18, జనవరి 2014, శనివారం

శ్రీశైలం నుంచి పిలుపొచ్చింది-2

'కాశిరెడ్డి నాయన ఎక్కడ ఉండేవాడు.' అడిగాను.

'ఆయనకొక ఊరంటూ లేదు సార్.ఎక్కడ బడితే అక్కడ అలా తిరుగుతూ ఉండేవాడు.ఎక్కువగా మాత్రం ఆళ్లగడ్డలో కనిపించేవాడు.ఆళ్ళగడ్డ బస్టాండ్ దగ్గర ఒక కానుగ చెట్టు ఉండేది.ఆ చెట్టుకింద ఒక నులక మంచంలో పడుకొని ఉండేవాడు.ఆ మంచానికి కూడా నిలువుగా మూడు అడ్డంగా మూడు పట్టీలు మాత్రమె ఉండేవి.అందులో పడుకొని ఉండేవాడు.చొక్కా వేసుకోడు.నడుముకు ఒక అంగవస్త్రం వంటిది మోకాళ్ళవరకూ కట్టుకొని ఉంటాడు.ఎంత చలిలో అయినా మంచులో అయినా అదే వేషంలో ఉంటాడు.

భుజానికి ఒక సంచీ వేలాడుతూ ఉండేది.అది ఎప్పుడూ ఖాళీగా ఉండేది.కానీ అందులోనుంచే మాకు చాలా వస్తువులు తీసి ఇచ్చేవాడు.ఆయన పొట్ట కూడా ఎప్పుడూ వెన్నుకు అంటుకొని ఉండేది.ఆయన ఎప్పుడూ ఏమీ తినగా మేము చూడలేదు.


'ఆయనకు ఎన్నేళ్ళు?' అడిగాను.

'సమాధి అయ్యే సమయానికి దాదాపు నూరేళ్ళు ఉండేవి సార్.బాగా పెద్దవాడై పోయాడు.బాగా వంగిపోయి నడిచేవాడు.' 

'మరి ఏమీ తినకుండా ఎలా ఉండేవాడు?' తెలీనట్టు అడిగాను.

'అదేసార్ యోగశక్తి.వాళ్ళు యోగులు. ఉండగలరు. మనకు తెలియని అనేక విద్యలు వాళ్లకు తెలిసి ఉంటాయి.కానీ ఎప్పుడైనా బలవంతం చేస్తే ఒక కప్పు టీ తాగేవాడు.అంతకంటే ఆయన తినగా త్రాగగా నేను ఈ ఇరవైముప్పై ఏళ్ళలో ఎప్పుడూ చూడలేదు.'అన్నాడు.

నాకు వెంటనే అమ్మ గుర్తొచ్చి కళ్ళలో నీళ్ళు గిర్రున తిరిగాయి.తన చేతిమీదుగా లక్షలాది మందికి అన్నం పెట్టిన జిల్లెళ్ళమూడి అమ్మ ఎప్పుడూ ఏమీ తినగా ఎవ్వరూ చూడలేదు.ఎప్పుడో చిన్నతనంలో వాళ్ళ అమ్మ బ్రతికున్నపుడు తిన్న అన్నమే.తల్లి చనిపోయిన తర్వాత అమ్మ తిన్నదో లేదో ఎవ్వరూ పట్టించుకోలేదు.'బంగారుతల్లి' అనీ 'ఎంత చక్కగా మాటలు చెబుతుందో' అంటూ ముద్దు చేసినవారూ 'ఎంత పెద్ద మాటలో' అంటూ ఆశ్చర్యపోయినవారూ కూడా అమ్మ ఆకలిని ఎవరూ పట్టించుకోలేదు.తల్లిలేని పిల్ల అని బాధపడిన  వారేకాని వేళకు ఆ పిల్ల తిన్నదా లేదా ఎవరికీ పట్టేది కాదు.తన ఆకలిని గురించి ఏమాత్రమూ పట్టించుకోని ఈ లోకానికి అమ్మ తన జీవితాంతమూ అన్నం పెడుతూనే ఉన్నది.ఈనాటికీ జిల్లెళ్లమూడిలో నడుస్తున్న 'అన్నపూర్ణాలయం' ద్వారా అన్నం పెడుతూనే ఉన్నది.

ఎవరైనా తనను చూడవస్తే 'తర్వాత మాట్లాడుకుందాం.ముందు అన్నం తినిరా నాన్నా' అని చెప్పేది.1950.1960 ప్రాంతాలలో అయితే అర్ధరాత్రయినా అపరాత్రయినా తనే వంటచేసి వచ్చినవారికి వడ్డించేది.

'అమ్మ ఏమీ తినేది కాదు.ఎప్పుడైనా కాఫీ మాత్రం తాగేది.' అని అమ్మతో అనేక ఏళ్ళు అతి సన్నిహితంగా గడిపిన వసుంధర అక్కయ్యే మాతో ఒకరోజున చెప్పింది.ఏమీ తినకపోయినా అమ్మ ముఖంలో తేజస్సు ఏమాత్రమూ తరిగేది కాదు.ఇది చూచి ఆశ్చర్యపోయిన వాళ్ళు ఎందఱో ఇప్పటికీ ఉన్నారు.అసలు తిండి తినకుండా జీవితాంతం ఒక మనిషి ఉండటం సాధ్యమేనా?సైన్స్ కు ఇది అందే విషయమేనా? అంటే,సైన్స్ కు అందనివి ఎన్నో యోగుల లోకంలో ఉన్నాయి అని చెప్పవచ్చు.అలా ఉన్న జిల్లెళ్ళమూడి అమ్మ నిన్న మొన్నటి వరకూ మన మధ్యనే ఉన్నారు.కాశిరెడ్డి నాయన కూడా అలాంటివాడే.

'యోగులకు పొట్ట లోపలికి ఉండాలి సార్.అదే భోగులకైతే బాగా పొట్ట ఉంటుంది.అదే వారికీ వీరికీ తేడా' అన్నాడు రామమూర్తి.

నాకు మళ్ళీ నవ్వొచ్చింది.ఇలాంటి మాటలు వింటే నాకు భలే వినోదం వేస్తుంది.

త్రిలింగ స్వామికి పెద్ద బానపొట్ట ఉండేది.కాని ఆయన మహాయోగి.రమణమహర్షికీ ఒక మోస్తరు పొట్ట ఉండేది.పొట్టను బట్టి యోగి స్థితిని ఎలా కొలవగలం?లోకులు ఇంతే.వారికి ఏవేవో తెలిసీ తెలియని కొన్ని అభిప్రాయాలుంటాయి.వాళ్ళ కళ్ళద్దాల నుంచే వాళ్ళు ఎప్పుడూ చూస్తూ ఉంటారు.అక్కడే వాళ్ళు సత్యాన్ని చూడలేక బొక్కబోర్లా పడిపోతుంటారు.పొట్ట ఒక్కటే యోగానికి కొలబద్ద అయితే నేడు జిమ్ కెళ్ళి సిక్స్ ప్యాక్ లు పెంచుతున్న కుర్రకారు అందరూ మహాయోగులే అవ్వాలి కదా.

లోలోపల నవ్వుకొన్నాను.

'కాశిరెడ్డి నాయన గురించి ఏదో చెబుతానని ఇందాక అంటూ ఆపారు.'అడిగాను.

అవును సార్.ఆయన శుక్రవారం నాడు శరీరాన్ని వదిలేశాడు.అంతకు మూడు నాలుగు రోజుల ముందు నాకు ఇక్కడే కనిపించి 'రేపు శుక్రవారానికి జ్యోతికి వచ్చేయ్ నానా.' అన్నాడు.

'ఎందుకు నాయనా' అని నేను అడిగాను.

'ఏమోరా.నాకు చెప్పాలని అనిపించింది.చెప్పినాను.నీ ఇష్టం' అన్నాడు.

'నువ్వు రమ్మంటే అట్లాగే వస్తాలే నాయనా' అన్నాను.

'కాని ఆరోజుకు నాకు పోవడానికి కుదరలేదు.విచిత్రం ఏమంటే,అదే రోజున రకరకాల ఊర్లలో చాలామందికి ఆయన కనిపించి ఇదే మాట చెప్పినాడు.శుక్రవారం నాటికి ఎంతోమంది గిద్దలూరు దగ్గర ఉన్న జ్యోతి ఆశ్రమానికి చేరినారు.అందరి సమక్షంలో ఆయన సమాధి అయిపోయాడు.' అన్నాడు.

'ఆయన ఏ విధంగా శరీర త్యాగం చేశినాడు?' అడిగాను.

'వాళ్ళు మనలాగా చనిపోరు సార్.ఊరకే హంసను వదిలేస్తారు.అంతే.' అన్నాడు.

'ఓహో అలాగా' అని తల పంకించాను.

'ఆ తర్వాత చాలా బాధపడ్డాను సార్.నాయన రమ్మని చెప్పినా నేను పోలేకపోయానే అని.తర్వాత ఒకసారి జ్యోతికి వెళ్ళినాను.అక్కడ గుడిదగ్గర ఉన్నప్పుడు కాశినాయన స్వరం స్పష్టంగా విన్నాను.

'ఏం నాయనా ఇప్పుడు వచ్చినావా?సరేలే.లోపలి రా' అంటూ ఆయన పిలవడం స్పష్టంగా ఈ చెవులతో విన్నాను సార్..ముందుగా నా భ్రమ ఏమో అనుకున్నాను.ఆయన గొంతు నాకు బాగా పరిచయమే గదా సార్.ముప్పై ఏళ్ళ నుంచీ వినిన గొంతేగా.అదే గొంతు.తర్వాత పూజారి మళ్ళీ పిలిచాడు.ఆ స్వరం వేరే.అప్పుడు లోనికి వెళ్లి పూజారితో ఇదే మాట చెప్పినాను.

'నువ్వు పిలవడానికి ముందు వేరు ఎవరో రమ్మని పిలిచినారు.అది నాయన గొంతు లాగా ఉన్నది.'

'ఇలాంటివి ఇక్కడ మామూలే'- అన్నాడు పూజారి.

నిజమైన మహనీయులు శరీరానికి అతీతంగా పనిచెయ్యగలరు.వారికి శరీరం పెద్ద సమస్య కానేకాదు.మామూలు మనుషులకు అడ్డుపడే దేశకాలాలు వారిని ఏమీ చెయ్యలేవు.

ఒకసారి తన వద్దకు వచ్చిన ఒక భక్తురాలితో జిల్లెళ్ళమూడి అమ్మ ఇలా అన్నారు.'మీ ఇంట్లో మామిడిచెట్టు కింద భలే చల్లగా హాయిగా ఉంటుందే.'

ఆమెకు ఏమీ అర్ధం కాలేదు.అమ్మ కూడా దానిగురించి అంతకంటే ఏమీ వివరించలేదు.

తర్వాత వాళ్ళఇంటికి వెళ్లి చూస్తె,అక్కడ మామిడిచెట్టు నీడ పడేచోట అమ్మ ఫోటో ఒకటి కనిపించింది.ఇది వింటూ ఉంటె ఆ సంఘటన నాకు గుర్తొచ్చింది.

'ఇంకా చెప్పండి' అడిగాను.

శ్రీరామ్మూర్తి  గొంతు సవరించుకున్నాడు.

(ఇంకా ఉంది)
read more " శ్రీశైలం నుంచి పిలుపొచ్చింది-2 "

17, జనవరి 2014, శుక్రవారం

శ్రీశైలం నుంచి పిలుపొచ్చింది-1

 'శ్రీవిద్య' పూర్తయింది.

అమ్మనుంచి ఇంకా పిలుపు రాలేదేమిటా అని ఆలోచిస్తున్నాను.ఇంతలో శ్రీశైలానికి రమ్మని పిలుపొచ్చింది.వెంటనే బయలుదేరాను.ఈ సారి నంద్యాల నుంచి ఘాట్ రోడ్డులో ప్రయాణం.రాత్రికి నంద్యాల చేరుకొని పొద్దున్న అయిదుకే నంద్యాల నుంచి కారులో బయలుదేరాం.గిద్దలూరు మీదనుంచి వెళదామని డ్రైవర్ అన్నాడు.వద్దు ఆత్మకూరు మీదనుంచి ఘాట్ లో పోనిమ్మని చెప్పాను.అటైతే అడవినీ పొద్దున్నే కనిపించే మృగాలనూ చూచుకుంటూ వెళ్ళవచ్చు.

ఈసారి శ్రీరామమూర్తి మాతో వచ్చాడు.ఆయనకు ఆ దారి అంతా బాగా తెలుసు.అయితే నాతో ప్రయాణం చేసేవారికి ఒక ఇబ్బంది ఎదురౌతుంది. అనవసరమైన మాటలు మాట్లాడితే నేను ఊరుకోను.అయితే ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడాలి.లేకుంటే మౌనంగా ఉండాలి.ఆధ్యాత్మికం కూడా సోదిగా మాట్లాడితే మళ్ళీ నాకు నచ్చదు.అనుభవం నుంచి మాట్లాడాలి.కార్లో పిచ్చిపిచ్చి పాటలు పెట్టనివ్వను.కాబట్టి నాతో ప్రయాణం అంటే చాలామందికి నరకమే.

రాయలసీమ నేల తగిలితే నాకు ఆనందం కలుగుతుంది.ఎందుకంటే దానిలో ఆధ్యాత్మిక తరంగాలు అధికంగా ఉంటాయి.అదే మాట అన్నాను.శ్రీరామ్మూర్తి స్పందించాడు.

'అవును సార్.ఇక్కడ అవధూతలు యోగులు ఎక్కువ.వీరబ్రహ్మంగారినే తీసుకోండి.ఆయనలాగా సమాధిలోకి వెళ్లి రెండుసార్లు బయటకు వచ్చి సజీవంగా దర్శనం ఇచ్చినవాళ్ళు చరిత్రలో ఎవరూ లేరు.జీవసమాధి అయినవాళ్ళు చాలామంది రాయలసీమలో ఉన్నారు.కాని అందులోనుంచి రెండుసార్లు బయటకు వచ్చి అందరికీ కనిపించి మళ్ళీ లోనికి వెళ్ళినవారు బ్రహ్మంగారు తప్ప ఎవరూ లేరు.

మొదటి సారి సిద్దయ్య కోసం బయటకు వచ్చాడు.రెండోసారి,లోకపోరు భరించలేక తన కుమారులు సమాధిని తవ్వగా ఆగ్రహంతో బయటకు వచ్చి తన వంశాన్నే నిర్వంశం అవ్వమని శపించాడు.అందుకే ఇప్పుడు ఉన్న ఆయన వంశస్తులు ఆయన కూతురి బిడ్డలు.'

'అవును.బ్రహ్మంగారు మహాయోగి.ఆయన చెప్పినది శుద్ధ యోగమూ వేదాంతమూ.' అన్నాను నేను.

'సార్.ఒక చిన్న విచిత్రం చూడండి.కులాన్ని ఆయన ఏనాడూ లెక్కచెయ్యలేదు.హరిజనుడైన కక్కయ్యకు అక్కడికక్కడే చక్రదేవతలను చూపించాడు.ఇంకా ప్రియశిష్యుడైన సిద్ధయ్యకే టైం పట్టింది.ఎప్పటికో ఆయనకు దర్శనాలు అయ్యాయి.కాని కక్కయ్యకు క్షణంలో కలిగించాడు.'

'రామమూర్తి గారు.మనం పాటించే కులాలూ ఇవన్నీ యోగులకు ఉండవు.వాళ్ళు వీటికి అతీతులు.వాళ్ళు మనిషి గుణాన్ని చూస్తారు గాని కులాన్ని కాదు.' అన్నాను.

'బ్రహ్మంగారు చెబుతున్న చక్రరహస్యాలు విని కక్కయ్య తన భార్యను చంపి ఆ చక్రాలూ దేవతలూ ఎక్కడా అని వెదికాడు.రక్తంలో మాంసంలో అవెక్కడుంటాయి?అవి సూక్ష్మశరీరంలో ఉంటాయి.దొంగస్వామి మాటవిని పెళ్ళాన్ని చంపుకున్నానని ఏడుస్తుంటే బ్రహ్మంగారు జాలిపడి 'ఒరే.మాంసపు కళ్ళతో మాంసంలో వెదికితే ఏమి కనిపిస్తుందిరా?ఇప్పుడు చూడు'.అంటూ యోగనేత్రాలు తెరిపించాడు.వాటితో చూచిన కక్కయ్యకు అన్ని చక్రాలూ అన్ని దేవతలూ యధావిధిగా దర్శనం అయ్యాయి.

ఆ తర్వాత బ్రహ్మంగారు ఆ అమ్మాయిని బ్రతికించారు.కత్తితో ముక్కలుగా నరికిన ఆమె ఎలా బ్రతికింది? అదే యోగశక్తి.బ్రహ్మం గారు ఇలాంటి మహత్యాలు ఎన్నో చేశారు."

'బ్రహ్మంగారి యోగశక్తిని పరీక్షించాలని కడప నవాబు ఆయన్ని తన దర్బార్ కు పిలిపించి మాంసం ముక్కలు ఒక పెద్ద ప్లేట్ లో పెట్టి వాటిమీద ఒక గుడ్డ కప్పి ఆయనకు ఇచ్చాడు.బ్రహ్మంగారు అది కనిపెట్టి తన కమండలంలో నుంచి కొంచం నీళ్ళు దానిమీద చల్లి గుడ్డ తొలగించమన్నాడు.అందులో అన్నీ స్వీట్లు ఉన్నాయి.బిత్తరపోయిన నవాబు బ్రహ్మంగారి కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకున్నాడు.ఇలాంటి మహత్యాలు ఎన్నో ఆయన చేశాడు.'

అంటూ గొంతెత్తి శివగోవిందతత్వాలు కొన్ని ఆలపించాడు.అవి వింటూ కొంతసేపు ప్రయాణం సాగించాము.

'శ్రీరామ్మూర్తిగారు.వినండి.బ్రహ్మం గారు కూడా కొత్తగా చెప్పినది ఏమీ లేదు.There is nothing new under the sun అని ఒక మాట ఉన్నది మీకు తెలుసుకదా.ఆయనేకాదు ఎవరైనా మన దేశంలో కొత్తగా చెప్పేది ఏమీ ఉండదు.ఉన్నదాన్నే ఆచరిస్తే చాలు.మన దేశంలో అతి ప్రాచీనకాలం నుంచీ ఉన్న యోగాన్నీ వేదాంతాన్నీ ఆయన ఆచరించాడు సాధించాడు బోధించాడు. ఆయనే కాదు మనదేశంలో పుట్టిన పుడుతున్న మహానీయులందరూ చేసినదీ చేస్తున్నదీ అదే.మనకు ఎంతో ప్రాచీన జ్ఞానసంపద మూలుగుతున్నది.ఆచరించేవారే లేరు.ఎక్కడో ఒకరో ఇద్దరో అలాంటివారు ఉంటారు.వారే బ్రహ్మంగారు వేమన మొదలైన యోగులౌతారు.'అన్నాను.

రామ్మూర్తిగారికి ఈ మాట నచ్చలేదు.

'కాదు సార్.బ్రహ్మంగారు ఎన్ని అద్భుతమైన యోగరహస్యాలను తన తత్వాలలో చెప్పారో చూడండి.అవి ఇంతకు ముందు ఎక్కడా ఎవరూ చెప్పలేదు' అన్నాడు.

నాకు నవ్వొచ్చింది.

చాలామంది ఇలాగే ఉంటారు.వారు ప్రధమంగా ఒక మహనీయుని బోధలను చదివి కొన్ని కొత్తవిషయాలను తెలుసుకున్నపుడు ఆ వ్యక్తి చాలా ప్రత్యేకుడు అనీ ఆయన చెప్పినది కొత్త విషయమనీ భావిస్తారు.ఇక ఆ వ్యక్తికి పూజ ప్రారంభిస్తారు.కానీ వారు మన ప్రాచీన సాహిత్యాన్ని విస్తృతంగా క్షుణ్ణంగా చదివితే వారి అభిప్రాయాలు మారుతాయి.ఆధ్యాత్మిక లోకంలో కొత్తగా చెప్పేది ఏమీ ఉండదు."కొత్తసీసాలో పాతసారా" అంతే.

చాలామంది చేసే తప్పు ఏమంటే,వారు సారాయిని వదిలిపెట్టి సీసాకి పూజ చేస్తూ కూచుంటారు.సీసా ముఖ్యంకాదు.అది ఏదో ఒకరోజున పగిలిపోతుంది. కాని సారా ఎప్పటికీ ఉంటుంది.కనుక సారాయి త్రాగాలి.ముందు సారా త్రాగి అప్పుడు కావాలంటే సీసాను పూజించవచ్చు.కాని సారా త్రాగకుండా సీసాను పూజిస్తూ కూచోకూడదు.కానీ లోకంలో అందరూ చేసేది అదే.సారా ఎవ్వరూ త్రాగరు.సీసాను మాత్రం పట్టుకుని వేళ్ళాడుతూ ఉంటారు.వీలైతే దాన్ని మెడలో వేసుకుని కూడా ఊరేగుతారు.సీసా మీద స్తోత్రాలు వ్రాస్తారు.దానికి భజనలు చేస్తారు.కాని సారా మాత్రం త్రాగరు.

ఎందుకంటే సారా త్రాగితే మనలో మార్పు వస్తుంది.ఆ మార్పు ఎవరికీ ఇష్టం ఉండదు.మార్పంటే మనకు భయం కూడా.కనుక సీసాను పూజిస్తూ కూచుంటారు.ఆ సీసాకి రకరకాల అలంకరణలు చేస్తారు.సీసాకూడా తనలోని సారాయిని త్రాగమనే చెబుతూ ఉంటుంది.కాని దానిమాట ఎవ్వరూ పట్టించుకోరు.సీసాకు కిరీటాలు చేయిస్తారు.కవచాలు చేయిస్తారు.వీలైతే దానికి పెళ్ళికూడా చేస్తారు.కాని సారా మాత్రం ఎవ్వరూ త్రాగరు.ఆధ్యాత్మిక లోకంలోని అసలైన మాయ ఇదే.

'రామ్మూర్తిగారు.బ్రహ్మంగారు కాలజ్ఞానంలో కొత్త విషయాలు చెప్పారు.కాని ఆయన చెప్పిన తత్త్వం కనీసం అయిదువేల ఏళ్లక్రితమే మన దేశంలో ఉన్నది.ఇంకా ముందుది కూడా కావచ్చు.తమిళ సిద్ధసాంప్రదాయం లోనూ, శైవసాంప్రదాయంలోనూ ఈ యోగరహస్యాలు తెలిసినవారూ ఆచరించినవారూ ఎందఱో సిద్ధులు మన దేశంలో ఎప్పటినుంచో ఉన్నారు.ముందునుంచీ ఉన్నదానినే బ్రహ్మంగారు కూడా ఆచరించి బోధించారు.' అన్నాను.

ఆయనేమీ మాట్లాడలేదు.

ఈమధ్య కాలంలో రాయలసీమలో ఉద్భవించిన మహనీయుల్లో కాశిరెడ్డి నాయన ముఖ్యుడు.కాశిరెడ్డి నాయనతో ఇరవైఏళ్ళ పైన పరిచయం ఉన్నది శ్రీరామమూర్తికి.నాయనతో అనేక అనుభవాలు ఆయనకు ఉన్నవి.వాటిని చెప్పమని అడిగాను.

'సార్.ఒకటా రెండా ఎన్నని చెప్పేది?ఎన్నో ఉన్నాయి.'అంటూ మొదలు పెట్టాడు.

'కాశిరెడ్డి నాయన నిజమైన మహనీయుడు సార్.ఆయన అవధూత.ఊళ్లు పట్టుకుని తిరుగుతూ ఉండేవాడు.ఒకే క్షణంలో అనేక ఊళ్లలో అనేకమందికి కనిపించేవాడు.నాకే జరిగిన అనుభవం చెబుతాను వినండి.'అంటూ చెప్పసాగాడు.

(ఇంకా ఉంది)
read more " శ్రీశైలం నుంచి పిలుపొచ్చింది-1 "

8, జనవరి 2014, బుధవారం

హీరో ఉదయ్ కిరణ్ జాతకం -ఒక పరిశీలన


నటుడు ఉదయకిరణ్ జాతకాన్ని పరిశీలిద్దాం.ఇతను 26-6-1980 న పుట్టినట్లు చెబుతున్నారు.జనన సమయం తెలియదు.కనుక పైపైన చూద్దాం.

ముఖ్యంగా రెండు గ్రహస్థితులు ఇతని జాతకంలో కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి.ఒకటి చంద్రుని నీచస్థితి.రెండు కుజశనుల డిగ్రీసంయోగం.

ఆత్మకారకుడు కుజుడయ్యాడు. కారకాంశ ధనుస్సు.జైమిని సూత్రాల ప్రకారం లగ్న,కారకాంశల నుంచి తృతీయం మీద పాపగ్రహ ప్రభావం ఉంటే అసహజమరణం అని ఖచ్చితంగా చెప్పవచ్చు.ఈ సూత్రాన్ని కొన్ని వందలజాతకాల్లో గమనించడం జరిగింది. కొంతకాలం క్రితం ఆత్మహత్య చేసుకున్న హిందీనటి జియాఖాన్ జాతకంలో కూడా ఇదే యోగం ఉన్నది.

తృతీయమైన కుంభం మీద శనికుజుల డిగ్రీ దృష్టి ఉండటం స్పష్టంగా చూడవచ్చు.ఇదే ఈ జాతకానికి గల కార్మిక్ సిగ్నేచర్.వారిద్దరూ నవమంలో ఉండటం చూస్తే,వీరి వంశంలో ఈ శాపం ఉన్నదని స్పష్టంగా కనిపిస్తున్నది.ఇతని సోదరుడు కూడా ఇలాగే సూయిసైడ్ చేసుకున్నాడని అంటున్నారు.కనుక ఈ గ్రహయోగం ఖచ్చితంగా నిజమే అని తెలుస్తోంది.

చంద్రుని నుంచి నవమంలో రాహు బుధులూ,దశమంలో శనికుజ యోగమూ ఉండటం చూస్తే బలమైన శాపదోషం నిజమే అని రూడి అవుతున్నది.

శనికుజుల యోగం యాక్సిడెంట్లకూ అసహజ మరణాలకూ దారితీస్తుంది అని ఇంతకు ముందు లెక్కలేనన్ని సార్లు వ్రాశాను.ఆత్మహత్యలు చేసుకున్నవారి అనేక జాతకాల్లో ఈ యోగం ఉండటం గమనించాను.ఒకవేళ ఆత్మహత్య కాకపోతే వారికి యాక్సిడెంటల్ డెత్ ఉంటుంది.

"మంద మాందిభ్యాం జలోద్బంధనాదిభి:" అనే జైమినిమహర్షి సూత్రం ఇక్కడ ఖచ్చితంగా రుజువు కావడం చూడవచ్చు.తృతీయం మీద శని మాందుల ప్రభావం ఉంటే చెప్పిన మరణ కారణాలలో ఉద్బంధనం(ఉరి)కూడా ఒకటి.ఎన్నో వేల సంవత్సరాల క్రితం మహర్షి చెప్పిన సూత్రం ఇక్కడ నేటికీ రుజువు కావడం గమనార్హం.ఉరిపోసుకుని చనిపోయిన ప్రతి ఒక్కరి జాతకంలో ఈ గ్రహస్తితి ఖచ్చితంగా ఉండటం గమనించాను.

చంద్రుని నీచస్థితివల్ల సున్నిత మనస్తత్వంగాని తేలికగా ఆందోళనకు గురయ్యే తీరుగాని ఉంటుంది అన్నది అందరికీ తెలిసినదే.ఇతని జాతకంలో దీనికి తోడు చంద్రుని మీద వక్రశుక్రుడు,రాహువు,శనిగురువుల ప్రభావం ఉన్నది. చంద్రుడు ఇన్ని గ్రహాల ప్రభావానికి లోనైతే ఆ జాతకుని ఆలోచనలు ఒకేసారి ఎన్నోవైపులకు లాగబడతాయి.చివరకు ఎటూ తేల్చుకోలేక పోవడం జరుగుతుంది.

సూక్ష్మభూమికలలో వేచిచూస్తున్న కొన్ని దుష్టశక్తులకు ఇలాంటి మానసిక స్థితిలో ఉన్నమనుషులే కావాలి.ఇటువంటి డోలాయమాన సందిగ్ధస్థితిలో ఉండి డిప్రెషన్ కు గురైన వ్యక్తులను అవి తేలికగా లోబరుచుకుంటాయి. చాలాసార్లు ఈ శక్తుల ప్రోద్బలం వల్లనే ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతుంది.అలాంటి సమయంలో ఉన్నవారికి ఆత్మహత్య తప్ప ఇంకేదారీ కనిపించదు.వారి మనస్సు అంతా దానిమీదే కేంద్రీకృతమై ఉంటుంది.అలా ఉండేలా ఆ శక్తులు చేస్తాయి.

అందుకే ఇలాంటివారిని వారి కుటుంబసభ్యులు నీడలా వెంట ఉండి కాపాడాలి.నిరంతర కౌన్సిలింగ్ వీరికి చాలా అవసరం.అనుక్షణం వెంట ఉండి ధైర్యాన్ని ఇస్తూ ఉండాలి.రక్షణ వలయంలా నిలబడాలి.అయితే ఖర్మ బాగాలేనప్పుడు(దీనినే టైం బాగాలేదు అనికూడా అంటాం) అదే కొరవడుతుంది.అయినవాళ్ళు అందరూ అప్పుడే దూరమౌతారు.అప్పుడు చీకటిశక్తులు వీరి మనస్సును తేలికగా డిప్రెషన్ లోకి తీసుకెళతాయి. ఆత్మహత్య వైపు ప్రేరేపిస్తాయి.

చంద్రుడు కేమద్రుమయోగంలో ఉండటం కూడా ఈ జాతకానికి ఒక చెడు సూచన.అంటే మానసికంగా ఇతనికి ఎటువంటి ఆధారమూ ఆసరా లేకపోయింది అని తెలుస్తోంది.పైగా కేతువు లోన్లీ ప్లానెట్ అయినవారు చాలా తేలికగా డిప్రెస్ అవుతారు.అలాంటివారిని ఏకాంతంలో వదిలేసి ఉంచకూడదు.

గోచార గ్రహస్తితి:

ఇతను ఆత్మహత్య చేసుకున్న రోజున గోచారబుధుడు జననకాల శనికుజులకు చాలాదగ్గరి కోణస్థితిలోకి వచ్చి యున్నాడు.అంటే,విపరీతమైన డిప్రెషన్ మరియు అసహజమైన హింసాత్మక సంఘటన జరగడానికి ప్రేరేపణ ఆరోజున గట్టిగా ఉన్నది.ఇంకా సరిగ్గా చెప్పాలంటే ఒకటి రెండురోజుల ముందే ఈ ధోరణి మొదలై ఉండాలి.ఎందుకంటే అప్పటికే గోచారబుధుని పైన ఈగ్రహాల బలీయమైన ప్రభావం పడటం మొదలైంది.కనుక ఒకటి రెండు రోజుల ముందునించే ఇతనిలో మూడ్స్ మారటం మొదలై ఉండాలి.

ఆత్మహత్యా జాతకాల్లో ఉన్న గ్రహస్తితులే ఇక్కడకూడా మళ్ళీ దర్శనం ఇస్తున్నాయి.ఇంతకు ముందు వ్రాసిన కొన్ని జాతకాల్లో ఈ విషయాలు చర్చించాను.కావలసినవారు పాత పోస్ట్ లు ఒక్కసారి తిరగేయ్యండి.

జ్యోతిష్య కారణాలను అలా ఉంచితే,ఈ సంఘటనకు దారితీసిన కారణాలు అందరికీ తెలుసు.నేను మళ్ళీ చెప్పనక్కరలేదు.ఒక వ్యక్తో ఒక కులమో మాత్రమే బ్రతకాలి బాగుపడాలి మిగిలినవారు పైకి రాకూడదు అన్న నీచ మనస్తత్వం మనుషులలో పోనంతవరకూ ఇలాంటి మొగ్గలు ప్రతి రంగంలోనూ రాలిపోతూనే ఉంటాయి.అందులోనూ సినిమారంగంలో ఉన్న కుళ్ళూ కుతంత్రాలూ రాజకీయాలూ అన్నీఇన్నీ కాదు.అదొక బురదగుంట.ఆ బురదలో ఇలాంటివారు కూరుకుపోయి కనుమరుగు కావడంలో వింతేముంది?

అందరూ మర్యాదస్తులూ,కదిలిస్తేచాలు నీతులు చెప్పేవారూ ఉన్న ఈలోకంలో ఒక మనిషి బ్రతకలేక తన నిండుప్రాణాన్ని చేజేతులా అంతం చేసుకున్నాడంటే అంతకంటే తలవంపులు ఆ సమాజానికి ఇంక వేరేమీ అవసరం లేదు.మనస్సాక్షి ఉన్న ప్రతి సినిమాపెద్దమనిషీ తల దించుకోవలసిన పరిస్తితి ఇది. కానీ ఇప్పుడు ఏం చేసినా ఉదయకిరణ్ ప్రాణం వెనక్కు రాదు.ఈ కుళ్ళు ప్రపంచాన్ని వెక్కిరిస్తూ అతని ఆత్మ ఏదో లోకాలకు చేరుకుంది.కాని అది అక్కడైనా శాంతిగా ఉంటుందా?దాని వ్యధ తీరెంతవరకూ ఆ ఆత్మ శాంతిగా ఉండదనే మన గ్రంధాలు చెబుతున్నాయి. దీనికి ఎవరు కారకులో వారికి ఈ ఉసురు తగలకుండా ఉంటుందా?

ఏమో? వేచిచూద్దాం.

అతని నిర్భాగ్య ఆత్మ శాంతించుగాక అని దైవాన్ని ప్రార్ధిద్దాం.
read more " హీరో ఉదయ్ కిరణ్ జాతకం -ఒక పరిశీలన "

17, డిసెంబర్ 2013, మంగళవారం

సాధారణ జీవితంలో...

సాధారణ జీవితంలో 
సమున్నత సత్యం అందివచ్చింది

నీటి చెలమలో నీలాకాశం
నింగి స్వర్గాన్ని నేలకు తెచ్చింది

అనుక్షణికపు అల్పత్వంలో
అమరత్వం అవధులు దాటింది

నేను వెదికే నిత్యసత్యం
నా చుట్టూ నిలచి నవ్వింది
read more " సాధారణ జీవితంలో... "

4, డిసెంబర్ 2013, బుధవారం

కాలజ్ఞానం -21

డిసెంబర్ 3 నుంచి 15 వరకూ ఉన్న ఒక గ్రహస్తితి వల్ల రాష్ట్ర పరిస్తితి మరింత దురదృష్టకరమైన పీటముడిగా మారుతుంది.రాజకీయపరిస్తితి ఇంకా దిగజారుతూ పోతుంది.డిసెంబర్ 9 న నాయకత్వం సందిగ్ధపరిస్థితిలో పడుతుంది.నాయకులు ప్రజలపైనే కుట్ర చేస్తున్నారా అన్న అనుమానం ప్రజలలో బలపడుతుంది.15 వ తేదీ దగ్గరకు వచ్చేకొద్దీ ఆవేశాలు ఎక్కువౌతాయి.సంయమనం కోల్పోయిన నాయకులు రకరకాల ప్రకటనలతో ప్రజలను గందరగోళంలోకి ప్రవేశపెడతారు.ఆ తర్వాత ఏం జరుగుతుందో మళ్ళీ చూద్దాం.
read more " కాలజ్ఞానం -21 "

2, డిసెంబర్ 2013, సోమవారం

లూయీ బ్రెయిలీ జాతకం-అంధత్వయోగాలు

మొన్న అంధుల ఆశ్రమానికి వెళ్ళినప్పుడు లూయీ బ్రెయిలీ జాతకం పరిశీలిద్దామని తోచింది. ఎందరిలాగానో  అతను కూడా గుడ్డివాడైనా తన ఖర్మను తిట్టుకుంటూ కూర్చోకుండా బ్రెయిలీ లిపిని తయారు చేసి తద్వారా నేడు లక్షలాది అంధులకు వెలుగును ప్రసాదించాడు.అందుకే అతని జాతకంలో ఏ గ్రహస్తితి ఈ యోగాన్ని ఇచ్చిందో చూద్దామని అనుకున్నాను.

లూయీ బ్రెయిలీ 4-1-1809 న ఫ్రాన్స్ లో కూవ్రే అనే ఊళ్ళో పుట్టినాడు.స్విస్ ఎఫిమెరిస్ వారి ఆస్ట్రో డేటాబాంక్ ప్రకారం జనన సమయం ఉదయం నాలుగు గంటలు.ఆ సమయానికి వచ్చె జాతకచక్రం ఇక్కడ చూడవచ్చు.

జాతకంలో రెండూ పన్నెండూ భావాలు కళ్ళకు సూచికలు.సూర్యచంద్రులు నేత్రాలకు సహజకారకులు.సహజరాశి చక్రంలో ఈ భావాధిపతులైన గురుశుక్రులు కూడా నేత్రాలకు కారకులే.ఇప్పుడు బ్రెయిలీ జాతకం ఏమంటున్నదో చూద్దాం.

ఇతని జాతకం చూడగానే స్ఫురించే విషయం లగ్నంలో రాహువూ,లగ్నానికి గల పాపార్గళమూ.ఇది 'నేత్రహీనయోగం' అనబడుతుంది.చాలా లగ్నాలకు పాపార్గళం ఉంటుంది.అది వింతకాదు.మేషానికీ తులకూ పాపార్గళం ఉండటం ఒక ప్రత్యేకత.అప్పుడు ఆ రెండు పాపగ్రహాల సప్తమదృష్టి వల్ల సప్తమానికి కూడా పాపార్గళం ఉంటుంది.ఈ రెంటిలో మళ్ళీ తులకు ఈ స్తితి ఉంటే అది మరీ ప్రత్యేకత అవుతుంది.ఎందుకు?

మేషానికి ఈ స్థితి ఉంటే తుల సహజసప్తమం కనుక దోషం లగ్నానికీ సప్తమానికీ పంచబడుతుంది.అదే తులకు ఉంటే,రెండూ లగ్నాలే అవుతాయి గనుక లగ్నదోషం రెండింతలు అవుతుంది.అదీ భేదం.ఈ విధమైన సూక్ష్మపరిశీలన జ్యోతిష్యశాస్త్ర విద్యార్ధికి చాలా అవసరం.

ప్రస్తుతజాతకంలో లగ్నమైన తులవల్ల సహజలగ్నానికి కూడా ఆదోషం పట్టింది.జాతకలగ్నమూ సహజలగ్నమూ కూడా దోషాన్ని సంతరించు కున్నాయి.కనుక తలకూ కళ్ళకూ ప్రమాదం ఖచ్చితంగా ఉన్నదని జాతకం చూడగానే తెలుస్తుంది.చిన్నప్పుడు ఆయా దోషపూరిత దశలు గనక నడిస్తే,ఆ ప్రమాదం ఆయా వయస్సుల్లో ఖచ్చితంగా జరుగుతుంది.ఇతను బుధ నక్షత్రంలోనే జన్మించాడు గనుక చిన్నప్పుడు అదేదశ జరుగుతుంది. ఇక కళ్ళు ఎలా మిగులుతాయి?బుధుడు ఈ లగ్నానికి మంచివాడే.అయితే దోషం ఎలా వచ్చిందో ఇప్పుడు వివరిస్తాను. 

లగ్నంలో రాహువూ యురేనస్సూ ఒకే బిందువు మీద స్వాతీనక్షత్రం నాలుగో పాదంలో ఉన్నారు.ఇది నవాంశలో గురువుదైన మోక్షరాశి,మీనరాశి అవుతుంది.కనుక ఇతను గతజన్మలో ఆధ్యాత్మికంగా మహనీయులైన వారికి ఆకతాయితనంతో ద్రోహం చెయ్యడంవల్ల ఈజన్మలో కళ్ళు పోగొట్టుకున్నాడని తెలుస్తున్నది.

పాతతరంలో పల్లెటూళ్ళలో ఉన్నవారికి కొన్ని సామెతలు గుర్తుంటాయి. ఎవరైనా ఏదైనా ఘోరమైన తప్పు చేస్తుంటే -'ఒరే వద్దురా కళ్ళు పోతాయిరా' అని పెద్దలు హెచ్చరించేవారు.ప్రకృతిలో ఏపనికి ఏశిక్ష పడుతుందో పాతకాలంవారికి అతి మామూలుగా తెలిసిపోయేది.ఆ విషయాలు సామెతలుగా వాడుకమాటలుగా నిత్యజీవితంలో కలసిమెలసి ఉండేవి. ఇప్పటివారికి అవి తెలియను కూడా తెలియవు.ఇదొక దౌర్భాగ్యం.తెలిసినా ఎవరూ ఆగమంటే ఆగరు.ఇది ఇంకొక మహాదౌర్భాగ్యం.

ఈ లగ్నానికి సూర్యుడు బాధకుడు.కనుక నేత్రదోషం ఉన్నది.ద్వాదశాదిపతి అయిన బుధుడు బాధకుడైన సూర్యునితో కలసి దోషాన్ని పంచుకోవడమే గాక మారకశక్తి కలిగిన కేతువు యొక్క నక్షత్రంలో ఉన్నాడు.కనుక ఇతని ఎడమ కంటికి గండం స్పష్టంగా కనిపిస్తున్నది.

అదీగాక ఈ లగ్నానికి ప్రబలదోషీ మారకుడూ అయిన కుజుడు ద్వాదశంలో నేత్రకారకుడైన చంద్రుని నక్షత్రంలో కూర్చుని ఉన్నాడు.సూర్యుడు కుడికంటికీ చంద్రుడు ఎడమకంటికీ సూచకులనేది జగమెరిగిన జ్యోతిష్య సూత్రం.కనుక ఎడమకంటికి ప్రమాదాన్ని సూచిస్తున్నాడు.లగ్నానికి ఇరువైపులా ఉన్న శనికుజులవల్ల ఈ జాతకానికి లగ్నపాపార్గళదోషం పట్టింది.తద్వారా ముఖానికి ప్రమాదం జరుగుతుందన్న సూచన ఉన్నది.

ఇతను మూడేళ్ళ వయస్సులో ఉండగా తండ్రి పనిముట్లతో ఆడుకుంటూ కంటి దగ్గర ఒక అట్టముక్కలాంటి దానిని పెట్టుకుని దానిలోకి ఒక మేకును గుచ్చాలని ప్రయత్నించాడు.ఆ ప్రయత్నంలో మేకు అట్టముక్కను చీల్చుకుని ఇతని కంటిలో దిగబడింది.ఈ సంఘటన బుధ/శుక్ర దశలోగాని బుధ/కేతు దశలోగాని జరిగింది.బుధుడు ఏ విధంగా ఎడమకంటిని సూచిస్తున్నాడో,ఏ విధంగా దోషాన్ని సంతరించుకున్నాడో పైన వివరించాను.కేతువు మారకుడు.శుక్రుడైతే లగ్నదోష పూరితుడైనాడు.

సూర్యుని బాధకాదిపత్యం వల్ల తండ్రికి చెందిన పనిముట్ల వల్లే ఇతని కన్ను పోయింది.భయంకరమైన లగ్నదోషంవల్ల తన కన్ను తానే పోడుచుకునే స్తితి కల్పించబడింది.క్రమేణా కన్ను సెప్టిక్ అయి అది రెండవ కంటికి కూడా సోకి ఇతనికి రెండు కళ్ళూ పోయాయి.రెండవ కన్ను ఎందుకు పోయిందో చూద్దాం.

కుడికంటిని సూచించే వృశ్చికంలో శని కూర్చుని ఉన్నాడు.శని ఈ లగ్నానికి మంచివాడే.అయితే మారకస్థానంలో ఉండటం ఇతని మంచితనాన్ని పాడు చేసింది.కుజుని ఇంటిలో శని స్తిమితంగా ఉండలేడు.పైగా నెప్ట్యూన్ కి అతిదగ్గరగా ఉన్నాడు.కనుక దోషపూరితుడైనాడు.

సహజరాశిచక్రంలో ప్రధమం కేతుగ్రస్తమైంది.కేతువు యమాధిష్టితమైన భరణీ నక్షత్రంలో ఉన్నాడు.అది లగ్నాధిపతి నక్షత్రంకూడా అయింది.కనుక ముఖానికీ కంటికీ గండం సూచితం అవుతున్నది.ద్వితీయాదిపతి అయిన శుక్రుడు బుధనక్షత్రంలో ఉన్న చంద్రునిచే చూడబడుతున్నాడు.

ఇక ద్వాదశాదిపతి అయిన గురువు శనిరాశిలో ఉంటూ రాహుదృష్టిలో ఉన్నాడు.ఇది పైన వివరించిన పూర్వకర్మను సూచిస్తున్నది.దీనికి దోహకంగా లగ్నం శనికుజ దృష్టులతో పాపార్గళ దోషానికి లోనైంది.

మారకుడైన కుజుడు నవాంశలో నీచస్థితిలో ఉండి దారుణమైన పాపత్వాన్ని సంతరించుకుని ఉన్నాడు.అందుకే తనచేతితో తన కంటినే పొడుచుకునేటట్లు చేశాడు.అదికూడా ఎడమకంటికి అధిపతి అయిన బుధునితో కలసి ఉండటం వల్ల ఎడమకంటికే ప్రమాదం వచ్చింది.

ఆ సమయానికి గోచారకుజుడు లగ్నంలోకి వచ్చాడు.రాహువు ద్వాదశంలోకి పోయినాడు.శని యధావిధిగా రెండింట ఉన్నాడు.ఇక కళ్ళుపోక ఏమి జరుగుతుంది?రాహువూ కుజుడూ శనీ ఇలా మూడుస్థానాలనూ ఆక్రమిస్తే ఇదికాక ఇంకేమి జరుగుతుందో జ్యోతిష్యవేత్తలకు వివరించపనిలేదు.

అయితే లగ్నాధిపతి శుక్రుడు చతుర్దంలో మిత్రస్థానంలో ఉండటంవల్ల గుడ్డివాడైనా బాగా చదువుకోగలిగాడు.బ్రెయిలీలిపిని సృష్టించి ఎందరికో మేలు చెయ్యగలిగాడు.దానికి దశమంలోని పూర్ణచంద్రుడూ అతనిపైన గల శుక్రదృష్టీ కారణాలు.

శుక్రుడు ఆత్మకారకుడు.కారకాంశ కన్య.అక్కడనుంచి తృతీయమూ అష్టమమూ దెబ్బ తినడంవల్ల మధ్యాయుష్కుడై 6-1-1852 న సూర్య/చంద్ర/శని/కేతు దశలో 43 ఏళ్లకే మరణించాడు.సూర్యచంద్రులకుగల దోషాన్ని పైనే వివరించాను.శనికేతువులిద్దరూ మారకస్థానంలో ఉన్నారు.వీరిలో కేతువు కుజున్ని సూచిస్తున్నాడు.కనుక ఈ సమయంలో మరణించాడు.

ఇతని కళ్ళు పోవడానికి ఏ గ్రహయోగాలు కారణం అయ్యాయో మరణానికీ అవే యోగాలు కారణం అయ్యాయి.అంటే పూర్వజన్మ పాపం ఇతన్ని జీవితమంతా వెంటాడుతూనే ఉందనీ మధ్యాయుష్క మరణాన్నికూడా అదే తెచ్చిందనీ తెలుస్తున్నది.

ఈ లగ్నానికి మంచివాడుకాని గురువు షష్టాధిపతిగా పంచమంలో ఉండటం చూస్తే ఇతనికి పూర్వకర్మ బాగాలేదని తెలుస్తుంది.పైగా నవమాధిపతి అయిన బుధునికి ఇంత దోషం ఆపాదించబడటం కూడా దీనినే సూచిస్తుంది. పై గ్రహస్తితులనుబట్టి ఆపాపం ఏమిటో తేలికగా ఊహించవచ్చు.కాని అలాంటివి వ్రాయడమూ చదవడమూ మంచిదికాదు.అవి వినడానికి అంత బాగుండవు కూడా.కనుక వ్రాయడం లేదు.

ఇటువంటి అనలిటికల్ స్కిల్ వల్లే పాతకాలంలో జ్యోతిష్యవేత్తలు ఒకని జాతకం చూడగానే అతని జీవితంలో ఎప్పుడు ఏమి జరుగుతుందో చెప్పగలిగేవారు.

అయితే,పుట్టిన వెంటనే జాతకం చూచి,ఈ దోషాన్ని గమనించి,పరిహారాలు చేస్తే,ఇలా జరుగకుండా ఉంటుందా? అనే ప్రశ్న తలెత్తుతుంది.పరిహారం చేస్తే దోషం ఉపశమిస్తుందనీ పోతుందనీ భ్రుగు,గర్గ,పరాశరాది మహర్షులు చెప్పినారు.ఒకవేళ చేసిఉంటే ఏమయ్యేది అని ఇప్పుడు ఊహించడం సరికాదు.ఇతని తల్లిదండ్రులకు భారతీయజ్యోతిష్యం తెలిసే అవకాశం లేదు. తెలిసినా పరిహారం చేద్దామని బుద్ధి పుట్టాలి.మోసగాడు కాని జోస్యుడు దొరకాలి.పరిహారం చెయ్యాలి.ఇన్ని చిక్కులను దాటగలిగితే ఫలితం ఖచ్చితంగా కనిపిస్తుంది.

కాని అలా జరగకుండా పూర్వకర్మ అడుగడుగునా అడ్డు పడుతుంది. అందులోనూ దోషం బలీయంగా ఉన్నపుడు పరిహారం జరగనివ్వకుండా ప్రకృతిశక్తులు అనుక్షణమూ అడ్డుకుంటాయి.వాటిని దాటి పరిహారం చెయ్యగలిగితే దోషం పోవడం ఖాయం.కానీ అంత శక్తి ఎవరికుంటుంది?

అందుకే,పుట్టిన పన్నెండేళ్ళవరకూ జాతకం చూడరాదు అనేమాట నేను అంతగా హర్షించను.కొందరు జ్యోతిష్కులు ఈమాటను చెబుతారు.కాని ఇది నేను ఒప్పుకోను.ఈలోపలే జరగాల్సిన దారుణం జరిగితే ఇక ఆపైన జాతకం చూచి ఉపయోగం ఏముంటుంది?కనుక శిశువు పుట్టిన వెంటనే జాతకం చూచి బాలారిష్టాలు ఏమైనా ఉంటే దోషపరిహార శాంతులు జరపడం ఉత్తమం.బాలారిష్టం అంటే అర్ధం కూడా అదే.

పూర్వకాలంలో మహారాజులూ చక్రవర్తులూ కూడా ఇదేపని చేసేవారు.వాళ్ళు తెలివితక్కువవారు కారనీ మనకంటే చాలా లౌక్యులనీ,జ్ఞానులనీ,జీవితాన్ని మనకంటే ఎంతో చూచినవారనీ గుర్తుంటే జ్యోతిష్యశాస్త్రాన్ని విమర్శించేవారి నోళ్ళు టక్కున మూతపడతాయి.

ఈవిధంగా ఎన్ని జాతకాలు చూచినా జ్యోతిష్యశాస్త్రం యొక్క అద్భుతమైన మహత్యం మళ్ళీ మళ్ళీ ఋజువౌతూనే ఉంటుంది.కర్మసిద్ధాంతం నిజమే అనేది కూడా ఎన్నిసార్లైనా ఋజువౌతూనే ఉంటుంది.
read more " లూయీ బ్రెయిలీ జాతకం-అంధత్వయోగాలు "

1, డిసెంబర్ 2013, ఆదివారం

'పంచవటి' సేవా కార్యక్రమాలు మొదలయ్యాయి

పంచవటి సంస్థ నుంచి మేము తలపెట్టిన సేవా కార్యక్రమాలలో భాగంగా నిన్న గుంటూరులోని 'షిర్డీసాయి దీనజన సేవాసమితి' వారికీ 'మాతృశ్రీ వృద్దాశ్రమానికీ' కొంత ధనసహాయం చెయ్యడం జరిగింది.నేనూ,పంచవటి సభ్యుడూ మిత్రుడూ మదన్ కలసి నిన్న ఈ పని చేశాము.

'షిర్డీసాయి దీనజన సేవాసమితి' గుడ్డివారికోసం మొదలుపెట్టబడిన సంస్థ. ఇది 2/13 గుంటూరు బ్రాడీపేటలో ఉన్నది.ఇక్కడ 71 మంది గుడ్డివారు ఉండి చదువుకుంటున్నారు.వీరిలో నలుగురైదుగురు గ్రాడ్యుయేట్లూ,పోస్ట్ గ్రాడ్యుయేట్లూ కూడా ఉన్నారు.ఒకరిద్దరు మానసిక వికలాంగులు కూడా ఉన్నారు.తీరా అక్కడకి వెళ్లేసరికి మిత్రుడు పీ.ఎస్.మూర్తి గారే దాని సెక్రెటరీ అని తెలిసింది.ఆయనేదో రాజకీయ మీటింగ్ లో ఉండటం వల్ల సమయానికి అక్కడకు రాలేకపోయారు.

'మాతృశ్రీ వృద్దాశ్రమం' గుంటూరు శ్రీనగర్లో ఉన్నది.ఇందులో నలుగురు మగవారూ,22 మంది ఆడవారూ ఉన్నారు.అనాధలలో ఎక్కువగా స్త్రీలే ఉంటారు.కారణం-వారికి చదువు లేకపోవడమూ ఆస్తులు లేకపోవడమూ, స్వతంత్రంగా బ్రతికేశక్తి లేకపోవడమూ ఇలా రకరకాలైన కారణాలు ఉంటాయి.వీరిలో ఒక్కొక్కరిది ఒక్కొక్క విషాదగాధ.అందరూ వృద్ధులే.వీరిలో కొందరు బాగా ముసలివారుగా ఉన్నారు.వారి పనులు వారు చేసుకుంటూ ఆశ్రమాన్ని శుభ్రంగా ఉంచుకుంటూ నిరాడంబరంగా ఒక కుటుంబంలా కలసి ఉంటున్నారు.

కాని అందరి ముఖాల్లోనూ ఏదో నిరాశా నిర్లిప్తతా కనిపిస్తున్నాయి.పెద్ద వయస్సులో 'నావాళ్ళు' అనుకున్నవారి నిరాదరణకు గురవ్వడం చాలా బాధాకరం.ఎంతగా సమయానికి అన్నీ జరుగుతున్నా మనస్సులో ఆ వెలితి వారిని బాధిస్తున్నట్లు కనిపించింది.

నవంబర్ నెలలో ఈ రెండు సంస్థలకూ మాకు చేతనైన ధనసహాయం చెయ్యడం జరిగింది.
read more " 'పంచవటి' సేవా కార్యక్రమాలు మొదలయ్యాయి "

27, నవంబర్ 2013, బుధవారం

మాగ్నస్ కాల్సన్ (ప్రపంచ చదరంగ చాంపియన్) జాతకం

మాగ్నస్ కాల్సన్ నేటి వరల్డ్ చెస్ చాంపియన్.చెన్నైలో జరిగిన పోటీలో విశ్వనాధన్ ఆనంద్ ని ఓడించి టైటిల్ గెలుచుకున్నాడు.ఇతని జాతకం ఒకసారి పరిశీలిద్దాం.

ఇతను 30-11-90 న నార్వేలో టాన్స్ బెర్గ్ అనే ఊళ్ళో పుట్టినాడు.జనన సమయం తెలియదు.కనుక విభిన్నములైన నాడీ విధానాలతో ఇతని జాతకాన్ని స్థూలంగా చూద్దాం.

ఇతను శుక్రనక్షత్రంలో శుక్రవారం రోజున పుట్టినాడు.కనుక శుక్రునికి ఇతని జీవితంలో మంచి ప్రాధాన్యత ఉండాలి.పైగా శుక్రుడు అమాత్యకారకుడయ్యాడు.కనుక ఇతని వృత్తిని కూడా శుక్రుడే నిర్ణయిస్తాడు.ఆ శుక్రుడు గూడత్వాన్ని సూచించే వృశ్చికంలో ఉంటూ,వెనుకవైపు సూర్యునీ,ముందు బుధునీ శనినీ కలిగి ఉన్నాడు.అంటే తండ్రి తోడ్పాటుతో,తెలివిని ఉపయోగించి ఆడేఆట అయిన చదరంగం వృత్తిగా కలిగిన వాడౌతాడని గ్రహములు సూచిస్తున్నాయి.

ఇతని జాతకంలో ఆత్మకారకుడు శని అయినాడు.ఆరోజున చంద్రునికి ఆత్మకారకత్వం రాదు.ఇతర గ్రహములు ఆ స్థానమును ఆక్రమించలేవు.కనుక కారకాంశ ధనుస్సు అవుతుంది.శనికి వర్గోత్తమాంశ కలిగింది.రవి కూడా వర్గోత్తమాంశలోనే ఉన్నాడు.ఈ రెంటివల్ల ఇతనికి వృత్తిపరమైన అదృష్టమూ,పేరుప్రఖ్యాతులూ తేలికగా వస్తాయని అర్ధమౌతుంది.చదరంగంలో బాలమేధావి అవడం ఈ రెండుగ్రహాల వరమే.

ధనుస్సులో శని,బుధుడు,యురేనస్,నెప్ట్యూన్ లున్నారు.వీరిలో యురేనస్సూ సూర్యుడూ ఖచ్చితమైన ద్విర్ద్వాదశస్థితిలో ఉన్నారు.దీనివల్ల ఉన్నట్టుండి సరియైన అంత:స్ఫురణ కలుగుతుంది.గురువూ నెప్త్యూనూ ఖచ్చితమైన షష్టాష్టక స్థితిలో ఉన్నారు.దీనివల్ల మతాభినివేశమూ అదృష్టమూ ఉంటాయి.

మేషరాశిలోని చంద్రమంగళయోగం వల్ల ఓటమిని అంగీకరించని పట్టుదల ఉంటుంది.శని బుధుల కలయిక వల్ల ఓర్పుగా ఆలోచించి ఆడగల నేర్పు వస్తుంది.గజకేసరీ యోగం అదృష్టాన్నిస్తుంది.

కర్మకారకుడైన శనితో బుధుని కలయికవల్ల ఆలోచనాశక్తితో కూడిన జీవిక ఉంటుందని సూచన ఉన్నది.చంద్రలగ్నాత్ తృతీయాధిపతి కూడా బుధుడే అవడం గమనార్హం.కనుక గంటలు గంటలపాటు స్థిరంగా ఆలోచించి ఓర్పుగా ఎత్తుకు పైఎత్తులు వేసి ఆడవలసిన చదరంగం లో ప్రావీణ్యం కలిగింది.

శనికి వచ్చిన ద్వితీయ తృతీయాధిపత్యములవల్ల,క్రీడలుగాని,రచనలుగాని, సమాజంతో కమ్యూనికేషన్ వల్లగాని ధనార్జన ఉంటుందని తెలుస్తుంది.ఈ మూడూ ఇతని జీవితంలో నిజాలయ్యాయి.

శని వెనుకగా వరుసగా సూర్య,శుక్ర,బుధులు ఉండటం వల్ల,ఇతని వృత్తిలో పేరు ప్రఖ్యాతులూ,విలాస జీవితమూ,తెలివితో కూడిన ఆలోచనాశక్తీ తోడుగా ఉంటాయన్న సూచన ఉన్నది.

శుక్రునికి వచ్చిన అమాత్యకారకత్వంవల్ల,చిన్నప్పుడే మోడలింగ్ చేసే అవకాశాలు వచ్చాయి.ఉత్పత్తులకు ప్రోమోటింగ్ మోడల్ గా అవకాశాలను చదరంగ విజయాలు కలిగించాయి.

ఎంత క్రీడాసామర్ధ్యం ఉన్నప్పటికీ చదరంగం వంటి ఆటలో స్ఫురణశక్తి చాలా ప్రధానం.అటువంటి అంత:స్ఫురణను ఇవ్వడంలో శన్యతీతగ్రహాలకు చాలా ప్రముఖపాత్ర ఉంటుంది.ఆ కోణంలో యురేనస్ నెప్త్యూన్ల పాత్ర స్పష్టంగా కనిపించే మరొక్క జాతకం ఇతనిది.

సరియైన జననసమయం లేకున్నా,నాడీజ్యోతిష్య విధానములు ఉపయోగించడం వల్ల జాతకాన్ని స్థూలంగా చదవవచ్చు.చాలావరకూ జీవిత దిశనూ దశనూ గ్రహించవచ్చు అనడానికి ఇలాంటి జాతకములే ఉదాహరణలు.
read more " మాగ్నస్ కాల్సన్ (ప్రపంచ చదరంగ చాంపియన్) జాతకం "

23, నవంబర్ 2013, శనివారం

సచిన్ టెండూల్కర్ జాతకం

సచిన్ టెండూల్కర్ మొన్న నవంబర్ 16 న క్రికెట్ నుంచి రిటైరయ్యాడు.ఆ సందర్భంగా అతని జాతకం చూద్దాం.ఇతని జననసమయం కూడా ఖచ్చితమైనది దొరకడం లేదు.ప్రముఖవ్యక్తులు వారి జనన సమయాన్ని దాచి ఉంచుతారు.దానికి రకరకాలైన కారణాలుంటాయి. ఇతను 24-4-1973 న ముంబైలో పుట్టినాడు. జనన సమయాలు మధ్యాన్నం 1 అనీ,2.47 అనీ సాయంత్రం 4.20 అనీ రకరకాలుగా దొరుకుతున్నాయి. వీటిలో ఏది సరియైన సమయమో తేలికగా కనిపెట్టవచ్చు.కొన్ని స్థూలమైన విషయాలద్వారా మాత్రమే దీనిని గమనిద్దాం.

సూర్యుడూ కుజుడూ ఇతని జాతకంలో ఉచ్ఛలో ఉన్నారు.కుజుడు క్రీడలకు దూకుడుతనానికి కారకుడు కనుక క్రికెట్ ఆటలో అంతపేరు సంపాదించాడు. కన్యాలగ్నం అయితే మాత్రమే ఇది సాధ్యం.ఎందుకంటే అప్పుడు మాత్రమే కుజుడు తృతీయాధిపతి అవుతాడు అనే వాదనతో నాకు కొన్ని సందేహాలున్నాయి.కనుక ప్రస్తుతం ఆ విషయం అలా ఉంచుదాం.

సూర్యునివల్ల సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులూ, ఆదరణా, విజయ పరంపరలూ కలిగాయి.గురువు నీచలో ఉన్నాడు.కనుక సత్యసాయిబాబాకు భక్తుడయ్యాడు.సత్యసాయిబాబా జాతకంలో కూడా గురువు నీచలో ఉండటం గమనార్హం.కార్మిక్ సిగ్నేచర్స్ ఆ విధంగా పనిచేస్తాయి.

ఇతనిది ప్రేమవివాహం.కర్కాటక కన్యాలగ్నాలకు ఈజాతకం ప్రకారం ప్రేమవివాహం సాధ్యమే.కనుక ఈరెంటిలో ఏదో ఒకటి అయి ఉండాలి.ఇతని భార్య ఇతనికంటె ఆరేళ్ళు పెద్దది.ఈ రెండు లగ్నాలకూ సప్తమదోషం ఉన్నప్పటికీ ఎక్కువగా కర్కాటక లగ్నమే సూచితం అవుతుంది.ఎందుకంటే అప్పుడే సప్తమానికి శని ఆధిపత్యం వస్తుంది.పైగా భార్య డాక్టర్ అయ్యే యోగం కర్కాటక లగ్నానికే ఎక్కువగా ఉన్నది.

కెరీర్ పరంగా చూచినా కన్యాలగ్నం అయితే దశమకేతువు వల్ల కెరీర్ అంత బాగుండదు.అదే కర్కాటకం అయితే దశమంలోని ఉచ్ఛసూర్యుని వల్ల బ్రహ్మాండంగా ఉంటుంది.కనుక కర్కాటకలగ్నమే సరియైనది అని అనిపిస్తున్నది.అలాంటప్పుడు జననసమయం మద్యాన్నం ఒంటిగంట ప్రాంతం అవుతుంది.అప్పుడు వివాహసమయానికి(24-5-1995) కుజ/గురు/బుధదశ జరిగింది.కుజగురులు సప్తమంలోనూ బుధుడు చంద్రలగ్నాత్ సుఖస్థానం లోనూ ఉండటం చూస్తే ఈ సంఘటన సరిగ్గా సరిపోతుంది.కనుక మధ్యాన్నం ఒంటిగంట సమయమే సరియైనది.

ప్రస్తుతం ఇతను కెరీర్ నుంచి విరమించుకున్నాడు.భారతరత్న బిరుదు కూడా ఇవ్వబడింది.దశాపరంగా పరిశీలిద్దాం.

ప్రస్తుతం ఇతని జాతకంలో రాహు/శుక్ర/గురు/కేతుదశ జరుగుతున్నది. శుక్రునితో కలిసి ఉన్న సూర్యుడు అత్యున్నత పురస్కారం ఇచ్చాడు.శుక్రుడు ఈ లగ్నానికి బాధకుడు,గురువు నీచలోఉండి కుజునికి దోషాన్ని ఆపాదిస్తున్నాడు,కేతువు విడిపోవడాన్ని సూచిస్తాడు.కనుక కెరీర్ ముగిసింది.

ఇతని జాతకంలో కూడా వ్యతిరేక కాలసర్పయోగం ఉందని కొందరు అంటారు. కాని అలాంటియోగం అంటూ అసలు ఏదీలేదని ఇతని అప్రతిహతమైన కెరీర్ వల్ల తెలుస్తున్నది.ఆ పదం కూడా కొందరిసృష్టి మాత్రమేగాని నిజం కాదన్న విషయం కూడా నిజమే.

తృతీయంలోని యురేనస్ ప్లూటోలు క్రీడలలో దూకుడును ఇస్తాయి.ఇతని జాతకంలో ఈ రెంటిలో యురేనస్ బాగా బలంగా ఉన్నది.ఎందుకంటే యురేనస్ కుజనక్షత్రంలో ఉండి ఖచ్చితమైన పంచమదృష్టితో ఉచ్ఛకుజుడిని చూస్తున్నది.కనుకనే డోనాల్డ్ బ్రాడ్మన్ కూడా ఇతన్ని మెచ్చుకునే విధంగా విచిత్రంగా టెక్నిక్ నూ దూకుడునూ కలగలిపి ఆడగలిగాడు.

పంచమంలో నెప్ట్యూన్ ప్రేమవివాహాన్ని ఇస్తుంది.ఇతని జాతకంలో ఇదికూడా నిజం కావడం చూడవచ్చు.నెప్ట్యూన్ శనినక్షత్రమైన అనూరాధలో ఉండటం వల్ల తనకంటే పెద్దదైన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

యురేనస్ నెప్ట్యూన్ ప్లూటోలను నేనుకూడా మొదట్లో పరిగణించేవాడిని కాను.కాని తర్వాత్తర్వాత నా అభిప్రాయాలు మార్చుకున్నాను.వాటిని కూడా జాతకంలో లెక్కలోకి తీసుకుంటేనే ఎక్కువ క్లారిటీ వస్తుంది అనేమాట నిజమే.

తృతీయంలోని ఘటికాలగ్నం కూడా క్రీడలవల్ల వచ్చే పేరుప్రఖ్యాతులను సూచిస్తున్నది.

ఈ రకంగా జాతకచక్రాన్నిబట్టే జీవితం జరగడం ఎవరి జీవితంలో చూచినా గమనించవచ్చు.ఏరంగంలో ఎంత గొప్పవారైనా గ్రహాలకూ జాతకానికి అతీతులు కారు.కాలేరు.
read more " సచిన్ టెండూల్కర్ జాతకం "

16, అక్టోబర్ 2013, బుధవారం

దేవరగట్టు-మక్కా

ఈ లోకంలో మానవులు అసలైన ఆధ్యాత్మికతను వదలి ఏవేవో వారికి తోచిన తంతులలో కాలం వెళ్ళబుచ్చుతూ అవే దైవానికి చేర్చే మార్గాలని భ్రమిస్తూ ఉంటారు.కళ్ళు తెరచి చూస్తే,మన చుట్టూఉన్న ప్రపంచంలో దీనికి నిదర్శనాలు ఎన్నైనా కనిపిస్తాయి.

ప్రస్తుతం భూమ్మీద రెండుచోట్ల రెండురకాలైన కార్యక్రమాలు జరుగుతున్నాయి.

ఒకటి - మక్కాలో సైతాన్ అంటూ రాతిస్తంభాన్ని లక్షలాదిమంది 'సాంప్రదాయబద్ధంగా' రాళ్ళతో కొట్ట్డడం.ఆతర్వాత లక్షలాది జంతువులను 'సాంప్రదాయబద్ధంగా' దేవుడికి బలివ్వడం.

రెండు - కర్నూల్ జిల్లా దేవరగట్టు గ్రామంలో దేవుడి ఊరేగింపు సందర్భంగా రెండు గ్రామాల ప్రజలు 'సాంప్రదాయబద్ధంగా' కర్రలతో తలలు పగలగొట్టుకోవడం.

నా దృష్టిలో ఈ రెండూకూడా మానవునిలోని సాంప్రదాయబద్ధమైన అజ్ఞానానికి సూచికలే.

ఎందుకని?

దైవానికి జంతువుల బలి ఎంతమాత్రం అవసరం లేదు.ఎందుకంటే అవికూడా దైవసృష్టిలో సృష్టించబడిన జీవాలే గనుక.మానవునికి మిగిలిన జంతువుల కంటె కొంచం తెలివి ఉన్నంతమాత్రాన వాటిని చంపే హక్కు అతనికి లేదు.'నీకోసమే వాటిని సృష్టించాను. వాటిని చంపి భుజించు' అంటూ దేవుడు చెప్పినట్లు కొన్ని మతగ్రంధాలలో ఉన్న మాటలకు వాస్తవికత లేదు.ఇవి జిహ్వచాపల్యాన్ని జయించలేని కొందరు మనుషులు వ్రాసిన మాటలేగాని దైవం చెప్పిన సూక్తులు కానేకావు.ఎందుకంటే దైవంనోట అలాంటి పక్షపాతంతో కూడిన మాటలు ఎన్నటికీ రావు.

సైతాన్ అనేది రాతిస్తంభంలో లేదు.అది మన చుట్టూ ఉన్నది.మన హృదయాలలో ఉన్నది.ఒక పక్క దేవుణ్ణి పూజిస్తున్నాం అని చెబుతూ ఇంకోపక్క సాటి మనుషులను చంపాలని ప్లానులు వేసే మనుషుల గుండెల్లో సైతాన్ ఉన్నది.ఆ సైతాన్ని చంపాలంటే మనమే చెక్కిన రాతిస్తంభాన్ని మనమే రాళ్ళతో కొట్టడం కాదు,మనల్ని మనమే రాళ్ళతో కొట్టుకోవాలి.

ఒక పక్కన ఉన్నతమైన భావనతో నిరాకార తేజోస్వరూపంగా దైవాన్ని కొలిచే ముస్లిములు ఇంకోపక్కన ఇలాంటి అనాగరిక ఆటవిక తంతులను ఎలా ఆచరిస్తారో నాకెప్పటికీ అర్ధం కాదు.

ఇక దేవరగట్టు విషయానికొస్తే,ఇది కూడా మక్కాలొ జరిగే తంతులాంటి అనాగరిక ఆచారమే.ఒక వర్గం దేవుణ్ణి ఊరేగిస్తుంటే ఇంకొక వర్గం దానిని అడ్డుకోవడం ఏమిటి?దానికోసం యుద్ధం ఏమిటి?కర్రలతో తలలు పగలగొట్టుకొని ఆనందించడం ఏమిటి?పైశాచికత్వం కాకపోతే దీనిని ఏమనాలి?

ఎప్పుడో కాలగతిలో ఏదో ఒక సందర్భంలో ఆయా ఘట్టాలు జరిగి ఉండవచ్చు. వాటిని శిలాశాసనాలుగా తీసుకొని తరతరాలుగా వాటిని గుడ్డిగా ఆచరించడానికి అవేమీ అంత ఆదర్శ సంఘటనలు కావు.వాటిలో ఉన్నత తాత్త్వికసత్యాలూ లేవు.

ఈ రెంటినీ విమర్శిస్తే ఆయా అనుయాయులకు పిచ్చికోపం వస్తుంది.ఈ రెంటినే కాదు.'సత్యం ఇదిరా బాబూ' అని చెప్పే ప్రతివాడిమీదా లోకానికి పిచ్చి కోపం వస్తూనే ఉంటుంది.ఎందుకంటే తరతరాలుగా తాము ఆచరిస్తున్న తర్కరహిత ఆచారాలలో సత్యం ఎంత? అని ప్రశ్నించుకోవడానికి చాలా గుండెధైర్యమూ సత్యనిష్ఠా ఉండాలి.దురదృష్టవశాత్తూ అవి మానవులలో ఎక్కడోకాని కనిపించవు.

దేవరగట్టులో జరుగుతున్న ఈ అనాగరిక తంతును ఆపడానికి వెళ్ళిన పోలీసులపై గ్రామస్తులు ఎదురుదాడి చెయ్యడం వారి అజ్ఞానానికి పరాకాష్ట అనుకోవచ్చు.పైపెచ్చు,ఈ అనాగరిక ఆచారం ఆపితే దేవుడికి కోపం వస్తుందనీ,ఆయా గ్రామాలకు ఏదో చెడు జరుగుతుందనీ గ్రామస్తులు ఇప్పటికీ నమ్ముతారు.రోదసీయుగంలో కూడా అడవి మనుషులలాగా బ్రతుకుతామంటే ఎవరేం చెయ్యగలరు?

అలాగే, మక్కా వెళ్ళి సైతానంటూ రాతి స్తంభాన్ని రాళ్ళతో కొట్టి జంతువులను బలిచ్చి ఆనందంగా తిరిగివచ్చె సాధారణ ముస్లిం, తాను తిరిగివచ్చిన తర్వాత తనచుట్టూ ఉన్న సాటిమానవులనూ వారు పాటించే ఇతర మతాలనూ ద్వేషిస్తూ గుండెలనిండా కోపాన్ని కలిగిఉంటే దాని ప్రయోజనం ఏమిటి?సైతాన్ని అతడు ఏరకంగా చంపినట్లు?తాను ద్వేషించే సైతాన్ని తన గుండెల్లోనే పెట్టుకుని తిరిగివచ్చినట్లు కాదా?

ప్రతి మతంలోనూ ఇలాంటి పిచ్చిపిచ్చి ఆచారాలు చాలా కనిపిస్తాయి. అత్యున్నతములైన సత్యాలూ,అజ్ఞానపూరిత ఆచరణలూ ఒకేసారి రెండూ పక్కపక్కనే కనిపిస్తాయి.అసలైన సత్యాన్ని ఉన్నదున్నట్లు చెప్పిన బౌద్ధమూ అద్వైతమూ వంటి మతాలుమాత్రం కాలగర్భంలో కలసి ఎక్కడో నామమాత్రంగా మిణుకు మిణుకుమంటూ ఉండిపోతాయి.అవెవరికీ పట్టవు.

మనుష్యులు బయటకు ఎన్ని మాటలు చెప్పినా వారిస్వార్దాన్నీ,అజ్ఞానాన్నీ, హింసాప్రవృత్తినీ పెంచిపోషించే మతాచరణలే వారికి నచ్చుతాయి.లేదా ఆయా మతాలలో ఇలాటివాటిని ప్రేరేపించే తంతులనే వారు స్వీకరించి ఆచరిస్తూ ఉంటారు.మిగిలిన సత్యాలను వారు స్వీకరించరు.ఆచరించరు.అలాగే,సత్యాన్ని ఉన్నదున్నట్లుగా చెబితే కూడా ఎవరికీ ఎక్కదు.సాటి మానవులనూ సాటి జీవులనూ ప్రేమించలేనివారికి దైవత్వం ఎలా వస్తుందో నాకైతే ఎప్పటికీ అర్ధం కాదు.

మనుషులకు అసలైన మతమూ దైవాన్ని చేరే అసలైన మార్గమూ అక్కరలేదు.వీరికి కావలసినది అనవసరమైన తంతులూ,అజ్ఞానపూరిత ఆచారాలూ,వారి స్వార్ధాన్నీ భయాన్నీ అహంకారాన్నీ సంతృప్తిపరచే డొల్ల కార్యక్రమాలూ మాత్రమే.మనుషుల అజ్ఞానాన్నీ మొండితనాన్నీ ఆ దేవుడు కూడా మార్చలేడు.ఈ లోకం ఖర్మ ఇంతే.
read more " దేవరగట్టు-మక్కా "