ఈ ఐదేళ్లలో ఎన్నో జరిగాయి. ఆశ్రమాన్ని స్థాపించడం జరిగింది. పంచవటిని విస్తృతపరచడం జరిగింది. నేను చూపిస్తున్న సాధనామార్గాన్ని ఎంతోమందికి పరిచయం చెయ్యడం జరిగింది. ఈ మధ్యలో అనేకమంది జ్ఞానార్థులు, శిష్యులు, సందర్శకులు, ఔత్సాహికులతో ఎన్నో విషయాలపైన నేను మాట్లాడాను. వారి ప్రశ్నలకు సమాధానాలిచ్చాను. ఆ సంభాషణలలో నుండి ఇంకొక 360 టాపిక్స్ ను ఏర్చికూర్చి ఇప్పుడు గురుపూర్ణిమ సందర్భంగా ఈ పుస్తకం యొక్క రెండవభాగంగా విడుదల చేస్తున్నాము. ఇదికూడా వెయ్యిపేజీల పుస్తకమే.
మొదటిభాగంలోలాగే ఇందులోకూడా, అన్నీ నిత్యజీవితంలో జరిగిన సంఘటనలనుండి, ఇతరులు అడిగిన ప్రశ్నలనుండి తీసుకున్నవే. ఊహించి వ్రాసినది ఒక్కటికూడా లేదు. కనుక, మీ జీవితంలో జరుగుతున్న అనేకవిషయాలకు, మీకొస్తున్న అనేక ఆధ్యాత్మికసందేహాలకు ఈ పుస్తకం అద్దాన్ని పడుతుంది. వాటికి స్పష్టములైన జవాబులనిస్తుంది.
ఒక్కవారంలో రాబోతున్న నా 63 వ పుట్టినరోజు సందర్భంగా దీని తెలుగు అనువాదం "వెలుగుదారులు-రెండవభాగం" గా విడుదల అవుతుంది. అనువాదం ఇప్పటికే పూర్తయింది. అదికూడా వెయ్యిపీజీలను దాటిపోయింది. దానిని ఒకే పుస్తకంగా ముద్రించడం కష్టం కనుక, రెండుభాగాలుగా ముద్రించి, 'వెలుగుదారులు' - 3 మరియు 4 భాగాలుగా, డిసెంబర్లో జరుగబోయే హైదరాబాద్ పుస్తకప్రదర్శన నాటికి మీకు అందుబాటులోకి తెస్తాము.
అజ్ఞానంలో పడి, ఎవరేది చెబితే దాన్ని నిజమని నమ్ముతూ, నానారకాల గురువులతో, గుడులతో, దేవుళ్లతో, దీక్షలతో, మతవ్యాపారాలతో దిక్కుతెలియకుండా పోతున్న నేటి హిందువులకు జ్ఞానజ్యోతిని చూపిస్తూ, సరియైనదారిలో వారిని నడిపించేదిశగా మేము చేస్తున్న ఈ జ్ఞానయజ్ఞాన్ని సఫలం చేయమని, సమస్తసృష్టికీ పరమగురువైన పరమేశ్వరుని ప్రార్ధిస్తూ ఈ ఉద్గ్రంధాన్ని నేడు విడుదల చేస్తున్నాను.
ఈ పుస్తకం ఇక్కడ లభిస్తుంది.
