11, మార్చి 2012, ఆదివారం

కుజప్రభావానికి రుజువు - అన్నీ ముందే తెలిసే స్తితి.

పౌర్ణమి తర్వాత ఈరోజు సరిగ్గా మూడోరోజు. నిన్న హైదరాబాద్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. 400 పైగా గుడిసెలు కాలిపోయాయి. షార్ట్ సర్క్యూట్ అని కొందరూ, కుట్ర అని కొందరూ అంటున్నారు.ఏదిఏమైనా అగ్నిప్రమాదం మాత్రం జరిగింది.

ఇదిలా ఉండగా హైదరాబాద్ నుంచి నా మిత్రుడొకరు ఫోన్ చేసాడు. 

'కంగ్రాట్స్' అన్నాడు. 

'ఎందుకు' అడిగాను.

'నీవు చెప్పిన ప్రిడిక్షన్ మళ్ళీ నిజమైంది. పౌర్ణమికి అటూఇటూగా ప్రమాదాలున్నాయనీ కుజునివల్ల  అగ్నిప్రమాదాలు జరుగవచ్చనీ చెప్పావు. అలాగే ఈ రోజు భారీ అగ్నిప్రమాదం జరిగింది. అందుకే కంగ్రాట్స్' అన్నాడు.

'నాకేమీ సంతోషం లేదు. అన్ని కుటుంబాలు రోడ్డునపడిన స్తితి తలచుకొని బాధగా ఉంది.' అన్నాను.

'కానీ నీలో ఒక్కటే లోపం. హైదరాబాదులోనే,అదికూడా ఈరోజే ప్రమాదం జరుగుతుంది అని మాత్రం నీవు చెప్పలేకపోయావు' అన్నాడు.

'ఇంకా నయం. నాగోల్ లో 13 నంబర్ వార్డులో 12 /24 /3 -5 -2 నంబరు గుడిసెలో ప్రమాదం జరుగుతుందనీ అదికూడా సరిగ్గా ఉదయం 7.11నిముషాలకు గుడిసె అంటుకుంటుందనీ  చెప్పలేదని నీకు బాధగా ఉందా?' అడిగాను.

'అదికాదు. అలా చెప్పినప్పుడే కదా జ్యోతిష్యానికి విలువ?' సందేహం వ్యక్తం చేసాడు.

'ఒకవేళ అలా చెప్తే ఏం చేసేవాడివి?' అడిగాను.

'ప్రెస్ ని పిలిచి అందరినీ ఎలర్ట్ చేసి ఆ ఘోరం జరుగకుండా ఆపేవాణ్ని' అన్నాడు.

'నువ్వాపని చేస్తావనే ఆ అడ్రసు మనకు ముందుగా తెలియనివ్వదు ప్రకృతి' - చెప్పాను.

'అంటే ఇలా జరగాలని ఉంది కాబట్టి జరిగింది అంటావా? అన్నాడు.

'కావచ్చు' అన్నాను.

'మరి ముందే తెలుసుకొని ఉపయోగం ఏముంది?' అన్నాడు.

'ఉపయోగం ఉండేవాళ్లకు ఉంటుంది. అందరికీ ఉండదు.' చెప్పాను.

'అదేంటి? అర్ధం కాలేదు' అడిగాడు.

'అన్నీ ముందే తెలిసినా బయటపడేవాడు మాత్రమే బయటపడతాడు. అందరూ తప్పించుకోలేరు. నాడీజ్యోతిష్యం పేరు విన్నావుగా. అందులో అందరి జాతకాలూ ఉంటాయని చెప్తారు. కానీ అక్కడ కూడా అందరివీ తాటాకుపత్రాలు ఉండవు. నీవు అక్కడకు వెళ్లి అడుగుతావని రాసిపెట్టి ఉంటేనే అక్కడ నీ తాళపత్రం ఉంటుంది. అలాగే, నీకు బయటపడే యోగం ఉన్నపుడే నీకు ముందుగా తెలుస్తుంది.లేదా ఏదో విధంగా సాయం అందుతుంది.లేకుంటే లేదు.ప్రపంచంలో అందరూ జాతకాలు చూపించుకోలేరు.చూపించుకున్న వారిలో కూడా అందరికీ రేమేడీలు దొరకవు, దొరికినవారిలో కూడా అందరూ చెయ్యలేరు. చేసినవారికి కూడా అందరికీ ఫలితాలు దక్కవు. ' చెప్పాను.

'ఏంటి ఇదంతా? గందరగోళంగా ఉందే?' అన్నాడు. 

'అంతే అలాగే ఉంటుంది. భగవద్గీతలో 'మనుష్యాణాం సహస్రేషు' శ్లోకం తెలుసుగా. ఇదీ అంతే అనుకో.' అన్నాను.

'ఏదైనా కానీ. నువ్వు ఖచ్చితంగా ఫలానా రోజున ఫలానా డోర్ నెంబరున్న  ఇంట్లో ఫలానావ్యక్తికి ఫలానాగండం ఉంది. ఇన్ని గంటలా ఇన్ని నిముషాలకు జరుగుతుంది అని చెప్పినరోజున మాత్రమె నేను నీ జ్యోతిష్యం నమ్ముతాను. లేకుంటే నమ్మను.' నన్ను ఇంకొంచం ప్రోత్సహించడానికా అన్నట్లు చెప్పాడు.

'నువ్వు నమ్మడం నమ్మకపోవడం నీ ఇష్టం. దానివల్ల నాకు ఉపయోగం ఏమీ లేదు. నువ్వు నమ్మితే నాకొచ్చే లాభమూ లేదు. నమ్మకపోతే   నష్టమూ లేదు. ఒక రహస్యం చెప్తా విను. అలాటిస్తితి వచ్చినరోజున ఇంక నేనుమాట్లాడేది ఏమీ ఉండదు. అప్పుడసలు ఎవరికీ ఏమీ చెప్పను. అప్పుడు ఈ బ్లాగూ ఉండదు. నేను నీతో చెప్పేది కూడా ఏమీ ఉండదు. నన్నుగానీ మన శాస్త్రాలను గానీ విమర్శించినా తిట్టినాకొట్టినా కూడా ఊరకే అలా నవ్వుతూ చూస్తూ ఉంటాను. అంతే.' అన్నాను.

'ఎందుకలా?' అడిగాడు.

'అదంతే. ఇది ప్రకృతిలో ఒక వింత. అన్నీ నీకు తెలిసిన రోజున నీవు మాట్లాడేది ఏమీ ఉండదు. కొంతవరకూ  తెలుసుగనుకే మాట్లాడుతున్నావు. అన్నీ తెలిస్తే మాట్లాడవు. 'కుండ మొత్తం నిండితే శబ్దం చెయ్యదు. నిండుతూ ఉన్నప్పుడే గుడగుడమని శబ్దం చేస్తుంది' అన్న శ్రీరామకృష్ణుని మాట తెలుసుగా. అలాగే, అన్నీ తెలిసిననాడు ఇక చెప్పేది ఉండదు. వినేదీ ఉండదు. అప్పుడు అన్నీ తెలుస్తాయి. కానీ దేనినీ అడ్డుకోవడమూ ఉండదు. తప్పించడమూ ఉండదు. ముందే చెప్పడం అసలే ఉండదు. అప్పుడు నీవు నాతో మాట్లాడతావు. కాని నేను నీతో మాట్లాడేది ఏమీ ఉండదు.' అన్నాను..

'మరి అంతా దేవుడి ఇష్ట ప్రకారం జరిగితే జ్యోతిష్యం ఎందుకు?' అడిగాడు.

'అంతా విధిప్రకారమే జరుగుతుంది అని అనుకుంటూ  మనిషి ఊరుకోలేడు కాబట్టి. అలా ఊరుకోగలిగితే జ్యోతిష్యం అవసరం లేదు' చెప్పాను.

' ఏమిటో నువ్వు చెప్పేది నాకు సరిగ్గా అర్ధం కావడం లేదు' అన్నాడు.

'అర్ధం కాకపోవడమే మంచిదిలే. అర్ధం చేసుకుందామని ప్రయత్నించిన దగ్గరనుంచీ అన్నీబాధలే. రేపటి గురించి చీకూచింతా ఆలోచనా లేనివాడే ఈ ప్రపంచంలో సుఖి. చేతనైతే నువ్వూ అలా ఉండటానికి ప్రయత్నించు' అని ముగించాను.
read more " కుజప్రభావానికి రుజువు - అన్నీ ముందే తెలిసే స్తితి. "

10, మార్చి 2012, శనివారం

హన్నేమాన్ ది గ్రేట్ - సత్యం ఎప్పటికీ సత్యమే

కోపెన్హాగెన్ విశ్వవిద్యాలయంలో జరిపిన పరిశోధనలలో ఒక విషయం వెల్లడైందిట. అదేమంటే కీళ్ళవాతం(రుమటాయిడ్ ఆర్ధరైటిస్)ఉన్నవారికి గుండె దెబ్బతినే అవకాశం మిగతా వారికంటే 40% ఎక్కువ. అలాగే వారికి పక్షవాతం వచ్చే అవకాశమూ ఎక్కువేట. పోనీలే ఇన్నాళ్ళకైనా ఈవిషయం వారు గ్రహించగలిగారు. సంతోషం కలిగింది.

ఈ విషయాన్నిహోమియో వైద్యసృష్టికర్త శామ్యూల్ హన్నేమాన్ రెండువందల ఏళ్ల క్రితమే స్పష్టంగా చెప్పాడు. ఆయన వ్రాసిన "క్రానిక్ డిసీజెస్" అన్న పుస్తకంలో ఈ విషయం స్పష్టంగా వివరించాడు. సైకోసిస్ అనే మయాజం రక్తంలో ఉంటె దానివల్ల కీళ్ళనొప్పులు వస్తాయనీ దాని అణచివేత వల్ల గుండెదెబ్బ తింటుందనీ, గుండెకు వచ్చే దాదాపు అన్ని వ్యాదులకూ మయాజమ్స్ కారణమనీ ఆయన చాలా క్లియర్ గా తన పరిశోధనల ఫలితంగా తేల్చి చెప్పాడు. అంతేకాదు కీళ్ళనొప్పులూ గుండెజబ్బూ కూడా ప్రత్యెక వ్యాధులు కావనీ నూటికి తొంభైతొమ్మిది శాతం ' సోరా' 'సైకోసిస్' అనబడే మయాజంల వలన వచ్చే సెకండరీ మరియు టెర్షియరీ ఫలితాలనీ, అవి రెండూ ఒకేవ్యాధి యొక్క భిన్నరూపాలనీ ఎప్పుడో రెండు శతాబ్దాల క్రితమే వివరించాడు. కాని ఆయనమాట ఎవరూ పట్టించుకోలేదు.

హోమియో వైద్యవిధానంలో ఒక గుండెజబ్బును ట్రీట్ చేస్తే అది తగ్గి ఆరోగికి కీళ్ళనొప్పులు బయటపడిన కేసులూ, ట్రీట్మెంట్ కంటిన్యూ చేయగా అవీ తగ్గి చర్మరోగాలూ, ఎప్పుడో అణచివేయబడిన గనోరియా బయటపడిన కేసులూ ఆ తర్వాత అవీ క్రమంగా తగ్గిన కేసులూ ఎన్నో ఉన్నాయి. హోమియో విధానంలో ఇది చాలా చక్కని శాస్త్రీయ అవగాహన. కానీ, చాలామంది వీటిని నమ్మరు. అనుభవించే ఖర్మ ఉన్నప్పుడు నమ్మకం కలగదు. ఎవరికీ ఎంత ఏ రకంగా వదలాలో అంత వదిలి అల్లోపతీ వైద్యుల చేతిలో నానాబాధలూ పడితేగాని కర్మతీరదు మరి.

రెండువందల ఏళ్ల క్రితమే హన్నేమాన్ చెప్పిన సిద్ధాంతాలు నేడు పరిశోదనకు నిలబడి, అవి అక్షరసత్యాలే అని కనీసం నేడైనా మెడికల్ సైన్స్ నమ్మాల్సి రావడం ముదావహం. అలాగే జ్యోతిష్యం కూడా సైన్సా కాదా అని వాదించుకునే రచ్చబండ బైతన్నలు వారే అందులో పరిశోధన చేసి అది సైన్సో కాదో నిరూపించేపనికి తామే ముందుకు వస్తే బాగుంటుందేమో. ఆ పనికి మాత్రం ఎవరూ ముందుకు రారు.అలా చెయ్యాలంటే ఎంతో అధ్యయనం చెయ్యాలి. కొన్ని వేలజాతకాలను శోధించాలి. అనేక సూత్రాలను అనేక జాతకాల మీద నిగ్గుతేల్చి చూడాలి. సిద్ధాంతబాగంలోనూ ఫలితభాగంలోనూ ఉన్న ప్రాధమికసిద్ధాంతాలనుంచి మొదలుపెట్టి అర్ధం చేసుకుంటూ పరిశీలిస్తూ రావాలి. దానికి ఎంతో కష్టపడాలి. బోలెడంత సమయమూ ధనమూ వెచ్చించాలి.ఇదంతా చేస్తే మిగిలేది ఆత్మసంతృప్తి తప్ప డాలర్లేమీ రాలవాయె. అదంతా చేసే ఓపిక ఎవరికుందీ? దానిబదులు ఏదో మన నోటికి వచ్చింది నాలుగుకామెంట్లు రాసేసి/చేసేసి, ఒకవేళ అలా ఎవరైనా రీసెర్చి చేస్తుంటే వాళ్ళమీద నాలుగు రాళ్ళేసి,మన అజ్ఞానం బయటపెట్టుకునే చాన్స్ ఉన్నపుడు ఇంత కష్టపడి ఏళ్లకేళ్ళు రీసెర్చి చేసి మాట్లాడే ఓపిక ఎవరికుంది గనుక? చిన్న ఉదాహరణ. రాహుకేతువులు అసలు భౌతికంగా లేవుకదా వాటిని గ్రహాలని చెప్పే జ్యోతిష్యం అసలు ఒక విజ్ఞానమా? అని మొన్న ఎవరో వాదిస్తున్నారు.  

జీవవిజ్ఞానం, ప్రాణవిజ్ఞానం లేనివాళ్ళు నేడు డాక్టర్లు! కనీసం గ్రహం అనే పదానికి అర్ధం తెలియనివాళ్ళు జ్యోతిష్యంమీద బ్లాగుల్లోనూ టీవీలలోనూ చర్చించి అమీతుమీ కంక్లూజన్స్ ఇచ్చేవాళ్ళు!! చూస్తుంటే, ప్రపంచంలో అసలైన సత్యాలు ఎప్పటికీ మైనారిటీలుగానే ఉండాలేమో,అవి అందరికీ తెలియకూడదేమో,సృష్టిధర్మం ఇదేనేమో  అనిపిస్తోంది. అజ్ఞానమా వర్ధిల్లు !!!
read more " హన్నేమాన్ ది గ్రేట్ - సత్యం ఎప్పటికీ సత్యమే "

6, మార్చి 2012, మంగళవారం

మళ్ళీమళ్ళీ నిజమౌతున్న జ్యోతిష్యజ్ఞానం

భూమికి దగ్గరగా వచ్చిన కుజప్రభావం వల్ల నిన్నా ఈరోజూ జరిగిన సంఘటనలు చూద్దాం.  

>> నిన్న కుజప్రభావం మీద పోస్ట్ వ్రాసిన కొంతసేపటికే 4.9 స్థాయిలో డిల్లీలో భూకంపం వచ్చింది. ఎవరూ పోలేదు కాని బిల్డింగులు ఊగినట్లు అయ్యి జనాలు భయభ్రాంతులయ్యారు. రోడ్లమీదకి పరిగెత్తి వచ్చారు.

>> నిన్న అర్జెంటీనా లో 6.1 స్థాయిలో భూకంపం వచ్చింది. 

>> నిన్న యెమెన్లో ఆర్మీ బలగాలకూ ఆల్ ఖైదా కూ జరిగిన యుద్ధంలో 100 కంటే ఎక్కువ మంది చనిపోయారు.

>> ఈ రోజు ఫిలిప్పైన్స్ లో భూకంపం వచ్చింది. దాదాపు 50 మంది హరీ మన్నారు.

ఇవన్నీ ఈరెండు రోజులలో జరిగిన సంఘటనలు.ఇవిగాక చెదురుమదురుగా అక్కడక్కడా జరిగిన అగ్నిప్రమాదాలూ, రోడ్డు ప్రమాదాలూ లెక్క లేదు.

ఇలాంటి ఘోరాలు ఈ పౌర్ణమి దగ్గరలో జరుగబోతున్నాయని నేను జనవరి 28 తేదీన వ్రాసిన "కుజుని వక్రత్వ ఫలితాలు మొదలు" అన్న పోస్ట్ లో హెచ్చరించాను. ఒక్కసారి ఆ పోస్ట్ లోని జోస్యాలను గత నాలుగు రోజులుగా జరుగుతున్న సంఘటనలతో పోల్చుకుని చదువుకుంటే జ్యోతిష్య విజ్ఞానం అనేది ఎంతటి మహత్తరమైనదో అర్ధం అవుతుంది. పౌర్ణమికి రెండు మూడు రోజులు అటూ ఇటూ గా ఈ సంఘటనలు జరుగుతాయి అని కూడా వ్రాశాను. రేపు 8 వ తేదీ పౌర్ణమి. నాలుగో తేదీనుంచే ప్రపంచ వ్యాప్తంగా ఈ దుర్ఘటనలు జరగటం చూడవచ్చు. ఈ సంఘటనలు ప్రతిరోజూ జరిగే చిన్నచిన్న సంఘటనలు కావు. కళ్ళు తెరిచి చూస్తె వీటికీ గ్రహాల స్తితులకూ మధ్య ఉన్న సంబంధం తెలుస్తుంది.

మన ప్రాచీనఋషులు ఇటువంటి మహత్తరవిజ్ఞానాన్ని ఎన్నోవేల ఏళ్ళ క్రితమే కనుక్కుని గ్రంధస్తం చేసి మనకోసం అందించినా ఈ  నాటికీ మనం మన సంస్కృతి గొప్పదనాన్ని తెలుసుకోలేక వీటిని మూఢనమ్మకాలుగా భావించడం మన తెలివితక్కువతనానికి నిదర్శనం కాక మరేమనాలో మీరే చెప్పండి.
read more " మళ్ళీమళ్ళీ నిజమౌతున్న జ్యోతిష్యజ్ఞానం "

5, మార్చి 2012, సోమవారం

భూమికి దగ్గరైన కుజుడు -- అగ్నిప్రమాదాలు

మొన్న మూడోతేదీనుంచి ఈ రోజువరకూ కుజుడు భూమికి బాగా దగ్గరకి వచ్చాడు. ఈ రోజు వీరిద్దరి మధ్య దూరం 100 మిలియన్ కిమీ ఉంది. లెక్కల ప్రకారం వీరి మధ్యన అతి తక్కువ దూరం 55 మిలియన్ కి.మీ గానూ అతి ఎక్కువ దూరం 400 మిలియన్ కి.మీ గానూ ఉంటుంది. కనుక ప్రస్తుతం కుజుడు భూమికి బాగా దగ్గరగా ఉన్నట్లే లెక్క. అందుకే కుజుని తేజస్సు బాగా కనిపిస్తూ సింహరాశిలో ఈగ్రహం కంటికి చక్కగా దర్శనం ఇస్తోంది. మరి అగ్నితత్వ గ్రహమైన కుజుడు భూమికి దగ్గరగా వస్తే ఏమి జరుగుతుంది? కుజుని కారకత్వాలు మనకు తెలుసు. అగ్ని ప్రమాదాలు, గొడవలు, యుద్ద వాతావరణం, ప్రకృతివిలయాలు, సామూహిక జననష్టాలు ఈయన కారకత్వాలలోనివి అని జ్యోతిష్యగ్రంధాలు చెబుతున్నాయి. గత రెండు రోజులుగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు గమనిస్తే ఇవి నిజమే అని అర్ధం అవుతుంది.

>>4 వ తేదీ ఆదివారంనాడు రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఆయుధడిపో పేలిపోయి దాదాపు 200 మంది మాడి మసైపోయారు. ఇంకొక 2000 మంది ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ఇల్లూ వాకిళ్ళూ వదలి పారిపోయారు. 

>>3 వ తేదీ శనివారం నాడు పోలాండ్ లో రెండు రైళ్ళ హెడ్ ఆన్ కొలిజన్ లో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. 

>>ఇదే శనివారంనాడు సెంట్రల్ అమెరికాలో తుఫానులు భీభత్సం సృష్టించాయి. దాదాపు 13 తుఫానులు శుక్రవారం నుంచి శనివారం లోపు విలయతాండవం చేసాయి. ఇండియానా రాష్ట్రంలోని మేరీస్ విల్లి అనే ఊరు ఊరే లేకుండా మాయమై పోయింది అని న్యూస్ చెబుతోంది.

>>2 వ తేదీ శుక్రవారం పాకిస్తాన్ లో జరిగిన దాడులలో కనీసం 100 మంది చనిపోయారు. 

>>4 తేదీ ఆదివారం నాడు చైనా తన మిలిటరీ బడ్జెట్ ను 100 బిలియన్లు గా ప్రకటించింది. ఈ ప్రకటనవల్ల అనేక ప్రపంచదేశాల గుండెల్లో గుబులు మొదలైంది. యుద్దానికి, మిలటరీకి సంబంధించిన విషయాలు కుజుని ఆధీనంలో ఉంటాయని మనకు తెలుసు. 

>> ఇరాన్ తో మిగతా దేశాల వైరం ఊపందుకుంటున్నది. రాబోతున్న అమెరికా ఎన్నికల దృష్ట్యా మరొక "బూచిని" ఇరాన్ రూపంలో అమెరికా ప్రజలకు చూపించి ఓటర్లను మాయ చేసే ప్రయత్నం జరుగుతున్నది.  ఇది ముందుముందు యుద్ధానికి దారి తీసే సూచనలున్నాయి.

గ్రహప్రభావం భూమిమీద తప్పకుండా ఉంటుంది. మనిషి జీవితంమీద కూడా ఖచ్చితంగా ఉంటుంది. కాకుంటే ఎక్కడ ఎలా ఆ ప్రభావాలుంటాయో తెలుసుకోగలిగితే కొంత ఉపయోగం ఉంటుంది. సామూహిక జన హననం ఆపడం ఎవరివల్లా కాదు. ఎందుకంటే సామూహికకర్మను ఆపే శక్తి ఎవరికీ ఉండదు. ఆపగల శక్తి ఉన్నటువంటి శ్రీకృష్ణునివంటి అవతారపురుషులే చూస్తూ ఊరుకున్నారు.కాని వ్యక్తి జాతకంలో ఇలాంటి దుస్సంఘటనలు జరిగే పరిస్తితులు ఉన్నపుడు వాటిని తగిన రెమెడీస్ ద్వారా నివారించుకోవచ్చు. అంతవరకు జ్యోతిశ్శాస్త్రం వీలు కల్పిస్తుంది. ప్రపంచానికి మనం గొడుగు పట్టలేం. కాని మనవరకు మనం గొడుగు వేసుకుని ఎండనుంచి రక్షణ పొందవచ్చు.

రేపు 8 వ తేదీన పౌర్ణమి రాబోతున్నది. ఈ లోపల మరిన్ని సంఘటనలకు రెడీగా ఉందాం. వ్యక్తిగత జీవితాలలో కూడా ఈ మధ్యలో ఏక్సిడేంట్లు జరగడం , దెబ్బలు తగలడం, అనారోగ్యాలు ఎక్కువ కావడం, అనవసర ఉద్రేకాలు పెరగడం, ఇతరులతో గొడవలు,  వస్తువులు రిపేర్లు రావడం గమనించవచ్చు.
read more " భూమికి దగ్గరైన కుజుడు -- అగ్నిప్రమాదాలు "

1, మార్చి 2012, గురువారం

నవీనకాలపు భయంకరపాపం

మానవుడు సైన్సుపరంగా ఎంతో ఎదిగానని విర్రవీగుతూ కన్నూమిన్నూగానక చేస్తున్న ఎన్నోతప్పులు నవీనకాలంలో ఉన్నాయి. విచ్చలవిడిగా సాగుతున్న అబార్షన్లు వాటిలో ఒకటి.

భ్రూణహత్యను మహాపాపాలలో ఒకటిగా ధర్మశాస్త్రాలన్నీ పరిగణించాయి. అవన్నీ పనీపాటాలేని వాళ్ళు వ్రాసిన పుస్తకాలు అని ఎగతాళి చేస్తూ ఇష్టానుసారం పిచ్చి పనులు చేసేవారు అనుభవిస్తున్న ఖర్మలు దారుణంగా ఉంటున్నాయి. తల్లిగర్భం అనేది ఒక ప్రాణికి జీవంపోసి తొమ్మిదినెలలు పోషించవలసిన అమృతస్థానం. జీవం పోసుకుంటున్న అమాయకప్రాణికి అది బలిపీఠంగా మారిందంటే దాని ఫలితాలు భయంకరంగా ఉంటాయి. ప్రకృతిలో ఏది ఏపని చెయ్యాలో అది ఆపని చేసినప్పుడే అక్కడ వ్యవస్థ సక్రమంగా ఉన్నట్లు లెక్క. అంతేగాని పెంచి పోషించవలసిన చోట శ్మశానం చోటుచేసుకుంటే ప్రకృతి కన్నెర్ర చేస్తుంది. ఆ వ్యక్తి జీవితం అక్కణ్ణించి గతి తప్పుతుంది. సూక్ష్మంగా గమనిస్తే ఈ విషయం తెలుస్తుంది.

ఒక గురువుకు శిష్యుణ్ణి అని చెప్పుకునే ఒక ఆధ్యాత్మికనయవంచకుడు నాకు తెలుసు. అతను కొన్నేళ్ళక్రితం బాగానే ఉండేవాడు. లోలోపల దుష్ట సంస్కారాలు ఉన్నాయని నాకు తెలుసు. కాని పైకి కొంత బాగానే ఉండేవాడు. బాగానే నటించేవాడు. అతనికి ఒకగురువు దగ్గర దీక్ష ఇప్పించడంలో ఇరవైఏళ్లక్రితం నేనుకూడా కొంతపాత్ర పోషించాను. తరువాత తరువాత అనవసరంగా నాతో శత్రుత్వం తెచ్చుకుని మాట్లాడటం మానేశాడు. సరే, ఎవరి ఖర్మకెవరు బాధ్యులు అని నేనూ అతనికి దూరంగానే ఉన్నాను. కొన్నేళ్ళ తర్వాత ఈమధ్యనే యదాలాపంగా అతన్ని కలవడం జరిగింది. అతని ముఖంలో, ఒక కిరాతకుని ముఖంలో ఉండే క్రౌర్యం కనిపించింది. ఇరవై ఏళ్ల సాధన తర్వాత ఒక మనిషిలో రావలసిన పవిత్రతా పరిపక్వతా రాకపోగా అతనిముఖం ఒక రాక్షసునిముఖంలాగా, కసాయివాడిముఖంలాగా  కనిపించింది. అతని తేజోవలయం (ఆరా) పరమచండాలంగా, రిపల్సివ్ గా ఉంది. అతనికి షేక్ హాండ్ ఇస్తే నాచెయ్యి మంటలు పుట్టింది. కారణాలు విచారించగా, భార్య వద్దని మొత్తుకుంటున్నా వినకుండా అయ్యగారు వరుసగా ఆమెకు మూడుఅబార్షన్లు చేయించాడని తెలిసింది. ఆడపిల్ల గర్భంలో ఉండడమే దానికి కారణమట. ఇలాటి వెధవలు ఆధ్యాత్మికత గురించి లెక్చర్లు ఇస్తే నాకు ఎంత కోపం వస్తుందంటే, అలాటివాళ్ళను భీముడు జరాసంధుణ్ణి చీల్చినట్లు, ఏముక్కకు ఆముక్క చీల్చి పారేద్దామనిపిస్తుంది. నాకు పరమచీదర పుట్టి అతనితో మాట్లాడటం, అతని ముఖం చూడటంకూడా మానేశాను.

నవీనకాలంలో పెరుగుతున్న ఇంకొన్ని పోకడలున్నాయి. పెళ్లి చేసుకున్న వెంటనే పిల్లలు వద్దట. కొన్నేళ్ళు ఎంజాయ్ చేసి అప్పుడు పిల్లల్ని కంటారట. అందుకే కుక్కపిల్లలూ కోతిపిల్లలూ పుడుతున్నాయి.పెద్దయ్యాక పశువులశాలకు పశువుల్ని తోలినట్లు, తల్లిదండ్రుల్ని అనాదాశ్రమాలకు తోలే పిల్లలు అందుకే పుట్టుకొస్తున్నారు. దంపతులకు ఎంజాయ్మెంట్  ప్రధానం అట, సంతానం కాదుట. కనుకనే అలాంటివారికి పుట్టే పిల్లలుకూడా వారు పెద్దయిన తర్వాత 'మా ఎంజాయ్మెంట్ మాకు ముఖ్యం. మీరు మాకు అడ్డం' అంటూ తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలకు తోలుతున్నారు. పిల్లలను కనడం ఒక కళ. అది ఒక యోగం అని చెప్పవచ్చు. ప్రాచీనులకు ఆ కళ తెలుసు. ముఖ్యంగా ప్రాచీన ఋషులు ఈ విద్యలో ఉద్దండులు. వారి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందిపుచ్చుకోగల సంతానాన్ని ఎలా కనాలో వారికి తెలిసి ఉండేది. దీనికి ఉత్తకోరిక ఉంటే చాలదు. దానికోసం మన జీవనవిధానం మార్చుకోవాలి. మన ఇష్టానుసారం మనం జీవిస్తూ మన సంతానంమాత్రం ఉత్తములుగా ఉండాలంటే అది సాధ్యంకాదు.మన పిల్లలు ఏవిధంగా ఉండాలని మనము అనుకుంటామో ఆవిధంగా పెళ్లి కాకముందు కొన్నేళ్ళపాటు మనం ఉంటే అప్పుడు ఆ జీన్స్ లోనుంచి అలాంటి పిల్లలే మనకు పుడతారు.  లేకుంటే లేదు.

పశువులుకూడా పిల్లలను కంటాయి అది గొప్పవిషయం కాదు. కాని పశువుకు పశువే పుడుతుంది. ఒక దేవతను బిడ్డగా పొందగలిగే అదృష్టం మాత్రం మనిషికే ఉంది. అలాంటి సంతానం పొందాలంటే దానికి మనిషి చిన్నప్పటినుంచే తయారు కావాలి. మన శారీరిక మానసిక పవిత్రతను ఆధ్యాత్మికబలాన్నీ బట్టే మన సంతానానికి ఉత్తమసంస్కారాలు ఏర్పడతాయి. చాలామంది తల్లిదండ్రులు 'మా పిల్లలు మా మాట వినడం లేదు' అని బాధపడటం నేను చూచాను. 'దానికి కారణం మీరే' - అని వారికి చెప్తాను.జంతువులలా సంతానాన్ని కంటే జంతువులే పుడతారు. దేవతలవంటి సంతానం కావాలంటే మనం దేవతలవలె ఉండాలి. దానికి ప్రత్యేకమైన ట్రైనింగ్ ఉంది. వివాహానికి ఎంతో ముందు నుంచే ఇద్దరూ ఆ శిక్షణలో ఉండాలి. ఆ మార్గంలో ఇద్దరూ తమ మనస్సులనూ శరీరాలనూ తయారు చేసుకోవాలి.అప్పుడే వారికి రుషితుల్యమైన సంతానం కలుగుతుంది. అది నేటి తల్లిదండ్రులకే తెలియదు ఇక తమ పిల్లలకు ఏమి నేర్పించగలరు? సంగమసమయంలో దంపతుల శారీరికపవిత్రతనుబట్టి, మానసికసంస్కారాలను బట్టి పుట్టబోయే జీవి ఉంటుంది. అటువంటి ఉత్తమ పరిస్తితులు అప్పటికప్పుడు స్నానం చేస్తే వచ్చేవి కావు. వాటికోసం ఎన్నో ఏళ్లుగా తపస్సు చెయ్యాలి. అటువంటివారికే ఉత్తమసంతానం కలుగుతుంది.

పెళ్ళయ్యాక అయిదారేళ్ళు ఎంజాయ్ చేసి పిచ్చిపిచ్చి మందులు వాడిన జంటలు తర్వాత సంతానం కలగక ఎందఱో డాక్టర్లచుట్టూ సంతానం కోసం ప్రదక్షిణాలు చేసినవిషయం నాకు తెలుసు.మా బంధువులలోనే అలాటివాళ్ళు చాలామంది ఉన్నారు. పునరుత్పత్తి వ్యవస్థ అనేది మొగవాడిలోనైనా ఆడదానిలోనైనా అతి సున్నితమైన వ్యవస్థ. తిక్కతిక్క పనులతో దానిని అస్తవ్యస్తం చేసుకుంటున్న నేటి నవీనులకు జంతుసమానులైన వాళ్ళు  సంతానంగా పుట్టటంలో వింత ఏముంటుంది? రకరకాల దురభ్యాసాలతో వీర్యనష్టానికి లోనైన యువకుని వీర్యంలో పటుత్వం ఉండదు. దానినుంచి ఉత్తమ సంతానం రాదు. అలాగే రకరకాల మందులు వాడి నెలసరి వ్యవస్థను అతలాకుతలం చేసుకుని తిక్క పనులు చేసే యువతికి కూడా సత్సంతానం కలగడం కల్ల. ఇక వీరిద్దరి కలయికతో ఎటువంటి సంతానం వస్తుందో ఊహించడానికి దివ్యదృష్టి అక్కర్లేదు, కామన్ సెన్స్ చాలు. ఇలాటివాళ్ళను ప్రోత్సహిస్తూ చెత్తవాగుడు పత్రికల్లో వాగుతూ సమాజపు డబ్బును దోచుకునే నేటి డాక్టర్లు పచ్చిదొంగలు అంటే ఎంత మాత్రం తప్పు లేదు.

మిత్రులు జయదేవ్ గారు ఇంకొక విషయం చెప్పారు. గర్భసంచి అనేదానికి కూడా మెమరీ ఉంటుందని నేటి రీసెర్చి రుజువు చేస్తున్నది. మన శరీరంలో ప్రతి కణానికీ మెమరీ ఉంటుంది అన్నది నిజమే. ఒకసారి గర్భస్రావం జరిగినప్పుడు గర్భసంచి భయంతో వణికిపోయి కుంచించుకుపోతుంది. ఆ భయం దాని సెల్స్ లో రికార్డ్ అయి ఉంటుంది. కనుక రెండవసారి అసలు గర్భధారణనే  జరుగనివ్వదు. కనుకనే రెండుమూడుసార్లు ఎబార్షన్ చేయించుకున్న వారికి ఆ తరువాత ప్రయత్నించినా గర్భం నిలబడదు. దానికోసం మళ్ళీ మందులు వాడి నరకం అనుభవించవలసి వస్తుంది. అయినా గ్యారంటీ ఉండదు. ఇదంతా గర్భసంచి కణాల మెమరీ లో ప్రింట్ అయిపోయిన భయంవల్లే జరుగుతుంది. డాక్టర్లకు ఈవిషయం తెలీదో లేక తెలిసీ ధనాశతో మనకెందుకులే పాడైపొయ్యేది పేషంటేకదా అని వీళ్ళకు చెప్పరో అర్ధం కాదు. మనిషి మాత్రం తన అహంకారంతో అన్నీ తెలుసనీ విర్రవీగుతూ పిచ్చిపనులతో నాశనం అవుతూ ఉంటాడు.

చిన్ననాటినుంచి ఉత్తమభావాలతో నిండిన ఇంటి వాతావరణంలో పెరిగి, సాత్విక ఆహారం తీసుకుంటూ, బ్రహ్మచర్యం పాటిస్తూ ఉన్న యువతీ యువకులకు కలిగే సంతానం ఎంతో ఉత్తమగుణాలతో నిండి ఉంటుంది. అలా పుట్టిన సంతానానికి మంచీచెడులను ఒకరు నేర్పవలసిన అవసరం ఉండదు.ధర్మంగా జీవించాలని కూడా వారికి ఒకరు చెప్పవలసిన పని లేదు. చిన్నప్పటినుంచీ సక్రమమైనమార్గంలో వారే ఉంటారు. పైగా, పెద్దవారి తప్పులను కూడా సరిదిద్దగలరు.దానికి పూర్తీ వ్యతిరేకంగా, చిన్నప్పటినుంచీ సినిమాలు, టీవీలో హింసా సెక్సూ దృశ్యాలు, తినే తిండిలో మషాలాలు, మాంసాలు,చిన్నప్పటినుంచే తాగుడు,తిరుగుడు,పోకిరీవేషాలు, అసభ్యసంభాషణలు అలవాటు అవుతున్న నేటి యువతీయువకులకు ఎలాంటి సంతానం కలుగుతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మోడరన్ భావాల ముసుగులో దాక్కుని చాలామంది నేటి తల్లిదండ్రులు వీటిని ప్రోత్సహిస్తున్నారు అనేది ఇంకొక చేదునిజం. 

మాకుతెలిసిన ఒకఅమ్మాయి ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నపుడు, ఇంట్లోనుంచి వెళ్లి పోయి ఒక హోటల్లో నాలుగురోజులు ఉండి, వాళ్ళ క్లాస్మెట్లు  నలుగురు అబ్బాయిలతో ఎంజాయ్ చేసింది. తర్వాత మూన్నేల్లకు ఆ అమ్మాయికి కడుపు అని తేలింది. నెత్తీనోరూ బాదుకున్న ఆ తండ్రి, గుట్టుచప్పుడు కాకుండా ఆఅమ్మాయికి అబార్షన్ చేయించి, ఇంకొకడితో మూడు ముళ్ళు వేయించాడు. ఆ నలుగురు బాయ్ ప్రెండ్స్ లో అనుమానం ఉన్న ఒకడికి రౌడీలతో దేహశుద్ధి చేయించాడు. ఆ కుర్రాడు మూడునెలలు హాస్పిటల్ బెడ్లో ఉన్నాడు. ఇంతా చేస్తే ఆనలుగురిలో ఈఅమ్మాయి కడుపుకు కారణం ఎవరో ఆఅమ్మాయే చెప్పలేకపోతున్నది. ఇదంతా ఎందుకు చెబుతున్నాను అంటే, ఆఅమ్మాయి తండ్రి కూడా తక్కువవాడేమీ కాదు. అతనూ విచ్చలవిడిగా ఆడవాళ్ళతో తిరిగినవాడే. ఇప్పుడూ అతనికి తాగుడూ తిరుగుడూ అన్నిరకాల వ్యవహారాలూ ఉన్నాయి. కాని తనకూతురు దగ్గరకు వచ్చేసరికి ఆమె సతీసావిత్రిలాగా ఉండాలని ఆశించాడు. అది ఎలా సాధ్యమో నాకు అర్ధం కాదు. చాలామంది తల్లితండ్రులు ఇదే పొరపాటు చేస్తారు. తామెలా ఉన్నా తమసంతానం మాత్రం ఉత్తములుగా ఉండాలని కోరుకుంటారు. తమ జీన్స్ లోనుంచే తమ సంతానం వస్తుందని వారు మరచిపోతారో లేక గుర్తులేనట్టు నటిస్తారో అర్ధం కాదు. ఆ పిల్లల తప్పు కూడా ఏమీ ఉండదు. వాళ్ళ జీన్స్ ప్రేరేపించిన తీరులో వాళ్ళు ప్రవర్తిస్తారు. దానికి తోడు పెంపకంలో ఇరవైనాలుగ్గంటలూ ఇంట్లో చూస్తున్నపనులే వాళ్ళూ చేస్తారు. వాళ్ళను తప్పుబట్టి ప్రయోజనం లేదు.

అబ్బాయిలలోనూ అమ్మాయిలలోనూ స్వలింగసంపర్కం ఈరోజుల్లో మామూలుగా జరుగుతోంది. ఇది మరీ నీచాతినీచం. విచక్షణాజ్ఞానం లేని జంతువుకూడా ఈపని చెయ్యదు. ఇక మనిషి ఇలాటిపనులు చేస్తుంటే అతన్ని జంతువూ అంటే జంతువులు  కూడా సిగ్గు పడతాయేమో. ఇలాటి వాళ్లకు పుట్టబోయే సంతానంలో క్రిమినల్ పోకడలు తప్పకుండ ఉంటాయి. సంఘవ్యతిరేకమనస్తత్వాలూ, అసహజమనస్తత్వాలూ, సైకోలూ ఇలాగే పుట్టుకొస్తారు.కలియుగధర్మమా అని వీరికోసం న్యాయస్థానాల తీర్పులూ, వీరి హక్కులకోసం పోరాటాలూ గట్రాలూ చూస్తుంటే మనం పురోగమిస్తున్నామో లేక  తిరోగమిస్తున్నామో అర్ధం కావడం లేదు.

ఇక ప్రస్తుతవిషయానికి వస్తే, అబార్షన్లు చేయించిన లేక చేయించుకున్న కుటుంబాలు తరువాత భయంకరఫలితాలు అనుభవిస్తాయి అనడం పచ్చినిజం. నేను అనేక కేసుల్లో వీటిని కళ్ళారా చూచాను. నాకు తెలిసిన ఒక లేడీ డాక్టర్ అబార్షన్లు చెయ్యడంలో మంచిదిట్ట. ఆపని వద్దనీ అది మంచిది కాదనీ ఎందఱో చెప్పి చూచారు. కాని ఆమె వినలేదు. కారణం ఏమంటే, ఆ పనివల్ల తేరగా ఎక్కువ డబ్బు వచ్చి పడుతుంది. ఆమె ఆస్పత్రి కింద బ్లాకులో ఈ అబార్షన్లు చేసే రూం ఒకటుంది. అక్కడకు వెళితే ఎప్పుడూ ఎవరో అక్కడ ఏడుస్తున్న ఫీలింగ్ కలుగుతుంది.నేను ఒకసారి అక్కడకు వెళ్ళినపుడు ఒక్కక్షణంకూడా ఆగదిలో నిలవలేక పారిపోయినట్లు బయటకువచ్చిపడ్డాను. ఎన్నో ఆత్మలు అక్కడ గాలిలో ఏడుస్తూ తిరుతున్నట్లు నాకు అనిపించింది. తర్వాత కొన్నాళ్ళకు ఆ డాక్టర్ కుటుంబం చిన్నాభిన్నం అయిపొయింది. ఆమెకు బ్రెస్ట్ కేన్సర్ వచ్చి చనిపోయింది. ఆమె భర్త కూడా డాక్టరే. ఆయన అకస్మాత్తుగా పక్షవాతంతో మంచానపడి మరణించాడు.పిల్లలు దిక్కులేనివాల్లయ్యారు. కూతురు ఇంటర్ కేస్ట్ ( బాగా తక్కువకులం వాడిని) మేరేజి చేసుకుని ఎక్కడో ఉంటోంది. ఈ విధంగా బంగారంలాంటి సంసారం సర్వనాశనం అయిపొయింది. ఇలా జరగడానికి కారణం ఆమె చేసిన వందలాది అబార్షన్లు అని నేను నమ్ముతాను.

నాకు తెలిసిన ఒక వ్యక్తికూతురు ఇరవై ఏళ్లక్రితం MBBS  చదివి ప్రాక్టీస్ పెట్టింది. కాని ఆమె అబార్షన్లు మాత్రమె ఎక్కువగా చేసేది. కాలుజారిన పెళ్లికాని కాలేజీయువతులు గుట్టుచప్పుడుకాకుండా వచ్చి ఈమెదగ్గర అబార్షన్ చేయించుకునేవారు. ఈమెకూడా వారివద్ద డబ్బు బాగా గుంజుతూ లీగల్ గా వారికి సహకరించేది. తర్వాత వాళ్ళు పెళ్లిచేసుకుని అమాయకంగా నటిస్తూ జీవితంలో సెటిల్ అయిపోయేవారు.ఇది మంచిపని కాదని, చెయ్యొద్దనీ  నేను చాలాసార్లు చెప్పాను. ఆమె వినలేదు. విచిత్రమేమంటే, ఆమె తండ్రి నాకు స్నేహితుడు. అతనే ఈఅమ్మాయి చేత ఈ క్లినిక్ ఓపన్ చేయించి ఇలాంటి పనులు చేయించేవాడు.తర్వాత కొన్నేళ్ళకు ఆ అమ్మాయికి పెళ్లయింది. మొగుడితో భయంకరంగా గొడవలు అయ్యి కోర్టుకెక్కి, విడిపోయి ఇద్దరూ ఇప్పుడు తలోదారీ చూసుకున్నారు. ఈ అమ్మాయి ఆరోగ్యం బాగా పాడై పోయింది. ప్రస్తుతం ఎక్కడుందో తెలియదు. ఈ తండ్రికూడా చాలాకష్టాలలో కూరుకుపోయి ఉన్నాడు. ఇతనికి కూడా ఆరోగ్యం బాగా దెబ్బతిన్నది.ఆకుటుంబంకూడా చిన్నాభిన్నం అయిపొయింది.

అప్పటివరకూ చక్కగా సాగుతున్న సంసారాలు తెలిసోతెలియకో చేయించుకున్న  అబార్షన్ తర్వాత చిన్నాభిన్నం కావడం చాలాసార్లు చూడవచ్చు. కాకపోతే దీనికీ దానికీ లింకులు అర్ధం చేసుకోవడం చాలామందికి సాధ్యం కాదు. ఎందుకంటే ఈ దృష్టి కోణాలు అందరికీ అలవాటు ఉండవు. ఈ విషయంలో మనకంటే పల్లెటూరివాళ్ళు చాలా మేలుగా ఉంటారు. వాళ్ళు ఇలాంటివాటిని భలే ఖచ్చితంగా గుర్తుపట్టి, 'ఈ పని చేసిన దగ్గరనుంచే ఇలా మనింట్లో చెడు జరుగుతోంది' అని గుర్తుపట్టగలుగుతారు. చదువుకున్న నవీనులు  తెలివిగలవాల్లమనీ అన్నీతెలుసనీ విర్రవీగుతూ ఇలాంటి తిక్క తిక్క పనులు చేసుకుని ఖర్మలు అనుభవిస్తుంటారు.

అబార్షన్లు చేసిన డాక్టర్లకూ,చేయించుకున్నవారికీ,చేయించినవారికీ భయంకరఖర్మలు కట్టి కుడుపుతాయి. అవి అనుభవించేటప్పుడు అర్ధం అవుతుంది తాముచేసింది ఎంతటితప్పో అనే విషయం. కాని అప్పటికే సమయం మించిపోతుంది.ఇదంతా చెబితే చాలామందికి సోదిలా కనిపిస్తుంది.కాని ప్రకృతిధర్మాలు మనం నమ్మినా నమ్మకున్నా జరుగుతూనే ఉంటాయి. ధర్మమూర్తి అయిన కర్మసాక్షి ఎవరికి ఇవ్వాల్సిన ఫలితాలు వారివారి కర్మానుసారం వారికి ఇస్తూనే ఉంటాడు. కళ్ళు తెరిచి గ్రహించేవాడు జాగ్రత్తగా జీవిస్తాడు. అహంకారంతో విర్రవీగేవాడు కాలక్రమేణా ఫలితాలు అనుభవిస్తాడు.

భ్రూణహత్య అనేది మహాపాపం అనీ, దాని ఉసురు తప్పకుండా తగులుతుందనీ, దాని ఫలితాలు చాలా దారుణంగా ఉంటాయనీ దాన్ని చేయించుకునే వాళ్ళూ చేసే డాక్టర్లూ కూడా గ్రహిస్తే మంచిది. తస్మాత్ జాగ్రత.

ఈ పోస్ట్ చదివిన ఒక మిత్రురాలు మెయిల్ ద్వారా కొన్ని ఆసక్తికరమైన అంశాలు లేవనెత్తారు. ఒక అమ్మాయి చెరచబడి గర్భం దాలిస్తే అప్పుడు ఆమె ఏమి చెయ్యాలి? ఆ కడుపును ఉంచుకొని బిడ్డను కని జీవితాంతం పెంచాలా? ఆబిడ్డను రోజూ చూస్తూ తన మానసిక క్షోభను రోజూ రెన్యూవల్ చేసుకోవాలా? అలాగే, పిండం సక్రమంగా పెరుగుతోందా లేదా అన్నది తెలుసుకునే సాంకేతిక వ్యవస్థలు నేడు మనకు ఉన్నాయి. పిండంలో నయంకాని లోపాలు భయంకరరోగాలు ఉన్నాయి అని తెలిసినప్పుడు అబార్షన్ చేయించవచ్చా లేదా అనేది కూడా వివాదాస్పద అంశమే. కాకుంటే ఒక్కవిషయం గుర్తుంచుకోవాలి. కారణాలు ఏవయినా కావచ్చు. ఎవరి కారణాలు వారికి ఉండవచ్చు. కాని ఒక ప్రాణిని మొగ్గలోనే తుంచితే దానిఖర్మ మాత్రం అనుభవించక తప్పదు. దీనికిమాత్రం ప్రకృతిలో మినహాయింపు  లేదు. ప్రకృతిన్యాయస్థానంలో మనవాదనలు ఏమాత్రం నిలబడవు అనీ, ఆ కోర్టులో 'కంటికి కన్ను పంటికి పన్ను' అనేదే తీర్పు అన్న విషయం గుర్తుంచుకోవాలి.

జ్యోతిష్య విజ్ఞానంలో ఇటువంటి దోషాలను కనుక్కునే పద్దతులు ఉన్నాయి.   ఒక జాతకంలోని ప్రేతశాపాలను కనుక్కునే విధానాలు మహర్షి పరాశరులు తన 'హోరాశాస్త్రం'లోఇచ్చారు. చంపబడిన పిండం ప్రేతంగా మారుతుంది. దాని శాపం వీరికి తగులుతుంది. కనుక ఆయా దోష ఫలితాలు వీరిని తరతరాలు ( ఆ దోషం నివారణ అయ్యేంతవరకూ) వెంటాడతాయి. సామాన్యంగా వీటివల్ల సుతక్షయం జరుగుతుంది. అంటే వీరి పిల్లలు చనిపోవడం జరుగుతుంది. వాటిని తెలుసుకుని రెమెడీస్ పాటించి ఆయాదోషాలను తొలగించుకుంటే అప్పటినుంచీ జాతకుని జీవితం బాగుంటుంది. అసలు ఇలాంటి పనులు చెయ్యకుండా ఉండటం ఉత్తమం. చేసిన తర్వాత ఇంకేమీ చెయ్యలేము గనుక రెమెడీస్ పాటించడమే ఎవరైనా చెయ్యగలిగింది.
read more " నవీనకాలపు భయంకరపాపం "

25, ఫిబ్రవరి 2012, శనివారం

విస్మృత యాత్రికుడు

శాంతి కొఱకై వెదకితి నెన్నొ ఏండ్లు
దిక్కులన్నిట జూచితి నీడ కొరకు
అర్ధమయ్యెను కడకొక్క సత్యమింక   
నేను వెదకెడి శాంతియు నీడ నేనె

శాంతి లేదెంత వెదకిన నా యందుదప్ప  
బహువాకిళ్ళ బిచ్చమెత్తితి ప్రేమకొరకు
పరువులెత్తితి కోరితి దాహశాంతి   
లేదెచటనోయది నా హృదంతరాలపు సీమదప్ప

తీర్ధ యాత్రల దిరిగితి అనుగ్రహార్ధినై 
ఎంత మూర్ఖుడ నేను?
వెదకుచుంటిని సుదూరసీమలందు
హృదయాగాధపు లోతుల నెపుడు
వెలుగుచున్నట్టి శాంతిని కానలేక 
ఎంత మూర్ఖుడ నేను?
యోజనములు పరుగిడి వెదకుచుంటి
నిజయాత్ర నాలోన వేచియుండ

కస్తూరి జింక తన సుగంధ భ్రాంతి చేత 
వనమునంతయు దిరిగి వేసారినట్లు 
నావ కొసను నిలచియున్న పక్షికి 
నీడ చూడగ నెక్కడ దొరకనట్లు  
కొలనిలోన విహరించెడు  మీనుకేమొ
దాహ భ్రాంతిని గొంతెండి పోయినట్లు 

ఏ గృహపు ముంగిట నింక నర్ధించబోను
ప్రేమార్దినై వెతల నందబోను
వెదకులాటలు ప్రయాస వేసరములు 
స్వచ్చమౌ ప్రేమ లేదను మాట నిజము.

ప్రేమకోరకై బిచ్చమెత్తితి వీధులందు 
స్వార్ధమే కనిపించే నన్నిచోట్ల 
ప్రేమముసుగున, నింక ఈ ఆట చాలు
విరమించెద నీ జూదక్రీడ ఇదియె మేలు

ఆశ పెకలించి నాలోనె విశ్రమింతు 
ఎవరినైనను ఇకనేమి కోరబోను
ఎంత యద్భుత మిది జూడ ఏమి వింత 
ముగియనున్నది యుగయుగాల వెదుకులాట 

ఎంత మూర్ఖుడ నేను?
వేచి యుంటిని నీకొరకు వేలఏండ్లు 
రమ్ము నాయెద్ద కంచును చేయిసాచి 
వెదకుచున్నది నాలోనె దాగియుండ
వెదకుచుంటిని లోకాన వేసరిల్లి 

మృతిని పొందితి నెంతయు నెన్నొమార్లు
మరల పుట్టితి జూడగ నన్నిసార్లు
పరువులెత్తితి మరీచిక వీధులందు 
తేటయయ్యె సత్యమిపుడు తేరిచూడ

ఇంతకాలము నేనిట వెదకు ప్రేమ 
నిలిచియున్నది నాలోన మౌనముగను
చేయి సాచుచు రమ్మను తల్లివోలె 
వేయి తప్పులు క్షమియించు తల్లివోలె 

ప్రేమించినంతసేపు నా చిన్నబ్రతుకును
చావు వెంటాడె నన్ను నా నీడవోలె 
నాఇల్లు వదలి నే బయలు వెడలినపుడు 
లోకమే నా ఇల్లయి నిలచేనిపుడు

మృతికి వెరువను నేనిక ఎన్నడైన
దాని రమ్మంటి నావైపు చేయి సాచి
మిత్రుడయ్యెను నాకది ఏమి వింత?
బోధించెనొక నిగూఢరహస్యము నిశ్చయముగ
చావు బ్రతుకులనన్నిటి మించి వెలుగు
విశ్వజీవితజ్ఞానము తెల్లమయ్యె  

స్వప్నముల చిక్కుట కల్ల ఇంక
దేబిరించుట లెల్లను దూరమయ్యె
రుతువులోచ్చును పోవును రోజుమారు 
పెరిగి తరుగును లోకము లీలయందు 
నాయందు నేనుందు నిశ్చలముగ
నిర్మలాకాశరీతిని నెమ్మదించి 

నియమాల నన్నిటి నే ధిక్కరింతు
సాగెద జీవితాన నా ఇష్టరీతి
నేనొక ఉన్మత్తుడనని తలచిరి లోకులెల్ల  
తలువనిమ్ము వారికి తోచినట్లు 
నాకు తెలియును నాదగు తత్వమేమొ 

చల్లగాలుల నేనిక సాగిపోదు
వేడిగాడ్పుల జేసెద నాట్యరవళి
సాగిపోయెడి  మబ్బుల తేలిపోదు
కురియు వానల జల్లుల నేలబడుదు
భూమిలోపల కింకుచు దాగిపోదు 
గగనసీమల రేగుచు విక్రమింతు 
మృతిని మించుచు లేచెడి పక్షివోలె

జీవనుల యందలి జీవితమ్ము నేను
మృతుల ఘూర్ణించు తమోగుణధృతియు నేనె
జీవనమ్మున రేగేద విస్తరించి
ముదము నొందెద మృతిలోన మునిగియుండి

వర్షధారల నర్తించు వృక్షమేను
గగనసీమల పారెడి మబ్బు నేను
స్థిరత నిలచెడి పర్వతరాజమేను
సంద్రమును చేర పరువెత్తు నదిని నేను

ప్రేమికుల గాఢ పరిష్వంగసుఖము నేనె
నిరాశాదృక్కుల దోచు ఎడారి నేనె        
దిక్కులేని బతుకుల వ్యధయు నేనె  
ధన్యజీవుల జీవనతృప్తి నేనె
కష్టజీవుల కడగండ్లపాట్లు నేనె
చక్రవర్తుల రాజసదీప్తి నేనె

గగనసీమల సాగెడి పక్షి నేను
సంద్రమున ఈదెడి మీను నేను
భీకరమ్ముగ చెలరేగి బాధపెట్టు
మృత్యువిహ్వల ప్రచండమూర్తి నేను 
జగతి నిదురించు నిశీధ సమయమందు 
నిద్రలేకుండ రాజిల్లు మౌనమేను   

ఏకాగ్రచిత్తుడౌ యోగి నేత్రాలలో 
తెరపులేక జ్వలించు ఎరుక నేను
కాటికేగెడి శవాల తోడునీడ
సాగిపోయెడి మృత్యువు చాయ నేను

కొండలోయల ఆనందనృత్యమాడు 
పిల్లగాలుల తేలెడి పువ్వు నేను
శిశిరఋతువున పండుచు రాలిపోవు
మట్టి కలసెడి విశీర్ణ పత్రమేను 

తనదు బిడ్దను ముద్దిడు తల్లియందు
కరగిపోదును నేనిక ప్రేమ నగుచు 
ప్రేమతాపపు మంటల కాగిపోవు 
యువకరక్తపు ఎర్రనిఛాయ నేను
ప్రేమ బెంచిన సుతుల చీదరింపులతో
కుమిలి ఏడ్చెడి వార్ధక్యవ్యధలు నేను   

గుండెలోతుల ధ్వనియించు నాదమేను
ధ్యాని చవిచూచు ఆనందసీమ నేను
స్వప్నసీమల తోచెడి వెలుగు నేను
చెక్కుచెదరని యోగుల దృష్టి నేను

బ్రహ్మచారుల తేజపు వెలుగు నేను
పైకిలేచెడి యోగపు శక్తి నేను
సాదుమూర్తుల పవిత్రదీప్తి నేను
జ్ఞానిచూపుల కరుణాసంద్రమేను

సూర్యకాంతుల నాట్యమొనరింతు నేను  
మృతిని బోలెడు రాత్రుల విశ్రమింతు
వీరయోధుల శక్తియు యుక్తి నేను
ఓడిపోయెడి వారల సిగ్గు నేను

యాచకుని ఆకలి యందు నుందు
ధనపు మదమున తూలెడి మత్తు నేను
యవ్వనమ్మున రేగెడి శక్తి నేను
వణకుచుండెడి వార్ధక్యస్తితిని నేను
శిశువు కన్నుల మెరసెడి నవ్వు నేను
శక్తిహీనత పడియుండు శవము నేను

రాత్రిచుక్కల మెరపుల మేళవింతు
సాంద్రఘోషల నెగసెడి  శబ్దమేను
మంద్రగతి సాగెడి నదిని నేను
సడిలేక నిలచు గంభీరసంద్రమేను

లోకరీతుల నన్నిట నేనె యుందు  
అష్టదిక్కుల నిండెద విస్తరించి
వేడినిచ్చెడి వెలుగులరేడు నేను
చల్లచల్లని చందురు కాంతి నేను 
 
మౌనధ్యానపు లోతుల ఉబికివచ్చు
స్వర్లోక సుమధుర గానమేను  
రాత్రిఝాముల నిశ్శబ్దసీమయందు
వినగవచ్చెడి వేణువు నాదమేను    

ముసిగ నవ్వెడి ముగ్ధంపు శిశువు నేను
కామజ్వాలల తపియించు కాంక్ష నేను
కర్రయూతాన వణకెడి ముసలి నేను
చితిని మండెడి నికృష్టశవము నేను

కసాయి కత్తి కరకుదనము నేనె
గొంతు తెగిపోవు జంతువు గూడ నేనె
కుష్టురోగుల వ్రణముల రసిని నేను  
నష్టలోకపు నిరాశ ఛాయ నేను.

తల్లిపాదాల చెంతన నేర్చుకొంటి 
ధన్యజీవిత రహస్యజ్ఞానమేల్ల
బ్రతుకుటెట్టులో మరి చచ్చుటెట్లో   
నేర్పే మాయమ్మ తన జీవయాత్ర చేత
     
అమ్మ మాటల నెప్పుడు ఆచరించి
బ్రతికేదను రోజు మరియును చత్తునట్లే
జీవింతు ప్రతిక్షణము మరుక్షణమున చత్తునటులే
బ్రతికియుందును మృతియందు చిత్రముగను

మృతిని బొందెద ప్రతిరోజు మానకుండ    
తిరిగిలేచేద మరునాడు శిశువువోలె 
తేటకన్నుల చూచెద లోకమెల్ల
అమ్మ నేర్పిన రహస్యజ్ఞానమిదియె

జోలపాటల నూగితి నెన్నొమార్లు
కాలిపోయితి చితిలోన అన్నిసార్లు
కనులు తెరచితి నిప్పుడు నిశ్చయముగ 
కనుక వాటి చాయలకింక పోను

స్వప్నభ్రాంతిని బోలెడు లోకమెల్ల 
కనుల ముందర కదలాడి సాగిపోవు
నన్ను తాకంగ దానికి శక్తిలేదు      
చూతునన్నిటి నొక మౌనసాక్షి వోలె
మూలనిలచిన అదృశ్యఆత్మ వోలె

సాటిజీవుల బాధలు పట్టకుండ
పూజచేయగ చూచి నవ్వుకొందు
మార్పులేనట్టి జీవనరీతి జూచి
పొరలి నవ్వుదు నెంతయు వేడ్కతోడ
గుడ్డిగురువుల చేష్టల గుర్తుబట్టి
నవ్వుకొందును వారల గతులనెరిగి  

సురలనొల్లను, నెప్పుడు చూడబోను
వారలందరు నన్నిట వదలిపోరు
ధిక్కరింతు నందరి పొండు పొండనుచు       
కాని అంతయు నాదె ఇదియె వింత 

అడిగిరేవ్వరొ నన్ను-- గుడులు గోపురాలు తిరుగవేల?
అతనినడిగితి నోక్కగు వింత ప్రశ్న
మనిషి హస్తము తాకని దేవళమును 
చూపుమా పరుగెత్తిపోయేద నచటికంచు

ఒకరనిరి నాతోడ ఒక్కరోజు
పూజమానిన నరకాన పడేదవంచు
పొరలినవ్వితి వానిజూచి పక్కుమంచు
స్వర్గనరకాలు నాలోని కలలు జూడ      
ఎచటికేగేద నేను? ఎట్లు బోదు?

జనులు నవ్విరి నన్నుజూచి
పనికిమాలిన వాడవు నీవటంచు
నేనును నవ్వితిని వారిజూచి
నిజము మీరలు చెప్పెడి మాట నిజము   

పనులన్నియు నన్ను విడచి పారిపోయె
సర్వనక్షత్రసీమల నావరించు
శూన్యమునదూరితి శూన్యమైతి
పనికిమాలినవాడనె పచ్చినిజము

నాదుకన్నుల దోచెడి శూన్యదృష్టి
జనులమనమున భయమును దోపచేయు
వారు నన్నొక జడుడవనిరి
నేను నవ్వెద వారల శ్రుతిని గలిపి
పొరలి నవ్వెద లోకుల పాటుజూచి

చంపువాడును మరియిక చచ్చువాడు
చంపు క్రియయును ఈమూడు కలసిపోయి
కలల రీతిని నాలోనె  కానుపింప    
ఏమి చేయంగ గలవాడనింక నేను?

లోకలీలను చూచుచు సంతసింతు
అంతరంగాన నవ్వుల తేలిపోదు
ఉన్నవన్నియు లోకాన చక్కగానె
చావుపుటకల జూచితి నే జన్మయందో
మరచిపోయితి వానిని ఇప్పుడింక
read more " విస్మృత యాత్రికుడు "

18, ఫిబ్రవరి 2012, శనివారం

హోమియోపతి-మరికొన్ని కేన్సర్ ఔషధాలు

నిజానికి హోమియోపతిలో ఈ రోగానికి ఈ మందు అని ఉండదు. అదే హోమియోపతి వైద్య విధానంలోని విచిత్రం. ఇది వినడానికి కొంచం చిత్రంగా ఉంటుంది. కాని కొంత వివరణ తర్వాత దీని వెనుక ఉన్న నిజం అర్ధం అవుతుంది. 

ఒకే రోగంతో బాధపడుతున్న ఇద్దరు వ్యక్తులకు రోగలక్షణాలు ఒకే విధంగా ఉండవు. ఇద్దరిలోనూ రోగం ఒకే స్థాయిలో ఉండదు అని కాదు దీని అర్ధం. రోగం ముదిరిన తీరునుబట్టి దాని లక్షణాలు ఒకరోగికీ ఇంకొకరోగికీ భిన్నంగానే ఉంటాయి. రోగం యొక్క ఎదుగుదలను బట్టి ,దాని స్థాయిని బట్టి దాని లక్షణాలు ఉంటాయి. దీని గురించి నేను చెప్పటం లేదు. 

ఒకేస్థాయిలో ఉన్న ఒకేరోగంతో బాధపడే ఇద్దరు రోగులకు హోమియోపతిలో ఒకేమందు ఇవ్వడం జరుగదు. ఎందుకంటే ఇక్కడ రోగి యొక్క లక్షణాలు కూడా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది. శారీరిక మానసిక లక్షణాలు ఏ ఇద్దరికీ ఒకే విధంగా ఉండవు. ఈ శారీరిక మానసిక లక్షణాలు అనేవి మన పూర్వీకులనుంచి జీన్స్ రూపంలో సంక్రమిస్తాయి. వాటికి తోడు రోగలక్షణాలు కలుస్తాయి. కనుక వాటిని లెక్కలోకి తీసుకోకుండా చేసే వైద్యం శాస్త్రీయ వైద్యం అనిపించుకోదు. ఈ కోణంలో చూచినపుడు, ఒకే స్థాయిలో ఉన్న ఒకే రోగంతో బాధపడే ఇద్దరు వ్యక్తుల లక్షణాలు భిన్నంగా ఉండటం చూడవచ్చు. కనుక ఆ ఇద్దరికీ రెండు వేర్వేరు మందులు సూచింపబడతాయి. హోమియోపతిలో రోగంతో బాటు రోగిని కూడా చాలా సూక్ష్మంగా పరిశీలించడం జరుగుతుంది. అల్లోపతిలో రోగాన్ని మాత్రమే పరిశీలించడం ఉంటుంది. రోగం శరీరంలో తీసుకొచ్చిన మార్పులు మాత్రమే అక్కడ ప్రాముఖ్యతను పొందుతాయి. వారికి రోగి యొక్క మానసిక స్తితి అనవసరం. అందుకనే, చాలామంది అల్లోపతీ వైద్యులు, రోగి చెబుతున్న విషయాలు ఏమీ పట్టించుకోకుండా ఏదేదో ప్రిస్క్రిప్షన్ రాసి రోగి ముఖాన కొట్టడం సర్వసాధారణ దృశ్యంగా మనం చూడవచ్చు. ఇది సరియైన వైద్యం కానేకాదు.

హోమియోపతిలో ఉన్న అన్ని మందులూ సమయం సందర్భాన్ని బట్టి కేన్సర్ వంటి దీర్ఘరోగాల్లో బాగా పని చేస్తాయి.  లక్షణాలను బట్టి వీటిని వాడుకోవాలి. పోయిన సారి కోనయం గురించి వ్రాశాను. ఇప్పుడు మిగిలినవాటిలో కొన్ని మందుల స్వరూప స్వభావాలను ఇక్కడ పరిచయం చేస్తాను.

కార్బో ఏనిమాలిస్ 
ఇది యానిమల్ చార్కోల్. కర్బన కుటుంబానికి చెందిన మందులన్నీ దీర్ఘరోగాలలో అద్భుతంగా పని చేస్తాయి. ఎందుకంటే జీవం యొక్క పరమాణు నిర్మాణంలో కర్బనం (Carbon )ప్రముఖ పాత్ర పోషిస్తుంది. దీర్ఘరోగాలలో, కణాలలోని కర్బనబంధాలలో మార్పులు వస్తాయి. ఆ మార్పులను పోటేన్సీలలో వాడే ఈమందులు పరమాణు స్థాయిలో సరి చేస్తాయి.

ఈ రోగులలో ప్రాణశక్తి బాగా క్షీణించి ఉంటుంది. కేన్సర్ కణుతులు వచ్చి ఉంటాయి. గ్రంధులు వాచి ఉంటాయి. సిరలు ఉబ్బి వాచి నీలంగా ఉంటాయి. బరువులెత్తడం వల్ల తేలికగా వీరు బాధలకు లోనవుతారు. శరీరంలో పుళ్ళు పడి అవి కుళ్ళుడుగా మారుతాయి. వీరి ఒంటిలోనుంచి వచ్చే స్రావాలు భయంకర దుర్వాసనగా ఉంటాయి. శరీరంలో ఏదో ఒక ప్రాంతంలో వాపులు ఉంటాయి కాని వేడి ఉండదు. ప్రాణశక్తి క్షీణతవల్ల శరీరవేడి తగ్గుతుంది. వాపు ఉన్నచోట వేడి ఉండాలి. అది లేకుంటే విచిత్రలక్షణంగా (peculiar symptom ) పరిగణించాల్సి ఉంటుంది. 

వీరు మనుషులతో కలవరు. మౌనంగా ఉండటానికి ఇష్టపడతారు. ఎప్పుడూ డిప్రెషన్ లో ఉంటారు.వీరిలో వినికిడి శక్తి అయోమయంలో ఉంటుంది. శబ్దం ఏ వైపునుంచి వస్తున్నదో చెప్పలేరు. జీర్ణక్రియ బాగా దెబ్బ తిని ఉంటుంది. పొట్ట కేన్సర్ ఉండవచ్చు. గాలి త్రేన్పులు, పొట్ట ఉబ్బరం, చికాకు ఉంటాయి. కొందరిలో పైల్స్ కూడా ఉండవచ్చు. స్త్రీలలో నెలసరి తర్వాత అమిత నీరసంగా ఉంటారు.స్తనాలలో మెరుపులలాగా (shooting pains ) నొప్పులు వస్తుంటాయి. పరీక్షించినప్పుడు వాటిలో గడ్డలలాగా చేతికి తగులుతాయి. ముఖ్యంగా కుడిస్తనంలో ఈ బాధలు ఎక్కువగా ఉంటాయి. గర్భాశయ కేన్సర్ ఉండవచ్చు. ఇలాటి వారిలో గర్భాశయద్వారం (cervix) వాచి ఉంటుంది.

శరీరంలో గ్రంధులు వాచి నొప్పిగా ఉంటాయి. మెడలో, చంకలలో, స్థనాలలో, గజ్జలలో గ్రంధులు వాచి ఉంటాయి. గ్రందుల్లో నొప్పులు దారుణంగా, కత్తితో కోస్తున్నట్లు, మంటతో కూడి ఉంటాయి.

కాడ్మియం మెటాలికం
ఇది ముఖ్యంగా పొట్ట కేన్సర్ మీద బాగా పని చేస్తుంది. ఆహారం గాని ద్రవాలు గాని తీసుకొని తీసుకోక ముందే వాంతి అయిపోతుంటాయి. వాటిని ఏ మాత్రం అరిగించుకోలేని స్తితిలో జీర్ణాశయం ఉంటుంది. వాంతి నల్లగా కాఫీ డికాషిన్ రంగులో ఉంటుంది. 

కాడ్మియం అనే మందు హోమియో ఔషధాలలో చేరకముందు ఎందఱో కేన్సర్ రోగులు బలైపోయారు. కాని ఈ మందు ప్రూవింగ్ అయిన తర్వాత ఎందఱో రోగులు కాపాడబడ్డారు.  వీటిలో కాడ్మియం బ్రోమేటం, కాడ్మియం సల్ఫ్, కాడ్మియం అయోడం మొదలైన ఇతర కాంబినేషన్ డ్రగ్స్ ఉన్నాయి. వాటి లక్షణాలు కూడా ఒకదానికొకటి విభిన్నం గా ఉంటాయి. ఉదాహరణకు కాడ్మియం బ్రోమేటం అనే మందు ఊపిరితిత్తుల బాధలమీదా ఉదరకోశ కేన్సర్ మీదా పనిచేస్తుంది. కాడ్మియం అయోడం అనేది పేగు కేన్సర్ మీదా, తదితర బాధల మీదా పనిచేస్తుంది. కాడ్మియం సల్ఫ్ అనేది నల్లని వాంతి అవుతున్న దశలోనూ, ముఖ పక్షవాతం లోనూ,ఇతర ఉదరకోశ కేన్సర్ స్తితులలోనూ పనిచేస్తుంది.

ఆర్సేనికం ఆల్బం
కేన్సర్ రోగం లో ముందుగా ఈ మందును చెప్పుకోవాలి. ఇందులో బాధలన్నీ అర్ధరాత్రి గానీ మిట్ట మధ్యాన్నం గానీ ఉద్రేకిస్తాయి. రోగి చాలా చికాకుగా ఉంటాడు. స్తిమితం ఉండదు. ఒకచోట ఉండలేదు. కోపంగా ఉంటాడు. చాలా నీరసంగా ఉంటాడు. వేడి పానీయాలు తాగితే ఇతనికి హాయిగా ఉంటుంది. రక్తం వాంతులు అవ్వవచ్చు. ఇతని బాధలన్నీ మంటలతో కూడి ఉంటాయి. అయినా సరే వేడి ఇతనికి హాయినిస్తుంది. ఇతనికి ఉదరకోశ కేన్సర్ ఉండవచ్చు. పొట్టలో వస్తున్న మంటలతో కూడిన బాధలు తట్టుకోలేక హాహాకారాలు చేస్తుంటాడు.
కార్సినోసిన్ 
ఇది కేన్సర్ కణుతుల నుండి తీసిన పదార్ధాన్ని పోటెన్సీలోకి  మార్చి రాబట్టిన మందు. హోమియో విధానంలో రోగి యొక్క స్రావాలనుంచే మందులు తయారు చేసే పద్దతి ఉంది. ఇలా తయారుచేసిన మందులను 'నోసోడ్స్' అంటారు. సూచింపబడుతున్న ఇతరమందులు ఏవీ పనిచెయ్యని స్తితిలో ఈ మందును వాడుతారు. అప్పుడు రోగి యొక్క ప్రాణశక్తి ఉత్తేజితమై, మళ్ళీ మందులను స్వీకరించి పనిచేసే స్తితికి వస్తుంది.అప్పుడు సూచింపబడుతున్న ఇతర మందులు మళ్ళీ వాడుకోవచ్చు. కొన్ని సార్లు సరాసరి కేన్సర్ బాధలమీద కూడా ఈమందు అద్భుతంగా పనిచేస్తుంది. ప్రాణశక్తి బాగా క్షీణించి కుప్పకూలిన స్తితిలో ఉంటుంది. రోగి చాలా నీరసంగా ఉంటాడు. పొట్టలో మండుతున్న బాధలుంటాయి. దొడ్డికి పోయినప్పుడు విపరీతమైన మంటగా ఉంటుంది. ఇతర కేన్సర్ లక్షణాలు ఉంటాయి.

హోమియోపతిలో కనీసం నూరుమందులు కేన్సర్ మీద పనిచేసేవి ఉన్నాయి.అవి రోగంలోని వివిధస్థాయిలలో వివిధబాధలలో ఉపయోగపడతాయి. లక్షణాలపరంగా జాగ్రత్తగా ఎంచుకొని సరియైన పోటేన్సీలో హోమియోసూత్రాల కనుగుణంగా వీటిని వాడుకోవాలి. చాలా మంది రోగులు కేమోథెరపీ అయిన తర్వాత ఆ బాధలు భరించలేక హోమియోని ఆశ్రయిస్తుంటారు. దానివల్ల పెద్దగా ఫలితం ఉండదు. ముందే హోమియోపతి వాడితే రోగం ముదరడం జరుగదు. రోగం మొదటినుంచే హోమియో ఔషధాలు వాడితే అది ముదిరి సర్జరీ వరకూ రావడం ఎన్నటికీ జరుగదు. అయితే రోగం బాగా ముదిరి ఇతర వైద్యవిధానాలు వాడిన తర్వాత హోమియోఔషధాలు మొదలుపెడితేనో,లేక అల్లోపతీ మందులూ హోమియోపతీ మందులూ కలిపి వాడితేనో పూర్తి ఫలితాలు కనపడవు. రోగం పూర్తిగా తగ్గటమూ జరుగదు. కొన్నాళ్ళు రోగం ముదరటం మాత్రం వాయిదా వెయ్యబడుతుంది. కనుక ముందునుంచే హోమియో ఔషధాలు వాడటం శ్రేయస్కరం.
read more " హోమియోపతి-మరికొన్ని కేన్సర్ ఔషధాలు "

11, ఫిబ్రవరి 2012, శనివారం

హోమియోపతిలో కేన్సర్ ఔషధాలు-కోనయం మాక్యులేటం

ఒక వ్యాధిని హోమియౌ వైద్య శాస్త్రం చూచే దృష్టి అల్లోపతీ కంటే భిన్నంగా ఉంటుంది. ఎక్యూట్ రోగాలలో రోగకారక క్రిముల పాత్రను హోమియో వైద్య శాస్త్రం కూడా ఒప్పుకుంటుంది. ఈ విషయంలో ఇతర వైద్యాలకూ హోమియో విధానానికీ స్పర్థ లేదు. కానీ, దీర్ఘరోగాల విషయంలో హోమియో సిద్ధాంతాలు భిన్నమైనవి. చాలా దీర్ఘ రోగాలకు కారణాలు ఏమిటో అల్లోపతీ విధానం ఇంతవరకూ కనిపెట్టలేదు. ఉదాహరణకు నిన్న గాక మొన్న యువరాజ్ సింగ్ కు వచ్చిన రోగానికి కారణం ఏమిటో స్పెషలిస్టులు కూడా చెప్పలేకపోతున్నారు. లక్షలో ఒకరికి ఈ వ్యాధి రావచ్చు అంటారు గాని, ఆ ఒక్కడూ ఇతనే ఎందుకు కావాలో చెప్పలేరు. 

ట్రీట్మెంట్ విధానం కూడా అల్లోపతీలో ఎలా ఉంటుందంటే, క్షీణిస్తున్న ప్రాణశక్తికి సూక్ష్మ స్త్తాయిలో బలాన్ని ఇవ్వడం ఒదిలేసి, ప్రాణం చెయ్యవలసిన పనిని వారు మందులద్వారా పరికరాల ద్వారా పూరించాలని చూస్తారు. తద్వారా, తన పని ఎవరో చేస్తున్నారు కనుక ప్రాణం ఇంకా ఇంకా చతికిలబడుతూ ఉంటుంది. కనుకనే, అనుకూల పరిస్తితి వచ్చినపుడు వ్యాధి మళ్ళీ రిలాప్స్ అవుతుంది. హోమియోపతిలో అయితే,ప్రాణాన్ని సూక్ష్మ స్థాయిలో సరిదిద్దటం ద్వారా వ్యాధిని ప్రాణమే సమర్ధవంతంగా ఎదుర్కొనేలా చెయ్యడం ఉంటుంది. ఈ ప్రక్రియ పోటేన్సీ ఔషధాల ద్వారా జరుగుతుంది. పోటేన్సీలు ప్రాణవ్యాకులత ఉన్న పరమాణు స్థాయిలోకి వెళ్లి అక్కడి లోటును సరిదిద్దుతాయి. కనుక ప్రాణం బలాన్ని పుంజుకొని వ్యాధిని తిప్పికొట్టగలుగుతుంది. అల్లోపతీలో వాడే స్థూలస్థాయి మందులు పరమాణుస్థాయిలోకి వెళ్ళలేవు.

ఒక్క మాటలో చెప్పాలంటే, ఒక ఉద్యోగం లేని వ్యక్తికి, రెండు విధాలుగా మనం సాయం చెయ్యవచ్చు. ఒకటి-- జీవితాంతం అతన్ని మనం పోషిస్తూ  ఆదుకోవడం. రెండు- అతని కాళ్ళమీద అతనే నిలబడేలా చేసి జీవనోపాధి కలిపించడం. . ఇందులో మొదటి విధానం అల్లోపతీ అయితే, రెండవ విధానం హోమియోపతి అని చెప్పవచ్చు. అల్లోపతీలో జీవితాంతం మందులు వాడుతూ ప్రాణం చేసే పని మనం చేస్తాం. హోమియోపతీలో ప్రాణాన్ని చక్కదిద్ది దానిపని అది చేసుకునేలా చేస్తాం. ఇదీ రెంటికీ తేడా.

కేన్సర్ కు వాడే హోమియో ఔషధాలలో 'కోనయం మాక్యులేటం' అనే మందు ఒకటి. దీని ముఖ్య లక్షణాలు కొన్ని పరిశీలిద్దాం. ఇవి ముఖ్య లక్షణాలు మాత్రమేననీ, మందు యొక్క సమగ్ర స్వరూపం కాదనీ గుర్తుంచుకోవాలి. 

ఇది 'హెమ్లాక్' అనే విషం. సోక్రటీస్ కు ఇది ఇచ్చినందువల్లె ఆయన  చనిపోయాడు. చనిపోయేముందు ఆయన పడిన బాధలనూ, ఆ బాధలను వర్ణించిన తీరునూ సోక్రటీస్ శిష్యుడైన  'ప్లేటో' వ్రాసి పెట్టాడు. బహుశా 'కోనయం' మొదటి ప్రూవింగ్ అదే అయ్యుండవచ్చు. అందులో, శరీరం క్రమేణా చచ్చు బడినట్లు అనిపిస్తున్నదనీ అలా చచ్చుబడటం కాళ్ళలో మొదలై క్రమేణా పైకి పాకుతున్నదనీ సోక్రటీస్ అంటాడు. 

ఈ మందు అవసరం అయ్యే పేషంట్లు గట్టివారు. వారి గ్రంధులు గట్టిపడి ఉంటాయి. వీరికి ఏ పనీ చేద్దామని ఉండదు. ఊరకే అలా కాలక్షేపం చేస్తూ ఉంటారు. ఎప్పుడూ నీరసంగా ఉంటుంది. జ్ఞాపక శక్తి కూడా క్షీణించి ఉంటుంది. తేలికగా ఉద్రేకపడతారు. ఊరకే ఇతరులతో గొడవలు పెట్టుకుంటారు. ఎవరైనా వీరికి ఎదురుచేబితే భరించలేరు. ఉద్రేకం ఎక్కువై దాన్నుంచి డిప్రెషన్ లోకి పోతుంటారు. 

ఆడవారిలో స్థనాలు, మగవారిలో వృషణాలు బాగా గట్టిపడి రాళ్ళలా ఉంటాయి. స్త్రీలలో నెలసరికి ముందూ, నెలసరి సమయంలోనూ స్థనాలు గట్టిపడి నొప్పిగా బాధగా ఉంటాయి. ఇలాటి వారిలో బ్రెస్ట్ కేన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.స్తనాలను పరిశీలించినప్పుడు వాటిలో రాళ్ళలాగా గడ్డలు తగులుతాయి. కొందరిలో  చంకలలో గ్రంధులు వాచి ఆ నొప్పి తిమ్మిరిలాగా చేతిగుండా పాకుతూ వేళ్ళవరకూ వస్తుంది. 

ఒవరీలలోనూ, గర్భాశయంలోనూ బాధలున్నవారిలో కొందరికి కళ్ళు గిర్రున తిరుగుతాయి. మెడ పక్కకు తిప్పినా, కళ్ళు పక్కకు తిప్పినాs గది మొత్తం గిర్రున తిరిగినట్లు ఉంటుంది. ఎక్కువగా ఈ లక్షణం బెడ్ మీద పడుకుని ఉన్నపుడు కనిపిస్తుంది.

ప్రోస్టేట్ కేన్సర్ ఉన్న మగవారిలోనూ, గర్భాశయ సమస్యలున్న ఆడవారి లోనూ ఒంటేలుకు పోయేటప్పుడు చాలా ఇబ్బంది కలుగుతుంది. యూరిన్ ధార మధ్యమధ్యలో ఆగిఆగి వస్తుంది.ఆడవారిలో నెలసరి ఆగిపోతుంది. నెలసరికి ముందు ఒంటిమీద ఎర్రని సన్ననిదద్దుర్లు వచ్చి నెలసరి రాగానే మాయమౌతాయి. నెలసరి తర్వాత పది రోజులకు లుకోరియా కనిపిస్తుంది. 

సెక్స్ కోరికలను బలవంతంగా అణచిపెట్టుకున్నవారిలోనూ, లేక విపరీతంగా కోరికలు తీర్చుకున్నవారిలోనూ లేటు వయసులో కేన్సర్ వచ్చే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఈవిషయం అల్లోపతీకి తెలియదు.ఇది హోమియో వైద్యపు insights లో ఒకటి. ఇలాటి వారికి సెక్స్ కోరికలు ఎక్కువగా ఉంటాయి. కాని శరీరం సహకరించదు. అంటే యయాతిలాంటి వారన్నమాట. అలాటి వారికి ముందుముందు కేన్సర్ రావచ్చు అని అనుమానించవచ్చు. ఇటువంటి వారికి ఈ మందు అద్భుతంగా పనిచేస్తుంది.

వీరికి పగలూ రాత్రీ ఒకటే చెమటలు పడుతుంటాయి. ఈ మందు అవసరమైన వారి లక్షణాలు రాత్రిపూట ఉద్రేకిస్తాయి.పక్కమీద చేరిన తర్వాత బాధలు  ఎక్కువౌతాయి. బ్రహ్మచర్యం పాటిస్తే వీరి బాధలన్నీ ఉద్రేకిస్తాయి. 
    
కోనయం రోగికి బాధలు శరీరంలో కిందినుంచి పైకి వ్యాపిస్తాయి. Ascending  paralysis వీటిలో ఒకటి. ఈ పక్షవాతం అనేది క్రమేనా పై పైకి ఎదిగి చివరికి ఊపిరితిత్తులను ఆక్రమించి శ్వాస అందకపోవడం వల్ల చావును కొని తెస్తుంది. ఇలాంటి వారికి ముఖ్యంగా నీరసంగా ఉంటుంది. కాళ్ళలో కండరాలు చాలా నీరసంగా అనిపిస్తాయి.

వీరికి ఉపవాసం ఉంటె బాధలు శాంతిస్తాయి. చీకటిలో ఉంటే బాగుంటుంది. తిరుగుతూ ఉన్నా, ఒళ్ళు పట్టించుకున్నా హాయిగా ఉంటుంది. కాళ్ళూ చేతులూ బెడ్ మీదనుంచి కిందకు వేలాడేసి పడుకుంటే హాయిగా ఉంటుంది. 

మందులక్షణాలూ, రోగిలక్షణాలూ, రోగలక్షణాలూ కలిసినప్పుడు ఈ మందు ఇండికేట్ అవుతుంటే సరైన దశలోగనుక దీనిని వాడగలిగితే ఈ మందు కేన్సర్ ను కూడా తగ్గిస్తుంది.దీని ప్రభావంవల్ల కేన్సర్ కణుతులు కరిగిపోయి కనిపించకుండా మాయమౌతాయి.కెమోథెరపీ,రేడియేషన్ థెరపీలు చెయ్యలేని పని ఈమందు చేస్తుంది.రోగి యొక్క మానసికశారీరికలక్షణాలు పరిశీలించి సరియైన పోటేన్సీలో హోమియోసూత్రాల కనుగుణంగా దీనిని వాడవలసి ఉంటుంది. అప్పుడు అద్భుతాలు జరగడం చూడవచ్చు.

వచ్చే పోస్ట్ లో మరికొన్ని కేన్సర్ మందులు చూద్దాం.
read more " హోమియోపతిలో కేన్సర్ ఔషధాలు-కోనయం మాక్యులేటం "

8, ఫిబ్రవరి 2012, బుధవారం

కాలజ్ఞానం - 5

మాఘ కృష్ణ ఏకాదశి మార్గమేదో చూపుతోంది
నీచరాహు దృష్టంతా దనుజగురువు మీదుంది 
తమకు తగని మన్మధాగ్ని లోకాన్నే కమ్ముతుంది 
జనుల మానసాలలోన చిచ్చునేమొ పెంచుతుంది

రాజులనగ  పేదలనగ వ్యత్యాసం లేకుండా 
ప్రతివారిని కామాగ్ని పడవేయ బూనుతుంది 
వింత వింత చేష్టలతో లోకం పోటెత్తుతుంది 
మదనబాణ ధాటిలోన మాటలేక పడుతుంది

శివభక్తులకే చూడగ చిత్రమైన రక్షణుంది
మోరెత్తుకు తిరుగువారి మాడు పగిలిపోతుంది 
అహంకారులను చూస్తె అంటకాగబెడుతుంది
ఎరుకగలుగువారినేమొ ఏమనక సాగుతుంది
read more " కాలజ్ఞానం - 5 "

నాతో కలిసి నడుస్తావా నేస్తం?

గోవుల్లాంటి మూగజీవులకు 
చెత్తకుండీలలో ఎంగిలాకులు
కుక్కాపిల్లీ క్రూరజంతువులకు 
ఏసీరూములు సోఫామెత్తలు
గమనించావా లోకపు న్యాయాన్ని?

మెత్తనిభర్తలకు కరుకుభార్యలు 
లేతమొగ్గలకు వ్యసనపు మొగుళ్ళు 
చదువుకోవాలంటే అవకాశాలు శూన్యం 
వసతులమరిస్తే చదువు పూజ్యం
ఏమిటంటావ్ ఈ విచిత్రం?

ఆలయాలలో హోరున పూజలు 
నడిరోడ్డున దిక్కులేని శవాలు
వేదికలపైన ధార్మికోపన్యాసాలు 
రాతిగుండెల శ్రోతల జీవితాలు
మితిలేని ఆత్మవంచనలు; కాదనగలవా?


ఆశకూ ఆనందానికీ మధ్య ఇంతటి దూరాలెందుకో?
కన్నీటికీ చిరునవ్వుకీ మధ్య తీరని అంతరాలేమిటో
విచిత్రమైంది కదూ ఈ సృష్టి?


ఆశల పెనాల మీద ఆవిరయ్యే జీవితాలు
గమ్యం చేరుకోలేక కూలే ఊహలవిహంగాలు
ఎప్పటికీ మారని ఎదురుచూపులు
ఎన్నటికీ తీరని మనిషి కోరికలు
ఎక్కడికంటావ్ మన పరుగు?

కోరుకున్నది వెంటనే దొరికితే తెలుస్తుందా జీవితం విలువ?
అన్నీ సుఖంగా అమిరితే పుట్టుకొస్తుందా తెగువ?
చీకటే లేకుంటే పగటికి విలువేది?
లేమి నుంచేగా కలిమి మొదలయ్యేది? 


కడుపు నిండినా ఇంకా తినాలని ఆశెందుకో
ఎన్నటికీ తృప్తిలేని సుఖాలపై మోజెందుకో
అంతముందా ఆశల అన్వేషణకు 
పొంతనుందా లోకపు తీరులకు
కళ్ళుతేరిచి చూడు నేస్తం నీవే గ్రహిస్తావు సమస్తం 


పగలూ రాత్రీ అంతులేని ఆటలో
దారీతెన్నూ తోచని పరుగు పందెంలో
ఆలోచించావా ఎప్పుడైనా?
ఎన్నాళ్ళుగా గడిపావో ఈ వ్యధాభరిత జీవితాన్ని
ఎన్నేళ్ళుగా నడిచావో వృధాగా ఈ ఎడారి నడకల్ని


ఎక్కడికో నీ ప్రయాణం ఈ లోకంలో
ఎందుకోసమో నీ అన్వేషణ ఈ మోహంలో 
దాక్కున్నావా బాధ్యతల ముసుగులో?
దారితప్పావా ఆత్మవంచన అనే అడివిలో?
నీకేం కావాలో నీకైనా తెలుసా? 
నీ పయనం ఎక్కడికో అదైనా తెలుసా?


మారిందా లోకమనే కుక్కతోక ఎన్నడైనా?
తీరిందా మనసు దాహం ఎప్పుడైనా?
పాతకాలం నుంచీ మనిషితీరు మారిందా ?
మనసుపాశం ఎన్నడైనా మనిషిని వదిలిందా ?
లోకంలో ఆనందం ఆకాశపుష్పమేనోయ్
ఉందని అనుకోవడం నీ భ్రమేనోయ్ 

ఎవరెలా పోతే నీకెందుకు లోకమేమైపోతే నీకెందుకు 
నీవెవరో ముందు తెలుసుకో నిన్నే నీగమ్యంగా నిలుపుకో 
నీవే నీకు తెలియవు లోకాన్నేం జయిస్తావ్ నువ్వు? 
స్వార్ధమే నీకు కావలిస్తే అమితంగా దానిని పెంచుకో 
ప్రపంచాన్ని మొత్తం మింగేసి నీవొక్కడివే మిగులు 

లోకమనేది ఎక్కడా లేదనేది తెలుసుకో 
ఉన్నది మనుషులూ వాళ్ళ స్వార్ధమే 
నీలోకి నువ్వే నడచిపో మిగిలినదంతా వ్యర్ధమే
భరించలేవా ఈ నిజాన్ని? తాకలేవా ఈ అగ్నిని? 
అయితే నీ జీవితం వృధాయేనంటాను నేను


ఎక్కడున్నావ్ పుట్టకముందు? 
ఏమౌతావ్ పోయిన తర్వాత?
ఊహించావా ఎప్పుడైనా ఒక్క క్షణం?
బ్రతుకుపోరాటంలో పడి మరిచావా ఈ ప్రశ్నని?
కట్టుకున్నావ్ కదూ నీ కళ్ళకి పట్టుగంతల్ని?


శాశ్వతమనుకుంటున్నావా నువ్విక్కడ 
అదే నిజమైతే, నీ ముందరివాళ్ళంతా ఎక్కడ?
నీవు పోయిన మరుక్షణం నిన్ను మరిచిపోతుందీ లోకం
నీకు నచ్చినా నచ్చకున్నా ఇదే అసలైన చేదునిజం 
నీ జీవితకాలం ఈలోకంలో అతి స్వల్పం 
విశాలవిశ్వంలో నీ బ్రతుకే అత్యల్పం 

కనీసం ఇప్పుడైనా కళ్ళుతెరవవా మరి 
లోకమూ వద్దు నీమనసూ వద్దు 
ఈరెంటినీ వదిలిచూడు ఒకసారి
నేనన్నది నిజమేనని అంటావప్పుడు
ఎన్నడూ వినని నాదం వింటావప్పుడు


అన్ని సమస్యలూ అర్ధమౌతాయప్పుడు
చిక్కుముళ్లన్నీ విడిపోతాయప్పుడు
నీ పెద్దలందరూ ఈ బాటనే నడిచారు 
అందరు దేవుళ్ళూ ఆత్మదేవుణ్నేకొలిచారు

ఆరాటమనేదుంటే ఆచరించు ఈవిధానం స్వయంగా 
నీవే చూడు, చేరుతావో లేవో నీగమ్యం నిజంగా
read more " నాతో కలిసి నడుస్తావా నేస్తం? "