“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

19, ఫిబ్రవరి 2020, బుధవారం

Chart of Sri Aurobindo - Astro analysis - 3 (తల్లిదండ్రులు - కుటుంబం)

అరవిందులు 1872 లో కలకత్తాలో పుట్టారు. ఆయన తల్లిదండ్రులు డా || కృష్ణధన్ ఘోష్, స్వర్ణలతాదేవి. నాన్నగారు ప్రభుత్వంలో సివిల్ సర్జన్ గా ఉండేవారు. అమ్మగారు హౌస్ వైఫ్. కృష్ణధన్ ఘోష్ ఇంగ్లాండ్ లోని ఎడిన్బర్గ్ లో మెడిసిన్ చదివారు. అప్పట్లో డార్విన్ ప్రతిపాదించిన Theory of evolution అనేది యూరప్ అంతటా మారుమోగిపోతూ ఉండేది. దాని దెబ్బకు సైన్స్ పునాదులు, సమాజపు పునాదులు, అప్పటివరకూ జనం నమ్ముతున్న నమ్మకాలు అన్నీ సమూలంగా కదిలిపోతూ ఉన్న రోజులవి. అరవిందుల నాన్నగారు ఈ థియరీని నమ్మేవారు. అరవిందులు కూడా తన ఇంగ్లీషువిద్యవల్ల ఇదే భావాన్ని బాగా నమ్మాడు. అందుకే ఆయన ప్రతిపాదించిన పూర్ణయోగంలో కూడా ఇదే evolutionary భావన అంతర్లీనంగా కనిపిస్తుంది.

అరవిందులకు పైన ఇద్దరు అన్నయ్యలున్నారు. క్రింద ఒక చెల్లెలు ఒక తమ్ముడు ఉన్నారు. తమ్ముడి పేరు బరీంద్ర. తరువాతి కాలంలో అరవిందులు తన తమ్ముడు బారీన్ కు వ్రాసిన ఉత్తరాలలో అనేక విషయాలను ఆయన ముచ్చటించారు. అవి అరవిందాశ్రమం ఆర్కైవ్స్ లో ఉన్నాయి.

జాతకంలో అన్నలను అక్కలను సూచించేది పదకొండో ఇల్లు. అరవిందుల జాతకంలో అది వృషభం అయింది. అందులో ఉచ్చరాహువున్నాడు. వక్రశని వృశ్చికంలోకి రావడం వల్ల, అక్కడనుంచి తన సప్తమదృష్టితో రాహువును చూస్తున్నాడు. కనుక ఏకాదశస్థానంలో రెండు గ్రహాలున్నట్లు అయింది. కనుక అరవిందులకు ఇద్దరు అన్నయ్యలున్నారు.

తనకంటే చిన్నవారిని మూడో ఇల్లు సూచిస్తుంది. అది కన్య అయింది. దానిమీద రాహువు యొక్క పంచమ దృష్టి ఉంది. అది శనీశ్వరుని ప్రభావాన్ని మోసుకొస్తోంది. కనుక మళ్ళీ తనకంటే చిన్నవారు ఇద్దరున్నారు - ఒక తమ్ముడు, ఒక చెల్లెలు.

జాతకంలో రవి స్థానాన్ని బట్టి తండ్రిగారి స్థితి తెలుస్తుంది. ఈ జాతకంలో రవి, బుధుడు, శుక్రులతో కలసి స్వస్థానమైన సింహంలో బలంగా ఉన్నాడు. సింహరాశి నాయకులకు సూచిక, సూర్యుడు డాక్టర్లను సూచిస్తాడు. కనుక తండ్రిగారైన కృష్ణధన్ ఘోష్ అప్పట్లోనే ఇంగ్లాండ్ లో మెడిసిన్ చదివి వచ్చి, ఇండియాలో సివిల్ సర్జన్ గా ఉన్నాడు. అరవిందుల జాతకంలోని సూర్యునితో బుధ శుక్రుల కలయిక, తండ్రిగారికి సమాజంలో ఉన్న మంచి పేరును పలుకుబడిని సూచిస్తోంది. కానీ వీరిపైన ఉన్న శనిచంద్రుల కోణ దృష్టి అంతా పాడు చేసింది. పైగా వీరిలో శని వక్రించి ఉన్నాడు. ఇదే అరవిందుల జాతకంలోని శాపం.

ఏ జాతకంలో అయితే శనిచంద్రుల కలయిక ఉంటుందో ఆ జాతకుని తల్లి దురదృష్టవంతురాలౌతుంది. దీర్ఘరోగాలకు గురౌతుంది. అనేక బాధలతో తీసుకుంటూ మరణిస్తుంది. ఎన్నో వందల జాతకాలలో ఈ సూత్రం రుజువైంది. కానీ ఆ జాతకునికి గొప్ప ఆధ్యాత్మిక పోకడలుంటాయి. బహుశా జీవితంలో అనేక బాధలను చూచి ఉండటం వల్లనే ఈ ఆధ్యాత్మిక ధోరణి ఒకరికి కలుగుతుందేమో?


కానీ ఒకరి జాతకంలో శనిచంద్రయోగం ఉన్నంత మాత్రాన అతనికి ఆధ్యాత్మికత కలుగదు. దానికి తోడ్పడే ఇతర యోగాలుండాలి. దశానుకూలత ఉండాలి. అంటే, ఆయా దశలు అతనికి సరియైన సమయంలో రావాలి. అప్పుడే అతనికి ఆధ్యాత్మికత ఒంటబడుతుంది. లేకుంటే, ఇదే యోగం డిప్రెషన్ నూ, మజ్జుతనాన్నీ కూడా ఇస్తుంది. ఇలాంటి సూక్ష్మమైన తేడాలను జాతకంలో గమనించాలి. 

కనుక అరవిందుల తండ్రిగారు మంచి జాతకుడే అయినప్పటికీ, తల్లిగారి దురదృష్ట యోగాలు ఆయన జాతకాన్ని పాడు చేశాయి. అన్నీ ఉండికూడా, చివరకు వారి జీవితం నిరాశా నిస్పృహలతో ముగిసింది.

ఇంగ్లాండ్ లో చదువుకుని రావడం వల్ల, మన సొసైటీ కంటే ఇంగ్లీష్ సొసైటీ గొప్పది అన్న భావాలు కృష్ణధన్ ఘోష్ లో ఉండేవి. అందుకని తన పిల్లలను చిన్నప్పటి నుంచే ఇంగ్లీషువారిలాగా పెంచాలని ఆయన ఉద్దేశ్యం. అందుకే అరవిందులను, ఆయన ఇద్దరు అన్నయ్యలను డార్జిలింగ్ లో ఐరిష్ వనితలు నడుపుతున్న బోర్డింగ్ స్కూల్ లో పడేశాడు.

అరవిందులు కేతుదశలో జన్మించారని ఇంతకు ముందు వ్రాశాను. ఆ కేతువు ఆయన జాతకంలో పంచమస్థానంలో ఉచ్చస్థితిలో ఉన్నాడు. పంచమం విద్యాస్థానం. కనుక ఆయనకు చిన్నప్పటి నుంచే యూరోపియన్స్ నడుపుతున్న బోర్డింగ్ స్కూల్లో విద్యాభ్యాసం సాగింది. ఆ తరువాత ఇంగ్లాండ్ లో ఉండి చదువుకున్నాడు.

అరవిందుల అమ్మగారు స్వర్ణలతగారికి మొదటి కాన్పు తర్వాత కొంచం పిచ్చి మొదలైంది. పిల్లలను ఆమెకు దూరంగా ఉంచుదామన్న ఉద్దేశంతో కూడా వారిని డార్జిలింగ్ లో ఉంచాడు కృష్ణధన్ ఘోష్. అరవిందుల జాతకంలో వక్రశని, చంద్రుల కలయిక కూడా ఆయన తల్లికి పిచ్చి ఉందని సూచిస్తున్నది.

కృష్ణధన్ ఘోష్, స్వర్ణలతా ఇద్దరూ బ్రహ్మసమాజభావాలు బాగా తలకెక్కినవారు. స్వర్ణలత తండ్రిగారైన రాజనారాయణ్ బోస్ కూడా బ్రహ్మసమాజంలో మంచి పేరున్న నాయకుడు. ఆయన సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులున్న వాడే. కానీ ఆయన వంశంలో ఏదో దీర్ఘరోగం ఉండేది. ఆయన కొడుకుకి పిచ్చి ఉండేది. దానితోనే అతను చనిపోయాడు. ఇద్దరు కూతుళ్ళలో స్వర్ణలత ఒకరు. ఆమెకు ఆమె చెల్లెలికీ కూడా చిన్నప్పటినుంచీ మూర్చరోగం (Fits) ఉండేది. స్వర్ణలత మంచి అందగత్తె. కనుక ఆమెను చూచిన కృష్ణధన్ ఘోష్ ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అప్పట్లోనే డాక్టరైన క్రిష్ణధన్ కు తన కూతుర్ని ఇవ్వడంలో ఏమీ అభ్యంతరం కనిపించలేదు రాజనారాయణ్ బోస్ కు.

చంద్రుని నుంచి దశమం మాతామహులను సూచిస్తుంది. అది కన్య అయింది. దానిమీద శనిచంద్రుల దశమదృష్టి ఉంది. ఇది వారి వంశంలో ఉన్న మానసికరోగాన్ని సూచిస్తోంది. వారి వంశాన్ని తుల సూచిస్తుంది. దానిమీద నీచకుజుని చతుర్ధదృష్టి ఉంది. ఇది మంచిది కాదు. కనుక తల్లివైపు నుంచి మనస్సుకు నరాలకు సంబంధించిన బలహీనత అరవిందులకు సరఫరా అయింది.

కృష్ణధన్ ఘోష్ కు అప్పట్లో ఇండియాలో పనిచేస్తున్న బ్రిటిష్ సివిల్ సర్వంట్లు కొందరు స్నేహితులు ఉండేవారు. వారిలా తన పిల్లలు కూడా ఇండియన్ సివిల్ సర్వీస్ పాసై ఉన్నత స్థానాలలో ఉండాలని ఆయన కలలు కనేవాడు. అందుకని తన మొదటి ముగ్గురు పిల్లలనూ చదువుల కోసం ఇంగ్లాండ్ పంపించాడు. ఇండియాలో తనకున్న బ్రిటిష్ స్నేహితులకు తెలిసిన బ్రిటిషువారి సంరక్షణలో ఇంగ్లాండ్ లో వారిని ఉంచాడు. అక్కడ వాళ్ళు ఇంగ్లీష్, ఫ్రెంచ్, గ్రీక్, లాటిన్, భాషలు నేర్చుకోవడమే గాక, గణితం, చరిత్ర, భౌగోళిక శాస్త్రం మొదలైనవి చదివారు.

కానీ ఈ ముగ్గురిలో అరవిందులు ఒక్కరే ఇండియన్ సివిల్ సర్వీస్ కి మొగ్గు చూపారు. పెద్దన్నయ్య కు ICS ఇష్టం లేదు. చిన్నన్నయ్య దానికి క్వాలిఫై కాలేదు. అరవిందులు కూడా ICS పరీక్ష పాసయ్యారు, కానీ గుర్రపు స్వారీ పరీక్షకు లేటుగా వచ్చి అబద్దాలు చెప్పినందుకు ఆయనను ఫెయిల్ చేశారు. ఆయన యూరినరీ ఆర్గాన్స్ లో ఏదో లోపం ఉండటం వల్ల ఆ పరీక్ష తప్పారని కూడా పుకార్లున్నాయి. ఈ విషయాన్ని పీటర్ హీస్ తన Lives of Sri Aurobindo అనే పుస్తకంలో వ్రాశారు. దానిమీద పెద్ద గాలిదుమారం రేగింది. ఈ పుస్తకం ఇండియాలో బ్యాన్ అయింది. కానీ నెట్లో దొరుకుతోంది. కావలసిన వారు చదవండి.

అరవిందులు తన 78 వ ఏట కిడ్నీ ఫెయిల్యూర్ తోనే చనిపోయారు. దానికంటే ముందు ఆయనకు ప్రోస్టేట్ గ్రంధి వాపు వచ్చింది. అది కిడ్నీలను పాడు చేసింది. అయితే, ఆయనకు మొదటినుంచీ యూరిన్ సమస్య ఉందా అంటే అనుమానమే. కాకపోతే, చిన్నప్పుడు ఆయనలో యూరినరీ ఆర్గాన్స్ ఎదుగుదల సరిగా ఉందో లేదో మనకు తెలియదు. లేకపోతే, ఆ సమస్య వల్లనే ఆయన ICS పరీక్షలో disqualify అయ్యాడన్న మాట అసలెందుకు వస్తుంది?

సహజరాశి చక్రంలో అష్టమం అయిన వృశ్చికరాశికి అధిపతి అయిన కుజుడు ఈయన జాతకంలో నీచలో ఉంటూ లగ్నంలోకి రావడం, ఈ కోణంలో కొన్ని అనుమానాలకు తావిస్తూనే ఉంది. ఏదేమైనా ఇది అంతగా పరిశీలించవలసిన విషయం కాదు.


అసలు విషయం ఇది కాదని కొందరు పరిశోధకులు అంటారు. అరవిందులు కేంబ్రిడ్జ్ లో చదువుకుంటున్నపుడు అక్కడి Indian Congregation అనే సంస్థతో ఆయన చురుకుగా పనిచేసేవాడు. ఇండియా నుంచి ఇంగ్లాండ్ వెళ్లి చదువుకుంటున్న అనేకమంది విద్యార్ధులు అందులో సభ్యులుగా ఉండేవారు. వారందరూ అక్కడ సమావేశామౌతూ, ఇండియాలో ఉన్న పరిస్థితుల గురించి బ్రిటిష్ వారి నిరంకుశపాలన గురించి చర్చిస్తూ ఉండేవారు. కృష్ణధన్ ఘోష్ ఇండియా నుంచి బెంగాలీ న్యూస్ పేపర్లను పంపిస్తూ ఉండేవాడు. బ్రిటిష్ వారు ఇండియన్స్ మీద ఇండియాలో జరుపుతున్న దౌర్జన్యాలు వాటిల్లో కళ్ళకు కట్టినట్లు వ్రాయబడుతూ ఉండేవి. అవన్నీ చదివిన ఈ విద్యార్ధులు కోపంతో రగిలిపోతూ ఉండేవారు. ఆ కోపాన్ని వ్యక్తీకరిస్తూ వారు అనేక ఉపన్యాసాలు ఈ సమావేశాలలో ఇచ్చేవారు. అరవిందులు కూడా అలాంటి ఉపన్యాసాలు అనేకం ఇచ్చాడు. ఈ విషయాలన్నీ confidential గా తెలుసుకున్న ICS Commissioner అరవిందులు ICS పరీక్ష పాసైనా సరే, అతను anti-British గనుక ఆయన్ను సెలక్ట్ చెయ్యలేదని పరిశోధకుల అభిప్రాయం. ఎందుకంటే, గుర్రపు స్వారీ పరీక్షకు లేటుగా వచ్చాడన్నది ఒక కుంటిసాకు మాత్రమేననీ, అలా వచ్చిన వారిని అనేకమందిని పాస్ చెయ్యడం జరిగిందనీ, పరీక్షలో అంత మంచిర్యాంక్ తెచ్చుకున్న ఒక చురుకైన విద్యార్ధిని ఇంత చిన్న కుంటిసాకుతో ఫెయిల్ చెయ్యడం తెల్లవాళ్ళ పక్షపాతధోరణి మాత్రమేననీ పరిశోధకులు అభిప్రాయపడ్డారు. ఇందులో చాలా నిజం ఉన్నది కూడా !

1879 నుంచి 1893 వరకూ అరవిందులు ఇంగ్లాండ్ లో ఉన్నారు. ICS పరీక్షలో ఆయన తప్పి కూచోడంతో తండ్రిగారైన కృష్ణధన్ ఘోష్ కు ఏం చెయ్యాలో పాలుపోలేదు. ఆ సమయంలో బరోడా మహారాజు సాయాజీరావ్ గయక్వాడ్ ఇంగ్లాండ్ లో పర్యటిస్తున్నాడు. తెలిసినవారి సిఫారసుతో అరవిండులకు బరోడా రాజుగారి దగ్గర ఉద్యోగం దొరికింది. అందుకని ఆయన ఇండియాకు తిరిగి వచ్చేశాడు.

కానీ ఆ సమయంలో ఒక దురదృష్టకరమైన సన్నివేశం జరిగింది. ఆయన వస్తున్న ఓడ ఫసిఫిక్ సముద్రంలో మునిగిపోయిందని Shipping company ఏజంట్లు కృష్ణధన్ ఘోష్ కు తప్పుడు సమాచారం అందించారు. అప్పుడాయన ఖుల్నాలో చీఫ్ మెడికల్ ఆఫీసర్ గా ఉన్నాడు. అది విన్న కృష్ణధన్ ఘోష్, తన కలలన్నీ కల్లలయ్యాయన్న షాక్ తో హార్ట్ ఎటాక్ వచ్చి కుప్పకూలి చనిపోయాడు.

జాతకంలో సూర్యునినుంచి నవమస్థానాన్ని బట్టి తండ్రిగారి విషయాలు తెలుస్తాయని పరాశరహోర, ఫలదీపిక మొదలైన ప్రామాణిక గ్రందాలంటాయి. అనుభవంలో అయితే, ఇది దశమస్థానంతో కూడా బాగా సరిపోతుంది. ఎందుకంటే, నా పద్ధతిలో నవమస్థానం కంటే, దశమస్థానమే తండ్రిగారిని ఎక్కువగా సూచిస్తుంది. సాయనవిధానంలో కూడా దశమమే తండ్రిస్థానం.

ఈ కోణంలో చూచినప్పుడు, సూర్యుడున్న సింహం నుంచి, దశమమైన వృషభంలో ఉచ్చరాహువున్నాడు. కనుక కొన్నేళ్ళు తండ్రిగారి జీవితం అంతా బాగానే జరిగింది. కానీ వక్రశని వృశ్చికంలోకి వచ్చి రాహువును చూస్తున్నాడు. ఇది శపితయోగం అనబడుతుంది. కనుక చివరకు తండ్రిగారి జీవితం నిరాశతో ముగుస్తుందని విషాదాంతం అవుతుందని తెలుస్తున్నది. ఖచ్చితంగా అదే జరిగింది !


ఇదే ట్రెండ్ ను అరవిందుల జాతకంలో కూడా చూడవచ్చు. తన సాధన ఫలించలేదన్న నిరాశతోనే ఆయన చివరకు చనిపోయాడు. నిరాశతో చనిపోవడం అనే విషయంలో అరవిందులలో ఆయన తండ్రిగారి పోలిక కనిపిస్తుంది. కొంచం కాకపోతే, కొంచంగానైనా, ఉన్నవీ లేనివీ ఊహించుకుని (ఉదాహరణకు పాండిచేరిలో కూచున ఉన్న తను, మీరారిచర్డ్ అనబడే మదర్ ఇద్దరూ కలసి మొదటి ప్రపంచయుద్ధపు తీరునూ, ముగింపునూ నిర్దేశించామని భావించడం) అవే నిజాలని అనుకోవడంలో తల్లిగారి పిచ్చిపోకడ గోచరిస్తుంది. ఈ విధంగా తల్లిదండ్రుల పోకడలు పిల్లలలో కనిపిస్తాయి.

ఆ విధంగా, అరవిందులు బొంబాయిలో అడుగు మోపేసరికి తండ్రిగారు గతించారు. ఆయన జీవితం గొప్పదిగా మొదలైనా, చివరకు నిరాశలో ముగిసింది. దానికి కారణం భార్య స్వర్ణలతగారి జాతకమూ దానినుంచి ఈయనకు సోకిన శపితయోగమూ  అని నా అభిప్రాయం.

ఆమెకు మొదటి కాన్పులోనే పిచ్చి మొదలైంది. అదే పిచ్చి అరవిందులకు కూడా కొంచం సోకిందని ఆయన శిష్యులు కొందరు అభిప్రాయపడ్డారు. ఒకానొక సమయంలో ఎవరో ఏదో చిన్న తప్పు చేస్తే, దానికి అతన్ని అరవిందులు తిట్టిన తీరు చూస్తే కొంచం 'అతిగా' అనిపించిందని, అంత చిన్న విషయానికి అంతగా రియాక్ట్ కావలసిన పని లేదని, వారు వ్రాశారు. కనుక తల్లినుంచి కొంచం పిచ్చిధోరణి అరవిందులకు సోకి ఉండవచ్చు. ఆయన జాతకంలో ఈ పోకడ కనిపిస్తున్నది కూడా. పిచ్చంటే పిచ్చే కానక్కరలేదు, కొంచం eccentric behaviour కూడా ఒక రకమైన పిచ్చిలక్షణమే. అదేవిధంగా గంటలుగంటలు కళ్ళుమూసుకుని కూచోవడమూ, రోజులు నెలలు సంవత్సరాల తరబడి ఒక గదిలో ఉంటూ బయటకు రాకుండా ఉండటమూ కూడా దాదాపుగా అవే లక్షణాలు. యోగులకూ పిచ్చివారికీ కొన్ని లక్షణాలు సమానంగానే ఉంటాయి. వీరిద్దరూ నార్మల్ మనుషులు కారు. కనుక వీరిలో ఉండే abnormal లక్షణాలు, ముఖ్యంగా, బయటనుంచి చూచేవారికి ఒకేరకంగా కనిపిస్తాయి.

మనస్సును సూచించే చంద్రుడు లగ్నాదిపతిగా ఉంటూ, రోగాలను సూచించే అరవ ఇంట్లో, దీర్ఘరోగాలను సూచించే అష్టమాదిపతి అయిన వక్రశనితొ కలసి ఉండటమూ, రోగాదిపతి అయిన గురువు ఉచ్చస్థితిలో లగ్నంలోకొచ్చి ఉండటమూ నా భావాన్ని బలపరుస్తున్నాయి.

చంద్రుని నుంచి నాలుగో ఇల్లు తల్లిగారిని సూచిస్తుందని ప్రాచీన జ్యోతిష్య గ్రందాలంటాయి. అరవిందుల జాతకంలో, ధనుస్సు నుంచి నాలుగో ఇల్లు మీనం అయింది. దానిపైన ఉచ్చ కేతువు దృష్టి ఉంది. అంతేగాక, దాని అధిపతి అయిన గురువు చంద్రాత్ అష్టమంలో నీచకుజునితో కలసి ఉండటమూ, ఆ కుజునికి పంచమ ద్వాదశాదిపత్యాలు పట్టి ఉండటమూ చూస్తే, తల్లికి మానసిక అనారోగ్యం తీవ్రంగా ఉందని, అంతేగాక ఆమెకు శాపం ఉందనీ తెలుస్తున్నది. ఇదే పోకడ అరవిందులకు కూడా తల్లినుంచి సోకి ఉంటుంది.

పీటర్ హీస్ కూడా ఇదే మాటను వ్రాసీ వ్రాయనట్లు సూచనాప్రాయంగా వ్రాశాడు. దానిమీద అరవిందుల భక్తులు మండిపడి గందరగోళం చేశారు. దీనిమీద ఒరిస్సాలో కోర్టు కేసులయ్యాయి. ఇదంతా 2010 ప్రాంతంలో Lives of Sri Aurobindo పుస్తకం విడుదలయ్యాక జరిగింది.

కానీ అరవిందుల జాతకంలో ఎక్కడైతే నీచకుజుని దృష్టి సోకిందో అక్కడే ఉచ్చగురువు దృష్టి కూడా సోకింది. అందుకే, మొదట్లో చెడు చేసిన యోగాలు చివరకు ఆధ్యాత్మిక పరంగా మంచియోగాలుగా మారాయి. తల్లిగారి పూర్వీకుల నుండి వచ్చిన మానసికవైకల్యం అనేది ఈయనలో యోగసాధనాపరంగా మారి, ఉన్నతమైన భూమికలను ఈయనకు అందించింది.

(ఇంకా ఉంది)