“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

25, ఫిబ్రవరి 2012, శనివారం

విస్మృత యాత్రికుడు

శాంతి కొఱకై వెదకితి నెన్నొ ఏండ్లు
దిక్కులన్నిట జూచితి నీడ కొరకు
అర్ధమయ్యెను కడకొక్క సత్యమింక   
నేను వెదకెడి శాంతియు నీడ నేనె

శాంతి లేదెంత వెదకిన నా యందుదప్ప  
బహువాకిళ్ళ బిచ్చమెత్తితి ప్రేమకొరకు
పరువులెత్తితి కోరితి దాహశాంతి   
లేదెచటనోయది నా హృదంతరాలపు సీమదప్ప

తీర్ధ యాత్రల దిరిగితి అనుగ్రహార్ధినై 
ఎంత మూర్ఖుడ నేను?
వెదకుచుంటిని సుదూరసీమలందు
హృదయాగాధపు లోతుల నెపుడు
వెలుగుచున్నట్టి శాంతిని కానలేక 
ఎంత మూర్ఖుడ నేను?
యోజనములు పరుగిడి వెదకుచుంటి
నిజయాత్ర నాలోన వేచియుండ

కస్తూరి జింక తన సుగంధ భ్రాంతి చేత 
వనమునంతయు దిరిగి వేసారినట్లు 
నావ కొసను నిలచియున్న పక్షికి 
నీడ చూడగ నెక్కడ దొరకనట్లు  
కొలనిలోన విహరించెడు  మీనుకేమొ
దాహ భ్రాంతిని గొంతెండి పోయినట్లు 

ఏ గృహపు ముంగిట నింక నర్ధించబోను
ప్రేమార్దినై వెతల నందబోను
వెదకులాటలు ప్రయాస వేసరములు 
స్వచ్చమౌ ప్రేమ లేదను మాట నిజము.

ప్రేమకోరకై బిచ్చమెత్తితి వీధులందు 
స్వార్ధమే కనిపించే నన్నిచోట్ల 
ప్రేమముసుగున, నింక ఈ ఆట చాలు
విరమించెద నీ జూదక్రీడ ఇదియె మేలు

ఆశ పెకలించి నాలోనె విశ్రమింతు 
ఎవరినైనను ఇకనేమి కోరబోను
ఎంత యద్భుత మిది జూడ ఏమి వింత 
ముగియనున్నది యుగయుగాల వెదుకులాట 

ఎంత మూర్ఖుడ నేను?
వేచి యుంటిని నీకొరకు వేలఏండ్లు 
రమ్ము నాయెద్ద కంచును చేయిసాచి 
వెదకుచున్నది నాలోనె దాగియుండ
వెదకుచుంటిని లోకాన వేసరిల్లి 

మృతిని పొందితి నెంతయు నెన్నొమార్లు
మరల పుట్టితి జూడగ నన్నిసార్లు
పరువులెత్తితి మరీచిక వీధులందు 
తేటయయ్యె సత్యమిపుడు తేరిచూడ

ఇంతకాలము నేనిట వెదకు ప్రేమ 
నిలిచియున్నది నాలోన మౌనముగను
చేయి సాచుచు రమ్మను తల్లివోలె 
వేయి తప్పులు క్షమియించు తల్లివోలె 

ప్రేమించినంతసేపు నా చిన్నబ్రతుకును
చావు వెంటాడె నన్ను నా నీడవోలె 
నాఇల్లు వదలి నే బయలు వెడలినపుడు 
లోకమే నా ఇల్లయి నిలచేనిపుడు

మృతికి వెరువను నేనిక ఎన్నడైన
దాని రమ్మంటి నావైపు చేయి సాచి
మిత్రుడయ్యెను నాకది ఏమి వింత?
బోధించెనొక నిగూఢరహస్యము నిశ్చయముగ
చావు బ్రతుకులనన్నిటి మించి వెలుగు
విశ్వజీవితజ్ఞానము తెల్లమయ్యె  

స్వప్నముల చిక్కుట కల్ల ఇంక
దేబిరించుట లెల్లను దూరమయ్యె
రుతువులోచ్చును పోవును రోజుమారు 
పెరిగి తరుగును లోకము లీలయందు 
నాయందు నేనుందు నిశ్చలముగ
నిర్మలాకాశరీతిని నెమ్మదించి 

నియమాల నన్నిటి నే ధిక్కరింతు
సాగెద జీవితాన నా ఇష్టరీతి
నేనొక ఉన్మత్తుడనని తలచిరి లోకులెల్ల  
తలువనిమ్ము వారికి తోచినట్లు 
నాకు తెలియును నాదగు తత్వమేమొ 

చల్లగాలుల నేనిక సాగిపోదు
వేడిగాడ్పుల జేసెద నాట్యరవళి
సాగిపోయెడి  మబ్బుల తేలిపోదు
కురియు వానల జల్లుల నేలబడుదు
భూమిలోపల కింకుచు దాగిపోదు 
గగనసీమల రేగుచు విక్రమింతు 
మృతిని మించుచు లేచెడి పక్షివోలె

జీవనుల యందలి జీవితమ్ము నేను
మృతుల ఘూర్ణించు తమోగుణధృతియు నేనె
జీవనమ్మున రేగేద విస్తరించి
ముదము నొందెద మృతిలోన మునిగియుండి

వర్షధారల నర్తించు వృక్షమేను
గగనసీమల పారెడి మబ్బు నేను
స్థిరత నిలచెడి పర్వతరాజమేను
సంద్రమును చేర పరువెత్తు నదిని నేను

ప్రేమికుల గాఢ పరిష్వంగసుఖము నేనె
నిరాశాదృక్కుల దోచు ఎడారి నేనె        
దిక్కులేని బతుకుల వ్యధయు నేనె  
ధన్యజీవుల జీవనతృప్తి నేనె
కష్టజీవుల కడగండ్లపాట్లు నేనె
చక్రవర్తుల రాజసదీప్తి నేనె

గగనసీమల సాగెడి పక్షి నేను
సంద్రమున ఈదెడి మీను నేను
భీకరమ్ముగ చెలరేగి బాధపెట్టు
మృత్యువిహ్వల ప్రచండమూర్తి నేను 
జగతి నిదురించు నిశీధ సమయమందు 
నిద్రలేకుండ రాజిల్లు మౌనమేను   

ఏకాగ్రచిత్తుడౌ యోగి నేత్రాలలో 
తెరపులేక జ్వలించు ఎరుక నేను
కాటికేగెడి శవాల తోడునీడ
సాగిపోయెడి మృత్యువు చాయ నేను

కొండలోయల ఆనందనృత్యమాడు 
పిల్లగాలుల తేలెడి పువ్వు నేను
శిశిరఋతువున పండుచు రాలిపోవు
మట్టి కలసెడి విశీర్ణ పత్రమేను 

తనదు బిడ్దను ముద్దిడు తల్లియందు
కరగిపోదును నేనిక ప్రేమ నగుచు 
ప్రేమతాపపు మంటల కాగిపోవు 
యువకరక్తపు ఎర్రనిఛాయ నేను
ప్రేమ బెంచిన సుతుల చీదరింపులతో
కుమిలి ఏడ్చెడి వార్ధక్యవ్యధలు నేను   

గుండెలోతుల ధ్వనియించు నాదమేను
ధ్యాని చవిచూచు ఆనందసీమ నేను
స్వప్నసీమల తోచెడి వెలుగు నేను
చెక్కుచెదరని యోగుల దృష్టి నేను

బ్రహ్మచారుల తేజపు వెలుగు నేను
పైకిలేచెడి యోగపు శక్తి నేను
సాదుమూర్తుల పవిత్రదీప్తి నేను
జ్ఞానిచూపుల కరుణాసంద్రమేను

సూర్యకాంతుల నాట్యమొనరింతు నేను  
మృతిని బోలెడు రాత్రుల విశ్రమింతు
వీరయోధుల శక్తియు యుక్తి నేను
ఓడిపోయెడి వారల సిగ్గు నేను

యాచకుని ఆకలి యందు నుందు
ధనపు మదమున తూలెడి మత్తు నేను
యవ్వనమ్మున రేగెడి శక్తి నేను
వణకుచుండెడి వార్ధక్యస్తితిని నేను
శిశువు కన్నుల మెరసెడి నవ్వు నేను
శక్తిహీనత పడియుండు శవము నేను

రాత్రిచుక్కల మెరపుల మేళవింతు
సాంద్రఘోషల నెగసెడి  శబ్దమేను
మంద్రగతి సాగెడి నదిని నేను
సడిలేక నిలచు గంభీరసంద్రమేను

లోకరీతుల నన్నిట నేనె యుందు  
అష్టదిక్కుల నిండెద విస్తరించి
వేడినిచ్చెడి వెలుగులరేడు నేను
చల్లచల్లని చందురు కాంతి నేను 
 
మౌనధ్యానపు లోతుల ఉబికివచ్చు
స్వర్లోక సుమధుర గానమేను  
రాత్రిఝాముల నిశ్శబ్దసీమయందు
వినగవచ్చెడి వేణువు నాదమేను    

ముసిగ నవ్వెడి ముగ్ధంపు శిశువు నేను
కామజ్వాలల తపియించు కాంక్ష నేను
కర్రయూతాన వణకెడి ముసలి నేను
చితిని మండెడి నికృష్టశవము నేను

కసాయి కత్తి కరకుదనము నేనె
గొంతు తెగిపోవు జంతువు గూడ నేనె
కుష్టురోగుల వ్రణముల రసిని నేను  
నష్టలోకపు నిరాశ ఛాయ నేను.

తల్లిపాదాల చెంతన నేర్చుకొంటి 
ధన్యజీవిత రహస్యజ్ఞానమేల్ల
బ్రతుకుటెట్టులో మరి చచ్చుటెట్లో   
నేర్పే మాయమ్మ తన జీవయాత్ర చేత
     
అమ్మ మాటల నెప్పుడు ఆచరించి
బ్రతికేదను రోజు మరియును చత్తునట్లే
జీవింతు ప్రతిక్షణము మరుక్షణమున చత్తునటులే
బ్రతికియుందును మృతియందు చిత్రముగను

మృతిని బొందెద ప్రతిరోజు మానకుండ    
తిరిగిలేచేద మరునాడు శిశువువోలె 
తేటకన్నుల చూచెద లోకమెల్ల
అమ్మ నేర్పిన రహస్యజ్ఞానమిదియె

జోలపాటల నూగితి నెన్నొమార్లు
కాలిపోయితి చితిలోన అన్నిసార్లు
కనులు తెరచితి నిప్పుడు నిశ్చయముగ 
కనుక వాటి చాయలకింక పోను

స్వప్నభ్రాంతిని బోలెడు లోకమెల్ల 
కనుల ముందర కదలాడి సాగిపోవు
నన్ను తాకంగ దానికి శక్తిలేదు      
చూతునన్నిటి నొక మౌనసాక్షి వోలె
మూలనిలచిన అదృశ్యఆత్మ వోలె

సాటిజీవుల బాధలు పట్టకుండ
పూజచేయగ చూచి నవ్వుకొందు
మార్పులేనట్టి జీవనరీతి జూచి
పొరలి నవ్వుదు నెంతయు వేడ్కతోడ
గుడ్డిగురువుల చేష్టల గుర్తుబట్టి
నవ్వుకొందును వారల గతులనెరిగి  

సురలనొల్లను, నెప్పుడు చూడబోను
వారలందరు నన్నిట వదలిపోరు
ధిక్కరింతు నందరి పొండు పొండనుచు       
కాని అంతయు నాదె ఇదియె వింత 

అడిగిరేవ్వరొ నన్ను-- గుడులు గోపురాలు తిరుగవేల?
అతనినడిగితి నోక్కగు వింత ప్రశ్న
మనిషి హస్తము తాకని దేవళమును 
చూపుమా పరుగెత్తిపోయేద నచటికంచు

ఒకరనిరి నాతోడ ఒక్కరోజు
పూజమానిన నరకాన పడేదవంచు
పొరలినవ్వితి వానిజూచి పక్కుమంచు
స్వర్గనరకాలు నాలోని కలలు జూడ      
ఎచటికేగేద నేను? ఎట్లు బోదు?

జనులు నవ్విరి నన్నుజూచి
పనికిమాలిన వాడవు నీవటంచు
నేనును నవ్వితిని వారిజూచి
నిజము మీరలు చెప్పెడి మాట నిజము   

పనులన్నియు నన్ను విడచి పారిపోయె
సర్వనక్షత్రసీమల నావరించు
శూన్యమునదూరితి శూన్యమైతి
పనికిమాలినవాడనె పచ్చినిజము

నాదుకన్నుల దోచెడి శూన్యదృష్టి
జనులమనమున భయమును దోపచేయు
వారు నన్నొక జడుడవనిరి
నేను నవ్వెద వారల శ్రుతిని గలిపి
పొరలి నవ్వెద లోకుల పాటుజూచి

చంపువాడును మరియిక చచ్చువాడు
చంపు క్రియయును ఈమూడు కలసిపోయి
కలల రీతిని నాలోనె  కానుపింప    
ఏమి చేయంగ గలవాడనింక నేను?

లోకలీలను చూచుచు సంతసింతు
అంతరంగాన నవ్వుల తేలిపోదు
ఉన్నవన్నియు లోకాన చక్కగానె
చావుపుటకల జూచితి నే జన్మయందో
మరచిపోయితి వానిని ఇప్పుడింక