“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

9, ఫిబ్రవరి 2020, ఆదివారం

యోగులకు వ్యాయామం ఎందుకు?

నిన్న సాయంత్రం రాజు వచ్చేసరికి మా తోటలో వ్యాయామం చేస్తున్నాను. నా దగ్గర నేను వాడే పర్సనల్ మార్షల్ ఆర్ట్స్ ఆయుధాలతో బాటు, ఐరన్ బాడీ కండిషనింగ్ కోసం పనికొచ్చే ఎక్విప్ మెంట్, వెయిట్ ట్రెయినింగ్ కి పనికొచ్చే బార్ బెల్, డంబ్ బెల్స్ ఇతర సాధనాలూ ఉంటాయి. నిన్న రాజు వచ్చేసరికి వాటితో సాధన మొదలవ్వబోతోంది.

వచ్చాడు కదా అని, రాజుని కూడా కొన్ని వ్యాయామాలు నాతోబాటు కలసి చెయ్యమని చెప్పాను.

చేస్తూ ఉండగా  రాజు ఒక ప్రశ్న అడిగాడు.

'యోగులు శరీరాన్ని పెద్దగా లెక్కచెయ్యరు కదా? అదెలా పోయినా వారికి అనవసరం అని నేను చదివాను. వారికి ద్యానమూ, దాని ద్వారా అందుకునే అతీతభూమికలూ మాత్రమే ముఖ్యం గాని, శరీరదృష్టి వారికే మాత్రమూ ఉండదని, ఉండకూడదని చదివాను. మరి మీరేమో ఇలా వ్యాయామాలు చేస్తారు, మాచేత కూడా చేయిస్తారు. ఇదేంటో నాకర్ధం కావడం లేదు' అన్నాడు.

నవ్వి ఇలా చెప్పాను.

'నువ్వు చెబుతున్నది చాలా పాత యుగాలలోని మాట. 2500 ఏళ్ళ క్రితం జైనమతంలో ఇవే చేసేవారు. నెలల తరబడి ఉపవాసాలుండి, శరీరాన్ని శుష్కింపజేసి, అలాగే చనిపోయేవారు. దానిని ప్రాయోపవేశం అనేవారు. జ్ఞానప్రాప్తికి శరీరమే పెద్ద అడ్డంకి అన్న భావన వారికి ఉండేది. కనుక శరీరాన్ని శత్రువుగా చూసేవారు. బుద్ధుడు కూడా ఈ మార్గాన్ని కొన్ని నెలలు అభ్యసించాడు. ఆహారాన్ని పూర్తిగా మానేసి చిక్కిపోయి అస్థిపంజరం అయిపోయాడు. బుద్ధునికి అలాంటి బొమ్మలూ, విగ్రహాలూ కొన్ని ఉంటాయి చూడు. ఆ తర్వాత అది సరియైన మార్గం కాదని గ్రహించి మళ్ళీ తినడం మొదలుపెట్టాడు.

ఇలాంటి అభ్యాసాలు 2500 ఏళ్ళ నాటివి. ఆ తర్వాత చాలా మారింది. నా సాధనామార్గం అది కాదు. శరీరాన్ని నిర్లక్ష్యం చెయ్యమని నేనెప్పుడూ చెప్పను. పూర్తిగా ఒళ్ళు మీదే ఫోకస్ చెయ్యమనీ, అదిచ్చే సుఖాలను జుర్రుకోమనీ చెప్పను. రెండూ తప్పులే. మధ్యేమార్గం మంచిది.

శరీరం అనేది భగవంతుడు మనకిచ్చిన వరం. ఇదొక దేవాలయం. దీనిని శుభ్రంగా, మంచి కండిషన్ లో ఉంచాలి. ఇది లేకుంటే మనం సాధనా చెయ్యలేము, ఇంకేమీ చెయ్యలేము. ఆరోగ్యం బాగా లేకుంటే, ముక్కటమూ మూలగటమే సరిపోతుంది. ఇక సాధనేం చేస్తాం?

నా మార్గంలో సాధన అనేది మాటలు కాదు. కళ్ళు తిరుగుతాయి ! గుడ్లు పైకి పోతాయి ! దానిని తట్టుకోవాలంటే, నీకు భౌతికస్థాయిలో బలమైన పునాది ఉండాలి. అందుకే నేను శరీరవ్యాయామాలు తప్పనిసరిగా నేర్పిస్తాను. ఆరోగ్యకరమైన శరీరం అనే పునాది మీద మాత్రమే, నేను నేర్పించే higher sadhana వీలౌతుంది. వీక్ బాడీతో నువ్వు నా మార్గంలో నడవలేవు. అంతేకాదు. ఏవేవో పుస్తకాలు చదివి, యూట్యూబులు చూసి, ఫేన్సీగా సాధన చెయ్యాలనుకునే అల్లాటప్పాగాళ్ళు నా మార్గంలో రెండడుగులు కూడా వెయ్యలేరు. నాతో కలసి నాలుగడుగులు కూడా నడవలేరు.

నీకు శరీరం మీద అతిమోజు ఉండకూడదు. అలాగని దానిని నిర్లక్ష్యమూ చెయ్యకూడదు. ఉన్నన్నాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి. దానికి నిత్యవ్యాయామం అవసరం. అందులోనూ అది యోగవ్యాయామం అయ్యి ఉండాలి. దానిలో మార్షల్ ఆర్ట్స్ పద్ధతులు కలసి ఉండాలి. అంతేగాని, ఉత్త gym exercise లను నేనెప్పుడూ ప్రోత్సహించను. లాంగ్ రన్ లో అవి మంచివి కావు.

షావోలిన్ టెంపుల్ లో బోధిధర్మ ఇవే నేర్పించాడు అక్కడి చైనీస్ భిక్షువులకు. అవే తర్వాత తర్వాత కుంగ్ ఫూ గా రూపుదిద్దుకున్నాయి. వివేకానంద స్వామి కూడా తన చివరి రోజులలో డంబ్ బెల్స్ తొ వ్యాయామాలు చేసేవారు. తలచుకున్న క్షణంలో శరీరస్పృహను దాటి నిర్వికల్ప సమాధిలో లీనమయ్యే శక్తి ఉన్న ఆయనకు వ్యాయామాలు ఎందుకు? ఆలోచించు. విషయం అది కాదు. మనం బ్రతికినన్నాళ్లు ఆరోగ్యంగా ఉండాలి. మనవల్ల ఇతరులు బాధపడకూడదు. మనం ఇతరులకు భారం కాకూడదు, అది ఏ విధంగానైనా సరే! దానికోసం యోగవ్యాయామాలు అత్యుత్తమమైనవి.

'అర్ధమైందా?' అడిగాను.

అర్ధమైనదన్నట్టు తలాడించాడు రాజు.

'మరి ఎత్తుకో బార్ బెల్' అంటూ నేను నా వ్యాయామం కొనసాగించాను.

పునాదిని నిర్లక్ష్యం చేస్తే, బిల్డింగ్ ఎలా నిలబడుతుంది???