“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

6, ఫిబ్రవరి 2020, గురువారం

పాండిచేరి, ఆరోవిల్ యాత్ర - 4 (International community)

సోమవారం ఉదయాన్నే లేచి తయారై 6 గంటల కల్లా బీచ్ కి చేరుకున్నాను. అప్పటికే అక్కడ గోలగోలగా ఉంది. వాకర్స్ వాకింగ్ చేస్తున్నారు. వ్యాయామాలు చేసేవారు అవి చేస్తున్నారు. ధ్యానం చేసేవారు అది చేస్తున్నారు. సముద్రంలో దిగి స్నానాలు చేసేవారు అవి చేస్తున్నారు. ఇలా ఎవరి గోలలో వారున్నారు.

ఒక ఫారెన్ ముసలామె అక్కడ ఇసుకలో చాలా బేసిక్ యాంగ్ స్టైల్ తాయ్ ఛి మూమెంట్స్ చేస్తోంది. ఆమె చేస్తున్న తీరు గమనిస్తే, జనాలు తనను చూడాలని చేస్తోంది గాని, నిజంగా తాయ్ ఛిలో నిమగ్నమై చెయ్యడం లేదు. నాకు నవ్వొచ్చింది. పైగా, ఆమె చేస్తున్న మూమెంట్ తప్పు చేస్తోంది. ఆమె దగ్గరకు వెళ్లి, 'అమ్మా ! ఆ మూమెంట్ అలా కాదు. ఇలా చెయ్యాలి' అని చూపిద్దామని అనుకున్నాను. మళ్ళీ, మనకెందుకులే గోల? అని ఊరుకున్నాను.

ధ్యానాలు చేస్తున్నట్టు కూచున్న కొందరిని గమనించాను. ఊరకే 'షో' కోసం అలా కూచుని ఉన్నారు గాని ఎవడికీ ధ్యానస్థితి లేదు. కొందరు ఆలోచనలతో యుద్ధం చేస్తున్నారు. కొంతమందేమో నిద్రమత్తులో కలలు కంటున్నారు. భలే నవ్వొచ్చింది.

'ఏం మనుషులు? ఏం ప్రపంచంరా దేవుడా? మనిషి జీవితమంతా ఎదుటివారి మెప్పుకోసం చేసే 'షో' లోనే గడిచిపోతోంది కదా !' అనుకున్నా.

పక్కసందులోనే ఉన్న ఆశ్రమం డైనింగ్ హాల్ లో బ్రేక్ ఫాస్ట్ స్వీకరించి మళ్ళీ గెస్ట్ హౌస్ కొచ్చేశా. ఒక ముతఃక బ్రెడ్ ముక్క, పెద్ద గిన్నెలో పాలు, అంతే గిన్నెలో పాయసం, నాలుగు చిటికెన వేలంత చిన్న అరటిపళ్ళు, ఇదీ బ్రేక్ ఫాస్ట్. చాలా హాయిగా, తేలికగా ఉంది. యోగిక్ డైట్ అంటే ఇది !

కాసేపు రెస్ట్ తీసుకుని లేచి ఊళ్ళో సర్వేకి బయలుదేరా. ఎక్కడెక్కడ మంచి హోటళ్ళున్నాయి? హోమ్లీ టిఫిన్ ఎక్కడ దొరుకుతుంది? హోమియోపతి షాపులు ఎక్కడున్నాయి? కూరగాయల మార్కెట్ ఎక్కడుంది? సరుకులు ఎక్కడ దొరుకుతాయి? - అన్నీ సర్వే చేసి గుర్తుపెట్టుకున్నా. ఎందుకంటే మళ్ళీ నా శిష్యబృందంతో ఇక్కడకు వచ్చే ప్లాన్ త్వరలోనే ఉంది గాబట్టి, వాళ్ళకోసం ఇవన్నీ ముందే వెదికి పెట్టుకున్నా. ఈ తిరగడానికి రెండు మూడు గంటలు పట్టింది. నడిచే ఊరంతా తిరిగా. ఇంతలో భోజనం టైం అయింది. మళ్ళీ ఆశ్రమం డైనింగ్ హాల్ కు వెళ్లి, భోజనం చేశాను.

భోజనం కూడా సింపుల్ గా, యోగిక్ డైట్ లాగా ఉంది. సాంబారన్నం, కొంచం తెల్లన్నం, పెరుగు, ముక్కలపులుసు, చిన్న అరటిపళ్ళు - అంతే. కానీ చాలా ఆరోగ్యకరంగా చాలా రుచిగా సింపుల్ గా చాలా బాగుంది. నాకు బాగా నచ్చింది.

కంచం, గ్లాసు, స్పూన్, గిన్నెలూ తీసుకుని వాషింగ్ ఏరియాకు వెళ్లాను.

సమాధి దగ్గర ధ్యానాలు చేస్తున్నవారి కంటే, బీచ్ లో కళ్ళుమూసుకుని షో చేస్తున్న వారికంటే - వాషింగ్ ఏరియాలో కంచాలు కడిగే చోట - మన ఎంగిలి కప్పులు, స్పూన్లు, కంచాలు మన చేతుల్లోంచి తీసుకుని - వాటిని దేనికది వేరుచేసి కడిగేపనిలో ఉన్న ఒక పెద్దవయసు ఫారెనర్, గొప్ప ధ్యానస్థితిలో ఉన్నట్టు నేను గమనించాను. ఆయన ఆధ్యాత్మికంగా ఉన్నతస్థితిలో ఉన్నాడు. ఆయన ఆరా చాలా ఆధ్యాత్మికంగా ఉంది. నేనది గమనించి నవ్వుతూ ఆయనకు అభివాదం చేశాను. ఆయన కూడా నవ్వుతూ నాకు అభివాదం చేశాడు. ఇలా, ఆధ్యాత్మికంగా ఉన్నతమైన స్థాయిలో ఉన్న మనుషులు అక్కడక్కడా నాకు అగుపించారు. కానీ వాళ్ళు, ధ్యానమందిరాలలో కూచుని 'షో' చేస్తూ లేరు. మామూలు పనులలో అతి మామూలుగా బయటపడకుండా ఉన్నారు. అదే అసలైన నిజమైన ఆధ్యాత్మిక ఔన్నత్యం అని నేనెప్పుడూ నా శిష్యులకు చెబుతాను. అలాంటివారిని నేను తేలికగా గుర్తు పట్టగలను.

గెస్ట్ హౌస్ కు వచ్చి, ఖాళీ చేసి, ఆరోవిల్ వెళదామని OLA Cab బుక్ చేసే సమయానికి నా శిష్యురాలు ఒకమ్మాయి అరుణాచలం నుంచి వచ్చి నన్ను కలుసుకుంది. ఆమె నా శిష్యురాలు కాదు. రకరకాల యోగసంప్రదాయాలతో ఆమె ఇంకా ప్రయోగాలు చేస్తోంది. ప్రస్తుతం అరుణాచలంలో జరుగుతున్న SN Goenka గారి 10 రోజుల Vipassana Concentration Camp నుంచి సరాసరి ఇక్కడకు వచ్చింది. సౌలభ్యం కోసం ఈమెను 'శిష్యురాలు' అనే సంబోదిద్దాం, ప్రస్తుతానికి కాకపోయినా సరే !

విపస్సాన ధ్యానం ఎవరు బడితే వారు చెయ్యకూడదు. దానికి కొన్ని foundations ఉండాలి. అవి లేకుండా, డైరెక్ట్ గా 10 రోజుల కోర్సులు, నెలరోజుల కోర్సులు చేస్తే పిచ్చి పుడుతుంది. చెయ్యవద్దు. SN Goenka గారి పధ్ధతి సరైనది కాదని ఈ అమ్మాయికి చెప్పాను. కానీ ఆమె వినలేదు. సరే, వినకపోతే మనమేం చేస్తాం?

ఇద్దరం కలసి క్యాబ్ లో ఆరోవిల్ కి బయల్దేరాం.  

ఆరోవిల్ అనేది ఒక అంతర్జాతీయ టౌన్ షిప్. పాండిచేరికి ఇది 10 కిమీ దూరంలో ఉంటుంది. అన్ని దేశాల ప్రజలూ ఒకే కుటుంబంలాగా కలసిమెలసి ఒకచోట జీవిస్తూ ఆధ్యాత్మిక ఔన్నత్యానికి కృషి చెయ్యాలని అరవిందులు, మదర్ భావించారు. ఆ కలకు ప్రతిరూపమే - ఆరోవిల్. ఇది 1968 లో మొదలైంది. చాలా దేశాల ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు. దాని వివరాలు వారి వెబ్ సైట్ లో ఉంటాయి గనుక నేను మళ్ళీ వ్రాయడం లేదు. కాకపోతే నేను గమనించిన కొన్ని విషయాలు చెబుతాను.

ఆరోవిల్ అనేది 20 చదరపు కి. మీ పరిధిలో ఉన్న ఒక దట్టమైన అడవి. ఈ అడవి మధ్యలో Communities అనేవి ఉంటాయి. అంటే, ఆ చెట్ల మధ్యలో ఇళ్ళు, అపార్ట్ మెంట్లు కట్టుకుని విదేశీయులు ఉంటూ ఉంటారు. ఇల్లు కొనుక్కుని అక్కడ ఉన్నప్పటికీ, ఆ ఇంటిమీద వాళ్లకు రైట్స్ ఉండవు. బయటకు వెళితే, ఆ ఇల్లు ఆరోవిల్ సంస్థకు చెందుతుంది. అక్కడ సౌకర్యాలు చాలా మినిమంగా ఉంటాయి. తారు రోడ్లు తక్కువ. మట్టి రోడ్లు ఎక్కువ. ముఖ్యమైన ఏరియాలలో మాత్రమే కరెంట్ ఉంటుంది. చీకటి పడితే  కరెంట్ లేని అడివిలో బిక్కుబిక్కుమంటూ ఉన్నట్లే. కనీసం కాఫీ త్రాగాలంటే కూడా ఒక అయిదారు కి.మీ దూరం అడవిలో పడి నడుచుకుంటూ పోతే గాని దొరకదు. హోటళ్ళు ఒకటో రెండో తప్ప ఉండవు. ఉన్నా, అక్కడ రేట్లు మోగిపోతుంటాయి. రవాణా సౌకర్యాలు ఉండవు. ఆరోవిల్ పోయె దారిలో ఉన్న చిన్నచిన్న ఊర్లలో సైకిళ్ళు, బైకులు అద్దెకిస్తారు. అవి తీసుకుని ఆ అడివిలో ప్రయాణం చెయ్యాలి. బస్సులు కార్లు ఉండవు. అలాంటి పరిస్థితిలో ఉన్న అడవీగ్రామం పేరే ఆరోవిల్. కానీ అక్కడి మనుషులు దానిని 'సిటీ' అంటారు.

ఆరోవిల్ సిటిజెన్ కావాలంటే అదొక పెద్ద ప్రాసెస్. దాదాపు అయిదేళ్ళు పడుతుంది. డబ్బులు బాగా ఉండాలి. అరవిందులు మదర్ల ఫిలాసఫీ తెలిసి ఉండాలి. వారి సాధనా మార్గంలో తపన ఉండాలి. కమ్యూనిటీ కోసం కష్టపడి పని చెయ్యాలి. ముఖ్యంగా, ఆరోవిల్ గవర్నింగ్ బాడీ చేసే ఇంటర్వ్యూలో సెలక్ట్ కావాలి. ఆ తర్వాత మనిషికింత అని ప్రతినెలా సిటీ టాక్స్ కట్టాలి. రోజుకు ఎనిమిది గంటలు ఫ్రీ సర్వీస్ చెయ్యాలి. ఇంత తతంగం ఉంటుందక్కడ.

ఆరోవిల్ లో చూడదగ్గ ప్రదేశాలు రెండు. ఒకటి - మాతృమందిర్. ఒక బ్రహ్మాండమైన టెన్నిస్ బాల్ ఆకారంలో కట్టబడిన ఒక కట్టడం ఇది. చుట్టూ దాదాపు 50 ఎకరాల ఖాళీ స్థలం ఉంటుంది. మధ్యలో ఇది ఉంటుంది. దానిలోకి వెళ్ళడానికి దారులున్నాయి. పై అంతస్తులో ఒక పెద్ద Crystal ఉంటుంది. దానిమీద సూర్యకాంతి పడుతూ ఉంటుంది. ఆ చేంబర్ లో కూచుని ఆ Crystal ball మీద Concentrate చేస్తారు. ఇలా చెయ్యడానికి టైమింగ్స్ ఉన్నాయి. ఎవరిని బడితే వారిని అనుమతించరు. ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి, పర్మిషన్ తీసుకోవాలి.

రెండోది సావిత్రి భవన్. అరవిందులు వ్రాసిన అద్భుతమైన గ్రంధమే 'సావిత్రి'. ఇందులో ఆయన సాధనామార్గం, అందులో ఆయనకు కలిగిన అనుభవాలు ఇంగ్లీషు పద్యాల రూపంలో వ్రాయబడి ఉన్నాయి. ఇది చాలామందికి అర్ధంకాని మార్మికమైన చిక్కటి విక్టోరియన్ ఇంగ్లీషులో వ్రాయబడిన పద్యసమాహారం. దీనిమీద చాలామంది Ph.D లు చేశారు. సావిత్రీ భవన్ లో 'సావిత్రి' గురించిన వివరాలు, ఆడియో విజువల్ ప్రదర్శనలు, పెయింటింగ్స్ ఉంటాయి. లైబ్రరీ ఉంటుంది.

ఆరోవిల్ లో ఎరువులు లేకుండా పంటలు పండిస్తారు, సోలార్ కరెంట్ ను వారే ఉత్పత్తి చేసుకుంటారు. నీటి సంరక్షణ చేస్తారు. చుట్టూ దట్టమైన అడవి. ప్రకృతిని పాడు చెయ్యకుండా బ్రతుకుతూ, అరవిందుల మార్గంలో సాధన చేసుకుంటూ ఉంటారు. ఇదీ ఆరోవిల్ స్థూల చరిత్ర. మిగతా వివరాలకు దాని వెబ్ సైట్ చూడండి.

చూస్తూ ఉండగానే మా కారు, పాండిచేరి లిమిట్స్ దాటి, దారిలోని పల్లెలను దాటుకుంటూ ఆరోవిల్ లో ప్రవేశించి, సెక్యూరిటీ గేట్ దాటి, మాకిచ్చిన 'మైత్రేయ - 2' గెస్ట్ హౌస్ దగ్గర ఆగింది. సామాన్లు మా ఫ్లాట్లో పెట్టుకుని కొంచం రిలాక్స్ అయ్యాం.

సమయం మధ్యాన్నం మూడౌతోంది. 'నాక్కొంచం రెస్ట్ కావాలి. నేనిప్పుడు బయటకు రాను' అంది శిష్యురాలు. నాకేమో అలా నీరసంగా పడుకోవడం నచ్చదు. 'సరే, నువ్వు రెస్ట్ తీసుకో. నేను మూర్తిగారిని కలసి వస్తా' అంటూ బయలుదేరాను.

'ఇది అడవి. ఇక్కడ దారి తెలీకపోతే కష్టం. సిగ్నల్స్ కూడా ఉండవిక్కడ. ఎలా వెళతారు? ఆయన ఉండే ఆఫీస్ ఇక్కడకు ఆరు కి.మీ దూరంలో దట్టమైన అడవిలో ఉంటుంది' అందామె.

నవ్వాను.

'రిస్క్ తీసుకోవడం నా అలవాటు.  నా లైఫు మొత్తం రిస్కులతో, చాలెంజ్ లతోనే గడిచింది. ఒక సంగతి చెబుతా విను. మా ఫ్రెండ్ రవి తరచూ అంటుంటాడు. ' నువ్వెలాంటివాడివో చెప్పనా? నువ్వు బస్టాప్ లో నిలబడి ఉన్నావు. బస్సొచ్చింది. కానీ నువ్వెక్కవు. దాని వెనుక నెక్స్ట్ స్టాప్ దాకా పరిగెత్తి మధ్యలో దానిని అందుకుని రన్నింగ్ లో ఎక్కే రకం నువ్వు' అని. అదీ నా పద్దతి ! తేలికగా దొరికితే ఏదీ నాకు నచ్చదు. కష్టపడి సాధిస్తేనే నాకు బాగుంటుంది. అందుకని అడివిలో నేనే వెతుక్కుంటూ వెళతా. నాకెవరి గైడెన్సూ అవసరం లేదు. అమెరికా రెండుసార్లు వెళ్లివచ్చా. ఇండియా అంతా ఒక్కడినే తిరిగా. ఇక్కడ తిరగలేనా? నేనేం వయసులో ఉన్న ఆడపిల్లను కాను. ఏదైనా ఎదురైతే నా మార్షల్ ఆర్ట్స్ నాకు తోడుంటాయి. భయంలేదు. నువ్వు పడుకో' అంటూ బయలుదేరా.

'వీడెవడ్రా బాబూ? కదిలిస్తే కధలు చెబుతున్నాడు?' అన్నట్టు ఆమె వింతగా చూచింది.

అదేమీ పట్టించుకోకుండా, ఆ గెస్ట్ హౌస్ లో ఆమెనొదిలేసి అడివిలోకి నా నడక సాగించాను.

(ఇంకా ఉంది)