16, మార్చి 2014, ఆదివారం

మలేషియా విమానం ఏమైంది?

పిబ్రవరి మార్చ్ నెలల జాతకాలు వేసినప్పుడు వాహన ప్రమాదాల గురించి యాక్సిడెంట్ల గురించీ, జననష్టం గురించీ ప్రస్తావించాను. అవి ఊహించినట్లే జరుగుతూ ఉండటం గమనించవచ్చు. జరుగుతున్న సంఘటనలను కనెక్ట్ చేసుకుని చూస్తే విషయాలు అర్ధమౌతాయి.

పోయిన శనివారం నాడు అదృశ్యమైన మలేషియా విమానం ఏమైందో ప్రశ్న ద్వారా చూద్దాం.అది ఆరోజున (అంటే మార్చ్ 8 న) 1.22 గంటలకు చివరిసారిగా ఫ్లైట్ కంట్రోల్ కు అందుబాటులో ఉన్నది.తర్వాత ఏమైందో తెలియదు.

దీనిగురించి చెప్పమని పంచవటి సభ్యుడు ఒకాయన పంపిన మెయిల్ ఈరోజు చూచాను.ఈరోజు ఉదయం 7.34 కి ప్రశ్న చక్రం వేసి పరిశీలించడం జరిగింది.దీనిని కొంత విశ్లేషణ చేద్దాం.

మీనలగ్నం సూర్యసహితమై ఉదయిస్తున్నది.జలతత్వ లగ్నం గనుక విమానం నీటిలో ఉన్నట్లు తెలుస్తున్నది.సూర్యుడు షష్టాదిపతి గనుక శత్రువుల కుట్రవల్ల ఈ ప్రమాదం సంభవించిందని సూచన ఉన్నది.

లగ్నంలో ఉన్న యురేనస్ లగ్నాధిపతి అయిన గురువుతో ఖచ్చితమైన కేంద్రదృష్టిలో ఉండటం వల్ల,అకస్మాత్తుగా జరిగిన ప్రమాదం కారణంగా విమానం దారితప్పి కూలిపోయిందని తెలుస్తున్నది.అష్టమాదిపతి అయిన శుక్రునితో యురేనస్ అర్ధకోణదృష్టి గమనార్హం.ఇదికూడా ఇదే ఫలితాన్ని సూచిస్తున్నది.

లగ్నాధిపతి గురువు చతుర్దంలో ఉండటంవల్ల విమానం పాతాళంలో(అంటే నీటి అడుగున) ఉన్నదని తెలుస్తున్నది.చతుర్దానికి పాతాళం అని జ్యోతిష్య శాస్త్రంలో పేరున్నది.

అష్టమంలోని మూడు గ్రహాల(శని,రాహు,కుజ)కూటమి వల్ల ఘోరప్రమాదం జరిగిందని సర్వనాశనం అయిందని తెలుస్తున్నది.రాహువు,శని,కుజుడూ కలసినప్పుడు ఘోరమైన ప్రమాదాలు జరుగుతాయని ఎంతోముందే హెచ్చరించాను.ఈ విషయం నేనేకాదు ప్రపంచం మొత్తంమీద ఎందఱో జ్యోతిష్కులు గమనించి ముందే హెచ్చరించారు.ఈ గ్రహకూటమి ఫలితంగా ప్రతిరోజూ ఎన్నో ప్రమాదాలు జరుగుతూ ఉండటం నేడు మనం కళ్ళారా చూస్తున్నాం.దానిలో ఒకటే ఈవిమాన ప్రమాదం కూడా.

అయితే ఈ విమానం ప్రస్తుతం ఎక్కడున్నది అనేదే అసలైన ప్రశ్న.

ఈ చక్రంవరకూ మిధునం ఉత్తరదిక్కును సూచిస్తున్నది.అలాగే పాపగ్రహ కూటమి ఉన్న తులారాశి కూడా ఉత్తరదిక్కును సూచిస్తున్నది.లగ్నాధిపతి గురువు ఈశాన్యదిక్కుకు అధిపతి.పై గ్రహసూచనలను బట్టి ఈ విమానం ప్రస్తుతం మనకు ఉత్తరఈశాన్యంలో సముద్రంలో పడిఉన్నదని నేను ఊహిస్తున్నాను.మనకు ఉత్తరఈశాన్యం అంటే కాంబోడియా, థాయిలాండ్, బర్మా,ఇండియాల మధ్యన ఉన్న సముద్రప్రాంతం.

విమాన సమాచారం లోకానికి ఎప్పుడు లభిస్తుంది?

ఈరోజు ప్రశ్నసమయానికి శుక్రనక్షత్రమూ శుక్రహోరా జరుగుతున్నాయి. శుక్రుడు ప్రశ్నలగ్నానికి లాభస్తానంలో ఉన్నాడు.కనుక సమాచారం లభిస్తుంది.

సమాచార వ్యవస్థకు కారకుడైన బుధుడు ఎల్లుండి అనగా మార్చ్ 18 న రాహువుతో ఖచ్చితమైన డిగ్రీ కోణదృష్టిలోకి వస్తాడు.కనుక విమానం ఎక్కడుందో అప్పుడు లోకానికి తెలుస్తుంది.
read more " మలేషియా విమానం ఏమైంది? "

15, మార్చి 2014, శనివారం

జనసేన పార్టీ జాతకచక్రం ఏమంటున్నది?



నిన్న 14-3-2014 రాత్రి 19-16 నిముషాలకు హైదరాబాద్ లో సినీనటుడు పవన్ కళ్యాణ్ తన జనసేన పార్టీని ప్రకటించాడు.ఆ సందర్భంగా పార్టీ భవిష్యత్తు ఎలా ఉంటుందో ఒకసారి పరికిద్దాం.

ముహూర్తాలు నిర్ణయించి అన్నీ మనమే నిర్దారించగలం అని చాలామంది అనుకుంటారు.ఇది తప్పు.భవిష్యత్తును మనం చేతిలోకి తీసుకోవడం సాధ్యం కాదు.మన ఇష్టం వచ్చినట్లుగా మన భవిష్యత్తును మార్చుకోవడం కర్మాతీతులైన మహర్షులకూ మహాయోగులకే సాధ్యమౌతుంది గాని మామూలు మనుషులకు సాధ్యం కాదు.మనుష్యులు ఎంతటివారైనా కర్మబద్దులే.

నిర్ణయింపబడిన ముహూర్తాన్ని కూడా పూర్వకర్మ తెలివిగా అతిక్రమిస్తుంది.ఆ రహస్యాలు ఏమిటో మామూలుగా ముహూర్తాలు పెట్టే సామాన్య జ్యోతిష్కులకూ పురోహితులకూ తెలియవు.అంతరిక యోగసాధనలో ఉన్నతస్తరాలు అందుకున్న వారికే ఆ విషయాలు అర్ధమౌతాయి.

ప్రస్తుతానికి వస్తే,లగ్నం ద్విస్వభావమైన కన్య అయింది.కనుక పార్టీ పరిస్తితి ఎప్పుడూ ఊగిసలాటగానే ఉంటుంది.గట్టి స్థిరత్వం ఉండకపోవచ్చు. లాభాదిపతి అయిన పూర్ణచంద్రుడు లగ్నానికి సపోర్ట్ గా ఉన్నప్పటికీ రెండింట ఉన్న పాపగ్రహ కూటమి వల్ల ఒక విషయం స్పష్టంగా కనిపిస్తున్నది.పవన్ కు ప్రజాభిమానం దండిగా ఉన్నప్పటికీ ఆయన్ను ముందుకు పోనివ్వకుండా ఆపేశక్తులు కూడా బలంగానే ఉంటాయన్న విషయం సుస్పష్టంగా కనిపిస్తున్నది.

మఖా నక్షత్రం నడుస్తున్నరోజున ఈ పార్టీ ప్రారంభం అయింది.కేతువు అష్టమంలో ఉన్నాడు.ఇది అంత మంచి శకునం కాదు.తన సిద్ధాంత ఔన్నత్యాలను అందుకోవడానికి ఈపార్టీ చాలా కష్టనష్టాలను చవిచూడవలసి ఉంటుంది.అంతేగాక ఈ పార్టీ ప్రారంభించడానికి ముందు పవన్ ఎంతో మానసిక సంఘర్షణను అనుభవించాడని కూడా ఈ యోగం సూచిస్తున్నది.

కుజహోరలో ఈ పార్టీ మొదలైంది.కుజుడు జ్ఞాతికారకుడుగా కుటుంబ స్థానంలో వక్రించి ఉన్నాడు.కనుక ఈ చర్యవల్ల పవన్ కు సొంత కుటుంబంలోనే వ్యతిరేకతా,శత్రుత్వమూ ఎదురయ్యే అవకాశాలు బలంగా ఉన్నాయి.

రెండింట ఉన్న శని రాహు కుజులవల్ల ఇతరపార్టీల సిద్ధాంతాలనూ ఆచరణలనూ తూర్పారబట్టే విధానం ఈ పార్టీలో కనిపిస్తుంది.పవన్ ఉపన్యాసంలోనే ఆ ధోరణి స్పష్టంగా కనిపించింది.ఇది వాక్స్తానంలో ఉన్న ఈ మూడుగ్రహాల ప్రభావమే.సిద్ధాంతాల పట్ల నిబద్ద్తతను శని ఇస్తే,ఎదుటివారి దాడిని తిప్పికొట్టడంలో రాహువూ కుజుడూ ప్రముఖపాత్ర పోషిస్తారు.

పంచమంలోని ధర్మస్థానాధిపతి శుక్రుడు ఈ పార్టీకి మంచి ఆలోచనలనూ నైతికతనూ ఆపాదిస్తాడు.ఉన్నతమైన సిద్ధాంతాలతో ఈపార్టీ ప్రారంభించ బడుతుంది.ఈరోజు శుక్రవారం కావడం వెనుకగల ప్రభావమూ, పవన్ ఉపన్యాసం కుల మత ప్రాంతీయ తత్వాలకు అతీతంగా సాగడంలోని గ్రహప్రభావమూ ఇదే.

ఇకపోతే,లగ్నాధిపతి బుధుడు ద్వాదశాదిపతి అయిన సూర్యునితో కలసి ఆరవ ఇంటిలో ఉండటం వల్ల తన సూటి విమర్శలతో ఇతర పార్టీల రహస్య శత్రుత్వాన్ని కొనితెచ్చుకుంటాడని సూచిస్తున్నది.నిన్న ఆయన వేదికమీదనుంచి చేసిన విమర్శలు ఎవరికైనా మింగుడు పడటం కష్టమే.కానీ అవన్నీ నిజాలే గనుక ఎవరూ ఏమీ జవాబు చెప్పలేని పరిస్త్తితి ఉన్నది. కుజబుధుల మధ్యన గల ఖచ్చితమైన కోణదృష్టి కూడా దీనినే సూచిస్తున్నది.చంద్ర రాహువుల మధ్య ఉన్న అర్ధకోణ దృష్టివల్ల రకరకాలైన భావాలతో పార్టీ ఊగిసలాడుతుందని సూచన ఉన్నది.

ఎనిమిదింట కేతువు వల్ల లోతైన ఆధ్యాత్మికచింతన కలుగుతుంది.కేతువు ఇక్కడ కుజుడిని సూచిస్తున్నాడు.కుజుడు సోదరకారకుడు గనుక సోదరులతో శత్రుత్వమూ విభేదాలూ రావడం ఖాయం.ఈపార్టీ కూడా అనూహ్యమైన అకస్మాత్తు నష్టాలను చవిచూడవలసి వస్తుంది.

పదింట గురువూ ద్వాదశంలో చంద్రుడూ ఈ జాతకానికి ముఖ్యమైన గ్రహాలు. దశమ గురువువల్ల సైద్ధాంతిక పరంగా మంచి ధార్మికత ఉంటుంది. కులమతప్రాంతీయభేదాలను అధిగమించి మానవత్వపరంగా ప్రజలకు మేలు చెయ్యాలన్న కోరిక ఈ పార్టీ నేతలకు ఉంటుంది.అయితే ఇది ఎంతవరకు ఆచరణలో సాధ్యపడుతుంది అన్నది ప్రశ్నార్ధకమే. ఎందుకంటే, గురువు ఈ లగ్నానికి కేంద్రాదిపత్య దోషి.కనుక సొంత గూటిలోనే కొంత అసంతృప్తిని కలిగిస్తాడు.అలాగే శత్రువుల కుట్రలవల్ల ఈ పార్టీ అనుకున్నవి అనుకున్నట్లుగా చెయ్యలేకపోవచ్చు.కనీసం అలా చెయ్యాలన్న ప్రయత్నంలో చాలా చిక్కులూ అవరోధాలూ అధికారులవద్ద నుంచీ నాయకుల వద్దనుంచీ వీరు ఎదుర్కోవలసి వస్తుంది.

లాభాదిపతి ద్వాదశంలో స్థితివల్ల ఈ పార్టీ ఆర్ధికంగా బాగా సంపాదించుకునేది ఏమీ ఉండదని అనిపిస్త్తున్నది.'నేను సంపాదించడానికి రాజకీయాలలోకి రావడం లేదు'- అన్న పవన్ మాటల వెనుక ఉన్న నిజాయితీని ఈ గ్రహయోగం సూచిస్తున్నది.

ఇదే యోగంవల్ల తన అన్నలతో ఈయనకు రహస్య శత్రుత్వం వస్తుందన్న సూచనా ఉన్నది.పైకి ఏమీ లేదని చెప్పినా లోలోపల ఈ చర్య వారిమధ్యన విభేదాలకు తప్పక దారితీస్తుందని వ్యయంలోని లాభాదిపతి సూచిస్తున్నాడు.

ద్వితీయంమీదా షష్ఠంమీదా ఉన్న గురుదృష్టి వల్ల తొందరపడి కామెంట్స్ చెయ్యడంవల్ల వచ్చె అనర్దాలనుండీ శత్రుత్వాలనుండీ గురువు కాపాడతాడని సూచన ఉన్నది.

చతుర్ధంమీద ఉన్న వక్రోచ్చశనిదృష్టివల్ల,పవన్ యొక్క ఆధ్యాత్మికచింతనా, విశాలభావాలూ క్రమేణా తన పార్టీలోని వారికే మింగుడుపడకపోవచ్చన్న సూచన ఉన్నది.అదే చతుర్ధం మీద ఉన్న గురుదృష్టి వల్ల పార్టీలో వచ్చె కల్లోలాలు మళ్ళీ శాంతిస్తాయన్న సూచనా ఉన్నది.

శుభార్గళం పట్టిన ఆరూఢలగ్నంవల్ల--ప్రాధమికంగా ఈ పార్టీ చాలా ఉన్నతమైన మంచి ఉద్దేశ్యాలతో మొదలైనా కూడా ఆచరణలో తాను అనుకున్న విలువలతో కూడిన రాజకీయాలను సాకారం చేసుకోవడం అంత సాధ్యం కాదేమో అన్న సంశయం దశమంలో ఉన్న కేతువు వల్ల కలుగుతున్నది.

చతుర్దంలో ఉన్న పాపగ్రహకూటమి వల్ల క్రమేణా సొంతపార్టీలోనే పవన్ భావాలను పూర్తిగా అర్ధం చేసుకోలేనివారు తయారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.నిన్న ఆయన సమావేశానికి వచ్చిన వారందరూ ఆయనంత పరిపక్వమైన ఆలోచనా,దార్శనిక స్పష్టతా,సిద్ధాంతఔన్నత్యమూ ఉన్నవారేనా లేక ఉత్త సినీ అభిమానులా అన్నది ఆలోచించదగిన విషయమే.

పాకలగ్నమైన కుంభం నుంచి రాహువు నవమంలో ఉండటం వల్ల,ఈ జాతకానికి అష్టోత్తరీ దశ ఉపయోగిస్తుంది.ఆ దశాప్రకారం పార్టీ ప్రారంభ సమయానికి చంద్ర/బుధ/శుక్రదశ నడుస్తున్నది.జ్యేష్టసోదరులతో విభేదాలూ (చంద్రబుధుల సమసప్తకం),ఉన్నత ఆశయాలతో(నవమాధిపతి పంచమ స్థితి) ఈ పార్టీ మొదలైందని స్పష్టంగా కన్పిస్తున్నది.

వింశోత్తరీ దశాప్రకారం కేతు/రాహు/శని దశలో ఈపార్టీ మొదలైంది. అష్టమంలోని కేతువు వల్ల మానసిక సంఘర్షణా,ద్వితీయంలో ఇంకా రెండు గ్రహాలతో కలసి ఉన్న రాహువువల్ల కుటుంబానికి ఇష్టంలేకపోయినా పార్టీని ప్రారంభించడమూ,ఉచ్ఛ వక్రశనివల్ల ప్రజలకు బాధ్యతగా ఏదోమేలు చెయ్యాలన్న సత్సంకల్పమూ కనిపిస్తున్నాయి.  

చాలా పార్టీలు ఉన్నత సిద్ధాంతాల తోనే మొదలౌతాయి.క్రమేణా ఆచరణలో ఘోరంగా దిగజారిపోతాయి.తద్వారా ప్రజలు నిరాశకు గురికావడమూ జరుగుతూనే ఉంటుంది.ఇలా ఇప్పటికి ఎన్నో సార్లు జరిగింది.ఈ మధ్యనే ఉన్నతమైన ఆశయాలతో వచ్చిన ఆమాద్మీ పార్టీ చేస్తున్న పిల్లచేష్టలతో ఆ పార్టీ క్రమేణా ఎంతగా విశ్వసనీయతను కోల్పోతున్నదో గమనిస్తే నేను చెబుతున్నది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే అని అర్ధం అవుతుంది.

పవన్ మాటల్లోని నిజాయితీ నాకు నచ్చింది.అతని విశాలమైన ప్రాక్టికల్ గా ఉన్న భావాలూ నాకు నచ్చాయి.అతను ఏదీ దాచుకోకుండా ఓపెన్ గా మాట్లాడే విధానమూ నాకునచ్చింది.కులానికీ మతానికీ ఇతర అల్పమైన విషయాలకూ అతీతంగా అతను ఆలోచించే విధానం అన్నింటికంటే నాకు బాగా నచ్చింది.

అయితే వ్యక్తిగత భావాలు వేరు.ఒక పార్టీని నడిపించడం వేరు.పార్టీ అంటే ఎన్నెన్నో భావాలూ విభేదాలూ ఉన్న అనేకమంది వ్యక్తుల సమూహం. మొదట్లో ఉత్సాహంతో అందరూ చేరతారు.క్రమేణా స్వార్ధాలూ,కుట్రలూ మొదలౌతాయి.చీలికలు మొదలౌతాయి.ఈ క్రమంలో కొన్ని సిద్ధాంతాలను త్యాగం చెయ్యవలసి వస్తుంది.అప్పటినుంచి పతనం ప్రారంభం అవుతుంది. చివరకు అదికూడా అన్ని పార్టీల్లాగే తయారౌతుంది.ఇది ప్రతి పార్టీలోనూ జరిగే తంతే.

అటువంటి పతనం సంభవించకుండా,పార్టీనీ కేడర్ నూ నడుపుతూ,తాను నిన్నచెప్పిన సిద్దాంతాలలో రాజీపడకుండా నిజంగా ప్రజల సంక్షేమంకోసం కుల మత ప్రాంత వర్గవిభేదాలకు అతీతంగా పవన్ కృషి చెయ్యగలిగితే అంతకంటే సంతోషం ఇంకేదీ ఉండదు.ప్రస్తుతం మన రెండు రాష్ట్రాలకూ కావలసింది ఇలాంటి భావాలే.

కానీ అది సాధ్యమేనా?ప్రస్తుత కుళ్ళుసమాజం ఆ పనిని సజావుగా చెయ్యనిస్తుందా?

తరతరాలుగా వేళ్ళూనుకొని ఉన్న స్వార్ధపరశక్తులు అటువంటి మార్పును స్వాగతిస్తాయా?ముఖ్యంగా భావావేశాలకు తేలికగా పడిపోయే మన ప్రజలు అటువంటి ఉన్నతమైన మార్పును ఒప్పుకుంటారా?

ఏమో? కాలమే సమాధానం చెప్పాలి.
read more " జనసేన పార్టీ జాతకచక్రం ఏమంటున్నది? "

9, మార్చి 2014, ఆదివారం

మార్చ్ 2014-దేశఫలితాలు

14-3-2014 రాత్రి 11-24 కి హైదరాబాద్ లో సూర్యునికి మీనసంక్రమణం జరుగుతుంది. అప్పటి నుంచి ఏప్రియల్ 14 వరకూ మన రాష్ట్రజాతకం ఎలా ఉందో చూద్దాం.

ఈ నెలకు కుట్రల కుతంత్రాల మాసం అని పేరు పెట్టుకోవచ్చు.

రాజకీయంగా చూస్తే,ఎవరికి వారు వారివారి స్వలాభాలు స్వార్ధాలకు రాష్ట్రప్రయోజనాలను తాకట్టు పెడతారు.

పార్టీల మార్పులు చేర్పులు జోరుగా జరుగుతాయి.రాజకీయ సమీకరణాలు జోరుగా మారిపోతాయి.

అధికారం చేజిక్కించుకోవడమే పరమావధిగా అందరూ ప్రవర్తిస్తారు.అందరూ స్వార్ధంతోనూ హిపోక్రసీతోనూ ఆలోచిస్తారు గాని రాష్ట్ర ప్రయోజనాల గురించి ఎవరికీ పట్టదు.

పరిస్తితి చాలా ఫ్లూయిడ్ గా ఉంటుంది.ఎవరికీ స్థిరమైన అభిప్రాయాలూ నమ్మకాలూ ఉండవు.రాబోయే ఎన్నికలలో ఎలాగైనా గెలవాలి అన్నది ఒక్కటే వారి ఆలోచనగా ఉంటుంది.దానికోసం ఎవరితోనైనా కలుస్తారు లేదా విడిపోతారు.సిద్ధాంతాల రాద్ధాంతాలను ఎవరూ పెద్దగా పట్టించుకోరు.

రహస్య సమాలోచనలూ మంత్రాంగాలూ పొత్తులూ జోరుగా జరుగుతాయి. ఎవరెవరి ప్లానులూ ఎవరెవరి సమీకరణాలూ వారివిగా పరిస్తితి ఉంటుంది.

ప్రతివారికీ ఒకటే చింత వేధిస్తుంది.రాబోయే ఎన్నికలలో మనకు ఓట్లు పడతాయా లేదా?ప్రజలు మనల్ని ఆదరిస్తారా లేదా?అన్న భయం ప్రతివారినీ వెంటాడుతుంది.దానికి అనుగుణంగా పావులు కదుపుతారు. మనసులో మాట ఎవరూ బయటపెట్టరు.అందరూ గుంభనంగా ఉంటారు. లోపలొకటి బయటకొకటి చెబుతూ ఉంటారు.

నీతి అన్న పదానికి అర్ధమే ఉండదు.వ్యక్తిగతప్రయోజనం,స్వార్ధం ఇవి రెండే రాజ్యం ఏలతాయి.తెలివిగా మాట్లాడటమే నీతి అన్న కొత్త నిర్వచనం పుట్టుకొస్తుంది.

ఎవరైనా విలువలతో కూడిన రాజకీయాల గురించి మాట్లాడితే వాడిని వాజమ్మ కింద జమకడతారు.

నల్లధనం విపరీతంగా చేతులు మారుతుంది.చీకటి లావాదేవీలు ఘోరంగా జరుగుతాయి.పైకి మాత్రం అందరూ నీతులు చెబుతూ ఉంటారు.

కుట్రలమాసంలో ఏయే వింతలు ఎదురౌతాయో,ఎవరెవరు కలుస్తారో, ఎవరెవరు విడిపోతారో ముందుముందు చూద్దాం.

మార్చిలో ముఖ్యమైన రోజులు

మార్చ్ 16 నుంచి 20 వరకు:--ప్రజాజీవితం లోనూ వ్యక్తిగత జీవితాలలోనూ చికాకులు గొడవలు నష్టాలు ఆందోళనలు ఉంటాయి.

మార్చ్ 24,25 లలో గొడవలు,యాక్సిడెంట్లు ఉంటాయి.

మార్చ్ 30 నుంచి ఏప్రియల్ 2 వరకు:--వృత్తిలోనూ వ్యక్తిగత జీవితాల లోనూ మానసికచింతలు ఎక్కువగా ఉంటాయి.సంబంధాలు దెబ్బతింటాయి. ప్రమాదాలు జరుగుతాయి.

ఏప్రియల్ 5 నుంచి రాజకీయ కుట్రలు బాగా ఎక్కువైపోతాయి.
read more " మార్చ్ 2014-దేశఫలితాలు "

5, మార్చి 2014, బుధవారం

నరేంద్రమోడి జాతకం-2-ఒక పరిశీలన

ఇంతకు ముందు వ్రాసిన నరేంద్రమోడి జాతకవిశ్లేషణ పూర్తి కాకుండా అలాగే ఉండిపోయింది.ఆ వ్యాసం కావలిస్తే ఇక్కడ చూడవచ్చు. ఎందుకంటే ఆయన జననసమయం ఎక్కడా సరిగ్గా దొరకడంలేదు. రకరకాల సమయాలు కనిపిస్తున్నాయి.జననసమయాన్ని తేల్చకుండా ఆయన జాతకాన్ని స్పష్టంగా చెప్పలేము.కనుక ముందుగా జననసమయ నిర్ధారణ చాలా ముఖ్యం అని ఇంతకు ముందు వ్రాసిన వ్రాసంలో అన్నాను.దానికి కొంత పరిశ్రమా,రివర్స్ యాస్ట్రో ఇంజినీరింగూ అవసరం.

అది చెయ్యబోయే ముందు కూడా మరికొన్ని జ్యోతిష్య సూత్రాల ఆధారంగా ఈయన జాతకాన్ని ఇంకోక్కసారి పరిశీలించవచ్చు.ఆ కోణాలలో ఈయన జాతకాన్ని ప్రస్తుతం చూద్దాం.

లగ్నం ఏదైనప్పటికీ ఆయన రాశి వృశ్చికమే అన్నది సత్యం.ఈయన జాతకంలో ఆత్మకారకుడు శని అన్నదీ,అమాత్య కారకుడు శుక్రుడు అన్నదీ సత్యమే.కనుక స్థిరంగా మనకు కనిపిస్తున్న ఈ అంశాల ద్వారా ఈయన జాతకాన్ని కొద్దిగా విశ్లేషించి చూద్దాం.ఎందుకంటే ఒకవేళ లగ్నం మారినప్పటికీ ఆయన జాతకంలోని ఈ అంశాలు మాత్రం మారవు.కనుక వాటివైపునుంచి ఆయన జాతకాన్ని పరిశీలిద్దాం.

ఎలక్షన్ సమయానికి గ్రహగోచారం ఎలా ఉన్నదో పరికిస్తే త్వరలో ఆయన రాజకీయ ప్రస్థానం ఎలా ఉండబోతున్నదో తెలుస్తుంది.

గురుగోచారం

రేపటినుంచి గురువుగారు వక్రస్థితి నుంచి బయటపడబోతున్నాడు.ఈ వ్యాసం ఇప్పుడు వ్రాయడానికి కారణం కూడా ఇదే.రేపటినుంచి గురువుగారికి వక్రస్థితి వదలడమే గాక అతిచారం మొదలౌతున్నది.అంటే మామూలుగా నడచే వేగం కంటె అతివేగంగా నడవబోతున్నాడు.కనుక రేపటినుంచీ నరేంద్రమోడీ ప్రచారం బాగా ఊపందుకుంటుంది.ఆయనకు మంచికాలం స్పష్టంగా మొదలౌతుంది.సెంటిమెంట్ పవనాలు ఆయనకు అనుకూలంగా బలంగా వీస్తాయి.

దీనికి ఇంకొక ప్రధానకారణం మోడీ జాతకంలో సెంటిమెంట్ ను సూచిస్తున్న గురువు తన ఉచ్చస్థితి వైపు వేగంగా ప్రయాణించడమే.1-6-2014 తేదీనాటికి గురువు మిధునం చివరి నవాంశలోకి అడుగుపెడతాడు.అంటే అప్పటినుంచి ఆయన తర్వాతి రాశి ఫలితాలు ఇవ్వడం మొదలౌతుంది.గురువుగారు జూన్ 19 న కర్కాటక రాశి ప్రవేశంతో ఉచ్ఛస్థితిలోకి అడుగుపెడుతున్నాడు.అంటే నరేంద్రమోడీ జాతకంలో భాగ్యస్థానంలో ఉచ్చస్తితిలోకి రాబోతున్నాడు. భాగ్యభావం కళ్ళుతెరవడం ద్వారా మోడీకి అత్యంత శుభప్రదమైన రోజులు మొదలు కాబోతున్నాయి.కనుక జూన్ మొదటివారం నుంచే నరేంద్రమోడీకి మహర్ధశ పట్టబోతున్నది.

చంద్రలగ్నాత్ గురువు నరేంద్రమోడీకి యోగకారకుడు.యోగకారకుని ఉచ్చస్థితి వల్ల ఆయనకు మంచిదశ మొదలౌతున్నది.పైగా సెంటిమెంట్ కు సూచకం అయిన చతుర్దంలో గురువు ఉన్నాడు.కనుక మోడీ పవనాలు బలంగా వీచబోతున్నాయి.దేశం మొత్తంనుంచి మంచి సెంటిమెంటల్ సపోర్ట్ ఆయనకు రాబోతున్నది.

రాహుగోచారం

మే 12 నుంచి రాహువు తులారాశి మొదటి నవాంశలోకి అడుగు పెడుతున్నాడు.అంటే జ్యోతిష్య ఫలితసూత్రాల ప్రకారం ఆయన అప్పటినుంచి కన్యారాశి ఫలితాలు అందించడం మొదలౌతుంది.ఆ రోజునుంచీ మోడీ జాతకంప్రకారం చంద్రలగ్నాత్ లాభస్థానంలోకి రాహువు ప్రవేశించినట్లే లెక్క. కనుక ఆ రోజునుంచీ నరేంద్రమోడీకి అనుకూల పవనాలు బలంగా వీచడం మొదలౌతుంది.లాభస్తానంలోని రాహువు వల్ల ఆయనకు ఇతర పార్టీల నుంచి మద్దతు కూడా ఆరోజునుంచీ బలంగా లభిస్తుంది.ముస్లిం వర్గాలనుంచి కూడా ఆయనకు బలమైన సపోర్ట్ రావడం స్పష్టంగా ఆరోజునుంచీ చూడవచ్చు.

శుక్ర గోచారం

28-4-2014 నుంచి 23-5-2014 వరకూ శుక్రుడు మీనంలో ఉచ్ఛస్థితిలోకి రాబోతున్నాడు.శుక్రుడు నరేంద్రమోడీ జాతకంలో అమాత్యకారకుడు.మే 3 నుంచి శుక్రుని ఆరోహణ పర్వం నవాంశలో మొదలౌతుంది.అక్కడనుంచి 20 రోజులపాటు నరేంద్రమోడీకి ఎదురనేది ఉండదు.అన్నిచోట్లా ప్రజాభిమానం వెల్లువెత్తుతుంది.ఎన్నికల సమయానికి అమాత్య కారకుని ఉచ్చస్థితివల్ల ఎన్నికలలో విజయం ఆయన సొంతం అవుతుంది.

శనిగోచారం

2-3-2014 నుంచి శని వక్రత్వం మొదలైంది.కనుక ఈ రోజునుంచీ శనిభగవానుడు అత్యంత బలాన్ని పుంజుకోబోతున్నాడు.పాపగ్రహాలు వక్రిస్తే మహాశక్తివంతంగా తయారౌతాయి.మోడీకి శని ఆత్మకారకుడు.కనుక క్రమక్రమంగా ఆయన ప్రసంగాలు ఊపందుకోవడం స్పష్టంగా ఆ రోజునుంచీ గమనించవచ్చు.ప్రత్యర్ధుల మీద డైరెక్ట్ ఎటాక్ ఆయన ఎన్నికల ప్రసంగాలలో ఇక స్పష్టంగా కన్పిస్తుంది.నవాంశలో మిదునంలో ఉన్న శని,తన వక్రత్వం వల్ల మేషంలోని తన నీచస్తితికి చేరుకోవడం కోసం పయనం మొదలు పెడతాడు.కనుక మహాశక్తివంతుడౌతాడు.

అదే సమయంలో ప్రత్యర్ధుల విమర్శలూ మోడీ మీద తీవ్రస్థాయిలో మొదలౌతాయి.కాని ఆ విమర్శలు ఆయనను ఇంకా ఇంకా బలోపేతం చెయ్యబోతున్నాయి.ఆ విమర్శలను ఆయన సమర్ధవంతంగా తిప్పి కొట్టడమే కాక ప్రత్యర్ధులు సమాధానం చెప్పలేని నిజాలను మంచి తర్కంతో ప్రజల ముందు పెట్టగలుగుతాడు.తద్వారా ఆయనవైపు ప్రజలు ఆశగా చూడటం మొదలౌతుంది.

అన్ని గ్రహాలూ అనుకూలంగా కనిపిస్తున్నందువల్ల నరేంద్రమోడీ ప్రధాన మంత్రి అయ్యే అవకాశాలు చాలా బలంగా కనిపిస్తున్నాయి.అయితే ఈ క్రమంలో ఆయనకు బయటనుంచి కొంత సపోర్ట్ అవసరం అయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి.అదే జరిగితే మన దేశానికి మంచిరోజులు వచ్చినట్లే భావించవచ్చు.

ప్రస్తుతం రాజకీయ ముఖచిత్రంలో నరేంద్రమోడీని మించిన సమర్ధుడైన ప్రధానమంత్రి అభ్యర్ధి మన దేశంలో ఎవరూ కనిపించడం లేదనే చెప్పవచ్చు. భాగ్యభావంలో ఆయనకు కలుగబోతున్న ఉచ్ఛగురువు అనుగ్రహం కూడా ఆయనకున్న దైవబలాన్నీ భగవంతుని నిర్ణయాన్నీ స్పష్టంగా సూచిస్తున్నది.

రివర్స్ యాస్ట్రో ఇంజినీరింగ్ ద్వారా మోడీ జననసమయాన్ని నిర్ధారణ చెయ్యడం ఎలాగో వచ్చే వ్యాసాలలో చూద్దాం.
read more " నరేంద్రమోడి జాతకం-2-ఒక పరిశీలన "

2, మార్చి 2014, ఆదివారం

వీరవిరాగిణి అక్కమహాదేవి జాతక విశ్లేషణ-జీవితం

వీరశైవ సాంప్రదాయంలో అక్కమహాదేవి పేరు తెలియనివారు ఉండరు.ఆమె మహా శివభక్తురాలు.వీరవిరాగిణి.తనకంటే వయసులో ఎంతో పెద్దవారైన అల్లమప్రభువు,చెన్న బసవేశ్వరుడు మొదలైన మహనీయులచేత 'అక్కా' అని సగౌరవంగా పిలిపించుకున్న జ్ఞాని. ఆమెలో భక్తీ జ్ఞానమూ సమపాళ్ళలో కలసి వెలుగుతూ ఉండేవి.

ఆమె ఇరవైఏళ్ళకే సమాధిలో జీవితాన్ని స్వచ్చందంగా చాలించిందని కొందరు అంటారు.ఇరవై ఐదేళ్ళకు ఆ సంఘటన జరిగిందని ఇంకొందరు వ్రాశారు.ఏదేమైనా ఆమె ఇరవైఅయిదు ముప్ఫై ఏళ్ళకు మించి బ్రతకలేదనేది అందరూ ఒప్పుకుంటున్న అభిప్రాయం.ఆమె జీవించి ఉన్న ఆ కొద్దికాలంలో తనకు ఎనిమిది ఏళ్ల వయసునుంచీ ఆమె శివధ్యానంలోనే ఎక్కువ కాలం గడిపింది.చివరకు శివధ్యానంలోనే శ్రీశైలక్షేత్రంలో తన ప్రాణాన్ని వదలిపెట్టింది.ప్రపంచంలోనే అతి కొద్దిమందిలో కనిపించే తీవ్రమైన భక్తి ఆమె సొంతం.

అక్క జన్మించిన సంవత్సరం మీద భిన్నాభిప్రాయాలున్నాయి.మనకు చరిత్రను రికార్డ్ చేసే విధానం సరిగ్గా లేదు.పాతకాలంలో రాజులకు వాళ్ళలో వాళ్ళు కొట్టుకోవటమూ పరాయి రాజులకు ఉప్పందించడమూ తప్ప వేరు పనిలేదు.ఉన్న ఒక్క ఖగోళ జ్యోతిష్యవిధానాన్నీ మనం నమ్మం. కాగితాల మీద వ్రాస్తే అవి నశిస్తాయని రాళ్ళమీద మనవాళ్ళు శాసనాలు చెక్కారు. అయితే మన నిర్లక్ష్యంవల్ల అవి ఏ బ్రిటిష్ మ్యూజియానికో తరలి వెళ్ళిపోతాయి.

నక్షత్రాలలో అయితే ఏ రికార్డ్ అయినా భద్రంగా ఉంటుందని ముఖ్యమైన సంఘటనలను ప్రాచీనులు ఖగోళరీత్యా రికార్డ్ చేశారు.కాని మనం వాటిని నమ్మం.ఎవడో తెల్లవాడు వచ్చి చెబితేగాని మన అడ్రసు మనకు తెలియదు.మళ్ళీ గర్వంలోనూ పొగరులోనూ మనం ఎవరికీ తీసిపోం. ఇన్ని బానిసలక్షణాలున్న ఆత్మాభిమాన హీనజాతి ఎలా బాగుపడుతుంది?అందుకే విదేశీయులు వెయ్యేళ్ళపాటు మనల్ని ఏకధాటిగా పరిపాలించారు. ఇష్టం వచ్చినట్లు దేశాన్ని దోచుకెళ్లారు.

అక్క 12 వ శతాబ్దంలో పుట్టినట్లు అందరూ ఒప్పుకుంటున్నారు.ఆమె 1170లో పుట్టిందని కొందరన్నారు.1150లో పుట్టిందని కొందరన్నారు. 1130లో పుట్టిందని ఇంకొందరి అభిప్రాయం.అయితే,ఆమె చైత్రపూర్ణిమ రోజున పుట్టినట్లు దొరుకుతున్న చారిత్రిక ఆధారాలను అందరూ ఒప్పుకున్నారు.ఆమె జీవితం మనకు తెలుసు కాబట్టి జ్య్తోతిష్యసూత్రాల నుపయోగించి ఆమె జనన సంవత్సరం గణించడం పెద్ద విషయం కాదు.

మామూలు మనుషుల జాతకాలను నేను చూడటానికి అంత ఇష్టపడను.ఎంతసేపూ డబ్బూ,ఉద్యోగమూ,వ్యాపారమూ పెళ్ళీ, పిల్లలూ, దోషాలూ,స్వార్ధపుకోరికలూ ఇలాంటి జాతకాలు చూచి ఉపయోగం ఏముంది?చూస్తే మహనీయుల జాతకాలు చూడాలి.తద్వారా వారి మహత్తరమైన జీవితాలను ఒకసారి అధ్యయనం చేసే అవకాశం కలుగుతుంది.మామూలు మనుషుల జాతకాలు చూస్తే ఏముంటుంది?చెత్త తప్ప?

అందుకే ఇప్పుడు బ్రతికి ఉన్న మామూలు మనుషుల జాతకాలకంటే కొన్ని వందలవేల ఏళ్ళనాడు గతించినా సరే మహనీయులైనవారి జాతకాలు చూడటానికే నేను మొగ్గు చూపుతాను.డబ్బుకోసం నేను జ్యోతిష్యం చెప్పను గనుక నాఇష్టం నాది.నాకిష్టమైతే ఎవరి జాతకమైనా చూస్తాను.లేకుంటే లేదు.నాకిష్టమైతే రెమేడీలు చెబుతాను.లేకుంటే లేదు.

ఆ విషయం అలా ఉంచితే,పై మూడు సంవత్సరాలలో ఉడుతడి గ్రామానికి (అక్క పుట్టిన ఊరు 'ఉడుతడి'.ఇది కర్నాటకలోని షిమోగా జిల్లాలో ఉన్నది)చైత్రపౌర్ణమి కుండలులను ఒకసారి పరిశీలిద్దాం.ఆరోజు రాత్రి మొదటిజాము దాటిన కొద్దిసేపటికి అక్క పుట్టిందని చాలామంది విశ్వసిస్తున్నారు.

9-4-1170 చైత్ర పౌర్ణమి
1-4-1130 చైత్ర పూర్ణిమ
21-3-1150 చైత్ర పూర్ణిమ

ఈ మూడు జాతకచక్రాలలో 1170 ది మాత్రమే అక్క జాతకానికి బాగా సరిపోతున్నదని నాఅభిప్రాయం. కనుక 9-4-1170 నాటి చైత్ర పౌర్ణమి తేదీనే అక్క జన్మదినంగా నేను తీసుకుంటున్నాను. 
   
దానికి కారణాలను క్లుప్తంగా వివరిస్తాను.మూడు కుండలులలో సన్యాసయోగం ఒక్క 1170 కుండలికే ఉన్నది.1150 కుండలికి కుజ శుక్రయోగం మేషంలో ఉన్నది. కామాన్ని జయించిన అక్క మహాదేవికి ఈ యోగం ఉండటం సంభవం కాదు. 1130,1150 లలో రవి మేషంలో లేడు.ఉజ్జ్వల జ్ఞానమూర్తియైన అక్క జాతకంలో సూర్యుడు బలంగా ఉండాలి.అది 1170 లో మాత్రమే కనిపిస్తున్నది.పైగా 1150 జాతకానికి గురువు వక్రించి ఉన్నాడు.కనుక ఎలా చూచినా 1170 కే ఎక్కువ మార్కులు పడుతున్నాయి.అందుకని ఆ సంవత్సరంలో వచ్చిన చైత్ర పౌర్ణమినే నేను అక్క జన్మదినంగా స్వీకరిస్తున్నాను. 

మిగిలిన రెండు జాతకాలలో శని కేతువులు కలసి ఉండటమూ చంద్రకేతువులు కలసి ఉండటమూ వంటి కొన్ని ఆధ్యాత్మిక యోగాలున్నప్పటికీ సన్యాసయోగం బలంగా ఉన్న జాతకం 1170 కనుక దానినే అక్క జననసంవత్సరంగా తీసుకుందాం.

ఇప్పుడు ఆ కుండలిలోని కొన్ని విషయాలను గమనిద్దాం. నవాంశలో కుజుని ఉచ్ఛ స్థితివల్ల అక్క చాలా పట్టుదల కల్గిన వ్యక్తి అని తెలుస్తున్నది.కనుకనే దాదాపు వెయ్యి సంవత్సరాల నాడే ఆనాటి చాందస కట్టుబాట్లనూ ఆచారాలనూ ధిక్కరించి బట్టలు వదలివేసి సంఘంలో నగ్నయోగినిగా సంచరించగలిగింది.క్రూరమృగాలతో నిండిన అడవులలో ఏ సహాయమూ లేకుండా ఏ ఆహారమూ లేకుండా ఏ తోడూ లేకుండా ఒక్కతే నగ్నంగా నడుస్తూ కర్నాటక నుంచి శ్రీశైలానికి రాగలిగింది.ఆరోజులలో మంచి వయసులో ఉన్న సౌందర్యవతి ఆపని చెయ్యాలంటే ఎంత ధైర్యమూ పట్టుదలా తన సాధనపైన తనకు ఎంత నమ్మకమూ,పరమేశ్వరుని పైన ఎంతటి అచంచలమైన విశ్వాసమూ ఉండాలో ఊహిస్తే దిగ్భ్రమ కలుగుతుంది.

సుఖస్థానంలో గానీ,కళత్రస్థానంలోగానీ సన్యాసయోగం ఉంటే వారికి వివాహం కాదు.ఒకవేళ అయినా వారికి సంసారం మీద పెద్దగా కోరిక ఉండదు.అయిష్టంగా సంసార జీవితం గడుపుతూ ఉంటారు.ఈ జాతకంలో సుఖస్తానంలో ఉన్న సన్యాసయోగం వల్ల అక్క ఆజన్మ బ్రహ్మచారిణిగా ఉండిపోయింది.

అక్కకు ఆత్మకారకుడు బృహస్పతి అయ్యాడు.ఆత్మకారకుడు ఉచ్ఛ సూర్యునితో కలసి ఉండటం మహత్తరమైన యోగం.ఇది ఉజ్జ్వలమైన జ్ఞానతేజస్సును ఇస్తుంది.అక్క జాతకంలో ఈ యోగం ఉన్నది.

కారకాంశ ధనుస్సు అయింది.అక్కడనుంచి పంచమంలో ఉచ్ఛసూర్యునితో కలసి లగ్నాధిపతి అయిన గురువు ఉండటం ఒక గొప్ప ఆధ్యాత్మిక సూచన.ఈ జీవి సామాన్యమైనది కాదనీ ఎంతో మహనీయమైన ఆత్మ అనీ సూచిస్తుంది.

అంతేగాక ఇదే యోగంవల్ల ఆమె మంచి కవయిత్రి కూడా అయింది. సామాన్యంగా యోగులైనవారు తమ అనుభవాలనూ అభిప్రాయాలనూ భావాలనూ కవితల రూపంలో వెలువరించడం జరుగుతూనే ఉంటుంది.పంచమంలో ఉన్న నీచభంగబుధుని వల్ల కూడా ఇదే సూచితం అవుతున్నది.

దశమంలోని కేతువు వల్ల ఒక గొప్ప  యోగినిగా సిద్దురాలిగా చరిత్రలో మిగిలిపోయింది.ఆ కేతువు శుక్రనక్షత్రంలో ఉంటూ ఆమెకు వివాహం లేకుండా చేశాడు.

నవమాదిపతి అయిన చంద్రుడు ద్వాదశంలో ఉండటం కూడా ఆధ్యాత్మిక యోగమే.నవాంశలో బుధ కేతువులు లగ్నంలో వచ్చి ఉండటం దీనికి బలాన్ని చేకూరుస్తున్నది.

చాలామంది జ్యోతిష్యశాస్త్రాన్ని నమ్మరు.నమ్మిన కొంతమంది కూడా తమ పద్ధతులు మార్చుకోకుండా దానిని తమ స్వార్ధానికి వాడుకోవాలని చూస్తారు.అలాంటివారు ఎన్నటికీ ఈ శాస్త్రం నుంచి ప్రయోజనాన్ని పొందలేరు.ఎందుకంటే ఇది ఒక మార్మికశాస్త్రం.మన అతితెలివీ స్వార్ధమూ గర్వమూ దీనిముందు ఎంతమాత్రం పనిచెయ్యవు.అలాంటి వారికి ఈ శాస్త్రం సహాయపడదు.

ఇక్కడ ఒక చిన్న జ్యోతిష్యరహస్యాన్ని పరిచయం చేస్తాను.పౌర్ణమినాడు పుట్టినవారికి వివాహజీవితం బాగుండదు.దీనిని చాలా జాతకాల్లో కొండగుర్తుగా గమనించవచ్చు.వీరిలో చాలామందికి పెళ్లి జరగదు.ఒకవేళ జరిగినా వారి వైవాహిక జీవితంలో ఏదో తీర్చలేని లోటు ఎప్పుడూ ఉంటుంది.సామాన్యంగా వీరి జాతకంలో కుటుంబ,సుఖ,కళత్రస్థానాలు చెడిపోయి ఉండటం చూడవచ్చు.దీనికి మార్మికమైన కర్మకారణాలు చాలా ఉన్నాయి.వాటిని నేను వివరించబోవడం లేదు.అర్హులైన వారికి మాత్రమే ఆ రహస్యాలు చెబుతాను.

అక్కమహాదేవి చిన్నప్పటినుంచి శివభక్తురాలు.ఎనిమిదేళ్ళ వయసునుంచే జపధ్యానాలు నిష్టగా చేసేది.గురుకులంలో చేసి శాస్త్రాలు అభ్యసించింది. వేదాన్తాన్నీ ముఖ్యంగా శైవసిద్ధాంతాన్ని ఔపోసన పట్టింది.సంస్కృతంలోనూ కన్నడంలోనూ మంచి పాండిత్యాన్ని సంపాదించింది.చిన్నప్పుడే మల్లికార్జున రూపంలో ఉన్న పరమశివుని తన భర్తగా స్వీకరించి ఆరాధించడం ప్రారంభం చేసింది.ఇది మాధుర్యభావ సాధన.భగవంతుని తన ప్రియునిగా భావించడం ఒక్క మన ఆర్షధర్మంలోని భక్తిమార్గంలోనే కనిపిస్తుంది.రాధాదేవి, మీరాబాయి మొదలైన ఎందఱో ఈ మార్గాన్ని అనుసరించి దైవప్రేమలో కరిగిపోయినవారే.

అక్కమహాదేవిని ఆ దేశపు రాజైన కౌశికుడు చూచి ఆమె అందాన్ని మోహించి వివాహం చేసుకోవాలని సంకల్పిస్తాడు.ఆమె ఒప్పుకోదు. మొండివాడైన కౌశికుడు బలప్రయోగంతోనైనా ఆమెను తన రాణిని చేసుకోవాలని ప్రయత్నిస్తాడు.అందరూ ఆమె అదృష్టానికి పొంగిపోతారు.కాని ఆమె నిర్లిప్తురాలు.లోకం దృష్టిలో అదృష్టం ఐనది ఆమె దృష్టిలో ఒక ప్రతిబంధకం.రాజదండనకు వెరచి తల్లిదండ్రులకు శిరచ్చేదం తప్పించడం కోసం ఆమె రాజును వివాహం చేసుకున్నదని కొందరంటారు. అలా వివాహం చేసుకోలేదనీ ఒక ఒప్పందం ప్రకారం కొంతకాలం కోటలో ఉంటాననీ తాను పెట్టిన షరతులకు రాజు ఒప్పుకుంటే అప్పుడు అతన్ని వివాహం చేసుకుంటాననీ ఆమె ఒప్పుకుందని కొందరంటారు.

కానీ ఆ షరతుల కాలం పూర్తికాకముందే ఒకరోజున కౌశికుడు ఆమెను బలాత్కారం చెయ్యబోగా ఆమె తప్పించుకుని కోట బయటకు వచ్చేసింది. "నీవు కోటను విడచి వెళ్ళాలని అనుకుంటే నేను ఇచ్చిన దుస్తులు వదిలేసి వెళ్ళు"- అని కౌశికుడు అనగా వెంటనే అందరి ఎదురుగా బట్టలు విసిరి పారేసి నగ్నంగా నడుచుకుంటూ నగరంలోకి వచ్చేస్తుంది.

ఎంతమంది చెప్పినా వినకుండా అలాగే సంచరిస్తూ అన్నింటినీ త్యజించిన విరాగిణిగా కల్యాణినగరానికి బయలుదేరి వెళ్ళి అక్కడ వీరశైవసిద్దులూ మహాతపస్వులూ అయిన అల్లమప్రభువు,బసవేశ్వరులను కలుసుకుంటుంది.వారు స్థాపించిన 'అనుభవ మంటపం'లోనికి సామాన్యంగా ఎవరినీ రానివ్వరు.అందులో ప్రవేశించాలంటే మంచిసాధకులై అనుభవజ్ఞానులై ఉండాలి.అలాంటివారినే అక్కడి సిద్ధులు వారిలో కలవనిస్తారు.ఊకదంపుడు పండితులనూ ఉపన్యాసకులనూ మెట్టవేదాంతులనూ వారు పొరపాటున కూడా తమ దగ్గరికే రానివ్వరు.వారు పెట్టే పరీక్షలలో ఉత్తీర్ణులైతేనే ఆ మంటపంలోకి ప్రవేశం సంభవం. అక్కమహాదేవిని అక్కడి జ్ఞానులు ఎన్నో ప్రశ్నలతో పరీక్షిస్తారు.

ఆమె నగ్నత్వాన్ని గురించి ప్రశ్నించిన కిన్నెర బొమ్మయ్య అనే సాధకునికి అక్క ఇచ్చిన సమాధానం ఎంతో ఆలోచింపచేస్తుంది.

'అసలు మీ దృష్టి నా నగ్నత్వం మీదకు ఎందుకు పోతున్నది?ఇదేనా మీ సాధన?దేహాన్ని తప్ప ఇంక దేనినీ మీరు చూడలేరా?' అని అక్క ప్రశ్నిస్తుంది.

ఆ జవాబుతో కిన్నెర బొమ్మయ్య నిరుత్తరుడై పోతాడు.

అనుభవ మంటపంలో గొప్పగొప్ప సాధకులైనవారి సమక్షంలో అల్లమప్రభువు ఆమెను అడిగిన ప్రశ్నలూ ఆమె ఆయనకు ఇచ్చిన జవాబులూ చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోయాయి.

'ఎందుకు ఇలా బట్టలు వదిలేసి తిరుగుతున్నావు?' అని అల్లమ ప్రభువు ఆమెను ప్రశ్నిస్తాడు.

దానికి అక్కమహాదేవి ఇలా జవాబిస్తుంది.

'ఈ ప్రపంచంలో సర్వే సర్వత్రా నా ప్రభుని కళ్ళున్నాయి.ఆయన నేత్రాలు సమస్తాన్నీ నిత్యమూ చూస్తున్నాయి.ఇంక ఆయననుంచి దాచుకోవడానికి నాలో ఏమున్నది?'

'ఈ వేషంలో ఉన్న నిన్ను ఇక్కడి జ్ఞానులు లోనికి అనుమతిస్తారనే అనుకున్నావా?'

'మీరు నిజమైన జ్ఞానులైతే తప్పక అనుమతిస్తారు.' అంది అక్కమహాదేవి.

'నీకు నిజంగా దేహస్పృహ లేకపోతే దేహాన్ని నీ కేశాలతో ఎందుకు కప్పుకున్నావు?అంటే నీ మనసులో ఇంకా కొంత సిగ్గు మిగిలి ఉన్నట్లేగా?అది ఉన్నంతవరకూ నీవు జ్ఞానివి ఎలా అవుతావు?' అని అల్లమప్రభువు అడిగాడు.

'నా దేహాన్ని చూచి మీలాంటి జ్ఞానులు కూడా కామానికి లోనౌతారన్న భయంతో,ఆ దోషం మీకు అంటకూడదని,మీకోసం ఈ దేహాన్ని కేశాలతో కప్పుకున్నాను.అంతేగాని నాకోసం కాదు.' అని అక్క బదులిచ్చింది.

'అయితే నీ భర్త ఎవరో చెప్పు' అని అల్లమప్రభువు అడిగారు.

'సర్వేశ్వరుడే నా భర్త.నిరాకారుడూ,నిర్గుణుడూ,ఏకస్వరూపుడూ,పరమ సుందరుడూ అయిన మల్లికార్జునుడే నా భర్త.కాలమనే వంటింటిలో ఆహారంగా మారే సామాన్య మానవులు నా మనస్సులో నిలవలేరు.' అని అక్క బదులిచ్చింది.

అప్పుడు అల్లమప్రభువు ఒక మార్మికమైన ప్రశ్నల పరంపరను ఆమెవైపు గుప్పిస్తాడు.

'శవం నేను చనిపోయానని అరుస్తుందా?దాగిన నిధి నేనున్నాను రమ్మని పిలుస్తుందా?తోడుపెట్టిన పాలు తియ్యగా ఉంటాయా?వీటికి జవాబు చెప్పు'అంటూ అడిగాడు అల్లమప్రభువు.

'అవన్నీ సాధ్యమే.' అక్క జవాబిచ్చింది.

'ఎలా సాధ్యం'?

'పరమేశ్వరుని సంకల్పానికి అసాధ్యం అంటూ లేదు' అక్క జవాబు.

'వివరించు'

'ఒక దేహాన్ని విడిచిన జీవుడు ఇంకొక దేహాన్ని ఆశ్రయించి మళ్ళీ జీవిస్తున్నాడు.అప్పుడు శవం మళ్ళీ బ్రతికినట్లే కదా.అతన్ని పట్టుకొని ఉన్న సంచిత ప్రారబ్ధ ఆగామి కర్మలనే గుప్తనిధులు కనిపించకుండా అతనిలోనే దాగిఉండి అతన్ని నిత్యమూ పిలుస్తున్నాయి.అతన్ని జుట్టు పట్టుకుని నడిపిస్తున్నాయి.గుప్తనిధులు పిలవడమంటే ఇదే.తోడుపెట్టిన పాలనుంచి నెయ్యి వస్తుంది.ఆ నెయ్యి తియ్యగా ఉండదా?అలాగే సాధన చెయ్యగా చెయ్యగా కలిగిన పరిపక్వతవల్ల ఇదే మనస్సులో జ్ఞానమనే తీపి ఉద్భవిస్తుంది.' అని అక్క జవాబిచ్చింది.
  
ఈ సంభాషణ అంతా వెయ్యి సంవత్సరాలనాడు జరిగిందన్న విషయం గుర్తుంచుకుంటే,మహాగురువులూ జ్ఞానమూర్తులూ అయినవారికి ఇరవై సంవత్సరాల చిన్నవయస్సులోనే అటువంటి జవాబులిచ్చిన అక్కమహాదేవి ఎంతటి జ్ఞానమూర్తియో అర్ధమౌతుంది.

ఆమె జవాబులు విన్న అనుభవమంటపంలోని సాధకులూ,సిద్ధులూ, మహనీయులూ అందరూ ఆమెను ప్రశంసించి వయస్సులో తమకంటే చిన్నదైనా ఆమెను 'అక్కా' అంటూ పిలిచి గౌరవించి తమలో ఒకదానిగా ఆమెను ఒప్పుకున్నారు.

'అమ్మా.నీ తపస్సుకూ నివాసానికీ అనువైన స్థలం శ్రీశైలక్షేత్రంలోని కదళీవనమే.నీవు వెంటనే బయలుదేరి అక్కడకు వెళ్ళి తపస్సులో ఉండు' అని అల్లమప్రభువు చెప్పారు.

వారి అనుమతితో అక్కడనుంచి బయలుదేరిన అక్క కాలినడకన నదులూ అడవులూ దాటుకుంటూ శ్రీశైలం చేరుకొని అక్కడి కదళీవనంలో ఉన్న గుహలో నివాసం ఏర్పరచుకొని తపస్సులో ఉండి అక్కడే పరమేశ్వర సాక్షాత్కారాన్ని పొంది ఆయనలో లీనమై పోయింది.శరీరం వదిలే సమయానికి ఆమెకు ఇరవై ఐదు లేదా ముప్పై ఏళ్ల వయస్సు ఉండవచ్చు.

తర్వాత కొంతకాలానికి అల్లమప్రభువు కూడా ఇక్కడకే వచ్చి స్థిరపడి తపస్సులో ఇక్కడే దేహాన్ని చాలించారు.

తొంభై ఏళ్ళు వచ్చినా ఇంకా కామంమీదా ధనంమీదా వాంఛ చావక ఇంకా ఇంకా నానామందులూ వయాగ్రాలూ మింగుతూ వాటికోసం వెంపర్లాడే యయాతులున్న నేటి సమాజంలోని నికృష్టులకు అక్కమహాదేవి వంటి మహాజ్ఞాని యొక్క స్థితి అర్ధం కావాలంటే వాళ్ళు ఇంకా ఎన్ని జన్మలెత్తాలో తేలికగా ఊహించుకోవచ్చు.

అక్కవంటి వారు కారణజన్ములు.వాళ్ళ సంస్కారాలు వేరు.వాళ్ళ ఆలోచనా విధానాలు వేరు.వాళ్ళ జీవితాలు వేరు.మనలాంటి క్షుద్ర జీవితాలు కావు వారివి.

మహారాణి అయ్యే అవకాశం వెదుక్కుంటూ వస్తే దానిని తిరస్కరించి ఆకలి దప్పులకు ఓర్చి అడవులలో కొండలలో ఒక్కతే నగ్నంగా సంచరిస్తూ పరమేశ్వరుని మీద అచంచలమైన విశ్వాసంతో అనుక్షణం పరమేశ్వర ధ్యానంలో తపోమయజీవితాన్ని గడిపి చివరకు అతి చిన్న వయస్సులోనే తన గమ్యాన్ని చేరుకోగలిగిన అక్కమహాదేవి వంటి వారికి జన్మనిచ్చిన భరతదేశం ధన్యభూమి.

నిరంతరమూ సంసారమూ డబ్బూ సుఖాలూ ఈర్ష్యాద్వేషాలతో కూడిన మనవంటి వారి మనస్సులలోని కల్మషాలూ కుళ్ళూకుత్సితాలూ,ఇలాంటి మహనీయులను స్మరిస్తేనన్నా,కొంత ఉపశమిస్తాయేమో?ఎంతసేపూ పనికిమాలిన చెత్త మాట్లాడుకుంటూ లోకుల గురించి నానా గాసిప్సూ చెప్పుకునే నేటిజనానికి ఇలాంటి మహనీయుల చరిత్రలు ఎలా నచ్చుతాయి?ఎప్పుడూ బురదలో పొర్లే పందులకు సుగంధభరితమైన మలయమారుతం యొక్క విలువ ఎలా తెలుస్తుంది?

వెయ్యి సంవత్సరాలనాడు అక్కమహాదేవి తపస్సు చేసిన కదళీవనం గుహలు శ్రీశైలంలో నేటికీ నిలిచి ఉన్నాయి.కొంతదూరం బోటులో కృష్ణా నదిమీదుగా ప్రయాణం చేసి ఆ గుహలకు చేరుకోవచ్చు.పిక్నిక్ కోసం పవిత్రక్షేత్రాలకు వెళ్ళి అక్కడి వాతావరణాన్ని పాడుచేసే మన ఆంధ్రావాళ్ళకు ఈ గుహల ప్రాముఖ్యత తెలియదు.కర్నాటక నుంచి ఎక్కువగా వచ్చె భక్తులు ఈ గుహలను దర్శిస్తూ ఉంటారు.

మన ఆంధ్రావాళ్ళు ఈ గుహలకు పోకపోవడమే మంచిది.ఎందుకంటే ఎక్కడికి పోయినా అనవసరమైన వాగుడుతోనూ లిట్టరింగ్ తోనూ ప్రకృతినీ అక్కడి ప్రశాంత వాతావరణాన్నీ పాడుచేసే చౌకబారు మనుష్యులు ఇలాంటి పవిత్ర స్థలాలకు పోకుండా వాటికి దూరంగా ఉండటమే మంచిది.కనీసం ఆయా స్థలాల తపోమయ వాతావరణమూ పవిత్రతా చెడిపోకుండా ఉంటుంది.

ఎలా ఉపయోగించుకోవాలో తెలిసిన సాధకులైనవారికి మాత్రం శ్రీశైలంలోని ఈప్రదేశం చాలా ఉపయోగిస్తుంది.కావలసినంత మానసికపవిత్రతా, ధ్యానశక్తీ,సాధనాబలమూ,అంతర్ద్రుష్టీ ఉంటే అక్కమహాదేవినీ, అల్లమప్రభువు నూ ఇంకా ఎందఱో మహాసిద్దులనూ ఇప్పటికీ ఇక్కడ దర్శించి వారి అనుగ్రహాన్ని పొందవచ్చు.వెయ్యి సంవత్సరాలు గడచినప్పటికీ పరమేశ్వరానుగ్రహంతో సూక్ష్మదేహాలతో వారందరూ ఇప్పటికీ ఇక్కడే ఉన్నారన్నది వాస్తవం.అనుభవ సత్యం.

కన్నడ సాహిత్య చరిత్రలోకూడా అక్కమహాదేవికి చిరస్మరణీయమైన స్థానం ఉన్నది.అక్క వ్రాసిన "వచనాలు" అనే చిన్నచిన్న వచనపద్యాలు ఎంతో నిగూఢమైన తాత్వికచిన్తననూ మార్మికతనూ ప్రతిఫలిస్తూ ఉంటాయి. నేటికి కూడా వాటిని చదివిన సాధకులకు అవి ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి.అక్క ఆలోచనాధారను ఆ 'వచనాల' ద్వారా తొమ్మదివందల సంవత్సరాల తర్వాత ఇప్పుడు కూడా మనం అందుకోవచ్చు.ఆమె సాన్నిధ్యంలో పునీతులం కావచ్చు.
read more " వీరవిరాగిణి అక్కమహాదేవి జాతక విశ్లేషణ-జీవితం "

1, మార్చి 2014, శనివారం

వ్రతాలు-పూజలు-ధ్యానాలు-నిజమైన ఆధ్యాత్మికత

ఈ మధ్యకాలంలో అనేకమంది గురువులూ వాళ్ళ స్కూల్సూ పుట్టుకొచ్చినందువల్ల మంచి జరిగినా జరుగకున్నా ఒక చెడుమాత్రం తప్పక జరుగుతోంది.

మన పూజలూ వ్రతాలూ ఆచారాలూ అన్నీ తప్పులనీ వాటిని ఆచరించవలసిన అవసరం లేదనీ ఒక వితండవాదం బయలుదేరుతోంది.ఇది చాలా తప్పుభావన.చాలాసార్లు ఇలాంటి భావనలను సోకాల్డ్ గురువులే పెంచి పోషిస్తున్నారు.ఇదీ అసలైన వింత.

నా స్నేహితుడైన ఒకాయన ముప్ఫై ఏళ్లక్రితమే పరమహంస యోగానంద గారి YSS క్లాసులు తీసుకుని తీవ్రంగా సాధన చేసేవారు.అప్పట్లోనే రోజుకు మూడుగంటలపాటు ఆయన క్రమం తప్పకుండా ధ్యానంలో ఉండేవారు. క్రమేణా ఆయనకు హార్ట్ ఎన్లార్జ్ మెంట్ వచ్చేసి చిన్నవయసులోనే చనిపోయారు.అతి ఉత్సాహంతో క్రియాప్రాణాయామం కౌంట్ ఆయన ఇష్టం వచ్చినట్లు పెంచుకుంటూ పోయినందువల్ల ఇలా జరిగిందని నా అభిప్రాయం.

మాకు తెలిసిన ఒకావిడ ఉన్నది.ఆమె కూడా YSS కు వీరభక్తురాలే గాక క్రియాయోగ సాధకురాలు.పూజల్నీ ఆచారాలనీ వ్రతాలనీ ఆమె తీవ్రంగా విమర్శిస్తూ ఉంటుంది.వాళ్ళ ఇంటిలో పూజగది గత ఏడెనిమిది ఏళ్ళుగా మూతపడి ఉన్నది.వరలక్ష్మీ వ్రతమూ సత్యనారాయణ వ్రతమూ మొదలైన అనేకవ్రతాలు ఆమె చెయ్యకపోగా చేస్తున్నవారిని విమర్శిస్తుంది.ఈ పిచ్చివేషాలు చూచి కొందరు మిత్రులుకూడా వాళ్ళ ఇంటికి పోవడం మానుకున్నారు.

మా బంధువులలో ఒకామె ఈమధ్యనే పరమహంస యోగానందగారి ఆశ్రమానికి వెళ్ళింది.

అక్కడ ఎదురైన ఒకాయన 'మీరెవరు?ఏమిటి ఇలా వచ్చారు?' అని అడిగారట.

'నేను "పరమహంస యోగానంద గారి ఆటో బయాగ్రఫీ ఆఫ్ ఎ యోగి" పుస్తకం చదివాను.అందుకని వచ్చాను.' అని ఆమె చెప్పింది.

ఆయన వెంటనే -'సరే మీరు ఈ అప్లికేషన్ పూర్తి చెయ్యండి.రెండువేలు కట్టండి.మీకు సాధన ఎలా చెయ్యాలో నేర్పిస్తాము.' అని అన్నాడు.

ఈమె బిత్తరపోయి అక్కడనుంచి తప్పించుకుని వచ్చేసింది.

ఓం ప్రధమంగా మొదలుపెట్టడమే డబ్బుతో మాటలు మొదలైతే అదెంత ఆర్టిఫిషియల్ గా ఉంటుందో,అదేమి ఆధ్యాత్మికతో ఆమెకు అర్ధం కాలేదని నాకు చెప్పింది.

ఇదంతా వింటుంటే గతంలో జరిగిన ఒక సంఘటన నాకు గుర్తొచ్చింది.

పదేళ్లక్రితం ఎవరైనా మంచి సాధకులు పరిచయం అవుతారేమో అని నేను వెదుకుతూ ఉండేవాడిని.ఆ క్రమంలో భాగంగా ఒకసారి గుంటూరులోని YSS వారి సంస్థకు వెతుక్కుంటూ వెళ్లాను.ఆ రోజున ఏదో ఒక స్పెషల్ క్లాసు ఉన్నదని అక్కడవారు చెప్పారు.అప్పటికి ఇంకా ఎవరూ రాకపోతే అక్కడ కూచుని చాలాసేపు వేచి చూచాను.

ఇంతలో ఒకాయన వచ్చి అనుమానంగా నావైపు చూచాడు.

'అదేంటి అలా చూస్తున్నాడు?' అనుకున్నాను.

'మీరు క్రియాయోగా ఇనిషియేషన్ తీసుకున్నారా?' అడిగాడు.

'లేదు.కాని నాకు క్రియాయోగం తెలుసు' అని జవాబిచ్చాను.

'ఎలా తెలుసు?' అడిగాడు.

అవన్నీ అతనికి చెప్పడం ఎందుకని నేను మౌనంగా ఊరుకున్నాను.

'మీరు దయచేసి బయటకు వెళ్ళిపొండి.మా సంస్థలో ఇనిషియేషన్ తీసుకున్నవారు మాత్రమే ఇక్కడ ఉండాలి.ఇది బయటవాళ్ళకోసం కాదు.' అని అతనన్నాడు.

నేను మౌనంగా బయటకు వచ్చేసాను.

వచ్చేముందు గుమ్మం వద్ద ఆగి ఆయన్ను ఒక మాట అడిగాను.

'దయామాత వ్రాసిన "ఓన్లీ లవ్" అనే పుస్తకం మీరు చదివారా?'

అతను అనుమానంగా చూచాడు.కాసేపుంటే నన్ను బయటకు తోసేసేవాడే.అంత దగ్గరగా వచ్చాడు.

అతని వాలకం చూస్తే ఆపుస్తకం పేరు కూడా అతను వినలేదని నాకర్ధమైంది.

'ఆమె ఎవరో కాదు.మీ పరమహంస యోగానంద గారి ప్రియశిష్యురాలు.ఆమె వ్రాసిన పుస్తకం పేరే "ఓన్లీ లవ్".ఒకసారి చదవండి.' అని చెప్పి అక్కడనుంచి వచ్చేశాను.

అతనికంటే మామూలు క్రైస్తవులు చాలా బెటర్ అని నాకనిపించింది.మనం ఏ చర్చికి వెళ్ళినా లోపలికి రమ్మని పిలుస్తారు గాని బయటకు పొమ్మని ఎవరూ చెప్పరు.అదీ నీతులు చెప్పే మన ఆధ్యాత్మిక సంస్థల ఘనత!!!

కదిలిస్తే చాలు పుంఖానుపుంఖాలుగా నీతులు వల్లించడమూ ఆచరణలో దానికి పూర్తిగా వ్యతిరేకంగా ప్రవర్తించడమే హిందువుల పతనానికి అసలైన కారణమని వివేకానందస్వామి ఎన్నోసార్లు అనేవారు.ప్రేమా,విశాలమైన దృక్పధమూ లేనిది ఆధ్యాత్మికత ఎలా అవుతుందో నాకైతే అర్ధం కాదు.

ధ్యానం ఒక్కటే చాలు ఇంకే పూజలూ అవసరం లేదు-అనే వాదం ఒకటి ఈ మధ్యన ఒక గడ్డంగురువుగారు ప్రారంభం చేశారు.బౌద్ధాన్నీ హిందూమతాన్నీ ఇంకా అనేకానేక సాంప్రదాయాలని కలగలిపి ఇష్టం వచ్చినట్లు సాంబారు వండిన ఆయన చివరకు ఎటుపోవాలో అర్ధంకాక గందరగోళంలో పడే అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నది.ఇప్పటికే వారు ఒక డెడ్ ఎండ్ కు చేరినట్లు వాళ్ళ కార్యక్రమాలను చూస్తే నాకనిపిస్తున్నది. ఇకపోతే,ఆయన శిష్యుల సంగతి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది.

పూజలూ వ్రతాలూ మంచివి కాకపోతే మహర్షులు వాటిని ఎందుకు ప్రోత్సహించారు?అన్ని పురాణాలు వ్రాసిన మన మహర్షి వేదవ్యాసునికి ఇంత చిన్న విషయం తెలియలేదా?ధ్యానం అంటే ఏమిటో లోకానికి బోధించిన మహర్షులకు ధ్యానం గురించి తెలియదా?మనంత తెలివి వాళ్లకు లేదా?అని ఆలోచిస్తే ఎవరికైనా ఒక్క విషయం తెలుస్తుంది.

మన హిందూమతం లేదా సనాతనధర్మం లేదా ఆర్షధర్మం అనబడేది ఒక యూనివర్సిటీ వంటిది.ఇందులో కేజీ నుంచి పీజీయే కాదు రీసెర్చి వరకూ అన్ని విభాగాలూ ఉన్నాయి.మనకేది సరిపోతుందో మనమే స్థాయిలో ఉన్నామో మనమే క్లాసులో చేరాలో తెలుసుకుని అక్కడనుంచి మొదలుపెట్టి పైకి ఎదగాలి.అంతేగాని మనకు అర్ధమైన స్వల్పవిషయాన్ని చూచుకుని అదే సర్వస్వం అనుకుని ఇక మిగిలిన అంతా అనవసరం అనీ పనికిరానిదనీ విమర్శించడం చాలా పొరపాటు.ఈ యూనివర్శిటీ ని ప్రారంభించినవాళ్ళు సామాన్య్లులు కారనీ మనకంటే వాళ్లకు తెలివితేటలూ జ్ఞానమూ కొన్ని లక్షల రెట్లు ఎక్కువనీ మనం మరచిపోరాదు.

పై క్లాసులకు ఎదగకుండా ఉన్న క్లాసులోనే ఉండటం ఎంత పొరపాటో, నేనున్న విభాగమే మంచిది ఈ యూనివర్సిటీలో ఇక మిగిలిన విభాగాలన్నీ తప్పులే అనుకోవడమూ అంతే పొరపాటు.ఇదే పొరపాటును చాలామంది హిందువులు నేడు చేస్తున్నారు.వారివారి గురువులూ చేయిస్తున్నారు.

చాలామంది చేస్తున్న ఇంకొక ఘోరమైన తప్పు ఉన్నది.

మనం ఒక ఆధ్యాత్మిక సంస్థలోనూ కల్ట్ లోనో చేరతాం.ఇక మిగిలిన మనుషులందరూ అంటరానివాళ్లనీ అజ్ఞానులనీ వాళ్ళ పొడకూడా మనకు సోకరాదనీ అనుకుంటూ అందర్నీ దూరంగా ఉంచడమే ఆ తప్పు.ఈ తప్పును చాలామంది చేస్తూ ఉండటం నేడు మనం చూస్తున్నాం.

నిజమైన ఆధ్యాత్మికత అంటే వికాసం చెందటం.మన పరిధి క్రమేణా విస్తృతం కావాలి.అందరినీ మనం దగ్గరకు చేర్చుకోవాలి.విశాలమైన భావాలూ దృక్పథమూ మనకు రావాలి.సమస్త ప్రపంచాన్నీ అక్కున చేర్చుకునే మనస్తత్వం మనకు రావాలి.అదీ నిజమైన ఆధ్యాత్మికత.అంతేగాని మనలోకి మనం కుంచించుకుపోతూ ఎదుటివారిని అంటరానివారిగా చూస్తూ ఉంటే అది ఆధ్యాత్మికత కాదు.అదొక మానసికరోగం మాత్రమే.అటువంటి వారికి కావలసినది ధ్యానమూ సాధనలూ కాదు.వారికి అర్జంటుగా మానసిక వైద్యం ఇప్పించాలి.

వ్రతాలూ మంచివే,పూజలూ మంచివే,ధ్యానాలూ మంచివే,యోగాలూ మంచివే.నీరు పారుతున్నంతవరకూ కుళ్ళుడు పట్టదు.అదే నిలబడిపోతే కుళ్ళిపోతుంది.చేసే మనలో మంచితనం ఉంటె అన్నీ మంచివే.ఉండకూడని చండాలమంతా మనలోనే ఉంటే మనం చేసే సాధనలు కూడా అలాగే ఉంటాయి.అవి ఎంత గొప్ప సాధనలూ యోగాలూ అయినా మనలోని దరిద్రమే వాటిలోనూ ప్రతిఫలిస్తుంది.కనుక సాధనలు ముఖ్యం కాదు.మనమేమిటి అనేదే అసలైన విషయం.   

ఎవరికి ఏది అవసరం?ఎవరికి ఏది మంచిది?అన్న ప్రశ్నకు ఒకే సమాధానం ఉన్నది.ఎవరు దేనిని ఆచరించగలరో వారికి అది మంచిది.ఇంకొకరు ఇంకొకదానిని ఆచరిస్తూ ఉన్నంత మాత్రాన అది చెడ్డదికాదు.కాకపోతే, ఎక్కడివారు అక్కడ మురిగిపోకూడదు.ఏ విధానంలోనైనా సరే stagnation మంచిది కాదు.stagnation వచ్చిందంటే అది ఏ విధానమైనా ఏ మతమైనా వారు తప్పు చేస్తున్నట్లే లెక్క.

తనకు చేతనైనదానిని చేస్తూ అక్కడనుంచి మున్ముందుకు ఎదగడమే నిజమైన ఆధ్యాత్మికత.అంతేగాని కళ్ళకు గంతలు కట్టుకుని మనకు కనిపిస్తున్నంతవరకే సత్యం అనుకొని ఎదుటివారిని విమర్శించడం,వారిని దూరం చేసుకోవడం నిజమైన అధ్యాత్మికత కాదు.

సరిగ్గా చేస్తే అన్నీ మంచివే.ఆ సరిగ్గా చేసే విధానం ఏమిటో తెలుసుకోవడమే మన బాధ్యత.తెలుసుకున్నదానిని ఆచరించడమే మన తెలివి.

తమ కుటుంబసభ్యులను తామే ప్రేమించలేనివారు ఆధ్యాత్మికంగా ఎదగలేరు.తమ కుటుంబసభ్యులతో సమానంగా ఇతరులను కూడా ప్రేమించలేనివారు కూడా ఆధ్యాత్మికంగా ఎన్నటికీ ఎదగలేరు.

కళ్ళకు గంతలు కట్టుకోవడం ఆధ్యాత్మికత కాదు.కళ్ళకు ఇప్పటికే ఉన్న గంతలూ పొరలూ అన్నీ విడిపోవడమే నిజమైన ఆధ్యాత్మికత.
read more " వ్రతాలు-పూజలు-ధ్యానాలు-నిజమైన ఆధ్యాత్మికత "