మొన్న ఒంగోలుకు వెళుతూ దారిలోని ఒక వెల్డింగ్ షాపుదగ్గర ఆగాను.
అక్కడ ఇనుపపైపులతో ఒక రధాన్ని తయారు చేస్తున్నారు. తయారు చేయిస్తున్నది మనకు తెలిసినవాళ్ళే.
అక్కడ నా పనిని ముగించుకుని ఒంగోలుకు బయలుదేరబోతుండగా, అడగకపోయినా రధం గురించి చెబుతూ ' మా ఊళ్లో రామాలయానికి, ఊరేగింపుకి' అన్నాడతను.
'అలాగా. బాగుంది' అన్నాను.
'ఒకసారి రాండి. మా రాములవారిని చూద్దురుగాని' అని ఆహ్వానించాడతను.
'సరే వీలైనప్పుడు వస్తాలే' అన్నాను.
'అట్టా అనుకుంటే ఎప్పుడొచ్చేది? రేపు పౌర్ణమికి రధం ఊరేగింపు. భలే ఉంటుంది. రాండి' అన్నాడు.
'చిన్నప్పటినుంచీ చాలా చూశాను. ప్రస్తుతం ఆసక్తి లేదు' అన్నాను.
'పోనీ రాములవారిని చూడండి' అన్నాడు.
ఒక్కక్షణం అతనివైపు చూచి, 'చూస్తున్నాను' అన్నాను.
'ఎక్కడా?' అన్నాడు ఆశ్చర్యంగా చుట్టూ చూస్తూ.
'ఇక్కడ' అంటూ ఛాతీపైన చేయివేసుకున్నాను.
ఈసారి అయోమయంగా చూస్తున్నాడు.
'రాములవారు ఇక్కడే ఉన్నారు. ఆయన్ని చూట్టానికి గుడికెందుకు? అయినాసరే, మీరు మంచిగా పిలిచారు కదా. వీలైనప్పుడు తప్పకుండా వస్తాను మీ ఊరికి' అన్నాను.
అతనికర్ధమైంది. ఇంకేమీ అడగలేదు.
నా దారిన ఒంగోలుకు బయల్దేరాను.