“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

3, జులై 2017, సోమవారం

అమెరికా జనజీవనం - నా అభిప్రాయాలు

'స్వర్గమంటే ఇదేరా' అంటూ ఒక పోస్ట్ ఇంతకు ముందు అమెరికానుంచి వ్రాశాను. చెట్లు చేమలు, ప్రకృతి, మంచి రోడ్లు, వసతులు, ఎవడి గోల వాడిదిగా ఉంటూ పక్కవాడిని పట్టించుకోని జీవితాలు - వీటిని దృష్టిలో పెట్టుకుని మాత్రమే నేనా పోస్ట్ వ్రాశాను. అంతేగాని అమెరికా మొత్తం స్వర్గమే అని నా ఉద్దేశ్యం కాదు. కనిపించని నరకం కూడా అక్కడ చాలా ఉంది. అదేంటో ఈ సీరీస్ లో వ్రాస్తా.

వైట్ సుప్రీమసీ / రేసిజం

అమెరికా భూతల స్వర్గమేమీ కాదు. అక్కడ బాధలు అక్కడున్నాయి. వైట్ సుప్రీమసీ అనేది అక్కడ అన్ని రంగాలలోనూ అంతర్లీనంగా ఉంటుంది.

స్వతహాగా అమెరికా ఎవడబ్బ సొమ్మూ కాదు. అక్కడున్న అందరూ బయటనుంచి వచ్చి అక్కడి నేటివ్ అమెరికన్స్ అయిన రెడ్ ఇండియన్స్ ను దారుణంగా చంపేసి, లేదా వాళ్ళను డ్రగ్స్ కు అలవాటు పడేలా చేసి, ఆ నేలను ఆక్రమించి ఇది మాది అన్నవాళ్ళే. ప్రపంచం లోని అన్ని దేశాలనుంచీ అక్కడకు వలస వచ్చిన వాళ్ళున్నారు. కాకపోతే - ముందు వలస వచ్చిన వాళ్ళు తర్వాత వస్తున్నవాళ్ళను రావద్దంటున్నారు.

స్టాట్యూ ఆఫ్ లిబర్టీ క్రింద వ్రాసినట్లు 'అన్నిచోట్ల బాధలు పడుతున్న వాళ్ళు ఇక్కడకు రండి. నేను మీకు నీడనిస్తాను' అనే భావన ఉత్త చెప్పుకోడానికి మాత్రమే బాగుంటుంది. రియాలిటీ ఏమంటే, తెల్లతోలు కాని ప్రతివాడినీ తేడాగా చూడటం. ఒకవైపు అలా చూస్తూనే - ఇంకోవైపు టానింగ్ కోసం నానా ప్రయత్నాలూ చేస్తారు అక్కడ వాళ్ళు. అదొక విచిత్రం.

మనమంటే అమెరికా వాళ్లకు ఏమీ ప్రేమ లేదు. ఉండదు కూడా. వారికి మన టాలెంట్ కావాలి. మన చీప్ లేబర్ కావాలి. కానీ మనల్ని వాళ్ళతో ఎప్పటికీ కలుపుకోరు. అమెరికాలో కొన్ని కొన్ని రాష్ట్రాలలో ఇప్పటికీ పూర్తిగా వైట్స్ మాత్రమే ఉన్న ప్రాంతాలు ఉన్నాయి. ఆ ఊళ్లకు మనం పోతే చాలా తేడాగా చూస్తారు. అసలు వీళ్ళెందుకు ఇక్కడికొచ్చారు? అన్నట్లు వాళ్ళ చూపులుంటాయి.

ఉద్యోగాలలో మనవాళ్ళను టాప్ పొజిషన్స్ లోకి రానివ్వడం అంత సులభంగా జరిగే పని కాదు. మనవాళ్ళంతా ఇనిషియల్ లెవల్లోనో లేదా మిడిల్ మేనేజిమెంట్ లోనో ఉంటారు గాని టాప్ మేనేజిమెంట్ పొజిషన్ లోకి ఎదగడం అందరికీ సాధ్యం కాదు. అందరూ సత్య నాదెళ్ళ అవాలనుకుంటే అది అసంభవం.

ఒక మేనేజరియల్ పొజిషన్ లోకి ఇండియనా లేక అమెరికనా అన్న చాయిస్ వారికి ఉన్నపుడు అమెరికా వాడికే ప్రాధాన్యతనిస్తారు గాని మనకివ్వరు. ఎందుకంటే వారికి మనపైన నమ్మకం తక్కువ. మనం అలా ఎదగడం వారికి సుతరామూ ఇష్టం ఉండదు.

మనం వారిని ఎంత పూసుకున్నా మనల్ని వాళ్ళు నమ్మరు. వాళ్ళ ఫంక్షన్స్ కి మనల్ని ఆహ్వానించరు (మనతో వాళ్లకు ఏదైనా ఉపయోగం ఉంటే తప్ప). ముప్పై ఏళ్ళుగా అక్కడ ఉన్న మనవారికి కూడా అమెరికన్ వైట్స్ లో ప్రాణస్నేహితులు ఉండరు. వాళ్ళు మనల్ని ఎప్పటికీ పరాయి వాళ్ళుగానే చూస్తారు, మన టాలెంట్ ని వాడుకుంటారు గాని మనల్ని వాళ్ళలో కలవనివ్వరు. ఇది నిజం.

తరతరాలుగా వారితోనే కలసి ఉంటున్న నల్లవారినే అమెరికా తెల్లవాళ్ళు తమతో కలవనివ్వడం లేదు. నిన్నగాక మొన్న అక్కడకు వెళ్ళిన మనవాళ్ళను ఎలా కలుపుకుంటారు? అది జరగని పని.

చాలామంది అమెరికా అంటే భూతల స్వర్గం అనుకుంటారు. అక్కడ మోసం లేదని భ్రమిస్తారు. అది నిజం కాదు. మనదగ్గర ఉన్నని ఫ్రాడ్స్ అక్కడ కూడా ఉన్నాయి. అయితే, అక్కడ దొంగలు నేడు కాకుంటే రేపు దొరుకుతారు. ఇక్కడ త్వరగా దొరకరు. ఒకవేళ దొరికినా తేలికగా తప్పించుకుంటారు.

అక్కడ సమాజంలో ప్రజలందరూ పాటిస్తున్న రూల్సన్నీ చట్టానికి భయపడి మాత్రమే గాని అక్కడున్న అందరూ పతివ్రతలని కాదు. న్యాయమనేది కొంచం లూజైతే అక్కడ జరిగే ఘోరాలు దోపిడీలు ప్రపంచంలో ఇంకెక్కడా జరగవు. అక్కడ సమాజం అంతా ఒక టైం బాంబ్ లాగా నాకనిపించింది. అక్కడంతా కృత్రిమత్వమే గాని సహజత్వం తక్కువ.

అక్కడ సమన్యాయం కూడా లేదు. ఒకే నేరాన్ని ఒక తెల్లోడు నల్లోడు చేస్తే అందులో నల్లోడికే ఎక్కువ శిక్ష పడుతుంది. తెల్లోడికి పడదు. లేదా తక్కువ పడుతుంది. ఈ విధంగా ఎక్కడా కాగితం మీద వ్రాసి లేనప్పటికీ, ప్రాక్టికల్ గా మాత్రం ఈ పార్షియాలిటీ ప్రతి చోటా దర్శనమిస్తుంది. తెల్లవాళ్ళు చేసిన నేరాలను చక్కగా సమర్ధించుకుంటారు, కప్పిపుచ్చుకుంటారు. బయటవాళ్ళు చేస్తే మాత్రం భూతద్దంలో చూపిస్తారు. ఇది అమెరికాలో సర్వసాధారణంగా జరుగుతున్నది.

లాబీయింగ్ / కాంటాక్ట్స్ 

పనులు జరగాలంటే అక్కడ లాబీయింగ్ తప్పనిసరిగా ఉంటుంది. లాబీయింగ్ అంటే లీగల్ కరప్షన్ తప్ప ఇంకేమీ కాదు. కొంతమంది గ్రూపులు కట్టి లా మేకర్స్ ను ప్రభావితులని చేసి తమ పనులు చేసుకోవడం లేదా తమకు అనుగుణంగా చట్టాలు వచ్చేలా చూచుకోవడం అమెరికాలో బ్రహ్మాండంగా జరుగుతున్నది. ఇది చాలా హై లెవల్ లో సర్వసాధారణంగా జరుగుతున్న కధ.

ఉద్యోగాలలో కానీ, రాజకీయాలలో కానీ ఎదగాలంటే అక్కడ కాంటాక్ట్స్ చాలా అవసరం. అన్నీ సమంగా ఉన్నప్పుడు కాంటాక్ట్స్ ఉన్నవాడికే విజయం లభిస్తుంది. ఇది మన ఇండియాలో కూడా ఉంది. ఇక అమెరికాకూ మనకూ తేడా ఏంటి?

ఇంటర్నల్ మోసాలు / వెన్నుపోట్లు 

ఇకపోతే, అక్కడున్న మనవాళ్ళలో మన గొడవల సంగతి చూద్దాం. అక్కడ సెటిలైన మనవాళ్ళు కొందరు పార్ట్ నర్స్ గా ఏర్పడి వ్యాపారాలు మొదలు పెట్టిన వాళ్ళున్నారు. ఎక్కువగా వీళ్ళు హోటల్ బిజినెస్ చేస్తూ ఉంటారు. వీళ్ళలో ఒకరి నొకరు మోసం చేసుకుని పార్ట్ నర్స్ ని ముంచడం చాలా తరచుగా జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా మనవాళ్ళ చేతుల్లోనే మునిగిన మనవాళ్ళు నాకు తెలుసు. ఎక్కడికి పోయినా బుద్ధులు మారవు కదా !

ఇన్సులేటెడ్ జీవితాలు

మనవాళ్ళు అక్కడి న్యూస్ చూడకుండా, చుట్టూ ఏం జరుగుతున్నదో చూసుకోకుండా బావిలో కప్పల్లాగా ఇన్సులేటెడ్ జీవితాలు గడుపుతూ ఉంటే వాళ్లకు అంతా బాగున్నట్లే భ్రమ కలుగుతుంది. అమెరికా స్వర్గమే అనిపిస్తుంది. కానీ కొంచం అక్కడ సొసైటీతో ఇన్వాల్వ్ అయితే అప్పుడు మాత్రమే అక్కడి కష్టాలు మోసాలు బాధలు భయాలు అర్ధమౌతాయి. అది చెయ్యకుండా మన ఉద్యోగం చేసుకుంటూ, షాపింగ్ కెళుతూ, అప్పుడప్పుడూ మనవాళ్ళతో కలసి సినిమాలు చూస్తూ, ఒకరి ఇళ్ళలో ఒకరు పార్టీలు చేసుకుంటూ, లేదా అప్పుడప్పుడు దగ్గరలోని గుడికెళ్ళి వస్తూ - అంతా బాగుంది, అమెరికా స్వర్గం అనుకుంటే అంతకంటే పెద్ద భ్రమ ఇంకోటి ఉండదు.

మన ఇండియన్స్ లో చాలామంది అమెరికాలో ఇలాంటి ఇన్సులేటెడ్  జీవితాలే గడుపుతున్నారు. వీరంతా ఇండియాలో బ్రతికిన బ్రతుకునూ ఇప్పుడు అమెరికాలో బ్రతుకుతున్న బ్రతుకునూ పోల్చుకుని తాము స్వర్గంలో ఉంటున్నామని అనుకుంటే అది భ్రమ మాత్రమే. ఎందుకంటే వారివి ఇన్సులేటెడ్ జీవితాలు మాత్రమే. వారు పొందుతున్నాం అనుకుంటున్న స్వేచ్చ నిజానికి స్వేచ్చ కాదని కొంచం గమనిస్తే వారికి అర్ధమై పోతుంది.

కల్చరల్ గ్యాప్

అన్నిటినీ మించి మనవాళ్ళను వేధిస్తున్న సమస్య కల్చరల్ గ్యాప్. అక్కడ పుట్టి పెరిగిన మనవాళ్ళ పిల్లలు ఇండియన్స్ కారు. కాలేరు. వాళ్ళు అమెరికన్స్ గా అమెరికన్ లైఫ్ స్టైల్ లోనే పెరుగుతారు. ఎంతగా వాళ్లకు అన్నమాచార్య కీర్తనలు వినిపించినా, ఎంతగా భగవద్గీత శ్లోకాలు నేర్పించి పోటీలు పెట్టి ప్రైజులు ఇచ్చినా వాళ్ళు గడప దాటి బయటకెళితే బ్రతకవలసింది అమెరికన్ సొసైటీలోనే. దాని ప్రభావాన్ని వాళ్ళు తప్పుకోలేరు. కనుక వాళ్ళు మన కల్చర్ కు తప్పకుండా దూరమౌతారు. రెండు తరాలు గనుక ఇలాగే అమెరికాలోనే బ్రతికితే ఇక వాళ్ళు పూర్తిగా అమెరికన్స్ గా మారిపోతారు. ఇది ఖాయం.

అందుకని ఇప్పుడు చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను ఇండియాలో అమ్మమ్మ తాతయ్యల దగ్గర ఉంచి బీ టెక్ దాకా చదివించి, పీజీకి అమెరికాకు తీసుకెళుతున్నారు. అప్పుడైతే 'బెస్ట్ అఫ్ ది బొత్ వరల్డ్స్' వారి సొంతమౌతుందని వారి ఊహ. ఇది తెలివైన పనే. కానీ ఈ క్రమంలో ఒక ఇరవై ఏళ్ళపాటు తల్లిదండ్రులకు పిల్లలు దూరం కాక తప్పదు. ఈ విధంగా ఎక్కడో ఒకచోట ఏదో ఒక లోటు తప్పకుండా ఉంటూనే ఉంటుంది. ఎక్కడా ఏ లోసుగూ లేకుండా అవీ ఇవీ పొందుతూ అన్నీ పర్ఫెక్ట్ గా మేనేజ్ చెయ్యడం అనేది జరగని పని.

(ఇంకా ఉంది)