“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

2, మార్చి 2014, ఆదివారం

వీరవిరాగిణి అక్కమహాదేవి జాతక విశ్లేషణ-జీవితం

వీరశైవ సాంప్రదాయంలో అక్కమహాదేవి పేరు తెలియనివారు ఉండరు.ఆమె మహా శివభక్తురాలు.వీరవిరాగిణి.తనకంటే వయసులో ఎంతో పెద్దవారైన అల్లమప్రభువు,చెన్న బసవేశ్వరుడు మొదలైన మహనీయులచేత 'అక్కా' అని సగౌరవంగా పిలిపించుకున్న జ్ఞాని. ఆమెలో భక్తీ జ్ఞానమూ సమపాళ్ళలో కలసి వెలుగుతూ ఉండేవి.

ఆమె ఇరవైఏళ్ళకే సమాధిలో జీవితాన్ని స్వచ్చందంగా చాలించిందని కొందరు అంటారు.ఇరవై ఐదేళ్ళకు ఆ సంఘటన జరిగిందని ఇంకొందరు వ్రాశారు.ఏదేమైనా ఆమె ఇరవైఅయిదు ముప్ఫై ఏళ్ళకు మించి బ్రతకలేదనేది అందరూ ఒప్పుకుంటున్న అభిప్రాయం.ఆమె జీవించి ఉన్న ఆ కొద్దికాలంలో తనకు ఎనిమిది ఏళ్ల వయసునుంచీ ఆమె శివధ్యానంలోనే ఎక్కువ కాలం గడిపింది.చివరకు శివధ్యానంలోనే శ్రీశైలక్షేత్రంలో తన ప్రాణాన్ని వదలిపెట్టింది.ప్రపంచంలోనే అతి కొద్దిమందిలో కనిపించే తీవ్రమైన భక్తి ఆమె సొంతం.

అక్క జన్మించిన సంవత్సరం మీద భిన్నాభిప్రాయాలున్నాయి.మనకు చరిత్రను రికార్డ్ చేసే విధానం సరిగ్గా లేదు.పాతకాలంలో రాజులకు వాళ్ళలో వాళ్ళు కొట్టుకోవటమూ పరాయి రాజులకు ఉప్పందించడమూ తప్ప వేరు పనిలేదు.ఉన్న ఒక్క ఖగోళ జ్యోతిష్యవిధానాన్నీ మనం నమ్మం. కాగితాల మీద వ్రాస్తే అవి నశిస్తాయని రాళ్ళమీద మనవాళ్ళు శాసనాలు చెక్కారు. అయితే మన నిర్లక్ష్యంవల్ల అవి ఏ బ్రిటిష్ మ్యూజియానికో తరలి వెళ్ళిపోతాయి.

నక్షత్రాలలో అయితే ఏ రికార్డ్ అయినా భద్రంగా ఉంటుందని ముఖ్యమైన సంఘటనలను ప్రాచీనులు ఖగోళరీత్యా రికార్డ్ చేశారు.కాని మనం వాటిని నమ్మం.ఎవడో తెల్లవాడు వచ్చి చెబితేగాని మన అడ్రసు మనకు తెలియదు.మళ్ళీ గర్వంలోనూ పొగరులోనూ మనం ఎవరికీ తీసిపోం. ఇన్ని బానిసలక్షణాలున్న ఆత్మాభిమాన హీనజాతి ఎలా బాగుపడుతుంది?అందుకే విదేశీయులు వెయ్యేళ్ళపాటు మనల్ని ఏకధాటిగా పరిపాలించారు. ఇష్టం వచ్చినట్లు దేశాన్ని దోచుకెళ్లారు.

అక్క 12 వ శతాబ్దంలో పుట్టినట్లు అందరూ ఒప్పుకుంటున్నారు.ఆమె 1170లో పుట్టిందని కొందరన్నారు.1150లో పుట్టిందని కొందరన్నారు. 1130లో పుట్టిందని ఇంకొందరి అభిప్రాయం.అయితే,ఆమె చైత్రపూర్ణిమ రోజున పుట్టినట్లు దొరుకుతున్న చారిత్రిక ఆధారాలను అందరూ ఒప్పుకున్నారు.ఆమె జీవితం మనకు తెలుసు కాబట్టి జ్య్తోతిష్యసూత్రాల నుపయోగించి ఆమె జనన సంవత్సరం గణించడం పెద్ద విషయం కాదు.

మామూలు మనుషుల జాతకాలను నేను చూడటానికి అంత ఇష్టపడను.ఎంతసేపూ డబ్బూ,ఉద్యోగమూ,వ్యాపారమూ పెళ్ళీ, పిల్లలూ, దోషాలూ,స్వార్ధపుకోరికలూ ఇలాంటి జాతకాలు చూచి ఉపయోగం ఏముంది?చూస్తే మహనీయుల జాతకాలు చూడాలి.తద్వారా వారి మహత్తరమైన జీవితాలను ఒకసారి అధ్యయనం చేసే అవకాశం కలుగుతుంది.మామూలు మనుషుల జాతకాలు చూస్తే ఏముంటుంది?చెత్త తప్ప?

అందుకే ఇప్పుడు బ్రతికి ఉన్న మామూలు మనుషుల జాతకాలకంటే కొన్ని వందలవేల ఏళ్ళనాడు గతించినా సరే మహనీయులైనవారి జాతకాలు చూడటానికే నేను మొగ్గు చూపుతాను.డబ్బుకోసం నేను జ్యోతిష్యం చెప్పను గనుక నాఇష్టం నాది.నాకిష్టమైతే ఎవరి జాతకమైనా చూస్తాను.లేకుంటే లేదు.నాకిష్టమైతే రెమేడీలు చెబుతాను.లేకుంటే లేదు.

ఆ విషయం అలా ఉంచితే,పై మూడు సంవత్సరాలలో ఉడుతడి గ్రామానికి (అక్క పుట్టిన ఊరు 'ఉడుతడి'.ఇది కర్నాటకలోని షిమోగా జిల్లాలో ఉన్నది)చైత్రపౌర్ణమి కుండలులను ఒకసారి పరిశీలిద్దాం.ఆరోజు రాత్రి మొదటిజాము దాటిన కొద్దిసేపటికి అక్క పుట్టిందని చాలామంది విశ్వసిస్తున్నారు.

9-4-1170 చైత్ర పౌర్ణమి
1-4-1130 చైత్ర పూర్ణిమ
21-3-1150 చైత్ర పూర్ణిమ

ఈ మూడు జాతకచక్రాలలో 1170 ది మాత్రమే అక్క జాతకానికి బాగా సరిపోతున్నదని నాఅభిప్రాయం. కనుక 9-4-1170 నాటి చైత్ర పౌర్ణమి తేదీనే అక్క జన్మదినంగా నేను తీసుకుంటున్నాను. 
   
దానికి కారణాలను క్లుప్తంగా వివరిస్తాను.మూడు కుండలులలో సన్యాసయోగం ఒక్క 1170 కుండలికే ఉన్నది.1150 కుండలికి కుజ శుక్రయోగం మేషంలో ఉన్నది. కామాన్ని జయించిన అక్క మహాదేవికి ఈ యోగం ఉండటం సంభవం కాదు. 1130,1150 లలో రవి మేషంలో లేడు.ఉజ్జ్వల జ్ఞానమూర్తియైన అక్క జాతకంలో సూర్యుడు బలంగా ఉండాలి.అది 1170 లో మాత్రమే కనిపిస్తున్నది.పైగా 1150 జాతకానికి గురువు వక్రించి ఉన్నాడు.కనుక ఎలా చూచినా 1170 కే ఎక్కువ మార్కులు పడుతున్నాయి.అందుకని ఆ సంవత్సరంలో వచ్చిన చైత్ర పౌర్ణమినే నేను అక్క జన్మదినంగా స్వీకరిస్తున్నాను. 

మిగిలిన రెండు జాతకాలలో శని కేతువులు కలసి ఉండటమూ చంద్రకేతువులు కలసి ఉండటమూ వంటి కొన్ని ఆధ్యాత్మిక యోగాలున్నప్పటికీ సన్యాసయోగం బలంగా ఉన్న జాతకం 1170 కనుక దానినే అక్క జననసంవత్సరంగా తీసుకుందాం.

ఇప్పుడు ఆ కుండలిలోని కొన్ని విషయాలను గమనిద్దాం. నవాంశలో కుజుని ఉచ్ఛ స్థితివల్ల అక్క చాలా పట్టుదల కల్గిన వ్యక్తి అని తెలుస్తున్నది.కనుకనే దాదాపు వెయ్యి సంవత్సరాల నాడే ఆనాటి చాందస కట్టుబాట్లనూ ఆచారాలనూ ధిక్కరించి బట్టలు వదలివేసి సంఘంలో నగ్నయోగినిగా సంచరించగలిగింది.క్రూరమృగాలతో నిండిన అడవులలో ఏ సహాయమూ లేకుండా ఏ ఆహారమూ లేకుండా ఏ తోడూ లేకుండా ఒక్కతే నగ్నంగా నడుస్తూ కర్నాటక నుంచి శ్రీశైలానికి రాగలిగింది.ఆరోజులలో మంచి వయసులో ఉన్న సౌందర్యవతి ఆపని చెయ్యాలంటే ఎంత ధైర్యమూ పట్టుదలా తన సాధనపైన తనకు ఎంత నమ్మకమూ,పరమేశ్వరుని పైన ఎంతటి అచంచలమైన విశ్వాసమూ ఉండాలో ఊహిస్తే దిగ్భ్రమ కలుగుతుంది.

సుఖస్థానంలో గానీ,కళత్రస్థానంలోగానీ సన్యాసయోగం ఉంటే వారికి వివాహం కాదు.ఒకవేళ అయినా వారికి సంసారం మీద పెద్దగా కోరిక ఉండదు.అయిష్టంగా సంసార జీవితం గడుపుతూ ఉంటారు.ఈ జాతకంలో సుఖస్తానంలో ఉన్న సన్యాసయోగం వల్ల అక్క ఆజన్మ బ్రహ్మచారిణిగా ఉండిపోయింది.

అక్కకు ఆత్మకారకుడు బృహస్పతి అయ్యాడు.ఆత్మకారకుడు ఉచ్ఛ సూర్యునితో కలసి ఉండటం మహత్తరమైన యోగం.ఇది ఉజ్జ్వలమైన జ్ఞానతేజస్సును ఇస్తుంది.అక్క జాతకంలో ఈ యోగం ఉన్నది.

కారకాంశ ధనుస్సు అయింది.అక్కడనుంచి పంచమంలో ఉచ్ఛసూర్యునితో కలసి లగ్నాధిపతి అయిన గురువు ఉండటం ఒక గొప్ప ఆధ్యాత్మిక సూచన.ఈ జీవి సామాన్యమైనది కాదనీ ఎంతో మహనీయమైన ఆత్మ అనీ సూచిస్తుంది.

అంతేగాక ఇదే యోగంవల్ల ఆమె మంచి కవయిత్రి కూడా అయింది. సామాన్యంగా యోగులైనవారు తమ అనుభవాలనూ అభిప్రాయాలనూ భావాలనూ కవితల రూపంలో వెలువరించడం జరుగుతూనే ఉంటుంది.పంచమంలో ఉన్న నీచభంగబుధుని వల్ల కూడా ఇదే సూచితం అవుతున్నది.

దశమంలోని కేతువు వల్ల ఒక గొప్ప  యోగినిగా సిద్దురాలిగా చరిత్రలో మిగిలిపోయింది.ఆ కేతువు శుక్రనక్షత్రంలో ఉంటూ ఆమెకు వివాహం లేకుండా చేశాడు.

నవమాదిపతి అయిన చంద్రుడు ద్వాదశంలో ఉండటం కూడా ఆధ్యాత్మిక యోగమే.నవాంశలో బుధ కేతువులు లగ్నంలో వచ్చి ఉండటం దీనికి బలాన్ని చేకూరుస్తున్నది.

చాలామంది జ్యోతిష్యశాస్త్రాన్ని నమ్మరు.నమ్మిన కొంతమంది కూడా తమ పద్ధతులు మార్చుకోకుండా దానిని తమ స్వార్ధానికి వాడుకోవాలని చూస్తారు.అలాంటివారు ఎన్నటికీ ఈ శాస్త్రం నుంచి ప్రయోజనాన్ని పొందలేరు.ఎందుకంటే ఇది ఒక మార్మికశాస్త్రం.మన అతితెలివీ స్వార్ధమూ గర్వమూ దీనిముందు ఎంతమాత్రం పనిచెయ్యవు.అలాంటి వారికి ఈ శాస్త్రం సహాయపడదు.

ఇక్కడ ఒక చిన్న జ్యోతిష్యరహస్యాన్ని పరిచయం చేస్తాను.పౌర్ణమినాడు పుట్టినవారికి వివాహజీవితం బాగుండదు.దీనిని చాలా జాతకాల్లో కొండగుర్తుగా గమనించవచ్చు.వీరిలో చాలామందికి పెళ్లి జరగదు.ఒకవేళ జరిగినా వారి వైవాహిక జీవితంలో ఏదో తీర్చలేని లోటు ఎప్పుడూ ఉంటుంది.సామాన్యంగా వీరి జాతకంలో కుటుంబ,సుఖ,కళత్రస్థానాలు చెడిపోయి ఉండటం చూడవచ్చు.దీనికి మార్మికమైన కర్మకారణాలు చాలా ఉన్నాయి.వాటిని నేను వివరించబోవడం లేదు.అర్హులైన వారికి మాత్రమే ఆ రహస్యాలు చెబుతాను.

అక్కమహాదేవి చిన్నప్పటినుంచి శివభక్తురాలు.ఎనిమిదేళ్ళ వయసునుంచే జపధ్యానాలు నిష్టగా చేసేది.గురుకులంలో చేసి శాస్త్రాలు అభ్యసించింది. వేదాన్తాన్నీ ముఖ్యంగా శైవసిద్ధాంతాన్ని ఔపోసన పట్టింది.సంస్కృతంలోనూ కన్నడంలోనూ మంచి పాండిత్యాన్ని సంపాదించింది.చిన్నప్పుడే మల్లికార్జున రూపంలో ఉన్న పరమశివుని తన భర్తగా స్వీకరించి ఆరాధించడం ప్రారంభం చేసింది.ఇది మాధుర్యభావ సాధన.భగవంతుని తన ప్రియునిగా భావించడం ఒక్క మన ఆర్షధర్మంలోని భక్తిమార్గంలోనే కనిపిస్తుంది.రాధాదేవి, మీరాబాయి మొదలైన ఎందఱో ఈ మార్గాన్ని అనుసరించి దైవప్రేమలో కరిగిపోయినవారే.

అక్కమహాదేవిని ఆ దేశపు రాజైన కౌశికుడు చూచి ఆమె అందాన్ని మోహించి వివాహం చేసుకోవాలని సంకల్పిస్తాడు.ఆమె ఒప్పుకోదు. మొండివాడైన కౌశికుడు బలప్రయోగంతోనైనా ఆమెను తన రాణిని చేసుకోవాలని ప్రయత్నిస్తాడు.అందరూ ఆమె అదృష్టానికి పొంగిపోతారు.కాని ఆమె నిర్లిప్తురాలు.లోకం దృష్టిలో అదృష్టం ఐనది ఆమె దృష్టిలో ఒక ప్రతిబంధకం.రాజదండనకు వెరచి తల్లిదండ్రులకు శిరచ్చేదం తప్పించడం కోసం ఆమె రాజును వివాహం చేసుకున్నదని కొందరంటారు. అలా వివాహం చేసుకోలేదనీ ఒక ఒప్పందం ప్రకారం కొంతకాలం కోటలో ఉంటాననీ తాను పెట్టిన షరతులకు రాజు ఒప్పుకుంటే అప్పుడు అతన్ని వివాహం చేసుకుంటాననీ ఆమె ఒప్పుకుందని కొందరంటారు.

కానీ ఆ షరతుల కాలం పూర్తికాకముందే ఒకరోజున కౌశికుడు ఆమెను బలాత్కారం చెయ్యబోగా ఆమె తప్పించుకుని కోట బయటకు వచ్చేసింది. "నీవు కోటను విడచి వెళ్ళాలని అనుకుంటే నేను ఇచ్చిన దుస్తులు వదిలేసి వెళ్ళు"- అని కౌశికుడు అనగా వెంటనే అందరి ఎదురుగా బట్టలు విసిరి పారేసి నగ్నంగా నడుచుకుంటూ నగరంలోకి వచ్చేస్తుంది.

ఎంతమంది చెప్పినా వినకుండా అలాగే సంచరిస్తూ అన్నింటినీ త్యజించిన విరాగిణిగా కల్యాణినగరానికి బయలుదేరి వెళ్ళి అక్కడ వీరశైవసిద్దులూ మహాతపస్వులూ అయిన అల్లమప్రభువు,బసవేశ్వరులను కలుసుకుంటుంది.వారు స్థాపించిన 'అనుభవ మంటపం'లోనికి సామాన్యంగా ఎవరినీ రానివ్వరు.అందులో ప్రవేశించాలంటే మంచిసాధకులై అనుభవజ్ఞానులై ఉండాలి.అలాంటివారినే అక్కడి సిద్ధులు వారిలో కలవనిస్తారు.ఊకదంపుడు పండితులనూ ఉపన్యాసకులనూ మెట్టవేదాంతులనూ వారు పొరపాటున కూడా తమ దగ్గరికే రానివ్వరు.వారు పెట్టే పరీక్షలలో ఉత్తీర్ణులైతేనే ఆ మంటపంలోకి ప్రవేశం సంభవం. అక్కమహాదేవిని అక్కడి జ్ఞానులు ఎన్నో ప్రశ్నలతో పరీక్షిస్తారు.

ఆమె నగ్నత్వాన్ని గురించి ప్రశ్నించిన కిన్నెర బొమ్మయ్య అనే సాధకునికి అక్క ఇచ్చిన సమాధానం ఎంతో ఆలోచింపచేస్తుంది.

'అసలు మీ దృష్టి నా నగ్నత్వం మీదకు ఎందుకు పోతున్నది?ఇదేనా మీ సాధన?దేహాన్ని తప్ప ఇంక దేనినీ మీరు చూడలేరా?' అని అక్క ప్రశ్నిస్తుంది.

ఆ జవాబుతో కిన్నెర బొమ్మయ్య నిరుత్తరుడై పోతాడు.

అనుభవ మంటపంలో గొప్పగొప్ప సాధకులైనవారి సమక్షంలో అల్లమప్రభువు ఆమెను అడిగిన ప్రశ్నలూ ఆమె ఆయనకు ఇచ్చిన జవాబులూ చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోయాయి.

'ఎందుకు ఇలా బట్టలు వదిలేసి తిరుగుతున్నావు?' అని అల్లమ ప్రభువు ఆమెను ప్రశ్నిస్తాడు.

దానికి అక్కమహాదేవి ఇలా జవాబిస్తుంది.

'ఈ ప్రపంచంలో సర్వే సర్వత్రా నా ప్రభుని కళ్ళున్నాయి.ఆయన నేత్రాలు సమస్తాన్నీ నిత్యమూ చూస్తున్నాయి.ఇంక ఆయననుంచి దాచుకోవడానికి నాలో ఏమున్నది?'

'ఈ వేషంలో ఉన్న నిన్ను ఇక్కడి జ్ఞానులు లోనికి అనుమతిస్తారనే అనుకున్నావా?'

'మీరు నిజమైన జ్ఞానులైతే తప్పక అనుమతిస్తారు.' అంది అక్కమహాదేవి.

'నీకు నిజంగా దేహస్పృహ లేకపోతే దేహాన్ని నీ కేశాలతో ఎందుకు కప్పుకున్నావు?అంటే నీ మనసులో ఇంకా కొంత సిగ్గు మిగిలి ఉన్నట్లేగా?అది ఉన్నంతవరకూ నీవు జ్ఞానివి ఎలా అవుతావు?' అని అల్లమప్రభువు అడిగాడు.

'నా దేహాన్ని చూచి మీలాంటి జ్ఞానులు కూడా కామానికి లోనౌతారన్న భయంతో,ఆ దోషం మీకు అంటకూడదని,మీకోసం ఈ దేహాన్ని కేశాలతో కప్పుకున్నాను.అంతేగాని నాకోసం కాదు.' అని అక్క బదులిచ్చింది.

'అయితే నీ భర్త ఎవరో చెప్పు' అని అల్లమప్రభువు అడిగారు.

'సర్వేశ్వరుడే నా భర్త.నిరాకారుడూ,నిర్గుణుడూ,ఏకస్వరూపుడూ,పరమ సుందరుడూ అయిన మల్లికార్జునుడే నా భర్త.కాలమనే వంటింటిలో ఆహారంగా మారే సామాన్య మానవులు నా మనస్సులో నిలవలేరు.' అని అక్క బదులిచ్చింది.

అప్పుడు అల్లమప్రభువు ఒక మార్మికమైన ప్రశ్నల పరంపరను ఆమెవైపు గుప్పిస్తాడు.

'శవం నేను చనిపోయానని అరుస్తుందా?దాగిన నిధి నేనున్నాను రమ్మని పిలుస్తుందా?తోడుపెట్టిన పాలు తియ్యగా ఉంటాయా?వీటికి జవాబు చెప్పు'అంటూ అడిగాడు అల్లమప్రభువు.

'అవన్నీ సాధ్యమే.' అక్క జవాబిచ్చింది.

'ఎలా సాధ్యం'?

'పరమేశ్వరుని సంకల్పానికి అసాధ్యం అంటూ లేదు' అక్క జవాబు.

'వివరించు'

'ఒక దేహాన్ని విడిచిన జీవుడు ఇంకొక దేహాన్ని ఆశ్రయించి మళ్ళీ జీవిస్తున్నాడు.అప్పుడు శవం మళ్ళీ బ్రతికినట్లే కదా.అతన్ని పట్టుకొని ఉన్న సంచిత ప్రారబ్ధ ఆగామి కర్మలనే గుప్తనిధులు కనిపించకుండా అతనిలోనే దాగిఉండి అతన్ని నిత్యమూ పిలుస్తున్నాయి.అతన్ని జుట్టు పట్టుకుని నడిపిస్తున్నాయి.గుప్తనిధులు పిలవడమంటే ఇదే.తోడుపెట్టిన పాలనుంచి నెయ్యి వస్తుంది.ఆ నెయ్యి తియ్యగా ఉండదా?అలాగే సాధన చెయ్యగా చెయ్యగా కలిగిన పరిపక్వతవల్ల ఇదే మనస్సులో జ్ఞానమనే తీపి ఉద్భవిస్తుంది.' అని అక్క జవాబిచ్చింది.
  
ఈ సంభాషణ అంతా వెయ్యి సంవత్సరాలనాడు జరిగిందన్న విషయం గుర్తుంచుకుంటే,మహాగురువులూ జ్ఞానమూర్తులూ అయినవారికి ఇరవై సంవత్సరాల చిన్నవయస్సులోనే అటువంటి జవాబులిచ్చిన అక్కమహాదేవి ఎంతటి జ్ఞానమూర్తియో అర్ధమౌతుంది.

ఆమె జవాబులు విన్న అనుభవమంటపంలోని సాధకులూ,సిద్ధులూ, మహనీయులూ అందరూ ఆమెను ప్రశంసించి వయస్సులో తమకంటే చిన్నదైనా ఆమెను 'అక్కా' అంటూ పిలిచి గౌరవించి తమలో ఒకదానిగా ఆమెను ఒప్పుకున్నారు.

'అమ్మా.నీ తపస్సుకూ నివాసానికీ అనువైన స్థలం శ్రీశైలక్షేత్రంలోని కదళీవనమే.నీవు వెంటనే బయలుదేరి అక్కడకు వెళ్ళి తపస్సులో ఉండు' అని అల్లమప్రభువు చెప్పారు.

వారి అనుమతితో అక్కడనుంచి బయలుదేరిన అక్క కాలినడకన నదులూ అడవులూ దాటుకుంటూ శ్రీశైలం చేరుకొని అక్కడి కదళీవనంలో ఉన్న గుహలో నివాసం ఏర్పరచుకొని తపస్సులో ఉండి అక్కడే పరమేశ్వర సాక్షాత్కారాన్ని పొంది ఆయనలో లీనమై పోయింది.శరీరం వదిలే సమయానికి ఆమెకు ఇరవై ఐదు లేదా ముప్పై ఏళ్ల వయస్సు ఉండవచ్చు.

తర్వాత కొంతకాలానికి అల్లమప్రభువు కూడా ఇక్కడకే వచ్చి స్థిరపడి తపస్సులో ఇక్కడే దేహాన్ని చాలించారు.

తొంభై ఏళ్ళు వచ్చినా ఇంకా కామంమీదా ధనంమీదా వాంఛ చావక ఇంకా ఇంకా నానామందులూ వయాగ్రాలూ మింగుతూ వాటికోసం వెంపర్లాడే యయాతులున్న నేటి సమాజంలోని నికృష్టులకు అక్కమహాదేవి వంటి మహాజ్ఞాని యొక్క స్థితి అర్ధం కావాలంటే వాళ్ళు ఇంకా ఎన్ని జన్మలెత్తాలో తేలికగా ఊహించుకోవచ్చు.

అక్కవంటి వారు కారణజన్ములు.వాళ్ళ సంస్కారాలు వేరు.వాళ్ళ ఆలోచనా విధానాలు వేరు.వాళ్ళ జీవితాలు వేరు.మనలాంటి క్షుద్ర జీవితాలు కావు వారివి.

మహారాణి అయ్యే అవకాశం వెదుక్కుంటూ వస్తే దానిని తిరస్కరించి ఆకలి దప్పులకు ఓర్చి అడవులలో కొండలలో ఒక్కతే నగ్నంగా సంచరిస్తూ పరమేశ్వరుని మీద అచంచలమైన విశ్వాసంతో అనుక్షణం పరమేశ్వర ధ్యానంలో తపోమయజీవితాన్ని గడిపి చివరకు అతి చిన్న వయస్సులోనే తన గమ్యాన్ని చేరుకోగలిగిన అక్కమహాదేవి వంటి వారికి జన్మనిచ్చిన భరతదేశం ధన్యభూమి.

నిరంతరమూ సంసారమూ డబ్బూ సుఖాలూ ఈర్ష్యాద్వేషాలతో కూడిన మనవంటి వారి మనస్సులలోని కల్మషాలూ కుళ్ళూకుత్సితాలూ,ఇలాంటి మహనీయులను స్మరిస్తేనన్నా,కొంత ఉపశమిస్తాయేమో?ఎంతసేపూ పనికిమాలిన చెత్త మాట్లాడుకుంటూ లోకుల గురించి నానా గాసిప్సూ చెప్పుకునే నేటిజనానికి ఇలాంటి మహనీయుల చరిత్రలు ఎలా నచ్చుతాయి?ఎప్పుడూ బురదలో పొర్లే పందులకు సుగంధభరితమైన మలయమారుతం యొక్క విలువ ఎలా తెలుస్తుంది?

వెయ్యి సంవత్సరాలనాడు అక్కమహాదేవి తపస్సు చేసిన కదళీవనం గుహలు శ్రీశైలంలో నేటికీ నిలిచి ఉన్నాయి.కొంతదూరం బోటులో కృష్ణా నదిమీదుగా ప్రయాణం చేసి ఆ గుహలకు చేరుకోవచ్చు.పిక్నిక్ కోసం పవిత్రక్షేత్రాలకు వెళ్ళి అక్కడి వాతావరణాన్ని పాడుచేసే మన ఆంధ్రావాళ్ళకు ఈ గుహల ప్రాముఖ్యత తెలియదు.కర్నాటక నుంచి ఎక్కువగా వచ్చె భక్తులు ఈ గుహలను దర్శిస్తూ ఉంటారు.

మన ఆంధ్రావాళ్ళు ఈ గుహలకు పోకపోవడమే మంచిది.ఎందుకంటే ఎక్కడికి పోయినా అనవసరమైన వాగుడుతోనూ లిట్టరింగ్ తోనూ ప్రకృతినీ అక్కడి ప్రశాంత వాతావరణాన్నీ పాడుచేసే చౌకబారు మనుష్యులు ఇలాంటి పవిత్ర స్థలాలకు పోకుండా వాటికి దూరంగా ఉండటమే మంచిది.కనీసం ఆయా స్థలాల తపోమయ వాతావరణమూ పవిత్రతా చెడిపోకుండా ఉంటుంది.

ఎలా ఉపయోగించుకోవాలో తెలిసిన సాధకులైనవారికి మాత్రం శ్రీశైలంలోని ఈప్రదేశం చాలా ఉపయోగిస్తుంది.కావలసినంత మానసికపవిత్రతా, ధ్యానశక్తీ,సాధనాబలమూ,అంతర్ద్రుష్టీ ఉంటే అక్కమహాదేవినీ, అల్లమప్రభువు నూ ఇంకా ఎందఱో మహాసిద్దులనూ ఇప్పటికీ ఇక్కడ దర్శించి వారి అనుగ్రహాన్ని పొందవచ్చు.వెయ్యి సంవత్సరాలు గడచినప్పటికీ పరమేశ్వరానుగ్రహంతో సూక్ష్మదేహాలతో వారందరూ ఇప్పటికీ ఇక్కడే ఉన్నారన్నది వాస్తవం.అనుభవ సత్యం.

కన్నడ సాహిత్య చరిత్రలోకూడా అక్కమహాదేవికి చిరస్మరణీయమైన స్థానం ఉన్నది.అక్క వ్రాసిన "వచనాలు" అనే చిన్నచిన్న వచనపద్యాలు ఎంతో నిగూఢమైన తాత్వికచిన్తననూ మార్మికతనూ ప్రతిఫలిస్తూ ఉంటాయి. నేటికి కూడా వాటిని చదివిన సాధకులకు అవి ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి.అక్క ఆలోచనాధారను ఆ 'వచనాల' ద్వారా తొమ్మదివందల సంవత్సరాల తర్వాత ఇప్పుడు కూడా మనం అందుకోవచ్చు.ఆమె సాన్నిధ్యంలో పునీతులం కావచ్చు.