“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

4, జులై 2017, మంగళవారం

అమెరికా జనజీవనం - నా అభిప్రాయాలు - 2

స్వార్ధపూరిత సమాజం

అమెరికా ఒక కేపిటలిస్ట్ దేశం. అక్కడ డబ్బే మాట్లాడుతుంది గాని మనుషులు మాట్లాడరు. నీ దగ్గర డబ్బు లేకపోతే అమెరికాలో ఎవరూ నీతో మాట్లాడరు. డబ్బు లేకపోతే మన దేశంలో ఏదో ఒక రకంగా బ్రతికెయ్యచ్చు. కానీ అమెరికాలో ఆ పరిస్థితి లేదు. అక్కడ డబ్బున్నవాడిదే రాజ్యం. అక్కడ ఫ్రీ లంచ్ అనే మాటే లేదు. ప్రతిదానికీ ఒక 'వెల' ఉంటుంది.

ఒకడిలో టాలెంట్ ఉందీ అంటే వాళ్ళు అక్కున చేరుకుంటారని సామాన్యంగా అనుకుంటారు. అది నిజమే. ఎందుకంటే వాడి టాలెంట్ చూచి ముచ్చట పడి కాదు. ఆ టాలెంట్ ని వాడుకుని అందులో ముప్పావలా లాభం వాళ్ళు నొక్కేసి పావలా వీడికిస్తారు. పైకి మాత్రం మెరిట్ ని మేము నెత్తికెత్తుకుంటాం అంటారు. దేన్నైనా సరే బిజినెస్ దృష్టితో మాత్రమే వాళ్ళు చూస్తారు. నాకేంటి? అనేది అక్కడ ప్రధాన సూత్రం. అవసరం లేకపోతే కుక్క కూడా అక్కడ మనల్ని పలకరించదు.

మృగ్యమైన మానవ సంబంధాలు

అక్కడ మానవ సంబంధాలు కూడా అంతంత మాత్రమే. అక్కడున్నది అవసరమే గాని ప్రేమ అనేది అక్కడ లేదు. సగటు అమెరికా పౌరుడు తనను తానే నమ్మడు ఇంక పక్కవాడినెలా నమ్మగలడు? అందుకే చిన్న చిన్న విషయాలకే అక్కడ విడాకులు తీసుకుంటూ ఉంటారు. ఒక ఇంట్లో ఎవరి బ్యాంక్ ఎకౌంట్ వారిదే ఎవరి సంపాదన వారిదే. ఖర్చులు పంచుకుంటారు. అంతా వ్యాపారం లాగా ఉంటుంది. ఇంకో మంచి పీస్ దొరికి ఈ పీస్ అంటే ఇష్టం లేని రోజున టక్కున విడిపోతారు. అలా విడిపోయినందుకు రిగ్రెట్స్ ఏమాత్రం ఎవరికీ ఉండవు.

కృత్రిమ వేషాలు

ప్రతి మనిషినీ బిజినెస్ దృష్టితో మాత్రమే చూస్తారు. పైకి మాత్రం చాలా మర్యాదగా నవ్వుతూ మాట్లాడతారుగాని లోపల ఉద్దేశ్యాలు మనకు ఏమాత్రం అర్ధం కావు. ఆ విధంగా నటించడం వారికి వెన్నతో పెట్టిన విద్య. దీన్నే మన భాషలో చెప్పాలంటే ' మెత్తగా గొంతు కొయ్యడం' అని చెప్పవచ్చు. పైకి ఎంతగా నవ్వుతూ మాట్లాడినా లోపల మాత్రం మనమంటే వాళ్లకు చులకనభావమే. కమ్యూనికేషన్ స్కిల్స్ చిన్నప్పటి నుంచీ నూరిపొయ్యబడడం వల్ల దేన్నైనా మార్కెటింగ్ ధోరణిలో మాత్రమే వాళ్ళు తీసుకుంటారు. 'యూస్ అండ్ త్రో' అనేది వాళ్ళ పాలసీ.

భయంతో కూడిన జీవితం

అమెరికాలో ప్రతివారికీ భయం ఎక్కువ. రోడ్డు మీద పోతున్నప్పుడు ఎవరైనా వారివైపు అదేపనిగా చూస్తుంటే భయపడి పోతారు. ఏదైనా తగిలినా, చీమో దోమో కుట్టినా విపరీతమైన భయంతో ఆ చోట లోషన్లేసి తెగ కడుగుతారు. ఏదో అంతు తెలియని రోగం వచ్చి తమను చంపుతుందని అంతరాంతరాలలో వాళ్లకు తగని భయం ఉంటుంది. అందుకే వాళ్ళ సినిమాలు కూడా జంతువులు, కీటకాలు, పక్షులు వచ్చి ఎటాక్ చేసినట్లు, లేకపోతే ఏవో అంతు తెలియని రోగాలు వచ్చి పడినట్లు చివరకు వాటిని అంతం చేసి తమను తాము రక్షించుకున్నట్లు ఉంటాయి. మిడిల్ ఈస్ట్ నుంచో లేదా మార్స్ లాంటి ఇతర గ్రహం నుంచో ప్రపంచ వినాశనం పొంచి ఉందని వాళ్ళు గట్టిగా నమ్ముతారు. హెల్త్ పారామీటర్స్ లో ఏ మాత్రం తేడా వచ్చినా తెగ గాభరా పడిపోయి తల్లక్రిందులు అవుతారు.

ఇంట్లో ఒక చీమ కనిపిస్తే దానిని పట్టుకుని బయట పారేయందే వాళ్లకు తోచదు. ఇక బొద్దింక కనిపిస్తే చాలు ఆ రోజు వాళ్ళు నిద్రే పోరు. మితిమీరిన కెమికల్స్ వాడకంతో తెలీకుండానే ఒళ్ళు గుల్ల చేసుకుంటూ ఉంటారు.

కుక్కలు / కార్లు

అమెరికాలో మనుషుల కంటే కుక్కలు / కార్లు ఎక్కువ. ఒక ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని కార్లు తప్పనిసరిగా ఉంటాయి. ఎవరి ఆఫీసు వారిదే ఎవరి తిరుగుడు వారిదే. అదే విధంగా - ప్రతి ఇంటికీ మినిమం రెండు నుంచి నాలుగు లేదా ఆరు కుక్కలు ఉంటాయి. చాలామంది తమతమ జీవితాలలో మూడు నాలుగు లేదా ఇంకా ఎక్కువ మందికి విడాకులు ఇచ్చేసి చివరకు రెండు కుక్కల్ని పెంచుకుంటూ వాటితో బ్రతుకుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. పెళ్ళికాని అబ్బాయిలు అమ్మాయిలయితే కుక్కలతోనే కాలక్షేపం చేస్తూ వాటిని షికార్లకు తిప్పుతూ బ్రతుకుతూ ఉంటారు. మనుషులలో దొరకని ప్రేమను జంతువులలో వాళ్ళు వెతుక్కుంటూ ఉంటారు. మనం ఎదుటివారిని ప్రేమిస్తేనే కదా వాళ్ళు మనల్ని ప్రేమించేది? అదీ ఇదీ లేనప్పుడు మిగిలేది జంతుప్రేమ మాత్రమే.

అంతుబట్టని రోగాలు

అమెరికాలో ఎక్కడ చూచినా కనిపించే రోగం - ఒబేసిటీ. బ్రేక్ ఫాస్ట్ నుంచీ డిన్నర్ దాకా ఫ్రైడ్ చికెన్ మాత్రమే తినేవాళ్ళు కోట్లల్లో అమెరికా నిండా ఉన్నారు. వీరిలో వైట్స్ కంటే బ్లాక్స్ ఎక్కువ. చీప్ తిండి తినేవారు కూడా బ్లాక్స్ లోనే ఎక్కువ. ఆ చీప్ మాంసంలో అనేక హానికారక హార్మోన్లు ఉంటాయి. వాటివల్ల శరీరం అడ్డదిడ్డంగా ఊరిపోయి రాక్షసుల్లా కనిపిస్తూ ఉంటారు. వాళ్ళకుండే రోగాలు కూడా తక్కువేమీ కావు. తెల్లవాళ్ళ రెసిస్టెన్స్ పవర్ మనకంటే చాలా తక్కువ.

ఒబేసిటీ వల్ల పెళ్ళికాకుండా మిగిలిపోయే ఆడపిల్లలు మొగపిల్లలు చాలామంది అమెరికాలో మనకు కన్పిస్తారు. వీరిలో బ్లాక్ ఆడపిల్లల పరిస్థితి మరీ దుర్భరం. దీనికొక కారణం ఉంది. తెల్లవాళ్ళేమో తెల్లమ్మాయిల వెంట పడుతూ ఉంటారు. తెల్లమ్మాయిలు నల్లబ్బాయిలను (బలంగా ఉంటారని) లైక్ చేస్తారు. ఎవడూ పట్టించుకోక మిగిలిపోయేది నల్లమ్మాయిలే. ఆ డిప్రెషన్లో పడి చీప్ తిండి తిని వాళ్ళు విపరీతంగా ఊరిపోతూ ఉంటారు. చివరకు పెళ్ళికాకుండా మిగిలిపోతూ ఉంటారు.

డయాబెటీస్, హైపర్ టెన్షన్, కాన్సర్ మొదలైన రోగాలు కూడా అక్కడ తక్కువేమీ కావు. వీటికి తోడు విచ్చలవిడి వాక్సినేషన్ వల్ల వచ్చే 'ఆటిజం' అక్కడ చాలా ఎక్కువగా ఉంటున్నది.

కొన్ని కొన్ని రోగాలు వచ్చాయంటే ఆ ట్రీట్మెంట్ కు వాళ్ళ జీతాలే గాక పక్కవాడి జీతాలు కూడా చాలవు. అందుకే ఏ చిన్న రోగం వచ్చినా భయపడి గజగజా వణికిపోతూ ఉంటారు. ఎక్కడ ఏ వైరస్ ఉందో ఏ బాక్టీరియా ఉందో అని తెగ శుభ్రత పాటిస్తారు.

అంత శుభ్రత పాటించినా వీళ్ళలో ఒక దరిద్రపు అలవాటు ఉంది. అదేమంటే నాలుక గీసుకోరు. ఊరకే బ్రష్ చేసుకుని ఊరుకుంటారు. ఆ తర్వాత పొద్దున్నే చికెన్ తిని చూయింగ్ గం నములుతూ ఆఫీసుకెళతారు. ఆ నోట్లోంచి వచ్చే కంపుకు ఎదుటివాడు హరీమని చావాల్సిందే. మనం నాలుక గీక్కుంటే దాన్ని కామెంట్ చేసి జోకులేసి నవ్వుతారు. మళ్ళీనేమో మనదగ్గర కర్రీ స్మెల్ వస్తున్నదని ఆఫీసులలో బాసులకు కంప్లెయింట్ చేసే అమెరికన్స్ కూడా ఉన్నారంటే మీరు నమ్ముతారో లేదో మరి? ఇక టాయిలెట్ పేపర్ యూసేజి గురించి నేను చెప్పనక్కర్లేదు. మీరే ఊహించుకోండి.

ఇటువంటి దరిద్రపు అలవాట్లు వాళ్ళు పెట్టుకుని మన ఇండియన్స్ ను 'కంట్రీ బ్రూట్స్' అన్నట్లు చూస్తారు. అదీ విచిత్రం !! విచిత్రం అనడం కంటే తెల్లవాడి దురహంకారం అంటే కరెక్ట్ గా ఉంటుందేమో?