నిజమైన అదృష్టవంతులు మాత్రమే మాతో చేయి కలుపుతారు

29, జూన్ 2017, గురువారం

రెండవ అమెరికా యాత్ర -77 (గుడ్ బై అమెరికా - ప్రస్తుతానికి)


తెల్లవారితే ఇండియాకు ప్రయాణం.

మూడు నెలలు మూడు రోజులుగా గడచిపోయాయి.

ఈ మూడు నెలలలో అమెరికాలో ఎంతోమంది శిష్యులను, వారి కుటుంబ సభ్యులను, అభిమానులను కలిశాను. ఎందరివో ప్రేమాభిమానాలను అందుకున్నాను. ఎన్నో అనుభవాలను సొంతం చేసుకున్నాను. నేననుకున్న సాధనలన్నీ చేశాను. ఎన్నో నేర్పించాను. నేనూ ఎంతో నేర్చుకున్నాను.

నన్ను వదలాలంటే బాధ పడేవాళ్ళు ఎందఱో ఇక్కడ ఉన్నారు. నన్నిక్కడే ఉండమని వాళ్ళంతా అడుగుతున్నారు. కానీ నాకు ఇండియాలో బాధ్యతలున్నాయి. నాకోసం ఎదురుచూస్తున్న శిష్యులూ, నా సాంగత్యాన్ని కోరుకునే వాళ్ళూ ఇండియాలో చాలామంది ఉన్నారు. కనుక ప్రస్తుతానికి ఇండియాకు బయలుదేరక  తప్పదు.

ప్రతి కలయికా ఒక ఎడబాటుకే దారితీస్తుంది. ప్రతి ఎడబాటూ తిరిగి మరొక కలయికలో లయిస్తుంది. ప్రతి పయనమూ ఒక గతానికి ముగింపు పాడుతూ ఒక క్రొత్త ఉదయాన్ని దరిజేరుస్తుంది. ప్రతి ఉదయమూ తిరిగి ఒక రాత్రిలోనే అంతమౌతుంది. ఇదొక నిరంతర చక్రభ్రమణం.

మనిషి జీవితమే ఒక ప్రయాణం. ఈ ప్రయాణంలో ఎందరినో కలుస్తుంటాం. విడిపోతుంటాం. కలసిన ప్రతివాళ్ళూ మనతో నడవలేరు. నడవరు కూడా. మనల్ని ఇష్టపడి మనల్ని ప్రేమించేవాళ్ళు మనతోనే ఎల్లప్పుడూ ఉండనూ లేరు. జీవితం ఇంతే. అది ఇలాగే ఉంటుంది.

ఏది ఏమైనా ఈ పయనం ముందుకు సాగవలసిందే.

మనల్ని వదల్లేక కళ్ళలో నీరు నింపుకునే మనుషులను కొందరినైనా మనం పొందగలిగితే అంతకంటే మనిషి జన్మకు కావలసింది ఇంకేముంటుంది? అలాంటి వారిని చాలామందిని అమ్మ నాకిచ్చింది.

ప్రస్తుతానికి గుడ్ బై.

తిరిగి త్వరలో కలుసుకుందాం !!