నిజమైన అదృష్టవంతులు మాత్రమే మాతో చేయి కలుపుతారు

7, జులై 2017, శుక్రవారం

కరిగిన వినువీధి

విసిరేసిన చీకట్లో
అకాలపు వర్షం
నిశిరాత్రపు వాకిట్లో
అకారణ హర్షం

అలుపు లేని విశ్వాసం
వినువీధిని కరిగిస్తుంది
అలవికాని నిశ్వాసం
పెనుజల్లులు కురిపిస్తుంది

పుడమి వనిత చేయిచాస్తే
ఆకాశం సొంతమౌతుంది
కడమ వరకు వేచి ఉంటే
ఆరాటం అంతమౌతుంది

ప్రతి ఎదురుచూపునూ
ఒక కలయిక కుదిపేస్తుంది
ప్రతి బెదురు గుండెనూ
ఒక యవనిక మురిపిస్తుంది

ప్రియుని కోసం ఎదురుచూస్తూ
నువ్వుండాలి
వానకోసం ఎదురుచూచే
పుడమిలా

మౌనంగా నీ విరహాన్ని
తెలపాలి
జల్లుకోసం ఎదురెళ్ళే
వేడిమిలా...