“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

8, ఏప్రిల్ 2014, మంగళవారం

శ్రీరామ నవమి

ఈ రోజు శ్రీరామనవమి.

మనలో చాలామందికి చాలా పవిత్రమైన రోజు.

శ్రీరామకధ మన దేశపు ఎల్లలు దాటి చాలా దేశాలకు పయనించింది.

స్వయానా దానిని వ్రాసిన వాల్మీకే--"సూర్య చంద్రులూ నక్షత్రాలూ ఉన్నంతవరకూ ఈ కధ నిలిచి ఉంటుంది" అన్నాడు.

పాతకాలంలో చూస్తే మన దేశంలో రామాలయం లేని ఊరు ఉండేది కాదు.శ్రీరాముని పూజించని ఇల్లూ ఉండేది కాదు.

కాని నేటి పరిస్థితి ఒక్కసారి చూద్దాం.

నేడు--

అసలు శ్రీరాముడు పుట్టనే లేదని మనం వాదిస్తాం.

రామాయణం కల్పితకధ అని ఎగతాళి చేసే ఇతర మతస్తులను మనం నెత్తిన పెట్టుకుని గౌరవిస్తాం.వారి హక్కులను చాలా జాగ్రత్తగా పరిరక్షిస్తాం.

శ్రీరాముడు ఆడదైన తాటకిని చంపడం ఎంత తప్పు? అని విమర్శిస్తాం.

వాలిని చెట్టు చాటునుంచి చంపడం ఎంతటి తప్పు? అనీ విమర్శిస్తాం.

తండ్రి ఏదో ఆవేశంలో అన్నమాటకు శ్రీరాముడు అంత విలువ ఇవ్వడం ఎంతవరకు సమంజసం? అని కూడా వాదిస్తాం.

ఆ మాటను పట్టుకుని తన భార్యనూ తమ్ముడినీ కూడా తనతోబాటు అడవులలో తిప్పి అన్ని కష్టాలకు గురిచెయ్యడం ఎంతవరకు సరియైన పని? అని కూడా వాదిస్తాం.

చివరిలో సీతను అగ్నిప్రవేశం చెయ్యమని ఆజ్ఞాపించడం ఎంతవరకు కరెక్ట్? అని కూడా విమర్శిస్తాం.

వివాదాస్పదమైన ఉత్తరరామచరితం లోని శంబుకవధనూ మనం తూర్పారబడతాం.

కాని,ఇదంతా వాగే ముందు, వాల్మీకి అనే ఆయన రామాయణంలో అసలేమి వ్రాశాడో మనం చదవం.ఆయా సంఘటనల వెనుక ఉన్న నిజాలను మనం విస్మరిస్తాం.అలా చదివి వాటిని సరిగ్గా అర్ధం చేసుకోడానికి మనకు సంస్కృతం రాదు.దానిని ఎప్పుడో అటకెక్కించాం.

అనాగరికుడూ బోయవాడూ అయిన వాల్మీకి సంస్కృతంలో రామాయణం వ్రాశాడు.ఉన్నత చదువులు చదివి పీ హెచ్ డీలు సంపాదించిన మనకు దానిని చదవడం రాదు.భలే ఉంది కదూ?

మనకు తెలిసిన రామాయణం ఏదంటే--నాటకాలలో సినిమాలలో త్రాగుబోతు నటులు చూపించిన రామాయణం మాత్రమే.శ్రీరామవేషాలు వేసిన అనేకమంది నటులు నిత్యజీవితంలో అనేకపత్నీవ్రతులే అన్నది నగ్నసత్యం. కాని మనకు వాళ్ళే దేవుళ్ళు.అసలు రాముడు ఎవరో మనకి తెలియదు.

పోనీ ఆ సంగతి అలా ఉంచుదాం.

శ్రీరాముని ఊరకే పూజిస్తే సరిపోతుందా?

ఆయన పాటించిన విలువలు నిత్యజీవితంలో మనమూ పాటించవద్దూ? ఆపని మాత్రం చస్తే చెయ్యం.

అహంకారం అనే రావణుడూ,బద్ధకం అనే కుంభకర్ణుడూ,పొగరు అనే మేఘనాధుడూ,అతి తెలివి అనే మారీచుడూ మన లోలోపలే తిష్ఠ వేసుకుని కూచుని ఉన్నారు.ఇక మనం చేసే శ్రీరామపూజ ఎందుకు పనిచేస్తుంది? ఎలా పనిచేస్తుంది?

శ్రీరాముడు ఏకపత్నీ వ్రతుడై ఉండాలి.కాని మనం మాత్రం ఎందరితో నైనా తిరగవచ్చు.తిరగాలి.అలా తిరగకపోతే మొగపుటక పుట్టి చేతగానితనం అవుతుంది మరి.

మొన్నీ మధ్యన ఒక విషయం విని నిర్ఘాంతపోయాను.

ఒక పవర్ ఫుల్ పోస్ట్ లో పనిచేసిన ఒకానొక గవర్నమెంట్ ఆఫీసర్ తాను రిటైర్ కాబోయే ముందు ఒక పెద్ద పార్టీ ఇచ్చాడు.ఎందుకయ్యా ఈ పార్టీ అంటే ఒక బిత్తరపోయే నిజం తెలిసింది.తాను సర్వీస్ లో చేరినప్పటి నుంచి ఇప్పటివరకూ "వెయ్యిమంది" ఆడవాళ్ళను ఎంజాయ్ చేసి టార్గెట్ పూర్తి చేసిన సందర్భంగా ఈ పార్టీ ఇస్తున్నానని ఆయనే ఘనంగా ఆ సందర్భంగా ప్రకటించాడు.ఆ పార్టీలో పాల్గొన్నవారంతా జయజయ ధ్వానాలు పలుకుతూ హర్షం వెలిబుచ్చారు.ఆ వెయ్యిమందిలో చాలామంది ఆడవాళ్ళు కూడా ఆనందంగా ఆ పార్టీలో పాల్గొన్నారు.చిన్నప్పుడు చదివిన 'సహస్ర శిరచ్చేద అపూర్వ చింతామణి' కథ నాకు గుర్తొచ్చింది.

ఇవీ మనం పాటించే విలువలు !!

మనం ఎంతవరకూ నిత్యజీవితంలో నీతినీ ధర్మాన్నీ పాటిస్తున్నాం? అనడానికి ఒక చిన్న ఉదాహరణ ఏమంటే -- ప్రస్తుత ఎన్నికలలో ఏరులై ప్రవహిస్తున్న మద్యమూ డబ్బు సంచులూ.ఇంతకంటే మనం ఎంత నీతిపరులమో చెప్పడానికి ఇంకేమీ ఉదాహరణలు అవసరం లేదు.

ఈ మధ్యన లోకల్ ఎన్నికలలో పోటీ చేస్తున్న నా మిత్రుడిని అడిగాను.

'నీవు ప్రతి ఏడాదీ శ్రీరామనవమి పందిళ్ళు వేయించి ఘనంగా పూజలు చేయిస్తావు కదా? మరి ఎన్నికలలో ఇంత డబ్బు ఎందుకు పంచుతున్నావు? ఇది తప్పు కాదా?ధర్మ స్వరూపుడైన శ్రీరాముడు దీనిని మెచ్చుకుంటాడని నీవు భావిస్తున్నావా?'

'అది వేరు.ఇది వేరు.నేడు డబ్బు పంచకపోతే ఎన్నికలలో గెలిచే పరిస్తితి ఎవరికీ లేదు.' అని అతను జవాబిచ్చాడు.

'మరి గెలిచాక నీవు మళ్ళీ అవినీతి చేసి ఈ డబ్బంతా వెనక్కు రాబడతావు కదా? ఇలాగే కదా దేశం భ్రష్టు పడుతున్నది?' అడిగాను.

'పెద్దవాళ్ళు చేసినంత అవినీతి నేను చెయ్యను.నేనంత వెధవను కాను. చేతనైనంతలో నీతిగానే ఉంటాను.కాకపోతే పూర్తిగా మడి కట్టుకుంటే రాజకీయాలలో రాణించలేం' అని అతను అన్నాడు.

'అంటే శ్రీరాముడైనా ఈరోజులలో రావణుడిగా ఉండకపోతే బ్రతకలేడంటావు. అంతేనా?' అన్నాను.

అతను ఇబ్బందిగా నవ్వుతూ 'పూర్తిగా కాదుగాని.దాదాపుగా అంతే' అని ఒప్పుకున్నాడు.

ఈ ఒక్కరోజువరకూ శ్రీరాముని ఊరకే పూజిస్తే చాలదు.ఆయన ధర్మస్వరూపుడని వేదికలెక్కి మనం ఉపన్యాసాలిస్తే చాలదు.ఆయన ధర్మస్వరూపుడైతే మనకు ఒరిగేది ఏమీ లేదు.మనమేమిటి అన్నదే అసలైన ప్రశ్న.మనం నిలువెల్లా అధర్మంతో నిండి ఉండి,శ్రీరాముడు ధర్మస్వరూపుడు అని పొగిడితే ఉపయోగం ఏముంది?

మన నిత్యజీవితంలో వేసే ప్రతి అడుగులో ధర్మం కనిపించాలి. మన నడతలో శ్రీరాముడు ప్రత్యక్షమవ్వాలి.మనం పీల్చి వదిలే ప్రతి ఊపిరిలో రామతత్వం ప్రతిధ్వనించాలి.అదీ నిజమైన రామభక్తి.

రామాయణం గురించి వేదికలెక్కి గొప్పగా ఉపన్యాసాలిచ్చే ఒక వక్త గుంటూరులో ఉన్నాడు.ఆయన కాలేజీ రోజులలో ఎన్ని వేషాలేశాడో ఎంతమంది అమ్మాయిలతో తిరిగాడో అందరికీ తెలియకపోయినా కొందరికైనా తెలుసు.ఆ కొందరిలో కొందరు నాకు తెలుసు.వాళ్ళే నాకీ విషయం చెప్పారు.ఆయనకి 'ఆ' వీక్నెస్ కొంచం ఎక్కువే అని వాకబు చేస్తే తెలిసింది.అదీ విషయం!! 

జీవితంలోకి ఇంకని ఇలాంటి ఉపన్యాసభక్తి వల్ల ఏమీ ఉపయోగం లేదు.నీ వ్యక్తిత్వంలో సమూలమైన మార్పు రాకుండా,రామతత్వం నీ అణువణువులో ప్రవేశించకుండా ఎన్ని శ్రీరామ నవములు చేసినా,ఎన్నెన్ని ఉత్సవాలు చేసినా,ఎన్నెన్ని ప్రసాదాలు మెక్కినా,ఎన్ని ఉపన్యాసాలు చెప్పినా విన్నా ఏమీ ఉపయోగం లేదు.

"షో" కోసం చేసే భక్తి అసలు భక్తే కాదు.ఆ పేరుకు అదేమాత్రమూ తగదు.

ఈరోజు మన దేశాన్ని పట్టి పీడిస్తున్న అన్ని రకాల అవలక్షణాలకూ, దరిద్రాలకూ,జాడ్యాలకూ,రోగాలకూ,పిచ్చివేషాలకూ ఒక్కటే కారణం.మనం శ్రీరామునీ సీతాదేవినీ మనస్ఫూర్తిగా మరచిపోవడమే.

శ్రీరాముని ధర్మాచరణా,సీతామాత యొక్క పవిత్రతా పాతివ్రత్యమూ ఎక్కడా ఎవరిలోనూ నేడు కనిపించక పోవడమే ప్రస్తుత జాడ్యాలన్నిటికీ అసలైన కారణాలు.వారు ఆచరించి చూపిన విలువలను పూర్తిగా విస్మరించడమే మనం చేస్తున్న అసలైన తప్పు.

శ్రీరాముని గుడిలో మాత్రమే ఉంచి,రావణుడినీ అతని సైన్యాన్నీ గుండెల్లో ఉంచుకోవడమే అన్ని అనర్దాలకూ కారణం.

పూజల వరకూ శ్రీరాముడు,ఆచరణలో రావణుడుగా ఉండటమే సర్వ అనర్దాలకూ కారణం.

ఈ ఒక్క విషయం చక్కగా గ్రహించి,మనల్ని మనం నిజంగా మార్చుకున్ననాడు మాత్రమే మనం నిజమైన రామభక్తులం అవ్వగలం. అప్పుడే మనం ధర్మాన్ని నిజంగా అనుసరిస్తున్నట్లు లెక్క.

అప్పుడే ధర్మమూ మనల్ని కాపాడుతుంది.ధర్మ స్వరూపుడైన శ్రీరాముడూ అప్పుడే మన గుండెల్లో కొలువై ఉంటాడు.

పూజారికి డబ్బులు పారేసి ఏదో కాసేపు పూజలు చెయ్యడం కాదు. డబ్బులు పడేసి సీతమ్మవారికి చీరలు సమర్పించడం కాదు.నిత్యజీవితంలో శ్రీరాముని ప్రతిష్టించుకోవాలి.మన అడుగడుగులో రామతత్వం ప్రతిఫలించాలి.మన జీవితాలు శ్రీరామమయములు కావాలి.మనలో ఉన్న రాక్షసత్వాన్ని ప్రయత్నపూర్వకంగా మనం నిర్మూలించాలి.దాని స్థానే,దివ్యస్వరూపుడైన శ్రీరాముని మన గుండెల్లో నిలుపుకోవాలి.

ఆరోజే నిజమైన శ్రీరామనవమి.

అలా మనం అందరం ఉండగలిగిన రోజున మాత్రమే మన దేశం నిజమైన రామరాజ్యం అవుతుంది.అంతవరకూ మనకు గానీ మన దేశానికి గానీ నిష్కృతి లేదు.