే మనిషి
ఒక్కడైనా కనిపించడా
అని దేవుని ఎదురుచూపు...
read more " ఎదురుచూపు "

బూటక భక్తి








డబ్బులిచ్చే దేవుడికే ఉత్సవాలు
డబ్బులిచ్చే భక్తులకే మర్యాదలు
లోకంలో డబ్బే దేవుడు గాని
అసలు దేవుడు ఎక్కడున్నాడో
ఎవరికీ తెలియదు

మనం చూచే జనుల భక్తి
పెద్ద బూటకనాటకం
డబ్బులివ్వని దేవుడిని ఎవరూ
కొలవకపోవడమే దీనికి తార్కాణం

పాత దేవుడుకంటే కొత్త దేవుడితో
బాగా కలిసొస్తుందనుకుంటే
సరాసరి దేవుడినే మార్చెయ్యడమే
దీనికి నిదర్శనం

దేవుడి పేరుతో జనం పూజించేది
డబ్బునే గాని దేవుడిని కాదనేది
నగ్నసత్యం

గుళ్ళూ గోపురాలూ
పక్కా వ్యాపార సంస్థలే
డబ్బులున్న భక్తులకు
ప్రత్యేక గౌరవాలే దీనికి తార్కాణం

మొక్కులూ నోములూ
యాత్రలూ స్నానాలూ
అంతా ఉత్త బూటకం
లోకంలో కనిపించే ఇదంతా
స్వార్ధపు వికృతనాట్యం

ఏ మతపు ప్రార్ధనాలయమైనా
అక్కడున్నది
మనిషి సృష్టించిన దేవుడే గాని
అసలు దేవుడు కాదు

ఎందుకంటే అసలుదేవుడు
ఎవరికీ అక్కర్లేదు
అంతేకాదు
అసలు దేవుడే ఎవరికీ అక్కర్లేదు

లోకంలో భక్తి అనేది
అసహ్యపు వ్యాపారం
ఇది మనుషులు మనుషులతో చేసే
అనైతిక వ్యవహారం...
read more " బూటక భక్తి "

23, జులై 2015, గురువారం

శూన్యమందిరం











అన్నీ అడిగి
కొనకుండా పోయే
బేరమెందుకు?

ఆత్మీయంగా
నిజంగా అనుసరిస్తే
దూరమెందుకు?

నీటిని చూచి దడుస్తూ
ఒడ్డున మాటలు చెప్పే
స్నానమెందుకు?

మనసుతో యుద్ధం చేస్తూ
మదిలో మునగలేని
ధ్యానమెందుకు?

దూరాన్ని లెక్కిస్తూ
కాలుకదపలేని
యానమెందుకు?

వినేవారు లేని
శూన్యమందిరంలో
గానమెందుకు?

మౌనమనే మత్తులో
మునిగి మదిరా
పానమెందుకు?

అంతా ఐనప్పుడు
విడిగా ఇంకొక
ప్రాణమెందుకు?
read more " శూన్యమందిరం "

తిరుగలి రాళ్ళు











నీవన్నది ఒక మాయ
నేనన్నది పెనుమాయ
నిన్నూ నన్నూ దాటిన
నువ్వేగా నిత్యసత్యం?

నీవూ నేనుల చెలిమిలో
సాగే మనిషి జీవితం
చావూ బ్రతుకుల కొలిమిలో
కాగే నిత్య నాటకం

భూమ్యాకాశాలనే
తిరుగలి రాళ్ళ మధ్య నలిగి
పిండి అవుతోంది జీవితం

నువ్వూ నేననే
గానుగ చట్రంలో నలిగి
జావగారుతోంది జీవితం

పగలూ రాత్రుల
పాదయాత్రలో అరిగి
పగులువారుతోంది జీవితం

భూమినీ ఆకాశాన్నీ దాటినదే
నీ దారి
గానుగనీ ఎద్దులనీ ఆపిచూడు
ఒకసారి

పగలూ రాత్రీ దాటి
పరవశించు ఒకసారి
నిన్నూ తననూ మరచి
నీలో మునుగు ఒకసారి

చెయ్యకపోతే ఈ పని
చెదిరిపోదు నీ భయం
చెందకపోతే దీనిని
తెరుచుకోదు ఆలయం

ఆగలేని యాత్రధారికి
విశ్రాంతిపై ఆశెందుకు?
లీనమైన పాత్రధారికి
విషాదమంటే భయమెందుకు?
read more " తిరుగలి రాళ్ళు "

22, జులై 2015, బుధవారం

అంతంలేని అనుభవం...











మబ్బులేని ఆకాశంనుంచి
స్వచ్చమైన జలపాతం
వర్షంలా కురుస్తోంది

అడుగెక్కడో తెలియని
అనాది మాలిన్యాన్ని
సమూలంగా కడుగుతోంది

అంతరాలు తెగుతున్న అంతరంగం
అంతం లేని అనుభూతి
అగాధానికి చేరుతోంది

ఎవరికోసమో తెలియక
ఎప్పటినుంచో వేచిన
ఎదురుచూపే కరగిపోతోంది

ఉందో లేదో తెలియని
ఉన్మత్తపు భావమొకటి
ఉప్పెనలా కళ్ళు తెరుస్తోంది

తనను తానే ఎరుగని ఎరుక
తారతమ్యాల హద్దులు మీరి
తానుగా మిగులుతోంది...
read more " అంతంలేని అనుభవం... "

మౌన చకోరం











తెలుసు
అడగందే చెప్పరాదు 
మనసు 
ఎవరూ తెలుసుకోలేరు 

ఉంది
కోరనిదే ఇవ్వరాదు
తోడు
ఎవరూ ఉండలేరు 


ఐనా ... 
విసుగులేక 
దిగంతాలను వీక్షిస్తూ 
వేచి ఉన్న
మౌన చకోరం...
read more " మౌన చకోరం "

సడిలేని రాత్రి












సడిలేని  రాత్రి.... 
లోకం హాయిగా నిద్రిస్తోంది 
నాకేమో నిద్ర కరువైంది 

లోకాన్ని తడుపుతోంది
వెలుగుతున్న జాబిలి   
కొలిమిలా మండుతోంది 
నా హృదయపు లోగిలి  

కన్నీరు ధారలు కట్టి 
దిండును తడిపేస్తోంది 
నాకోసం రాని
నీకోసం....
read more " సడిలేని రాత్రి "

రెండు దారులు












సాగే స్వేచ్చ కోసం ఆరాటం
లాగే బంధాలతో పోరాటం
బరువు బాధ్యతల మోమాటం 
ఇదేగా జీవితం 

పట్టెడు మెతుకులకోసం 
పరుగులు
గుప్పెడు మనసు చేసే 
మరుగులు

ఆరని ఆశలు, తీరని కోరికలు
మారని మనసులు, పారని ఎత్తులు
ఆగని పయనం, చేరని గమ్యం
ఇదేగా జీవితం...

ఈ ఎడారి పయనంలో
నీ గమ్యం 
ఒక లేని ఒయాసిస్సు

నీ దాహం 
ఎన్నటికీ తీరేది కాదు
వ్యామోహం 
ఎప్పటికీ పోయేది కాదు

దేనికోసం నీ పరుగు
ఆగి ఆలోచించొకసారి 
దేనికోసం నీ నిరీక్షణ
తరచి అవలోకించొకసారి

నువ్వు వెతికేది నీ ఎదురుగా ఉన్నా
గుర్తించలేని బ్రతుకేగా నీది
నువ్వు కోరేది నీ వడిలో ఉన్నా
తెలుసుకోలేని మరుపేగా నీది

ఎవరికోసం నువ్వు జన్మజన్మలుగా
ఎదురు చూస్తున్నావో
ఆ ప్రియుడు  
ఈ క్షణం నీ తలుపు తడుతున్నా
గుర్తించలేక పిచ్చిదానిలా   
ఎక్కడో చూస్తున్నావు

ఎన్నిసార్లు వేశావీ వేషం
ఎన్నిసార్లు ఆడావీ నాటకం
ఎందుకింత మరుపు నీకు?
ఇక చాలించు నేస్తం
వదలిపెట్టు సమస్తం

నీ ముందున్నవి రెండే దారులు
నీ ప్రియునిలో నీవైనా కరగాలి
లేదా - అతడే నీలో కలవాలి 
నీవో అతడో ఒకరే మిగలాలి

ఎంచుకో ఒకదారి 
శ్రమించు కడసారి
ఉండటమో పోవటమో 
తేలాలీసారి ....
read more " రెండు దారులు "

21, జులై 2015, మంగళవారం

గురువుగారు సింహరాశి ప్రవేశం - ఫలితాలు

ఈ నెల 14 న గురువు కర్కాటకరాశిని వదలి సింహరాశి లోకి ప్రవేశించాడు. అప్పటినుంచే మనకు గోదావరి పుష్కరాలు మొదలయ్యాయి.

ఈ రాశిలో ఆయన ఒక ఏడాది పాటు సంచరిస్తాడు.ఈ ఏడాదిలో పన్నెండు లగ్నాలు/రాశుల వారికి ఏయే ఫలితాలు ఉంటాయో చూద్దాం.ఈ ఫలితాలను లగ్నం మరియు చంద్రరాశి నుంచి కలిపి చూచుకోవాలి.

మేషరాశి
ఉత్సాహం ఉరకలెత్తుతుంది.అన్నింటా ఆశావహులై ఉంటారు.మనస్సు చురుకుగా పనిచేస్తుంది.అదృష్టం కలసివస్తుంది.ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

వృషభరాశి
ఇంటిలో చికాకులు పెరుగుతాయి.లీగల్ విషయాలు కోర్టుపనులు కలసి వస్తాయి.విదేశాలలో విద్య ఫలిస్తుంది.వృత్తిలో పురోగతి ఉంటుంది.ప్రమోషన్లు వస్తాయి.వాహనయోగం కలుగుతుంది.

మిధునరాశి
ధైర్యం పెరుగుతుంది.సమాజంతో సంబంధాలు మెరుగౌతాయి.వృత్తి ఉద్యోగాలలో పురోగతి కనబడుతుంది.కనిష్ట సోదరులకు కష్టకాలం.దగ్గర ప్రయాణాలు చేస్తారు.

కర్కాటక రాశి
మాట దురుసువల్ల గొడవలు జరుగుతాయి.విదేశాలనుంచి ధనలాభం ఉంటుంది.సమాజంలో మాట చెలామణీ అవుతుంది.ధనప్రాప్తి కలుగుతుంది. కంటి జబ్బులు కలుగుతాయి.

సింహరాశి
అన్నింటా వెలుగు రేఖలు కనిపిస్తాయి.ఉత్సాహం ఉరకలేస్తుంది.విజయాలు సాధిస్తారు.ధైర్యంగా ముందుకు దూసుకుపోతారు.

కన్యారాశి
అనుకోని ఖర్చులు ఎక్కువౌతాయి.ఆస్పత్రికీ రోగాలకూ ఖర్చు చెయ్యవలసి వస్తుంది.ఉన్న చోటిని వదలి ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది.దీర్ఘరోగాలు ఎక్కువౌతాయి.

తులారాశి
అన్నింటా లాభాలు చవిచూస్తారు.గురుకటాక్షం కలుగుతుంది.స్నేహితులు సహాయపడతారు.జ్యేష్ట సోదరులకు మంచికాలం మొదలౌతుంది.

వృశ్చికరాశి
జీవితంలో వెలుగు కనిపిస్తుంది.వృత్తి ఉద్యోగాలలో పురోగతి ఉంటుంది. ఇన్నాళ్ళూ ఖాళీగా ఉన్నవారు వృత్తిపరంగా ఎదుగుతారు.జీవితంలో ఎదగడానికి కొత్తకొత్త ప్లాన్లు వేస్తారు.కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

ధనూరాశి
ఆధ్యాత్మికచింతన పెరుగుతుంది.కుటుంబంలో పెద్దలు గతిస్తారు.విదేశీ ప్రయాణాలు ఉంటాయి.ధనలాభం కలుగుతుంది.యాత్రలు చేస్తారు.

మకరరాశి
అధికారులతో విరోధాలు కలుగుతాయి.డబ్బు చేతిలో నిలవదు.మార్మిక విషయాలలో ఆసక్తి పెరుగుతుంది.

కుంభరాశి
కార్యశీలత పెరుగుతుంది.వ్యాపారాలు ప్రారంభిస్తారు.లోకానికి ఏదో చెయ్యాలన్న తపన ఎక్కువౌతుంది.సమాజంతో సంబంధాలు పెరుగుతాయి.

మీనరాశి
నిరుద్యోగులు ఉద్యోగులౌతారు.అజీర్ణ రోగాలు బాధిస్తాయి.శత్రుబాధ ఎక్కువౌతుంది.వృత్తిపరంగా త్రిప్పట విసుగు చికాకు ఎక్కువౌతాయి.

ఈ గోచారంలో గురువుగారు రాశిసంధిని నక్షత్రసంధిని దాటి ప్రస్తుతం కేతు నక్షత్రంలో సంచరిస్తున్నాడు గనుక చాలామందికి మానసిక చికాకులు, ఉద్యోగంలో చికాకులు,కుటుంబంలో కలహాలు,పెద్దలతో పడకపోవడం,జీర్ణకోశ బాధలు ఎక్కువకావడం మొదలైనవి ఉంటాయి.

వ్యక్తిగత జాతకరీత్యా ఆయా పరిహారాలు చెయ్యడం వలన ఆయా చెడు ఫలితాలనుంచి తప్పుకోవచ్చు.
read more " గురువుగారు సింహరాశి ప్రవేశం - ఫలితాలు "

20, జులై 2015, సోమవారం

నాసిక్ త్రయంబకం నుంచి మా ఇంటికొచ్చిన గోదావరి మాత

సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత పనులు ముగించుకుని,ధ్యానంలో కొంతసేపు ఉండి లేచే సమయంలో కాలింగ్ బెల్ మ్రోగింది.

ఇంత రాత్రి సమయంలో ఎవరబ్బా? అని తేరి చూచేలోపు 'అన్నగారు నమస్తే' అంటూ చరణ్ లోపలికి వస్తూ కనిపించాడు.

'రా తమ్ముడూ' అంటూ ఆహ్వానించాను.

మంచినీళ్ళు త్రాగి ప్రశాంతంగా కాసేపు కూర్చున్న తర్వాత -'అన్నగారు ఇవి స్వీకరించండి' అంటూ సంచిలోనుంచి ఒక్కొక్క వస్తువూ తీసి దోసిలితో జాగ్రత్తగా నా ముందు ఉంచాడు. అవి -- ఒక సీసాలో నీళ్ళు, ఒక ప్లాస్టిక్ కవర్లో ప్రసాదం, ఒక దానిమ్మకాయ.

'ఏంటి తమ్ముడూ ఇవి?' అని అడిగేలోపు తనే --' అన్నగారు. గోదావరి జలం-త్రయంబకేశ్వరుని ప్రసాదం-షిర్డీ సాయిబాబా ప్రసాదం.' అన్నాడు.

ఈ లోపు మా శ్రీమతి అందుకుని -'రాజమండ్రి నుంచి వస్తున్నావా?' అన్నది.

'అబ్బే.రాజమండ్రి మనకెందుకు వదినగారు? సరాసరి నాసిక్ త్రయంబకం లోని 'రాంకుండ్' నుంచి  గోదావరిని తెచ్చా.' అన్నాడు నవ్వుతూ.

'ఎప్పుడు వెళ్ళావు తమ్ముడూ?'అడిగాను.

'అనిపించింది.వెళ్లి వచ్చానన్నగారు.అంతే.' అన్నాడు కూచుంటూ.

'ఎలా ఉంది అక్కడ?' అడిగాను.

'ఏం చెప్పమంటారు అన్నగారు?నాసిక్ ముందు అసలు మన రాజమండ్రి ఏం ఆగుతుంది?నాసిక్ దగ్గర నాలుగు రహదారుల రోడ్లమీద 26 కిలోమీటర్ల పొడవున ట్రాఫిక్ జాం అయిపొయింది.దాదాపు 10,000 కార్లు అలా పడేసి ఉన్నాయ్.26 కిలోమీటర్లు నడకే.'--అన్నాడు.

'అలాగా' అన్నా.

'అవునన్నగారు.అసలు మహారాష్ట్రా వాళ్ళ భక్తిభావం ముందు మనవాళ్ళ కాకిగోల చాలా అసహ్యంగా అనిపిస్తున్నది.మనంత గోలగా అక్కడ లేదు. త్రయంబకంలో అయితే 200 రూపాయల క్యూనే మూడు కిలోమీటర్ల పొడవున ఉన్నది.కానీ తోపులాట లేదు.ఇక మామూలు దర్శనం సంగతి చెప్పనక్కరలేదు.అదెక్కడ మొదలైందో కూడా అంతు తెలియనంత పొడవున ఉన్నది.మేమక్కడకు వెళ్లినప్పుడు వెస్టర్న్ ఘాట్స్ అంతా మబ్బులు పట్టి సన్నగా చినుకులు పడుతూ చాలా ఆహ్లాదంగా ఉన్నది.అక్కడ మన తెలంగాణా వాళ్ళే పురోహితులు దొరికారు.చక్కగా అన్నీ చేసుకుని వచ్చాము.అక్కడ నుంచి షిరిడీ వచ్చి బాబా దర్శనం చేసుకుని గుంటూరు వచ్చేశాము.చూచారా? మీరు గోదావరి దగ్గరకు రాకపోయినా తనే మీ దగ్గరకు వచ్చింది నాసిక్ నుంచి?' అన్నాడు.

'నాసిక్ లో ఏ ఘాట్ నుంచి తెచ్చావు?'అడిగాను.

'రాం కుండ్' అని అక్కడ ఉన్నది అన్నగారు.అక్కడే రాములవారు ఉన్న సమయంలో ఆయనకు దశరధుని మరణవార్త తెలుస్తుంది.ఈ తీర్ధంలోనే ఆయన తన తండ్రికి పితృతర్పణం గావించారు.ఆ తీర్ధంలోని నీళ్ళే ఇవి.' అన్నాడు.

'నాగమహాశయుని జీవితంలో కూడా ఇలాంటి సంఘటన జరిగింది తమ్ముడూ' అన్నాను.

'ఏంటది అన్నగారు?మీరు నాకు ఆ పుస్తకం ఇచ్చారు.అమ్మో?ఏం జీవితం అన్నగారు ఆయనది?' అన్నాడు.

'అవును తమ్ముడూ.ఆయన శ్రీరామకృష్ణుల గృహస్థభక్తుడు.భగవాన్ ఆయనతో ఇలా అన్నారు.'నువ్వు నీ ఇంటిలో కదలకుండా ఉండు. మహనీయులు నిన్ను వెదుక్కుంటూ నీ దగ్గరకే వస్తారు.అన్నీ నీ దగ్గరకే వస్తాయి.'ఆ మాటను పట్టుకుని,ఆయన జీవితమంతా ఏ యాత్రకూ వెళ్ళకుండా ఇంటిలోనే ఉన్నాడు.మహనీయులు ఆయన దగ్గరకే వచ్చారు. చివరకు గంగామాత కూడా ఆయన ఇంటికే వచ్చింది.నీకొక సంగతి చెప్పనా చరణ్? నందానందస్వామి నాతో సరిగ్గా ఇదే మాట అన్నారు.ఆ విషయం మన 'శ్రీవిద్యా రహస్యం'లో వ్రాశాను కూడా.చదివావా?' అడిగాను.

'చదివానేమో గుర్తులేదన్నగారు.నాగమహాశయుని జీవితంలో ఈ సంఘటన ఎలా జరిగింది?' అడిగాడు చరణ్.

'నాగమహాశయుని తండ్రి అవసాన దశలో మంచంలో ఉన్నాడు.ఆ సమయంలో గంగానదికి పుష్కరాలు వచ్చాయి.వాటిలో స్నానం చెయ్యాలని ఆ ముసలి తండ్రి కోరిక.కానీ గంగానదికి వెళ్ళాలంటే చాలా మైళ్ళు ప్రయాణం చెయ్యాలి.ఆ స్థితిలో అది సాధ్యం కాదు.అందుకని తండ్రి మాటమాటకీ అడిగినా కూడా నాగమహాశయుడు మౌనంగా ఉండిపోయాడు.తండ్రికి కోపం వచ్చి 'ఈ చివరి కోరికను కూడా తీర్చని నువ్వేం కొడుకువి?' అని తిడతాడు కూడా.దానికీ నాగమహాశయుడు చలించడు.

ఇలా ఉండగా ఒకరోజున వాళ్ళ ఆవరణలో ఒక మూలగా నీటి ఊట రావడం మొదలై, మహా ప్రవాహంగా మారి ఆవరణ అంతా నీరు నిండిపోయి చివరకు ఇంటిలోకి కూడా ఆ నీరు వచ్చేస్తుంది.తండ్రిగారు పడుకుని ఉన్న మంచం వరకూ ఆ నీరు వస్తుంది.అప్పుడు నాగమహాశయుడు ఆనందంతో నృత్యం చేస్తూ -' అమ్మా గంగామాతా ! నువ్వే వచ్చావా? గురుదేవా? నీ అనుగ్రహం ఎంత గొప్పది? నా తండ్రి చివరి కోరికను ఇలా తీర్చావా?' అంటూ ఆ నీటితో తండ్రిని స్నానం చేయిస్తాడు.ఆ తర్వాత ఆ జల అంతా ఇంకిపోవడం మొదలు పెట్టి ఒక పూటలో మళ్ళీ నీరంతా భూమిలోకి వెళ్ళిపోతుంది.భగవాన్ లీలలు అలా అత్యంత సహజంగా అనూహ్యంగా ఉంటాయి.ఇది జరిగిన సంఘటనే. నీకిచ్చిన పుస్తకంలో ఉంది చదువు.' అన్నాను.

'ఏం జీవితాలు అన్నగారు వాళ్ళవి?'- అన్నాడు చరణ్ తన్మయత్వంతో.

'అవును తమ్ముడూ.నాగమహాశయుడు సామాన్యుడు కాదు.సాక్షాత్తూ వివేకానందస్వామే ఆయన పాదాలకు నమస్కరించాడంటే ఆయన స్థితి ఏమిటో ఊహించుకో.ఆయన పేరు దుర్గాచరణ్ నాగ్.నీ పేరు దుర్గాశంకర చరణ్.అంతే తేడా.'-అన్నాను నవ్వుతూ.

'అవునన్నగారు.మా నాన్నగారు కాళీభక్తుడు.1963 లో ఆయన దక్షినేశ్వర్ వెళ్లివచ్చాడు.ఆ తర్వాతే నేను పుట్టాను.అందుకే పేరు అలా పెట్టాడు.' అన్నాడు చరణ్.

'ఇంకొక విషయం విను.నాగమహాశయుడు హోమియో డాక్టరు.భారతదేశంలో హోమియో పతీ వైద్యపు పయనీర్లైన రాజేంద్రలాల్ దత్తా మొదలైన ఉద్దండుల వద్ద ఆయన హోమియో వైద్యం నేర్చుకున్నాడు.కానీ ఒకరోజున భగవాన్ ఎవరితోనో అన్న మాటలు ఆయన విన్నాడు.

భగవాన్ ఒకరోజున ఇలా అన్నారు.'లాయర్లకూ వైద్యులకూ భగవంతుని దర్శనం కలగడం అసంభవం.అది జరిగే పనికాదు.'

ఎందుకంటే ఈ ఇద్దరి మనస్సులు ఎంతసేపూ మోసంతో నిండి ఉంటాయి. డబ్బు మీద ఆశతో ఉంటాయి.అందుకని అలాంటివారికి భగవంతుని దర్శనం ఎలా దక్కుతుంది?అందుకే భగవాన్ ఈ మాటను అన్నారు.ఆయన సరాసరి నాగమహాశయునితో ఈ మాటను అనలేదు.ఒక రోజున భక్తులతో అంటుండగా ఈయన విన్నాడు.

వెంటనే ఇంటికెళ్ళి తన హోమియో పుస్తకాలూ మందుల పెట్టెలూ అన్నీ మూటగట్టి గంగలో పారవేశాడు.ఆ తర్వాత మళ్ళీ వాటివైపు చూడలేదు.

'మరి జీవనం ఎలా అన్నగారు?' అడిగాడు చరణ్.

'నాకేది అవసరమో అది గురుదేవులు ఇస్తారు' అనేవాడాయన.అంతే.అదొక అచంచలమైన నమ్మకం.

'తన జీవితమంతా దుర్భరమైన పేదరికంలో గడిపినా సరే, చినిగిన బట్టలు కట్టుకుని, పైన తాటాకులు కూడా సరిగ్గా లేని ఒక పూరిపాకలో ఉంటూ, గాలివాన వచ్చినపుడు ఆ తాటాకులు కూడా ఎగిరిపోయి ఆ వానలో అలా వణుకుతూ ఆ గుడిసెలో రాత్రంతా ఉండవలసి వచ్చినా సరే, మళ్ళీ ఆయన తనకు జీవనోపాధిని ఇస్తున్న ఆ వైద్యం వైపు కన్నెత్తి కూడా చూడలేదు. గురుదేవులు ఒక మాట అన్నారు.దానిని తను ఆచరించాలి.అంతే.తన జీవితం ఏమైపోయినా పరవాలేదు.అదొక్కటే ఆయన ఆలోచన.'-- అన్నాను.

చరణ్ కాసేపు దిమ్మెరపోయి అలా ఉండిపోయాడు.

చివరకు తేరుకుని -'ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అన్నగారు?' అడిగాడు.

'ఉంటారా ఏమిటి? ఉన్నారు.శ్రీరామకృష్ణుల గృహస్థభక్తులు అందరూ ఇలాంటి ఆణిముత్యాలే.ఒక్కొక్కరిది ఒక్కొక్క ఉజ్జ్వలమైన జీవితం.అదిసరేలే గాని పక్కనే రాజమండ్రిలో గోదావరిని పెట్టుకుని అంతదూరం వెళ్లాలని అసలు నీకెందుకనిపించింది?' అడిగాను.

'ఏమో తెలీదన్నగారు.అనిపించింది పోయొచ్చాను.మీకు ఇవ్వాలనిపించింది తెచ్చి ఇస్తున్నాను.ఎందుకో నాకే తెలీదు.' అన్నాడు.

ఆ తర్వాత కొన్ని వ్యక్తిగత విషయాలు మాట్లాడి చరణ్ సెలవు తీసుకున్నాడు.

ఆ విధంగా నాసిక్ త్రయంబకం నుంఛి గోదావరిమాత ఈ సోమవారం రోజున సరాసరి మా ఇంటికొచ్చింది.

'భక్తుడు మరచిపోయినా భగవంతుడు మరచిపోడు'-- అంటే ఇదేనేమో?
read more " నాసిక్ త్రయంబకం నుంచి మా ఇంటికొచ్చిన గోదావరి మాత "

19, జులై 2015, ఆదివారం

హైదరాబాద్ లో జరిగిన యోగా రిట్రీట్ ఫోటోలు

'ఆరోగ్యమే మహాభాగ్యం'- అనే సూక్తి అందరికీ తెలిసినదే.జీవితంలో అన్ని ముఖ్యమైన విలువైన విషయాలలాగే ఆరోగ్యం విలువ కూడా అది చేజారిపోయిన తర్వాతే తెలుస్తుంది.ఉన్నంతవరకూ దాని విలువ తెలియదు. ఒకసారి పోయిన తర్వాత దానిని తిరిగి సంపాదించడం చాలా కష్టం. ఆరోగ్యం సరిగా లేకుంటే,మామూలు పనులే సరిగ్గా చేసుకోలేము ఇక ఆధ్యాత్మిక సాధన సంగతి చెప్పనే అక్కర్లేదు.శరీరం సహకరించకపోతే సాధన ఏమాత్రమూ చెయ్యలేము.

నేను సూచించే సాధనామార్గంలో శరీరాన్ని ఫిట్ గా ఉంచుకోవలసి ఉంటుంది. అందుకే నేను రాజయోగానికీ కుండలినీయోగానికీ ఎంత ప్రాధాన్యం ఇస్తానో హఠయోగానికి కూడా అంతే ప్రాధాన్యం ఇస్తాను.కనుక,నేను నిర్దేశించే సాధనాపధంలో నడవాలనుకునేవారికి కొన్ని ప్రత్యేకమైన ఆసనాలు, ముద్రలు,క్రియలు,ప్రాణాయామ విధానాలు నేర్పిస్తాను.

ఈ క్రమంలో - పంచవటి సభ్యులకోసం హైదరాబాద్ లో ఇందిరా పార్క్ లో జరిగిన యోగా రిట్రీట్ నుంచి కొన్ని ఫోటోలు ఇక్కడ చూడవచ్చు.

మేము అక్కడ యోగా చేస్తున్న విధానం అక్కడకు రెగ్యులర్ గా వస్తున్న చాలామందిని ఆకర్షించింది.వారిలో కొందరు 'మేమూ మీతో చేరవచ్చా? నేర్చుకోవచ్చా? ఫీజెంత?' అని అడిగారు.

'ఫీజు తీసుకోము.ఉండేది ఇక్కడ కాదు.గుంటూరులో.' అని జవాబు చెప్పాము.

'యోగా నేర్పించడానికి గుంటూరు నుంచి ఇంతదూరం వచ్చారా?ఫీజు తీసుకోరా?' అని వాళ్ళు ఆశ్చర్యపోయారు.

'మీరు తరచుగా హైదరాబాద్ వచ్చి ఇలా ఓపన్ గా ఇంత మంచి క్లాస్ తీసుకుంటే ఇక్కడ రోజూ క్లాసులు చెప్పేవాళ్ళు ఇబ్బంది పడతారు.మీరు చేయిస్తున్న విధానం చాలా బాగుంది. మీరు చేయించిన ఆసనాలలో కనీసం పావు వంతుకూడా ఇక్కడ చేయించడం లేదు.' అంటూ పంచవటి ట్రస్ట్ పీఆర్వో రాజూ సైకం చేసిన వ్యాఖ్య నాకు సంతోషాన్ని కలిగించడమే గాక నాకు పెద్ద కాంప్లిమెంట్ గా మిగిలింది.

నాకు మార్షల్ ఆర్ట్స్ లోనూ యోగాలోనూ కూడా సమానమైన అనుభవం ఉండటంతో రెంటిలోని టెక్నిక్స్ ను కలగలిపి 'ఫుల్ బాడీ వర్కౌట్' ఎలా చేయించాలో తెలుసు.నేను నేర్పే వర్కౌట్ గనుక ఒక నెలరోజులు ప్రతిరోజూ చేస్తే పర్ఫెక్ట్ ఫిట్నెస్ సొంతం కావడమే గాక బాడీలో ఉన్న కొవ్వు ఎక్కడికక్కడ కరిగిపోయి ఒళ్ళు జింకపిల్లలా తేలికైపోవడం ఖాయం.

ఈ విషయమే ఈ రిట్రీట్ కు హాజరైనవారికి వివరించి,క్రమం తప్పకుండా రోజూ ఈ యోగా సీక్వెన్స్ ను చెయ్యమని వారికి చెప్పాను.

















































































read more " హైదరాబాద్ లో జరిగిన యోగా రిట్రీట్ ఫోటోలు "