“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

2, జులై 2017, ఆదివారం

ఇండియాకు వచ్చేశాం !!

నిన్న రాత్రి ఎనిమిదికి హైదరాబాద్ లో ఫ్లైట్ దిగి బయటకు వచ్చేసరికి ఇండియా పంచవటి సభ్యులందరూ ఎదురుగా నిలబడి పుష్పగుచ్చంతో స్వాగతం చెప్పారు. వారిలో చెన్నై నుంచి సునీల్ వైద్యభూషణ, బెంగుళూరు నుంచి సునీల్ మొదలైన వారున్నారు. మూడునెలల తర్వాత మళ్ళీ అందరినీ చూచేసరికి ఆనందం కలిగింది.

'గణేషూ తనూ కలసి కొద్ది రోజుల క్రితం అరుణాచలం వెళ్లి మూడు రోజులు ఉండి వచ్చామనీ అతనికి టైఫాయిడ్ వచ్చిందనీ అందుకే రాలేకపోయాడనీ తానొక్కడినే బెంగుళూరు నుంచి వచ్చాననీ' చెప్పాడు సునీల్.

ఒకవేళ రాత్రి బస్సుకు బయలు దేరతాడేమో అంతదూరం నుంచి పడుతూ లేస్తూ ఆ జ్వరంతో రావద్దని చెబుతూ మెసేజి పెట్టమని చెప్పాను. గెస్ట్ హౌస్ కి చేరుకొని స్నానపానాదులు కానిచ్చి, అందరినీ వారివారి ఇళ్ళకు వెళ్లి పొద్దున్నే రమ్మని చెప్పి, నిద్రకు ఉపక్రమించాం.

ఒళ్లంతా తుక్కై పోయి ఉండటంతో కళ్ళు మూసి తెరిచేసరికి ఉదయం ఆరైంది.

బాల్కనీ లోకి వచ్చి చూచాను.

మళ్ళీ మన హైదరాబాదు, మన బస్సులు, కార్లు, స్కూటర్లు రోడ్డు మీద అడ్డదిడ్డంగా పోతూ, హారన్లు 'బోయ్' మంటూ మోగిస్తూ, రణగొణ ధ్వనితో, దుమ్ముతో నిండిన రోడ్లు, రూల్సు పాటించని మనుషులూ అందరినీ చూచే సరికి "ప్రాణం లేచొచ్చింది." దానితో బాటు రెండు తుమ్ములు కూడా వచ్చాయి - ఆ దుమ్ముకి.

బాల్కనీలో నుంచి ఆ ట్రాఫిక్ ని చూస్తూ కాసేపు నిలబడ్డాను.

అమెరికాలో గణేష్ అనే శిష్యుడన్న మాట గుర్తొచ్చింది.

'అమెరికాలో అంతా ఆర్గనైజుడు గా ఉంటుంది కానీ అందులో వైబ్రెన్సీ ఉండదు. అదే మన ఇండియాలో అయితే అంతా గందరగోళమే. ఎవడూ ఏ రూలూ పాటించడు. ఆ జీవితంలో చాలా వైబ్రెన్సీ ఉంటుంది.' అన్నాడతను. రోడ్డు మీద మన జనాన్నీఅడ్డదిడ్డపు ట్రాఫిక్ నీ చూస్తుంటే ఆ మాటల్లో నిజం అర్ధమైంది.

గెస్ట్ హౌస్ నుంచి బయటకొచ్చి ఒక లాంగ్ వాక్ చేసి బ్రేక్ ఫాస్ట్ ముగించి మళ్ళీ గెస్ట్ హౌస్ కొచ్చి కాసేపు రెస్ట్ తీసుకునే సరికి మనవాళ్ళు ఒక్కొక్కరూ ఛిన్నగా రావడం మొదలైంది. ఈ లోపల బెంగుళూరు నుంచి 'ఇండియా గణేష్' ప్రత్యక్షమయ్యాడు.

'అదేంటి నీకు టైఫాయిడ్ జ్వరమని సునీల్ చెప్పాడే నిన్న రాత్రి? రావద్దని చెప్పానుకదా? మెసేజి రాలేదా?' అడిగాను.

'వచ్చింది. మందులేసుకున్నాను. కొంచం తగ్గింది. అందుకని ఉదయం ఆరింటికి బెంగుళూర్ లో ఫ్లైట్ ఎక్కి ఏడున్నరకల్లా ఇక్కడ దిగాను. వచ్చేశాను.' అన్నాడు.

అంటే, జ్వరంతో ఉదయం మూడుకే లేచి బెంగుళూర్ లో ఎయిర్ పోర్ట్ కు వచ్చి ఉండాలి? అవునా?' అడిగాను.

'అవును' అన్నాడు.

నిజాయితీ ఉన్న సాధకులను నాకిమ్మని శ్రీరామకృష్ణులను నేను చాలాసార్లు ప్రార్ధించిన మాట నిజమే. కానీ మరీ "ఇంత" ఎక్కువగా నిజాయితీ ఉన్న వాళ్ళను నా దగ్గరకు పంపిస్తున్నందుకు ఆయన వైపు ఒకసారి చిరుకోపంగా చూచాను మనస్సులోనే.

టైఫాయిడ్ ఫీవర్ లక్షణాలు ఎలా ఉన్నాయో చెప్పమని గణేష్ ను అడిగాను. ఆ లక్షణాలు విని 'బాప్టీజియా - 200' వెంటనే వాడమని గణేష్ కు చెప్పాను.

నిదానంగా ఒక్కొక్కరూ రావడం మొదలు పెట్టారు. కరీంనగర్ నుంచి వచ్చిన శంకర్, అతని శ్రీమతీ, రాయలసీమలోని కదిరి నుంచి వచ్చిన సురేష్, అంతేగాక మలేషియా (కౌలాలంపూర్) నుంచి వచ్చిన ప్రశాంతి వాళ్ళలో ఉన్నారు. వారందరూ ఏవేవో అడిగితే రకరకాల ఆధ్యాత్మిక విషయాల మీద మాట్లాడుతూ గడిపాను. అలా మాట్లాడుతుంటే టైం ఎలా గడచిపోయిందో తెలియలేదు. వాచ్ చూచే సరికి మధ్యాన్నం ఒంటిగంట అయింది.



















త్వరలో రాబోతున్న గురుపూర్ణిమ + నా జన్మదిన రిట్రీట్ ఎక్కడ పెట్టుకుందామని కాసేపు ఆలోచించి చివరకు శ్రీశైలం ఖాయం చేశాం. ఈ లోపల జనార్దన్, అతని భార్యా అందరికీ భోజనాలు ప్యాక్ చేసి తెచ్చారు. మేము భోజనాలు చేస్తూ ఉండగా, మిత్రుడు రవి వచ్చాడు. సరే అందరం కలసి మాట్లాడుకుంటూ భోజనాలు కానిచ్చాం. ఆ తర్వాత అందరి దగ్గరా సెలవు తీసుకుని సికింద్రాబాద్ స్టేషన్ కు చేరుకున్నాం.

ట్రైన్ రావడం కాస్త ఆలస్యం అవడంతో మాట్లాడుకుంటూ కాసేపు గడిచింది. త్వరలో మనం వ్రాయబోతున్న 'మెడికల్ ఆస్ట్రాలజీ' పుస్తకానికి నాందిగా ద్వాదశ లవణాలు, ద్వాదశ రాశులకు సంబంధం గురించి అడిగాడు వంశీ. డాక్టర్ స్కూస్లర్ ఆ పనిని తనే చేశాడని నేనన్నాను. అయినా మనం ఇంకో కోణంలో చేద్దామని ఒక ప్రయత్నం అక్కడికక్కడే చేశాం.

ఆ తర్వాత 'ఫైనాన్షియల్ ఎస్ట్రాలజీ', 'షేర్ మార్కెట్' లో జ్యోతిష్యాన్ని ఎలా వాడాలి? అనే విషయం మీదా ఈ కోణంలో W.D.Gann చేసిన రీసెర్చి మీదా ఇండియా వచ్చి అతను నేర్చుకున్న జ్యోతిష్య రహస్యాల మీదా మాట్లాడుకున్నాం. దీనిమీద ఒక కోర్సు జర్మనీలోనూ ఫ్రాన్స్ లోనూ ఉందనీ, one to one మాత్రమే దానిని నేర్పిస్తారనీ, ఐదురోజుల ఆ కోర్సు ఫీజు మన కరెన్సీలో అక్షరాలా పాతిక లక్షలు మాత్రమేననీ చెప్పాడు గురుమోహన్.ఈ రంగంలో గట్టి పరిశోధన చాలా తీవ్రంగా చెయ్యాలని అందరం కలసి నిశ్చయించుకుని రైలెక్కి గుంటూరులో రాత్రి ఎనిమిదిన్నరకు దిగాము. రైలు ప్రయాణంలో 'Sarvatobhadra Chakra and how to predict share market trends with it?' అనే పుస్తకాన్ని నమిలేశాను.

స్టేషన్లో దిగగానే ఎదురుగా మా అమ్మాయి డా|| భార్గవి, దేవేంద్ర, ప్రసాద్ గార్లు కనిపించారు.

'సిస్టర్ కి పోస్టింగ్ ఇచ్చారా?' అడిగాను. ప్రసాద్ గారి చెల్లెలు పోలీస్ ఆఫీసర్. తనకీ మధ్యనే Additional S.P గా ప్రొమోషన్ వచ్చింది.

'ఇచ్చారు. ఒంగోల్లో జాయినైంది.' అన్నాడు.

'ఇంతకు ముందైతే అక్కడంతా కమ్యూనిస్టులు, నక్సలైట్ల గొడవ ఉండేది. ప్రస్తుతం సద్దుమణిగింది అనుకుంటాను' అన్నాను.

'అవును.జాయిన్ అవబోయే ముందు ఒకసారి వచ్చి మిమ్మల్ని కలుద్దామని అనుకున్నాం. కానీ మీరు అమెరికాలో ఉన్నారు.' అన్నాడు ప్రసాద్.

మాటల్లో పడి లగేజితో స్టేషన్ బయటకు వచ్చేసాం. కష్టపడి లగేజినంతా కారులో సర్దేసి 'మేం ఆటోలో వస్తాంలే. మీరెళ్ళండి' అని వాళ్ళతో చెప్పి ఆటో మాట్లాడాం.

ఆటో కదలబోతుండగా ' ఆటోకు ఇవ్వడానికి డబ్బులున్నాయా నీ దగ్గర? అరవై రూపాయలు మన కరెన్సీ?' అడిగింది మా అమ్మాయి.

నాలుక్కరుచుకున్నాను.

ఎందుకంటే మన పర్సులో ఒక కార్డూ, కొన్ని  డాలర్లూ, మన కరెన్సీ రెండు పెద్ద నోట్లే ఉన్నాయి మరి. నా అవస్థ గమనించి ఒక యాభై నోటూ ఒక పది నోటూ తన జేబులోంచి తీసిచ్చాడు ప్రసాద్. అవి తీసుకుని ఆటో ఎక్కి ఇంటికి బయల్దేరాం. ఆ విధంగా మూడు నెలల తర్వాత మళ్ళీ ఇండియాలో అడుగుపెట్టి, పర్సులో డబ్బులున్నా, ఆటో డబ్బుల కోసం అరవై రూపాయలు అప్పుచేసి మరీ ఇంటికి చేరామన్న మాట. ఎంతసేపూ ఎక్కడో ఆలోచిస్తుంటే ఇలాగే ఉంటుంది మరి !!

ఇంటికి పోతున్న నాకు ఒక మిత్రుడు ఎప్పుడో చెప్పిన ఒక సంఘటన గుర్తొచ్చింది. నాలుగేళ్ళ క్రితం ఒకసారి చైనా వెళ్ళిన అతని దగ్గర మన కరెన్సీ పదిలక్షలు సూటుకేసులో ఉండికూడా, దాహంతో గొంతెండి పోతుంటే ఒక వాటర్ బాటిల్ కొనుక్కోడానికి చైనీస్ కరెన్సీ లేక ఎంత అవస్థ పడ్డాడో ఒకసారి చెప్పాడు. ఆ సంగతి గుర్తొచ్చింది.

సరే - ఈ విషయాలన్నీ అలా ఉంచితే, రేపటినుంచీ - అమెరికా సమాజం మీద నా అభిప్రాయాలు ( ఒక శిష్యురాలి భాషలో చెప్పాలంటే 'తిట్లు') చదవండి మరి !!