“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

19, ఏప్రిల్ 2014, శనివారం

తెలుగుదేశం పార్టీపై శనిగ్రహ ప్రభావం

సామాన్య ప్రజల ఆకాంక్షలకూ శనిగ్రహానికీ అవినాభావ సంబంధం ఉంటుంది. అనేక వందల సంవత్సరాల పాటు సునిశిత పరిశీలన చేసి ప్రాచీనులు ఈ నిర్ధారణకు వచ్చారు.రాశిచక్రంలో శనిగ్రహ సంచారాన్ని బట్టి ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రజాఉద్యమాలూ,విప్లవాలూ జరిగాయి.గత చరిత్రను ఒక్కసారి తిరగేస్తే ఈ విషయం స్పష్టంగా చూడవచ్చు.

ఇంతకుమునుపు మూడేళ్ళక్రితం నేను వాసిన ఒక వ్యాసంలో దీనిని వివరించాను.ఆ వ్యాసం కోసం ఇక్కడ చూడండి.

మన రాష్ట్రంలో ఇప్పుడు జరగబోతున్న ఎన్నికల విషయంలో చూస్తే, తెలుగుదేశంపార్టీ విజయం తధ్యం అని తెలిసిపోతున్నది.

జ్యోతిష్య పరంగా కొంత పరిశీలన చేద్దాం.

1982 లో ఎన్టీ ఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు శని భగవానుడు వక్రించిన స్థితిలో చిత్తానక్షత్రం 2 పాదంలో  ఉన్నాడు.సామాన్య ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ స్థాపించిన కొద్ది నెలల్లోనే తెలుగుదేశం పార్టీ అధికారం లోకి వచ్చింది.1982 జూన్ 19 న వక్రస్తితిని శని భగవానుడు వదలి తన ఉచ్చరాశి అయిన తులవైపు వేగంగా ప్రయాణం మొదలుపెట్టడం తోనే తెలుగుదేశం పార్టీకి అనుకూల పవనాలు బలంగా వీచడం మొదలైంది. ఎన్టీఆర్ కూడా ప్రజల్లోకి వెళ్లి గ్రామగ్రామానా తిరిగి ప్రచారం చేసి సమస్యలను ఎత్తిచూపి ప్రజాభిమానాన్ని సంపాదించాడు.అక్టోబర్ 6 న శనిభగవానుడు తులారాశిలో ప్రవేశించి ఉచ్చస్థితిలోకి వచ్చాడు.ఇక అప్పటికే తెలుగుదేశం పార్టీ విజయం తధ్యం అని తేలిపోయింది.

మళ్ళీ ఇప్పుడు సరిగ్గా 30 ఏళ్ళ తర్వాత శనిభగవానుడు రాశిచక్రాన్ని చుట్టి వచ్చి  మళ్ళీ దాదాపు గత రెండేళ్లుగా తులారాశిలో స్తితుడై ఉన్నాడు.ప్రజా ఉద్యమాలు మళ్ళీ ముమ్మరం అవుతున్నాయి.అయితే మధ్యలో ఆ పార్టీ తన వైభవాన్ని కోల్పోవడానికి జ్యోతిష్య కారణాలు ఏమిటన్నది ఇంకొక వ్యాసం లో విశదీకరిస్తాను.దానికి మూలకారణం ఒక్కటే--ఏ సామాన్య ప్రజలూ ఉద్యోగులూ రైతులూ అయితే తనను గెలిపించారో ఆ సామాన్య ప్రజలనూ ఉద్యోగులనూ రైతులనూ ఆ పార్టీ దూరం చేసుకోవడమే దానికి ప్రధాన కారణం.అంటే ఆ రకంగా ఆ పార్టీ శనిభగవానుని అనుగ్రహానికి దూరమై ఆగ్రహానికి దగ్గరైంది.కనుక అధికారం కోల్పోయింది.

ఇప్పుడు మళ్ళీ ప్రజాభిప్రాయం తెలుగుదేశం పార్టీ వైపే స్పష్టంగా కనిపిస్తున్నది.దానికి కారణం ప్రజల్లోని అసంతృప్తే.అయితే ప్రస్తుతం శనిభగవానుడు విశాఖ నక్షత్రంలో ఉన్నాడు.పోయినసారి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినపుడు ఆయన రాహువుదైన స్వాతినక్షత్రంలో ఉన్నాడు.ఈ తేడాను గమనించాలి.

పోయినసారి ఆవేశం,దూకుడులతో ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. సమాజానికి ఎంతో మంచి చేసినా కొన్ని అపరిపక్వ నిర్ణయాలవల్ల దెబ్బతిని పరాజయం చవిచూచింది.పార్టీలో ఎన్నో లుకలుకలూ గొడవలూ జరిగాయి. ఇదంతా రాహు నక్షత్ర ప్రభావమే.ఇప్పుడు అలా కాదు.గురు నక్షత్రంలో శని ప్రస్తుతం కొలువై ఉన్నాడు.గురువు గారి రంగు పసుపు.తెలుగుదేశం పార్టీ రంగు కూడా పసుపే.

కనుక ఈ సారి రాహు లక్షణాలైన ఆవేశం దూకుడు కాకుండా గురువుగారి లక్షణాలైన ఆలోచన,పరిపక్వత,స్థిరచిత్తంతో తీసుకునే మంచినిర్ణయాలు ఆ పార్టీని నడిపిస్తాయని ఆశించవచ్చు.ఆ పునాదుల పైన గనుక ఈసారి తెలుగుదేశం పార్టీ నడుస్తూ అన్ని వర్గాలకు న్యాయం చెయ్యగలిగితే పోయినసారి కంటే ఎక్కువ ఏళ్ళు తప్పకుండా అధికారంలో ఉంటుంది.

అధికారం వల్ల వచ్చే నిర్లక్ష్యాన్నీ అహంకారాన్నీ దగ్గరకు చేరనివ్వకుండా ఎప్పటికప్పుడు నిత్యజాగరూకతతో ఉండటమే ఏ పార్టీకైనా శ్రీరామరక్ష. ఇచ్చిన వాగ్దానాలను చిత్తశుద్ధితో అమలు చెయ్యడమూ,మనస్ఫూర్తిగా ప్రజల క్షేమాన్ని కోరుకోవడమూ,వర్గ కులముద్రలు పడకుండా పారదర్శకమైన విధానాలతో దేశాన్ని ముందుకు నడిపించగలిగితే ఈసారి తెలుగుదేశానికి ఓటమి అంటూ ఉండదు.

అయితే తిరిగి అధికారం వచ్చాక దరిచేరే చెడుప్రభావాలకు ఆ పార్టీ ఎంతవరకు దూరంగా ఉండగలదు? తాను ఇచ్చిన ఇస్తున్న వాగ్దానాలను ఆ పార్టీ ఎంతవరకూ నేరవేర్చగలదు? ఎంతవరకూ అవినీతికి దూరంగా ఉండగలదు?ఎంతవరకూ అన్ని వర్గాల ప్రజలకూ న్యాయం చెయ్యగలదు?అన్నవిషయాలమీదే అంతా ఆధారపడి ఉంటుంది.