నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

19, జులై 2015, ఆదివారం

హైదరాబాద్ లో జరిగిన యోగా రిట్రీట్ ఫోటోలు

'ఆరోగ్యమే మహాభాగ్యం'- అనే సూక్తి అందరికీ తెలిసినదే.జీవితంలో అన్ని ముఖ్యమైన విలువైన విషయాలలాగే ఆరోగ్యం విలువ కూడా అది చేజారిపోయిన తర్వాతే తెలుస్తుంది.ఉన్నంతవరకూ దాని విలువ తెలియదు. ఒకసారి పోయిన తర్వాత దానిని తిరిగి సంపాదించడం చాలా కష్టం. ఆరోగ్యం సరిగా లేకుంటే,మామూలు పనులే సరిగ్గా చేసుకోలేము ఇక ఆధ్యాత్మిక సాధన సంగతి చెప్పనే అక్కర్లేదు.శరీరం సహకరించకపోతే సాధన ఏమాత్రమూ చెయ్యలేము.

నేను సూచించే సాధనామార్గంలో శరీరాన్ని ఫిట్ గా ఉంచుకోవలసి ఉంటుంది. అందుకే నేను రాజయోగానికీ కుండలినీయోగానికీ ఎంత ప్రాధాన్యం ఇస్తానో హఠయోగానికి కూడా అంతే ప్రాధాన్యం ఇస్తాను.కనుక,నేను నిర్దేశించే సాధనాపధంలో నడవాలనుకునేవారికి కొన్ని ప్రత్యేకమైన ఆసనాలు, ముద్రలు,క్రియలు,ప్రాణాయామ విధానాలు నేర్పిస్తాను.

ఈ క్రమంలో - పంచవటి సభ్యులకోసం హైదరాబాద్ లో ఇందిరా పార్క్ లో జరిగిన యోగా రిట్రీట్ నుంచి కొన్ని ఫోటోలు ఇక్కడ చూడవచ్చు.

మేము అక్కడ యోగా చేస్తున్న విధానం అక్కడకు రెగ్యులర్ గా వస్తున్న చాలామందిని ఆకర్షించింది.వారిలో కొందరు 'మేమూ మీతో చేరవచ్చా? నేర్చుకోవచ్చా? ఫీజెంత?' అని అడిగారు.

'ఫీజు తీసుకోము.ఉండేది ఇక్కడ కాదు.గుంటూరులో.' అని జవాబు చెప్పాము.

'యోగా నేర్పించడానికి గుంటూరు నుంచి ఇంతదూరం వచ్చారా?ఫీజు తీసుకోరా?' అని వాళ్ళు ఆశ్చర్యపోయారు.

'మీరు తరచుగా హైదరాబాద్ వచ్చి ఇలా ఓపన్ గా ఇంత మంచి క్లాస్ తీసుకుంటే ఇక్కడ రోజూ క్లాసులు చెప్పేవాళ్ళు ఇబ్బంది పడతారు.మీరు చేయిస్తున్న విధానం చాలా బాగుంది. మీరు చేయించిన ఆసనాలలో కనీసం పావు వంతుకూడా ఇక్కడ చేయించడం లేదు.' అంటూ పంచవటి ట్రస్ట్ పీఆర్వో రాజూ సైకం చేసిన వ్యాఖ్య నాకు సంతోషాన్ని కలిగించడమే గాక నాకు పెద్ద కాంప్లిమెంట్ గా మిగిలింది.

నాకు మార్షల్ ఆర్ట్స్ లోనూ యోగాలోనూ కూడా సమానమైన అనుభవం ఉండటంతో రెంటిలోని టెక్నిక్స్ ను కలగలిపి 'ఫుల్ బాడీ వర్కౌట్' ఎలా చేయించాలో తెలుసు.నేను నేర్పే వర్కౌట్ గనుక ఒక నెలరోజులు ప్రతిరోజూ చేస్తే పర్ఫెక్ట్ ఫిట్నెస్ సొంతం కావడమే గాక బాడీలో ఉన్న కొవ్వు ఎక్కడికక్కడ కరిగిపోయి ఒళ్ళు జింకపిల్లలా తేలికైపోవడం ఖాయం.

ఈ విషయమే ఈ రిట్రీట్ కు హాజరైనవారికి వివరించి,క్రమం తప్పకుండా రోజూ ఈ యోగా సీక్వెన్స్ ను చెయ్యమని వారికి చెప్పాను.