ఈమధ్య అనుకోకుండా హటాత్తుగా అహోబిలం, యాగంటియాత్ర చెయ్యవలసి వచ్చింది. ఆ క్షేత్రాధిదేవత పిలుపు వస్తే తప్ప, నా అంతట నేను ఏ యాత్రా చెయ్యను. అలాటి పిలుపు ఇప్పుడు అహోబిలం నుంచి వచ్చింది. యాగంటి ఇంతకుముందు చూచాను.కాని అహోబిలం ఇప్పటిదాకా చూడలేదు. రెండూ రాయలసీమలోనివే. కర్నూలు జిల్లాలో ఉన్నాయి. రాయలసీమ అంటే నాకు చాలా ఇష్టమైనప్రదేశం గనుక యాత్ర అంతా ఆనందంగా జరిగింది.
అహోబిలం అనేది నవనారసింహక్షేత్రం.ఇక్కడ తొమ్మిది నరసింహ దేవాలయాలున్నాయి. దిగున అహోబిలంలో మూడు, ఎగువ అహోబిలంలో ఆరు, మొత్తం తొమ్మిది నృసింహదేవళాలున్న క్షేత్రమిది.దీనిని తమిళంలో తిరుసింగవేల్ కుండ్రం అంటారు. అహోబిలపీఠంలో స్వాములు తమిళులు. వీరిని 'మహాదేశికన్' అంటారు. అంటే మహాగురువు అని అర్ధం. వీరందరూ విశిష్టాద్వైత పరులు. కొండొకచో ద్వైతులూ ఉంటారు.
"ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుర్నమామ్యహం"- అంటూ నవనారసింహులనూ స్తుతించే శ్లోకం బహుప్రసిద్ధం.
అహోబల నృసింహస్తుతి
లక్ష్మీకటాక్షసరసీరుహరాజహంసం
పక్షీంద్రశైలభవనం భవనాశమీశం
గోక్షీరసార ఘనసార పటీరవర్ణం
వందే కృపానిధిం అహోబలనారసింహం
ఆద్యంతశూన్యమజమవ్యయ మప్రమేయం
ఆదిత్యచంద్రశిఖిలోచన మాదిదేవం
అబ్జాముఖాబ్జ మదలోలుప మత్తభ్రుంగం
వందే కృపానిధిం అహోబలనారసింహం
కోటీరకోటి ఘటికోజ్జ్వల కాంతికాంతం
కేయూరహారమణికుండల మండితాంగం
చూడాగ్రరంజిత సుధాకరపూర్ణబింబం
వందేకృపానిధిం అహోబలనారసింహం
వరాహవామననృసింహసుభాగ్యమీశం
క్రీడావిలోలహృదయం విభుదేంద్రవంద్యం
హంసాత్మకం పరమహంసమనోవిహారం
వందేకృపానిధిం అహోబలనారసింహం
మందాకినీ జననహేతుపదారవిందం
వృందారకాలయ వినోదనముజ్జ్వలాంగం
మందారపుష్పతులసీరచితాన్ఘ్రిపద్మం
వందే కృపానిధిం అహోబలనారసింహం
తారుణ్యకృష్ణతులసీదళదామరాభ్యాం
దాత్రీరమాభిరమణం మహనీయరూపం
మంత్రాదిరాజ మతదానవమానభంగం
వందేకృపానిధిం అహోబలనారసింహం

నరసింహస్వామి యొక్క బలాన్ని తేజస్సునూ ఉగ్రరూపాన్నీ చూచిన దేవతలు 'అహో! బలం, అహో! బలం' అని ఆశ్చర్యంతో ఘోషించినందువల్ల ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చిందని అంటారు. అదే కాలక్రమేణా అహోబిలం అయిందని ఒక గాధ ఉన్నది.


నరసింహస్వామి యొక్క బలాన్ని తేజస్సునూ ఉగ్రరూపాన్నీ చూచిన దేవతలు 'అహో! బలం, అహో! బలం' అని ఆశ్చర్యంతో ఘోషించినందువల్ల ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చిందని అంటారు. అదే కాలక్రమేణా అహోబిలం అయిందని ఒక గాధ ఉన్నది.

దిగువ అహోబిలం కొండకింద సమతలప్రదేశంలో ఉంటుంది. ఎగువఅహోబిలం కొండమీద అడివిలో ఉంటుంది. పైవరకూ కారు,బస్సు పోతున్నాయి. అక్కడ నుంచి కొన్ని మెట్లు ఎక్కవలసి ఉంటుంది. అక్కడ ఒకగుహలో నరసింహస్వామి స్వయంభూవిగ్రహం ఉన్నది.ఎగువ అహోబిలానికి ఇంకాపైగా కనిపించే కొండలెక్కి పైకి కొన్నికిలోమీటర్లు పోతే అక్కడ హిరణ్యకశిపుని కోట శిధిలావస్థలో కనిపిస్తుందట.అక్కడ నృశింహస్వామి ఉద్భవించిన స్థంభంకూడా ఉందని చెబుతారు.అక్కడే ప్రహ్లాదుడు విద్యనభ్యసించిన గురుకులంకూడా ఉందని అహోబిలమఠంలోని వారు చెప్పారు. మొత్తం ప్రహ్లాదచరిత్ర అంతా జరిగినప్రదేశం ఇదే.దీనిని రాజధానిగా చేసుకుని హిరణ్యకశిపుడు పరిపాలించేవాడు.చుట్టూ చాలాఎత్తైన కొండలతో శత్రుదుర్భేద్యంగా ఉంటుంది. ఇదంతా తిరిగి చూడాలంటే రెండుమూడురోజులు పడుతుంది. ఇదంతాకూడా,బాగా నడవగలిగినవారైతేనే చూడగలరు. కాళ్ళనెప్పులు, కీళ్ళనొప్పులున్నవారు తిరగడం కష్టమే.

వీరిలో 1.భార్గవనరసింహుడు సూర్యునికీ,2.కారంజనరసింహుడు చంద్రునికీ,3.జ్వాలానరసింహుడు కుజునికీ,4.పావననరసింహుడు బుధునికీ,5. అహోబలనరసింహుడు గురువుకూ. 6. మాలోల నరసింహుడు శుక్రునికీ, 7.యోగానందనరసింహుడు శనికీ, 8. క్రోధనరసింహుడు రాహువుకూ, 9.క్షత్రవటనరసింహుడు కేతువుకూ అధిదేవతలని ఇక్కడ చెబుతారు.ఆయా గ్రహబాధలున్నవారు ఆయారూపాలలో నృసింహస్వామిని పూజించితే ఆ గ్రహబాదలనుంచి విముక్తి కలుగుతుంది.



ఈ అరణ్యంలో పులులూ సింహాలూ ఎలుగుబంట్లూ ఉన్నప్పటికీ ఎప్పుడూ ఎవరినీ దాడిచేసి గాయపరచిన దాఖలాలు లేవు. నృసింహ నామస్మరణతో క్రూరమృగాల నుంచి కూడా రక్షణ కలగటం నిజమేనని ఇక్కడివారు నాతో చెప్పారు.
అగ్నితత్వస్వరూపుడైన కుజుడు ఆత్మకారకునిగా సింహరాశిలో ఉన్న జాతకులు నృసింహాంశను తమలో కలిగిఉంటారు. ఎదిరించిన అధర్మంపట్ల వారికి దుస్సహమైన కోపం క్షణకాలం కలిగినప్పటికీ, లోపల పరమశాంతస్వభావులై, యోగనిష్టాపరులై ఉండటం చూడవచ్చు. వీరిలో ఉన్న ఈ పరస్పర వైరుధ్యాలను అర్ధం చేసుకోలేనివారు వీరిని కోపిష్టులని భావించడమూ సహజమే. కాని నిజం అది కాదు.ఇట్టివారికి నృసింహోపాసన ఉంటుంది. వారికి కలిగే ఉగ్రం నృసింహోపాసనా ఫలితం. కాని అది తాటాకుమంటవలె వెంటనే చల్లారి పోతుంది. ఇదే విధంగా మిగతా గ్రహాలనూ అర్ధం చేసుకోవచ్చు.
నృసింహోపాసన చాలా అద్భుతమైనది. దుష్టగ్రహాల పీడలకు దీనిని మించిన ఉపాసన లేదు. శంకరుల జీవితంలోకూడా,కాపాలికుని బారినుండి నృశింహస్వామి ఆయన్ను రక్షించడం చూడవచ్చు. త్వరలోనే మళ్ళీ అక్కడకు వెళ్లి రెండుమూడురోజులు ఎగువ అహోబిలంలో జపధ్యానాలలో గడపాలని నిశ్చయించుకొని వెనుదిరిగాను.
(వచ్చే పోస్ట్ లో యాగంటి విశేషాలు)
నృసింహోపాసన చాలా అద్భుతమైనది. దుష్టగ్రహాల పీడలకు దీనిని మించిన ఉపాసన లేదు. శంకరుల జీవితంలోకూడా,కాపాలికుని బారినుండి నృశింహస్వామి ఆయన్ను రక్షించడం చూడవచ్చు. త్వరలోనే మళ్ళీ అక్కడకు వెళ్లి రెండుమూడురోజులు ఎగువ అహోబిలంలో జపధ్యానాలలో గడపాలని నిశ్చయించుకొని వెనుదిరిగాను.
(వచ్చే పోస్ట్ లో యాగంటి విశేషాలు)