“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

18, జనవరి 2014, శనివారం

శ్రీశైలం నుంచి పిలుపొచ్చింది-2

'కాశిరెడ్డి నాయన ఎక్కడ ఉండేవాడు.' అడిగాను.

'ఆయనకొక ఊరంటూ లేదు సార్.ఎక్కడ బడితే అక్కడ అలా తిరుగుతూ ఉండేవాడు.ఎక్కువగా మాత్రం ఆళ్లగడ్డలో కనిపించేవాడు.ఆళ్ళగడ్డ బస్టాండ్ దగ్గర ఒక కానుగ చెట్టు ఉండేది.ఆ చెట్టుకింద ఒక నులక మంచంలో పడుకొని ఉండేవాడు.ఆ మంచానికి కూడా నిలువుగా మూడు అడ్డంగా మూడు పట్టీలు మాత్రమె ఉండేవి.అందులో పడుకొని ఉండేవాడు.చొక్కా వేసుకోడు.నడుముకు ఒక అంగవస్త్రం వంటిది మోకాళ్ళవరకూ కట్టుకొని ఉంటాడు.ఎంత చలిలో అయినా మంచులో అయినా అదే వేషంలో ఉంటాడు.

భుజానికి ఒక సంచీ వేలాడుతూ ఉండేది.అది ఎప్పుడూ ఖాళీగా ఉండేది.కానీ అందులోనుంచే మాకు చాలా వస్తువులు తీసి ఇచ్చేవాడు.ఆయన పొట్ట కూడా ఎప్పుడూ వెన్నుకు అంటుకొని ఉండేది.ఆయన ఎప్పుడూ ఏమీ తినగా మేము చూడలేదు.


'ఆయనకు ఎన్నేళ్ళు?' అడిగాను.

'సమాధి అయ్యే సమయానికి దాదాపు నూరేళ్ళు ఉండేవి సార్.బాగా పెద్దవాడై పోయాడు.బాగా వంగిపోయి నడిచేవాడు.' 

'మరి ఏమీ తినకుండా ఎలా ఉండేవాడు?' తెలీనట్టు అడిగాను.

'అదేసార్ యోగశక్తి.వాళ్ళు యోగులు. ఉండగలరు. మనకు తెలియని అనేక విద్యలు వాళ్లకు తెలిసి ఉంటాయి.కానీ ఎప్పుడైనా బలవంతం చేస్తే ఒక కప్పు టీ తాగేవాడు.అంతకంటే ఆయన తినగా త్రాగగా నేను ఈ ఇరవైముప్పై ఏళ్ళలో ఎప్పుడూ చూడలేదు.'అన్నాడు.

నాకు వెంటనే అమ్మ గుర్తొచ్చి కళ్ళలో నీళ్ళు గిర్రున తిరిగాయి.తన చేతిమీదుగా లక్షలాది మందికి అన్నం పెట్టిన జిల్లెళ్ళమూడి అమ్మ ఎప్పుడూ ఏమీ తినగా ఎవ్వరూ చూడలేదు.ఎప్పుడో చిన్నతనంలో వాళ్ళ అమ్మ బ్రతికున్నపుడు తిన్న అన్నమే.తల్లి చనిపోయిన తర్వాత అమ్మ తిన్నదో లేదో ఎవ్వరూ పట్టించుకోలేదు.'బంగారుతల్లి' అనీ 'ఎంత చక్కగా మాటలు చెబుతుందో' అంటూ ముద్దు చేసినవారూ 'ఎంత పెద్ద మాటలో' అంటూ ఆశ్చర్యపోయినవారూ కూడా అమ్మ ఆకలిని ఎవరూ పట్టించుకోలేదు.తల్లిలేని పిల్ల అని బాధపడిన  వారేకాని వేళకు ఆ పిల్ల తిన్నదా లేదా ఎవరికీ పట్టేది కాదు.తన ఆకలిని గురించి ఏమాత్రమూ పట్టించుకోని ఈ లోకానికి అమ్మ తన జీవితాంతమూ అన్నం పెడుతూనే ఉన్నది.ఈనాటికీ జిల్లెళ్లమూడిలో నడుస్తున్న 'అన్నపూర్ణాలయం' ద్వారా అన్నం పెడుతూనే ఉన్నది.

ఎవరైనా తనను చూడవస్తే 'తర్వాత మాట్లాడుకుందాం.ముందు అన్నం తినిరా నాన్నా' అని చెప్పేది.1950.1960 ప్రాంతాలలో అయితే అర్ధరాత్రయినా అపరాత్రయినా తనే వంటచేసి వచ్చినవారికి వడ్డించేది.

'అమ్మ ఏమీ తినేది కాదు.ఎప్పుడైనా కాఫీ మాత్రం తాగేది.' అని అమ్మతో అనేక ఏళ్ళు అతి సన్నిహితంగా గడిపిన వసుంధర అక్కయ్యే మాతో ఒకరోజున చెప్పింది.ఏమీ తినకపోయినా అమ్మ ముఖంలో తేజస్సు ఏమాత్రమూ తరిగేది కాదు.ఇది చూచి ఆశ్చర్యపోయిన వాళ్ళు ఎందఱో ఇప్పటికీ ఉన్నారు.అసలు తిండి తినకుండా జీవితాంతం ఒక మనిషి ఉండటం సాధ్యమేనా?సైన్స్ కు ఇది అందే విషయమేనా? అంటే,సైన్స్ కు అందనివి ఎన్నో యోగుల లోకంలో ఉన్నాయి అని చెప్పవచ్చు.అలా ఉన్న జిల్లెళ్ళమూడి అమ్మ నిన్న మొన్నటి వరకూ మన మధ్యనే ఉన్నారు.కాశిరెడ్డి నాయన కూడా అలాంటివాడే.

'యోగులకు పొట్ట లోపలికి ఉండాలి సార్.అదే భోగులకైతే బాగా పొట్ట ఉంటుంది.అదే వారికీ వీరికీ తేడా' అన్నాడు రామమూర్తి.

నాకు మళ్ళీ నవ్వొచ్చింది.ఇలాంటి మాటలు వింటే నాకు భలే వినోదం వేస్తుంది.

త్రిలింగ స్వామికి పెద్ద బానపొట్ట ఉండేది.కాని ఆయన మహాయోగి.రమణమహర్షికీ ఒక మోస్తరు పొట్ట ఉండేది.పొట్టను బట్టి యోగి స్థితిని ఎలా కొలవగలం?లోకులు ఇంతే.వారికి ఏవేవో తెలిసీ తెలియని కొన్ని అభిప్రాయాలుంటాయి.వాళ్ళ కళ్ళద్దాల నుంచే వాళ్ళు ఎప్పుడూ చూస్తూ ఉంటారు.అక్కడే వాళ్ళు సత్యాన్ని చూడలేక బొక్కబోర్లా పడిపోతుంటారు.పొట్ట ఒక్కటే యోగానికి కొలబద్ద అయితే నేడు జిమ్ కెళ్ళి సిక్స్ ప్యాక్ లు పెంచుతున్న కుర్రకారు అందరూ మహాయోగులే అవ్వాలి కదా.

లోలోపల నవ్వుకొన్నాను.

'కాశిరెడ్డి నాయన గురించి ఏదో చెబుతానని ఇందాక అంటూ ఆపారు.'అడిగాను.

అవును సార్.ఆయన శుక్రవారం నాడు శరీరాన్ని వదిలేశాడు.అంతకు మూడు నాలుగు రోజుల ముందు నాకు ఇక్కడే కనిపించి 'రేపు శుక్రవారానికి జ్యోతికి వచ్చేయ్ నానా.' అన్నాడు.

'ఎందుకు నాయనా' అని నేను అడిగాను.

'ఏమోరా.నాకు చెప్పాలని అనిపించింది.చెప్పినాను.నీ ఇష్టం' అన్నాడు.

'నువ్వు రమ్మంటే అట్లాగే వస్తాలే నాయనా' అన్నాను.

'కాని ఆరోజుకు నాకు పోవడానికి కుదరలేదు.విచిత్రం ఏమంటే,అదే రోజున రకరకాల ఊర్లలో చాలామందికి ఆయన కనిపించి ఇదే మాట చెప్పినాడు.శుక్రవారం నాటికి ఎంతోమంది గిద్దలూరు దగ్గర ఉన్న జ్యోతి ఆశ్రమానికి చేరినారు.అందరి సమక్షంలో ఆయన సమాధి అయిపోయాడు.' అన్నాడు.

'ఆయన ఏ విధంగా శరీర త్యాగం చేశినాడు?' అడిగాను.

'వాళ్ళు మనలాగా చనిపోరు సార్.ఊరకే హంసను వదిలేస్తారు.అంతే.' అన్నాడు.

'ఓహో అలాగా' అని తల పంకించాను.

'ఆ తర్వాత చాలా బాధపడ్డాను సార్.నాయన రమ్మని చెప్పినా నేను పోలేకపోయానే అని.తర్వాత ఒకసారి జ్యోతికి వెళ్ళినాను.అక్కడ గుడిదగ్గర ఉన్నప్పుడు కాశినాయన స్వరం స్పష్టంగా విన్నాను.

'ఏం నాయనా ఇప్పుడు వచ్చినావా?సరేలే.లోపలి రా' అంటూ ఆయన పిలవడం స్పష్టంగా ఈ చెవులతో విన్నాను సార్..ముందుగా నా భ్రమ ఏమో అనుకున్నాను.ఆయన గొంతు నాకు బాగా పరిచయమే గదా సార్.ముప్పై ఏళ్ళ నుంచీ వినిన గొంతేగా.అదే గొంతు.తర్వాత పూజారి మళ్ళీ పిలిచాడు.ఆ స్వరం వేరే.అప్పుడు లోనికి వెళ్లి పూజారితో ఇదే మాట చెప్పినాను.

'నువ్వు పిలవడానికి ముందు వేరు ఎవరో రమ్మని పిలిచినారు.అది నాయన గొంతు లాగా ఉన్నది.'

'ఇలాంటివి ఇక్కడ మామూలే'- అన్నాడు పూజారి.

నిజమైన మహనీయులు శరీరానికి అతీతంగా పనిచెయ్యగలరు.వారికి శరీరం పెద్ద సమస్య కానేకాదు.మామూలు మనుషులకు అడ్డుపడే దేశకాలాలు వారిని ఏమీ చెయ్యలేవు.

ఒకసారి తన వద్దకు వచ్చిన ఒక భక్తురాలితో జిల్లెళ్ళమూడి అమ్మ ఇలా అన్నారు.'మీ ఇంట్లో మామిడిచెట్టు కింద భలే చల్లగా హాయిగా ఉంటుందే.'

ఆమెకు ఏమీ అర్ధం కాలేదు.అమ్మ కూడా దానిగురించి అంతకంటే ఏమీ వివరించలేదు.

తర్వాత వాళ్ళఇంటికి వెళ్లి చూస్తె,అక్కడ మామిడిచెట్టు నీడ పడేచోట అమ్మ ఫోటో ఒకటి కనిపించింది.ఇది వింటూ ఉంటె ఆ సంఘటన నాకు గుర్తొచ్చింది.

'ఇంకా చెప్పండి' అడిగాను.

శ్రీరామ్మూర్తి  గొంతు సవరించుకున్నాడు.

(ఇంకా ఉంది)