నిజమైన అదృష్టవంతులు మాత్రమే మాతో చేయి కలుపుతారు

23, జులై 2015, గురువారం

తిరుగలి రాళ్ళునీవన్నది ఒక మాయ
నేనన్నది పెనుమాయ
నిన్నూ నన్నూ దాటిన
నువ్వేగా నిత్యసత్యం?

నీవూ నేనుల చెలిమిలో
సాగే మనిషి జీవితం
చావూ బ్రతుకుల కొలిమిలో
కాగే నిత్య నాటకం

భూమ్యాకాశాలనే
తిరుగలి రాళ్ళ మధ్య నలిగి
పిండి అవుతోంది జీవితం

నువ్వూ నేననే
గానుగ చట్రంలో నలిగి
జావగారుతోంది జీవితం

పగలూ రాత్రుల
పాదయాత్రలో అరిగి
పగులువారుతోంది జీవితం

భూమినీ ఆకాశాన్నీ దాటినదే
నీ దారి
గానుగనీ ఎద్దులనీ ఆపిచూడు
ఒకసారి

పగలూ రాత్రీ దాటి
పరవశించు ఒకసారి
నిన్నూ తననూ మరచి
నీలో మునుగు ఒకసారి

చెయ్యకపోతే ఈ పని
చెదిరిపోదు నీ భయం
చెందకపోతే దీనిని
తెరుచుకోదు ఆలయం

ఆగలేని యాత్రధారికి
విశ్రాంతిపై ఆశెందుకు?
లీనమైన పాత్రధారికి
విషాదమంటే భయమెందుకు?