“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

22, జులై 2015, బుధవారం

రెండు దారులు












సాగే స్వేచ్చ కోసం ఆరాటం
లాగే బంధాలతో పోరాటం
బరువు బాధ్యతల మోమాటం 
ఇదేగా జీవితం 

పట్టెడు మెతుకులకోసం 
పరుగులు
గుప్పెడు మనసు చేసే 
మరుగులు

ఆరని ఆశలు, తీరని కోరికలు
మారని మనసులు, పారని ఎత్తులు
ఆగని పయనం, చేరని గమ్యం
ఇదేగా జీవితం...

ఈ ఎడారి పయనంలో
నీ గమ్యం 
ఒక లేని ఒయాసిస్సు

నీ దాహం 
ఎన్నటికీ తీరేది కాదు
వ్యామోహం 
ఎప్పటికీ పోయేది కాదు

దేనికోసం నీ పరుగు
ఆగి ఆలోచించొకసారి 
దేనికోసం నీ నిరీక్షణ
తరచి అవలోకించొకసారి

నువ్వు వెతికేది నీ ఎదురుగా ఉన్నా
గుర్తించలేని బ్రతుకేగా నీది
నువ్వు కోరేది నీ వడిలో ఉన్నా
తెలుసుకోలేని మరుపేగా నీది

ఎవరికోసం నువ్వు జన్మజన్మలుగా
ఎదురు చూస్తున్నావో
ఆ ప్రియుడు  
ఈ క్షణం నీ తలుపు తడుతున్నా
గుర్తించలేక పిచ్చిదానిలా   
ఎక్కడో చూస్తున్నావు

ఎన్నిసార్లు వేశావీ వేషం
ఎన్నిసార్లు ఆడావీ నాటకం
ఎందుకింత మరుపు నీకు?
ఇక చాలించు నేస్తం
వదలిపెట్టు సమస్తం

నీ ముందున్నవి రెండే దారులు
నీ ప్రియునిలో నీవైనా కరగాలి
లేదా - అతడే నీలో కలవాలి 
నీవో అతడో ఒకరే మిగలాలి

ఎంచుకో ఒకదారి 
శ్రమించు కడసారి
ఉండటమో పోవటమో 
తేలాలీసారి ....