“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

1, మార్చి 2012, గురువారం

నవీనకాలపు భయంకరపాపం

మానవుడు సైన్సుపరంగా ఎంతో ఎదిగానని విర్రవీగుతూ కన్నూమిన్నూగానక చేస్తున్న ఎన్నోతప్పులు నవీనకాలంలో ఉన్నాయి. విచ్చలవిడిగా సాగుతున్న అబార్షన్లు వాటిలో ఒకటి.

భ్రూణహత్యను మహాపాపాలలో ఒకటిగా ధర్మశాస్త్రాలన్నీ పరిగణించాయి. అవన్నీ పనీపాటాలేని వాళ్ళు వ్రాసిన పుస్తకాలు అని ఎగతాళి చేస్తూ ఇష్టానుసారం పిచ్చి పనులు చేసేవారు అనుభవిస్తున్న ఖర్మలు దారుణంగా ఉంటున్నాయి. తల్లిగర్భం అనేది ఒక ప్రాణికి జీవంపోసి తొమ్మిదినెలలు పోషించవలసిన అమృతస్థానం. జీవం పోసుకుంటున్న అమాయకప్రాణికి అది బలిపీఠంగా మారిందంటే దాని ఫలితాలు భయంకరంగా ఉంటాయి. ప్రకృతిలో ఏది ఏపని చెయ్యాలో అది ఆపని చేసినప్పుడే అక్కడ వ్యవస్థ సక్రమంగా ఉన్నట్లు లెక్క. అంతేగాని పెంచి పోషించవలసిన చోట శ్మశానం చోటుచేసుకుంటే ప్రకృతి కన్నెర్ర చేస్తుంది. ఆ వ్యక్తి జీవితం అక్కణ్ణించి గతి తప్పుతుంది. సూక్ష్మంగా గమనిస్తే ఈ విషయం తెలుస్తుంది.

ఒక గురువుకు శిష్యుణ్ణి అని చెప్పుకునే ఒక ఆధ్యాత్మికనయవంచకుడు నాకు తెలుసు. అతను కొన్నేళ్ళక్రితం బాగానే ఉండేవాడు. లోలోపల దుష్ట సంస్కారాలు ఉన్నాయని నాకు తెలుసు. కాని పైకి కొంత బాగానే ఉండేవాడు. బాగానే నటించేవాడు. అతనికి ఒకగురువు దగ్గర దీక్ష ఇప్పించడంలో ఇరవైఏళ్లక్రితం నేనుకూడా కొంతపాత్ర పోషించాను. తరువాత తరువాత అనవసరంగా నాతో శత్రుత్వం తెచ్చుకుని మాట్లాడటం మానేశాడు. సరే, ఎవరి ఖర్మకెవరు బాధ్యులు అని నేనూ అతనికి దూరంగానే ఉన్నాను. కొన్నేళ్ళ తర్వాత ఈమధ్యనే యదాలాపంగా అతన్ని కలవడం జరిగింది. అతని ముఖంలో, ఒక కిరాతకుని ముఖంలో ఉండే క్రౌర్యం కనిపించింది. ఇరవై ఏళ్ల సాధన తర్వాత ఒక మనిషిలో రావలసిన పవిత్రతా పరిపక్వతా రాకపోగా అతనిముఖం ఒక రాక్షసునిముఖంలాగా, కసాయివాడిముఖంలాగా  కనిపించింది. అతని తేజోవలయం (ఆరా) పరమచండాలంగా, రిపల్సివ్ గా ఉంది. అతనికి షేక్ హాండ్ ఇస్తే నాచెయ్యి మంటలు పుట్టింది. కారణాలు విచారించగా, భార్య వద్దని మొత్తుకుంటున్నా వినకుండా అయ్యగారు వరుసగా ఆమెకు మూడుఅబార్షన్లు చేయించాడని తెలిసింది. ఆడపిల్ల గర్భంలో ఉండడమే దానికి కారణమట. ఇలాటి వెధవలు ఆధ్యాత్మికత గురించి లెక్చర్లు ఇస్తే నాకు ఎంత కోపం వస్తుందంటే, అలాటివాళ్ళను భీముడు జరాసంధుణ్ణి చీల్చినట్లు, ఏముక్కకు ఆముక్క చీల్చి పారేద్దామనిపిస్తుంది. నాకు పరమచీదర పుట్టి అతనితో మాట్లాడటం, అతని ముఖం చూడటంకూడా మానేశాను.

నవీనకాలంలో పెరుగుతున్న ఇంకొన్ని పోకడలున్నాయి. పెళ్లి చేసుకున్న వెంటనే పిల్లలు వద్దట. కొన్నేళ్ళు ఎంజాయ్ చేసి అప్పుడు పిల్లల్ని కంటారట. అందుకే కుక్కపిల్లలూ కోతిపిల్లలూ పుడుతున్నాయి.పెద్దయ్యాక పశువులశాలకు పశువుల్ని తోలినట్లు, తల్లిదండ్రుల్ని అనాదాశ్రమాలకు తోలే పిల్లలు అందుకే పుట్టుకొస్తున్నారు. దంపతులకు ఎంజాయ్మెంట్  ప్రధానం అట, సంతానం కాదుట. కనుకనే అలాంటివారికి పుట్టే పిల్లలుకూడా వారు పెద్దయిన తర్వాత 'మా ఎంజాయ్మెంట్ మాకు ముఖ్యం. మీరు మాకు అడ్డం' అంటూ తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలకు తోలుతున్నారు. పిల్లలను కనడం ఒక కళ. అది ఒక యోగం అని చెప్పవచ్చు. ప్రాచీనులకు ఆ కళ తెలుసు. ముఖ్యంగా ప్రాచీన ఋషులు ఈ విద్యలో ఉద్దండులు. వారి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందిపుచ్చుకోగల సంతానాన్ని ఎలా కనాలో వారికి తెలిసి ఉండేది. దీనికి ఉత్తకోరిక ఉంటే చాలదు. దానికోసం మన జీవనవిధానం మార్చుకోవాలి. మన ఇష్టానుసారం మనం జీవిస్తూ మన సంతానంమాత్రం ఉత్తములుగా ఉండాలంటే అది సాధ్యంకాదు.మన పిల్లలు ఏవిధంగా ఉండాలని మనము అనుకుంటామో ఆవిధంగా పెళ్లి కాకముందు కొన్నేళ్ళపాటు మనం ఉంటే అప్పుడు ఆ జీన్స్ లోనుంచి అలాంటి పిల్లలే మనకు పుడతారు.  లేకుంటే లేదు.

పశువులుకూడా పిల్లలను కంటాయి అది గొప్పవిషయం కాదు. కాని పశువుకు పశువే పుడుతుంది. ఒక దేవతను బిడ్డగా పొందగలిగే అదృష్టం మాత్రం మనిషికే ఉంది. అలాంటి సంతానం పొందాలంటే దానికి మనిషి చిన్నప్పటినుంచే తయారు కావాలి. మన శారీరిక మానసిక పవిత్రతను ఆధ్యాత్మికబలాన్నీ బట్టే మన సంతానానికి ఉత్తమసంస్కారాలు ఏర్పడతాయి. చాలామంది తల్లిదండ్రులు 'మా పిల్లలు మా మాట వినడం లేదు' అని బాధపడటం నేను చూచాను. 'దానికి కారణం మీరే' - అని వారికి చెప్తాను.జంతువులలా సంతానాన్ని కంటే జంతువులే పుడతారు. దేవతలవంటి సంతానం కావాలంటే మనం దేవతలవలె ఉండాలి. దానికి ప్రత్యేకమైన ట్రైనింగ్ ఉంది. వివాహానికి ఎంతో ముందు నుంచే ఇద్దరూ ఆ శిక్షణలో ఉండాలి. ఆ మార్గంలో ఇద్దరూ తమ మనస్సులనూ శరీరాలనూ తయారు చేసుకోవాలి.అప్పుడే వారికి రుషితుల్యమైన సంతానం కలుగుతుంది. అది నేటి తల్లిదండ్రులకే తెలియదు ఇక తమ పిల్లలకు ఏమి నేర్పించగలరు? సంగమసమయంలో దంపతుల శారీరికపవిత్రతనుబట్టి, మానసికసంస్కారాలను బట్టి పుట్టబోయే జీవి ఉంటుంది. అటువంటి ఉత్తమ పరిస్తితులు అప్పటికప్పుడు స్నానం చేస్తే వచ్చేవి కావు. వాటికోసం ఎన్నో ఏళ్లుగా తపస్సు చెయ్యాలి. అటువంటివారికే ఉత్తమసంతానం కలుగుతుంది.

పెళ్ళయ్యాక అయిదారేళ్ళు ఎంజాయ్ చేసి పిచ్చిపిచ్చి మందులు వాడిన జంటలు తర్వాత సంతానం కలగక ఎందఱో డాక్టర్లచుట్టూ సంతానం కోసం ప్రదక్షిణాలు చేసినవిషయం నాకు తెలుసు.మా బంధువులలోనే అలాటివాళ్ళు చాలామంది ఉన్నారు. పునరుత్పత్తి వ్యవస్థ అనేది మొగవాడిలోనైనా ఆడదానిలోనైనా అతి సున్నితమైన వ్యవస్థ. తిక్కతిక్క పనులతో దానిని అస్తవ్యస్తం చేసుకుంటున్న నేటి నవీనులకు జంతుసమానులైన వాళ్ళు  సంతానంగా పుట్టటంలో వింత ఏముంటుంది? రకరకాల దురభ్యాసాలతో వీర్యనష్టానికి లోనైన యువకుని వీర్యంలో పటుత్వం ఉండదు. దానినుంచి ఉత్తమ సంతానం రాదు. అలాగే రకరకాల మందులు వాడి నెలసరి వ్యవస్థను అతలాకుతలం చేసుకుని తిక్క పనులు చేసే యువతికి కూడా సత్సంతానం కలగడం కల్ల. ఇక వీరిద్దరి కలయికతో ఎటువంటి సంతానం వస్తుందో ఊహించడానికి దివ్యదృష్టి అక్కర్లేదు, కామన్ సెన్స్ చాలు. ఇలాటివాళ్ళను ప్రోత్సహిస్తూ చెత్తవాగుడు పత్రికల్లో వాగుతూ సమాజపు డబ్బును దోచుకునే నేటి డాక్టర్లు పచ్చిదొంగలు అంటే ఎంత మాత్రం తప్పు లేదు.

మిత్రులు జయదేవ్ గారు ఇంకొక విషయం చెప్పారు. గర్భసంచి అనేదానికి కూడా మెమరీ ఉంటుందని నేటి రీసెర్చి రుజువు చేస్తున్నది. మన శరీరంలో ప్రతి కణానికీ మెమరీ ఉంటుంది అన్నది నిజమే. ఒకసారి గర్భస్రావం జరిగినప్పుడు గర్భసంచి భయంతో వణికిపోయి కుంచించుకుపోతుంది. ఆ భయం దాని సెల్స్ లో రికార్డ్ అయి ఉంటుంది. కనుక రెండవసారి అసలు గర్భధారణనే  జరుగనివ్వదు. కనుకనే రెండుమూడుసార్లు ఎబార్షన్ చేయించుకున్న వారికి ఆ తరువాత ప్రయత్నించినా గర్భం నిలబడదు. దానికోసం మళ్ళీ మందులు వాడి నరకం అనుభవించవలసి వస్తుంది. అయినా గ్యారంటీ ఉండదు. ఇదంతా గర్భసంచి కణాల మెమరీ లో ప్రింట్ అయిపోయిన భయంవల్లే జరుగుతుంది. డాక్టర్లకు ఈవిషయం తెలీదో లేక తెలిసీ ధనాశతో మనకెందుకులే పాడైపొయ్యేది పేషంటేకదా అని వీళ్ళకు చెప్పరో అర్ధం కాదు. మనిషి మాత్రం తన అహంకారంతో అన్నీ తెలుసనీ విర్రవీగుతూ పిచ్చిపనులతో నాశనం అవుతూ ఉంటాడు.

చిన్ననాటినుంచి ఉత్తమభావాలతో నిండిన ఇంటి వాతావరణంలో పెరిగి, సాత్విక ఆహారం తీసుకుంటూ, బ్రహ్మచర్యం పాటిస్తూ ఉన్న యువతీ యువకులకు కలిగే సంతానం ఎంతో ఉత్తమగుణాలతో నిండి ఉంటుంది. అలా పుట్టిన సంతానానికి మంచీచెడులను ఒకరు నేర్పవలసిన అవసరం ఉండదు.ధర్మంగా జీవించాలని కూడా వారికి ఒకరు చెప్పవలసిన పని లేదు. చిన్నప్పటినుంచీ సక్రమమైనమార్గంలో వారే ఉంటారు. పైగా, పెద్దవారి తప్పులను కూడా సరిదిద్దగలరు.దానికి పూర్తీ వ్యతిరేకంగా, చిన్నప్పటినుంచీ సినిమాలు, టీవీలో హింసా సెక్సూ దృశ్యాలు, తినే తిండిలో మషాలాలు, మాంసాలు,చిన్నప్పటినుంచే తాగుడు,తిరుగుడు,పోకిరీవేషాలు, అసభ్యసంభాషణలు అలవాటు అవుతున్న నేటి యువతీయువకులకు ఎలాంటి సంతానం కలుగుతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మోడరన్ భావాల ముసుగులో దాక్కుని చాలామంది నేటి తల్లిదండ్రులు వీటిని ప్రోత్సహిస్తున్నారు అనేది ఇంకొక చేదునిజం. 

మాకుతెలిసిన ఒకఅమ్మాయి ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నపుడు, ఇంట్లోనుంచి వెళ్లి పోయి ఒక హోటల్లో నాలుగురోజులు ఉండి, వాళ్ళ క్లాస్మెట్లు  నలుగురు అబ్బాయిలతో ఎంజాయ్ చేసింది. తర్వాత మూన్నేల్లకు ఆ అమ్మాయికి కడుపు అని తేలింది. నెత్తీనోరూ బాదుకున్న ఆ తండ్రి, గుట్టుచప్పుడు కాకుండా ఆఅమ్మాయికి అబార్షన్ చేయించి, ఇంకొకడితో మూడు ముళ్ళు వేయించాడు. ఆ నలుగురు బాయ్ ప్రెండ్స్ లో అనుమానం ఉన్న ఒకడికి రౌడీలతో దేహశుద్ధి చేయించాడు. ఆ కుర్రాడు మూడునెలలు హాస్పిటల్ బెడ్లో ఉన్నాడు. ఇంతా చేస్తే ఆనలుగురిలో ఈఅమ్మాయి కడుపుకు కారణం ఎవరో ఆఅమ్మాయే చెప్పలేకపోతున్నది. ఇదంతా ఎందుకు చెబుతున్నాను అంటే, ఆఅమ్మాయి తండ్రి కూడా తక్కువవాడేమీ కాదు. అతనూ విచ్చలవిడిగా ఆడవాళ్ళతో తిరిగినవాడే. ఇప్పుడూ అతనికి తాగుడూ తిరుగుడూ అన్నిరకాల వ్యవహారాలూ ఉన్నాయి. కాని తనకూతురు దగ్గరకు వచ్చేసరికి ఆమె సతీసావిత్రిలాగా ఉండాలని ఆశించాడు. అది ఎలా సాధ్యమో నాకు అర్ధం కాదు. చాలామంది తల్లితండ్రులు ఇదే పొరపాటు చేస్తారు. తామెలా ఉన్నా తమసంతానం మాత్రం ఉత్తములుగా ఉండాలని కోరుకుంటారు. తమ జీన్స్ లోనుంచే తమ సంతానం వస్తుందని వారు మరచిపోతారో లేక గుర్తులేనట్టు నటిస్తారో అర్ధం కాదు. ఆ పిల్లల తప్పు కూడా ఏమీ ఉండదు. వాళ్ళ జీన్స్ ప్రేరేపించిన తీరులో వాళ్ళు ప్రవర్తిస్తారు. దానికి తోడు పెంపకంలో ఇరవైనాలుగ్గంటలూ ఇంట్లో చూస్తున్నపనులే వాళ్ళూ చేస్తారు. వాళ్ళను తప్పుబట్టి ప్రయోజనం లేదు.

అబ్బాయిలలోనూ అమ్మాయిలలోనూ స్వలింగసంపర్కం ఈరోజుల్లో మామూలుగా జరుగుతోంది. ఇది మరీ నీచాతినీచం. విచక్షణాజ్ఞానం లేని జంతువుకూడా ఈపని చెయ్యదు. ఇక మనిషి ఇలాటిపనులు చేస్తుంటే అతన్ని జంతువూ అంటే జంతువులు  కూడా సిగ్గు పడతాయేమో. ఇలాటి వాళ్లకు పుట్టబోయే సంతానంలో క్రిమినల్ పోకడలు తప్పకుండ ఉంటాయి. సంఘవ్యతిరేకమనస్తత్వాలూ, అసహజమనస్తత్వాలూ, సైకోలూ ఇలాగే పుట్టుకొస్తారు.కలియుగధర్మమా అని వీరికోసం న్యాయస్థానాల తీర్పులూ, వీరి హక్కులకోసం పోరాటాలూ గట్రాలూ చూస్తుంటే మనం పురోగమిస్తున్నామో లేక  తిరోగమిస్తున్నామో అర్ధం కావడం లేదు.

ఇక ప్రస్తుతవిషయానికి వస్తే, అబార్షన్లు చేయించిన లేక చేయించుకున్న కుటుంబాలు తరువాత భయంకరఫలితాలు అనుభవిస్తాయి అనడం పచ్చినిజం. నేను అనేక కేసుల్లో వీటిని కళ్ళారా చూచాను. నాకు తెలిసిన ఒక లేడీ డాక్టర్ అబార్షన్లు చెయ్యడంలో మంచిదిట్ట. ఆపని వద్దనీ అది మంచిది కాదనీ ఎందఱో చెప్పి చూచారు. కాని ఆమె వినలేదు. కారణం ఏమంటే, ఆ పనివల్ల తేరగా ఎక్కువ డబ్బు వచ్చి పడుతుంది. ఆమె ఆస్పత్రి కింద బ్లాకులో ఈ అబార్షన్లు చేసే రూం ఒకటుంది. అక్కడకు వెళితే ఎప్పుడూ ఎవరో అక్కడ ఏడుస్తున్న ఫీలింగ్ కలుగుతుంది.నేను ఒకసారి అక్కడకు వెళ్ళినపుడు ఒక్కక్షణంకూడా ఆగదిలో నిలవలేక పారిపోయినట్లు బయటకువచ్చిపడ్డాను. ఎన్నో ఆత్మలు అక్కడ గాలిలో ఏడుస్తూ తిరుతున్నట్లు నాకు అనిపించింది. తర్వాత కొన్నాళ్ళకు ఆ డాక్టర్ కుటుంబం చిన్నాభిన్నం అయిపొయింది. ఆమెకు బ్రెస్ట్ కేన్సర్ వచ్చి చనిపోయింది. ఆమె భర్త కూడా డాక్టరే. ఆయన అకస్మాత్తుగా పక్షవాతంతో మంచానపడి మరణించాడు.పిల్లలు దిక్కులేనివాల్లయ్యారు. కూతురు ఇంటర్ కేస్ట్ ( బాగా తక్కువకులం వాడిని) మేరేజి చేసుకుని ఎక్కడో ఉంటోంది. ఈ విధంగా బంగారంలాంటి సంసారం సర్వనాశనం అయిపొయింది. ఇలా జరగడానికి కారణం ఆమె చేసిన వందలాది అబార్షన్లు అని నేను నమ్ముతాను.

నాకు తెలిసిన ఒక వ్యక్తికూతురు ఇరవై ఏళ్లక్రితం MBBS  చదివి ప్రాక్టీస్ పెట్టింది. కాని ఆమె అబార్షన్లు మాత్రమె ఎక్కువగా చేసేది. కాలుజారిన పెళ్లికాని కాలేజీయువతులు గుట్టుచప్పుడుకాకుండా వచ్చి ఈమెదగ్గర అబార్షన్ చేయించుకునేవారు. ఈమెకూడా వారివద్ద డబ్బు బాగా గుంజుతూ లీగల్ గా వారికి సహకరించేది. తర్వాత వాళ్ళు పెళ్లిచేసుకుని అమాయకంగా నటిస్తూ జీవితంలో సెటిల్ అయిపోయేవారు.ఇది మంచిపని కాదని, చెయ్యొద్దనీ  నేను చాలాసార్లు చెప్పాను. ఆమె వినలేదు. విచిత్రమేమంటే, ఆమె తండ్రి నాకు స్నేహితుడు. అతనే ఈఅమ్మాయి చేత ఈ క్లినిక్ ఓపన్ చేయించి ఇలాంటి పనులు చేయించేవాడు.తర్వాత కొన్నేళ్ళకు ఆ అమ్మాయికి పెళ్లయింది. మొగుడితో భయంకరంగా గొడవలు అయ్యి కోర్టుకెక్కి, విడిపోయి ఇద్దరూ ఇప్పుడు తలోదారీ చూసుకున్నారు. ఈ అమ్మాయి ఆరోగ్యం బాగా పాడై పోయింది. ప్రస్తుతం ఎక్కడుందో తెలియదు. ఈ తండ్రికూడా చాలాకష్టాలలో కూరుకుపోయి ఉన్నాడు. ఇతనికి కూడా ఆరోగ్యం బాగా దెబ్బతిన్నది.ఆకుటుంబంకూడా చిన్నాభిన్నం అయిపొయింది.

అప్పటివరకూ చక్కగా సాగుతున్న సంసారాలు తెలిసోతెలియకో చేయించుకున్న  అబార్షన్ తర్వాత చిన్నాభిన్నం కావడం చాలాసార్లు చూడవచ్చు. కాకపోతే దీనికీ దానికీ లింకులు అర్ధం చేసుకోవడం చాలామందికి సాధ్యం కాదు. ఎందుకంటే ఈ దృష్టి కోణాలు అందరికీ అలవాటు ఉండవు. ఈ విషయంలో మనకంటే పల్లెటూరివాళ్ళు చాలా మేలుగా ఉంటారు. వాళ్ళు ఇలాంటివాటిని భలే ఖచ్చితంగా గుర్తుపట్టి, 'ఈ పని చేసిన దగ్గరనుంచే ఇలా మనింట్లో చెడు జరుగుతోంది' అని గుర్తుపట్టగలుగుతారు. చదువుకున్న నవీనులు  తెలివిగలవాల్లమనీ అన్నీతెలుసనీ విర్రవీగుతూ ఇలాంటి తిక్క తిక్క పనులు చేసుకుని ఖర్మలు అనుభవిస్తుంటారు.

అబార్షన్లు చేసిన డాక్టర్లకూ,చేయించుకున్నవారికీ,చేయించినవారికీ భయంకరఖర్మలు కట్టి కుడుపుతాయి. అవి అనుభవించేటప్పుడు అర్ధం అవుతుంది తాముచేసింది ఎంతటితప్పో అనే విషయం. కాని అప్పటికే సమయం మించిపోతుంది.ఇదంతా చెబితే చాలామందికి సోదిలా కనిపిస్తుంది.కాని ప్రకృతిధర్మాలు మనం నమ్మినా నమ్మకున్నా జరుగుతూనే ఉంటాయి. ధర్మమూర్తి అయిన కర్మసాక్షి ఎవరికి ఇవ్వాల్సిన ఫలితాలు వారివారి కర్మానుసారం వారికి ఇస్తూనే ఉంటాడు. కళ్ళు తెరిచి గ్రహించేవాడు జాగ్రత్తగా జీవిస్తాడు. అహంకారంతో విర్రవీగేవాడు కాలక్రమేణా ఫలితాలు అనుభవిస్తాడు.

భ్రూణహత్య అనేది మహాపాపం అనీ, దాని ఉసురు తప్పకుండా తగులుతుందనీ, దాని ఫలితాలు చాలా దారుణంగా ఉంటాయనీ దాన్ని చేయించుకునే వాళ్ళూ చేసే డాక్టర్లూ కూడా గ్రహిస్తే మంచిది. తస్మాత్ జాగ్రత.

ఈ పోస్ట్ చదివిన ఒక మిత్రురాలు మెయిల్ ద్వారా కొన్ని ఆసక్తికరమైన అంశాలు లేవనెత్తారు. ఒక అమ్మాయి చెరచబడి గర్భం దాలిస్తే అప్పుడు ఆమె ఏమి చెయ్యాలి? ఆ కడుపును ఉంచుకొని బిడ్డను కని జీవితాంతం పెంచాలా? ఆబిడ్డను రోజూ చూస్తూ తన మానసిక క్షోభను రోజూ రెన్యూవల్ చేసుకోవాలా? అలాగే, పిండం సక్రమంగా పెరుగుతోందా లేదా అన్నది తెలుసుకునే సాంకేతిక వ్యవస్థలు నేడు మనకు ఉన్నాయి. పిండంలో నయంకాని లోపాలు భయంకరరోగాలు ఉన్నాయి అని తెలిసినప్పుడు అబార్షన్ చేయించవచ్చా లేదా అనేది కూడా వివాదాస్పద అంశమే. కాకుంటే ఒక్కవిషయం గుర్తుంచుకోవాలి. కారణాలు ఏవయినా కావచ్చు. ఎవరి కారణాలు వారికి ఉండవచ్చు. కాని ఒక ప్రాణిని మొగ్గలోనే తుంచితే దానిఖర్మ మాత్రం అనుభవించక తప్పదు. దీనికిమాత్రం ప్రకృతిలో మినహాయింపు  లేదు. ప్రకృతిన్యాయస్థానంలో మనవాదనలు ఏమాత్రం నిలబడవు అనీ, ఆ కోర్టులో 'కంటికి కన్ను పంటికి పన్ను' అనేదే తీర్పు అన్న విషయం గుర్తుంచుకోవాలి.

జ్యోతిష్య విజ్ఞానంలో ఇటువంటి దోషాలను కనుక్కునే పద్దతులు ఉన్నాయి.   ఒక జాతకంలోని ప్రేతశాపాలను కనుక్కునే విధానాలు మహర్షి పరాశరులు తన 'హోరాశాస్త్రం'లోఇచ్చారు. చంపబడిన పిండం ప్రేతంగా మారుతుంది. దాని శాపం వీరికి తగులుతుంది. కనుక ఆయా దోష ఫలితాలు వీరిని తరతరాలు ( ఆ దోషం నివారణ అయ్యేంతవరకూ) వెంటాడతాయి. సామాన్యంగా వీటివల్ల సుతక్షయం జరుగుతుంది. అంటే వీరి పిల్లలు చనిపోవడం జరుగుతుంది. వాటిని తెలుసుకుని రెమెడీస్ పాటించి ఆయాదోషాలను తొలగించుకుంటే అప్పటినుంచీ జాతకుని జీవితం బాగుంటుంది. అసలు ఇలాంటి పనులు చెయ్యకుండా ఉండటం ఉత్తమం. చేసిన తర్వాత ఇంకేమీ చెయ్యలేము గనుక రెమెడీస్ పాటించడమే ఎవరైనా చెయ్యగలిగింది.