నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

28, జులై 2015, మంగళవారం

అబ్దుల్ కలాం జాతకం - కొన్ని విశేషాలు

ఉదయాన్నే ఒక మిత్రుడు ఫోన్ చేసి అడిగాడు.

'అబ్దుల్ కలాం పోయారు కదా. ఈరోజు ఆయన జాతకం నువ్వు వెయ్యబోతున్నావని నేను జోస్యం చెబుతున్నాను. ఇది ఖచ్చితంగా నిజం అవుతుంది చూడు'.

'సరే.నీ జోస్యం నిజమౌతుంది.ఇంత మంచి జోస్యం చెప్పినందుకు నీకు మంచి టీ పార్టీ ఇస్తాలే.' అన్నా నవ్వుతూ.

'అయినా నీకిదేం పని? ఎప్పుడూ పోయినవాళ్ళ జాతకాలు వేస్తుంటావ్?' అడిగాడు కొంచం అతిచనువుగా.

'మీలాంటి బ్రతికున్నవాళ్లకి గడ్డిపరక విలువ కూడా ఇవ్వకుండా పోయినవాళ్ళకే విలువ ఇస్తున్నానంటే నా దృష్టిలో మీ స్థాయి ఏమిటో ఇంకా అర్ధంకాలేదా? మీకంటే వాళ్ళే నయం అని నా అభిప్రాయం.వాళ్ళు మీలా అవాకులూ చవాకులూ వాగరు.Dead men never speak.అందుకే వాళ్ళ జాతకాలే నేను చూస్తా.' -నేనూ నవ్వుతూనే అంటించా.

'సరే ఉంటా మరి' అని వాడు ఫోన్ పెట్టేశాడు.

అబ్దుల్ కలాం గారిది విలక్షణమైన వ్యక్తిత్వం అనే విషయం అందరికీ తెలిసినదే.మీడియాలో అవన్నీ వస్తూనే ఉన్నాయి.తెలిసిన విషయాలనే మళ్ళీ ఊదరగొట్టడం నాకిష్టం లేదు.కొన్ని జ్యోతిశ్శాస్త్ర కోణాలను మాత్రం ఈ వ్యాసంలో స్పర్శిస్తాను.

కలాం గారు 15-10-1931 న తమిళనాడు రామేశ్వరంలో జన్మించాడు.పుట్టిన సమయం 11.30 అనీ 13.30 అనీ రెండు సమయాలు దొరుకుతున్నాయి. వాటిలో ఏది సరియైనదో మనకు తెలియదు.అందుకని విశ్లేషణలోకి లోతుగా పోవడం లేదు.

గురువు ఉచ్ఛస్థితిలో ఉండటం ఈ జాతకంలో ఒక మంచియోగం.అందుకే చిన్నప్పటినుంచీ సద్బ్రాహ్మణులతో సదాచారపరులతో స్నేహం ఈయనకు ఉన్నది.వారినుంచి ఈయన ఎంతో నేర్చుకున్నాడు.

లగ్నం కరెక్టే అనుకుందాం కాసేపు.దశమంలో ఉన్న బుధాదిత్యయోగం వల్ల విద్యారంగంలో రాణించడం,సంగీత సాహిత్యాలలో ప్రవేశం కలిగాయి.లగ్నంలో శనివల్ల పరిశోధనారంగంలో అభిరుచీ,పరిశ్రమా కలిగాయి.

సూర్యబుధుల పైన గురుదృష్టి వల్ల ఆయా బుధాదిత్యరంగాలలో గుర్తింపు లభించింది. నీచభంగరాజయోగం పట్టిన చంద్రునిపైన ఉన్న గురుదృష్టి ఆధ్యాత్మిక చింతనను ఇచ్చింది.

ప్రస్తుతం గోచార గ్రహాలకూ జనన గ్రహాలకూ సంబంధం గమనిద్దాం.

>>గోచార ఛాయాగ్రహాలు జననకాల స్థితికి పూర్తి వ్యతిరేక స్థితి.
>>గోచారశని, జననకాల చంద్రునిపై సంచారం.చంద్రుడు రక్తప్రసరణకు కారకుడని మనకు తెలుసు.హార్ట్ ఎటాక్ వచ్చినపుడు గుండెకు రక్తసరఫరా సరిగా జరగదు.దానివల్ల మరణం సంభవిస్తుంది.

శుక్ల ఏకాదశి రోజు పోవడం ఈయన పుణ్యాత్ముడని సూచిస్తోంది.

కలాంగారు ఇంద్రుడు చంద్రుడు మహనీయుడు అని పొగుడుతున్న వాళ్ళంతా ఆ గుణగణాలలో కొన్నైనా వారివారి రోజువారీ జీవితాలలో ఆచరించే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. లేకుంటే ఈ పొగడ్తలన్నీ దయ్యాలు వేదాలు వల్లించినట్లు తప్ప ఇంకే రకంగానూ ఉపయోగపడవు.

ఎవరినైనా ఉన్నన్నాళ్ళు తమ స్వార్ధానికి వాడుకోవడం,పోయినతర్వాత కులాసాగా వారిని మర్చిపోవడం మనకు అలవాటేగా??