“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

20, జులై 2017, గురువారం

సెవెంత్ హౌస్ వెంకటేశ్వరరావు - SHV

మొన్న ఏదో పనిమీద బజారుకెళితే రోడ్డుమీద ఆప్కో శాస్త్రిగారు కలిశాడు. ఈయన ఆప్కోలో పనిచేసి విరమించాడు. 'అందరూ నన్ను ఆప్కో శాస్త్రి ఆప్కో శాస్త్రి అంటూ ఉంటారుగాని నేను ఏదీ ఆపుకోలేను, ఎందుకంటే నాకు షుగరుంది మరి' అని జోకులేస్తూ ఉంటాడు. కనిపించి చాలా నెలలైంది గనుక తన కుటుంబ విషయాలూ మిత్రుల విషయాలూ చెప్పుకొచ్చాడు. ఆ సందర్భంలోనే సెవెంత్ హౌస్ వెంకటేశ్వరరావుగారు నవంబర్ లో చనిపోయాడని కూడా చెప్పాడు. చివరలో ఆయనకు పెరాలిసిస్ వచ్చిందని చెప్పాడు.

సెవెంత్ హౌస్ వెంకటేశ్వరరావుగారికి ఆ పేరును నా ఇంకో మిత్రుడు వెంకటాద్రి పెట్టాడు. ఆయన్ను మేము క్లుప్తంగా SHV అని పిలిచేవాళ్ళం. "అదేం పేరు? SHV ఏంటి అసహ్యంగా, HIV అన్నట్టు?" అని ఆయన అంటూ ఉండేవాడు. కానీ మేమాయన్ని అలాగే పిలిచేవాళ్ళం.

SHV కి జ్యోతిష్యం ఒక మోస్తరుగా వచ్చు. కానీ ఆయన దృష్టీ రీసెర్చీ అంతా సెవెంత్ హౌస్ మీదనే జరిగేది. ఆయన ఉండటం కూడా అరండల్ పేట ఏడో లైన్ లోనే ఉండేవాడు.

జాతకంలో ఏయే యోగాలుంటే గర్ల్ ఫ్రెండ్స్ ఎక్కువగా ఉంటారు? ఏయే యోగాలుంటే ఎక్స్ట్రా మారిటల్ ఎఫైర్స్ ఉంటాయి? అవి ఏయే సందర్భాలలో జరుగుతాయి? మొదలైన విషయాలలో ఆయన కొన్నేళ్ళ పాటు చాలా రీసెర్చి చేశాడు. తన జీవితంలోని సెక్సువల్ ఎడ్వెంచర్స్ ను సమర్ధించుకోడానికీ, తప్పు నాది కాదు గ్రహాలది అని చెప్పడానికీ ఆయన జ్యోతిష్యం నేర్చుకున్నాడని వెంకటాద్రి నవ్వుతూ అనేవాడు.

వెంకటాద్రీ ఈయనా కలసి ఒక విచిత్రమైన జ్యోతిష్య రీసెర్చిని కొన్నేళ్ళపాటు చేసి కొన్ని సూత్రాలను కనుక్కున్నారు. వాటిని ఉపయోగించి ఒక వ్యక్తి జీవితంలో ఫస్ట్ సెక్సువల్ ఎక్స్ పీరిఎన్స్ ఎప్పుడు జరిగింది. ఎలా జరిగింది? ఏయే పరిసరాలలో, ఏ వాతావరణంలో, ఎవరితో జరిగింది? మొదలైనవి ఖచ్చితంగా చెప్పగలిగేవారు. వాళ్ళ ఎనాలిసిస్ చాలా సరదాగా ఉండేది. వాళ్ళ టెక్నిక్ ను నాతో చెప్పారు. దానిని నేను ఫైన్ ట్యూన్ చేసి వాళ్లకు ఇచ్చాను.

ఇలాటి రీసెర్చి చేసి ఉపయోగం ఏముంది? కాస్త ఉపయోగపడేది చెయ్యండయ్యా అని నేను వాళ్ళతో అనేవాణ్ణి గాని వాళ్ళు వినేవాళ్ళు కాదు. వాళ్లకు ఇష్టమైన సబ్జెక్ట్ సెవెంత్ హౌస్ కాబట్టి దానిమీదే వాళ్ళ దృష్టంతా ఉండేది.

వీళ్ళిద్దరూ సెవెంత్ హౌస్ వీరులే. వెంకటాద్రిగారు 2004 లో చనిపోయాడు. SHV ఏమో 2016 లో పోయాడు. వీళ్ళు నాకంటే దాదాపు ఇరవై ఏళ్ళు పెద్దవాళ్ళు. మొదటినుంచీ అదేంటోగాని అలాంటి వాళ్ళతోనే నాకు స్నేహం ఉండేది. నాలుగైదు ఏళ్ళ క్రితం వరకూ నాతో బాగానే టచ్ లో ఉండేవాడు SHV. శంకర్ విలాస్ సెంటర్లోనో లేకపోతే అరండల్ పేట ఏడో లైన్ మొదట్లోనో ఎక్కడో ఒకచోట కూచుని ఉండేవాడు. నేను అటూ ఇటూ పోతూ కనిపిస్తే కూచోమని చెప్పి, కాఫీ తెప్పించి, ఇక ఆయన సోదంతా నాతో చెబుతూ ఉండేవాడు.

ఈ రిటైరైన వాళ్లకు వేరే పని ఏమీ ఉండదు. వాళ్లమాట ఎవరూ వినరు. వాళ్ళను పట్టించుకోరు. పాపం శ్రోతలు కనిపిస్తే ఇక వాళ్ళ సోది మనకు చెబుతూ ఉంటారు. పోనీలే మనకు పోయేదేముందని కాసేపు ఆయన మాటలు వినేవాడిని. ఆ తర్వాత, "ఇంకా ఎందుకండీ మీకివన్నీ? నామాటలు కాస్త ఇప్పుడన్నా వినండి" అంటూ మన వేదాంతధోరణి మొదలు పెడితే అది వాళ్లకు నచ్చేది కాదు. అందుకని 'సరే వెళ్ళిరండి' అనేవాడు.

నా మార్గంలోకి వాళ్ళను తెద్దామని విశ్వప్రయత్నం చేశాను. కానీ వాళ్ళు రాలేకపోయారు. ఒక జీవికి నెగటివ్ కర్మ బలంగా ఉన్నప్పుడు మన దారిలోకి వాళ్ళు రాలేరు. వాళ్ళ కర్మ వాళ్ళను రానివ్వదు. కర్మ అంత బలంగా ఉన్నప్పుడు నేను చెయ్యగలిగేది కూడా ఏమీ ఉండదు.

నాతో టచ్ లో ఉన్నంత వరకూ ఆయన బాగానే ఉండేవాడు. తనకు జరుగుతున్న దశలు చూపించి రెమేడీలు అడిగేవాడు. నాకు తోచినవి చెప్పేవాడిని చేసుకునేవాడు. మొత్తం మీద బాగానే ఉండేవాడు. నాతో ఎప్పుడైతే దూరం అయ్యాడో అప్పటినుంచీ ఆయనకు బ్యాడ్ టైం మొదలైంది. చివరకు మొన్న నవంబర్ లో పోయాడని తెలిసింది. పోయేముందు కూడా డబ్బుపరంగా, ఫేమిలీ పరంగా చాలా బాధలు పడ్డాడని తెలిసింది.

ఏది ఏమైనా, మనిషి దుర్మార్గుడు కాదు. ఒకరిని ముంచి మనం బాగుపడాలి, ఎవరేమై పోయినా నేను బాగుండాలి, ఎదుటివారిని నా స్వార్ధానికి వాడుకోవాలి అన్న మనస్తత్వం కాదు ఆయనది. అందుకే కొన్నాళ్ళు కాకపోతే కొన్నాళ్ళైనా నాతో స్నేహం కలిగింది.

నేను ఒక విచిత్రాన్ని చాలాసార్లు గమనించాను. మొదట్లో నాకు దగ్గరగా ఉండి తర్వాత దూరమైన చాలామంది చాలా బాధలకు గురవ్వడం నేను చూస్తున్నాను. దానికి కారణం ఏమంటే - సరియైన మార్గదర్శనం ఇచ్చే మనిషిని వాళ్ళు కోల్పోవడమే. జీవితంలో ఇది చాలా పెద్ద లాస్. కానీ అది తర్వాత ఎప్పుటికో గాని వాళ్లకు అర్ధం కాదు. అది అర్ధమయ్యేనాటికి ఇక చేసేది కూడా ఏమీ ఉండదు. బహుశా ఖర్మ దశలు వచ్చినప్పుడు అలా దూరంగా పోవాలని వాళ్లకు బుద్ధి పుడుతుందేమో?

SHV ఆత్మకు శాంతి కలగాలని శ్రీరామకృష్ణులను ప్రార్ధిస్తున్నాను.