“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

14, ఫిబ్రవరి 2020, శుక్రవారం

Chart of Sri Aurobindo - Astro analysis - 2 (దశలు - జీవితం)

అరవిందుల జాతక ప్రకారం ఆయన జీవితంలో ఈ దశలు నడిచాయి.

ఆయనది మూలానక్షత్రం రెండోపాదం. కనుక ఆయన పుట్టినపుడు కేతుమహాదశ జరుగుతోంది. Balance of Ketu Dasa 4 years - 4 months - 15 days ఉన్నది. ఇంకా చెప్పాలంటే, ఆయన పుట్టినపుడు కేతు - కుజ - గురుదశ జరుగుతోంది. ఎవరైనా సరే, ఈ భూమిమీద పుట్టినపుడు ఒక నిర్ణీతసమయంలో పుడతారు. జన్మ అనేది ఒక accident కాదు. ముందే నిర్ణయింపబడిన ఒక event. ఆ సమయానికి వారి జీవితం అంతా ముందే నిర్ణయించబడి ఉంటుంది. ఆ సమయంలో నడుస్తున్న దశ వారి జీవనగమనాన్ని స్పష్టంగా చూపిస్తుంది. ఇది మహనీయులకైనా, మామూలు మనుషులకైనా ఖచ్చితంగా జరుగుతుంది. వాళ్ళు ఎందుకు ఈ భూమ్మీద పుట్టారు? ఈ జీవితంలో వారి పని ఏమిటి? ఈ భూమిమీద వారి పాత్ర ఏమిటి? అన్నది జననదశను బట్టి స్పష్టంగా కనిపిస్తుంది.

చాలామంది మహనీయుల శిష్యులు ఏమనుకుంటారంటే - మా గురువు గారు గ్రహాలకు అతీతుడు. గ్రహాల ప్రభావాన్ని ఆయన దాటాడు. ఆయనమీద గ్రహాలు పనిచెయ్యవు అనుకుంటారు. ఇది పూర్తిగా తప్పు. ఈ భూమ్మీద పుట్టిన ఎవరైనా సరే, వారు అవతారపురుషులైనా కూడా, గ్రహప్రభావానికి అతీతులు కారు. ఈ విషయాన్ని ఇంతకు ముందు వ్రాసిన ఎందఱో మహనీయుల జాతకాలలో నిరూపించాను. 

అరవిందుల జాతకంలో, కేతువు పంచమంలో ఉచ్చస్థితిలో ఉంటూ ఆయనది గొప్పదైన ఆధ్యాత్మికజీవితం అని సూచిస్తున్నాడు. కుజుడు పంచమాదిపతిగా నీచస్థితిలో లగ్నంలోనే ఉన్నాడు. కానీ నీచభంగం అయింది. రాజయోగం పట్టింది. నీచభంగరాజయోగాన్ని మంత్రేశ్వరుడు తన ఫలదీపికలో ఇలా చెబుతాడు.

శ్లో|| తద్రాశినాధోపి తదుచ్చనాధ:
విలగ్న చంద్రాదపి కేంద్రవర్తీ
రాజాభవేద్దార్మిక చక్రవర్తీ

తద్రాశినాధుడైన చంద్రుడు కేంద్రంలో లేడు. కానీ తదుచ్చనాధుడైన  గురువు లగ్నకేంద్రంలోనే ఉచ్చస్థితిలో ఉంటూ కుజుని నీచత్వాన్ని భంగం చేస్తున్నాడు. రాజయోగాన్నిస్తున్నాడు.

కనుక కొన్నాళ్ళపాటు ఆయన తన స్వభావానికి విరుద్ధమైన రంగంలో నడవక తప్పదని తెలుస్తోంది. అలాగే, 1910 లో పాండిచేరికి వచ్చేవరకూ ఆయన తీవ్రవాద కార్యకలాపాలలో మునిగి తేలాడు. బ్రిటిష్ వారిని ఎదిరించి సాయుధపోరాటం చేశాడు. తీవ్రవాదుల గ్రూపులకు నాయకుడుగా ఉన్నాడు. ఇదంతా నీచకుజుని ప్రభావం. నీచకుజుడు హత్యలకు ప్లాన్ చెయ్యడం, మందుగుండు సామగ్రి వాడకం, తుపాకుల వాడకం మొదలైనవాటికి కారకుడు. అప్పట్లో బెంగాల్ తీవ్రవాదులు వైస్రాయ్ ని చంపాలని ప్లాన్లు వేశారు. డిల్లీలో ఏనుగు మీద ఊరేగుతున్న లార్డ్ హార్డింగ్ మీద బాంబులతో ఎటాక్ చేశారు కూడా. కానీ ఆయన చనిపోలేదు. తీవ్రంగా గాయపడ్డాడు. ఇవన్నీ అంతర్దశానాధుడైన నీచకుజుని ప్రభావాలు. ఇకపోతే, విదశానాధుడైన గురువు నవమాదిపతిగా లగ్నంలోనే ఉచ్చస్థితిలో ఉన్నాడు. కనుక చివరకు ఈ కార్యక్రమాలన్నీ విరమించుకుని ఆధ్యాత్మికరంగంలో ఒక గురువుగా స్థిరపడతాడని సూచన ఉన్నది. కానీ, నవాంశలో గురువు యొక్క నీచస్థితిని బట్టి ఆయన ఆశయాలు ఈ జన్మలో నేరవేరవనీ తెలుస్తోంది. ఏతావాతా, జననకాల దశను బట్టి ఆయనది ఉత్తమమైన యోగజననం అని తెలుస్తున్నది.

Dasas in Sri Aurobindo's life
-----------------------------------
22-12-1876 Ketu Dasa end
22-12-1876 to 22-12-1896 Venus Dasa
22-12-1896 to 22-12-1902 Sun Dasa
22-12-1902 to 22-12-1912 Moon Dasa
22-12-1912 to 22-12-1919 Mars Dasa
22-12-1919 to 22-12-1937 Rahu Dasa
22-12-1937 to 22-12-1953 Jupiter Dasa

5th Dec 1950 న ఆయన దేహాన్ని వదిలేసినపుడు గురు - కుజ - గురుదశ జరిగింది. కనుక కుజుడూ గురువూ ఆయన పుట్టుకనూ పోకడనూ రెంటినీ నిర్దేశించారని స్పష్టంగా తెలుస్తున్నది. వీరిద్దరూ ఆయన జాతకంలో లగ్నంలోనే ఉండటాన్ని, ఒకరు నీచత్వంలోనూ, ఇంకొకరు ఉచ్చత్వంలోనూ ఉండటాన్ని చూడవచ్చు.

పై దశలను బట్టి ఆయన సాధనంతా కూడా కుజ, రాహు, గురుదశలలోనే జరిగిందని కనిపిస్తున్నది. తన ఇరవై ఏట ఆయన ఇండియాకు వచ్చారు. తరువాత పదహారేళ్ళ పాటు రవి, చంద్ర దశలలో ఆయన స్వాతంత్రపోరాటంలో విప్లవవాదిగా, తీవ్రవాదిగా, తీవ్రవాదుల నాయకుడుగా తన పాత్రను పోషించారు. చంద్రదశ చివరలో ఆయన పాండిచేరికి చేరుకున్నారు. తరువాత జరిగిన కుజ, రాహు, గురుదశలలో పూర్తిగా అంతరిక సాధనలో నిమగ్నమైనారు. ఇది స్థూలంగా ఆయన జీవితం. దీనిని వివరంగా ముందు పోస్టులలో అధ్యయనం చేద్దాం.

(ఇంకా ఉంది)