“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

27, ఏప్రిల్ 2014, ఆదివారం

కాలజ్ఞానం 22-వైశాఖమాసం(మే -2014) ఫలితాలు


వైశాఖమాసం ఏప్రియల్ 30 నుంచి మొదలౌతున్నది.హైదరాబాద్ నగరానికి ఏప్రియల్ 29 న 11.44 నిముషాలకు వేసిన కుండలిని ఇక్కడ చూడవచ్చు.

దీనిని విశ్లేషించి మే నెలలో ఏయే సంఘటనలు జరుగబోతున్నాయో గమనిద్దాం.

దేశంలో జరుగబోతున్న ప్రస్తుత సాధారణ ఎన్నికలదృష్ట్యా ఈనెల చాలా ప్రత్యేకతను కలిగి ఉన్నది.

ఈ కుండలిలో కర్కాటకలగ్నం ఉదయిస్తూ ఈ నెలలో దేశ రాజకీయ పరిస్థితిలో రాబోతున్న విపరీతమైన ఆటుపోట్లను సూచిస్తున్నది.దశమంలో చరరాశిలో ఉన్న చతుర్గ్రహ కూటమి త్వరలో జరుగబోతున్న అధికార మార్పిడిని స్పష్టంగా సూచిస్తున్నది.

లగ్నంలోని మాందీ గుళికులు ప్రజాజీవితంలో రాబోతున్న మార్పులను సూచిస్తున్నారు.

అక్కడే ఉన్న ఘటీలగ్నం వల్ల అంతర్జాతీయంగా మన దేశప్రతిష్టలో రాబోతున్న మంచిమార్పు సూచితం అవుతున్నది.ఇన్నాళ్ళూ పనికిమాలిన దేశంగా,అవినీతి దేశంగా ముద్రపడిన మన దేశంకూడా తలెత్తుకుని తిరిగే పరిస్థితులు ముందుముందు ఉంటాయని,భారతదేశప్రజలు అభివృద్ధిని కోరుకుంటారనీ,అదే దిశగా ఓటేస్తారనీ,నాయకులకున్నంత అవినీతి ప్రజలలో లేదనీ,అంతర్జాతీయ సమాజం అర్ధం చేసుకుంటుందన్న సూచనను ఘటీలగ్నం ఇస్తున్నది.

చతుర్ధంలోని రాహుశనులు ప్రజాజీవితంలో రాబోతున్న కల్లోలాన్ని (ఆంధ్రరాష్ట్ర విభజనపరంగా) సూచిస్తున్నారు.

ఈ నెలప్రారంభంలోనే కొందరు నాయకులమీద చీకటి కమ్ముకుంటుంది. వారు చేసిన పాపాలకు శిక్షలు పడటం మొదలౌతుంది.

ఇప్పటివరకూ అధికారంలో ఉన్నవారికి ఈ నెలలో రాజ్యాధికారం గల్లంతౌతుంది.దోచుకున్నది చాల్లే ఇక ఆపండి అంటూ రాజ్యలక్ష్మి వారిని వీడిపోతుంది.ఇన్నాళ్ళూ అధికార దుర్వినియోగానికి పాల్పడినవారికి ముందుముందు ఏమౌతుందో అన్న భయమూ మానసికచింతా పట్టి పీడించడం మొదలౌతుంది.

ఈ పరిస్థితి రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ కూడా ఉంటుంది.

మతపార్టీగా పొరపాటుగా ముద్రపడిన ఒక పార్టీ,మిత్రుల సహకారంతో మంచి మెజారిటీని సాధిస్తుంది.ప్రజలు సమర్ధవంతమైన క్రొత్త ప్రభుత్వం కోసం ఎదురుచూడడం ప్రారంభిస్తారు.

ప్రజలలో ఉన్న దుష్టశక్తులనూ వర్గాలనూ కనిపించని దైవశక్తి నిగ్రహిస్తుంది.

యువకులలోనూ ఆశావహులైన ప్రజలలోనూ కష్టించి పనిచేసేవారిలోనూ క్రొత్త ఉత్సాహం నిండుతుంది.నిజమైన మేధావులలోనూ దేశభక్తుల లోనూ ఆనందం వెల్లివిరుస్తుంది.

ఆంధ్ర రాజకీయాలలో రెండు స్పష్టమైన అధికార కేంద్రాలు మొదలౌతాయి. ఆంధ్రా తెలంగాణా రాష్ట్రాలు విడిపోయే ప్రక్రియలో గందరగోళాలు ఉంటాయి.ఇవి మే 6,7 తేదీలలో జరుగుతాయి.

అదే తేదీలలో వాహన ప్రమాదాలూ రహదారి మరణాలూ ఉంటాయి.

మే 16,17,18 తేదీలలో కొన్ని చోట్ల ఉత్సవాలూ కొన్ని చోట్ల మతపరమైన అల్లర్లు జరుగుతాయి.బీసీ నేతలు గద్దెనెక్కుతారు.నిమ్న వర్గాలకు అధికారం అందుబాటులోకి వస్తుంది.వారిలో ఆనందం కలుగుతుంది.

కొందరు నేతల ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంటుంది.

విదేశాలలో మన మహిళల మీద ఉన్న కేసులు ఒక కొలిక్కి వస్తాయి. కొందరు భారతీయ మహిళలు విదేశాలలో మంచి పేరు ప్రతిష్టలూ ఆదరణా పొందుతారు.

మే 20,21,22 తేదీలలో అధికారపరమైన మార్పులు ప్రారంభం అవుతాయి. అదే సమయంలో అనేకమంది అధికారులకు పదవీగండం,కొందరు నేతలకు ఆరోగ్యభంగం,మరికొందరికి పరలోక ప్రయాణ సూచనలున్నాయి.