ఒక వ్యక్తి 66 ఏళ్ళనుండి 99 ఏళ్ల లోపు బ్రతికితే దీర్ఘాయుష్కుడనీ, నూరుదాటి నూట ఇరవైవరకూ బ్రతికితే పూర్ణాయుష్కుడనీ జ్యోతిషశాస్త్రం అంటుంది. ఆ లెక్కన లాల్ కృష్ణ అద్వానీగారు పూర్ణాయుష్కుడే.
ఈయన 8 నవంబరు 1927 న, నాటి లాహోర్ లో పుట్టాడు. సమయం ఉదయం 9.27 గంటలు. తేదీలప్రకారం ఈరోజున 99 ఏళ్లను పూర్తిచేసుకుని 100 లో అడుగుపెట్టాడు. ఈయన జాతకంలోని పూర్ణాయుర్యోగాలను గమనిద్దాం.
కుజరాశిలో శనికేతువులుండటం తపస్వీయోగం. తపస్సనేది హిమాలయాలలోనే చేయనక్కరలేదు. ఒక గమ్యంకోసం తపిస్తూ బ్రతికేది ఏదైనా తపస్సే అవుతుంది. తపించడమే తపస్సని జిల్లెళ్ళమూడి అమ్మగారనేవారు. భారతదేశాన్ని ఉన్నతమైన స్థానంలో చూడాలని తపించిన దేశభక్తుడీయన. కనుక ఈయనయొక్క జాతకంలో ఈ యోగం ఉండటం వింత ఏముంటుంది?
ఈ యోగం క్రమశిక్షణను ఇస్తుంది. ఇది ఉన్నవాడు జీవితాన్ని చాలా క్రమబద్ధమైన విధానంలో జీవిస్తాడు. ఆహారవిహారాలలో జాగ్రత్తగా ఉంటాడు. కనుక ఎక్కువకాలంపాటు బ్రతుకుతాడు. శని లగ్నంలో ఉన్నవాడు క్రమశిక్షణతోనే జీవిస్తాడు. పైగా శనికి తృతీయాధిపత్యం కూడా పట్టింది. తృతీయం ఆయుస్థానాలలో ఒకటని మనకు తెలుసు.
ఆఫ్కోర్స్, ఆయుష్షనేది చాలావరకూ జీన్స్ మీద ఆధారపడి ఉంటుంది. కానీ, క్రమశిక్షణాయుతమైన జీవితంతో జీన్స్ ను కూడా మార్చుకోవచ్చు. ఇది కష్టమేగాని, అసాధ్యమేమీ కాదు.
తపస్వియోగంపైన గురుదృష్టి చాలామంచిది. ఇది మార్గంలోని అడ్డంకులను తొలగిస్తుంది. గురువక్రత్వం వల్ల ఆయనయొక్క పంచమదృష్టి మిథునంపైన పడుతుంది. ఇది లగ్నం నుండి అష్టమభావమౌతుంది. అష్టమభావం ఆయుస్థానం గనుక, దీర్ఘాయుష్షు లభిస్తుంది.
ఈయనది అశ్వినీరాశి రెండవపాదం. దేవవైద్యుల నక్షత్రం గనుక, ఏదైనా అనారోగ్యం కలిగినప్పటికీ త్వరగా తేరుకునే శక్తిని ఈ నక్షత్రం ఇస్తుంది.
రవిశుక్రులు నీచస్తితులలో ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ, లగ్నంలో శనివల్ల రవికి, చంద్రునికి సప్తమంలో బుధునివల్ల శుక్రునికీ నీచత్వంపోయి రాజయోగంగా మారుతుంది.
చంద్రునినుండి తృతీయాధిపతి బుధుడు సప్తమకేంద్రంలో ఉండటంచేత, వక్రతవల్ల ఉచ్ఛస్థితి పట్టడంచేత ఆయుష్షుకు బలం కలిగింది. అష్టమంలోని తపస్వీయోగం ఆయుష్షును పెంచుతుంది. అష్టమశని దీర్గాయుష్షునిస్తాడు.
సూర్యునినుండి తృతీయాధిపతి గురువు స్వస్థానంలో ఉన్నాడు. వక్రత్వం వల్ల కలిగే పంచమస్థితి గురుదృష్టిని సూర్యునిపైన ఉంచుతుంది. దీనివల్ల కూడా ఆయుష్షు పెరుగుతుంది. నవమాధిపతి బుధుని లగ్నస్థితి మంచిది. వక్రత్వం వల్ల ద్వాదశభావంలో ఉచ్ఛస్థితి లభిస్తుంది. తులాలగ్నానికి ద్వాదశభావం మంచిదే. లగ్న/అష్టమాధిపతి శుక్రునికి ద్వాదశంలో ఉచ్ఛత్వం కూడా మంచిదే. అష్టమంలో రాహువుయొక్క ఉచ్ఛస్థితి ఆయుష్షుకు మంచిది.
ఆరూఢలగ్నం కన్య అవుతుంది. దానినుండి తృతీయంలో తపస్వియోగం ఉన్నది. అష్టమంలో పూర్ణచంద్రుడున్నాడు. కనుక ఇక్కడనుండి కూడా ఈ రెండుభావాలూ బలంగా ఉన్నాయి.
దీనికితోడుగా నవాంశచక్రంలో సూర్యుడు, చంద్రుడు, గురువు ముగ్గురూ ఉచ్ఛస్థితులలో ఉన్నారు.
ఇన్ని గ్రహస్థితులు ఈయన ఆరోగ్యాన్నీ, ఆయుష్షునూ భద్రంగా చూస్తున్నాయి. కనుక విజయవంతంగా 99 ఏళ్లను పూర్తిచేసుకుని 100 వ ఏడులోకి అడుగుపెట్టాడు.
రాజకీయాలలో ఉంటూ నిండునూరేళ్ళు ఆరోగ్యంగా బ్రతకడం చాలా కష్టం. దానికెంతో క్రమశిక్షణతో కూడిన జీవితమూ, దైవానుగ్రహమూ ఉండాలి. అవి రెండూ ఈయనకున్నాయని ఈ జాతకయోగాలు చెబుతున్నాయి.
మోదీగారు అద్వానీగారి శిష్యుడే. ఆయనతో కలసి పనిచేసిన అనుచరుడే. తమ తరంవారు కలలుగన్న భారతదేశాన్ని, తన శిష్యుని నాయకత్వంలో అన్నిరంగాలలో ముందుకు దూసుకుపోతున్న భారతదేశాన్ని చూచి కనీసం తన జీవితం చివరిదశలోనైనా, తృప్తిపడగలగడం అద్వానీగారి జాతకంలోని అదృష్టం.
మనదేశం ఎన్నో ఒడిదుడుకులను, గాంధీనెహ్రూల కాలంనాటి కుట్రలను, కుతంత్రాలను తట్టుకుంటూ, ఏ విధంగా వాటిని దాటుకుంటూ ఈ స్థితికి వచ్చిందో, ఈ క్రమంలో ఎంతమంది సమిధలై చరిత్రపుటలలో కలసిపోయారో గత ఎనభైఏళ్లుగా చూస్తూ వచ్చిన ఇలాంటి కురువృద్ధులు తమ జ్ఞాపకాలను, అనుభవాలను అక్షరబద్ధం చేయాలి.
2008 లో విడుదలైన ఈయన ఆత్మకథ My country, My life నేను చదవలేదు. చూడాలి ఏం వ్రాశాడో !
