“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

30, మార్చి 2014, ఆదివారం

హోమియోపతి సర్వరోగ నివారిణియా?

హోమియోపతిని నేను పొగిడే దానిని బట్టి అది సర్వరోగ నివారిణిగా నేను భావిస్తున్నానని కొందరు అనుకోవచ్చు.ఈ భావన సరికాదు.దాదాపు రెండు దశాబ్దాల అనుభవంతో నేను ఒక మాట నిజాయితీగా చెప్పగలను.హోమియోపతి సర్వరోగనివారిణి కాదు.నేడు వస్తున్న,లేదా పూర్వంనుంచీ ఉన్న అనేక రోగాలకు అందులో మందులు లేవు అన్నది చేదువాస్తవం.

మిగిలిన వైద్య విధానాలకంటే హోమియోపతి మంచిదే అనడంలో ఏ అనుమానమూ లేదు.కాకపోతే అందులో కూడా తగ్గని రోగాలు చాలా ఉన్నాయి.అలాంటి కొన్ని రోగాలకు ఆయుర్వేదంలో చక్కని మందులు ఉన్నాయి.ఇది వినడానికి వింతగా ఉండవచ్చు.కాని నిజం.

నిజానికి ఏ వైద్యవిదానమూ పర్ఫెక్ట్ కాదు.ఇవన్నీ పడుతూ లేస్తూ నేర్చుకుంటూ ముందుకు సాగుతున్న ప్రక్రియలే.కాకపోతే ఈ క్రమంలో తక్కువ హానితో ఎక్కువగా మేలు చేసేది ఏది అని ఆలోచిస్తే కొన్నింటికి ఎక్కువ మార్కులు పడతాయి.కొన్నింటికి తక్కువ మార్కులు పడతాయి.కాని అన్నీ ఎదిగే క్రమంలో ఉన్నట్టివే.హోమియోపతి ఈ భావనకు అతీతమైనది ఏమీ కాదు.

నా అనుభవంలో హోమియోపతికి లొంగని రోగాలను నేను చూచాను.దానికి కారణం వైద్యం తెలియకపోవడం కాదు.ఆయా రోగాలను తగ్గించే మందులు హోమియోపతిలో లేకపోవడమే.

డాక్టర్ హన్నేమాన్ విరచిత 'ఆర్గనాన్ ఆఫ్ మెడిసిన్' కాని, 'క్రానిక్ డిసీజెస్' కాని మనం క్షుణ్ణంగా చదివితే ఒకవిషయం అర్ధమౌతుంది.డా||హన్నేమాన్ కూడా చాలారోజులు మొక్కలనుంచీ లోహాల నుంచీ మినరల్స్ నుంచీ విషాలనుంచీ తీసిన మందులు వాడి రోగాలు తగ్గించేవాడు.కాని కొన్ని రోగాలు ఈ మందులకు తగ్గకపోవడం ఆయనకూడా గమనించాడు.ఆ క్రమంలో పన్నెండేళ్ళ రీసెర్చి అనంతరం ఆయన 'మయాజం' అన్న భావాన్ని కనుక్కున్నాడు.

ఈ 'మయాజం' అన్న దోషం రోగిలో ఉన్నపుడు ఇండికేటేడ్ మందులు పనిచేయ్యవని ఆయనకూడా గ్రహించాడు.అప్పట్లో ఆయన అనుభవాన్ని బట్టి సోరా,సిఫిలిస్,సైకోసిస్ అనబడే మూడు మయాజంలే ప్రపంచంలో ఉన్నాయని ఆయన అనుకున్నాడు.తర్వాతి తరాలవారు వారి పరిశోధనలో ట్యూబర్కులర్ మయాజం,కేన్సర్ మయాజం మొదలైన ఇంకా ఉన్నాయని గ్రహించారు.అందుకే హానిమాన్ ప్రవేశపెట్టిన సోరినం,సిఫిలినం,మెడోరైనం మొదలైన విషఔషధాల సరసన ట్యూబర్కులైనం,కేర్సినోసిన్ మొదలైన నోసోడ్స్ చేరాయి.

ప్రస్తుతం వీటన్నిటినీ మించి ఎయిడ్స్ ఒకటి తయారైంది.ఎయిడ్స్ వైరస్ ను కూడా పోటెంటైజ్ చేసి 'ఎయిడినం' అనే మందుగా కొందరు చేశారు.ఎయిడ్స్ రోగుల ట్రీట్మెంట్ లో అది చాలామంచి ఫలితాలను ఇస్తున్నదని కొందరు చెబుతున్నారు.

నా మిత్రులైన ఒక సీనియర్ హోమియో డాక్టర్ ఈ మధ్యనే ఒక విషయం చెప్పారు.ఒక రోగికి ఇలాగే ఏ మందు ఇచ్చినా పనిచేయ్యకపోతుంటే చివరికి అతని రక్తం ఒక బొట్టు తీసుకుని దానినె potentize చేసి మందుగా అతనికే ఇస్తే అప్పుడు అతనికి మందులు పనిచెయ్యడం మొదలుపెట్టి అతను మృత్యుముఖంలో నుంచి బయటపడ్డాడని చెప్పారు.

కనుక హోమియోపతిలో కూడా ఏ మందూ పనిచెయ్యని స్టేజ్ ఒకటి వస్తుంది.అది అన్నిరోగాలలో రాదు.కాని కొన్ని రోగాలలో ఈ పరిస్తితి వస్తుంది.అందుకే మనం నోసోడ్స్ డ్రగ్ పిక్చర్స్ లో చదివితే 'when the well indicated remedy fails to act or improve permanently'అనేమాట తరచుగా కనిపిస్తుంది.అలాంటప్పుడు నోసోడ్స్ వాడటం తప్పనిసరి అవుతుంది.'విషానికి విషమే విరుగుడు' అన్న మాట ఆయుర్వేదంలో కూడా ఉన్నది.

అలాంటి పరిస్థితుల్లో ఆ రోగకారక వైరస్సో బాక్టీరియానో ఏదైతే ఉంటుందో దానినె potentize చేసి అతనికి మందుగా ఇస్తేతప్ప ఆ రోగి respond కాడు.ఈ విధానాన్ని Isopathy అని డా|| హన్నేమాన్ అన్నాడు.ఇలాంటి పరిస్తితి ముఖ్యంగా autism,candida infection,hormonal imbalance మొదలైన అనేక రోగాలలో కనిపిస్తుంది.ఇవి సామాన్యమైన మందులకు లొంగవు.

కాని విచిత్రం ఏమంటే,ఇలాంటి రోగాలు కూడా ఆయుర్వేదంలో ఉన్న కొన్ని మందులకు తగ్గుతాయి.దీనిని నేను అనుభవంలో గమనించాను.అయితే దానికి కూడా ఎంతో అనుభవమూ పరిశీలనా మంచిమందులు సరైన సమయంలో వాడటమూ జరగాలి.అప్పుడే అవి తగ్గడం గమనించాను.ప్రాచీన ఆయుర్వేదం ఎంత గొప్ప సైన్సో నేను అప్పుడు అర్ధం చేసుకోగలిగాను.

హోమియో మెటీరియా మెడికాలో దాదాపు 300 మందులున్నాయి.వీటిలో 100 మందులు డా||హన్నేమాన్ ప్రవేశ పెట్టినవే.ఈ మందులలిస్టు ఇంకా ఇంకా పెరుగుతూ పోతున్నది.కొత్తకొత్త మందులు ఆవిర్భవిస్తున్నాయి. ఆయుర్వేదంలో ఉన్న కొన్ని అద్భుతమైన మందులను హోమియోపతి కూడా స్వీకరించి వాటిని proving చేసి,లక్షణాలను రాబట్టి వాటిని కూడా వాడుకుంటే ఇంకా అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు.సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ హోమియోపతి ఈ దిశగా పరిశోధనలు చేస్తున్నది.ఇంకా ఎంతో చెయ్యవలసిన అవసరమూ ఉన్నది.

ఈదిశగా కొందరు బెంగాల్ హోమియో డాక్టర్లు ఇప్పటికే పరిశోధన చేశారు.అనేక మందులను(Indian drugs)ప్రూవ్ చేశారు.కానీ ఇంకా చాలావాటిని చెయ్యవలసిన అవసరం ఉన్నది.ఇప్పటికే ప్రూవ్ చేసిన వాటిని కూడా,పైపైన prove చెయ్యడం కాకుండా,లోతుగా డా||హన్నేమాన్ చేసిన విధంగా క్షుణ్ణమైన provings చెయ్యబడాలి.అప్పుడే హోమియోపతిలో కూడా నేడు తగ్గని అనేక రోగాలు తగ్గడం మనం చూడగలం.

ప్రస్తుతానికి హోమియోపతి సర్వరోగనివారిణి కాదు.మిగిలిన ఎన్నో వైద్యవిధానాలలాగే అదికూడా రోజురోజుకూ నేర్చుకుంటూ క్రమేణా ఎదుగుతున్న సైన్స్ మాత్రమే అనేది నిజం.దానిలో కూడా పురోగతికీ రీసెర్చికీ ఎంతో అవకాశం ఉన్నది.