బెంగుళూరులో 50 రోజుల అజ్ఞాతవాసదీక్షను ముగించుకొని ఈరోజే తిరిగి ఆశ్రమానికి వచ్చేశాం, కనీసం బెంగుళూరు శిష్యబృందాన్ని కూడా కలవకుండా !
అక్కడున్న 50 రోజులలో ఒక్క U.G గ్రూపును తప్ప ఇంకెవరినీ కలవలేదు. అదికూడా ఒక్కరోజుమాత్రమే.
కనీసం రామకృష్ణా మిషన్ ఆశ్రమం వైపు తలతిప్పి కూడా చూడలేదు.
ఇది విని, "అదేంటి? అలాంటి దీక్షలు కూడా ఉంటాయా?" అని ఒకరన్నారు.
"ఇవి తెలియకపోవడం మీ అదృష్టం" అన్నాను.
"పక్కనే ఉన్న మైసూరు వెళ్లి అమ్మవారి దర్శనం కూడా చేసుకోలేదా?" అన్నారింకొకరు.
"ఎదురుగా ఉన్నదే కనిపించనపుడు, ఇక పక్కనున్నది ఏం కనిపిస్తుంది?" అన్నాను.
"కనీసం బెంగుళూరులో గుళ్ళయినా చూడలేదా?" ఇంకొకరన్నారు.
"చాలా చూశాను నా గదిలో కూచుని" అన్నాను.
"ఎలా తోచింది?" మరొకరడిగారు.
"తోచవలసిన అవసరమేముంది?" అన్నాను.
"ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆశ్రమం అక్కడే ఉంది. కనీసం అదైనా చూడలేదా?" ఒకాయన సందేహం.
"లివింగ్ తెలిసినవాడికి ఆ శ్రమ ఎందుకు?" అన్నాను.
"మీకు జోతిషమంటే ఇంట్రెస్టు కదా? అక్కడ చాలా నాడీజ్యోతిష సెంటర్లున్నాయి. కనీసం వాటినైనా చూసి ఉండచ్చు కదా?" అడిగారు మరొకరు.
"ఉన్న ఒక్క నాడి సరిగ్గా కొట్టుకుంటే చాలు." అన్నాను.
"మరేం చేశారు ఈ ఏభై రోజులూ?" చివరి సందేహం.
ఒక హైకూను వినిపించాను.
కొండకొమ్ము
ఒంటరి ఆలయం
సూర్యుడు ఉదయిస్తున్నాడు
అస్తమిస్తున్నాడు
ఋతువులు వస్తున్నాయి
పోతున్నాయి.
గర్భగుడి ఖాళీగా ఉంది
గుళ్ళో చెట్లు మాత్రం విరగబూశాయి.