“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

16, జులై 2017, ఆదివారం

ఈ రోజు నేనేం చేస్తున్నాను?

తిధుల ప్రకారం ఈరోజు నేను పుట్టినరోజు. పొద్దుటినుంచీ యధావిధిగా శిష్యులూ అభిమానులూ విషెస్ పంపిస్తున్నారు. కొందరు బాగా దగ్గరైన వాళ్ళు అనేక ప్రశ్నలు చనువుగా అడుగుతున్నారు. ఈరోజు నా షెడ్యూల్ ఎలా ఉంటుందా అని చాలామందికి సందేహాలున్నాయి. వారికందరికీ ఈ కవితే జవాబు.
------------------------------
ఈరోజు మామూలుగా నిద్రలేవలేదు
లోకం ఎరుగని ఎరుకలోకి
సునిశితంగా చూస్తూ నిద్రలేచాను

జన్మనిచ్చిన తల్లిని స్మరిస్తూ
జన్మజన్మల తల్లిని కూడా స్మరించాను

శరీరానికి తలంటి పోస్తూ
తలపులకూ తలంటి పోశాను

ఒంటికి పట్టిన మురికిని వదిలిస్తూ
మనసుకు పట్టిన మురికినీ కడిగేశాను

కొత్త దుస్తులు ధరిస్తూ
పాత దేహాన్ని వదలి షికారు కెళ్ళాను

రాళ్ళతో కట్టిన గుడికెళ్ళలేదు
సజీవపు గుండెలోకి తొంగి చూచాను

పనికిరాని పూజలు చెయ్యలేదు
లోపలి వెలుగును స్మరించాను

కొవ్వొత్తులు ఆర్పను
గుండెలలో దీపాలు వెలిగిస్తాను

వీధుల్లో తిరగను
లోపలి వీధుల్లో విహరిస్తాను

స్పెషల్ భోజనం చెయ్యను
స్పెషాలిటీనే వదిలేస్తాను

వస్తువులు కొనను
ఉన్నవాటినే వదిలిస్తాను

సినిమా కెళ్ళను
'లోకం' అనే సినిమా చూస్తాను

స్నేహితులను పలకరించను
నా హితులను తలచుకుంటాను

బంధువుల ఇళ్ళకెళ్ళను
నిత్యబంధువుతో ముచ్చట్లాడతాను

తాగి తందనాలాడను
నా మత్తులో నేనే చిత్తైపోతాను

పుట్టిన రోజును జరుపుకోను
ఎప్పుడూ పుట్టని వెలుగులో నిలిచి ఉంటాను