“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

20, మార్చి 2014, గురువారం

హోమియో అద్భుతాలు - 31 ఏళ్ల పార్శ్వపు తలనొప్పి(Migraine)-రెండవభాగం

క్రానిక్ డిసీజెస్ లో పేషంట్ కు కౌన్సెలింగ్ చాలా తప్పనిసరిగా ఇవ్వవలసి ఉంటుంది.హోమియో ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది?ఎలా ఓపిక పట్టాలి?రోగం ఎలా తగ్గుతూ వస్తుంది?అన్న విషయాలు వివరంగా చెప్పవలసి ఉంటుంది.

'మీరు ముప్ఫై ఏళ్ళనుంచి దీనితో బాధపడుతున్నారు కదా?ఇప్పుడు హోమియోపతికి మారుతున్నారు.మీకు నొప్పి తగ్గుతుంది.కాని వ్యాధి పూర్తిగా నయం కావాలని వెంటనే ఆశించకండి.కనీసం ఒక ఏడాది పాటు నేను సూచించిన మందులను మీరు క్రమం తప్పకుండా వాడుతూ,నేను సూచించిన విధంగా పత్యం చేస్తూ ఉంటె మీకు పూర్తిగా తగ్గిపోతుంది.మరి మీరు సిద్ధమేనా?' అని అడిగాను.

'ఈ బాధ పోతుందంటే మీరు ఏమి చెప్పినా చెయ్యడానికి నేను సిద్ధం సార్' అని ఆయన అన్నాడు.

సరే.వినండి.ప్రస్తుతం మీ ఒంట్లో రెండు వ్యాదులున్నాయి.ఒకటి నేచురల్ డిసీజ్ రెండోది ఆర్టిఫిషియల్ డిసీజ్.ఒకటి మీకు సహజంగా వచ్చిన మైగ్రేన్.రెండు మీరు ఇన్నాళ్ళుగా ఇంగ్లీషు మందులు వాడటం వల్ల మీ ఒంట్లో పేరుకున్న పొల్యూషన్.మీరు వాడిన ఇంగ్లీష్ మందులు పెయిన్ సిగ్నల్స్ మీ మెదడుకు చేరకుండా అడ్డుకుంటాయి.దానితో మీకు బాధ తగ్గినట్లు అనిపిస్తుంది.కాని ఆ బాధ రావడానికి ఏదైతే మూలమో ఆ మూలం చక్కగా మీ ఒంట్లోనే తిష్ట వేసుకుని ఉంటుంది.అది రోజురోజుకూ బలాన్ని పుంజుకుంటూ ఉంటుంది.అందుకే మీరు మందుబిళ్ళ వేసుకుంటే తలనొప్పి తగ్గినా ఒంట్లో హాయిగా ఉండదు.ఏదో చికాకుగా అసహజంగా ఉంటుంది.మీకు ఇప్పుడు వస్తున్న,ఇప్పటికే వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఈ మందుల దుష్ప్రభావమే.

ఇప్పుడు ప్లాన్ ఆఫ్ ఏక్షన్ ఏమంటే ముందుగా మీమీద ఇన్నేళ్ళుగా ఉన్న ఇంగ్లీషు మందుల దుష్ప్రభావాన్ని అంటే ఆర్టిఫిషియల్ డిసీజ్ ని తీసివేయాలి.ఆ తర్వాత మీ ఒరిజినల్ డిసీజ్ అయిన మైగ్రేన్ పోవాలి.మీ ట్రీట్మెంట్ ఈ క్రమంలోనే జరుగుతుంది.

నేనిచ్చిన మందులు వేసుకున్న తర్వాత మీకు ఎలిమినేషన్ మొదలౌతుంది.అంటే,ఇన్నాళ్ళూ ఈ రెండు వ్యాధులవల్ల మీ ప్రాణశక్తి అణగిపోయి కుంగిపోయి ఉంటుంది.ఇప్పుడు నేనిచ్చే పొటెంటైజుడ్ మెడిసిన్ వల్ల మీ ప్రాణశక్తి బలం పుంజుకుని దానిని అణచివేస్తున్న ఈరెండు రోగాలనూ బయటకు త్రోసివేయ్యాలని ప్రయత్నిస్తుంది.దీనినే ఎలిమినేషన్ అంటాము. ఈ ఎలిమినేషన్ ప్రాసెస్ ఒక్కొక్కరికి ఒక్కొక్కవిధంగా ఉంటుంది. కొందరికి విరేచనాల రూపంలో,ఇంకొందరికి వాంతుల రూపంలో,మరికొందరికి చర్మరోగంలాగా వచ్చి తగ్గిపోతుంది.అది వచ్చినపుడు భయపడి ఇదేదో కొత్త రోగం అనుకుని నాకు చెప్పకుండా మీరు ఇతర మందులు ఏవీ వాడవద్దు. దీనిని మీరు జాగ్రత్తగా గమనించాలి.'అని చెప్పాను.

ఆయన సరేనంటూ ఒప్పుకున్నాడు.

లక్షణాలను క్రోడీకరించి చూడగా గ్లోనోయిన్, శాంగ్వినేరియా, ఫాస్ఫరస్, పల్సటిల్లా ఇండికేట్ అయ్యాయి.ఫస్ట్ రెమేడీ క్రింద పల్సటిల్లా-200 తో మొదలు పెట్టమని చెప్పాను.ఆరోజు సాయంత్రం మందు వేసుకున్న ఒక గంటకు తలనొప్పి క్రమేణా తగ్గిపోయింది.మర్నాడు ఉదయం నిద్ర లేచేసరికి తలనొప్పి రాలేదు.ఆయన సంతోషంగా ఫోన్ చేశాడు.

'త్వరపడకండి.ఒక్క డోస్ కే ఇంత దీర్ఘవ్యాధి తగ్గదు.సాయంత్రానికో రేపు ఉదయానికో ప్రత్యక్షమౌతుంది.ఓపిక పట్టండి.ఒకవేళ వస్తే మాత్రం మళ్ళీ పల్సటిల్లా రిపీట్ చెయ్యండి.' అని చెప్పాను.

ఈలోపల కేస్ ను మా అమ్మాయికి వివరించాను.తనెలాగూ BHMS చదువుతున్నది.రకరకాల కేసులు చూస్తె తనకూ క్లినికల్ ఎక్స్ పీరియెన్స్ ఉంటుంది.

'పేషంట్ బొద్దుగా ఉన్నాడు.తలలో చెమటలు పడతాయి.నిద్రలో తలలో చెమటలున్నాయి.కాల్కేరియా కార్బ్ ఇండికేట్ అయింది కదా.నీవు ఎందుకు దానిని ఇవ్వలేదు?' అని మా అమ్మాయి అడిగింది.

'గుడ్.కానీ పేషంట్ చిల్లీ పేషంట్ కాడు.హాట్ పేషంట్.చలికాలంలో కూడా చన్నీళ్ళు స్నానం చేస్తాడు.కాల్కేరియా కార్బ్ అలా చెయ్యలేడు.నీవు దానిని గమనించాలి.కనుక కాల్కేరియా కార్బ్ contra-indicate అయింది.నీవు పర్టిక్యులర్స్ కంటే జెనెరల్స్ కు ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వాలి.ఎందుకంటే జెనెరల్స్ పేషంట్ ను సూచిస్తాయి.పర్టిక్యులర్స్ రోగాన్ని సూచిస్తాయి.రోగం కంటే పేషంట్ ముఖ్యం.Totality అంటే అదే.డాక్టర్ కెంట్ దానినే నొక్కి చెప్పాడు.

అదీగాక ఆ లావు సహజమైన లావు కాదు.అది మందుల సైడ్ ఎఫెక్ట్ .కనుక దానిని నీవు ఒక లక్షణంగా తీసుకోకూడదు.సహజమైన రోగలక్షణాలనూ అసహజమైన డ్రగ్ డిసీజ్ నూ నీవు విడివిడిగా చూడడం అలవాటు చేసుకోవాలి.వ్యక్తికి నీవు మందివ్వాలి.రోగానికి కాదు.వ్యక్తి అంటే వ్యక్తిలోని ప్రాణశక్తి.ప్రాణం బలాన్ని పుంజుకున్నపుడు రోగాన్ని అదే తరిమేస్తుంది. డాక్టర్ సర్ జాన్ వెయిర్ చెప్పింది అదే.

అదిసరే,ఇంగ్లీష్ వైద్యంలోని ఓవర్ డ్రగ్గింగ్ తీసేయ్యాలంటే ఏయే మందులు మొదట్లో ఇవ్వాలో చెప్పు?' అని ప్రశ్నించాను.

'నక్స్ వామికా,పల్సటిల్లా' అని జవాబు చెప్పింది.

'వెరీ గుడ్.కానీ వాటిని కూడా రొటీన్ గా ఇవ్వకూడదు.Indicated remedy మాత్రమె ఇవ్వాలి.'అన్నాను

'మరి ప్రాణం బలాన్ని పొందటానికి ఏదైనా టానిక్ లాంటిది ఇవ్వొచ్చు కదా?' అడిగింది.

'చూడమ్మా.క్లాసికల్ హోమియోపతీ లో టానిక్స్ ఉండవు.నీవు Dr Kent's Lectures on Materia Medica శ్రద్ధగా చదువు.అందులో ఆయన ఒకచోట ఇలా అంటాడు.In Homoeopathy,there is no better tonic than the indicated remedy.It will take care of everything.'అన్నాను.

అనుకున్నట్లే మర్నాడు ఉదయం 3 గంటల సమయంలో తలనొప్పి ప్రత్యక్షమైంది.దానితోనే నిద్ర మెలకువ వచ్చేసింది.కానీ నాకు ఫోన్ చెయ్యకుండా అలాగే బాధను భరిస్తూ తెల్లవారేవరకూ కూచున్నాడు.తెల్లవారే సరికి నొప్పి బాగా ఎక్కువై వాంతులు మొదలయ్యాయి.

చూచీచూచీ పదిగంటల సమయంలో నేనే ఫోన్ చేశాను.విషయం తెలిసింది. పల్సటిల్లా వేసుకున్నా ఈ సారి నొప్పి కంట్రోల్ అవలేదు.శాంగ్వినేరియా-200 వేసుకోమని చెప్పాను.అది వేసుకున్నాక కొంచం తగ్గినట్లు ఉండి మళ్ళీ వాంతులు ఎక్కువయ్యాయి. వేచిచూడమని చెప్పాను.సాయంత్రం వరకూ అలా వాంతులు అవుతూ ఉన్నాయి.వాంతులు అవుతుండే కొద్దీ చాలా తేలికగా ఉన్నదని చెప్పాడు.

సాయంత్రం అయిదు ప్రాంతంలో మెడికల్ షాపుకు వెళ్లి కొన్ని ఇతర మందులు కొనుక్కుని నేనే వాళ్ళ ఇల్లు వెతుక్కుంటూ వెళ్లాను.ఎందుకంటే మందులు తెచ్చిపెట్టడానికి తన చేతికింద ఎవరూ లేరని తెలిసింది.తను ఉండే ప్రదేశం హోమియో మెడికల్ షాప్ ఉండే సెంటర్ కు బాగా దూరం.నేను ఫోన్ లో చెప్పినా ఆ మందులు తేవడానికి ఎవరూ అందుబాటులో లేరు.సరే,ఆ అడ్రస్ సరిగా దొరకక ఒకగంట సేపు అటూఇటూ తిరిగి చివరికి పట్టుకోగలిగాను.కర్మ అడ్డు వస్తున్నదని అర్ధమైంది.

నేను వెళ్లేసరికి వాంతులు ఇంకా అవుతున్నాయి.నేను కూచున్న కొద్దిసేపటి లోనే రెండుమూడు వాంతులు అయిపోయాయి.మొదట్లో కాఫీరంగు జిగట పదార్ధం,తర్వాత బ్రౌన్ కలర్ లోకి మారి,చివరికి రంగులేని శ్లేష్మం పడుతున్నది.అప్పటికి ఒక పదిమగ్గుల శ్లేష్మం పొట్టలోనుంచి పడిపోయిందని చెప్పాడు.రుచి ఎలా ఉన్నదని అడిగాను.ఉదయాన్నే మొదట్లో చేదుగా,రానురాను పుల్లగా,ఇప్పుడు సాయంత్రానికి ఏరుచీ లేకుండా పడుతున్నదని చెప్పాడు.ఎలిమినేషన్ జరుగుతున్నదని గ్రహించాను.

ఈలోపల వాళ్ళమ్మగారు లోపలనుంచి వచ్చారు.నన్ను చూస్తూ-'ఏదైనా ఆస్పత్రికి తీసుకెళితే మంచిదేమోనండి.బాధ చూడలేకపోతున్నాను. 'అన్నారు. నేనేమీ మాట్లాడలేదు.

తను అంత బాధలోకూడా పాపం నవ్వుతూ 'సార్ డాక్టరేనమ్మా.మందులు ఆయనే తెచ్చారు.' అన్నాడు.

ఆమె నావంక కొంత అనుమానంగా చూచింది.నా వాలకం చూస్తె డాక్టర్ లక్షణాలేమీ ఆమెకు కనిపించలేదు.పైగా డాక్టర్ అంటే ఒక నర్సింగ్ హోమ్ లో ఏసీ రూమ్ లో కూచుని చెబుతున్నది వినకుండా ఏవేవో మందులు వ్రాసేసి పొమ్మని కసురుకోవాలిగాని,ఇలా ఇంటికి వెతుక్కుంటూ మోటార్ సైకిల్లో వచ్చి పక్కన కూచుని ఏవో పిచ్చి మందులిస్తుంటే ఎలా నమ్మకం కుదురుతుంది?

లోలోపల నవ్వుకున్నాను.

ఒక గంటసేపు అక్కడే కూచున్నాను.వాంతుల ఉద్ధృతం కాస్త తగ్గుతున్నట్లు కనిపించింది.అప్పుడు ఫాస్ఫరస్-200 ఇచ్చి వేసుకోమని చెప్పాను.ఆ తర్వాత కొద్దిసేపు కూచున్నాను.వికారమూ,తలనోప్పీ తగ్గుముఖం పడుతున్నాయని ఆయన చెప్పాడు.ఒక గంటలో ఫోన్ చెయ్యమని చెప్పి ఇక నేను బయలుదేరి వచ్చేశాను.

గంటలో ఫోన్ వచ్చింది.వాంతులు మళ్ళీ రాలేదు.పొద్దుననుంచీ బాధ పెడుతున్న తిప్పుడూ వికారమూ మాయమయ్యాయి.తలనొప్పి బాగా తగ్గిపోయింది.ఒక 5% మాత్రం మిగిలి ఉన్నదని చెప్పాడు.లోపలనుంచి ఏదో పెద్ద బరువు తీసేసినట్లు చాలా తేలికగా హాయిగా ఉన్నదని చెప్పాడు.వెయిట్ చెయ్యమని చెప్పాను.ఉదయం నుంచీ ఏమీ తినలేదు కనుక తేలికగా అరిగే ఆహారం ఏదన్నా తీసుకోమని చెప్పాను.

మర్నాడు అంతా తలనొప్పి లేదు.వాంతులు ఆగిపోయాయి.వికారం లేదు.

కాని ఆ మర్నాడు ఉదయం మళ్ళీ తలనొప్పి వచ్చింది.అయితే ఈసారి కుడివైపు రాకుండా ఎడమవైపు వచ్చింది.ఉదయమే మొదలైంది.క్రమేణా పెరగడం లేదు.దాని ఉద్ధృతం తగ్గిందిగాని మళ్ళీ కనిపించింది.

గ్లోనోయిన్ -200 వేసుకోమని చెప్పాను.వేసుకున్న అరగంటలో తలనొప్పి పూర్తిగా మాయమై పోయింది.ఇప్పటికి ఇది జరిగి వారం అయింది.మళ్ళీ తలనొప్పి రాలేదు.

మధ్యలో ఒకసారి మాత్రం గుంటూరు వేసవి ఎండలలో ఒక రెండు మూడు గంటలు ట్రాక్ దగ్గర ఏదో పనిని సూపర్వైజ్ చెయ్యవలసి వచ్చింది.మధ్యాహ్నం భోజనం మిస్ అయింది.అప్పుడు మళ్ళీ లైట్ గా తలనొప్పి మొదలైంది.కొద్ది సేపు వేచిచూచి తగ్గకపోతే మళ్ళీ గ్లొనోయిన్-200 రిపీట్ చెయ్యమని చెప్పాను.వేసుకున్న అరగంటలో మళ్ళీ తగ్గిపోయింది.

మనిషి లావు తగ్గినట్లుగా కనిపిస్తున్నాడు.ముఖం చాలా తేటగా ఉన్నది. చాలా తేలికగా హాయిగా ఉన్నదని చెబుతున్నాడు.

'లావు తగ్గడానికి కొన్ని ఆసనాలూ ప్రాణాయామమూ నేర్పిస్తాను అవి చెయ్యండి.కాఫీ టీ మానేయ్యండి.కొన్ని ఆహార నియమాలు చెబుతాను.అవి పాటించండి.మళ్ళీ మునుపటిలా సన్నంగా అవుతారు' అని చెప్పాను.

అలాగే అని అంగీకరించాడు.

ప్రస్తుతానికి ఏ మందులూ వాడకపోయినా వారం నుంచీ ఏ తలనొప్పీ లేదు. వాంతులు లేవు.ఆకలీ నిద్రా బాగా ఉన్నాయి.మందులు వాడకుండా నొప్పి రాకుండా గత 31 ఏళ్ళలో ఇదే ప్రధమం.హోమియోపతి ఎలా పనిచేస్తుందో ప్రాక్టికల్ గా చూచాక ఇప్పుడు వాళ్లకు నమ్మకం కలిగిందని నాకనిపిస్తున్నది.

(అయిపొయింది)