“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

1, జూన్ 2017, గురువారం

రెండవ అమెరికా యాత్ర -42 (షాంపేన్ సరస్వతీదేవి ఆలయంలో ప్రశ్నలు సమాధానాలు)

ప్రసంగం అయిపోయాక, సభికుల నుంచి ఈ క్రింది ప్రశ్నలు వచ్చాయి. వాటికి నేను ఈ క్రింది విధంగా సమాధానాలిచ్చాను.

1. లలితా సహస్రనామాలు చదివేటప్పుడు స్వరయుక్తంగా చదవడం అవసరమా?

జవాబు:-- అవసరం లేదు. ఎందుకంటే ఇవి వేదమంత్రాలు కావు. పురాణాలనుంచి వచ్చిన స్తోత్రాలు ఇవి. లలితా సహస్రం బ్రహ్మాండపురాణం లోనిది. వేదమంత్రాలకు స్వరం ఉంటుంది. వాటిని రాగయుక్తంగా చదవాలి. కానీ పురాణోక్త మంత్రాలకు ఆ నియమం లేదు. కనుక ఆ భయం అవసరం లేదు.

2. మేము ఎవరి దగ్గరా ఉపదేశం తీసుకోలేదు. లలితా సహస్ర నామాలు చదవవచ్చా?

జవాబు:-- నిరభ్యంతరంగా చదువుకోవచ్చు. ఉపదేశం తీసుకుంటే మంచిదే. లేకున్నా ఇబ్బంది లేదు. మీకు లోలోపల ఎంత ఆర్తి ఉన్నది? అనేదే ముఖ్యం గాని మీరు ఉపదేశం తీసుకున్నారా లేదా అనేది ముఖ్యం కాదు.

3. చదివేటప్పుడు తప్పులు పోతే ఏం చెయ్యాలి?

జవాబు:-- తప్పులు చదువుతున్నామని మీకు తెలిసినప్పుడు దిద్దుకోవాలి. తెలియకుండా తప్పులు చేస్తే ఏమీ దోషం లేదు. అమ్మ సర్వజ్ఞ కదా. ఆమెకు అన్నీ తెలుసు. అన్నింటినీ ఆమె చూస్తూనే ఉంటుంది. ఆమె మీ హృదయాన్ని చూస్తుంది గాని మీ మాటలో స్వచ్చతను కాదు. శ్రీరామకృష్ణులు ఇలా అనేవారు. ఒక తల్లికి నలుగురు పిల్లలున్నారు. వారిలో పెద్దవాడు 'అమ్మా' అని చక్కగా పిలవగలడు. కానీ చిన్నవాడు మాటలు పలకలేడు. వాడికి అలా పిలవడం రాదు. వాడు ఉత్తగా 'అం' అంటాడు. అంతమాత్రాన వాడంటే తల్లికి కోపం ఉండదు. ఇంకా ప్రేమ ఎక్కువ ఉంటుంది. వాడికి మాటలు ఇంకా రాలేదని ఆమెకు తెలుసు గనుక. ఇదీ అంతే.

4. వెయ్యి విష్ణు నామాల కంటే శివనామం ఉత్తమమని, వెయ్యి శివ నామాల కంటే దేవీ నామం ఉత్తమమని అంటున్నారు. దీనికేదైనా ప్రత్యేక కారణం ఉన్నదా? మనకున్న షణ్మతములలో ఏది గొప్పది? అసలిదంతా ఏమిటి?

జవాబు:-- విభిన్నతే మన మతంలో ఉన్న ప్రత్యేకత. శైవం, వైష్ణవం, శాక్తం, సౌరం, గాణాపత్యం, కౌమారం అనేవి షణ్మతములు. వీటిని ఆది శంకరాచార్యుల వారు స్థిరపరచారు. ఆయన కాలంలో ఇంకా తొంభై ఆరు మతాలు (శాఖలు) మన దేశంలో ఉండేవి. వాటినన్నింటినీ ఆయన ఖండించి ఈ ఆరింటిని స్థిరీకరించారు. వీటిలో ఒకటి గొప్పా ఒకటి తక్కువా అని లేదు. ఏ రూపంలో కొలిచినా నువ్వు కొలుస్తున్నది ఒకే బ్రహ్మమునే అనేది అసలైన సత్యం. ఈ విషయం గుర్తుంటే ఏ గొడవలూ ఉండవు. అయితే, శక్తి ఆరాధన ఎందుకు గొప్పది అంటే, తల్లికి మనం ఇచ్చే గౌరవంలో ఆ రహస్యం ఉన్నది. దేవుడైనా సరే జన్మ తీసుకోవాలంటే ఒక తల్లి కడుపులోనుంచే రావాలి. కనుక తల్లికి మన మతంలో అత్యంత గొప్ప స్థానం ఉన్నది. దైవాన్ని తల్లిగా పూజించడం మన మతపు అతి గొప్ప సౌలభ్యాలలో ఒకటి. శక్తి లేక శివుడు ఏమీ చెయ్యలేడని చెప్పడంలో కారణం కూడా ఇదే. ఆదిశక్తి నుంచే అన్నీ వచ్చాయని మనం నమ్ముతాం. అందుకే శక్తి ఆరాధన అన్నింటిలోకీ సర్వశ్రేష్టమని అంటారు. 

5. 'మూలాధారైక నిలయా బ్రహ్మగ్రంధి విభేదినీ' - మొదలుగా గల శ్లోకాల అర్ధం ఏమిటి?

ఈ నామాలు కుండలినీ యోగాన్ని సూచిస్తున్నాయి.

మూలాధారైక నిలయా బ్రహ్మగ్రంధి విభేదినీ - మూలాధార చక్రంలో ఉండి నువ్వు బ్రహ్మగ్రంధిని భేదిస్తున్నావు. మణిపూరాంతరుదితా విష్ణుగ్రంధి విభేదినీ - మణిపూరక చక్రంలో ఉండి నువ్వు విష్ణుగ్రంధిని భేదిస్తున్నావు. ఆజ్ఞాచక్రాంతరాళస్తా రుద్రగ్రంధి విభేదినీ - ఆజ్ఞాచక్రంలో ఉన్న నీవు రుద్రగ్రంధిని భేదిస్తున్నావు. సహస్రారాంబుజారూడా సుధాసారాభివర్షిణీ - సహస్రార చక్రానికి చేరిన నీవు అమృత వర్షాన్ని కురిపిస్తున్నావు. తటిల్లతా సమరుచి షట్చక్రోపరి సంస్థితా - మెరుపుతీగలా నీవు ఆరు చక్రాలను దాటి ఆ పైన ఉన్న భూమికను చేరుకుంటున్నావు. మహాశక్తి కుండలినీ బిసతంతు తనీయసీ - నీవు మహాశక్తివైన కుండలినివి. దేహంలో ఉన్న అన్ని నాడులనూ నీవు అమృత వర్షంతో తడుపుతున్నావు.

ఈ నామాలన్నీ శ్రీవిద్యలో మూల సాధనైన కుండలినీ జాగృతినీ, చక్రభేదనాన్నీ, గ్రంధి భేదనాన్నీ, అమృతవర్షాన్నీ సూచిస్తున్నాయి. మనలో మూడు గ్రంధులున్నాయి. సాధనలో వీటిని భేదించడం జరుగుతుంది. ఈ ప్రక్రియే ఇక్కడ సూచింపబడింది. వీటన్నిటినీ త్వరలో రాబోతున్న నా పుస్తకం - 'లలితా సహస్రనామ రహస్యార్థ ప్రదీపిక' లో వివరంగా చర్చించాను. అది చదవండి.

6. నాకు ఒక గురువు గారున్నారు. ఉపదేశం అయింది. కానీ నేను ఆయన చెప్పినట్లు చెయ్యడం లేదు. నాకు తోచిన రీతిలో చేసుకుంటున్నాను. ఇది దోషమా?

ఇలాంటి వారికి ఏం సమాధానం చెప్పాలి? గురువు చెప్పినట్లు విననప్పుడు అసలు వీళ్ళు ఎందుకు దీక్షలు తీసుకుంటారో? నాకు నవ్వొచ్చింది. ఆమెకు ఇలా చెప్పాను.

జవాబు:-- ఇందులో రెండు మార్గాలున్నాయి. ఒకటి - మీ మనసు చెప్పిన ప్రకారం మీరు పోవడం. రెండు - మీ గురువు చెప్పినట్లు వినడం. ప్రస్తుతం మీకు మీ మనసు చెప్పినట్లే నచ్చుతోంది కనుక అలాగే చెయ్యండి. ఇంతకంటే మీరు ఇంకేం చెయ్యగలరు? ఒకవేళ నేను ఇంకో రకంగా చెప్పినా మీరు వింటారో లేదో అనుమానమే. కనుక ప్రస్తుతానికి మీకు తోచిన రీతిలోనే మీరు చేసుకోండి.

7. అందరికీ గురువు దొరకడం కష్టం కదా? అలాంటి వారు ఏం చెయ్యాలి?

జవాబు:-- ఇందులో కష్టం ఏమీ లేదు. మీకు నిజమైన ఆర్తి ఉంటే, తప్పకుండా మీ గురువు లభిస్తాడు. భగవంతుడే ఆయన్ను మీ దగ్గరకు పంపిస్తాడు. కానీ మీరాయన్ని గుర్తించలేరు. అలా గుర్తించడానికి మీ అహం మీకు అడ్డొస్తుంది. ఆ అహాన్ని జయించనిదే మీకు గురు అనుగ్రహం ఎన్నటికీ దొరకదని అర్ధం చేసుకోండి. గురువు కోసం త్రికరణ శుద్ధిగా దైవాన్ని ప్రార్ధిస్తే మీకు గురువు తప్పకుండా లభిస్తాడు. ఇందులో అనుమానం లేదు.

8. పారాయణ చేసే సమయాలలో నియమనిష్టలు ఏవైనా పాటించాలా?

జవాబు:-- అలాంటి డొల్ల నియమనిష్టల మీద నాకు నమ్మకం లేదు. శుద్ధమైన హృదయం కలిగి ఉండటాన్ని మించిన నియమ నిష్టలు ఎక్కడా లేవు. మీరు ఉపవాసాలు ఉండవచ్చు, నేలమీద పడుకోవచ్చు, ఇంకా ఎన్నెన్నో చెయ్యవచ్చు, కానీ మీ నిత్యజీవితంలో మీ చుట్టూ ఉన్న వారితో సక్రమంగా మీరు ప్రవర్తించకపోతే మీ నియమ నిష్టలన్నీ దండగమారి పనులని తెలుసుకోండి. వాటివల్ల మీకు అహంకారం పెరగడం తప్ప ఉపయోగం ఏమీ ఉండదు.