“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

5, ఫిబ్రవరి 2020, బుధవారం

కరోనా వైరస్ కు ఆర్సెనికం ఆల్బం వాడకూడదు !!

'వెర్రివెర్రి అంటే వేలంవెర్రి' అనే మాట మన భారతీయులకు సరిపోయినంతగా ఇంకెవ్వరికీ సరిపోదు. ఎవరైనా రోడ్డుమీద వాళ్ళ గుడ్డలు చించుకుంటుంటే, 'వాళ్ళెందుకు అలా చేస్తున్నారు?' అన్న ఆలోచన ఏ మాత్రం లేకుండా మన గుడ్డలు వెంటనే చించేసుకోవడంలో ప్రపంచదేశాలన్నింటిలో మనం ఫస్ట్ ఉంటాం. అందుకే 'ఇండియా ఒక తెలివిలేని దద్దమ్మలాంటి పెద్ద మార్కెట్. ఏ ప్రాడక్ట్ అయినా అక్కడ తేలికగా మార్కెట్ అవుతుంది' అని అంతర్జాతీయ వ్యాపారస్తులలో ప్రచారంలో ఉన్న ఒక మాట !

భయం అనేది మనకు ఎంత ఎక్కువంటే - సమాజంలో ఏదైనా ఒక కొత్త రోగం వస్తే, ఇక ఎవరేది చెబితే అది గుడ్డిగా చేసేస్తూ ఉంటాం ! మన దేశంలో ఇంకా ఆ రోగం అడుగుపెట్టకపోయినా సరే, 'ఫలానా మందు వాడండి' అని మీడియాలో వస్తే చాలు, గొర్రెల్లాగా పొలోమంటూ ఎగబడి ఆ మందు వాడేస్తాం ! వాడుతున్నాం !

గతంలో వచ్చిన మెదడువాపు వ్యాధి విషయంలో అయితే ఎంత ఫార్స్ చూచామో? స్వచ్చందసంస్థలనుంచీ మొదలుపెట్టి అన్ని వ్యవస్థలనూ వాడేసి, 'బెల్లడోనా-200' అనే మందును విచ్చలవిడిగా పంచిపెట్టి, ప్రసాదంలాగా అందరిచేతా మింగించారు. నిజానికి అదొక తెలివిలేని అనవసర, అర్ధరహిత చర్య !!

ప్రస్తుతం కరోనా వైరస్ విషయంలో కూడా అదే జరుగుతోంది. 24 దేశాలలో పాకినప్ప్తటికీ, ఇంకా ఈ వ్యాధికి Pandemic లక్షణాలు రాలేదని World Health Organisation స్వయంగా చెబుతోంది. కానీ మన దేశంలో అప్పుడే Arsenicum Album - 30 అనే మందు టన్నులు టన్నులు మింగేస్తున్నారు చిన్నా పెద్దా అందరూనూ ! గొర్రెల మంద !!

నిజమేంటంటే - ఈ మందును అలా అందరూ పప్పుబెల్లాలలాగా మింగవలసిన పని ఏ మాత్రం లేదని Homoeopathic Principles చెబుతున్నాయి.

కానీ ఎవడు వింటాడు గనుక?

అసలు - కరోనావైరస్ కు ఈ మందు preventive గా ఏ మాత్రమూ పనిచెయ్యదు. కానీ జనం చేత వాడిస్తున్నారు. స్వయానా ఆయుష్ శాఖ ప్రకటనలు జారీ చేస్తోంది. జనం వాడుతున్నారు. కలిమాయ అంటే ఇదేనేమో?

నేను చెప్పేది మీకు అర్ధం కావాలంటే, మీకు హోమియోపతి చరిత్ర కొంచం తెలియాలి. ఓపికగా చదవండి మరి !

1831 లో యూరోప్ అంతటా, 'ఆసియాటిక్ కలరా' అనే వ్యాధి ప్రబలింది. జనాలు గుట్టలు గుట్టలుగా చనిపోతున్నారు. హోమియోపతి సృష్టికర్త అయిన డా|| హన్నేమాన్ అప్పటికి బ్రతికి ఉన్నాడు. ఆ రోగపు Epidemic లక్షణాలను గమనించి ఆయన మూడు మందులను సూచించాడు. అవే - Camphor, Cuprum Metallicum. Viratrum Album. ఆసియాటిక్ కలరా మొదటి దశలో Camphor, రెండవదశలో Cuprum, మూడవ దశలో Viretrum Album వాడమని ఆయన చెప్పాడు. ఎందుకంటే ఆయా దశలలో రోగిలో కనిపించే లక్షణాలకు ఆయా మందులు సరిగ్గా సరిపోతాయి గనుక ! అలా వాడి, వేలాదిమంది ఆ వ్యాధినుంచి బయటపడ్డారు. బ్రతికి బట్ట కట్టారు ! ఇది medical history లో రికార్డ్ అయిన నిజం !!

ఇకపోతే, Asiatic Cholera రోగం అనేది ఇంకా మనకు రాకముందే, preventive గా Cuprum Metallicum అనే మందును 15 రోజులకు ఒక డోస్ చొప్పున వాడమని ఆయన సూచించాడని కొందరు అంటారు. Genus Epidemicus అనే సిద్దాంతాన్ని బట్టి ఆయన అలా చెప్పాడు. కానీ నేడు కరోనావైరస్ అనేది ఇంకా Epidemic లక్షణాలను సంతరించుకోలేదు. కానీ మనం భయభ్రాంతులకు గురైపోతున్నాం ! ఎవడేది చేబితే అది నమ్మేస్తున్నాం ! ఎక్కడో కేరళలో ఒక కేసు నమోదు అయిందంటే, ఆంధ్రా, తెలంగాణా అంతటా ఆర్సెనిక్ ఆల్బం మందును పిచ్చిగా మింగేస్తున్నారు జనమంతా ! ఓరి దేవుడో ! ఈ పిచ్చి జనాన్ని నువ్వే రక్షించాలి !

Preventive గా వాడుతున్నపుడు, 15 రోజులకు ఒక డోస్ వాడితే చాలని డా || హన్నేమాన్ అన్నాడు. కానీ నేడు, ఏ రోగం కనిపించబోయినా - అదింకా పూర్తిగా కనిపించకముందే - పదిరోజులపాటు - ప్రతిరోజూ - పప్పుబెల్లాల మాదిరి - రకరకాల మందులను - ఒక్కొక్కటి పదిపది మాత్రల చొప్పున - వాడిస్తున్నారు హోమియో డాక్టర్లు. అది కూడా indicate కాని మందులను వాడిస్తున్నారు!

మన సొసైటీని ఎవడూ కాపాడలేడు !!

హోమియోపతిలో అత్యంత దురుపయోగం చేయబడిన మందులు (most abused medicines) కొన్నున్నాయి. వాటిల్లో ప్రధమస్థానాన్ని Pulsatilla, Arsenic Album ఆక్రమిస్తాయి. ప్రస్తుతం కూడా అయిదు రోజులు Arsenic Album -30 వాడి, ఆరో రోజున Phosphorus - 30 వాడమని ఒక మెసేజి చక్కర్లు కొడుతోంది. జనాలు కొని వాడుతున్నారు.

ఇది శుద్ధ తప్పని నేను చెబుతున్నాను !

దీనికి తోడు, తులసి ఆకు రసం వాడమని, ధనియాలు, అల్లం, మిరియాలు వాడమని, తిప్పతీగ రసం వాడమని మరికొన్ని మెసేజీలు చక్కర్లు కొడుతున్నాయి. హోమియో మందులు వాడుతూ ఇవి కూడా వాడమని చెబుతున్నారు. ఇది పచారీకొట్టు వైద్యమా లేక అసలైన హోమియోపతి వైద్యమా?

ఇలాంటి మెసేజి పదిరోజుల క్రితం నాకు ఒకటి వస్తే, ఆ పంపించిన ఆయనకు కొన్ని ప్రశ్నలు సంధించాను. జవాబు ఈ రోజువరకూ రాలేదు.

1. కరోనా వైరస్ లక్షణాలకు Arsenic Album సరిపోతుందని ఎవరు నిర్ణయించారు? హోమియోపతిలో జలుబుకు నూరు మందులున్నాయి. వాటిల్లోంచి ఇదే మందును ఎలా సెలెక్ట్ చేశారు?

2. 30 potency ని ఎవరు నిర్ణయించారు? ఎలా నిర్ణయించారు? 6 potency గాని 200 potency గాని ఎందుకు వాడకూడదు?

3. ఇది చాలదన్నట్లు, Phosphorous - 30 తో follow up చెయ్యమని ఎలా నిర్ణయించారు? ఇది హోమియోపతి సిద్ధాంతాలకు విరుద్ధం కాదా? ఉన్న లక్షణాలకు సరిపోయే మందు వాడాలిగాని, రెండు మూడు మందులు కలగలిపో, ఒకదాని వెంట ఒకటో ఎలా వాడతారు\?

4. నాలుగుమాత్రలు ఒక డోసుగా వేసుకోమని చెబుతున్నారు. మరికొంతమంది 6 అని, ఇంకొంతమంది 10 అని చెబుతున్నారు. Dr. Hannemann ఎక్కడా అలా చెప్పలేదు. ఆయన minimum dose అన్నాడు. మరి "ఇన్ని మాత్రలు" minimum dose అని ఎవరు నిర్ణయించారు? దానికేం పద్ధతీ పాడూ లేదా? ఎవడిష్టం వచ్చినట్లు వాడు చెప్పడమేనా? ఇదేనా హోమియో వైద్యం అంటే?

నా ఈ ప్రశ్నలకు ఇంతవరకూ జవాబులు రాలేదు. ఇక రావనీ నాకు తెలుసు. ఎందుకంటే హోమియోపతి శుద్ధంగా తెలిసినవారు నేను చెప్పేదే చెబుతారు గనుక !

'సరే - విమర్శించడం బానే ఉంది. మరి మీరేం చెబుతారు?' అని మీకు సందేహం రావచ్చు.

నేను సత్యాన్నే చెబుతాను.

హోమియోపతిని హోమియో సిద్ధాంతాల ప్రకారం వాడాలి. అంతేగాని, పచారీషాపులోనో, కిరాణాషాపులోనో సరుకులు కొని వాడినట్లు ఆ మందులను వాడకూడదు. హోమియో సిద్ధాంతాల ప్రకారం అయితే నేనిలా చెబుతాను.

ప్రస్తుతం బూచిగా కనిపిస్తున్న కరోనావైరస్ వ్యాధికి Arsenicum Album అనే మందును వాడకూడదు ! అంతేకాదు, అనవసరంగా అసలే మందునూ వాడకూడదు. మరేం చెయ్యాలి?

ఆరోగ్యపరమైన జాగ్రత్తలు మాత్రమే పాటించాలి. నలుగురిలో తిరిగేటప్పుడు ముక్కుకు గుడ్డ ధరించడం, చేతులు సబ్బుతోనో, హ్యాండ్ వాష్ తోనో శుభ్రంగా కడుక్కోవడం. దుమ్మూధూళీ పడిన ఆహారం తినకపోవడం, రోడ్ సైడ్ హోటళ్ళలో కాఫీ టీలు త్రాగకుండా ఉండటం, తిరునాళ్ళు జాతరలకు దూరంగా ఉండటం, పబ్లిక్ ప్లేసులకు సాధ్యమైనంత దూరంగా ఉండటం, మొదలైన జాగ్రత్తలు పాటిస్తే చాలు. అనవసరంగా ఏ మందూ వాడనక్కరలేదు. ఒకవేళ లక్షణాలు కనిపిస్తే మాత్రం, ఆయా లక్షణాలకు సరిపోయిన హోమియో మందు వాడాలి. అంతేగాని, ఎవరో చెప్పారని Arsenicum Album - 30 వాడరాదు. అలా వాడటం హోమియో సిద్ధాంతాలకు విరుద్ధం !!

కానీ మనం చెబితే ఎవడు వింటాడు? కలిమాయలో పడి లోకం అలా ముందుకు పోవలసిందే.

వాడుకోండి, మీమీ ఖర్మ అనుభవించండి.

నేనుంటా మరి !