“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

5, ఫిబ్రవరి 2020, బుధవారం

పాండిచేరి, ఆరోవిల్ యాత్ర - 2 (అనుకోని కనెక్షన్)

నేను సరిగ్గా 02-02-2020 తేదీన పాండిచేరిలో అడుగు పెట్టాను. గత 38 ఏళ్ళుగా అక్కడకు వెళ్లాలని అనుకుంటూనే కాలం గడచిపోయింది. కానీ చివరకు ఈ తేదీన అక్కడకు అడుగుపెట్టగలిగాను. ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. ఇలాంటి తేదీని Palindrome day అంటారు. అంటే, వెనక్కూ ముందుకూ ఎలా చూచినా ఒకే తేదీ వస్తుంది. ఇలాంటి తేదీ ఈ వెయ్యి సంవత్సరాలలో ఇదే మొదటిసారి వచ్చింది. క్రిందటిసారి ఇలాంటి Palindrome date 909 సంవత్సరాల క్రితం 11-11-1111 తేదీన వచ్చింది.

ఇలాంటి తేదీలకు ఒక ప్రత్యేక అర్ధం ఉంటుంది. ఎందుకంటే - అంకెలన్నీ గ్రహాలనే సూచిస్తాయి. కనుక ఒక తేదీని మనం తీసుకుంటే అందులో గ్రహాలే ఉంటాయి. ప్రస్తుతం నేను పాండిచేరిలో అడుగుపెట్టిన 02-02-2020 తేదీలో రాహుకేతువుల ప్రభావం చాలా బలంగా ఉంది. ఆ గ్రహాలు నా జాతకంలో చాలా బలంగా ఉన్నాయి. అన్నీ కూడితే 8 వస్తుంది. శనిభగవానుని సూచిస్తుంది. ఆయన కూడా నా జాతకంలో బలంగానే ఉన్నాడు. కనుకనే ఇన్నేళ్ళనుంచీ అనుకుంటున్నా కూడా ఇదే రోజున ఇక్కడకు రాగలిగాను. అంతేకాదు, 38 అనే అంకెని కూడా కుదిస్తే, 38 =11=2 అవుతుంది. అంటే మళ్ళీ రాహువును సూచిస్తోంది. కనుక ఈ రోజుని రాహువు పరిపాలిస్తోందని అర్ధమైంది. యోగసాధనకు కూడా రాహువే అధిపతి. ఎందుకంటే, రాహువూ, కుండలినీశక్తీ రెండూ సర్పాకారంలోనే ఉంటాయి మరి ! కనుక ఈరోజు నుంచీ నా జీవితం ఏదో ఒక పెద్దమలుపు తిరగబోతోందని అర్ధమైంది.

ఇలా ఆలోచిస్తూ బెడ్ మీదనించి లేచి, కుర్చీలో కూచున్నాను. ఇదే ఆలోచన కొనసాగుతూ ఉండగా, గుమ్మంలో మూర్తిగారు ప్రత్యక్షమైనారు.

పరిచయాలూ గట్రాలూ అయ్యాక ఇద్దరం కూర్చుని మాట్లాడుకోవడం మొదలుపెట్టాం.

'మావాడు మీ గురించి చాలా చెప్పాడు. ఈ రోజు ఇక్కడ ఉండండి. అరవిందుల సమాధిని, మదర్ సమాధినీ దర్శించుకోండి. రేపటినుంచీ మీకు ఆరోవిల్ లో బస ఏర్పాటు చేశాను. ఈ ట్రిప్ లో మీకు ఏం కావాలన్నా నాతో చెప్పండి. నేను సంతోషంగా ఏర్పాటు చేస్తాను. ఎందుకంటే నేను గత 25 ఏళ్ళుగా ఇక్కడే ఉన్నాను, ఇక్కడన్నీ నాకు బాగా తెలుసు' అన్నారాయన.

గవర్నర్లతో, చీఫ్ సెక్రటరీలతో తరచుగా మాట్లాడేంత హై పొజిషన్ లో ఉండి కూడా ఏమాత్రం గర్వం లేకుండా సాదాసీదాగా ఉన్న ఆయన్ను చూస్తూనే నాకు చాలా మంచి అభిప్రాయం కలిగింది. 'మనిషంటే ఇలా ఉండాలి' అనుకున్నా లోలోపల.

'పెద్దగా ప్రదేశాలు చూడాలని నాకేమీ లేదండి. మీరు చెప్పినట్లే అరవిందులు, మదర్ల సమాధులు దర్శిస్తాను. ఆ తర్వాత రెండు ప్రదేశాలు మాత్రం చూడాలని ఉంది. ఒకటి, శ్రీనివాస అయ్యంగార్ గారున్న ఇల్లు, రెండు M.P. Pandit గారున్న ఇల్లు' అన్నాను.

M.P.Pandit గారి పేరు వింటూనే ఆయన ముఖం వెలిగిపోయింది.

'ఆయన మా గురువుగారండి. నేను చిన్న పిల్లవాడిగా ఆయన దగ్గరకు వెళ్ళేవాడిని' అంటూ ఆ ఇంటి అడ్రస్ చెప్పాడాయన.

'ఆశ్రమం వెనుకవైపుగా ఉన్న వీధిలో పండిట్ గారున్న ఇల్లు ఉంటుంది. మదర్స్ బాల్కనీ కి కొంచం మూలగా కుడివైపున ఉంటుంది. చూడండి.' అంటూ 'ఆయన మీకెలా తెలుసు?' అడిగారు. 

'1986 ప్రాంతాలలో ఆయన బుక్స్ చదివాను. తంత్రం మీద ఆయన వ్రాసిన పుస్తకాలు బాగుంటాయి' అన్నాను.

'అవునండి. పండిట్ గారి గురువుగారు. కపాలిశాస్త్రిగారు. వారి గురువుగారు వాశిష్టగణపతి మునిగారు' అని ఆయన అంటూ ఉండగానే నేనందుకుని - 'ఆయనను రమణ మహర్షి 'నాయన' అని పిలిచేవారు. నాయన శిష్యుడైన కపాలిశాస్త్రిగారు రమణాశ్రమం వదలిపెట్టి అరవిందుల మార్గంలోకి వచ్చారు. ఆయన శిష్యుడైన పండిట్ గారూ అదే పంధాలో నడిచారు' అన్నాను.

'ఓ ! మీకు బాగానే తెలుసు ఈ విషయాలు' అన్నారు మూర్తిగారు.

నేనేమీ సమాధానం చెప్పకుండా ఒక నవ్వు నవ్వాను.

'పండిట్ గారితో నేనేదో తెలియని affinity ని ఎప్పుడూ feel అవుతాను. నేనాయనను చూడలేకపోయాను. కనీసం ఆయన ఉన్న ఇల్లైనా చూద్దామని అనుకున్నాను' అన్నాను.

'ఆయన దగ్గరే పెరిగిన 'శ్రద్ధాళు' అనే ఒకాయన ఇంకా ఉన్నాడు. ఆయన అదే ఇంట్లో ఉంటాడు. ఈ రోజు సాయంత్రం ఆ ఇంట్లో సత్సంగం ఉంటుంది. పండిట్ గారి ఉపన్యాసం టేప్ ప్లే చేసి, విని, అందరూ ధ్యానం చేస్తారు. వెళ్లి చూడండి.' అన్నారు మూర్తిగారు.

ఎందుకో గాని, అది జరిగేపని కాదని నాకనిపించింది. ఆ ఆలోచనను గమనిస్తూ - 'శ్రీనివాస అయ్యంగార్ గారెక్కడ ఉండేవారు?' అడిగాను.

'ఆయన ఇక్కడ ఉండేవారు కారు. మద్రాస్ లో ఉండేవారు. ఆయన అరవిందులకు చాలా పెద్ద శిష్యుడు. వీళ్ళిద్దరూ అరవిందులనూ, మదర్నీ చూచి వారితో చాలాకాలం గడిపిన గొప్ప వ్యక్తులు' అన్నారాయన.

'శ్రీనివాస అయ్యంగార్ గారి గురించి ఒక సంఘటన చెప్పనా?' అడిగాను.

'చెప్పండి' అన్నాడాయన.

'జిల్లెళ్ళమూడి అమ్మగారు జీవించి ఉన్న రోజుల్లోనే ఆయనొకసారి జిల్లెళ్ళమూడి వచ్చారు. అమ్మ ఇంటిలోని హాల్లో కూచుని ధ్యానంలో మునిగిపోయారు. ఆ రోజున ఇల్లంతా బూజులు దులుపుతున్నారు. ఆయనేమో నట్టింట్లో కూచుని ధ్యానంలో ఉన్నారు. ఎంతకూ లేవడం లేదు.

'ఏం చెయ్యాలమ్మా?' అని పనివాళ్ళు అమ్మను అడిగారు.

అమ్మ నవ్వి ' ఆయనమీద ఒక దుప్పటి కప్పి బూజులు దులపండి' అన్నది.

అదే విధంగా ఆయన మీద ఒక తెల్లని దుప్పటి కప్పి, ఇల్లంతా బూజులు దులిపి, చిమ్మి, ఒక రెండు గంటల తర్వాత దుప్పటి తొలగించారు. ఆయనలో మాత్రం చలనం లేదు. దుప్పటి ఎప్పుడు కప్పారో, ఎప్పుడు తీశారో కూడా ఆయనకు స్పృహ లేదు. అలాగే నిశ్చల ధ్యానంలో ఉన్నాడు. తర్వాత ఎప్పటికో లేచాడు.' అన్నాను.

మూర్తిగారు నవ్వారు. 'వాళ్ళంతా చాలా గొప్పవాళ్ళండీ' అని మాత్రం అన్నారు.

ఇలా చెప్పి, 'సరేనండి. ఉంటాను. మీకేం కావాలన్నా నాకు ఫోన్ చెయ్యండి' అంటూ మూర్తిగారు వెళ్ళిపోయారు.

ఇక ఆ పూటకు భోజనం చెయ్యాలని అనిపించలేదు. ఎందుకంటే ఆశ్రమం 12 కి మూసేస్తారు. మళ్ళీ మధ్యాన్నం 2.30 కి తెరుస్తారు. భోజనం చేసి అక్కడకు వెళితే ధ్యానం కుదరదు. అందుకని లంచ్ చెయ్యకూడదని నిశ్చయించుకున్నాను. పొద్దున్న త్రాగిన టీ మాత్రమే ఆధారం. అలా ఖాళీ పొట్టతో ఉంటేనే ధ్యానం చక్కగా కుదురుతుంది మరి !

కొద్ది సేపు రూమ్ లోనే ఉండి, 3 గంటలకు బయలుదేరి ఆశ్రమానికి వెళ్లాను. 

ఆ ఏరియా అంతా సముద్రతీరంలో ఉంది. విశాలమైన ఇళ్ళూ, విశాలమైన రోడ్లతో, ఫ్రెంచ్ పేర్లతో, నిజంగా ఒక ఫ్రెంచ్ కాలనీలాగే ఉంది. చాలామంది విదేశీయులు అక్కడ తిరుగుతూ కనిపించారు.

ఆశ్రమంలో అరవిందుల సమాధీ, మదర్ సమాధీ పక్కపక్కనే ఉన్నాయి. అదాటుగా చూస్తె, ఒకే సమాదిలా అనిపిస్తుంది. కానీ రెండు సమాధులూ ఒకే సమాధిలో విడివిడిగానే ఉన్నాయి. లోపల ఆవరణలో ఒక చెట్టు క్రింద ఈ సమాధులున్నాయి. చుట్టూ విశాలమైన ప్రాంగణం ఉంది. అందులో చాలామంది చిన్నా పెద్దా కూచుని ధ్యానంలో కనిపించారు. అందరివైపూ ఒకసారి గాలివాటుగా చూచాను. ఒక్కరంటే ఒక్కరు కూడా సరైన ధ్యానస్థితిలో కనిపించలేదు. నవ్వొచ్చింది.

'పోనీలే ప్రయత్నం అంటూ చేస్తున్నారు కదా ! ఏదో ఒకనాటికి నిలకడ వస్తుంది' అనుకున్నాను.

కొంతమంది సమాధి మీద తలలు పెట్టి కళ్ళు మూసుకుని ఉన్నారు. సమాధులు తాకకూడదని అక్కడ వ్రాసి ఉంది. కానీ వాళ్ళు పట్టించుకోవడం లేదు. వాళ్ళవైపు ఒక్క క్షణం చూసిన నాకు, వాళ్ళ మనసులో చదువుతున్న కోరికల చిట్టా కనిపించింది. 'ఛీ వెధవల్లారా ! లేవండి అక్కణ్ణించి. తాకకండి ఆ సమాధులను' అని వాళ్ళను ఒక్క తన్ను తందామని అనిపించింది. ఎక్కడకు వచ్చినా మనుషుల నీచమైన కోరికల గోల మాత్రం పోదుకదా అని బాధేసింది. 

ఒక పక్కగా బాగా పెద్దాయన ఒకరు కుర్చీలో కూచుని కళ్ళు తెరిచే ధ్యానంలో కనిపించాడు. ఆయనొక్కడే ధ్యానస్థితిని అందుకున్నట్లు నేను గమనించాను. కళ్ళు తెరిచి ధ్యానం చెయ్యడాన్ని మదర్ ఇష్టపడేవారు. నాకూ ఇది చిన్నప్పటినుంచీ అలవాటే. ఆయన పక్కనే నేలమీద కూచుని నేనూ ఒక గంటసేపు ధ్యానంలో కాలం గడిపాను. ధ్యానం ముగించి వస్తుంటే ఆయన ఇంకా అదే కుర్చీలో కూచునే ఉన్నాడు. మా ఇద్దరి చూపులూ కలిశాయి. ఆయన కనిపించీ కనిపించనంత చిరునవ్వు ఒకటి లిప్తకాలం పాటు నవ్వాడు. నేనూ అలాగే నవ్వి బయటకు వచ్చేశాను.

ఆశ్రమం బుక్ స్టాల్ ఒక గదిలో ఉంది. దానిలోకి దారితీశాను. అన్నీ చదివిన పుస్తకాలే కనిపించాయి. చూసుకుంటూ అక్కడ కౌంటర్లో ఉన్న వారిని గమనించాను. ముగ్గురు అక్కడ కూచుని ఉన్నారు. ఒకాయన మొబైల్లో ఎదో చూసుకుంటూ ఉన్నారు. ఇంకో ఆయన ఎటో గాలిలోకి చూస్తున్నాడు. ఇంకో ఆయన ఏదో విసుగ్గా కనిపించాడు. మొత్తం మీద వాళ్ళు కూడా సరైన మానసిక స్తితిలో కనిపించలేదు. 'అయ్యో పాపం ఇక్కడ ఉంటూ కూడా వీళ్ళు ఇలా ఉన్నారే?' అని మళ్ళీ బాధేసింది.

'అతుక్కుంటేనూ, అంటించుకుంటేనూ వస్తుందా ఆధ్యాత్మిక ఔన్నత్యం?' అనుకున్నా లోలోపల.

పక్క వీధిలో ఉన్న ఆనందభవన్ అనే హోటల్లో రవ్వదోశ ఒకటి తిని, ఏమాత్రం బాలేని 'టీ' ఒకటి సగం త్రాగి గెస్ట్ హౌస్ కి వచ్చేశాను.

(ఇంకా ఉంది)