“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

16, జూన్ 2017, శుక్రవారం

రెండవ అమెరికా యాత్ర -51 (మన పిల్లలకు ఏ కధలు చెప్పాలి?)


ఆరోజు రాత్రి అందరం కూర్చుని మాట్లాడుకున్నాం. యోగం, వేదాంతం, తంత్రం గురించి అందరూ అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పాను. అది చాలా పెద్ద టాపిక్. అవన్నీ వ్రాస్తూ పోతే ఇంకో అయిదు పోస్ట్లు అవుతాయి. అందుకని వాటి గురించి వ్రాయడం లేదు. కానీ కొన్ని ముఖ్యమైన విషయాలను మాత్రం ఇక్కడ ఇస్తున్నాను.

అమెరికాలో సెటిల్ అయిన మనవాళ్ళను బాధిస్తున్న పెద్ద సమస్య ఏమంటే - పిల్లలు మన పద్ధతులను, సాంప్రదాయాన్ని, ధర్మాన్ని మర్చిపోతున్నారని. ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగిన మన పిల్లలు పూర్తిగా అమెరికన్స్ గా పెరుగుతున్నారు. అలా పెరగక తప్పదు. వాళ్ళకు భారతీయత తెలీదు. కనుక సడన్ గా ఒకే ఒక్క తరంలో పెద్ద కల్చరల్ గ్యాప్ వచ్చేస్తున్నది. దానిని పెద్ద తరంవాళ్ళు జీర్ణించుకోలేక పోతున్నారు. అసలైన ఆధ్యాత్మికత మాట దేవుడెరుగు. కనీసం మన భారతీయత కూడా ఈ పిల్లలకు అర్ధం కావడం లేదు. ఇదే ఇక్కడి భారతీయ తల్లిదండ్రులను బాధిస్తున్న పెద్ద మానసిక సమస్య.

ఆ రోజు సాయంత్రం నన్ను అడుగబడిన ప్రశ్నలలో ఇదీ ఒకటి.

ప్రశ్న:-- మేము ఇక్కడ చిన్న 'బాలవిహార్' వంటిది నడుపుతున్నాం. ఇక్కడి మన పిల్లలకు మన భారతీయతను ఎలా నేర్పాలి? వాళ్ళడిగే ప్రశ్నలకు ఎలా జవాబులు చెప్పాలి? ఉదాహరణకు - ఒకబ్బాయి ఉన్నాడు. అతను మాతో ఇలా చెప్పాడు. 'శివుడు తన కొడుకును తానే చంపేశాడు. అలాంటి వాడు దేవుడెలా అవుతాడు? ఇది నాకు నచ్చలేదు. అందుకే నేను మీ క్లాసుకు రాను.' ఇలా అంటూ ఆ అబ్బాయి మా క్లాసుకు రావడం మానేశాడు. వీళ్ళంతా టీవీలు చూచి మన మతం గురించి తప్పుగా నేర్చుకుంటున్నారు. వీళ్ళకు ఎలా మనం సరిగ్గా నేర్పాలి?

జవాబు:--

ఇది చాలా మంచి ప్రశ్న. వినండి. మన పిల్లలకు నేర్పాలంటే ముందుగా మనకు విషయం స్పష్టంగా తెలియాలి. ఖర్మేమిటంటే మనలో చాలామందికి మన మతం గురించి సరియైన అవగాహన లేదు. ఇక మన పిల్లలకు మనమేం నేర్పగలం? అందుకే వాళ్ళు అడిగే ప్రశ్నలకు మనం జవాబులు చెప్పలేం.

పిల్లలు చాలా సూటి ప్రశ్నలు అడుగుతారు. ఎందుకంటే వాళ్లకు మనలా inhibitions ఉండవు. చాలా direct and innocent questions వాళ్ళు అడుగుతారు. వాటికి జవాబులు చెప్పాలంటే ముందు మనం సిద్ధంగా ఉండాలి. అందుకే నేనెప్పుడూ చెబుతూ ఉంటాను. పిల్లలని కనడం గొప్ప కాదు. వాళ్ళను సరిగ్గా పెంచడమే అసలైన విషయం. వాళ్లకు చదువు, సౌకర్యాలు, డబ్బు ఇవ్వడం ఒక్కటే సరిపోదు. మన భారతీయతనూ, మన ఆధ్యాత్మికతనూ వాళ్లకు నేర్పించాలి. ఎందుకంటే, ఇవి లేకుండా ఇంకెన్ని ఇచ్చినా వాళ్ళు సరియైన మనుషులుగా తయారు కాలేరు. జీవితంలో నిజమైన సమస్యలు ఎదురైనప్పుడు వారిని ఆదుకునేవి ఇవే. నిజమైన మనశ్శాంతినీ ఆనందాన్నీ జీవితంలో ఒక fulfillment నూ ఇచ్చేవి కూడా ఇవే. కనుక వీటిని నిర్లక్ష్యం చేస్తే ముందు ముందు వాళ్ళు చాలా బాధపడతారు.

ఇక్కడి పేరెంట్స్ లో నేను గమనిస్తున్న విషయాలు చాలా ఉన్నాయి. ఇండియాలో మనకు అమ్మమ్మలు, తాతయ్యలు ఉంటారు. వాళ్ళు పిల్లల్ని కూచోబెట్టి మన కధలు, పద్యాలు, పాటలు, పురాణ గాధలు నేర్పిస్తారు. అక్కడ పిల్లలకు మంచి పునాది పడుతుంది. కానీ ఇక్కడ పిల్లలకు అవి దొరకవు. ఇక్కడ తల్లీ తండ్రీ ఇద్దరూ ఉద్యోగాలకు పోతుంటారు. పిల్లలేమో అమెరికన్ స్కూల్లో చదువుతారు. ఇంకేముంది? వాళ్ళు రెంటికి చెడ్డ రేవడిగా తయారౌతారు. ఇక్కడ మన పిల్లలు చాలామందికి తెలుగే రాదు. అదీ సంగతి !

వాళ్లకు మన భారతీయతను నేర్పించాలన్న తపనలో ఈ తల్లిదండ్రులేం చేస్తారు? రామాయణం, మహాభారతం, లేదా ఇంకేవో పురాణకధలు ఉన్న సీడీలు తెచ్చి పిల్లలకు చూపిస్తారు. లేదా మన పాత సినిమాలు చూపిస్తారు. అదే మన కల్చర్ అని పెద్దవాళ్ళ భ్రమ. వాళ్ళు మాత్రం అంతకంటే ఇంకేం చెయ్యగలరు? ఇక్కడ సొసైటీలో ఉన్న ప్రస్తుత పరిస్థితులలో వాళ్ళు చెయ్యగలిగింది కూడా అంతే !

ఇలాంటి పరిస్థితులలో మీరు చేస్తున్న పని చాలా మంచిది. హౌస్ వైఫులుగా ఉంటున్న ఆడవాళ్ళు కొందరు కలిసి ఒక బృందంగా ఏర్పడి వారానికొకసారి ఇలాంటి క్లాసులు నడపాలి. వాటిల్లో మన పిల్లలకు మన భారతీయతను నేర్పాలి. అలా చెయ్యడం ద్వారా మాత్రమే మన సంస్కృతినీ మన ధర్మాన్నీ తర్వాత తరానికి అందించగలం. లేకుంటే ఒక్క తరంలోనే పెద్ద కల్చరల్ గ్యాప్ రావడం ఖాయం.

ఇప్పుడు మీరడిగిన ప్రశ్న.

మన పురాణాలు అనేక కధలు పిట్టకధలతో మహా సముద్రాలుగా తయారయ్యాయి. ఈ కధలలో వాస్తవమూ, కల్పనా, మార్మికసత్యాలూ కలిసి మెలసి ఉంటాయి. వాటిని విడదీసి చక్కగా వివరించే నేర్పు మీకుండాలి. అలా ఉండాలంటే ముందుగా మీరు తయారవ్వాలి. మీరు వాటిని పాటించకుండా మీ పిల్లలకు నేర్పాలనుకుంటే అది సాధ్యం కాదు. ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టుమీద ఎందుకు మేస్తుంది? అదీ చేలోకే దిగుతుంది.

మన పురాణాలలో ఉన్న అసలైన ఉత్తేజకరమైన కధలను మన పిల్లలకు చెప్పాలి. అంతేగాని controversial stories ను చెప్పకూడదు. వాటిని అర్ధం చేసుకునే వయస్సు వచ్చినప్పుడు మాత్రమే వాటి అసలైన అర్ధాలను మనం విడమర్చి చెప్పాలి.

ఉదాహరణకు - తన ప్రభువైన శ్రీరాముడు తనకిచ్చిన పనిని నెరవేర్చడం కోసం ఆంజనేయుడు ఎన్ని కష్టాలను పట్టుదలతో దాటుకుంటూ లంకకు వెళ్ళాడు? దారిలో ఎదురైన ప్రలోభాలకు ఏమాత్రం లొంగకుండా అంతిమంగా ఎలా తన పనిని సాధించాడు? అనే కధను చెప్పాలి.

అలాగే - తల్లికిచ్చిన మాటకోసం గరుత్మంతుడు ఎలా స్వర్గాన్ని చేరుకొని అక్కడ దేవతలను యుద్ధంలో ఒక్కడే జయించి అమృతాన్ని ఎలా భూమికి తెచ్చాడు? అనే కధను చెప్పాలి.

చిన్న పిల్లలైన ధ్రువుడు, ప్రహ్లాదుడు, మార్కండేయుడు మొదలైన వాళ్ళు తపస్సుతో దైవాన్ని ఎలా దర్శించారు? ఎలా మహనీయులుగా మారారు? అనే విషయాలను చెప్పాలి.

ధర్మంకోసం శ్రీరాముడు, పాండవులు ఎలా అష్టకష్టాలు పడి చివరకు ఎలా విజయాన్ని సాధించారు? అనే విషయాలు చెప్పాలి.

తండ్రికిచ్చిన మాటకోసం భీష్ముడు ఎంత ఉదాత్తమైన జీవితాన్ని గడిపాడు? ఈ విషయం చెప్పాలి.

ఎన్నో కష్టనష్టాలు పడిన వివేకానందస్వామి మన హిందూ మతానికి ఎలా పునర్వైభవాన్ని ఇచ్చాడు? అనే విషయాలను కళ్ళకు కట్టినట్లు చెప్పాలి.

ఇలాంటి కధలను వినడం వల్ల పిల్లలలో నిజమైన నైతిక విలువలు పెరుగుతాయి. వారికి ఒక ఆదర్శం కళ్ళముందు కనబడుతుంది. ఉన్నతమైన ఆదర్శాలు వారికి మనం ఏర్పరచకపోతే ఏ సినిమా హీరోనో, ఏ రాజకీయ నాయకుడినో, కుల నాయకుడినో, ఇంకే పనికిమాలిన వాడినో వారు ఆదర్శంగా తీసుకుంటారు. అక్కడ నుంచి వారి జీవితం తప్పుదారిలో పడుతుంది.

ఇక్కడి తల్లిదండ్రులు ఒక కంప్లెయింట్ చేస్తున్నారు. 'మా పిల్లలు మా మాట వినడం లేదు.' అని. ఇండియాలోనే ఇప్పుడు చాలామంది పిల్లలు తల్లిదండ్రుల మాట వినడం లేదు. ఇక ఇక్కడేం వింటారు? మీరు మొదటినుంచీ వాళ్ళను సక్రమంగా పెంచితే వాళ్ళు మీ మాట వింటారు. మీ ఇష్టం వచ్చినట్లు మీరు డబ్బూ విలాసాలూ స్నేహితులూ పార్టీలంటూ పిల్లల్ని పట్టించుకోకుండా తిరిగి ఇప్పుడు ఉన్నట్లుండి మీ పిల్లలు ఉత్తమోత్తములుగా ఉండాలంటే ఎలా కుదురుతుంది? పిల్లల్ని ఇలా తయారుచేసింది మీరే. కనుక మీ ఖర్మ మీరు అనుభవించవలసిందే. వేరే మార్గం లేదు. ఎందుకంటే - మొక్కగా వంగనిది మానుగా అయ్యాక ఎలా వంగుతుంది?

శివుడు వినాయకుని తలను ఖండించడం అనేది ఒక మార్మిక కధ. అది నిజంగా జరిగిన హిస్టరీ కాదు. దాని వెనుక ఒక సందేశం ఉన్నది. ఒక రహస్య మార్మిక విజ్ఞానం ఉన్నది. ఒక మెసేజ్ ఉన్నది. ఆ మెసేజ్ ను సరిగ్గా అర్ధమయ్యేలా పిల్లలకు చెప్పాలి.

మన పురాణ కధలలో అన్నీ నిజంగా జరిగినవి కావు. వాటిల్లో fiction కూడా మిళితమై ఉంటుంది. Mystic elements వాటిలో కలగలిసి ఉంటాయి. ఆ పాయింట్స్ అన్నీ వాళ్లకు సరిగ్గా అర్ధమయ్యేలా వివరించి చెప్పాలి. అప్పుడే మన కధలలో ఉన్న ఔన్నత్యం వారికి సరిగ్గా అర్ధమౌతుంది. ఇలా చెప్పగలగాలంటే ముందు ఆయా కధల అసలైన అర్ధాలు మీకు తెలియాలి.

ఉదాహరణకు - దేవతలు  రాక్షసులు అంటే వైట్స్, బ్లాక్స్ మాత్రమే. వాళ్ళు స్వర్గంలో పాతాళంలో లేరు. స్వర్గం పాతాళం అంటే ఎక్కడో ఉన్న లోకాలు కావు. అవి భూమి మీదే ఉన్న దేశాలు లేదా ఖండాలు. పాతకాలంలో అమెరికాను పాతాళం అనేవాళ్ళు. ఎందుకంటే మనం భూమికి పైన ఉంటే, అది సరిగ్గా క్రిందవైపు ఉంటుంది. అక్కడా ఇంకా ఆఫ్రికా ఖండంలోనూ ఉన్న ట్రైబల్స్ నే రాక్షసులు అనేవాళ్ళు. నగరాలలో ఉంటూ నాగరికంగా బ్రతికే వైట్స్ ను దేవతలు అనేవాళ్ళు. మన పురాణాలలో చెప్పబడిన దేవదానవ యుద్ధాలు అవే. ఇలాంటి దేవదానవ యుద్ధంలో ఒకదానిలో శ్రీరాముని తండ్రియైన దశరధుడు దేవతల తరఫున పాల్గొన్నాడు. ఇది రామాయణంలో రికార్డ్ చెయ్యబడి ఉన్నది. పాతకాలంలో ఖండాలు (continents) అన్నీ కలిసే ఉండేవి. నేలమార్గంలో రాకపోకలు సాగుతూ ఉండేవి. అందుకే క్రీస్తుపూర్వం 40,000 ఏళ్ళ నాడే ఇండియానుంచి అమెరికాకు వలస వచ్చిన జాతులున్నాయి. అమెరికాలో మాయన్ నాగరికత ఉన్నది. వారి రాజునే మనం మయుడు అన్నాము. వారు మంచి మంచి నగరాలను కట్టడంలో అప్పుడే సిద్ధహస్తులు. అందుకే మయుడిని పిలిపించి మరీ మయసభను కట్టించుకున్నారు పాండవులు. ఇలాంటి చారిత్రిక నిజాలను మన పిల్లలకు అర్ధమయ్యేలా చెప్పాలి. అప్పుడే మన పురాణాలు వాళ్లకు సరిగ్గా అర్ధం అవుతాయి.

మరీ చిన్న పిల్లలకు Controversial topics చెప్పకూడదు. ఎందుకంటే వాళ్లకు అవి అర్ధం కావు. ఉదాహరణకు - కృష్ణునికి అంతమంది భార్యలు ప్రియురాళ్ళు ఎందుకు ఉన్నారు? మొదలైనవి.

ఈ విషయాలన్నీ ఆయా కాలాలలో ఉన్న సామాజిక పరిస్థితుల ఆధారంగా వాటిని మనం అర్ధం చేసుకోవాలి. ఆ కాలంలో ఆ సమాజంలో అవి కరెక్టే. ఉదాహరణకు మన పురాణాలలో బూతు ఎక్కువని కొందరు అంటారు. దానికి సమాధానం ఒక్కటే. నేడు మనం బూతు అనుకుంటున్నది పాత కాలంలో బూతు కాదు. అది ఆ కాలంలో సర్వసామాన్యం.

ఉదాహరణకు - బైబిల్ ఓల్డ్ టెస్టమెంట్ అంతా రాజుల కధలతో నిండి ఉంటుంది. అందులో చాలా బూతు కధలున్నాయి. రజనీష్ ఒకచోట ఇలా అంటాడు. నేడు మనం చూస్తున్న పోర్నోగ్రఫీ కంటే ఎక్కువ బూతు ఓల్డ్ టెస్టమెంట్ కధల్లో ఉంది. రాజుల కామకేళీ విలాసాలన్నీ వివరంగా అందులో వర్ణింపబడ్డాయి. అంతమాత్రం చేత బైబిల్ అంటే పోర్నోగ్రఫీ అని మనం అనకూడదు కదా !

అలాగే ఏ ఇతర మతమైనా ఇంతే. అవేవీ పతివ్రత మతాలు కావు. ఉదాహరణకు మహమ్మద్ మొదటి భార్య ఆయనకంటే దాదాపు 25 ఏళ్ళు పెద్దది. అప్పటికే ఆమె వితంతువు. కానీ ఆమెను ఆయన పెళ్లి చేసుకున్నాడు. మహమ్మద్ చిన్న భార్య ఆయనకంటే దాదాపు 50 ఏళ్ళు చిన్నది. ఆయనకు అరవై ఏళ్ళు ఉన్న సమయంలో 15 ఏళ్ళ పిల్లను ఆయన పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయి పేరు ఆయేషా. కృష్ణుడికి అంతమంది భార్యలున్నారని విమర్శించే ముస్లిములు దీనికేమని సమాధానం చెబుతారు?

కృష్ణుడికి 16,000 మంది భార్యలున్నారని విమర్శించే వాళ్ళకు అసలైన నిజాలు తెలియవు. తెలుసుకోవాలని వాళ్ళు ప్రయత్నమూ చెయ్యరు. వాళ్ళందరూ ఆయన భార్యలు కారు. జరాసంధుడు చెరబట్టి తన జైల్లో ఉంచుకున్న అమ్మాయిలు వాళ్ళంతా. కృష్ణుడు జరాసంధుడిని చంపి ఆ అమ్మాయిలను ఆ చెర నుంచి విడిపించాడు. వాళ్లకు దిక్కులేక పోవడంతో తన రాజ్యానికి తెచ్చి వాళ్ళకు అక్కడే ఉండమన్నాడు. వాళ్ళను పోషిస్తూ వాళ్లకు ఒక క్రొత్త జీవితాన్ని ఇచ్చాడు. ఇది వాస్తవం. వాళ్ళందరూ ఆయన భార్యలు కారు. ఆయనకున్న భార్యలు ఎనిమిది మందే. వందలాది మంది భార్యలను రాజులు కలిగి ఉండే రోజులలో కృష్ణుడు ఉత్త ఎనిమిది మందితో సరిపెట్టుకున్నాడు. ఆ విధంగా ఆయన చాలా సంయమనం పాటించినట్లే. అంతదాకా ఎందుకు? నిన్నా మొన్న హైదరాబాద్ నిజాంకు ఎంతమంది భార్యలుండేవారో తెలుసా? కృష్ణుడిని విమర్శించే జాకీర్ నాయక్ లాంటి సైతాన్లు దీనికేమంటారు? మన పురాణాలు సరిగ్గా చదివితే ఈ నిజాలు తెలుస్తాయి. అంతేగాని, సీడీలు, సినిమాలు చూచి మన పురాణాలను అర్ధం చేసుకుందామని అనుకుంటే పప్పులో కాలేసినట్లే అవుతుంది.

ఈ విషయాలను మీరు ముందుగా సరిగ్గా అధ్యయనం చెయ్యాలి. ఆకాలం నాటి సామాజిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వాటిని మీరు సరిగ్గా అర్ధం చేసుకోవాలి. ఆ తర్వాత మీ పిల్లలకు వీటిని నేర్పించాలి. ఉత్తగా నేర్పిస్తే సరిపోదు. ముందు మీరు ఆదర్శంగా బ్రతకాలి. అప్పుడు మిమ్మల్ని చూచి పిల్లలు నేర్చుకుంటారు.

ఇకపోతే - ఆధ్యాత్మికత గురించి. నిజమైన ఆధ్యాత్మికత మీకు తెలియాలంటే ఒకే ఒక్క మార్గం ఉన్నది. అది శ్రీ రామకృష్ణులు, శారదామాత, వివేకానందస్వామి చెప్పిన విషయాలను చదవడం, అర్ధం చేసుకోవడం మాత్రమే. నిజమైన హిందూ మతం మీరు సరిగ్గా అర్ధం చేసుకోవాలంటే వీరొక్కటే మీకు మార్గం. ఇంకో దారి లేనేలేదు.

నేడు చాలామంది నకిలీ గురువులు ఎక్కడ చూచినా తామర తంపరలుగా పుట్టుకొస్తున్నారు. వారిని గుడ్డిగా నమ్మితే మీరు అధోగతి పాలైనట్లే. ఎందుకంటే వారికి మన హిందూ మతాన్ని గురించిన సత్యమైన జ్ఞానం లేదు. ఎవరికి వారు వారికి తోచిన విధంగా దానిని వ్యాఖ్యానం చేస్తున్నారు. అసలైన విషయాన్ని మీరు గ్రహించాలంటే రామకృష్ణ - వివేకానందులను చదవాలి. అప్పుడే మీరు హిందూ మతాన్నే గాక ఇతర మతాలను కూడా సక్రమమైన విధానంలో అర్ధం చేసుకోగలుగుతారు.' అని ముగించాను.

ఆ రాత్రికి అందరం భోజనాలు ముగించి నిద్రించాం. మర్నాడు ఉదయాన్నే బయలుదేరి చికాగోకు వెళ్ళాలి.