నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

14, జూన్ 2017, బుధవారం

రెండవ అమెరికా యాత్ర -49 (మాషీ మా)

ఇక్కడ పెద్ద పార్టీలలో మన ఆడాళ్ళు చక్కగా తాగుతారు, వాగుతారు, డాన్స్ చేస్తారు అన్నీ చేస్తారు. కానీ నేను ఇవేవీ చేసేదాన్ని కాను. ఒక్క డాన్స్ మాత్రం చేస్తాను. మనం డాన్స్ చెయ్యాలంటే ఒక మగాడో ఆడదో మనకు తోడుగా ఏ మాత్రం అవసరం లేదు. నాలోలోపల ఉన్న సంతోషాన్ని వ్యక్తీకరించడం కోసం నేను డాన్స్ చేస్తాను. ఒకరి కోసం చెయ్యను. ప్రదర్శన కోసం చెయ్యను. ఒక గొప్ప వ్యక్తిచేత నేను బ్లెస్ చెయ్యబడ్డాను గనుక ఆ ఆనందంతో డాన్స్ చేస్తాను. అదీ నా పద్ధతి. నన్నిక్కడ 'బెల్ ఆఫ్ ది బాల్' అంటారు. అంటే ఏంటో మీకు తెలుసా? వీళ్ళు చేసేది బాల్ రూమ్ డాన్స్. బెల్ ఆఫ్ ది బాల్ అంటే బాల్ రూమ్ డాన్స్ లో సెంటర్లో ఉండి యాక్టివ్ రోల్ తీసుకునే అమ్మాయన్నమాట.

నాకు చావంటే ఏమాత్రం భయం లేదు. ఒక మంచి పనికోసం రిస్క్ తీసుకోవాలంటే కూడా నాకు భయం లేదు. మా నాన్న నన్ను ముద్దుగా 'మంజుగంజి' అని పిలిచేవాడు. ఆయనిలా అనేవాడు - ' నా మంజుగంజి ఎలాంటిదో తెలుసా? తను మామూలుగా పువ్వు కంటే మెత్తగా ఉంటుంది. కానీ అవసరమైతే వజ్రం కంటే కఠోరంగా ఉండగలదు.' అది అక్షరాలా నిజం. నేను ఎవ్వరినీ క్షమించలేను. ఒకటి రెండు సార్లు తప్పు చేస్తే ఓకే. దానికేమీ ఇబ్బంది లేదు. కానీ మూడో సారి అదే తప్పు గనుక చేస్తే ' గెట్ అవుట్ ఆఫ్ మై లైఫ్' అంటాను. అంతే. ఇక చస్తే ఆ మనిషిని ఎన్నటికీ క్షమించను.

కరుణ అనేది దైవలక్షణం.నిజమే. కానీ, అలుసు ఇవ్వడం అనేది కాదు. ఒక మనిషిని మనం క్షమిస్తూ పొతున్నపుడు అది ఆ వ్యక్తి అలుసుగా తీసుకుంటూ ఉంటె మనం చేస్తున్నది క్షమ కాదు. మనమే చేతులారా ఆ మనిషిని పాడు చేస్తున్నామని నా లెక్క.

నా కూతురు కొంచం పెద్దదౌతూ ఉన్నప్పుడు దానికి ఇలా చెప్పాను. 'నువ్వు చిన్నచిన్న తప్పులు చేస్తే పరవాలేదు. కానీ ఏదైనా పెద్ద తప్పు చేశావో, నేనే నిన్ను షూట్ చేసి పారేస్తాను. ఆ తర్వాత నన్ను నేను షూట్ చేసుకుంటాను. ఎందుకంటే, నా కూతుర్ని నేనే చంపవలసి వచ్చింది కాబట్టి.' నా అదృష్టం బాగుంది. తను ఎంతో మంచి వ్యక్తిగా తయారైంది. మీకు తెలుసా? అది నాకు పుట్టలేదు. దాన్ని నేను పెంచుకున్నాను.

ఈ మే నెల ఒకటో తేదీకి దానికి 38 ఏళ్ళోచ్చాయి. అది చక్కగా బ్రతుకుతోంది. దాన్ని నేను పెంపకానికి తీసుకున్నప్పుడు మా వాళ్ళందరూ నన్ను విమర్శించారు. ఎందుకంటే అప్పట్లో బెంగాల్ అలా ఉండేది. మా పెద్ద బావగారు నన్నిలా అడిగారు. 'ఏమ్మా? పోనీ ఎవర్నైనా పెంచుకుందామని అనుకున్నప్పుడు అబ్బాయిని పెంచుకొని ఉండవచ్చు కదా? అమ్మాయిని పెంచుకుంటున్నారేంటి?' 

ఆయనకిలా చెప్పాను.

'దాదాజీ ! నాకే గనుక చాలినంత శక్తి, డబ్బు, అవకాశం ఉండి ఉన్నట్లయితే, ఒక్కమ్మాయిని కాదు, పదిమంది అమ్మాయిలను పెంచుకుని ఉండేదానిని. ఎందుకంటారా? మన సంఘంలో అమ్మాయిల పరిస్థితి ఎలా ఉన్నదో మీరు చూస్తున్నారు కదా?'

నేను చాలా సున్నిత మనస్కురాలిని. ఎదుటి మనిషి బాధల్లో ఉంటే వారికోసం నేనేమైనా చెయ్యగలను. కానీ అవసరం అయితే, సత్యం కోసం నిలబడవలసి వస్తే, ప్రపంచమంతా ఎదురైనా సరే, ఒక్కదాన్నే నిలబడగలను.

మీకు రవీంద్రనాద్ టాగోర్ పాట ఒకటి తెలుసా? 'జోది తొర్ దక్ష్ నెక్యు నాషే, తోబి ఎక్లో చలో దే'... '

'లేదు మాకు తెలీదు' అని మేమన్నాం.

'అద్భుతమైన పాట! దానర్ధం మీకు తెలుసా? వినండి. 'నువ్వు పిలిచినప్పుడు ఎవరూ నీ తోడుగా రాకపోతే, నువ్వొక్కడివే నడువ్. చీకటి వర్షపు రాత్రిలో సహాయం కోరుతూ నువ్వు తలుపు తడుతున్నపుడు ఎవరూ నీకు తలుపు తియ్యకపోతే, వర్షపు మెరుపుతో నీ హృదయాన్ని వెలిగించుకుని, నీ దారిని నువ్వే సృష్టించుకొని ఆ దారిలో నడువ్. దారంతా ముళ్ళతో నిండి ఉండి, నీతో నడవడానికి ఎవరూ ముందుకు రాకపోతే, నువ్వొక్కడివే నీ కాళ్ళతో ఆ ముళ్ళను తొక్కిపారేయ్' అది ఆ పాట. ఎంత గొప్పదో చూడండి !

నీ స్వార్ధం కోసం కాకుండా, ఒక మంచిపనిని నువ్వు చేస్తున్నపుడు, ఎవరూ నీకు సాయం చెయ్యకపోతే, ఏం పరవాలేదు. భయపడకు. నువ్వే ధైర్యంగా ముందు కెళ్ళు.' అన్న సందేశాన్ని ఆ పాట ఇస్తుంది.

సరే ఆ విషయాలలా ఉంచుదాం.

'మా నాన్నగారు రామకృష్ణా మఠంలో సన్యాసిగా కావాలని అనుకున్నారు. కానీ శారదానంద స్వామి, శివానంద స్వామి మీకు తెలుసా? వాళ్ళు ఠాకూర్ ప్రత్యక్ష శిష్యులు. వాళ్ళు ఏమన్నారో తెలుసా? 'వద్దు. నువ్వు పెళ్లి చేసుకో. ఎక్కువమంది పిల్లల్ని కను. వాళ్ళు అమ్మ సందేశాన్ని లోకానికి వినిపిస్తారు.' అని చెప్పారు.

నేను ఆ సంతానంలో ఒకరిని. దానికి నేను గర్విస్తున్నాను. నేనేం చేస్తున్నానో తెలుసా? ప్రస్తుతం నేనే గుడికీ,ఏ మసీదుకీ, ఏ చర్చికీ, ఎక్కడికీ వెళ్ళను. ఆయా కమిటీలలో చాలా రాజకీయాలుంటాయి. ఏవైనా రాజకీయాలు వగైరా అక్కడ జరుగుతున్నాయని తెలిసినప్పుడు నేనక్కడికి వెళ్ళడం మానేస్తాను. నన్ను కమిటీ మెంబర్ గా ఉండమని చాలా గుళ్ళలో అడిగారు. నేనా పనిని ఎన్నటికీ చెయ్యను. నాకెందుకా గోల? ఆలయాన్ని నా హృదయంలోకే తెచ్చుకున్నాను. అక్కడే నా పూజ. కాకుంటే ఎవరైనా ఏదైనా సాయం అడిగితే చేస్తాను. ఉదాహరణకు, ఇక్కడ చాలామంది మన విద్యార్ధులు ఉంటారు. ఎవరైనా విద్యార్ధి 'మాషీ! కొంచం స్టోర్ కు తీసుకు వెళతారా మీ కారులో?' అని అడిగితే ఆ సాయం చేస్తాను. మా ఆయన ఉన్నరోజులలో కూడా చాలామంది స్టూడెంట్స్ కు నేను ఎంతో సాయం చేసేదానిని. ఆయనెప్పుడూ బిజీగా ఉండేవాడు. అందరితో సరదాగా నేనిలా చెప్పేదానిని. ' మీకు మంచి సర్జన్ కావాలంటే మా ఆయన దగ్గరకు వెళ్ళండి. ఆయన మంచి సర్జనే. కానీ మంచి భర్త కాదు. మా ఆయన్ని పెళ్ళిమాత్రం చేసుకోకండి. ఎందుకంటే భార్యను ఏమాత్రం పట్టించుకోకుండా తన ప్రాక్టీస్ లోనే ఎప్పుడూ మునిగి ఉంటాడు.'

'ఆయన తనను తనే నిర్లక్ష్యం చేసుకునేవాడు. ఆయన లోకం అంతా పేషంట్లే. ఎప్పుడూ వారిదే ధ్యాస. మా నాన్న కూడా అలాంటి వ్యక్తే. ఆయనకు పన్నెండుమంది సంతానం. ఏడుగురు అబ్బాయిలు. అయిదుగురు అమ్మాయిలు. మేము పెద్దగా డబ్బున్న వాళ్ళం కాము. ఆయన కలకత్తా యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేసేవాడు. మేము శ్యాం బజార్ లో శ్రీశ్రీమా ఇంటి దగ్గరలోనే ఉండేవాళ్ళం. మా నాన్న ఆదేశం ప్రకారం మా ఇంటి తలుపు ఉదయం అయిదు నుంచి రాత్రి పన్నెండు వరకూ తెరిచే ఉండేది.  ఎవరొచ్చినా సరే, వారికి ఆశ్రయం, ఆసరా, భోజనం, ప్రేమ మా ఇంట్లో లభించేవి. అందరూ మా అమ్మను 'అమ్మా' అని పిలిచేవాళ్ళు. మా నాన్నను 'సార్' అనేవాళ్ళు. ఇప్పుడో? అంతా మారిపోయింది? 'హే జాన్? హౌ ఆర్ యూ?' అంటున్నారు. 'హేయ్ బాబ్ ! సినిమాకు పోదామా?' అంటున్నారు. మన సాంప్రదాయం ప్రకారం మనం ఈ విధంగా మన టీచర్ తో మాట్లాడకూడదు. మనం అలా ఎన్నటికీ చెయ్యలేము. దీనికి తోడు మా ఇంట్లో అయిదుగురు హెల్పర్స్ ఉండేవారు. వారిని పనివాళ్ళు అని నేను పిలవలేను. పిలవను కూడా. హెల్పర్స్ అంటాను. వాళ్ళు కూడా మాతోనే ఉండేవారు. అంతమంది హెల్పర్సు మా ఇంటిలో ఉండబట్టే నేనిలా వంటరాకుండా తయారయ్యాను.

దీనికి తోడు, పల్లెటూర్ల నుంచి వచ్చే పోయే బంధువులు, మా ఇంట్లోనే ఉండి కలకత్తాలో స్కూళ్ళలో కాలేజీలలో చదువుకునే మా బంధువుల పిల్లలు - ఈ రకంగా మా ఇల్లంతా ఎప్పుడూ ఒక పెద్ద తిరణాల లాగా ఉండేది. 'ఒక మనిషికి ఒక రూమ్' అనే పధ్ధతి మా ఇంట్లో ఎప్పుడూ మాకు తెలీదు. అందరం అదే ఇంట్లో ఉంటూ ఉండేవాళ్ళం. అంతే !

ఆరోజుల్లో బెంగాలీ కుటుంబాలలో ఆడపిల్ల అంటే 17 లేదా 18 ఏళ్ళు వచ్చేసరికి పెళ్లి అయిపోవాలి. లేదంటే వింతగా చూచేవాళ్ళు. కానీ మా నాన్న అలా చెయ్యలేదు. మేమందరం చక్కగా కాలేజీలలో చదువుకున్నాం. మా పెద్దక్క నాకంటే 18 ఏళ్ళు పెద్దది. ఆమె ఇప్పుడు లేదు. వెళ్ళిపోయింది. నేను ఏడుగురు అన్నయ్యల తర్వాత పుట్టాను. మొత్తం మా అమ్మవైపు నాన్న వైపు చూస్తె నాకు 25 మంది అన్నయ్యలుండేవారు.

నేను పుట్టినప్పుడు మా పెద్దక్క, మా ఇంటి నాలుగో అంతస్తుపైకి వెళ్లి, పళ్ళెం మోగించింది. ఎందుకో తెలుసా? మా ఇంట్లో ఇన్నేళ్ళ తర్వాత అమ్మాయి పుట్టిందని చెప్పడానికి. మా ఇంట్లో రూల్ ప్రకారం - అబ్బాయిలకంటే అమ్మాయిలను ఎక్కువగా ముద్దు చేసేవాళ్ళు. మా ఇంటికి కోడలు వస్తే, కూతురికంటే ఆమెను ఎక్కువగా చూసేవాళ్ళు. కోడలు ఫస్ట్, కూతురు సెకండ్, కొడుకులు థర్డ్ - అదీ మా ఇంటి రూల్. మా ఇల్లు అలా విచిత్రంగా ఉండేది. మా నాన్నగారి రూల్స్ అలా ఉండేవి. దానికిప్పుడు నేనెంతో గర్విస్తున్నాను.

మా ఇంట్లో కోడళ్ళకు ముందు భోజనం దొరికేది. ఆ తర్వాత కూతుళ్ళు తినేవారు. ఆ తర్వాత ఏదన్నా మిగిలి ఉంటె కొడుకులు తినేవాళ్ళు. అలా ఉండేది మా ఇంటి పద్ధతి.

తమ తమ భార్యలతో మా అన్నలు దురుసుగా మాట్లాడితే మా అమ్మా నాన్నా ఊరుకునేవాళ్ళు కారు. ఎందుకంటే - వాళ్ళు పరాయి ఇంటి ఆడపిల్లలు. వాళ్ళను మన పిల్లలుగా మనం మార్చుకోవాలి. లేకుంటే ఎవరా పనిని చేస్తారు? అని మా నాన్న అనేవారు.

మన ప్రేమతో వాళ్ళను మనం నింపాలి. మనం వాళ్లకు వజ్రాల చీరలు ఇవ్వలేకపోతే పోవచ్చు. కానీ ప్రేమను వారికి ఇవ్వగలం. ప్రేమకు డబ్బుతో పని లేదు. వాళ్ళు మన ఇంటి మహాలక్ష్ములు. మన ఇంటిలో పని చెయ్యడానికి వచ్చిన నౌకర్లు కారు - అని మా నాన్న అనేవారు.

మన ఆడపిల్లలు పెళ్ళయ్యాక ఏ ఇంటికి వెళతారో మనకు తెలియదు. కనుక వాళ్లకు అండగా చదువు ఉండాలని మా నాన్న ఆరోజుల్లోనే అనేవారు. ఎందుకంటే - మా బంధువులలోనూ, మా ఇంటి ఇరుగు పొరుగు లోనూ ఎందఱో కోడళ్ళు వారివారి అత్తమామల హింస భరించలేక ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇవి మేం చూశాం. అందుకనే, ఆడపిల్లలకు చదువు తప్పక ఉండాలని మా నాన్న అనేవారు. ఎందుకంటే - మాకు కూడా అత్తగారింట్లో అలాంటి హింస ఎదురైతే - మేం బయటకు రావచ్చు. ఏ టీచర్ గానో ఏదో ఉద్యోగం చేసుకుంటూ మా కాళ్ళమీద మేం నిలబడవచ్చు. మా బ్రతుకు మేం బ్రతకవచ్చు. అదీ మా నాన్న ఆలోచన !

ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చెయ్యకుండా ఇలా చదివిస్తున్నందుకు మా బంధువులందరూ మా నాన్నను వెలి వేస్తామన్నారు. దానిని మా నాన్న ఏమన్నారో తెలుసా? 'మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి.' అన్నారు.

స్వామి వివేకానంద, సిస్టర్ నివేదితలను చూచి మా నాన్న ఉత్తేజాన్ని పొందారు. వారి భావాలను అర్ధం చేసుకున్న ఫలితం ఇది. బాగ్ బజార్లో మన హిందూ అమ్మాయిలకోసం సిస్టర్ నివేదిత ఒక స్కూల్ ను తెరిచింది. ఆ స్కూల్ ఇంకా ఇప్పటికీ ఉంది. 

మా పెద్దక్కకు  18 ఏళ్ళు, మా చిన్నక్కకు 14 ఏళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు క్రిస్టియన్ స్కూల్స్ కు వెళ్ళేవాళ్ళు. 'నీ కూతుళ్ళను క్రిష్టియన్ స్కూల్స్ లో చదివిస్తున్నావా? అని మా నాన్నను మా బంధువులు అందరూ తిట్టారు. కానీ మా నాన్న లెక్క చెయ్యలేదు. ఎందుకంటే - చదువు విలువ ఏమిటో ఆయనకు బాగా తెలుసు. క్రిస్మస్ టైం లో స్కూల్ డ్రామాలు జరిగినప్పుడు మా అక్క 'మదర్ మేరీ' గా వేషం వేసేది.

కానీ మా అమ్మ మాత్రం ఏనాడూ ఆ స్కూల్స్ కు వెళ్ళేది కాదు. ఆమె ఒక చదువులేని చాదస్తపు కుటుంబం నుంచి వచ్చింది. కానీ చాలా ప్రేమమయి. ఇతరులు అనవసరంగా తాకితే ఆమెకు నచ్చేది కాదు. అందరికీ వండి పెట్టేది ప్రేమగా ఉండేది, కానీ కొంచం మడి పాటించేది. ముస్లిమ్స్ అంటే ఆమెకు పడేది కాదు. వాళ్ళు అంత నమ్మదగ్గ మనుషులు కారని ఆమె విశ్వాసం. మా నాన్న అవేవీ పాటించేవారు కారు. కానీ చివరకు చివరకు ఆమెను కూడా తనలా మా నాన్న మార్చగలిగారు.

(ఇంకా ఉంది)